ఇదేదో బాగుంది!!

13
2

[శ్రీ నంద్యాల గౌతమ్ రచించిన ‘ఇదేదో బాగుంది!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కృ[/dropcap]ష్ణయ్యా! అయ్యయ్యో!!! ఏంటిది?

ఒక వైపు నాతో మాట్లాడుతున్నావు, మరో వైపు నన్ను ఎవరో తోసేస్తున్నారు. ఎందుకు, అకస్మాత్తుగా నేను ఆడుకునే ఈ తాడు చేతికి దొరకటం లేదు, ఈ వెచ్చదనం తగ్గుతోంది, ఈ మెత్తటి హాయినిచ్చే ఈ ఇల్లు జారుతోందా? నేనెక్కడికో జారిపోతున్నానా? నా కాళ్ళకి, చేతులకి స్థలం చాలడం లేదు, ఏమైపోతోంది నాకు? బహుశా కాళ్ళతో జరపాలేమో? ప్రయత్నిస్తాను.

అయ్యో!! తలకి చల్లగా తగులుతోంది, నేనేం చేయాలి కృష్ణా?  ఇదేనా నువ్వు చెప్పిన భూమ్మీద పుట్టడం? ఈ ఇల్లు ఇరుకుగా, బాధగా ఉంది, చాలా నొప్పేస్తోంది. ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. ఈ వెలుతురేంటి, ఈ చప్పుళ్ళు ఏంటి? కోపంగా వస్తోంది. భూమి మీద పుట్టడం అంటే ఇదేనా? నీతో మాట్లాడను పో!!! అయినా ఈ వింత జీవులెవరు? ఇదేమీ బాలేదు!! ఈ పుట్టుక బాలేదు!!

అయ్యో అయ్యో!! నీకేం పోయేకాలం వచ్చిందే తెల్ల బట్టలమ్మా? నా పిర్రల మీద ఎందుకు కొట్టావు? ఏడుపొచ్చేస్తోంది. వీళ్ళకు అర్థం కావటం లేదా ఏంటి? అరే. ఒకవైపు ఇలా నేను ఏడుస్తుంటే వీళ్లంతా సంతోష పడుతున్నారా? ఈ తాడు నా కడుపు నింపేది, నాతో ఆడుకునేది, దీన్ని అలా తెంపేసారా?..

హమ్మయ్య!! ఈ చలి కొంచెం తగ్గింది. ఏదో బట్ట చుట్టారు నాకు. అందుకేనేమో? ఈవిడ ఎవరో తెలిసినట్టుగా ఉందే? నేను ఆడుకునే ఈ తాడుతో ఈమె కూడా ఆడుకుంటూ ఉండేదేమో!

ఆమె చేతులు మెత్తగా, వెచ్చగా ఉన్నాయ్. ఆమె గుండెలకు హత్తుకుంటే  నా భయం తగ్గింది. కృష్ణయ్య చెప్పిన ఆవిడ ఈమేనా? తన బదులు ఈమెతో ఆడుకోమని చెప్పినట్టు గుర్తుకొస్తోంది. మా ఇంట్లో ఎంత వెచ్చగా ఉండేదో ఈవిడ ఎత్తుకుంటే అలాగే ఉంది. ‘నీకేం భయం లేదు, నాతో ఉండు’ అని చెప్పాను. కానీ కొత్త కదా, భాష అర్థం కాలేదనుకుంటా. అయినా ముద్దులు పెట్టింది. “అరే ఇదేదో బానే ఉందే” అనుకుని నిద్ర పోయాను. నిద్ర లేచాను, ఆకలేసింది, ఆవిడ నన్ను ఎత్తుకుని పాలిచ్చింది. కడుపు నిండా తాగాను. ఇది ఒక కొత్త రకం హాయి!

నా భాష సరిగ్గా రాదేమో, నేను మాట్లాడితే చాలు వెంటనే పాలు ఇచ్చేస్తుంది ఈవిడ. వచ్చీరాని భాషలో ఏవేవో పాటలు పాడుతోంది. నాకు ముచ్చటేస్తోంది ఈవిడని చూస్తే. ఈమె నచ్చింది. ఈ గొంతు ఖచ్చితంగా ముందు విన్న గొంతే. సందేహం లేదు. ఎక్కడి నుంచి వినిపిస్తోందా.. అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. కానీ అంత పెద్ద ఆకారం ఆ చిన్ని ఇంట్లో ఎట్లా ఉండేదబ్బా అనుకున్నాను. ఈమెకి పేరేమి పెట్టాలి అని ఆలోచిస్తూ పడుకున్నాను.

కొద్దిగా మెలకువ వచ్చింది. ఈయన ఎవరు? ఆవిడ కంటే భారీగా ఉన్నాడు. నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు, ఇప్పుడు ఏడవాలా నవ్వాలా? కొద్ది సేపు చూస్తా. ఈ గొంతు కూడా విన్నట్టుగానే ఉంది. బలంగా ఉన్నాడు. నాకు కొద్దిగా నిశ్చింతగా ఉంది, నేను పడుకున్నప్పుడు ఆవిడకి ఇతను తోడుంటాడులే అనుకున్నా. ఇంతలో నా కడుపు బరువనిపించింది. ఖాళీ చేశాను. అందరూ నవ్వారు. నాకు కూడా బట్టలు మార్చారు. అతనికి కోపమా? నవ్వా? ముద్దు పెట్టుకున్నాడు. ఈయనకు కూడా కడుపు ఖాళీ అయిందేమో! ఇంతలో వేరే రంగు బట్టలు వేసుకున్నాడు. ఇదేదో బాగుంది. మళ్ళీ నిద్ర వచ్చింది.

ఇలానే కొన్ని రోజులు గడిచాయి.

“మా నాయనే.. మా బంగారే.. దిష్టి తీయాలి!” అనే మాటలు వినపడటంతో లేచాను. ఇంకో ఆవిడ కొంచం తెల్ల జుట్టు ఉంది. నన్ను ఎత్తుకుని ముద్దు చేసింది. ఈవిడ చేతులు కూడా మెత్తగా ఉన్నాయి. నచ్చింది. నా కాళ్ళు చేతులు అంతా నూనెతో రుద్ది, ఆడుకుంది. బాగానే ఉంది అనుకున్నాను. కానీ ఇంతలో నా మీద వేడి నీళ్ళు పోసింది. మీకు తెలుసుగా.. నాకు నచ్చని పని ఎవరైనా చేస్తే నేనేం చేస్తానో? అదే చేసాను. మళ్ళీ పాలు.. నిద్ర, ముద్దులు. ఇలా రోజు రోజు ఎన్నో వింతలు విశేషాలు.

రోజులు గడిచినా వీళ్ళకు నా భాష రావటం లేదు. ఇంక నా వల్ల కాదు వీళ్ళకి నేర్పించటం!!! నేనే వీళ్ళ భాష నేర్చుకోవాలి అనుకున్నా. ఆవిడకు ‘అమ్మ’ అని పేరు పెట్టా. ఆమెకి ఈ పేరు నచ్చినట్లుంది. మురిసిపోయింది. ఆ తెల్ల జుట్టు ఆవిడని కూడా ఆమె అమ్మా అనే పిలిచింది. చాలా బొమ్మలిచ్చారు అందరు. చిన్న వాళ్ళు పెద్ద వాళ్లందరు నన్ను అడిగి అడిగి పేరు పెట్టించుకున్నారు. అమ్మ, అత్తా, తాత, అవ్వ, నాన్న, అన్న, అక్క అని. నా భాషకు వీళ్ళు ‘ఏడుపు’ అని ఒక పేరు పెట్టారు.

ఒకసారి కృష్ణయ్యతో  చెప్పాను. ప్రతి క్షణం ఏదో ఒకటి కొత్తగా ఉంది. నేర్చుకోవటం ఆనందంగా ఉంది అని. నాకేమి కావాలన్నా సరే, కాళ్ళు చేతులు ఊపుతాను, ఎవరు దగ్గర లేకపోతే ఒకసారి నా భాషలో మాట్లాడతా. అంతే, నా సేవకు అందరూ వస్తారు అన్నాను. కృష్ణయ్య నవ్వాడు. నన్ను మర్చిపోవు కదా? అని అడిగాడు. కొద్దిగా కోపం వచ్చి. అమ్మతో చెప్తా అన్నాను.

ఇలా అన్ని భోగాలు అనుభవించాను. కొత్త కొత్త పదాలు నేర్చుకున్నాను. కొన్ని రోజులకు నేను మొదటి సారిగా అడుగు వేసాను. నాలో ఏదో తెలియని ఆనందం. మా అమ్మ నాన్నల ముఖాలలో సంతోషానికి అవధులు లేవు. ఎన్ని సార్లు కింద పడినా, నాకు నొప్పి కంటే సంతోషం వేసేది. ఆ సంతోషం ముందు ఎంత నొప్పి ఉన్నా ఇబ్బంది అనిపించలేదు.

ఇదేదో చాలా బాగుంది!

ఆ చిన్ని అడుగులు నడకలై, ఆ నడకలు పరుగులైనాయి. వాళ్ళ భాష నేర్పించారు. ఇంతకు ముందులా నేను కాళ్లు చేతులు ఆడిస్తే ఎవరు పట్టించుకోలేదు. ఈ భాష వల్లనే ఏమో. ఇప్పుడు నేను ఒక కథ రాయాలి అనుకున్నాను. నా భాష, నా అనుభవాలు, నా భావాలు, నా చుట్టూ ఉన్న వీళ్ళందరికీ అర్థం అయ్యేలా రాయగలనా.. అని సందేహం. కానీ నేను పుట్టినప్పుడు కూడా ఇదే సందేహం కదా?

నేను పుట్టినప్పుడు ఈ లోకంలో వీళ్లందరూ నన్ను ఆదరించారు. ఇప్పుడు కూడా ఈ కొత్త రచనాలోకంలో పుట్టినట్టే కదా! వీరందరూ కూడా నన్ను తప్పకుండా ఆదరిస్తారు, పెంచుతారు. “నీకేం కాదు. మళ్ళీ ప్రయత్నించు” అనే ధైర్యాన్ని ఇస్తారు. అమ్మ చెప్పింది కదా? కొత్త ప్రపంచంలో అడుగు పెట్టేటప్పుడు, కింద పడతానేమో అన్న భయం ఉంటుంది. పడినా ఈ మెత్తటి మనసులు నాకు సహకరిస్తాయి. ఎన్నిసార్లైనా పడొచ్చు, ‘నీకేం కాదు’ అనే ధైర్యాన్ని ఇస్తాయి. కానీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న కుతూహలంతో ముందుకు అడుగు వేస్తే ఇదేదో బాగుందే.. అని తప్పకుండా అనిపిస్తుంది.

నిజమే! ధైర్యంగా రాస్తూ ఉండగానే మనసుకు అనిపిస్తోంది. ‘ఇదేదో బాగుంది!’..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here