[dropcap]గ[/dropcap]ణపతి, చలపతి ఇద్దరూ మంచి మిత్రులు. గణపతికి భక్తి ఎక్కువ పూజలు చేయడం దేవాలయాలు సందర్శించడం చేస్తుంటాడు. చలపతికి కూడా భక్తి ఉంది కానీ మూఢ భక్తి మటుకు లేదు.
గణపతి, చలపతి ఇద్దరూ కలసి కాశీకి, కాశీ పక్కనే ఉన్న బుద్ధ గయకు వెళ్లి అక్కడి శివ లింగాన్ని, బోధి వృక్షాన్ని మొదలైన విశేషాల్ని చూచి రావాలను కొన్నారు.
అలా వారు అన్నీ సమకూర్చుకుని కాశీకి ప్రయాణించి గంగానది, ఇరుకు సందు వ్యాపారాలు చూసి ఆశ్చర్య పోయారు.
కాశీ విశ్వనాథుడి దర్శనం తరువాత బుద్ధ గయకు వెళ్లారు. అక్కడి విశేషాలు చూశారు. దానినే ‘బోధ గయ’ అంటారని తెలుసుకున్నారు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షాన్ని కూడా చూశారు.
అక్కడ ఒక ఆచారం ఉంది. మనకి ఇష్టమైన కాయనో పండునో మంత్రోఛ్ఛారణతో వదలి వెయ్యాలట. దాని వలన ఎంతో పుణ్యం వస్తుందనే నమ్మకం.
ఆ నమ్మకాన్ని నమ్మిన గణపతి తనకిష్టమైన మామిడి పండును గయలో వదలి వేశాడు. అంటే తాను ఇక మామిడి పండును తినడన్నమాట.
అయితే చలపతి మటుకు ఏ పండును కాయను వదలక ఈ అచారాన్ని గురించి లోతుగా ఆలోచించాడు. ఇష్టమైన పండో కాయలో వదిలేసిన ఏమవుతుంది? కేవలం వదలి వేసిన వ్యక్తికి కొంత మేలు జరగవచ్చునేమో, ఎట్టి పరిస్థితుల్లో అవి తినక పోవడం వలన జిహ్వ చాపల్యం చంపుకుని నిగ్రహ శక్తి పెరగవచ్చునేమో అంతేగాని ఆ ఆచారం వలన తన చుట్టూ ఉన్న వారికి ఏ లాభం లేక పోవచ్చు. అందుకే చలపతి ఒక నిర్ణయానికి వచ్చాడు. తనకున్న కొద్ది పాటి కోప గుణాన్ని వదలివేయాలని అందుకే ధృఢ నిశ్చయంతో పండ్లు కాయలు బదులు కోపాన్ని వదలి వేశాడు.
చలపతి చేసిన పనికి గణపతి ఆశ్చర్య పోయాడు.
“ఆచారం ప్రకారం నీకిష్టమైన కాయగూరలు పండ్లు వదలక కోపాన్ని వదలి వేశావేమిటి?” అని అడిగాడు గణపతి.
“కాయలు, పండ్లు వదలి వేస్తే వాటివలన మనకు లభించే ఆరోగ్యపర లాభాలు లభించక పోవచ్చు. దాని వలన ఎవరికీ ఉపయోగం లేదు, కానీ మనలో ఉన్న దుర్గుణాలు వదలి వేస్తే మనకి మన కుటుంబానికి, సంఘానికి కూడా మేలు జరుగుతుంది. ఆలోచించు నీకు తెలుసు కదా నాకు చిన్న విషయానికి కూడా కోపం వస్తుంటుంది. దాని వలన నా కుటుంబంలో వారు కూడా ఇబ్బంది పడుతుంటారు. కోపం ఉంటే బయటి వారికి నేను కోపిష్టిగా కనబడి నా మొహంలో ప్రశాంతత పోతుంది. అందుకే కోపాన్ని వదలి వేశాను. ఒకవేళ కోపం వస్తే వెంటనే మూడు మార్లు ‘గయ గయ గయ’ అనుకుంటాను. దానితో కోపం పోతుంది” అని చెప్పాడు.
“సరే నీ ఆలోచన నీది. మన యాత్ర ఇంతటితో ముగిసింది. మన ఊరికి వెళదాం. వెళ్లేముందు ఇక్కడి గుర్తుగా ఏదైనా కొనుక్కుందాం” అని చెప్పాడు గణపతి.
ఆ విధంగా చెరొక కంచు బొమ్మ కొనుక్కున్నారు.
నిజానికి చలపతి కోపాన్ని నియంత్రించుకుంటాడా లేదా? అనిపించి గణపతి చలపతిని పరీక్షించాలనుకొన్నాడు.
అలా కొద్ది దూరం వెళ్లాక, చలపతి చేతిలోని బొమ్మను లాక్కుని పక్కనే ఉన్న చెట్ల మధ్యకు విసరి వేశాడు గణపతి.
గణపతి చేసిన పనికి చలపతికి కోపం ముంచుకొచ్చింది. అతని మొహం ఎర్రబడింది. వెంటనే కోపం వదలి వేసిన సంగతి గుర్తుకొచ్చి చలపతి మనసులోనే మూడు మార్లు “గయ గయ గయ” అనుకుని గణపతితో సౌమ్యంగా ఇలా అన్నాడు.
“గణపతీ మన యాత్రకు గుర్తుగా కొనుక్కొన్న బొమ్మను అలా పారవేశావేమిటి? అది ఒక కళాకారుడు చేసింది. నీవెందుకు ఈ పని చేశావో నాకు తెలియదు. పద చెట్లలో వెతికి బొమ్మ తీసుకుందాం”అని మెల్లగా చెప్పాడు.
చలపతి కోపాన్ని ప్రదర్శించకుండా అలా చక్కగా మాట్లాడినందుకు గణపతి ఆశ్చర్యపోయి అతనికి తాను బొమ్మ ఎందుకు పారవేసింది వివరించాడు.
అప్పటి నుండి ఏ విషయంలోనూ చలపతి కోపంగా ప్రవర్తించకపోవడం వలన అతని కుటుంబంలో శాంతి నెలకొంది. అతని స్నేహితులు కూడా ఎంతో సంతోషించారు.