Site icon Sanchika

ఇదే… ఇదే… మా సంస్కృతి!!!

[dropcap]బా[/dropcap]ర్లా తెరచిన కిటికీలోంచి లేడిని గురిచూసి కొట్టిన బాణంలాంటి కిరణాలు నేరుగా కనురెప్పలపై పొడిచేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది కవిత.

ఒక్కసారిగా వెలుగు భరించలేక కళ్ళకు, రెండు డజన్ల గాజుల ఖాళీల్లోంచి కనిపిస్తున్న రంగోలి నిండుగా పెట్టుకున్న ముంజేతిని కళ్ళుకడ్డుపెట్టుకుంది. నెమ్మదిగా ముంజేతిని కొద్దికొద్దిగా కళ్ళ మీదనుంచి పైకి జరుపుకుంటూ ఆ వెలుతురుకు కళ్ళను అలవాటు చేసి, ‘కరాగ్రే వసతీ లక్ష్మీ…’ శ్లోకాన్ని పఠించుకుని రెండు చేతులు కళ్ళకద్దుకుంది. తన పుట్టింట్లో అయితే మేడ మీద తన గదిలోంచి బయటకు వచ్చి ఎదురుగా తూర్పున ఉదయిస్తున్న ప్రత్యక్ష నారాయణుడి నమస్కారం చేసుకునేది.

నాలుగు రోజులక్రితం కాపురానికి అత్తవారింటికి వచ్చేసింది తానని, కోపం వచ్చిందో ఏమిటో నేరుగా ఈవేళ గదిలోకే వచ్చేశాడు సూరీడు.

తన ఆలోచనకు తానే నవ్వుకుంది కవిత. మంచంమీద నుంచే సూర్యభగవానుడికి నమస్కరించుకుని బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది.

ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. రాత్రి భర్త మరీ రెచ్చిపోయాడు. అయితేనేం? చదువుకున్నవాడు కనుక తన అభిప్రాయాలకు, భావాలకు విలువనిస్తూ తనను గెలుచుకున్నాడు. భార్యకు అంతకన్న కావలసింది ఏముంది?

గదిలో ఎవరూ లేకపోయినా సిగ్గు బరువుతో ఆమె తల వాలిపోయింది.

అంతలో వేసి ఉన్న గది తలుపుల అవతల మాటలు వినిపించాయి.

”ఏందిరా? నీ పెండ్లాము ఇంకా నిద్ర లేవలేదా?”

”లేచినా దవ్వ! అయిదింటికే! కొత్త ప్రదేశం కదా! సీకట్లు సరిగా తెల్వదని నేనే పండబెట్టా!” అనిల్ అంటున్నాడు.

అప్పుడు వెంటనే తలెత్తి టైం చూసింది. టైం ఉదయం ఏడూ పది నిముషాలు. గబగబా మంచం దిగి బట్టలు సర్దుకుని, చెదిరిన జుట్టును సరిచేసుకుంది. అంతలో తలుపులు తోసుకుని అనిల్ లోపలకు వచ్చి తలుపు నొక్కేశాడు.

అయినా తలుపుల ఆవల అవ్వ “పెండ్లయి నాల్గుదినాలు కాలేదు. పెండ్లాన్ని కొంగట్టు తిరుగుతుండాడు. పిదపకాలం. మారోజుల్లో మొగడంటే గడగడలాడేటోళ్ళం” అనేసి వెళ్ళిపోయినట్టు అలికిడి.

అనిల్ ఆ మాటలకు కవిత కేసి చూశాడు.

“తప్పు నాదా!” అడిగింది కవిత.

ఆమెను అమాంతం చుట్టేసుకుని “కాదు! మన యిద్దరిదీ! అమ్మ కూడా అడిగింది. అమ్మ పూజ కూడా అయిపోనాది. ‘రేపట్నుంచి నేనే పూజ చేస్తాను – ఉదయమే లేచి’ అని సెప్పు” అన్నాడు కౌగిలి బిగిస్తూ.

“నువ్వొదిలేస్తే వెళ్ళి చెబుతాను” అంది కవిత అతని బుగ్గ మీద చిటికేసి.

“కాఫీతో పాటు నా బహుమతి కూడా నాకివ్వాలి!” అన్నాడు తను చిలిపిగా.

“అలాగే! అని అతన్ని సున్నితంగా విడిపించుకుని గదిలోంచి వెళ్ళిపోయింది కవిత.

***

నేరుగా ఫ్రెష్ అయి కిచెన్‍లోకి వచ్చింది కవిత.

అత్తగారు కాఫీ కలుపుతూనే, టిఫిన్ చేయడం కోసం బాణిలి రెండు పొయ్యి ఎక్కించింది. అలికిడి విని “వచ్చినావా! కాఫీ పట్టుకెళ్ళి నీ మావకిచ్చిరా! తొందరగా! యిట్టున్నట్టు రావాలే!” అంటూ కాఫీ గ్లాసు కోడలికి అందించింది.

“మావ ఎక్కడున్నారు?” అడిగింది కవిత.

“ఈది అరుగుమీద పేపరు సదువుతుండాడు. ఎల్లు. బేగిరావాలె!” తొందరచేసింది అత్త భద్రకాళి.

రెండు నిమిషాలలో మావగారికి కాఫీయిచ్చి తిరిగి వచ్చింది కవిత.

అప్పటికే ఉప్మా తాలింపు వేసి, నీళ్ళుపోసి, ఉప్పువేసి మూతపెట్టింది భద్రకాళి.

“యిదిగో! నీ పెనిమిటికి కూడా కాఫీ యిచ్చి రా! యిడ నువ్వూ నేను తాగుదాం! మన ఇండ్ల పనోళ్ళు ఉండరు. మన పనులు మనమే సేసుకోవాల! మగోడు రాజులా బయటకెల్లి సంపాదించుకొస్తాడు. ఆళ్ళు అలసిపోయొచ్చేసరికి మనం అన్నీ అమర్చి, మనం గూడ రెడీగుండాల! అట్టుండకపోతే ఆడుబయటకెల్లి ఎవత్తినో తగులుకుంటడు. మన బతుకు మొదలు కోసిన బీరపాదైపోద్ది. అర్థమైందా?” విడమర్చి విద్యార్థికి బోధిస్తున్న ఉపాధ్యాయినిలా చెప్పింది భద్రకాళి.

“అర్థమైందత్తా!” అని కాఫీ తీసుకుని భర్త ఉన్న గది తలుపు కొట్టింది కవిత!

కాఫీతో పాటు దాన్ని అందించిన చేతిని కూడా లోపలకు లాక్కోబోయాడు అనిల్.

“రాత్రికి! అన్నీ! అత్త ఉన్నపాటున వేగిరం రమ్మంది అనిల్!” అని కిచెన్ వైపు పరుగెత్తింది కవిత.

***

విజయవాడ మార్కెట్ యార్డ్‌లో చేపలు, రొయ్యల దిగుమతి వ్యాపార కాంట్రాక్టర్ శంకర్ యాదవ్ ఒక్కగానొక్క కూతురు కవిత. ఎం.బి.ఎ చేసింది. తల్లి జయప్రద ఆ రోజుల్లోనే ఎం.ఎ చదివింది. “ఉద్యోగం చేస్తానండి!” అని శంకర్‍ని కోరింది.

శంకర్ ఆమెను ‘అవసరమా!’ అని ప్రశ్నించాడు.

“ఎంతోమంది ఆడవాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అదో సరదా ముచ్చట. నేనూ చేస్తానండీ!” అంది గారంగా.

అప్పటికే తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఆయన గతించిన వెంటనే వ్యాపారం అంది పుచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడు అన్న పేరు తెచ్చుకున్న శంకర్ కోటీశ్వరుడు. వ్యాపారంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా చిరునవ్వు పెదవుల మీద చెదరనీయకుండా తన చిన్నతనంలో తనకు, తన తోబుట్టువులకు కడుపునిండా అన్నంపెట్టి, రెండురోజులకోసారి భోజనం చేసి తమకు జీవితాన్నిచ్చిన కన్న తల్లిదండ్రులంటే శంకర్ యాదవ్‍కు అవ్యాజ్యమైన భక్తి.

ఆ రోజుల్లోనే అర్ధాకలి పస్తులతో ఏళ్ళకాలం గడిపిన తల్లికి టి.బి సోకి వైద్యం చేయించలేని నిస్సహాయస్థితిలో ఆమెను పోగొట్టుకున్ననాడు తన తండ్రి ఎంతగా…. ఎంతగా విలపించాడో తనకు తెలుసు.

కూలివాడిగా చేరి, యజమాని నమ్మకం సంపాదించి మార్కెట్ యార్డులో అందరితోనూ తలలో నాలుకగా మసలి యజమాని అండదండలతో చిన్న కాంట్రాక్టరుగా ప్రవేశించి కోటీశ్వరుని స్థాయికి ఎదిగిన తండ్రి అనితర సాధ్య జీవితం శంకర్‍యాదవ్‍కు నిత్యభగవద్గీత.

తండ్రి చనిపోతూ “నాన్నా! ఓర్పు, సహనం, చిరునవ్వు, ధైర్యం ఈ నాలుగు ఎప్పుడు కోల్పోకు. అదే నీకు దుర్గమ్మ తల్లి భిక్ష- రక్ష!” అన్నమాటలు అతని పాలిట నాలుగు వేదాలు.

అందుకే ఉద్యోగం చేస్తానన్న భార్యను రాత్రివేళ పడకగదిలో అనునయిస్తూ ”జయా! అవసరం, కొత్త విషయాన్ని ఆవిష్కరించడానికి తల్లివంటిది అన్నారు పెద్దలు. నువు చేద్దామనుకున్న ఉద్యోగం ఒక వ్యక్తికి జీవనోపాధి అవుతుంది. దానివల్ల ఆ కుటుంబ సభ్యులు సుఖంగా బ్రతుకుతారు. స్త్రీకి విద్య చాలా అవసరం. అయితే అవసరం లేకపోయినా డబ్బున్న ఎందరో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి సంపాదిస్తూనే ఉన్నారు. స్త్రీ అన్నా, అమ్మ అనిపించుకున్న ప్రతి ఆడదానిపైన పూజ్యభావం గల సభ్యసమాజం మనది. అటువంటి ఉద్యోగంలో ఉన్నతస్థానంలోకి పోతోంది కూడా. లంచాలు తీసుకుని డబ్బు, నగలు, ఆస్తులు కూడబెట్టుకుని దొరికినప్పుడు మీడియా ద్వారా స్త్రీ పట్ల సమాజంతో గౌరవభావం తగ్గిపోయేలా, నిజాయితీ ఉద్యోగం చేసుకునే స్త్రీమూర్తులు సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు.

నీకు సేవ చేయాలనే దృక్పధమే ఉండాలిగాని మార్గాలు అనేకం. ఒక అనాథ శరణాలయాన్ని దత్తత తీసుకో. ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయి. నీ సహాయం అందించు. వందల చేతులు నిన్ను చల్లగా దీవిస్తాయి. అందుకు అవసరమైన డబ్బు అంతా నీవు వాడుకో.

మరో విషయం ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సృష్టిలో చెరో అర్ధభాగం. పదిమంది పిల్లల్ని కనడం కన్న ఒక్క అమ్మాయినో అబ్బాయినో కని నీ ప్రేమ, దృష్టి వారిపై కేంద్రీకరించి ప్రయోజకులయ్యే విధంగా పెంచు. నీకు అన్ని విషయాలలోనూ నా సంపూర్ణ సహకారం ఉంటుంది. ఏమంటావ్?” అన్నాడు.

జయప్రద అతని మాటలకు పులకించిపోయింది. తన మనసు చదివినట్టుగా భర్త అన్నమాటలకు ఆ క్షణం నుంచి అచ్చమైన ‘అర్థాంగి’గా మారిపోయింది. ఏడాదికే కవిత పుట్టింది. తన భర్త తనకు నేర్పినవన్నీ కవితకు ఉగ్గుపాలతో నేర్పింది.

పాఠశాలలో కవిత మంచిపిల్లగా పేరు తెచ్చుకుంది. పట్టణంలో ఏ ‘సహాయ’ కార్యక్రమాలు జరిగినా సెలవు రోజుల్లో తనతోపాటు కూతుర్ని తీసుకెళ్ళేది జయప్రద.

“ఎందుకమ్మా మనం వాళ్ళకి సహాయం చేయాలి?” ఒకసారి కవిత అడిగింది తల్లిని. అప్పటికి తను ఐదవ తరగతి చదువుతోంది.

“మనం బ్రతుకుతూ ఎదుటివారిని బ్రతికించడమే మానవత్వం. మహాత్మ గాంధీతోపాటు ఎందరో అమరవీరులు తమ దేశభక్తిని చాటుకుంటూ స్వాతంత్ర పోరాటం చేశారు. ఈ దేశం మనకేమిస్తుంది అని వాళ్ళు ఆలోచించలేదు. అలాగే ఈ దేశం మనకేమిచ్చింది అని మనమే మనం ప్రశ్నించుకుంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి జీవి స్వేచ్చగా పుట్టిపెరిగే స్వాతంత్రం యిచ్చింది. అప్పుడు మనం ఈ దేశానికి ఏమివ్వాలి? మన దేశ పతాకం ప్రపంచంలో అగ్రస్థానంలో రెపరెపలాడుతూ ఎగిరే అంతటి కీర్తిని ఇవ్వాలి. అటువంటి కృషి మీలాంటి భారతపౌరులు చేయాలి. అంత చేసే శక్తి లేనప్పుడు సాటి మనిషిగా సహాయం కావలసిన ప్రతీవ్యక్తికి మనకున్నంతలో మన శక్తిమేర చేయాలి! అర్థమైందా?” అంది జయప్రద.

ఒదులుగా పిల్ల పావురం తల్లి రెక్కల్లో ఒదిగినట్టుగా తల్లి ఒడిలో ఒదిగిపోయి ఆమె బుగ్గమీద పువ్వును చుంబించినంత మెత్తగా ముద్దుపెట్టి “నువ్వెంత మంచిదానివమ్మా!” అని ముడుచుకుపోయింది కవిత.

అప్పటి నుంచి కవిత చదువులో వెనుదిగిరి చూసుకోలేదు. చదువులో, డిబెట్స్‌లో, కల్చరల్ ఆక్టివిటిస్‍లో, స్పోర్ట్స్ అండ్ గేమ్‍లో చురుకుగా పాల్గోనేది. స్నేహితులెవరైనా అడిగితే “నాకు బహుమతి ముఖ్యం కాదే! పాల్గోవడం ముఖ్యం. అలా పాల్గోకపోతే ఆ ‘విజ్ఞానాన్ని’ కోల్పోతాను నేను” అనేది. తనవరకు ఆ కార్యక్రమంలో న్యాయం చేశానా లేదా! అని మాత్రమే ఆలోచించేది. ఆ ఆలోచనే ఆమెకు ‘విజయం’ సాధించిపెట్టేది.

కవిత సాధించిన బహుమతుల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేసింది జయప్రద. ఇంటర్ , డిగ్రీ తర్వాత ఎం.బి.ఎ చేసింది కవిత. చదువుకున్నంత కాలం ప్రతిరోజు ‘గాడ్స్ గిఫ్ట్ టెంపుల్’ అని తల్లి చేత నామకరణం చేయబడిన ఆ గదిలోకి వెళ్ళి బహుమతులకు నమస్కరించుకుని వెళ్ళేది కవిత.

ఎం.బి.ఎ పూర్తి చేసిన కవితను అడిగాడు శంకర్ యాదవ్. “ఏమ్మా! మంచి చదువు చదువుకున్నావ్! ఉద్యోగం చేయవా?” అని నవ్వుతూ.

“నాకు పరీక్ష పెడుతున్నారా నాన్నా! హాయిగా పెళ్ళి చేసుకుని అత్తామామలకి, భర్తకి సేవ చేసుకునే ఉద్యోగం చాలు. అయితే ఒక్క షరతు” అంది కవిత తండ్రితో.

“ఏమిటమ్మా అది?”

“నేను పుట్టిపెరిగింది విజయవాడలో. యిపుడు తెలంగాణా, ఆంధ్రా విడిపోయాయి కదా! నాకు తెలంగాణాలో అదీ ఒక పల్లెటూరు సంబంధం చూడండి. అతను చదువుకుని, రెండెకరాల పొలం ఉన్న పేదవాడైనా చాలు”

విస్తుపోయాడు శంకర్ యాదవ్ కవిత కోరిక విని.

“ఎందుకమ్మా! అలా! నీకేం తక్కువ? కోటీశ్వరుడి కూతురువి. రాజాలంటి సంబంధం తెచ్చి పెళ్ళి చేస్తాను”

“నేను ఏం మాట్లాడినా గుడ్డును పిల్ల వెక్కిరించినట్టు ఉంటుంది నాన్నా! అయినా నా భావాన్ని మీ ముందు ఉంచనివ్వండి. నా ఆలోచనలు తప్పయితే చెప్పండి. సరిదిద్దుకుంటాను. ఏమ్మా! తప్పుగా మాట్లాడానా?” జయప్రదను అడిగింది కవిత.

“నేను ఈవేళ ఇంత ఆనందంగా ఉన్నానంటే మీ నాన్నగారే కారణం. మా యిద్దరి ఆలోచనలు కలబోసుకుని పెరిగినదానివి. హాయిగా మనసు విప్పి చెప్పు ఆయనకి” ప్రోత్సహించింది కవితని.

“కష్టం తరువాత వచ్చే సుఖం, చెమట చుక్క చిందించాక వచ్చే నిద్ర, మనం నాటిన మొక్క పుష్పించిన క్షణం, అది పండుగా మారి దాన్ని మనం ఆస్వాదించే క్షణం… యివన్నీ జీవితంలో అద్భుతమైనవి నాన్నా! యివన్నీ మీ పెంపకంలో నేను అనుభవించాను. చక్కని ఫలితాలు పొందగలిగాను. జీవితంలో నాలుగు అరలు అనుకుంటే, బాల్యం, కౌమార్యం నాకు సంతృప్తిగానే గడిచాయి. యిక యవ్వనం, వృద్ధాప్యం. వీటిని కూడా సంతృప్తిగా గడపాలంటే అవసరాలు తీర్చేటంత డబ్బు చాలు. అమ్మ ఏ లక్ష్యంతో ఉద్యోగం మానివేసిందో, నేనూ అ లక్ష్యంతోనే ఉద్యోగం చేయను.

విద్య విజ్ఞతను పెంచేదిగా ఉండాలి. విజ్ఞానాన్నిపంచేదిగా ఉండాలి. నేను చదువుకుని నేర్పిన విద్యను అలా వినియోగించుకునే అవకాశం నాకిమ్మని కోరుతున్నాను. నెట్‍లో వెతుకుతారో, పంతులుగారికి చెబుతారో మీ యిష్టం. యిందాక నేను చెప్పినట్టు కనీసం డిగ్రీ చదివి, రెండెకరాల పొలం ఉన్నవాడు చాలు. నా లక్ష్యం అతని ద్వారా సిద్దింపచేసుకుంటాను. నా కోరిక తీరుస్తారా నాన్నా!” అడిగింది బేలగా కవిత.

“యువత అంతా పాశ్చాత్య సంస్కృతిని దిగుమతి చేసుకుంటూ, దానికి బానిసలై ప్రవర్తిస్తున్న ఈ అత్యంత వేగవంత సమాజంలో ఉన్నతమైన చదువు చదివి కూడా నా కూతురుగా ఆలోచిస్తున్న నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మా. తప్పకుండా నీ కోరిక ఎంత కష్టమైనా తీరుస్తానమ్మా! తీరుస్తాను బంగారూ!” అంటూ కుమార్తె తలను గుండెలకు గాఢంగా హత్తుకున్నాడు శంకర్ యాదవ్ పితృప్రేమతో!

కేవలం మూడునెలలలో తన మిత్రుల ద్వారా అన్నివిధాలా పరిశీలించి పరిశోధించి గంగదేవిపల్లి గ్రామానికి చెందిన మోతుబరిరైతు రాజేందర్ యాదవ్ ఏకైక కుమారుడు అనిల్‍యాదవ్ సంబంధాన్ని కుదుర్చుకున్నాడు కవితకు.

అనిల్ అగ్రికల్చరల్ ఎం.ఎస్.సి చదివాడు. ఆరడుగుల స్ఫురద్రూపి. ఆధునిక భావాలున్న వాడిలా కనిపించినా పెద్దలంటే గౌరవం, సనాతన సాంప్రదాయాలను పాటించే చక్కటి వ్యక్తిత్వం గలవాడని తెలిసి సంతోషించాడు.

పెళ్ళిచూపులలో ఒకరికొకరు మొదటిచూపులోనే ఇష్టపడటంతో కాబోయే వధూవరులు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఒకరి మనోభావాలను ఒకరు పంచుకున్నారు.

తన స్థాయికి తగ్గట్టుగా పెళ్ళిచేసి అత్తవారింటికి పంపించాడు శంకర్‍యాదవ్. పదహారు రోజుల పండుగ వెళ్ళాక ఒక మంచి ఏకాదశి శుభ ముహూర్తాన అత్తవారింట్లోకి అడుగుపెట్టింది కవిత.

వచ్చిన మొదటిరోజునే భద్రాచల రాముణ్ణి దర్శించుకున్నారు నూతన దంపతులిద్దరూ. రెండోరోజు యాదగిరి గుట్ట. ఆయా దేవుళ్ళను దర్శించుకుంటున్నప్పుడు ఆ ప్రాంతపు చారిత్రక విశేషాలు, స్థలపురాణం వివరాలను వివరంగా సేకరిస్తున్న కవితను “ఎందుకోయ్ అవి!” అని అడిగాడు.

“ఇది మన తెలంగాణ సంస్కృతీ, పూర్వచరిత్ర అని నా పిల్లలకు, తెలియనివాళ్ళకు చెప్పడం కోసం” అంది కవిత.

తండ్రి డ్రైవర్‍తో సహా కారును అనిల్‍కు బహుమతిగా ఇవ్వడంతో కేవలం మూడునెలలు తెలంగాణాలోని అన్ని ప్రదేశాలు ‘గూగుల్’లో వెదికి పట్టుకుని మరీ దర్శించి వచ్చింది కవిత, అనిల్ జంట.

మొదట పండుగకు రమ్మని ఆహ్వానించాడు శంకర్‍యాదవ్ స్వయంగా వచ్చి.

“నాన్న! ఆంధ్రాలో అన్ని పండుగలు నాకు తెలుసు. వాటి విశిష్టత, పూర్వవైభవం అన్నీ కూడా! యిక్కడి పండుగలు కూడా తెలుసుకోవాలి కదా నాన్న! మేము రాము. ఏమీ అనుకోకండి!” అంది.

ఆమె మాటలకు శంకర్ యాదవ్ నొచ్చుకున్నాడు.

“మీరన్నా చెప్పండి బావగారూ! నువ్వన్నా చెప్పవయ్యా” అభ్యర్థించాడు వియ్యంకుడిని, అనిల్‍ని.

“అవునమ్మా! యిక ప్రతి ఏడాదీ యిక్కడే పండుగలు జరుపుకుంటావు. మొదటిపండుగకే రాలేదా అని మీ నాన్నని ఎవరైన అడిగితే ఏం బావుంటుంది చెప్పు?” అన్నాడు రాజేందర్.

”సారీ నాన్న! నేను అంతదూరం ఆలోచించలేదు. నన్ను క్షమించండి” అంది తప్పుచేసిన దానిలా.

వియ్యాల వారందరినీ సంక్రాంతి పండుగ మూడురోజులు తమ మర్యాదలతో ఉప్పొంగిపోయేలా చేశాడు.

పండుగ అనంతరం ఇంటికి చేరాక భద్రకాళికి బాగా చేరువ అయింది కవిత. అవ్వకైతే కవిత ఒక దేవతే!

’అత్తయ్యా! ఈ పాటు ఏ పండుగ వచ్చినా అంటే బతుకమ్మా అయినా, బోనాల పండగైనా, ఆటికి సరిపడ్డ పూలన్నీ పెరట్లో పూయిస్తనత్తా! తులసమ్మను దాటినాక ఆ రెండో పెరడంతా చెత్తాచెదారంతో పిచ్చిమొక్కలు పెరిగి సిరగ్గా ఉన్నాదత్తా. యీ యిల్లు మీ పుట్టింటోరు పెళ్ళఫ్ఫుడు పసుపు కుంకుమల కింద యిచ్చినారని అనిల్ సెప్పిండు. అనిల్ నడిగితే నిన్ను అడిగి ఒప్పుకోలు తీసుకోమన్నడు. సెప్పండత్తా! పేచీ సెయ్యను?”

“అమ్మా కయితమ్మా! నువు మాయింటి మాలచ్చిమివి. అదాటులో నేను ఓ మాట ఇసిరినా ఏమనుకోమాక. నా యింట బతుకమ్మను పూయిస్తనంటే నేనెట్టా వద్దంటా? యింటి పనంత నేను చూసుకుంట గదా!” అంది భద్రకాళి.

వంగుని అత్తగారి పాదాలకు నమస్కరించింది కవిత. అక్కడే ఉన్న అవ్వ బోసినవ్వు నవ్వుతూ “ఎంత అదురుష్టమే కోడలా నీకు. ఏం యినయం. ఏం గౌరం. మన పిల్లదాన్ల ఒక్కరికాడ సూడం యిట్టాంటి పేమ” అని.

అవ్వకు కూడా నమస్కరించి చెంగున తమ అంతఃపురంలోకి వచ్చింది కవిత. అనిల్ మంచం మీద్ పడుకుని వీక్లీ చదువుకుంటున్నాడు.

“అనూ! మన రెండో పెరట్లో పూలమొక్కలు నాటడానికి అత్త, అవ్వ ఒప్పుకున్నారు. యిక మనం అనుకున్న ప్లాన్ ప్రారంభించడమే ఆలస్యం!” అంది అతని గుండెలమీద రోమాలను మెలిపెడుతూ.

“అద్సరే! అమ్మ, అవ్వలకాడ మా బాస, నాతోను, అత్త, మావల్తోను మీ బాస.. ఏంటి సంగతి?”… అడిగాడు అనిల్ ఆమెను గుండెలకు హత్తుకుని.

“ఆళ్ళకి అట్టా మటాడితేనే అర్దమవుద్ది. నీకు ఎట్టా మాట్లాడినా అర్థమవుతుంది. అదే సంగతి. అది సరేగానీ నీకు ప్రేమలేఖ రాసినా! చదువుతావా!” అతని గుండెల మీదనుంచి పక్కకు జరుగుతూ అంది కవిత.

“ఊ!” అన్నాడు అమాయకంగా ముఖంపెట్టి.

“అయితే తీసుకో!” అంటూ రెండో దిండుకింద దాచిన ఉత్తరం అతనికి అందించింది. ముందు మామూలుగా, తర్వాత శ్రద్ధగా, మరీ తర్వాత అత్యంత శ్రద్ధగా మూడోసారి చదవసాగాడు. అందులో-

“బ్రహశ్రీ వేదమూర్తులైన నాన్నగార్కి,

మీ కుమార్తె ‘కవితానిల్’ హృదయపూర్వక నమస్కారాలు.

మీ అల్లుడు తండ్రి కాబోతున్నాడు. అంటే మీరు, మావయ్య తాతయ్యలు కాబోతున్నారు. ఈ శుభవార్త మీకు అత్యంత సంతోషాన్నిస్తుందని నాకు తెలుసు.

ముఖ్యంగా నేను చెప్పదలచిన నాలుగుముక్కలు స్పష్టంగా చెప్పేస్తాను. నా ఉత్తరం సాంతం చదివాక మీ అభిప్రాయం చెప్పండి.

ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండుగా విడిపోయినందుకు ముందు బాధపడినా, ప్రాంతాల అభివృద్ది కొరకు అది అత్యావశ్యకం అని తెలిశాక ఎంతో ఆనందించాను.

అందుకే కోరి నేను తెలంగాణ అబ్బాయిని చేసుకున్నాను. రేపు నాకు కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా యీ గడ్డమీదనే కంటాను. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ఆంధ్ర సంబంధాలు చేస్తాను. ఒకవేళ ప్రేమిస్తే ఆంధ్రావారి పిల్లలనే ప్రేమించి వివాహం చేసుకోమని చెబుతాను.

ఎందుకంటే నా పుట్టింటి చరిత్రతో పాటు, నా అత్తింటి చరిత్ర సంస్కృతీ సంప్రదాయాలు పిల్లలు తెలుసుకోవాలి. తరతరాల వారసత్వ సంపదని, సంరక్షించుకుంటూ సనాతన ధర్మాలను ఆచరిస్తూ పెరగాలి.

యిది నేటి తరాల నుండి భావితరాలకు ప్రవహించే సంస్కృతి నాన్నా! ఆ ప్రవాహం యిటు నుంచి అటు, అటు నుంచి యిటూ నిరంతరంగా ప్రవహిస్తూ యిరువైపులా న్యాయం జరగాలి. ‘ఇదే ఇదే మా సంస్కృతి. ఇదే ఇదే మా ప్రగతి’ అని రెండు రాష్ట్రాల తెలుగువారు దేశదేశాల నినదించాలి నాన్నా! అదే నా కోరిక.

యిదంత పిచ్చితనమో, ఆనాటి పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు. కాని నేను బీజం వేయదలచుకున్నాను. యిదే ఆలోచన మరొకరికి రాకూడదని ఏముంది?

ఈ దేశం నాకేమిచ్చింది అని నేనే నాడూ ప్రశ్నించుకోను. నా దేశానికి నేను ‘ఇది’ ఇవ్వదలుచుకున్నాను. మనమందరం చదువుకున్నవాళ్ళం విజ్ఞానవంతులం. ఆలోచించండి. నా నిర్ణయం తప్పయితే సరిదిద్దుకుంటాను.

నమస్కారాలతో

మీ కుమార్తె

‘కవితానిల్’”

అనిల్ ఉత్తరాన్ని విసిరేసి కవితను గాఢంగా గుండెలలో దాచుకుని అత్మతృప్తితో కళ్ళు మూసుకున్నాడు.­

Exit mobile version