[20 మే 2024 టంగుటూరి ప్రకాశం పంతుల గారి వర్ధంతి సందర్భంగా శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘ఇచ్చే చేయి!!’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
సమయం తెల్లవారు ఝూమున నాలుగు,నాలుగున్నర ప్రాంతం. ప్రపంచం ఒళ్ళు మరచి నిద్రపోతున్నది.
ఆ రైలు, ‘బరువు లాగలేను మొర్రో’, అన్నట్టు ఈసురోమంటూ,పొగలు కక్కుతూ, స్టేషన్లో ఆగింది.
దిగే వాళ్ళు దిగుతున్నారు. ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. అది రాజమండ్రి రైల్వే స్టేషన్.
ఒక సుమారు 80 ఏళ్ళ వృధ్ధుడు మెల్లగా రైలు దిగి,ఫస్టు క్లాసు వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళి అందులో ఉండే పొడుగాటి పేము పడకకుర్చీ కాస్త వీలుగా లాక్కుని నిద్ర కుపక్రమించాడు.
వెయిటింగు హాల్ గుమ్మం దగ్గర ఉండి చెక్ చేసే ఉద్యోగి ఆ సమయంలో లేడో, లేక ఉండీ కాస్త నిద్రలోకి జారుకున్నాడో!
కాస్సేపట్లో వచ్చి చెక్ చేశాడా ఉద్యోగి.
ఈ కొత్తగా వచ్చిన ముసలాయన, చిరిగిన బట్టలతో పడుకుని కనబడ్డాడు. లేపటానికి ప్రయత్నించాడు అతను.
“ఏయ్ ఎవర్రా అది”, అని చేయి విదిలించి గద్దించాడు, పెద్దాయన!
ఉద్యోగికి, ఆ మనిషి అవతారం, వాలకం చూసి అనుమానం వచ్చింది, ‘వీడెవడో పిచ్చివాడు నా కన్నుగప్పి లోపలికి దూరాడు’ అనుకున్నాడు.
వెంటనే వెళ్ళి, స్టేషన్ మాస్టర్‌కి విషయం చెప్పి, పిలుచుకుని వచ్చి చూపించాడు ఆ మనిషిని!
స్టేషన్ మాస్టరు వచ్చి చూసి, గుర్తుపట్టాడు ఆ వచ్చినదీ, పడుకున్నదీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రకాశం పంతులు గారని!
అతను మెల్లిగా తట్టి లేపి, “అయ్యా నమస్కారం”, అన్నాడు.
ఆయన కళ్ళు తెరిచి చూసి, ”ఎవడ్రా అది” అన్నాడు.
స్టేషన్ మాస్టారు వినయంగా వంగి నమస్కరిస్తూ, “అయ్యా నేను సూర్యనారాయణ మూర్తి కొడుకు నండీ” అన్నాడు.
“సూర్యనారాయణ కొడుకువా, భోంచేశావా”, అని ప్రకాశం గారి ప్రశ్న మళ్ళీ!
అతను బుర్ర గోక్కున్నాడు, ‘ఇదేవిఁటి పెద్దాయన పొద్దున 5 గంటలకు భోజనం అయ్యిందా అని అడుగుతున్నాడు’ అనుకున్నాడు.
అనుకొని, “లేదండీ.. ఇప్పుడే..” అని ఏదో సణుగుతున్నాడు, ఏం చెప్పాలో తెలియక!
“ఏ సూర్యనారాయణమూర్తి కొడుకువురా?” గదమాయిస్తున్నట్టు వచ్చింది ఆయన దగ్గర నుంచి ప్రశ్న!
“అయ్యా రాజమండ్రి సూర్యనారాయణ మూర్తి కొడుకు నండీ”, అన్నాడతను ఇంకా వినమ్రంగా!
“మీ నాన్న నీకు ఇదేనురా మర్యాద నేర్పాడు? నేనేం అడిగాను నిన్ను ‘భోంచేశావా’ అని కదా, నువ్వేం అడగాలి ‘అయ్యా మీ భోజనం అయ్యిందా’, అని అడగాలా వద్దా?” అన్నారు!
అతనికి విషయం అర్థమయ్యింది. పెద్దాయన భోంచేసినట్టు లేదు ముందరి రోజంతా అని.
వెంటనే ఇంటికి మనిషిని పంపి భోజనం ఏర్పాట్లు చేయమని కబురు పంపించాడు ఆఘమేఘాల మీద!
తెలతెలవారే సమయం కల్లా ఊళ్ళోకి ఎట్లా పాకిందో వార్త – రాజమండ్రి స్టేషనులో ప్రకాశం పంతులు ఉన్నారట అని పాకిపోయింది.
జనం బళ్ళు కట్టుకుని ఒక గంటలో సుమారు అయిదారు వందలమంది పోటెత్తారు స్టేషనుకి!
ఈ లోపల, స్టేషనులో ఉన్న కూలీలు, మిగతా ప్రయాణికులు అందరూ కలిసి ‘ప్రకాశం గారు వచ్చారట మన స్టేషనుకి, జేబులో రూపాయి లేదుట’, అని అభిమానంతో తలా రూపాయి రెండు వేసి సుమారు 70/- రూపాయలు పోగు చేశారు.
అంతలో స్టేషన్ మాస్టారు ఇంటినుంచి క్యారేజీలో భోజనం వచ్చింది. ప్రకాశం గారు కాస్త ముఖం కడుగుకొని వచ్చి, భోజనం మొదలెట్టారు.
చుట్టూ ఆదరాభిమానాలతో కూర్చున్న పరిచయస్థులతో “ఆ ఏవిఁటయ్యా వాడెట్లా ఉన్నాడు, వీడి వ్యాపారం బాగా సాగుతోందా, మేస్టారు గారి అమ్మాయి పెళ్ళి కుదిరిందా”, లాంటి ప్రశ్నలు అడుగుతూ!!
వారికి గట్టి అనుబంధం ఆ ఊరితో, ఆ ప్రజలతో!
ఆయన లా ప్రాక్టీసు మొదలు పెట్టింది, మునిసిపల్ ఛైర్మన్ పదవి అలంకరించిందీ ఈ రాజమండ్రిలోనే!
అంతలో భోజనం పూర్తయ్యింది.
“ఒరేయ్ నేను విజయవాడ వెళ్ళాలిరా, ఒక టిక్కెట్టు కొనండి” అన్నారు.
చిన్నా పెద్దా అందరినీ ఆప్యాయంగా, చనువుగా “ఒరే” అనే సంబోధించిన నిష్కల్మష చిత్తుడు!
ఆయనతో అట్లా పిలిపించుకోవటం కొంతమందికి కిరీటం పెట్టినంత మరి! ఆ గౌరవం అట్లాంటిది!
అదే విన సొంపు కాని వాళ్ళూ, కంటగింపు కారణము అయిన వాళ్ళూ ఉండేవాళ్ళు!
ఎవరో ఆయన నోట ఆ మాట రావటం ఆలశ్యం, టికెట్ కొని తెచ్చారు. ఆ టికెట్టూ, ఆ పోగైన 70/-రూపాయలు ఆయనకి ఇచ్చారు, రైలెక్కుతుండగా!
అది ఆయన, తన చిరుగుల కుర్తా జేబులో పెట్టుకున్నారు.
కంపార్టమెంటు బయట కొంతమంది, లోపల కొంతమంది ఉన్నారు మాట్లాడుతూ. ఆ మాటలు వింటూ, రైలు బయలుదేరే వరకు ఆయనతో ఉందామని ఇంకొందరు.
ఇంతలో ఎవరో ఒక నడివయసు మనిషి పరిగెత్తుతూ, రొప్పుతూ వచ్చాడు కోచ్ లోకి.
“అయ్యా పంతులుగారు, నమస్కారమండీ, మీరు ఉన్నారని విని వచ్చానండి కాతేరు నుంచి, అయ్యా”, అన్నాడు, అందరు విస్తుపోయి చూస్తుంటే!
“ఎవరు రా నువ్వూ”, అన్నారు పంతులుగారు, కళ్ళజోడు లోంచి తేరిపార చూస్తూ!
“అయ్యా నేను మీ బండితోలేవాడు కదండీ, రత్తయ్య! ఆ రత్తయ్య కొడుకు నండీ, గుర్తు పట్టలేదా బాబూ” అన్నాడతను!
“ఓహో రత్తయ్య కొడుకువా, ఏరా బాగున్నావా?!”
అనగానే అతను కళ్ళనీళ్ళు పెట్టుకుని, “ఏం బాగు బాబు, మా నాన్న పోయాడు, మా అమ్మకు ఒంట్లో ఒకటే సుస్తీ. మీరున్నారని విని, మీరే ఏదైనా సాయం చేస్తారని వచ్చాను బాబూ.” అన్నాడు.
“ఏం సాయమో, ఏమి చేయటమోరా – ఇదిగో నన్నే వీళ్ళందరూ చూసుకుంటున్నారు! సరేలే ఏడవకు! మనిషికి కాకుండా మానులకొస్తాయిరా కష్టాలు?!” అంటూ జేబులో ఉన్న, జనం పోగుచేసి ఇచ్చిన ఆ 70/- రూపాయలు, ఆ వ్యక్తి చేతిలో పెట్టారు. చుట్టూ జనం నిర్ఘాంత పోయి చూశారు.
ఆ మనిషి, “అయ్యా వస్తానండి బాబూ, ఉంటానండీ! మీరు దేవుడు బాబూ, చల్లగా ఉండండి బాబూ” అంటూ రైలు దిగి వెళ్ళి పోయాడు!
అతను వెళ్ళగానే ఎవరో పరిచయస్థులు ఉండబట్టలేక అడిగేశారు, “అయ్యా పంతులుగారు, ఒక్క పది రూపాయలు మీ కోసం ఉంచుకోవచ్చు కదండీ, ఉన్న పళాన మొత్తం ఇచ్చేశారే” అని!
“ఒరేయ్ నాకు కష్టం వస్తే మీరు ఇంతమంది ఉన్నారు కదరా నన్ను చూసుకోవటానికి, వాడికి ఎవరూ లేకనే కదరా ఇంత దూరం వచ్చాడు నేనున్నానని!”, అదీ ప్రకాశం గారి జవాబు.
ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు ఆయన విశాల హృదయానికి జోహార్లు మనసులోనే చెపుతూ!
***
రాజకీయం అంటే త్యాగం అని నాయకులు అనుకున్న రోజులవి.
స్వార్థం అంటే ఒక మనిషికి, బాగా ఇష్టమైనది అని నిర్వచించుకుంటే, ఆ తరహా నాయకులకు బాగా ఇష్టమైనది, పరహితమే, జనహితమే.
కోరి పేదరికంలో ఉండటం వీరందరి సమాన లక్షణంగా కనబడుతుంది.
కనుక మేం చేసిన దాంట్లో గొప్ప ఏముందీ, అది మా స్వార్థమే అని వీరి లాంటి వారు స్వారస్యంగా, అతి సరళంగా తగ్గించి చెప్పుకున్నారు తాము చేసిన గొప్ప పనుల్ని!
***
అతి పేదరికంలో పుట్టి వారాల భోజనాలు చేసి చదువుకుని లండన్ వెళ్ళి, బారిస్టరై తిరిగి వచ్చి మద్రాసులో క్రిమినల్ లాయర్‌గా ప్రభ వెలిగించి, ఎంతో అఖండంగా డబ్బు సంపాదించి, గాంధీ గారి పిలుపుతో ఉన్నదంతా ఉద్యమానికే సమర్పించిన త్యాగి, నిస్సంగుడు, ప్రకాశం గారు.
1910లో ఒక భరణం కేసులో 75000/- ఛార్జి చేసిన అతి పెద్ద లాయర్ ప్రకాశం గారు ఆ రోజుల్లో. ఆ సొమ్ము ఇప్పటి విలువలో ఎన్ని వందల కోట్లో అవుతుంది.
అంతటి పేరు మోసిన క్రిమినల్ లాయర్, అతి ఎక్కువ ఫీజు తీసుకునే సంపాదనపరుడు, అంతే సులువుగా, నిస్సంకోచంగా. తన సర్వస్వం జాతీయోద్యమానికి ధారపోసి కటిక బీదరికంలో జీవితం గడిపాడు.
చివరి రోజుల్లో, చాలా సార్లు ఒక పూట భోజనం కూడా లేకనే!
***
ఆయన కొన్న, అమ్మిన ఆస్తులు ఆయనకే తెలియనన్ని.
తేనాంపేటలో ఒకసారి ఒక కాంగ్రెసు ఆఫీసు ప్రారంభానికి వెళ్ళి, “ఎవరిదిరా ఇల్లు బాగా కట్టారు”, అన్నారుట!
పక్కనున్న వారు “అయ్యా మీదేనండీ ఒకప్పుడు! వారికి అమ్మేశారు. మనమిప్పుడు పార్టీ కోసం అద్దెకు తీసుకున్నాం”, అన్నారట!
ఆయన విని, అంతే యథాలాపంగా “ఓహో” అని ముందు కెళ్ళారట!
ఉన్నదనే ఆనందమూ లేదు, పోయిందనే దిగులు ఉండేవి కావేమో అనిపించే జీవితం, మనస్తత్వం!
***
ఒకసారి ప్రకాశంగారు ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ఒక ఉత్తరం చూపిస్తూ, కాంగ్రెస్‌కి బధ్ధవైరులైన కమ్యూనిస్టులు – ఈయన అవినీతికి పాల్పడ్డాడని చట్టసభలో గోల చేస్తున్నారట!
ప్రకాశం రాజీనామా చేయాల్సిందే అని పెద్ద గందరగోళంగా ఉన్న సమయంలో ఆయన సభలోకి వచ్చి కూచున్పారు!
“ఏమిటిరా గోల, ఏమిటి విషయం?!” అన్నారట.
వెంటనే చెప్పారు ఎవరో, “ఇదిగో మా చేతిలో ఋజువు ఉన్నది, మీ అవినీతి గురించి. మీరు ఎవరికో అప్పనంగా సంతకం పెట్టి సిమెంటు ఇప్పించారు (అప్పట్లో సిమెంటు కొనుగోలుకి కంట్రోలు ఉండేది). చూసుకోండి మీ సంతకంతో ఉన్న ఉత్తరం”, అన్నారట!
ఆయన, “ఏదీ చూపించరా, ఆ ఉత్తరం”, అని అది తీసుకుని, చదివి, “అవునురా ఇది నేనిచ్ఛిందే”, అన్నారట!
“రాజీనామా ఏముందిరా, వెంటనే ఇచ్చేస్తాను, అయినా ఏ పదవిలో నన్ను మీరు ఉండనిచ్చారు గనుక సంవత్సరం, సంవత్సరంన్నర కన్నా మించి! కానీ దాని కంటే ముందు ఎందుకిచ్చానో వినండిరా”, అని ఇట్లా చెప్పారట:
“ఈ ఉత్తరం నా దగ్గర ప్రాధేయపడి తీసుకున్న వాడి నాన్న చలపతి అని ఒక దేశభక్తుడురా! బ్రిటిష్ వాళ్ళు అన్యాయంగా మన వాళ్ళను జైళ్ళలో వేసినపుడు ఈ చలపతికి తెలిస్తే చాలు, వారి కుటుంబం కష్టపడకూడదని, తాను ఎంతో కొంత డబ్బు నెలనెలా పంపించేవాడురా. వారికి వీరికీ సహాయం అంటూ, అట్లా కొన్ని ఏళ్ళు చేసి చేసీ చివరకు అతనే కూటికి లేని వాడు అయిపోయాడు. ఈమధ్యనే పోయాడట కూడా. అతని కొడుకు వచ్చి నాకు ఈ విషయం చెప్పి మా అమ్మకు కూడా బాగా జబ్బు చేసింది పంతులుగారు, మీరే ఏదైనా సహాయం చేయాలి అన్నాడు. నేను ఏమీ చేసే పరిస్థితిలో లేనురా, అంటే ‘ఊరుకో బాబాయ్, ముఖ్యమంత్రివి, రెండు మూడు వందలు ఇవ్వలేవా’, అన్నాడు.
నేను, ‘నిజంగానే నా దగ్గర లేదురా’ అన్నాను.
అప్పుడు ఈ ఉపాయం వాడే చెప్పాడురా,! సంతకం పెట్టి ఇచ్చేశాను ఉత్తరం. అతనికి ఒక వంద బస్తాల సిమెంటు ఇయ్యమని.
అది ఒక డీలర్ దగ్గరకు తీసుకువెళ్ళి అతను ఆ రెండు వందలు తీసుకున్నట్టున్నాడు.
ఆ ఉత్తరం ఆ సిమెంటు డీలర్, తన మిత్రులైన ఇదిగో ఈ కమ్యూనిస్టు నాయకులకు ఇచ్చినట్టున్నాడు.
అదిరా విషయం, నేనే ఇచ్చాను, ఇట్లాంటివి గతంలోనూ ఎన్నో ఇచ్చానురా! మీలో ఎంతమంది తీసుకున్నారో నా దగ్గర, కొంతమందికైనా గుర్తు ఉండే ఉంటుంది.” అన్నారట!
దాదాపుగా సగం మంది కన్నా పైనే తల దించుకున్నారట, ఆ రోజు అసెంబ్లీలో!
కారణం – వారు ఏ పార్టీ వారయినా ఈయన సహాయం ఏదో ఒక సందర్భంలో పొందినవారే అవటమే!
ఆయన చెప్పిన మాటల్లోని నిజాయితీకి, ఆ పదవీ వ్యామోహ రాహిత్యానికి వారు నిరుత్తరులై పోయారట! సభ మొత్తం కంట తడి పెట్టిందట ఆరోజు అసెంబ్లీలో, రాజీనామా అడిగిన విపక్షం వారితో సహా!
అదీ ఆ నాయకుడి హిమాలయోన్నత వ్యక్తిత్వం, త్యాగ గుణం!!
ఇట్లా ఎన్నైనా చెప్పవచ్చు ఆయన జీవితంలోని సన్నివేశాలు, ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టి అంత ఎత్తున చూపేవి!
***
తనను ఎప్పుడూ ప్రజల మనిషి అనుకున్నవాడు ఆయన. నా కేదైనా అవసరం వస్తే ప్రజలే తీరుస్తారు, ఇంకెవరున్నారు అనుకున్న బోళా శంకరుడు!
ఒకసారి ఈయన మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. పార్టీ కోసం ఇచ్చిన ధనం అంతా ఈయన ఇష్టమొచ్చినట్టు సొంత ఖర్చులకూ, దానాలకు వాడేస్తున్నాడని! గాంధీ గారి వరకు వెళ్ళింది కబురు, పితూరీ రూపంలో!
మనిషి ఎంత మంచివాడూ, పరహితం కోరేవాడూ అయితే, అన్ని రాళ్ళు పడతాయి కదా, అదే చేసే ప్రయత్నం చేశారు కొంత మంది అసూయాపరులు!
పై నుంచి తాఖీదు వచ్చింది, వెంటనే విరాళాలుగా వచ్చిన డబ్బు పూర్తి వివరాలు చెప్పమనీ, ఇకపై స్వంతానికి ఏ మాత్రమూ వాడకూడదనీ!
అది తెలిసిన జనం అనూహ్యమైన ప్రతిక్రియ చూపారు తమ అభిమాన నాయకుడైన ప్రకాశం గారిని సమర్థిస్తూ!
వందలు, వేల సంఖ్యలో రోజూ ఉత్తరాలు వెళ్ళేవి కాంగ్రెస్ ముఖ్య కార్యాలయానికి.
ఏవఁనీ?!
‘మేము ఇచ్చిన డబ్బు కాంగ్రెస్ పార్టీకి కాదు, ప్రకాశం గారికే, వారు వ్యక్తిగతంగా వాడుకోవటానికే’, అని!
ఆయన వాడుకుని మిగతాది అయిన పార్టీకే ఇస్తాడో, పంచి పెడతాడో సర్వాధికారాలూ, ఆయనవే అని!
ఆ వచ్చిన ఉప్పెన లాంటి మద్దతు చూసి ప్రకాశం గారిని ప్రశ్నిస్తే అయ్యేదేమీ లేదని ఢిల్లీ పెద్దలకు తెలిసొచ్చి, మిన్నకుండి పోయారట, ఆ తరువాత!
ఆయన కూడా తన సమాధానంలో, “నా ధర్మాలను నేను పూర్తిగా నెరవేరుస్తున్నాను. నా ప్రజలకు, పితరులకు, గోత్ర ఋషులకు, దేవతలకు, అందరికీ! కనుక నేను ఏ ఋణంతోనూ బంధింపబడి లేను. నేను, నా దేశం వేర్వేరు అని నేను అనుకోవటం లేదు.
నాకు డబ్బు అవసరం లేదు, నేను ఏమీ సంపాదించనూ లేదు.ఇక దాచే ప్రశ్నే రాదు. ఏదైతే మిగులుతుందో,నా ప్రాథమిక అవసరాలకు పోను, ప్రజానీకం నిరంతరం నా పేర ఇస్తున్నది, అది నిస్సంకోచంగా నా దేశానికే చెందుతుంది. సరియైన సమయంలో సరియైన వారి చేతులకు ఆ మిగిలిన సొమ్ము అందుచేయ బడుతుంది, ఇది సత్యం” అని వ్రాశారు నిర్ద్వంద్వంగా, ఎట్టి సంకోచాలు లేకుండా!
అదీ వారి నైతిక బలం, ఆత్మస్థైర్యమూ!
***
ఒకసారి ఆయన ఉమ్మడి మద్రాసు ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, వనియంబాడి అనే ప్రాంతంలో మతకల్లోలపు గొడవలు జరిగినై!
ఇస్మాయిల్ సాహెబ్ అనే ప్రతిపక్ష నాయకుడు, ప్రకాశంగారి ఇంటికి వచ్చి నిద్రపోతున్న ఆయనను లేపి, “ఎక్కువమంది పోలీసు బలగాలను పంపండి లేకపోతే పరిస్థితి చేయి మీరి పోతుంది”, అన్నాడట.
దానికి ఈయన,”నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, నేను ముఖ్యమంత్రిని, మనిద్దరితో కానిది, పోలీసుల వల్ల అవుతుందటయ్యా?! పద మనమే వెళ్దాం”, అని ఆ గొడవలు జరిగే ప్రాంతాలకు వెళ్లి ప్రజలను,ఇరువర్గాల వారినీ శాంతింపచేశారట!
అదీ ఆయన పనిలో చొరవా, నాయకత్వ పటిమా!
***
సైమన్ కమీషన్ ఘట్టంలో బ్రిటిష్ వారి నెదిరించిన ప్రసిధ్ధమైన ఆయన తెగువకు సరితూగేదిగా చెప్పుకోదగ్గ సన్నివేశం ఇంకొకటి అయిన జీవితంలో ఒక నున్నది.
అది 1948లో హైదరాబాద్‌లో జరిగిన విషయం!
“అంత క్షేమకరం కాదేమో మీరు ఆ రజాకార్లను కలవటం హైదరాబాద్లో” అని ప్రధానమంత్రి నెహ్రూ వారించినా, ప్రకాశం గారు ఆ జటిలమైన సమస్యకు సమాధానం ఎట్లాగైనా తెచ్చే ప్రయత్నంగా, అక్కడికి వెళ్ళారు 1948లో.
అది ఇంకా నిజామ్ పాలనలో ఉన్న భూభాగమే అప్పుడు.
ఆ రజాకార్ల నాయకుడైన కాసిమ్ రిజ్వీని కలిసి, “నీకు సలహా ఇస్తున్నాను, సమయం తీరిపోయి, మీ అందరికీ ముప్పు ముంచుకొచ్చే లోపే అకృత్యాలు ఆపి, లొంగిపోవలసింది” అని సూచన చేశారు.
అధికారం ఉన్నవాడు అది ప్రజాసంక్షేమానికై సరియైన రీతిలో వాడాలి అనేది వారి సిధ్ధాంతం!
దానికి తగిన ధైర్యం వారికి జన్మతః ప్రాప్తించిన అమూల్య ధనం!
***
ప్రకాశం గారి మానస పుత్రిక అని చెప్ప తగ్గింది, వారు ప్రారంభించిన ‘స్వరాజ్య’ పత్రిక.
ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తి రగిలించి, ధైర్యాన్ని పోరాటం పటిమను వారి గుండెల్లో నింపాలని వారి ధ్యేయం, పత్రికా రచనలో ద్వారా.
1921లో తమ స్వంత మూల ధనంతో ప్రారంభించినది, అతి తక్కువ కాలంలో జనాదరణ పొంది,వారు దానికోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగింది అనటం అతిశయోక్తి కాదు.
ఖాసా సుబ్బారావు, ఈశ్వర దత్, కృపానిధి, కోటంరాజు మొదలైన పాత్రికేయ దిగ్గజాలు పనిచేసిన పత్రిక అది. కానీ కొందరు అసూయాపరుల మాటలు ఢిల్లీకి చేరవేయటంతో తీరని చేటు చేశాయి వారి మహదాశయానికి.
గాంధీగారు రెండు సార్లు ఆదేశించారు పత్రిక మూసి వేయాలని, కానీ వీరు కొనసాగించారు, దాని గొప్ప లక్ష్యం ద్రృష్టిలో ఉంచుకుని!
చివరకు శత్రువుల పన్నాగాలు, ఆర్థిక ఇబ్బందుల వలన మూయనే వలసి వచ్చింది ఆ పత్రికా లోక స్వేచ్ఛకు కేతనాలెగుర వేసిన ‘స్వరాజ్య’ను!
అది వారిని బాధించిన సంఘటనల్లో చాలా ముఖ్యమైనది.
***
నాయకులు నీతిగా ఉంటే, ప్రజలు వారిని ఎంతగా తమ వారిగా చూసుకొని ఆదరిస్తారో అనటానికి ప్రకాశంగారి జీవితమే తార్కాణ మనవచ్చును!
ఒకసారి శాసనసభలో ప్రతిపక్షాలు “మీలోనే మీకు పొరపొచ్చాలున్నాయి” అన్న అభియోగం మోపితే, దానికి వారిచ్చిన జవాబులోని ఆ గుండె లోతుల్లో నుంచి వచ్చిన మాటలు అప్పటికీ, ఎప్పటికీ వర్తించేవే, ప్రజాసేవ అని రాజకీయాలలోకి తిరిగే వారికి.
ఆ రోజు ప్రకాశంగారు ఇలా అన్నారు:
“మాలో మాకు భేదాలున్నాయని మీరంతా అంటున్నారు. ఒక మాట చెబుతాను వినండి.. నేను ఈ ప్రజారంగంలో 26 సంవత్సరాలగా పనిచేస్తూ వస్తున్నాను. ఈ శాసన సభలో ప్రధాన మంత్రిగా కూర్చుండడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పబ్లిక్ రంగంలో నేనా పని చేయలేదు. ప్రజాసేవకుడి గానే నేను పరిపాలన సాగిస్తున్నాను. నన్నిక్కడికి పంపించిన ప్రజలకు నేను ఎలా రాజునౌతాను? మినిస్టర్ అన్న ఇంగ్లీషు క్రియకు ‘ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చు’ అని అర్థము. అది తీర్చేవాడు మినిస్టరు. మినిస్టరు ప్రజలకు సేవకుడు. ఆ సేవాధర్మం సరిగా నిర్వహించకపోతే, మినిస్టర్లు అవతలికి పోవలసిఉంటుంది. అటువంటి సేవ చేసే సమయంలో మాలో మా కేవైనా భేదాభిప్రాయాలు వస్తే వాటిని సర్దుకొనే సమృద్ధి మాలోనే ఉదయించాలి. కాని, ఈ భేదాల దుష్ప్రభావం పరిపాలనమీద పడకూడదు..”
నాయకులూ, పాలకులూ అయిన వారికి, వారి భూమికను గుర్తుచేసే స్పష్టమైన వైఖరి గల మాటలు.
అంతరాత్మకు జవాబుదారీగా ఉండే వ్యక్తులు మరువలేని పాఠాలు!
***
ధైర్యం, మనోబలాల విషయంలో వారు, ఆంధ్రులలో కేసరి; ఆంధ్ర పౌరుషానికి, సేవాబుధ్ధికీ మరపురాని నిధి, నిస్సంగత్వ వైఖరికి ఆంధ్ర రాజకీయాలలో ఆదర్శమైన మహర్షి – అని చెప్పటం, సమంజసంగా అనిపిస్తుంది.
(ప్రకాశం గారి గురించి అప్పటి వారు వ్రాసినవి, వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాల ఆధారంగా వ్రాసిన నివాళి!)