ఇచిగో ఇచి.. ఈ క్షణం చేజారనీయకు

1
2

[శ్రీపతి లలిత గారు రాసిన ‘ఇచిగో ఇచి.. ఈ క్షణం చేజారనీయకు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“డా[/dropcap]క్టర్ ఏమన్నారు?” బయటికి వచ్చిన భర్తని, కోడల్ని ఆత్రంగా అడిగింది శోభ.

పక్కనే ఉన్న నిఖిల్ ప్రశ్నార్థకంగా భార్య అపర్ణ వంక చూసాడు.

“ముందు ఇంటికి వెళ్లి మాట్లాడదాము” ఆగకుండా ముందుకు నడుస్తూ

“నేను కారు తెస్తానమ్మా!” అపర్ణతో అంటూ వెళ్ళాడు నిఖిల్ తండ్రి రమేష్.

కార్‌లో ఎవరూ మాట్లాడలేదు.

ఇంటికెళ్ళాక అందరికీ భోజనాలకి ఏర్పాటు చేసింది అపర్ణ.

భోజనాలయ్యాక అందరూ హాల్ లో కూర్చున్నారు.

“నాన్నా! నేను చిన్న పిల్లాడిని కాదు భయపడడానికి, డాక్టర్ ఏమన్నదీ నిజం చెప్పండి?” నిఖిల్ తండ్రిని అడిగాడు.

“మనం భయపడ్డదే చెప్పారు డాక్టరుగారు. కిడ్నీ మీద చిన్న ట్యూమర్ ఉందన్నారు. ముందు సర్జరీ చేసాక, బయాప్సీ రిపోర్ట్ వస్తే అది ఏ స్టేజిలో ఉందో తెలుస్తుందట” అన్నాడు రమేష్.

ఎంత అనుమానించినా, డాక్టర్ నోట్లోనుంచి ఆ సంగతి వచ్చిందని తెలిసాక నిఖిల్ ముఖం వెలవెల పోయింది.

అపర్ణ కన్నీళ్లు ఆపుకుంటూ నిఖిల్ భుజం మీద చేయివేసి నొక్కింది.

“కంగారు పడక్కర్లేదు అన్నారు. ఎర్లీ స్టేజి లోనే ఉన్నట్టుగా ఉంది, మూడొంతులు ఆపరేషన్ తోనే సరిపోవచ్చు అన్నారు, మనం కొంచెం త్వరగానే వెళ్ళాంగా” అందరివేపు ఓదార్పుగా చూస్తూ అన్నాడు రమేష్.

నిఖిల్ ఏమీ మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్ళాడు, అతను లోపలికి వెళ్ళగానే శోభ నిశ్శబ్దంగా ఏడవడం మొదలుపెట్టింది. రమేష్, శోభని ఓదారుస్తుంటే అపర్ణ నిఖిల్ దగ్గరికి వెళ్ళింది.

రమేష్, శోభల పిల్లలు నిఖిల్, నిరుపమ, నిఖిల్ అక్క నిరుపమకి పెళ్లి అయ్యి భర్తతో బెంగుళూరులో ఉంటుంది.

రమేష్ హైదరాబాద్ లో పబ్లిక్ సెక్టార్ కంపెనీలో చేసి రిటైర్ అయ్యాడు. మంచి ఇల్లు, బాగా స్థిరపడ్డ పిల్లలు, దేనికీ లోటు లేకుండా ఆనందంగా ఉన్నారు.

నిఖిల్ ఇంజినీరింగ్ అయ్యాక హైద్రాబాద్ లోనే ఉద్యోగం వచ్చింది, ఇంకో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అపర్ణతో పెళ్లి అయ్యి, నాలుగేళ్ళ కొడుకు దేవాస్‌తో సహా తల్లితండ్రులతోనే ఉంటాడు.

అందరూ వీళ్ళని, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అంటుంటారు.

ప్రస్తుతం ఉన్న ఆర్థికమాంద్యంలో నిఖిల్ ఉద్యోగం పోయింది. ఉద్యోగం వాళ్లే తీసేసారు కనక, ఆరు నెలల జీతం ఇచ్చారు.

ఉద్యోగం పోయినందుకు కొంత బాధపడ్డా, మళ్ళీ ఇంకోచోట తెచ్చుకోగలననే ధైర్యం ఉన్న నిఖిల్, రెండు నెలలు బ్రేక్ తీసుకుని, కొత్త జాబ్ వెదుక్కుంటాను అన్నాడు.

వెకేషన్‌కి వెళ్తే కొంత మార్పు ఉంటుందని, యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసి దానిలో భాగంగానే ఇద్దరూ మెడికల్ పరీక్షలు చేయించుకున్నారు.

నిఖిల్ ఈ మధ్య బరువు తగ్గితే డైటింగ్ వల్ల తగ్గానని, నీరసంగా ఉంటే తిండి సరిపోక అయ్యిఉంటుందని అనుకున్నాడు.

కానీ ఆ మెడికల్ పరీక్షల రిపోర్ట్ చూసిన డాక్టర్, వెంటనే స్పెషలిస్ట్‌ని కలవమని చెప్తే కంగారుగా కలిశారు.

ఆయన కొద్దిగా అనుమానం వ్యక్తం చేసి, ఆంకాలజిస్ట్‌ని కలవమంటే అందరికీ గుండెలు జారిపోయాయి.

బాగా పేరున్న ఆంకాలజిస్ట్, పరిస్థితి ఉన్నది ఉన్నట్టు చెప్తారు, ఆయన ట్రీట్ చేస్తే జబ్బు తగ్గడం ఖాయం అని అందరూ చెప్తే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ముందు నిఖిల్‌ని చూసి నవ్వుతూ “డోంట్ వర్రీ యంగ్ మాన్! యు విల్ బి ఫైన్” అంటూ రిపోర్ట్స్ చూసి పేషెంట్ ని బయట కూర్చోమని ఇద్దరిని ఉండమన్నారు, శోభా, నిఖిల్ బయటికి వెళ్లారు.

రమేష్, అపర్ణలతో, ఆయన వ్యాధి చాలా మొదట్లోనే ఉందని, ఎంత త్వరగా సర్జరీ చేస్తే అంతమంచిది అని చెప్పారు.

సర్జరీ చేసి ట్యూమర్ తీసేస్తే, మళ్ళీ వచ్చే అవకాశం తక్కువని, ఏది ఏమైనా సర్జరీ చేసి, బయాప్సీ రిపోర్ట్ వస్తే కానీ, ఏదీ ఖచ్చితంగా చెప్పలేనని చెప్పారు. ఎంత ఖర్చు అయ్యేది, ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలి, ఆ తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం పడచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు లాంటివి మాట్లాడి, వీలైనంత త్వరలో ఆపరేషన్‌కి ఏర్పాటు చేసుకోమని చెప్పారు.

రమేష్, డాక్టర్ చెప్పిన విషయాలన్నీ శోభకి, నిఖిల్ కి చెప్పాడు, ఆ సంగతులు విన్న నిఖిల్, రూమ్‌లో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు, నాకు ఎందుకు ఈ జబ్బు వచ్చింది? నేను సర్జరీ చేస్తే బతుకుతానా? ఆ తర్వాత జబ్బు మళ్ళీ తిరగపెట్టకుండా ఉంటుందా? తనకి ఏదన్నా అయితే? ఆ ఆలోచనే భరించలేక దుఃఖం వచ్చింది, కళ్లలో నీళ్లు, బుగ్గలు మీద కారుతున్నాయి, అప్పుడే లోపలికి వచ్చి చూసిన అపర్ణకి గుండె పిండినట్టయింది.

వెంటనే మనసు గట్టి చేసుకుని నిఖిల్ దగ్గరికి వెళ్లి “ఈ యుద్ధం మన అందరిదీ నిక్కీ! మేము అంతా నీతో ఉన్నాం. మనం గెలుస్తాం. నీకు ఏమీ కాదు, ఇది నా ఒక్కదానిదే కాదు, అందరి నమ్మకం” చేతిలో చెయ్యి వేస్తూ అంది.

“కిందటి నెల నా ఉద్యోగం పోయినప్పుడు కూడా ఇలానే అన్నావు, ఏది జరిగినా మన మంచికే అని, ఉద్యోగం పోవడం మంచిదా?” ఉక్రోషంగా అన్నాడు నిఖిల్.

“అవును, ఇప్పుడు కూడా అదే అంటున్నాను. నీకు ప్రతీ సంవత్సరం బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది, నిన్ను తీసెయ్యడం మీ మేనేజర్లకు కూడా ఇష్టం లేకపోయినా తప్పలేదు. నీ ఉద్యోగం పోయింది.. కానీ, నీకు కంపెనీ వాళ్ళు ఆరునెలల జీతం ఇచ్చారు. అలా ఇవ్వడం వల్లే మనం యూరోప్ వెళదామని మెడికల్ టెస్ట్ చేయించుకున్నాం, అందుకే నీ సమస్య త్వరగా బయటపడింది. ఇప్పుడు నువ్వు నీ ఉద్యోగం గురించిన ఆలోచన లేకుండా ట్రీట్మెంట్ మీద శ్రద్ధ పెట్టచ్చు” అనునయంగా అంది అపర్ణ.

“నాకే ఎందుకు ఇలా అయింది? నేను ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాను” ఉక్రోషంగా అన్నాడు నిఖిల్.

“నాకే ఎందుకు? ఈ ప్రశ్నకి ఎవరిదగ్గరా సమాధానం లేదు, సమస్య ఎవరికైనా రావచ్చు, పరిష్కారం అందరికీ దొరకదు, మనకి మంచి డాక్టర్ దొరికారు, సర్జరీతో నీ సమస్య తీరిపోతుంది అన్నారు, ట్రీట్మెంట్ ఖర్చు మా కంపెనీ ఇన్సూరెన్సు భరిస్తుంది, మనకు అండగా మన అమ్మానాన్నలు ఉన్నారు, ఇంతకంటే మనకి ఏం కావాలి?”

హఠాత్తుగా అపర్ణ మాటలని మధ్యలో ఆపుతూ “దేవాస్ ఏడీ?” కొడుకు గుర్తొచ్చి అడిగాడు.

“అమ్మ దగ్గర ఉన్నాడు, రేపు తీసుకుని వస్తారు, కానీ కొన్ని రోజులు అక్కడే ఉంచుతాను” అంది అపర్ణ, సరే అన్నట్టు తలూపాడు నిఖిల్.

“నిక్కీ! కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది విను. అసలు సమస్య నీకే వచ్చింది, ఏ మాత్రం ఇది ఊహించని నీకు, ఇది పిడుగులాంటి వార్త అన్నది నిజమే! నేనూ ఒప్పుకుంటా ఆ సంగతి. కానీ మనం ఒక కుటుంబంలో ఉన్నాం, సమస్య ఎవరికి వచ్చినా బాధ అందరిదీ. ఉదయం నుంచీ కనిపించని నీ నాలుగేళ్ల కొడుకు నీకు గుర్తొచ్చి, వాడు ఏమయ్యాడో అని కంగారు పడ్డావు, ముప్పయి ఏళ్ళ కొడుక్కి కాన్సర్ అంటే ఆ తల్లితండ్రుల బాధ ఆలోచించు. ఇద్దరూ దుఃఖం దిగమింగుకుని ఉన్నారు, అలాగే మా అమ్మానాన్న కూడా ఎంతో బాధపడుతున్నారు. కొన్ని విషయాలు మన చేతిలో లేవు,వాటి గురించి దిగులు పడి ఉపయోగం లేదు.

అయిపోయిన దాని గురించి నువ్వు ఎంత ఆలోచించినా ఉపయోగం లేదు, కనీసం నాకు ఉద్యోగం ఉంది, మా వాళ్ళు కొంతకాలం ఇంటి నుంచి వర్క్ చేయచ్చు అన్నారు. డబ్బు విషయం మనకి దిగులు లేదు, మనకి మానసికంగా బలాన్నిచ్చే మనుషులు ఉన్నారు. సంగతి తెలియగానే మీ అక్కా, మా తమ్ముడూ ఇద్దరూ వస్తామన్నారు కానీ నేనే ఇప్పుడే వద్దు అన్నాను, ఇలా పాజిటివ్ సైడ్ చూడు” ఊపిరి తీసుకోడానికి ఆగింది.

“అందరూ వచ్చి నన్ను సానుభూతి చూపులు చూస్తే, నేను భరించలేను” గద్గద స్వరంతో అన్నాడు నిఖిల్.

“నువ్వు చాలా సినిమాటిక్‌గా ఆలోచిస్తున్నావు, మా అందరికీ నువ్వు బావుండాలన్న ఆలోచన తప్ప వేరేది లేదు, నన్ను చూడు, ఏడుస్తున్నానా?” అంది నవ్వుతూ.

“నువ్వు ఏడవ్వు, అందరినీ ఏడిపిస్తావు రాక్షసీ!” అన్నాడు నిఖిల్ కూడా నవ్వుతూ.

అపర్ణ మానసిక దృఢత్వం కలిగిన అమ్మాయి, నిఖిల్ పైకి గట్టిగా కనిపించినా మెత్తటి మనసు, చాలా చిన్న విషయాలకి కూడా బాధపడతాడు. “నీకేమీ కాదు నిఖిల్! నాకు ఆ నమ్మకం ఉంది, నిన్ను కాపాడుకోడానికి ఏం చెయ్యాలన్నా చేస్తాను” నవ్వుతూ అతని నుదిటి మీద చిన్నగా మీద ముద్దు పెట్టింది.

“ఇప్పుడు నీకొక విజయమంత్రం బోధిస్తాను విను మానవా!” అంటున్న అపర్ణని చూసి

“అమ్మో! ఇప్పుడు నా చేత ఏదైనా దేవుడి మంత్రం లక్షల్లక్షలు చేయిస్తావా? నాకు నోరు తిరగదు” అన్నాడు నిఖిల్.

అపర్ణకి దైవ భక్తి ఎక్కువ, నిఖిల్ ప్రసాద భక్తుడు.

“ఇచిగో.. ఇచి.. ఇదీ.. మన మంత్రం”

“అదేమిటీ? ఏ భాష, ఏ దేవుడి మంత్రం” అయోమయంగా అన్నాడు నిఖిల్.

“ఇది జపనీస్ వారి ఆనందమంత్రం, సంతోషమార్గం. ప్రతీ మనిషినీ గతం వేధిస్తుంది, భవిష్యత్తు భయపెడుతుంది, ఆ రెండిటికి మధ్య చిక్కుకుని వర్తమానాన్ని నిర్లక్యం చెయ్యకూడదు, ఈ క్షణం విలువ తెలుసుకుని, ప్రతీ అనుభూతినీ ఆస్వాదించాలి. వదిలేసిన క్షణం మళ్ళీ రాదు అని గుర్తుంచుకుంటే చాలు, అదీ ఇచిగో ఇచి సారాంశం, ప్రతీ కలయికా అమూల్యమే, అది వ్యక్తులతో కావచ్చు, ప్రకృతితో కావచ్చు.. ఈ రోజు మన ‘ఇచిగో ఇచి’ డాక్టర్ గారితో అని నా నమ్మకం.

ఇప్పుడు మన ఇంట్లో అందరం ఈ మంత్రమే పాటించాలి, గతాన్ని మార్చలేము, భవిష్యత్తుని నిర్దేశించలేం.

అందుకే వర్తమానంలో ఉన్న ఆనందం అనుభవిద్దాం. నువ్వు పాజిటివ్‌గా ఉంటే నీకు వైద్యం కూడా బాగా పనిచేస్తుంది, కొంచెం సేపు రెస్ట్ తీసుకో” చెప్పి బయటికి వెళ్ళింది అపర్ణ.

తల్లీతండ్రిని ఓదార్చడానికి వెళ్లిందని తెలుసు నిఖిల్‌కి, అపర్ణ మాటలకి మనసు తేటపడి నిద్రపోయాడు.

సాయంత్రం టీ తాగడానికి హాల్ లోకి వచ్చిన నిఖిల్‌కి, తనకోసం చూస్తున్న తల్లితండ్రి కనిపించారు, ఏడ్చి, ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయిన తల్లిని, దుఃఖం దిగమింగుకుని గంభీరంగా కనిపిస్తున్న తండ్రిని చూస్తే జాలి వేసింది నిఖిల్‌కి.

చిన్న పిల్లాడిలా ఇద్దరి మధ్యలో కూర్చుని, ఇద్దరి భుజాల మీద చేతులు వేసి “మీ కోడలు ఇంకా మంత్రోపదేశం చెయ్యలేదా? మనకి ఇంక గుడ్ మార్నింగ్, గుడ్ నైట్‌లు లేవు. ఉన్నదల్లా ‘ఇచిగో ఇచి’ ఇదే మంత్రం జపించండి, మీ కోరికలు అన్నీ తీరతాయి, శుభం కలుగుతుంది” అభయ హస్తంతో అంటున్న నిఖిల్ ని చూసి పకపకా నవ్వేశారు అందరూ.

తర్వాత రెండురోజుల్లోనే ఆసుపత్రిలో చేరి, ఆపరేషన్‌కి సిద్దపడ్డాడు నిఖిల్.

చుట్టూ, తనకి మానసిక స్థైర్యాన్నిస్తున్న తనవాళ్లని చూసి, ధైర్యంగా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాడు నిఖిల్.

రెండుగంటల తరవాత, డాక్టర్ బయటికి వచ్చి “ట్యూమర్ చిన్నదే, మొత్తం తీసేసాము, మళ్ళీ కాన్సర్ వచ్చే అవకాశాలు లేనట్లే , బయాప్సీ రిపోర్ట్ వస్తే పూర్తి ధైర్యంతో చెప్పచ్చు, కొద్దిసేపటి తరవాత మీరు ఒకొక్కరే వెళ్లి పేషెంట్‌ని చూడొచ్చు” అని చెప్పి వెళ్లారు.

ఐసీయూ లోకి మార్చేముందు చూడమంటే, ఒకరి తర్వాత ఒకరు వెళ్లి చూశారు, ఆఖరున అపర్ణ వెళ్లింది. నీరసంగా ఉన్న భర్తని చూడగానే దుఃఖం వచ్చింది కానీ, కన్నీళ్లు కంట్రోల్ చేసుకుంటూ విజయసూచకంగా థమ్సప్ చూపిస్తే ‘ఇచిగో ఇచి’ బలహీనంగా నవ్వుతూ అన్నాడు నిఖిల్.

ఆ మాట విని సంతోషంగా ‘ఇచిగో ఇచి’ అంటూ నవ్వుతున్న అపర్ణ ని చూసి, “పాపం, భర్త అలా ఉంటే తట్టుకోలేక, ఏదో పిచ్చిగా మాట్లాడినా సంతోషిస్తోంది ఈ పిచ్చితల్లి” అనుకుంది ‘ఇచిగో ఇచి’ అంటే ఇంకా తెలీని అమాయకపు నర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here