Site icon Sanchika

ఇదే బతుకు

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘ఇదే బతుకు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]చె[/dropcap]ట్టునెడబాసి రాలినవి పూలు
అయినా జీవిస్తున్నాయి వృక్షాత్మై
చెరగని చిరునవ్వుల సిగలో పూలై

చెమట చెలిమి కరువై ఎండిన బీళ్ళు
చూడు అటు ఎలా పచ్చబడ్డవో
బడి నేర్పిన వొడి ఊపిరి అక్షరమై

పగిలిన గొంతులు దూరం మాటకు
అయినా నిశ్శబ్దాన్ని తొలుస్తున్నయి
ప్రశ్నించే గొంతుక కనుచూపులై
ఏరువాక గుండెల ప్రతిధ్వనించే శక్తులై

గెలువని మనసు విలవిల
అయినా చిగురెత్తింది ఆ సాధనలో
ఆశల ఆత్మీయ నేల కిలకిలలు

పేగుబంధం బలైన పుట్టుకే యుద్దం
అయినా బతికింది కేకల మనిషై
అడుగుల సాగే అఘాధమౌ జలధి

ఎవరికి తెలియదు మిత్రమా!
మాటల మూటలైన పాదముద్రలన్నీ
చిట్టచివరకూ, మట్టి గర్భంలోకేనని..

ఈ మట్టే బతుకుతుంది సదా!
ఊరుగా ఏరుగా అస్తిత్వశ్వాసగా

తుదిలేని ఆటలో ఫలితం అస్థిరం
ఆడుడు ఒకటే
బతుకులో నిరంతర జీవక్రియ

Exit mobile version