ఇది సినిమా కాదు

0
1

[dropcap]“నా[/dropcap]గూ! ముత్యం లాంటి నా అన్నయ్య ముద్దుల కూతురు బతుకు అన్యాయమైపోయింది రా!”

సర్విపిండికి కొబ్బరి చట్నీ అద్దుకుని టిఫిన్ తినేసి ఆఫీసుకు తయరవుతూంటే అమ్మ గొంతులో అగమాగం వినిపించింది.

“అదెట్లమ్మా! నెలక్రితమే గదా రంజని బారసాలకు వెళ్ళొచ్చాం. అంతా బాగానే ఉన్నారు. ఇప్పుడేమన్యాయం జరిగిందటా?”

ఎప్పుడైనా కీడెంచి మేలెంచడం అమ్మకలవాటు.

“నాగరాజూ! రంజని భర్త బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఆఫీసర్ గదా!” బంగళా మెట్లు దిగి నాన్న హాల్లో అడుగుపెట్టాడు.

“రంజని అదృష్టవంతురాలు నాన్న! భర్త దేశరక్షణ యజ్ఞములో చురుగ్గా పాల్గొంటున్నాడు. జాంపండు లాంటి బాబు పుట్టిండు. ఇప్పుడు వరంగల్లులోనే ఉంది గదా!” బూట్లు వేసుకుంటున్నాను.

“రంజని వరంగల్లులోనే ఉంది గాని భర్త దేశ సరిహద్దుల్లో, మంచుకొండల్లో వున్నాడు గదా! పాపం శ్రీకాంత్! రక్తం పంచుకుని పుట్టిన కొడుకు బారసాలగ్గూడ రాకపాయె!”

“రాకపోతే ఏమైంది నాన్నా! వీలు చూసుకుని లీవులో వస్తాడు. రంజనిని, గారాల కొడుకును తీసుకెళ్తాడు.”

“శ్రీకాంత్ రావడం కాదురా. ఈ రోజు అతని శవం వరంగల్ కొస్తుందటా” అమ్మ పొత్తికడుపులో పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పోయిందేమో! కళ్ళు మంచుపూలైనాయి. “మా అన్నయ్య కున్నదే ఒక్కగానొక్క సంతానం రంజని.”

కరంటుషాక్ కొట్టినట్టైంది. శ్రీకాంత్ శవమైనాడా! బంగళా మెట్లు జారిపడి కిందికి దొర్లుతున్నట్టైంది. నుదురుపీట ముడేసుకుంది.

“వరంగల్ నుండి ఫోన్ చేసిండ్రురా! శ్రీకాంత్ బార్డర్లో శత్రుసైనికుల మీద ఎదురు కాల్పులు జరుపుతూ ముందుకెళ్ళి ప్రాణాలిచ్చాడంటరా!” నాన్న విప్పి చెప్పాడు. నా గుండెకాయనెవరో పిసికేసినట్టనిపించింది.

సెల్‍ఫోన్ చేతికొచ్చింది. ఆఫీస్‍కు ఫోన్‍చేసి, పరిస్థితి చెప్పి సెలవుచీటి పంపిస్తున్నానన్నాను. తుఫాను గాలికి కూలిన చెట్టులా సోఫాలో కూలబడ్డాను.

***

రంజని అంటే ఎవరో కాదు. లోకం పోకడ తెలియని నా అనురాగ రంజని. మా అమ్మ తోడబుట్టి కూడి పెరిగిన మా మావయ్య గారాల పట్టి, నా మేన మరదలు. చిన్నప్పుడు బడికి సెలవొచ్చినప్పుడల్లా చలో వరంగల్ అని మనసు గంతులేసేది. ఆలోచన కాస్కారం లేకుండా రెక్కలు కట్టుకుని వరంగల్ కెళ్ళి ఒడిలో వాలేవాన్ని. అలనాటి కాకతీయ కళాకంతుల్ని మరదలు రంజని చేతిలో చెయ్యేసి, వేయి స్తంభాల గుడిలో మజాగా ఆడుకుంటుంటే ఆనందనందన వనములో గంతులేస్తున్నట్టు ఉండేది.

పచ్చిపాలలో సాయ పసుపు రంగరించినట్టున్న దేహఛాయలో రబ్బరు బొమ్మలాగుండేది. రెండు జడల రంజని లేడిపిల్లలా చెంగుచెంగున గంతులేస్తూ… ‘బావా బావా పన్నీరు’… పాడుతూ నన్నో ఆట పట్టించేది. రంజని మా వయసు దోస్తులతో ఆడుకుంటుంటే మరో లోకములో ఉన్నట్టుండేది.

రంజని పుట్టగానే మా అమ్మ “మా నాగరాజుకు పెళ్ళాం పుట్టింది” అని అత్తయ్యను గూడా అవుననిపించిందటా. మా నాన్న, మావయ్య గూడా మురిసిపోయారట.

అమ్మమ్మయితే ఓ సారి నా బుగ్గలు ముద్దాడి “అరేయ్ బడవా! నువ్వీ ఇంటి అల్లుడివిరా. రంజనిని మంచిగా చూసుకోకపోతే మావని గూడా చూడకుండా తోలు వలచి దండెమ్మీద ఆరేస్తా”నని బోసునవ్వులు చిమ్మింది. అమ్మతో సహా అందరూ మనసారా నవ్వుకునారట.

అదేమిటో గాని రంజని కనబడగానే మనసు సముద్రకెరటములా ఎగిరి గంతేసేది. వేయిస్తంభాల గుడిలో మిగతా దోస్తులతో కలిసి కోకో, దాగుడు మూత, చార్‍పత్తా ఇంకేవేవో ఆటలాడుకొనే వాళ్ళం.

చదువులతో పాటు వయసులు గూడా పోటీలుపడి పెరిగినై. ముడుచుకున్న మల్లెమొగ్గలాగున్న మానసికస్థితి యుక్తవయసులో రేకులు విప్పి ఆకర్షణలు పులుముకుంది. వలచి వచ్చిన తేనెటీగకు తనను తాను సమర్పించుకున్న మల్లెపూవులా యుక్తవయసు కొచ్చిన అమ్మాయిగాని, అబ్బాయిగాని మనసుదోచిన వారికే అంకితమైపోయాయని ఆనాడు అర్థం కాలేదు.

ఉరకలేస్తున్న ఉత్సాహముతో ఇంటర్‍లో ఎంటరవగానే పెద్ద చదువుల పోటీల్లో మునిగి వరంగల్ కెళ్ళడానికి పుల్‍స్టాప్ పడిపోయింది. రంజని గూడా మా ఇంటికి రాలేదు. మనో యవనిక మీద అప్పుడప్పుడు రంజని ప్రత్యక్షమైనా నాక్కాబోయే భార్యనే గదా అని గుండె గూటిలో దాచుకునేదాన్ని.

రంజని డిగ్రీ ఫైనల్ పరీక్షలు రాసింది. నేను పి.జి పాసయ్యాను క్రితం సంవత్సరం రాసిన పోటీ పరీక్షల్లో చూపించిన ప్రతిభ అధారంగా నన్నొ పెద్ద ఉద్యోగం వరించింది. రెక్కలొచ్చిన పక్షిలాగ మనసు ఆనందాకాశములో విహరించింది.

నూతన సంవత్సరారంభములో వసంతము వన్నెలు దిద్దుకుంటూంటే ఉగాది పండుగకు అమ్మా- నాన్న వెంట మురుసుకుంటూ వరంగల్ కెళ్ళాను. ప్రకృతి పరవశించి కొత్త అందాలు సంతరించుకున్నట్టు నాలో మొగ్గలుగా ఉగాదికి ఆశలు సహస్రదళాలుగా విచ్చుకున్నై కాని రంజని ముందట్లా గంతులెయ్యడం లేదు. మాట్లాడటం లేదు. పల్లవించిన అందాలు, వయసు పొంగులు, లంగా, ఓణీలో ఒదిగిన కారణంగా కుందనబ్బొమ్మలా కనిపించింది.

ఉగాది నాడు పచ్చడి సేవించి టిఫిన్లు ముగించి అందరం హాల్లో సోఫాలో కూర్చున్నాం. పిచ్చాపాటి సంభాషణలు సాగుతూంటే మావయ్యకేదో సైగ చేసింది అత్తయ్య. మావయ్య చిరునవ్వు పులుముకొని “బావగారూ! మన నాగరాజుకు కోరుకున్న ఉద్యోగం దొరికింది. రంజని డిగ్రీ ఐపోయింది. ఇహ వాళ్ళిద్దర్ని మూడుముళ్ళతో ఒక్కటి చేస్తే మన బాధ్యత తీరుపోతుంది గదా” అసలు విషయం ప్రస్తావించి ఆడపిల్ల తండ్రి అనిపించుకొన్నాడు.

అర్థవంతమైన నాన్న చూపులు అమ్మ మీద వాలినై. కనుసైగలతో సంప్రదింపులు సాగినై. మగపెళ్ళివాళ్ళం గదా! కొంతైన బెట్టు లేకపోతే చులకనైపోతాము.

నాన్న చిరునవ్వులో రవంత గర్వం చొరబడింది. “అప్పుడే తొందరేముంది బావా! ఓ మాంచి రోజు చూసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకొందాం”

నా ఎదపొదలో వసంత కోయిల కుహు కుహు లాడింది. రంజని ముభావంగా ఉంది. కాటుక కళ్ళు తుమ్మెద రెక్కల్లా టపటప లాడినై. విరబూసిన మందారం లాంటి మొహమ్మీద చిరునవ్వు చినుకుల జాడలేదు.

నేతిగారెలు, పోలెలు, పంచభక్ష్య పరమాన్నంతో భోజనాలు ముగించాము. అందరూ భుక్తాయాసం తీర్చుకునేందుకు గదుల్లోకి వెళ్ళారు. రంజని హాల్లోనే ఉంది. దొండపండు పెదాల మీద మబ్బులమాటు సూర్యకిరణంలా జీవంలేని చిరునవ్వు మెరిసింది.

“బావా! వేయిస్తంభాల గుడికెల్దామా?” తానే అడిగింది. నాలోని ఉత్సాహం ఉరకలేసింది. వెయ్యిస్తంభాల గుడి వాళ్ళింటికి దగ్గరే. కన్న కలల్ని సాకారం చెయ్యబోతున్న పుత్తడిబొమ్మ చేతిలో చెయ్యేసి నడుస్తూంటే…. అదో థ్రిల్లింగ్.

గుడి ప్రాంగణము ఆహ్లాదకరంగా ఉంది. స్తంభాల మీది సౌందర్య శిల్పాలు రారమ్మంటున్నాయి. మంటపం మీద స్తంభాల కోవికి ఎదురెదురుగా కూర్చున్నాం. మా పక్కనున్న శిల్పకళా వైభవాన్ని సందర్శకులు తమ కెమెరాల్లో, సెల్‍ఫోన్లలో బంధిస్తున్నారు. కొద్దిసేపు మాకిద్దరికీ మాట రాలేదు. మౌనం చోటు చేసుకుంది.

దోరవయసు యువతికి బిడియం కూడా అందమే. “మన పెళ్ళిగురించి నాలాగే నువ్వు కూడా అవ్వల్‌దర్జా కలలు కంటున్నావు గదూ!” నేనే చొరవ తీసుకున్నాను.

“కలలు గూడా కడలి కెరటాల్లాగా శాశ్వతం కాదు గదా బావా!” సిగ్గుల మొగ్గలతో పులకించిపోతాదనుకున్న బుగ్గలు గాంభీర్యాన్ని సంతరించుకున్నై.

“కలలు శాశ్వతం గావు గానీ కల్యాణం శాశ్వతం. పెళ్ళంటే ఎన్నో జన్మల బంధం”

వోణీ సర్దుకుని కళ్ళల్లోకి సూటిగా చూసింది. పొడుగాటి నల్లని జడ గుండెలమీద వంకర్లు తిరిగింది. “నేనో విషయం చెప్తాను నువ్వేమి అనుకోవు గదా బావా!” మంద్ర స్వరం.

“మన మధ్య అనుకోవడాలెందుకుంటై?” బుగ్గ గిల్లాలని చెయ్యి చాచాను. చలాకిగా తన చెయ్యి అడ్డుపెట్టి వారించింది.

“మా ఇంటి ముందు శ్రీకాంత్ ఇల్లుంది. శ్రీకాంత్ చలాకీ యువకుడు. డిగ్రీ పాసయ్యాక మిల్ట్రీ ఆఫీసర్‍గా ఎంపికైండు. ప్రస్తుతం ట్రయినింగ్‍లో వున్నాడు. దేశంకోసం సర్వస్వం త్యాగం చేసేందుకు ముందుకొచ్చిన దేశభక్తుడు” బుగ్గలమీద సన్నని సిగ్గులు కనకాంబరం మొగ్గల్లాగున్నె.

“వెరీగుడ్. దేహం కన్న దేశం మిన్న అనుకున్న అదృష్టవంతుడు”

“నేనూ శ్రీకాంత్ గాఢంగా ప్రేమించుకున్నాం. మానసికంగా ఏకమైపోయినం. నన్ను తన గుండె గూటిలో చిలకగా భావిస్తున్నాడు. అతని ట్రయినింగ్ ముగింపు దశకొచ్చింది. కొద్దిరోజుల్లో వచ్చేస్తాడు. పెద్దలను ఒప్పించి పెళ్ళిచేసుకోవాలనుకున్నాం. శ్రీకాంత్ తన తల్లిదండ్రులను ఒప్పించాడట. అందుకు నీ సాయం కావాలి” చెవుల రింగులు చెట్టుకొమ్మలకు పిట్టగూళ్ళలా ఊగులాడుతున్నై.

చేతిలో ఉన్న మామిడిపండు నోటికందించబోతుంటే జారి బురదలో పడ్డట్టనిపించింది. చిన్నప్పటి ఆశలు, ఆటలు, బాసలు గాలిదుమారంలా కొట్టుకుపోయినై. రంజని మనో రాగాలను నేను జీర్ణించుకోవాలి. బలవంతపెట్టి పెళ్ళాడేస్తే అది బాధల గాధ అవుతుంది.

“సరే… నీ ప్రేమకు నేను అడ్డురాను” మానసరోవరములో మొసలి తిరుగుతున్నట్టనిపించినా బయట పడరానుకున్నాను. “నీ పెళ్ళికి తప్పకుండా వస్తా… సరేనా?”

రంజని ముఖరవిందము వెయ్యిరేకలుగ విచ్చుకుంది. “థాంక్యూ బావా! నీది పెద్ద మనసని తెలుసు”

“సరే…. ఇహ వెళ్దామా” లేవబోయాను. శిల్పసౌందర్యాలను ఎంజాయ్ చేస్తున్న సందర్శకుల సందడి తగ్గలేదు.

”హా ఆగు బావా! ఇంకా మాట్లాడేదుంది” స్తంభానికొరిగింది.

“ఇంకా మాట్లాడేదేముంది రంజని”

“నీ సహాయం కావాలన్నాను గదా!”

“పెళ్ళికొస్తానన్నాను గదా!”

“అంతకంటే ముందు నా ప్రేమ సంగతి మా అమ్మానాన్నలకు చెప్పి, నువ్వే మీ, మా అమ్మా నాన్నలకు చెప్పి ఒప్పించాలి… ప్లీజ్ బావా!”

నా మానసవీణ మీద శివరంజని రాగం పలికించిన రంజని విషాద గీతాలాపనకు శ్రుతిచేస్తోంది. ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. అంతరాళాల్లోని వేదనా తరంగాలు మొహమ్మీద తచ్చాడుతున్నై.

“బాధపడుతున్నావా బావా?” గొంతులో గాంభీర్యం “లోకం పోకడ తెలియని వయసులోని ఊహలు తాడు లేని బొంగరం లాంటివి. అవన్నీ జీవితములో సాకారము కాకపోవచ్చు. నన్ను క్షమించు బావా!” చేతులు జోడించింది.

బాధ నరాన్ని గుండెల్లో అదిమిపెట్టి వాళ్ళమ్మా, నాన్నల్ని, మా అమ్మా నాన్నల్ని ఒప్పించేసరికి తలప్రాణం తోకొచ్చింది.

***

“ఏంరా నాగూ! అట్లా ముంగి లెక్క కూచున్నవేందిరా?” అమ్మ పలకరింపుతో జ్ఞాపకాల వ్యాపకాల్లోంచి బయటికొచ్చాను. “లే…. వరంగల్‍కెళ్దాం…” గుర్తుచేసింది.

“అవునవును దేశం కోసం అసువులర్పించిన వీర జవానుకు నివాళులర్పించాలి గదా!” లేచి తయారైనాను.

వరంగల్ చేరేసరికి మధ్యాహ్నం పన్నెండయింది. ఎండ తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. ఇల్లు శోకసంద్రంలాగుంది. తరంగాలుగ జనాలు వచ్చి పోతున్నారు.

అప్పుడే మిల్ట్రీ వాహనం పరుగెత్తుకొచ్చింది. వెంట వచ్చిన సైనికులు శవాన్ని పదిలంగా ఇంట్లోకి చేర్చారు. శవమ్మీద గుడ్డను తీసి చూసి మళ్ళీ కప్పేశాను. శవం ఒంటినిండా లోదుస్తులు మాత్రమే రక్తసిక్తమై ఉన్నాయి. మొహం నిండా గాయాలు. తల ఎర్రరంగులో ముంచి తీసినట్టుంది. మనిషిని గుర్తుపట్టడం కష్టమే అయింది. ఎదలోని ఆవేదన కరిగి నా కళ్ళల్లో నీరై కదలాడింది. బంధుమిత్రుల ఏడ్పులు, అంగలార్పులు.

మిల్ట్రీ ఆఫీసర్‍కు నన్ను నేను పరిచయం చేసుకుని నమస్కరించాను. “శ్రీకాంత్ ఎట్లా చనిపోయిండు సార్?” సవినయంగా అడిగాను.

“మిస్టర్ నాగరాజూ!” ఆయన తెలుగువాడే. “మతదురహంకారాన్ని నిండా నింపుకున్న శత్రుదేశ సైనికులు దొంగతనంగా దేశసరిహద్దుల్ని దాటి మన ఏరియాలో రావడాన్ని కాపలా డ్యూటిమీదున్న శ్రీకాంత్, మరో జవాను గమనించి కాల్పులు జరిపారు. శత్రుసైనికులు ఐదారుగురు అక్కడికక్కడే చనిపోయారు. ముగ్గురు శత్రుసైనికులు వెనకనుండి వచ్చి శ్రీకాంత్‍ను, మరో మన సైనికుడ్ని లాక్కుపోయారు. వాళ్ళను చిత్రహింసలు పెట్టారట. యూనిఫారాలు గూడా లాక్కున్నారట. మొహాలు గుర్తుబట్టలేనంత చేశారు. శ్రీకాంత్ శవాన్ని మన బార్డర్‍లోకి విసిరేసి పారిపోయారు. ఇంకో సైనికుని జాడ తెలియాల్సి వుంది. ఈ జిల్లా కలెక్టర్‍కు సమచారమిచ్చాము. శ్రీకాంత్… ఏ గ్రేట్ సోల్జర్ అండ్ పేట్రియేట్” అన్నాడు.

పోలీసులు, అధికారులు, ప్రజానాయకులు హాజరై నివాళులర్పించారు. కొద్దిసేపు బాధ, అయోమయంలో మునిగి తేరుకున్నాను.

రంజని దుఃఖప్రవాహములో వుంది. శవం పక్కన కూచుండి గుండెలు బాదుకుంటుంది. రంజని చిన్నారి కొడుకు శ్రీకాంత్ నోట్లోనుంచి ఊడిపడ్డట్టున్నాడు.

పంచప్రాణాలు పంచ భూతాల్లో కలిసిన మనిషి వీరుడైనా, భీరుడైనా సంప్రదాయ బద్దంగా సాగనంపక తప్పదు. అమర వీరుని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగినై. మాకదో గర్వకారణమైంది.

విషాదము సుడిగాలిలో చిక్కుకున్న మా అమ్మనాన్నల్ని అక్కడే ఉంచి నేను డ్యూటీయే బ్యూటీ అనుకుంటూ తిరిగొచ్చాను. రోజూ అమ్మ, నాన్న, రంజనికి ఫోన్ చేస్తూనే మనోవేదనను తగ్గించే ప్రయత్నంచేశాను.

రంజనిని, బాబును శ్రీకాంత్ వాళ్ళింటికి పంపలేదట. దుఃఖం గాయాలు సలుపుతున్న మనుషులకు కాలగమనమే మలాము పట్టీగా పంజేస్తాయి. వారంరోజులు భారంగా గడిచిపోయినై.

వర్తమానములో గల విషాదాన్ని తలుచుకుంటూ అస్తమానం బాధపడుతుంటే భవిష్యత్తుకు దారి దొరకదు.

నాలుగైదురోజులు సెలవుపెట్టి వరంగల్‍కెళ్ళాను. ఇంట్లో ప్రవేశించగానే ఎదురుగోడకు తగిలించివున్నపార్థసారధి చిత్రము ’కర్మణ్యే వాధికారస్తే….’ శ్లోకాన్ని గుర్తుచేస్తూ ‘నువ్వు చెయ్యాల్సిన కర్మ చెయ్. ఫలితాన్ని నాకొదిలేసెయ్’ గీతార్థాన్ని గుర్తుచేసింది. శ్లోకాన్ని మననం చేసుకున్నాను.

మా అమ్మ ఒడిలో ఆడుకుంటున్న బోసినవ్వుల అభిమన్యును తీసుకుని రంజని గదిలోకెళ్ళాను. ఏదో ఆలోచన బుర్రను తొలుస్తున్నట్టుంది. మంచం పక్క కుర్చీలో విషాదమూర్తిలా కూచుంది.

“రంజనీ! బాగున్నావా?” లాంఛనంగా పలుకరించాను. “ఇదో నీ కొడుకు అభిమన్యు ఎంత బాగా ఆడుకుంటున్నాడో చూడు” రంజని దృష్టి ఎదురుగా టేబుల్ మీదున్న శ్రీకాంత్ ఫోటోమీదుంది. మళ్ళీ పిలిచాను. ఈ లోకానికొచ్చింది.

“బావా!” లేవబోతుంటే నేనే వారించాను.

“ఇదో కర్మవీరుడు. శ్రీకాంత్ ప్రతిరూపము. వీన్ని చూస్తూ నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలి” అభిమన్యును చూపించాను.

“నా బతుకు సుడిగాలిలో చిక్కుకుంది బావా! కడుపులో దుఃఖమున్నా కళ్ళల్లో నీళ్ళు కరువైపోయినై బావా!” గొంతు వణికింది.

“నా భర్త సరిహద్దు కాపలాలో నలుగురు శత్రుసైనికులను పైకి పంపించి తానూ వారికి తోడుగా వెళ్లాడట” పంటి బిగువున దుఃఖాన్ని నియంత్రించుకుంటుంది.

“ఆ విషయాన్ని పత్రికల్లో కూడా చదివాను. గతాన్ని తలుచుకుంటూ గంపెడు దుఃఖాన్ని మోసే బదులుగా భవిష్యత్తు గురించి ఆలోచించు. నువ్వేదన్నా ఉద్యోగాని కప్లైచేస్తే సైనిక కుటుంబాల కోటాలో దొరుకుతుంది”

“గత సంవత్సరమే శ్రీకాంత్ సాయంతో బ్యాంకు రిక్రూట్‍మెంటు నోటిఫికేషన్ చూచి అప్లైచేసిన, రాత పరీక్షలో పాసైనాను. ఇహ ఫైనల్ సెల్క్షన్ కోసం ఎదురుచూస్తున్నాను బావా!”

కొద్దిసేపు మాట్లాడి బాబును రంజని కప్పగించి బయటకు రాగానే నాన్న పిలిచాడు. పెరట్లోని జామచెట్టు కిందకు తీసుకెళ్ళాడు.

“రంజనికి మళ్ళీ పెళ్ళి చేయాలనుకుంటున్నాను రా!” బహ్మోపదేశములా చెవిలో చెప్పాడు.

“తప్పేముంది నాన్నా? యువతి రంజని జీవితం మోడువారిన చెట్టు కారాదు. రంజనికి తగిన సంబంధం కుదిరి తీరుతుంది. శిశిరంలో మోడువారిన చెట్టు వసంతములో చిగురించిన నిండుదనాన్ని పులుముకోవడం ప్రకృతి ధర్మం గదా!”

నా వాదనతో నాన్న ఏకీభవించాడు.

మధ్యాహ్నానికల్లా సూర్యప్రతాపం పదునెక్కింది. భోజనాలయాక అందరం సావకాశంగా వసారాలో కూచున్నాము. శ్రీకాంత్ గుణగణాల గురించి స్వల్పకాల చర్చ జరిగింది. రంజని కూడా బాబును నిద్రబుచ్చి వచ్చి కూచుంది. మావయ్య మొహం మాడిపోయింది. ఆయన నన్ను ఆపాదమస్తకం కొత్తగా చూస్తూ “నాగరాజూ! నా కూతురు జీవితమిట్లా మోడుబారి పోవల్సిందేనా?” బాధను గొంతులో అదిమిపెట్టినట్టుంది. “రంజనిని దయతలచి నీ అర్థాంగిగా స్వీకరిస్తే…?” చర్చ ఆకస్మాత్తుగా అనుకోని మలుపు తిరిగింది. నేను కలుగులో పడ్డ ఎలకలాగయాను. అయోమయాన్ని అధిగమిస్తూ అమ్మా నాన్నల వైపు చూశాను. వాళ్ళు అంతకుముందే పచ్చజెండా ఊపినారని అర్ధమైంది.

విధి విలాసములో ఊగిసలాడుతున్ననా మరదలు, ఆనాడు నా ఊహల్లో ఉయ్యాలలూగిన రంజని ఓ బాబుకు జన్మనిచ్చిన తల్లి అయితేనేం?…. నాలోని తర్జనభర్జనలు ముభావంగా కూచున్న రంజని వైపు దృష్టి మరల్చాను. నా మానసిక పరిస్థితి నాన్న కర్థమైనట్టుంది. “ఏమ్మా రంజనీ! నీకిది సమ్మతమేనా? బలవంతమేమీ లేదు” సూటిగా అడిగాడు.

“మావయ్య!” రంజని కళ్ళల్లో తడి కనిపించింది. గొంతులో దుఃఖఛాయల్లో గాంభీర్యం తొంగి చూస్తోంది. “నా భర్త దేశరక్షణ కోసం బలిదానమయిండు. ఆయన తీపి గుర్తుగా నా కొడుకున్నడు. నా భర్త నాకు దేవుడిగా కనబడుతున్నడు. నా మనసులోంచి ఆయన రూపమెప్పుడూ చెదిరిపోదు. శ్రీకాంత్ స్థానములో మరొకరిని చూడలేను మామయ్యా!”

“వారెవ్వా! మీరంతా తీరిగ్గా కూర్చున్నట్టుంది” వెనుకనుండో వికారం మనిషి వచ్చి చేతులు కట్టుకుని నుంచున్నాడు. అందరిచూపు అతన్ని పరీక్షగా కిందినుంచి మీద్దాకా తడిమాయి.

ఆశ్చర్యం… ఆనందం… నమ్మలేని నిజం… మాసిన మిల్ట్రీ యూనిఫారంలో వున్నాడు. అందరం కళ్ళు నులుముకుని చూశాము… అతడు శ్రీకాంత్!

మన్నుదిన్న బాలకృష్ణుని నోట్లో విశ్వరూపం చూసిన యశోదలా… రంజని అమితానందాశ్చర్యాలు! కొద్దిక్షణాలు నోటి మాట రాలేదు. కళ్ళల్లో అపూర్వమైన రంజిని కాంతిరేఖలనూ, కొత్త మనిషి చూపులతో వేడుకొంటున్నాడు. అతడు చిన్నగా నవ్వి వచ్చి రంజని పక్కన కూర్చున్నాడు. అతడు శ్రీకాంతే! అందరినీ కొత్తగా చూస్తూ “ఎవరూ ఊహించని విచిత్రం జరిగింది. నా శవమనుకుని మీరు మన శత్రుసైనికునికి అంత్యక్రియలు చేశారు గదూ! మా ఆకారల్లో పోలికలున్నై” శ్రీకాంత్ రంజని చేతులందుకున్నాడు.

“ఏమండీ!” సహారా ఎడారిలో ఒంటరిగా భయంగా ప్రయాణిస్తూంటే మరో మనిషి ఆసరా దొరికినట్టుగా రంజిని భర్త గుండెల మీద ఒరిగిపోయింది. “ఇదంతా నిజమే కదూ!” ఒళ్ళు గిల్లుకుంది.

“అక్షరాల నిజమే రంజనీ! నేనూ మా మిల్ట్రీ హెడ్‍క్వార్టర్స్ కెళ్ళి వస్తున్నాను. విషయమంతా తెలిసింది” గాయాలకున్న కట్లు చూపించాడు.

అందరిలో సంతోషానందాలు జాలువారినై “అసలేమైంది బాబూ?” మావయ్య తేరుకున్నాడు.

శ్రీకాంత్ పెదాలమీద చిరునవ్వు మెరిసింది. “బార్డర్లో మేము శత్రుసైనికుల మీద కాల్పులు జరిపాము. దొంగచాటుగా వచ్చిన వారిని మట్టుబెట్టే ప్రయత్నంలో ముందుకెళ్ళి వాళ్ళ ఎదురు కాల్పుల నెదుర్కొన్నాం. ఐదారుగురిని పై లోకాలకు పంపించాము. ముగ్గురు శత్రుసైనికులు గజదొంగల్లా మా వెనకనుండి వచ్చి నన్ను, నా మిత్రున్ని లాక్కెళ్లారు. ఒకడు నా దగ్గరున్నాడు. వాడు అచ్చం నాలాగే ఉన్నాడు. మిగతా ఇద్దరు నా మిత్రుని తుపాకీ మడమలతో, పిడిగుద్దులతో చిత్రహింసలు చేస్తున్నారు. పాపం నా మిత్రుడు వీరస్వర్గం చేరాడు. నేను అంతవరదాకా శత్రుసైనికులతో కుస్తీ పడుతున్నాను. నాలో రోషం బుసలు కొట్టింది. తుపాకి బాయ్‍నెట్‍తో వాని కడుపులో పొడిచాను. అయినా వాడు ఎగబడుతున్నాడు. నా రోషం రెట్టింపైంది. తుపాకి మడమతో వాని మొహమ్మీద, ఒళ్ళంతా కుళ్ళబొడిచాను. వాని యూనిఫారం లాగిపారేసాను. లో దుస్తులతోనే వాడు పరుగెత్తి బార్డరు దాటి మన ఏరియాలో పడి ప్రాణాలొదిలిండు. శత్రుసైనికులు నా వెంట బడ్డారు. నేనో లోయలోకి దిగి దాక్కున్నాను. అక్కడున్న ఆకుల పసర్లు ఒళ్ళంతా రుద్దుకున్నాను. రెండు రోజులు లోయలోనే ఉండి బయటికొచ్చాను. నా చేతిలో చిత్రహింసలు అనుభవించిన శత్రుసైనికున్ని నేననుకుని మన సైనికులు తదుపరి చర్యలు తీసుకున్నారట. ఇదంతా ఈ సినిమా లాగుంది గదూ!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here