Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-98: ఇదన్నమాట సంగతి..

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]పొ[/dropcap]ద్దున్నే డాబా మీద ఒడియాలు పెడుతుంటే అమెరికాలో ఉండే మా అక్క కూతురు సుమ గుర్తొచ్చింది. దానికి పచ్చి ఒడియాలంటే చాలా ఇష్టం. ఇక్కడున్నన్నాళ్ళూ ఒడియాలు పెట్టినప్పుడల్లా పచ్చి ఒడియాలపిండితో అట్టు వేసి దానికి తీసికెళ్ళి ఇచ్చేదాన్ని.. పచ్చివడియాల మాటటుంచితే ఎండిన వడియాలు పంపాలన్నా కూడా కొరియర్ ఛార్జెస్ చూస్తుంటే ఆకాశాన్నంటుతున్నాయి. అసలు సరుకులకన్న రవాణాఛార్జీలు ఎక్కువైపోయేయి. మా సుమకి వడియాలు పంపించే అవకాశం లేదని విచారిస్తున్న నాకు ఒక్కసారి నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేయి.

మా చదువులకోసం మా నాన్నగారు పల్లెటూరు వదిలి పట్నంలో కాపరం పెట్టేరు. మా నాన్నమ్మగారు మాత్రం ఊరు వదిలి రానన్నారు. ఊళ్ళో పొద్దున్న ఆరింటికి బస్సెక్కితే ఎనిమిదింటికల్లా పట్నం చేరేది మొదటి బస్సు. పచ్చళ్ళు, చిరుతిళ్ళు, తోటలో పళ్ళూలాంటివన్నీ ఆ బస్సు కండక్టరుకి ఇచ్చేసేవారు మా నాన్నమ్మగారు. అతని పేరు వీరన్న అన్నట్టు గుర్తు.. బస్టాండు పక్కవీధిలో మొదటి ఇంట్లోనే మేవుండేవాళ్లం. అలా మా నాన్నమ్మ పంపించినవి పొద్దున్నే ఎనిమిదింటికల్లా మా ఇంటికి చేరేసేవా డతను. మా అమ్మ అతనికి ఫలహారం పెట్టి, కాఫీ ఇచ్చేది. ఆ కాస్తకే ఎంత సంబరపడిపోయేవాడో.. మేమెలా ఉన్నామో మళ్ళీ ఊరెళ్ళి మా నాన్నమ్మకి చెప్పేవాడు. అలా అతను మాకూ, మా నాన్నమ్మకీ మధ్యవర్తిత్వం చెయ్యడం వల్ల మామధ్య ఎగుమతి దిగుమతులకి ఏ సమస్యా ఉండేది కాదు.

ఆ విషయం గుర్తు రాగానే ఇంత మంచి విషయం ఎవరితోనైనా పంచుకోవాలనిపించింది. వెంటనే వదినకి ఫోన్ చేసి ఈ సంగతి చెప్పగానే వదిన కూడా తన పాత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది.

“నిజవే స్వర్ణా… ఆ రోజులలాంటివి. ఊళ్ళల్లో అయితే అందరూ మనవాళ్ళే. ఇంక పట్నాల్లో అయితే చుట్టాలూ, స్నేహితులూ కూడా మనింట్లోవాళ్ళలాగే ఉండేవారు. నీకో విషయం తెల్సా…

నాకు పెళ్ళయి హైద్రాబాదులో సెటిలయ్యేక ఇలా ఏవైనా పచ్చళ్ళు, చిరుతిళ్ళు మాకు పంపాలంటే మా అమ్మగారు వాటిని పేక్ చేసి మా నాన్నగారి కిచ్చేవారు. ఆయన గౌతమీ ఎక్స్‌ప్రెస్ బయల్దేరే టైమ్‌కి స్టేషన్‌కి వెడితే చుట్టాలో, స్నేహితులో ఎవరో ఒకరు తెలిసినవాళ్ళు కనపడేవారు. వారి చేతికి ఆ పేకట్ ఇచ్చి, మాకు ఫోన్ చేసి చెపితే, మేము ఆ ట్రెయిన్ వచ్చే టైమ్‌కి స్టేషన్‌కి వెళ్ళి వాళ్ళ దగ్గర్నుంచి తెచ్చుకునేవాళ్లం.” అంది.

“ఏవిటో వదినా… అప్పటి ఆప్యాయతలూ అవీ ఇప్పుడెక్కడా కనపట్టల్లేదు. ఇలా మా వాళ్ళకి ఏదైనా పట్టుకెళ్ళండని చెప్పడానిక్కూడా మొహమాట పడిపోతున్నామేంటో!” అంటూ ఫోన్ లోనే వాపోయేను.

“మొన్న మా ఫ్రెండ్ చెపుతోంది స్వర్ణా.. విని ఆశ్చర్యమేసిందనుకో.. వాళ్లమ్మాయి బెంగుళూర్లో ఉంటుంది. ఇలా లడ్డూలూ, కాజాలూ, కారా ఇక్కడ చేసేసి, చక్కగా ప్లాస్టిక్ కవర్లలో పాక్ చేసి, అట్టపెట్టెలో సర్దేసి వాటిని తీసికెళ్ళి బెంగుళూరు వెళ్ళే ట్రెయిన్‌లో ఒక రిజర్వుడ్ కంపార్ట్‌మెంట్‌లో ఏదో బర్త్ కింద పెట్టేసి, ఆ కంపార్ట్‌మెంట్ నంబరూ, బర్త్ నంబరూ కూతురికి ఫోన్ చేసి చెపుతుందిట. కూతురు ఆ ట్రెయిన్ వచ్చే టైమ్‌కి స్టేషన్‌కి వెళ్ళి ఆ పెట్టె తెచ్చుకుంటుందిట. భలే అవిడియా కదూ.. కానీ ఖర్చు లేకుండా సరుకులు పంపించేసుకోవచ్చు..” అంది వదిన.

ఆ మాటలకి నేను ఆశ్చర్యపోయేను..

“అదేంటి వదినా.. అలా అట్టపెట్టె వదిలేస్తారా… ఎవరైనా తీసుకుపోతే.. “

“నీమొహం.. ఎవరు తీసికెడతారూ.. అందులో అందరూ మనలాంటివాళ్ళే కదా ఉంటారూ.. మనం ఇంకోళ్ళ సామాను తెచ్చుకుంటామా.. తెచ్చుకోం కదా.. అదీకాక.. అలా తెలీనివన్నీ తీసుకుంటే అందులో ఏ బాంబ్ ఉందోననే భయం కూడా వచ్చింది కదా ఈ మధ్య… అందుకే ఎవ్వరూ ముట్టుకోకుండానే ఆ అట్టపెట్టె కావల్సినవాళ్లకి చేరుతుందన్న మాట..”

“ఇదేదో భలే ఉంది కదా!” అన్నాను సంబరంగా ఒక కొత్త సంగతి తెలిసిందన్న సంబరంతో.

“అయినా మనలో కూడా అప్పటి అభిమానాలూ, ఆప్యాయతలూ పూర్తిగా పోలేదు స్వర్ణా.. ఇంకా మనలాంటివాళ్ళం ఉన్నాం. నీకు మా వదిన అక్క తెల్సు కదా! వాళ్ళు విజయవాడలో ఉంటారు. వాళ్ళబ్బాయి రాజమండ్రీలోనూ, వాళ్ళమ్మాయి వైజాగ్ లోనూ ఉంటారు. వాళ్ళాయనకి తెలిసున్నవాళ్ళు డొమెస్టిక్ ఎయిర్‌వేస్‌లో పనిచేస్తున్నారుట. అందుకని మా వదినావాళ్ల అక్క ఇలా ఏవైనా పిల్లలకి పంపాలనుకుంటే పొద్దున్నే వాటిని ఎయిర్‌పోర్ట్‌కి పంపేస్తుందిట. ఆయన వైజాగ్ వెళ్ళే ఫ్లెయిట్ పైలట్‌కి అవిచ్చేస్తే ఆ పైలట్ వాటిని రాజమండ్రిలో కొడుక్కీ, వైజాగ్‌లో వాళ్లల్లుడికి అందిచ్చేస్తాడుట.. భలే ఉంది కదూ!” అంది మా వదిన నవ్వుతూ..

“నిజవే వదినా.. దీనివల్ల తెలుస్తున్నదేంటంటే ఆంధ్ర రాష్ట్రం చాలా చాలా అభివృధ్ధి చెందిందని..”

దానికి మా వదిన “ఆంధ్రాలో లాగా ఈ తెలంగాణాలో కూడా జిల్లాకో ఎయిర్‌పోర్ట్ వచ్చేస్తే బాగుంటుంది కదూ!..” అంది..

“అప్పుడు నేను పక్క జిల్లాకి మారిపోతాను. నువ్వు పొద్దున్నే పచ్చళ్ళు, పిండివంటలూ చేసి పంపుతూండు..” అన్నాను నవ్వుతూ.

నేనన్న మాటలకి వదిన గట్టిగా నవ్వేస్తూ,” అంతకన్నానా!” అంది.

Exit mobile version