ఐ లవ్ యూ బావా

0
2

[dropcap]వి[/dropcap]జయ్, దీపికలకు ఏకైక పుత్రరత్నం సందీప్. ఇద్దరూ టీచర్లుగా కందుకూరు చుట్టుపక్కల పని చేస్తూ కందుకూరులో కాపురం ఉండేవారు. సందీప్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని EAMCET ఎంట్రెన్స్ రాయించారు. ఎక్కడ సీటు వస్తుందో, హాస్టల్‌లో ఉండగలడో లేదో అనే విపరీతమైన ఆలోచనలతో గడిపారు ఆ దంపతులు. ఎట్టకేలకు సందీప్‌కు సీటు వచ్చింది. అదేదో పేరు మోసిన కాలేజి అనుకున్నారా… ఛ… అలా అనుకుంటే డస్ట్‌బిన్‌లో లెగ్గేసినట్లే. మనవాడికొచ్చిన రాంకుకు శింగరాయకొండ దగ్గర ఒక కాలేజిలో సీటు వచ్చింది. ఎక్కడో ఒకచోటలే అనుకుని అదే కాలేజిలో చేర్పించేశారు. హాస్టల్ ఖర్చు తగ్గింది అదే చాలనుఉన్నారు. ఎన్నో ఊహలతో అక్కడ చేరిపోయాడు సందీప్. అక్కడ చేరిన తరువాత తెలిసింది, మంచి ఫాకల్టీనే కాదు అందమైన అమ్మాయిలు కూడ అక్కడ లేరని. కనీసం రాగింగ్ చేస్తేనన్నా చిత్రవిచిత్రంగా వేషాలు వేసి ఎంజాయ్ చేయవచ్చనుకున్నాడు. అదికూడ మొక్కుబడిగా ముగిసింది. అక్కడ సీనియర్ విద్యార్థులు క్లాసులకే రారు. ఇక ర్యాగింగు ఏం చేస్తారు. ఎటువంటి ఎంజాయ్‌మెంట్ లేకుండానే చదువు ముగించాడు సందీప్. అప్పటిదాకా సరయిన సెల్, గర్ల్ ఫ్రెండ్ లేకుండానే పట్టా చేతికొచ్చింది సందీప్‌కు.

అందమైన అమ్మాయిలతో చిట్ చాట్ చెయ్యాలనే ఆరాటం, కోరిక తీరకుండానే ముగిసిన చదువు ఒకింత బాధ కలిగించినా, ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్ ప్రయాణం గుడ్డిలో మెల్లగా ఊరటనిచ్చింది.
రేపే ప్రయాణం, చాలా హడావుడిగా ఉన్నాడు సందీప్.

“బావా” అంటూ పరిగెత్తుకొచ్చింది సందీప్ మామయ్య కూతురు సంజన, చేతిలో డబ్బాతో సహా.
“వచ్చావా శకున పక్షి. ఇంకా దిగబడలేదేమిటా అనుకుంటున్నాను” విసుక్కున్నాడు సందీప్.

సంజన సందీప్‌కు స్వయాన మేనమామ కూతురు. చూడముచ్చటగా ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసింది. పెద్దలందరూ అదేపనిగా అనడమో, సందీప్ నచ్చడమో గాని, సందీప్ మీద మనసు పడింది. ‘వనిత తనంత తావలచి వచ్చిన చులకన కాదె’ అన్న చందాన వుంది సందీప్ వైఖరి. అటు ఇష్టమని చెప్పడు, లేదని చెప్పడు. అడిగితే మాట దాటవేస్తాడు. కానీ, పాపం సంజన మాత్రం ఇంకా ఏదో ఆశతో వుంది. మన హీరోకు మాత్రం ఆనదు సంజన. ఎక్కడో ఏదో ఉంది అనే ఆశ, ఫాస్ట్‌గా ఉండే అమ్మాయిని చేసుకోవాలనే తపన. అందుకే హైదరాబాద్ అనగానే ఊహాలోకంలో తేలిపోతున్నాడు.

“బావా హైదరాబాదు నుంచి నాకేమి తెస్తావు”

“నీకు అక్కను తెస్తాను”

పకపకా నవ్వింది.

“వెటకారం కాదు నిజంగానే” ఉడుక్కున్నాడు.

“నీకంత సీన్ లేదు, అయినా నువ్వు లవ్వు, గివ్వు అంటే చాలు అత్తయ్య ఫాన్ వైపు చూస్తుంది. అందుకని ఏదో నాలా సంసారపక్షంగా వుండే అనామకురాలిని చేసుకో. నువ్వూ హ్యాపీ, వాళ్ళూ హ్యాపీ” తేల్చేసింది సంజన.
“ఏమయినా నీలాంటి పల్లెపడుచు నాకొద్దు. పెళ్ళిచూపులు చూసయినా సరే సిటీలో అమ్మాయినే చేసుకుంటాను” నిక్కచ్చిగా చెప్పాడు సందీప్.

మనసు నొచ్చుకుంది సంజనకు. కాని బయటపడకుండా “ఇదిగో అమ్మ నీకివ్వమని చక్రాలు పంపింది. ఊరికట తీసుకెళ్ళు” అని డబ్బా అక్కడపెట్టి “అత్తయ్యా” అంటూ వంటగదిలోకి దూరిపోయింది సంజన.

***

సందీప్ కష్టం ఫలించో, వాళ్ళ అమ్మా, నాన్న అదృష్టం బాగుండో ఎట్టకేలకు బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. తన విఙ్ఞానానికి సాఫ్ట్‌వేర్ అందని ద్రాక్షని తెలుసుకుని వచ్చిన దానితో సర్దుకుపోయాడు సందీప్. సందులో సందుగా ఫాస్టుగా వున్న అమ్మాయిల గురించి వాకబు చేశాడు. కనీసం ఒకరితోనన్నా స్నేహం చేయాలనుకున్నాడు. కానీ పాపం వాళ్ళ నాన్న పంపే డబ్బుతో వాళ్ళను మెయింటైన్ చెయ్యలేనని తెలిసి మానేశాడు. కనీసంలో కనీసం హైదరాబాద్‌లో ఉండే అమ్మాయిని పెళ్ళిచూపులు చూసి పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నం చేయమని ఇంట్లో చెప్పేశాడు. ఇది విన్న సంజన వాళ్ళ కుటుంబం చాలా బాధపడ్డారు. కానీ చేసేదిలేక మౌనం వహించారు.

***

“మీరు బి.టెక్ చేసి బ్యాంకు ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాలేదు” అడిగింది వైశాలి, పెళ్ళిచూపులలో వ్యక్తిగతంగా మాట్లాడాలని గదిలోకి వచ్చిన సందీప్‌ను.

“అంటే… అది…” నాన్చాడు సందీప్.

“అర్థమయిందిలెండి. అయినా మీరు చదివిన కాలేజి ఏదో తెలియగానే అంతా తెలిసిపోయింది. ఇంతకూ మీకు ఈ జాబ్ ఇష్టమేనా” అడిగింది వైశాలి.

కాలేజి పేరు అడ్డంపెట్టి ‘నీ తెలివితేటలు ఇంతేనా’ అని వెటకారం చేసినట్లుగా అనిపించింది సందీప్‌కు.

“ఇష్టపడే చేరాను. ఏం మీకు నచ్చలేదా” ధైర్యం చేసి అడిగాడు.

“అఫ్ కోర్స్. సాఫ్ట్‌వేర్ అయితే విదేశాలు చూడవచ్చు కదా అని. మీకలాంటి అవకాశాలు లేవా? చివరిదాకా గుమాస్తాగిరేనా?” వ్యంగ్యం ధ్వనించింది ఆమె కంఠంలో.

ఆమెలో తనంటే లెక్కలేనితనం కనిపించింది సందీప్‌కు.

“మీ ఉద్యోగం సమస్య కాకపోయినా మాలాటి సిటీ అమ్మాయిలను మీరు భరించగలరా అని సందేహం. ఇక్కడ మా జీవన విధానం మీకు భిన్నంగా ఉంటుంది. కాలేజీలో బాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో చిట్ చాట్, వచ్చీరాని వంటలు, స్వతంత్రంగా, విలాసంగా ఉండడం మాకు చాలా సాధారణం. అవన్నీ మీకు కొత్తగా అనిపించి, మీకు బాధ కలిగించవచ్చు. మీకు ఫాస్ట్‌గా వుండే అమ్మాయి కావాలట గదా. మా ఇంట్లో అనుకుంటుంటే విన్నాను. నేను కనిపించను గానీ చాలా ఫాస్ట్. ఇంట్లో తెలియదు గానీ నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకే కాదు నా స్నేహితులందరికీ ఉన్నారు. వారు ఎప్పుడూ కలుస్తుంటారు. మీరు ఆపకూడదు, వేరేవిధంగా అనుకుని టార్చర్ పెట్టకూడదు” ఆగి సందీప్‌ను గమనించింది ఓరకంటితో.

నోరు వెళ్ళబెట్టి బిత్తరచూపులు చూస్తూ వింటున్నాడు.

“వింటున్నారా” చిటికలు వేసింది.

“ఆ..ఆ…మీరు అంత ఫాస్టా”

“నేనే చాలా బెటర్. నా ఫ్రెండ్స్ సూపర్ ఫాస్ట్”

“అంటే”
“అప్పుడప్పుడూ సిగరెట్, మందు కూడా. పబ్ లకు వెళ్ళడం కామన్”

బిత్తరపోయాడు సందీప్. నాలుక తడి ఆరిపోయింది. ఫాస్ట్ అంటే ఇదా. అమ్మో ఇలాటి అమ్మాయిలను తను భరించగలడా. ఉహూ. తన వల్లకాదు. తన జీతం వారానికల్లా కరిగిపోతుంది. కడుపు నిండిపోయింది. వద్దు ఫాస్ట్ వద్దు పాడు వద్దు. ఆలోచన వచ్చిందే తడవుగా వైశాలికి చెప్పకుండానే గది తలుపులు తీసుకుని హాలులోకి వచ్చాడు సందీప్.

హడావుడిగా పరిగత్తుతున్న అతనిని చూసి వచ్చే నవ్వును ఆపుకుంటూ అతని వెనుకనే తనూ గదిలోకి వచ్చింది వైశాలి.

“ఏం బాబూ. అన్నీ మాట్లాడుకున్నారా? అభిప్రాయాలు కలిశాయా? అమ్మాయి నచ్చిందా?” ప్రశ్నల వర్షం కురిపించాడు వైశాలి తండ్రి.

సమాధానమేమి చెప్పాలి అన్నట్లు కొడుకు వైపు చూశాడు విజయ్. కళ్ళు అడ్డదిడ్డంగా తిప్పాడు సందీప్. కొడుకు ముఖంలో అసహనం చూసి ఇదేదో తేడాగా ఉందనుకున్న విజయ్, వైశాలి తండ్రి వైపు తిరిగి
“అంత హడావుడి పెట్టడం దేనికండి పిల్లలను, మేము ఏ విషయమూ రేపు ఉదయానికల్లా చెప్పేస్తాము” అని అనునయంగా చెప్పి చల్లగా జారుకున్నారు.

ఇంతలో వైశాలి ఫోను మ్రోగింది.

“హాయ్ మౌనీ. నేనే చేద్దామనుకున్నా. ఏముంది గురుడు బిత్తరపోయాడు. ఇక ఛస్తే హైదరాబాద్ అమ్మాయిల జోలికిరాడు. ఆపరేషన్ సక్సెస్. పేషంట్ క్లోజ్” అని బిగ్గరగా నవ్వింది వైశాలి.

అర్థం కాక చూశాడు ఆమె తండ్రి.

“ఫీల్ అవకండి డాడీ. జస్ట్ చిన్న గేమ్” అంటూ వెళ్ళిపోయింది.

***

వైశాలిని చూసి వచ్చిన సందీప్‌కు దిమ్మదిరిగింది. టాప్ లేపిందిరా బాబు అనుకున్నాడు. అందరూ అంతేనేమో అన్న భయం పట్టుకుంది. ఆలోచించేకొద్ది అందరికంటే సంజనే తన అనుకూలవతి అయిన భార్య అనిపించింది. అవును తనంటే ప్రాణం పెట్టే సంజనను కాదనుకుని ఎక్కడెక్కడో తిరిగాను. బుద్ధి వచ్చింది.

‘సారీ సంజూ.. ఐ లవ్ యూ’.

***

పాలగ్లాసుతో శోభనం గదిలోకి అడుగుపెట్టిన సంజనను చూసి తలతిప్పుకోలేకపోయాడు సందీప్. ఎంత అందంగా ఉంది. ఛ… ఇంతకాలం ఇంత అందం అందుబాటులో వున్నా పిచ్చివాడిలా ఎక్కడెక్కడో వెదికాను.

వట్టి టింగరవెధవను. అమ్మో.. ఆ వైశాలి సంబంధం తప్పిపోయింది నా అదృష్ఠం కొద్ది. అలాంటి వాళ్ళను భరించడం నావల్ల కాదు. నాకు నా సంజూనే కరెక్ట్…

ఇంతలో సంజన చేతిలో సెల్ మ్రోగింది.

“హలో. మీరా. ధాంక్యూ.ఆ.. ఒక్క నిమిషం” అంటూ సెల్ సందీప్ కిచ్చింది “మీకే” అంటూ.

ఎవరబ్బా అనుకుంటూ “హలో ఎవరూ” అన్నాడు.

“హాయ్ సందీప్. నేను వైశాలిని. నన్ను మర్చిపోవులే. ముందుగా కంగ్రాట్స్. సంజన నాకెలా తెలుసా అనుకుంటున్నావా. అదొక చిన్నకథ. చెప్పాలనే చేశాను. నువ్వు నన్ను చూడటానికి వచ్చే ముందే నేను, వినమ్ర్ ప్రేమించుకున్నాం. ఇంట్లో ఈ విషయం ఎలా చెప్పాలా అనుకుంటున్నపుడు మీ సంబంధం వచ్చింది. మీది కందుకూరు అని తెలిసింది. వెంటనే మా ఫ్రెండ్ మౌనికది కందుకూరే కదా అని తనకు ఫోన్ చేశాను. మీ పేరు చెప్పగానే గుర్తుపట్టింది. సంజన, తను ఇంటర్ వరకు క్లాస్‌మేట్స్ అని చెప్తూ సంజన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది కూడ చెప్పి మీరెంత నిర్లక్ష్యం చేస్తున్నారో కూడా చెప్పింది. మాటలో మాటగా హైదరాబాద్ అమ్మాయిలంటే మీ క్రేజ్ కూడా చెప్పింది. అందుకే ఆ రోజు అలా ప్రవర్తించాను. సారీ సందీప్. సంజనకు నువ్వు దక్కాలనే అలా పథకం వేశాము. బై ది బై నా పెళ్ళి కూడ వినమ్ర్‌తో ఫిక్స్ అయింది మీ పుణ్యమా అని. హాపీ మ్యారీడ్ లైఫ్… ఇక సెల్ ఆఫ్ చేయండి.. బై” అంటూ ఫోన్ పెట్టేసింది వైశాలి.

“నిన్ను” అని ఏదో అనబోయిన సందీప్ నోటిని అరచేతితో మూస్తూ “ఐ లవ్ యూ బావా” అంటూ అల్లుకుపోయింది సంజన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here