[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]
నిష్కల
నమస్కారం..
చిన్నప్పటి నుండి సెలవులు వచ్చేసరికి బోలెడన్ని కథల పుస్తకాలు తెచ్చి అవి పూర్తి చేయమని చెప్పేవారు మా నాన్నగారు. అలా అలవాటు అయిన పుస్తక పఠనం, పెళ్లి అయ్యాక తెలియని ఊరులో నాకు నేస్తం అయ్యి నన్ను రాయమని ప్రేరేపించింది.
అలా 2016 నుండి ప్రతిలిపి, మామ్స్‌ప్రెస్సో వంటి స్వీయ ప్రచురణ వేదికలలో రాస్తూ ఆ వేదికల నుండి కొన్ని ప్రోత్సాహక బహుమతులు కూడా అందుకున్నాను.
అప్పుడే జ్యోతి వలబోజు గారితో పరిచయం అయింది. ఆ పరిచయం వలనే జ్యోతిగారు కథాకేళిలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జ్యోతిగారు మరో కథా సంకలనంలో కూడా అవకాశం కల్పించారు.
రాయడం సరదాగా మొదలుపెట్టినా వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు. నాకు రచనా అనుభవం, ఇంగ్లీష్ మీద అవగాహన ఉండడం వలన స్టోరీమిర్రర్ సంస్థ వారు తెలుగు కంటెంట్ ఎడిటర్‌గా అవకాశం ఇచ్చారు. 2019 ఆగస్ట్ నుండి 2020 అక్టోబర్ వరకు ఎడిటర్‌గా సేవలు అందించాను.
ఆపైన ఫ్రీలాన్సర్‌గా మారి ఇంగ్లీష్ నుండి తెలుగు ట్రాన్సలేషన్, లోకలైజేషన్ మరియు సబ్ టైటిల్స్ క్వాలిటీ చెక్ చేయడం వంటివి చేయడం ప్రారంభించాను.
పిల్లల్ని పెంచడంలో తల్లులకు ఎదురయ్యే సవాళ్ళను ఎప్పటికైనా పుస్తక రూపంలో తీసుకురావాలనే లక్ష్యంతో పాటు, మహిళా సాధికారత, తెలుగు భాషా పరిరక్షణ వంటి మరికొన్ని లక్ష్యాలతో ముందుకు వెళుతున్నాను, ఆ లక్ష్యాలను నేను చేరుకోవాలని ఆశీర్వదించండి.