Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-52: I am too intelligent

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఇ[/dropcap]వాళ మా కొబ్బరిచెట్లనుంచి బొండాంలు దింపించాం. అన్నీ మేం వాడుకోలేము కదా.. మాకు, మావాళ్లకి కావలసినవి అట్టిపెట్టుకుని మిగిలినవి తీసికెళ్ళిపొమ్మన్నాం ఆ తీసినతనిని. కాయకి రెండు రూపాయలిస్తానన్నాడు. నాకు అర్థం కాలేదు. అదే బొండాం మనం బైట తాగితే ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు కదా.. అందుకని నేను బేరమాడ్దం మొదలెట్టాను. అందులోనూ వాడన్న మాటకి వెంటనే ఒప్పేసుకుంటే మాకు బేరాల గురించి తెలీదనుకుంటాడు కదా.. అందుకని నేను కాయ పది రూపాయల్నించి మొదలెట్టాను. I am too intelligent.. you know..

వాడు మూడన్నాడు నేను యెనిమిదన్నాను. మా బేరం ఇలా సాగుతూనే వుంది.. ఈలోపల ఇంట్లోవాళ్ళు “వాళ్లతో బేరాలేంటీ.. పాపం కష్టం చేసేవాళ్ళు.. యెంతకో అంతకి తీసికెళ్ళమను..” అని డైలాగులు. ఆఖరికి కాయ నాలుగురూపాయలకి మాట్లాడుకున్నాక వాడు పని మొదలెట్టేడు. జుయ్ మంటూ అంత పొడుగుచెట్టూ తాడేసుకు యెక్కేసేడు. కిందనుంచి తాడు లాగుతూ, గెలలు విప్పుతూ వాడికి సాయం వాళ్ళావిడ. ఒక్కొక్క గెలా కోస్తుంటే వాళ్ళ కష్టం చూసి నా మనసు ద్రవించిపోయింది. పాపం.. యెంత కష్టపడుతున్నారో.. పోనీ.. కాయకి రెండురూపాయలే తీసుకుందాం అని దృఢనిశ్చయం చేసేసుకున్నాను.

అన్నీ దింపేక, వాడు గెల పట్టుకుని కాయలు లెక్కపెట్టడం మొదలెట్టేడు. గెల గిర్రుమని తిప్పేసి పదికాయలన్నాడు. అవునేమో అనుకున్నాను. కాని వాడు రెండుగెలలు అలా చేసాక నాకు అనుమానం వచ్చి, మళ్ళీ నేను లెక్కపెడితే ఒక్కో గెలకి పదిహేను నుంచి పధ్ధెనిమిది కాయలున్నాయి.

నాకు ఖోపం వచ్చేసింది. దగ్గరుండి మళ్ళి అన్ని కాయలూ లెక్కపెట్టిస్తుంటే వాడికి ఖోపం. అలా ఇద్దరం ఇంట్లోవాళ్లకి వినపడకుండా కాసేపు దెబ్బలాడేసుకున్నాక, వాడు కొబ్బరిబొండాల గెలలని గేటు బైట పెట్టేడు. ఇంకా మాకెంతివ్వాలో లెక్క చూసుకుంటున్నాడు. మా ఇల్లు మెయిన్‍ రోడ్ మీద కుంటుంది. కాయలు ఫుట్‍పాత్ మీద పెట్టగానే అటు పోతున్న ఒకావిడ “బొండాం యెంతా” అనడిగింది. ఈ తీసినవాడి భార్య ఇరవై రూపాయలంది. ఆవిడ ఇరవై రూపాయలిచ్చి ఓ బొండాం కొనుక్కుంది. అంతలోనే ఇంకో మోటార్‍సైకిల్ ఆగింది. ఇద్దరు దిగారు. వాళ్ళు రెండేసి ఇక్కడ తాగేసి, ఇంటికి ఇంకో నాలుగు పట్టుకుపోయేరు. ఇలాగ గేటు కిటువైపు ఇంకా కొనడం పూర్తికాకుండానే, అటువైపు అమ్మడం సాగించేడు వాడు. మాకు వాడు డబ్బిచ్చేలోపల సగం కాయలు కాయ ఇరవై రూపాయల కమ్మేసేడు.

నేను జీవితంలో మొదటిసారిగా కొబ్బరిచెట్టు యెక్కడం నేర్చుకోనందుకు తెగ బాధపడిపోయేను. హు.. అదే కనక వచ్చుంటే నేనే కాయ ఇరవై చొప్పున అమ్మేసి, ఈపాటికి కోటీశ్వరురాలిని అయిపోయేదాన్ని..

మొన్ననెవరో అంటుంటే విన్నాను. ఆ బ్రహ్మదేవుడు ముసలాడయిపోయి కొన్ని కొన్ని రాయడం మర్చిపోతున్నాడుట. అలాగే నాకు కొబ్బరిచెట్టెక్కడం వచ్చినట్టు రాయడం మర్చిపోయేడు. హూ.. ఏం చేస్తాం.. రాతనెవరూ మార్చలేరు కదా!

కొబ్బరిబొండాల పనయ్యాక ఇంటిపనిలో పడ్డాను. కాని తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడని సామెత లాగా ఈ రోజు నాకు బోలెడు పని పెట్టాలనుకున్నాడా భగవంతుడు.

మాకు తెలిసినవాళ్ళింట్లో ఈసారి మామిడికాయలు తెగ కాసాయిట. ఇటువైపో పాతిక పంపించారు. అవి పాడవకుండా వుండాలంటే వాటిని తొక్క తీసి, ఉప్పులో వెయ్యాలి కదా.. అసలే నాకు పనిగండమాయె. అంతేకాక పొద్దుట్నించీ ఆ బొండాలగొడవతో విసుగెత్తి వున్నానేమో ఆ భగవంతుడు రాసిన సామెతని మార్చేయ్యాలనుకున్నాను. అనుకోకుండా యెదురైన ఈ ఆపద నుంచి జయప్రదంగా తప్పించుకోవడమెలాగా అనుకున్నాను.

విల్‍పవర్‍ని మించింది లేదని తెలుసు కనక ఆ పని నుంచి యెలా తప్పుకోవాలా అని నా విల్ అంతా పెట్టి ఆలోచించేసేను.

పాజిటివ్ థింకింగ్ నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ దాకా అన్నింటిలో వున్న సారాన్నీ మథించేసేను.

అంతే.. ఒక్కసారిగా..”హా.. తెలిసెన్..” అని కేకపెట్టబోయి, ఇంట్లోవాళ్ళు హడిలిపోతారని ఆపుకున్నాను.

(“యురేకా..”అని అరవొచ్చు కానీ అది ఇంగ్లీషులో అరవడ మవుతుంది కదా మరి..అందుకని అచ్చ తెలుగులోనే “హా.. తెలిసెన్..” అని అరిచేనన్న మాట)

వెంఠనే ఆ మావిడికాయల్ని ఒక్కొక్కటీ అయిదు చొప్పున అయిదు భాగాలు చేసేసి, అయిదు ప్లాస్టిక్ సంచుల్లో వేసేసి, చుట్టూ వున్న మా ఫ్రెండ్స్ అయిదుగురికి పంపించేసేను. అంతే కాకుండా వాళ్ళకి ఫోన్లు చేసి, “మీరు క్రితంయేడు పెట్టిన కోరుపచ్చడి చాలా బాగుందండీ. ఈ కాయలు దానికి బాగుంటాయని పంపుతున్నాను.” అని కాస్త వెన్న రాసేసేను. అంతే.. నాకు బాగా తెలుసు.. రేపో.. రెండ్రోజుల్లోనో వాళ్ళు ఆ పచ్చడి చేసేసి నాకు సాంపిల్ పంపుతారని.

హమ్మయ్య.. ఓ పనైపోయింది. పని చెయ్యకుండా పచ్చడి తినే ఉపాయం అంటే ఇదే.. ఎవరైనా దీనిని సామెతగా మార్చుకోవచ్చు.. I am too intelligent.. you know..

ఇంక కొత్తపనులేమీ పెట్టుకోకుండా యెంచక్క కూర్చుని మధ్యాహ్నం భోజనంలోకి మెంతికూర, పెసరపప్పు చేద్దామని మెంతికూర ఒలవడం మొదలుపెట్టేను. పొద్దున్న తొమ్మిదవుతుంటే అన్ని ఛానల్సూ తిప్పుకుని ఈనాడులో సినిమా సెలెక్ట్ చేసుకుని, మెంతికూర ఒలవడం మొదలెట్టేను. రెండుసార్లు మధ్యలో ప్రకటనలయ్యాయి. నాకు ఒక్క కట్ట కూడా ఒలవడం కాలేదు. అయ్యో… మళ్ళీ భోజనానికి లేట్ అవుతుందేమో అనుకుంటుంటే గుర్తొచ్చింది నిన్న ఫంక్షన్‌కి వెళ్ళోచ్చినమాట.. ఓ రోజు విందు.. ఓ రోజు మందు అనేవారు మా అమ్మమ్మగారు. అలాగే నిన్న ఫంక్షన్‍కి వెళ్ళొచ్చాము కదా ఇవాళ వంటంతా సింపుల్‍గా చేసేద్దామనుకున్నాను.

మామూలు చారు పెడితే లాభంలేదని చారుపొడితోపాటు ఇంకో నాలుగు మిరియంగింజలు దంచిపడేసి చారును బాగా మరిగించేసేను. చారు ఘాటుగా వుంటే ఆ మంట తగ్గడానికి పెరుగన్నం మరో రెండుముద్దలు యెక్కువ తినేస్తే కడుపు నిండిపోతుందని నా ఆలోచన. I am too intelligent you know…

కానీ మెంతికూర అలాగే వుంది. మధ్యాహ్నం ఓ నిద్దరోయి లేచి, ఎప్పట్లాగే టివీ పెట్టుకుని, మళ్ళీ మెంతికూరకట్ట పుచ్చుకున్నానో లేదో.. కరెంట్ పోయింది. అమ్మో.. కరెంట్ లేకపోతే యెలాగ.. అసలే చెమటోడ్చి పనిచెయ్యడానికి నాకు పనిగండం వుందే.. అనుకుని ఓ గంటన్నర గోడమీంచి పక్కింటావిడతో ముచ్చట్లాడుకున్నాక కరెంట్ వచ్చింది. మళ్ళీ మెంతికూర పట్టుకుందామంటే మరి రాత్రి వంటో.. అందుకని కాస్త తేలిగ్గా రెణ్ణిమిషాల్లో పెళ్ళివారి ఉప్మా కలియబెట్టేసేను.

 అదయ్యేక మళ్ళీ మెంతికూర పట్టుకుందామనుకున్నాను.. కాని.. సచ్చీ బాత్ హై కీ, మా పెద్దమ్మ గుర్తొచ్చింది. ఆవిడకి నేనంటే యెంతో ప్రేమ. పాపం నేను పని చేస్తుంటే చూడలేకపోయేది. ఆవిడ గుర్తు రాగానే రాత్రీ పగలూ అనకుండా నేనిలా పనిచెయ్యడం చూస్తే పాపం ఆవిడ ఆత్మ ఘోషిస్తుందనిపించి, ఆ మెంతికూర కట్టలని కవర్లో పెట్టి ఫ్రిజ్‍లో డోర్ తియ్యగానే కనపడకుండా లోపలెక్కడికో పడేశా. I am too intelligent.. you know..

హమ్మయ్య.. ఇంక రాత్రి హాయిగా నిద్రపడుతుంది..

Exit mobile version