[2024 సెప్టెంబర్ 07 వినాయక చవితి పర్వదినం సందర్భంగా – ‘ఇద్దరు వినాయకులు’ అనే శీర్షికతో ‘వినాయక చవితి’, ‘శ్రీ వినాయక విజయం’ అనే సినిమాల గురించి వివరిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు, దుర్గాదేవి వంటి వారి మీద చాలా సినిమాలు ఉన్నాయి గానీ, వినాయకుడి మీద వచ్చిన సినిమాలు తెలుగులో రెండే! అవి వినాయక చవితి (1957), శ్రీ వినాయక విజయం (1979). ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగరోజు టి.వి. చానెల్స్ లో ఈ రెండు సినిమాలనే ప్రదర్శిస్తూ ఉంటారు. వాటి విశేషాలు చూద్దాం.
వినాయక చవితి:
కవి, రచయిత సముద్రాల రాఘవాచార్య గారికి దర్శకత్వం చేయాలన్న ముచ్చటకి ప్రతిరూపం వినాయక చవితి చిత్రం. దీనికి కథ ఆయనే తయారుచేసుకుని పాటలు కూడా రాశారు. పార్వతీదేవి స్నానానికి వెళ్ళబోతూ నలుగు పిండితో బాలుడిని చేసి, వాకిట నిలబెట్టటం, ఆ విషయం తెలియక శివుడి ఆ బాలుడి శిరసు ఖండించటం, తర్వాత ఏనుగు తల అతికించటం, చంద్రుడి ముఖం చూస్తే నీలాపనిందలు కలగటానికి కారణమైన సంఘటన, సత్రాజిత్తు సూర్యోపాసన చేసి శ్యమంతకమణిని సాధించటం, శ్రీకృష్ణుడికి నీలాపనిందలు కలగటం, జాంబవంతుడితో యుద్ధం, జాంబవతీ కళ్యాణం, సత్యభామా పరిణయం మొదలైన ఘట్టాలతో కథ నడుస్తుంది. ప్రధానమైన సంఘటనలు అన్నీ మొదటి గంటలోనే ముగుస్తాయి. శ్యమంతకోపాఖ్యానం మాత్రం చాలా వివరంగా రెండు గంటల పాటు చూపించారు. శ్రీకృష్ణలీలలు ఘట్టాలు కూడా వస్తాయి.
ఈ చిత్రంలో శ్రీకృష్ణుడిగా యన్.టి.రామారావు, సత్యభామగా జమున, రుక్మిణిగా కృష్ణకుమారి, సత్రాజిత్తుగా గుమ్మడి, ప్రసేనుడిగా రాజనాల, శతధన్వుడిగా రాజనాల, శివుడుగా జి.యన్. స్వామి, పార్వతిగా సూర్యకళ, జాంబవతిగా సత్యాదేవి, నారదుడిగా ప్రకాశరావు, వినాయకుడిగా బొడ్డపాటి మొదలైన వారు నటించారు.
యన్.టి.ఆర్.కి శ్రీకృష్ణుడిగా ఇది రెండవ చిత్రం. అంతకు ముందు ‘మాయాబజార్’ మొదటిసారిగా నటించారు. ఆ సినిమా అఖండ విజయం సాధించటంతో రెండవ చిత్రం ‘వినాయక చవితి’లో కూడా అదే పాత్ర ఇచ్చారు. రెండు చిత్రాలూ ఒకే సంవత్సరం (1957) లో విడుదల అయ్యాయి. అక్కడ నుంచీ ఆయనకు శ్రీకృష్ణ పాత్రలో అసమానమైన పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. తన కెరీర్ లో మొత్తం 18 సార్లు వివిధ చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా నటించారు యన్.టి.ఆర్.
జమున మూడు చిత్రాల్లో సత్యభామగా నటించారు. వినాయక చవితిలో కన్య సత్యభామగా, ‘శ్రీకృష్ణ తులాభారం’ (1966) లో వివాహితయైన సత్యభామగా యన్.టి.ఆర్.,తో పోటాపోటీగా నటించారు. తర్వాత మళ్ళీ ‘శ్రీకృష్ణ విజయం’ (1970) చిత్రంలో మూడోసారి సత్యభామగా నటించారు. అందులో ప్రధానపాత్ర కాకపోయినా బాగానే పేరు వచ్చింది. సత్యభామ అంటే జమునే అన్నంతగా ఆయా చిత్రాల్లో ఒదిగిపోయారు.
కృష్ణకుమారి మొహంలో ప్రశాంతత ఉట్టిపడుతూ ఉంటుంది. కనుకనే శాంతమూర్తి అయిన రుక్మిణి పాత్ర ఆమెను వరించింది. ‘దీపావళి’ (1960) లో కూడా రెండోసారి రుక్మిణిగా నటించారు. రుక్మిణి పాత్రలో ఇతర నటీమణులు నటించినా ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు కృష్ణకుమారి.
సత్రాజిత్తుగా నటించిన గుమ్మడి చాలా అందంగా కనిపిస్తారు. ఏ హీరోకి తీసిపోని చక్కటి ముఖ వర్చస్సు, నటనా సామర్థ్యం, స్పష్టమైన వాచికం అన్నీ ఉన్నా సహాయ పాత్రల్లోనే నటించవలసిన ప్రజ్ఞావంతుడు గుమ్మడి వెంకటేశ్వర రావు. అయన ఎక్కువ చిత్రాల్లో నటించినవి తండ్రి పాత్రలే!
వినాయక చవితి చిత్రంలో ప్రధాన పాత్ర అయిన వినాయకుడుగా బొడ్డపాటి నటించాడు. ఈయన పూర్తిపేరు బొడ్డపాటి కృష్ణారావు. హాస్యనటుడిగా చాల సినిమాల్లో నటించాడు. గుండమ్మ కథ సినిమాలో పెళ్ళిళ్ళ పేరయ్యగా కథ మొదట్లోనే కనిపిస్తాడు. వినాయకుడి మాస్క్ తగిలించినా కంఠస్వరం, కదలికలు హాస్యనటుడిని గుర్తుకు తెస్తూనే ఉన్నాయి. అయినా కథలో లీనమైపోయిన ప్రేక్షకులు అవన్నీ పట్టించుకోలేదు.
‘వినాయకచవితి’ చిత్రంలో పాటలు పద్యాలు చాలా మధురంగా ఉంటాయి. ‘శుక్లాంబర ధరం, విష్ణుం..’, సూర్యస్తుతిని తెలియజేసే ‘ప్రాతఃకాలే భవేత్ బ్రహ్మ..’, ‘అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే..’ వంటి సంప్రదాయ శ్లోకాలను యథాతథంగా వాడుకున్నారు. శుక్లాంబర ధరం శ్లోకం తర్వాత వచ్చే ‘వాతాపి గణపతిం భజే..’ కీర్తన చాలాసార్లు మనం విని ఉంటాం గానీ అది రచించింది ఎవరో తెలిసినవారు తక్కువమంది ఉండి ఉంటారు. అది ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన. ఇంకా సముద్రాల వారు రచించిన ‘దినకరా శుభకరా, దేవా దీనాధారా తిమిర సంహారా..’, ‘హరే నారాయణ త్రిభువన పాలన సనాతనా..’, ‘నిను నెరనమ్మితిరా తాండవ కృష్ణా..’, ‘శైలసుతా హృదయేశ సాంబశివా..’, ‘కలికి నే క్రిష్ణుడనే పలుకవేమే భామా నాతో..’ మొదలైన పాటలన్నీ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇవన్నీ ఘంటసాల, సుశీల, లీల, రాణి, జమునారాణి, మాధవపెద్ది, యం.యస్.రామారావు తదితరులు గానం చేశారు. సంగీత దర్శకత్వం కూడా ఘంటసాలే చేశారు. వినాయకచవితి చిత్రం శతదినోత్సవం జరుపుకుంది.
శ్రీ వినాయక విజయం:
ఈ చిత్రంలో వినాయకుడు హస్తిముఖుడు అవటానికి కారణమైన వృత్తాంతం, గజాసురుడు ఈశ్వరుని ఉదరంలోనే బంధించటం, విష్ణువు అతడిని విడిపించటం, వినాయకుడికి గణాధిపత్యం అప్పగించటం, కుమార సంభవం, మూషికాసురుడితో యుద్ధం ఇత్యాది ఘట్టాలతో కథ నడుస్తుంది.
ఈ చిత్రం నాటికి పౌరాణిక చిత్రాల సంఖ్య బాగా తగ్గిపోయింది. అడపాదడపా మాత్రమే వస్తున్నాయి. సాంఘిక చిత్రాల సంఖ్య వెల్లువలా వస్తున్నాయి. ప్రధాన పాత్రధారి అయిన కృష్ణంరాజు అంతక్రితం ‘భక్త కన్నప్ప’గా నటించారు. ఆ తర్వాత ఒకటీ రెండు పౌరాణిక పాత్రల్లోనే నటించారు. ఆయన ఎక్కువగా నటించినవి సాంఘిక చిత్రాలే! వాణిశ్రీ కూడా సత్యభామ, ద్రౌపది, లక్ష్మీదేవి, సతీసావిత్రి వంటి పౌరాణిక పాత్రలు ఇతర చిత్రాల్లో పోషించినా ఆమెకు ఎక్కువగా పేరు తెచ్చిపెట్టినవి సాంఘిక చిత్రాలే! ఆమె పోషించిన పొగరు, వగరు, ఆత్మాభిమానం, కాస్తంత అహంకారం కలగలిసిన ఐశ్వర్యవంతురాలు, ఆధునిక యువతి పాత్రలు అన్నీ ప్రజాదరణ పొందాయి. తన అభినయం ద్వారా హీరోయిన్ కి ఒక స్టైల్ తెచ్చిపెట్టిన నటి వాణిశ్రీ.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీవేంకటేశ్వరుడు మొదలైన పాత్రలు పోషించిన రామకృష్ణ యన్.టి.ఆర్., తర్వాత పౌరాణిక హీరోగా పేరుపొందారు. ‘లవకుశ’ (1963)లో లవుడి పాత్ర ద్వారా పరిచయం అయిన నాగరాజు తర్వాత కాలంలో నారదుడు, లక్ష్మణుడు, సహదేవుడు వంటి పాత్రలు పోషించినా ఆ స్థాయిలో పేరు రాలేదు.
రావణుడు, యముడు, దుర్యోధనుడు వంటి ప్రతినాయకుల పాత్రలు పోషించిన సత్యనారాయణ యస్.వి.రంగారావు వారసుడిగా పేరుపొందారు. ప్రతినాయకుల, రాక్షస పాత్రలకు కావలసిన స్థూలకాయం, వికటాట్టహాసంతో ఆకట్టుకున్నారు. యస్.వి.ఆర్., తర్వాత ప్రతినాయకుల పాత్రలకు పెద్దదిక్కు అయ్యారు సత్యనారాయణ. బాలవినాయకుడిగా నటించిన బేబీ లక్ష్మీసుధ అంతక్రితం ‘రాధాకృష్ణ’ (1978) చిత్రంలో చిన్నప్పటి జయప్రదగా ముద్దు ముద్దు మాటలతో అలరించింది. రాకుమార్తె వైశాలిగా నటించిన దీప లో అభినయం కంటే అందం ఆకట్టుకుంది ప్రేక్షకులను.
పౌరాణిక బ్రహ్మగా పేరుపొందిన కమలాకర కామేశ్వరరావు కెరీర్ చివరి రోజుల్లో దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీ వినాయక విజయం’. అలాగే పాతచిత్రాల సంగీత దర్శకుడు యస్. రాజేశ్వరరావు కూడా కెరీర్ చివరలో సంగీత నిర్వహణ వహించిన చిత్రం ఇది. అప్పటి చిత్రాల్లో పాపులర్ గాయనీ గాయకులైన సుశీల, జానకి, వాణీ జయరాం, మాధవపెద్ది, రామకృష్ణ, బాలు, వసంత, శైలజ, రమేష్ మొదలైన వారందరూ పాటలు పాడారు.
‘శ్రీ వినాయక విజయం’ అఖండ ప్రఖ్యాతి పొందకపోయినా సక్సెస్ పుల్ మూవీగా పేరు పొందింది.