[box type=’note’ fontsize=’16’] “మొదట మీ కుటుంబానికి ఈ అమూల్యమైన నిధుల్ని ఇవ్వండి. తర్వాత మొత్తం సమాజానికి పంచండి” అంటున్నారు సలీం ‘ఇచ్చుటలో ఉన్న హాయీ…’ అనే ఈ కల్పికలో. [/box]
[dropcap]ని[/dropcap]ద్ర లేస్తూనే ఎప్పటికిమల్లే దిగుల్ని వొంటినిండా కప్పుకుని లేచాడతను. ఏముందీ జీవితంలో.. తరుముకొచ్చే కష్టాలు, పొంగుకొచ్చే కన్నీళ్ళు తప్ప.. అనుకున్నాడు. చదువు సరిగ్గా అబ్బలేదు.. చిరుద్యోగం.. ఉదయం ఎనిమిదింటికి పన్లోకి దిగితే రాత్రి ఎనిమిదింటి వరకు గొడ్డు చాకిరీ.. నెల రోజులు కష్టపడితే చేతికందే జీతం గొర్రె తోకలా బెత్తెడయితే అవసరాలు మాత్రం మూరెడు. నెల మధ్యనుంచే వెతుకులాట. అసలు పెళ్ళేందుకు చేసుకున్నానా అని బాధపడని రోజు లేదతనికి. ఒక్కతే కూతురు. ఎనిమిదో తరగతి చదువుతోంది. భార్యా కూతురూ ఉద్యోగం.. ఏదీ అతనికి మనశ్శాంతినివ్వటం లేదు. ఈ మధ్య భార్య మొహం చూసినా కూతురి మొహం చూసినా కోపం వచ్చేస్తోంది. ఎప్పుడు ఎదురుపడినా అది కావాలీ ఇది కావాలీ అంటూ తన అసమర్థతను గుర్తు చేయటం తప్ప తన అసహాయతను ఎందుకు అర్థం చేసుకోరో తనకు అర్థం కావటం లేదు. చిరాకేస్తోంది.. విసుగనిపిస్తోంది. విషాదం ముంచెత్తినపుడల్లా చచ్చిపోవాలనిపిస్తోంది.
ఆ రోజు ఆదివారం… అందరికీ విశ్రాంతి దినం.. పనికెళ్ళక్కరలేదు. బాగా పొద్దెక్కేదాకా మంచం మీద బద్దకంగా దొర్లొచ్చు. కానీ తనకా అదృష్టం లేదు. ఇల్లు పేలబోతున్న అగ్ని పర్వతంలా ఉంది. నిన్న రాత్రే పెద్ద గొడవ జరిగింది. నిప్పు రాజుకుంది. అదిప్పుడు కార్చిచ్చులా ఇంటినంతా దహించేలా ఉంది.
“రేపు దీపావళి పండుగ. గుర్తుందిగా” అంది అతని భార్య అలివేలు.
జొన్న రొట్టెలో పచ్చడి నంజుకుని తింటూ “ఐతే ఏంటి?” అన్నాడు.
“కనీసం పాయసమైనా చేసి పిల్లకు పెట్టొద్దా? అది ఎప్పటినుంచో పాయసం చేయమ్మా అని అడుగుతోంది. యింట్లో సరుకులు లేవు. రేపు ఎవరి దగ్గరైనా అప్పు చేసి సరుకులు పట్రండి”
“ఇక్కడ గంజికి గతి లేకపోతే దానికి పాయసం కావాల్సి వచ్చిందా? గొంతెమ్మ కోర్కెలు కోరటం కాదు. నోర్మూసుకుని కూచోమని చెప్పు” అన్నాడు కోపంగా.
“నేనేమీ కొత్త బట్టలు కావాలనో, నగలు కావాలనో అడగడం లేదు నాన్నా. అవెలాగూ నువ్వు తీర్చలేవని తెలుసు. పాయసం తినాలన్న కోరిక.. అదేమీ గొంతెమ్మ కోరిక కాదు” అంది కూతురు.
తింటున్న కంచాన్ని విసురుగా తోసేసి లేచి నిలబడ్డాడు. “అవునే. నీకు బట్టలూ నగలూ కొనే స్తోమత నాకు లేదు. అంతేకాదు. పండగ రోజు నీకు పాయసం కూడా పెట్టలేని అసమర్ధుణ్ణి. చాలా.. నీకిప్పుడు సంతోషంగా ఉందా?” అన్నాడు కోపంగా..
“నేనలా అనలేదు నాన్నా” వస్తున్న ఏడుపుని దిగమింగుకుంటూ అంది.
“నా చాతకానితనాన్ని వేలెత్తి చూపింది చాలక అల్లేదంటావా? ఏం పాయసం తినకపోతే చచ్చిపోతావా?”
కూతురు వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
“ఔనండీ. అది నాలాంటి దౌర్భాగ్యురాలి కడుపున పుట్టకుండా చచ్చిపోయి ఉంటే చాలా బావుండేది. ఒక్కగానొక్క ఆడపిల్ల.. దాని అచ్చటా ముచ్చటా ఎప్పుడైనా తీర్చారా? నాతో సరే పెళ్ళయిన కాణ్ణించి ఎప్పుడూ ప్రేమగా మాట్లాడింది లేదు. కనీసం దాంతో ఎప్పుడైనా లాలనగా మాట్లాడారా? కసురుకోవడం విసుక్కోవడం తప్ప ఎప్పుడైనా దానికి అనురాగం పంచారా?” అలివేలు కోపంగా అంది.
“నా బతుక్కి అదొక్కటే తక్కువ.. ఎందుకు పెళ్ళి చేసుకున్నానా దేవుడా అని బాధపడని రోజు లేదు. తాదూరకంత లేదు మెడకో డోలు అన్నట్టు గుదిబండలా కూతురొకటి నా ప్రాణానికి.. అనురాగం పంచాలట.. ఎక్కణ్ణుంచి వస్తుంది అనురాగం?”
“అంత చాతకాని వాళ్ళు పెళ్ళేందుకు చేసుకున్నారు? నా జీవితంలో నిప్పులు పోయడానికా? పిల్ల కోరే చిన్న చిన్న కోర్కెలు కూడా తీర్చలేనివాళ్ళు దాన్నెందుకు కన్నారు? దాని బతుకు బండలు చేయడానికా?” అలివేలు రెచ్చిపోయింది. “పెళ్ళయి ఇన్నేళ్ళయినా ఏ పండగ రోజైనా ఓ వాయిల్ చీరైనా కొనిచ్చారా? లేదే. నేనేమీ మిమ్మల్ని తప్పు పట్టలేదే. తిన్నా తినకున్నా సర్దుకునే పోయాగా. ఎన్ని కోర్కెల్ని చంపుకున్నానో.. నా విషయం వదిలేయండి. అది చిన్న పిల్ల.. ఏమడిగిందని.. పాయసమేగా.. అది కూడా తీర్చలేని మీరేం తండ్రి.. ఛీ.. పాడు బతుకు”
అతనికీ కోపం వచ్చింది. ఛీ అంటుందా తననీ… తిట్లు.. మాటకు మాట.. అర్ధరాత్రి వరకూ పోట్లాడుకుంటూనే ఉన్నారు. కూతురు ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది.
ఉదయం నిద్రలేచాక అలివేలు మొహం వైపు చూశాడు. భగభగమండుతున్న అగ్ని గుండంలా ఉంది. కూతురి మొహం వైపు చూసాడు. విషాదం పొంగుతూ ఉంది.
“ఆకలేస్తోంది. ఏం వండావు? తొందరగా పెట్టు” అన్నాడు.
“ఏం ఉంది వండటానికి? ఆకలేస్తే నన్ను తిను” అంది అతని వైపు అసహ్యంగా చూస్తూ
ఏక వచన ప్రయోగంతో అతనికి మరింత కోపంవచ్చింది. ఈడ్చిపెట్టి కొట్టాడు. ఆమె కింద పడిపోయింది. “కొట్టు.. ఇంతకన్నా నీకేం చాతనవుతుంది?” అందామె రోషంగా.
“ఛీ.. ఈ ఇల్లోక నరకం” అంటూ వేగంగా బైటపడ్డాడు.
వీధులన్నీ నిరాసక్తంగా తిరిగాడు. సమయం పన్నెండు కావస్తోంది. ఉదయం ఏమీ తినకపోవడం వల్ల తట్టుకోలేనంత ఆకలి.. సాహిత్య సభలూ సమావేశాలు జరిగే హాలుకి ఆనుకుని ఉన్న వరండాలో కొంతమంది నిలబడి గొడవ గొడవగా మాట్లాడుకుంటూ పేపర్ ప్లేట్లలో ఏదో తింటున్నారు. బహుశా మరో కార్యక్రమం మొదలవడానికి ముందు ఆహూతులకు రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేసినట్టున్నారు. అతను లోపలి కెళ్ళాడు. పేపర్ ప్లేట్లో రెండు సమోసాలు పెట్టిస్తే తిన్నాడు. కాఫీ తాగాడు. ప్రాణం లేచొచ్చింది. వెళ్ళిపోదామనుకున్నాడు. తిన్న వెంటనే వెళ్ళిపోతే బావుండదని లోపలికెళ్ళి ఓ సీట్లో కూచున్నాడు.
విరామానంతర సభ మొదలయింది. ఒకతను పోడియం దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. “అవసరంలో ఉన్నవాళ్ళని, అన్నార్తుల్ని, అనాథల్ని ఎప్పుడైనా ఆదుకున్నారా? ఒక్కసారి ఇచ్చి చూడండి. హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఓ సినీ కవి రాసిన పాట గుర్తుందా? ఇచ్చుటలో ఉన్న హాయీ.. అన్నాడు. నిజంగానే ఇవ్వడంలో అలౌకికమైన తృప్తి మీకు దక్కుతుంది. మీరేమీ వారెన్ బఫెట్లానో, జుకర్ బర్గ్ లానో వందల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆదాయంలో పదో వంతు ఇవ్వండి చాలు.. దానికోసం మీరేమీ లక్షాధికార్లు కానక్కరలేదు. మీ దగ్గర వెయ్యి ఉంటే వంద ఇవ్వండి. వందుంటే పది రూపాయలివ్వండి. పది రూపాయలుంటే ఒక్క రూపాయి ఇవ్వండి.”
అతని ప్రసంగానికి అడ్డు తగులూ సభికుల్లోంచి ఓ వ్యక్తి గొంతు పెంచి “అసలేమీ లేకపోతేనో..” అని అడిగాడు.
“డబ్బులు లేనంత మాత్రాన మీ దగ్గర ఏమీ లేదని ఎందుకనుకుంటున్నారు? ప్రేమను ఇవ్వండి. కరుణను పంచండి. అందరితో దయగా మాట్లాడండి. ఇతరులకు ఎంత ఇచ్చినా తరగని నిధులివి. మొదట మీ కుటుంబానికి ఈ అమూల్యమైన నిధుల్ని ఇవ్వండి. తర్వాత మొత్తం సమాజానికి పంచండి…”
అతనికి ఛెళ్ళున ఎవరో కొరడాతో కొట్టినట్లయింది. వ్యాకులపాటుతో హాల్లోంచి బైటికొచ్చే వేగంగా ఇంటి వైపు నడుస్తూ ఆలోచించసాగాడు. ఔను కదా.. తన దగ్గర భార్యా పిల్లల అవసరాలు తీర్చేంత డబ్బు లేదు. అలివేలు కోసం ఓ వాయిల్ చీర కొనలేని అసమర్థత.. కూతురి కోసం పండక్కి ఓ కొత్త డ్రెస్ కొనలేని అసమర్థత.. కానీ తను ప్రేమించగలడు కదా.. ఆప్యాయంగా మాట్లాడగలడు కదా.. ఈ విషయం తనకి ఇన్నాళ్ళూ ఎందుకు తట్టలేదు? విసుక్కోవడం, చిరాకు పడటం, తిట్టడం తప్ప తనెప్పుడైనా తన వాళ్ళతో ఆత్మీయంగా వ్యవహరించాడా? లేదు. ఎంత తప్పు చేశాడో.. అతన్ని దహిస్తూ పశ్చాత్తాపం..
దార్లో ఓ మిత్రుడి యిల్లు.. అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో.. అతని దగ్గర కాసిని డబ్బులు అప్పు తీసుకున్నాడు. సూపర్ మార్కెట్లో సగ్గుబియ్యం, చక్కెరతో పాటు పాలప్యాకెట్ తీసుకుని యింటికెళ్ళాడు. ఇంటినిండా శ్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉంది.
అతని రాకను పట్టించుకోకుండా తల వొంచుకుని ఏదో చదువుకుంటున్న కూతురివైపు ప్రేమగా చూశాడు. “తల్లీ.. ఓ సారి నాదగ్గరకు రా” అని పిలిచాడు. ఎప్పుడూ అలా పిలవని తండ్రి వైపు ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూసింది. అతని కళ్ళల్లో అనంతమైన వాత్సల్యం… తడితడిగా.. దగ్గరకెళ్ళి నిలబడింది. పక్కన కూచోబెట్టుకుని “నువ్వు పాయసం కావాలన్నావుగా.. అవసరమైన సరుకులన్నీ తెచ్చాను. నిన్ను అనవసరంగా కోప్పడ్డాను కదా. సారీ తల్లీ. ఇంకెప్పుడూ కోప్పడను. విసుక్కోను. సరేనా” అన్నాడు లాలనగా ఆమె కురుల్ని నిమురుతూ. ఆ పిల్ల హృదయం కరిగిపోయింది. తండ్రి ఎదమీద వాలి “పాయసం లేకున్నా పర్లేదు నాన్నా. నువ్వెప్పుడు ఇలా ఉంటే చాలు” అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ.
తన భర్తలో వచ్చిన మార్పుని చూస్తూ ఇది కలా నిజమా అనే అనుమానంతో బొమ్మలా నిలబడి ఉన్న అలివేలుని సమీపించి, పేమగా ఆమెను హృదయానికి హత్తుకుంటూ “పెళ్ళి చేసుకుని పొరపాటు చేశానని ఇన్నాళ్ళూ అనుకోవడం ఎంత పొరపాటో అర్థమైంది అలివేలూ.. నువ్వూ మన పాపా నాకు దేవుడిచ్చిన రెండు వరాలు. ఇన్నాళ్ళూ నిన్ను బాధపెట్టాను కదూ. నన్ను క్షమించు. రెండు మూడు నెలల సమయం ఇవ్వు. నీకు తప్పకుండా చీర కొనిపెడతా” అన్నాడు.
ఆమె అతని గుండెల్లోకి ఒదిగిపోతూ “చీరలొద్దండీ. మీ ప్రేమ చాలు” అంది మనస్పూర్తిగా.
మరికొద్దిసేపటికి పొయ్యి మీద పాయసం ఉడుకుతున్న తీయని వాసన ఆ యింటినిండా వ్యాపించింది. వాళ్ళ మొహాలిప్పుడు మతాబాల్లా వెలుగుతున్నాయి.