ఇది నా కలం-15 : పెండ్యాల గాయత్రి

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

పెండ్యాల గాయత్రి

[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారములు.

నేను గాయత్రి. ఒంగోలుకు దగ్గరలోని చెరువుకొమ్ముపాలెం నా జన్మ స్థలం. నా చదువంతా ఒంగోలు లోనే సాగింది. నిరక్షరాస్యురాలైన అమ్మ చెప్పే కల్పిత కథలు నా రచన ప్రయాణానికి ప్రేరణనందించాయి. పదవ తరగతిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులను స్తుతిస్తూ ఒక పేరడీ పాట రాశాను. ఉపాధ్యాయులంతా బాగా మెచ్చుకున్నారు. రేడియో వినే అలవాటుతో సాహిత్యంపై అభిమానం పెంచుకున్నాను. ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు ఒక కథ రాసి పంపిస్తే ఆకాశవాణి వారు 200 రూపాయల చెక్కు పంపించారు. అది మార్చుకోవడం కోసం అని అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంకుకు వెళితే 200 కోసం 500 కడతావా అమ్మా అంటూ బ్యాంకు మేనేజర్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత అదే నా శాలరీ అకౌంట్‌గా మారింది. ఆకాశవాణిలో ప్రతినెలా వచ్చే కవితా కదంబం, యువవాణి లోనూ నా కవితలు, కథలు ప్రసారమయ్యేవి. ఒకానొక టైమ్‌లో నా రచన లేకుండా కవితా కదంబం ఉండేది కాదు. నేను రాసి పంపిన మూడు నాటికలు ఆకాశవాణి విజయవాడ వారు రికార్డ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కేంద్రాల్లో ప్రసారం చేశారు. 2007లో రాష్ట్రవ్యాప్త యువకవుల కవితల పోటీలో ఉత్తమ బహుమతి అందుకున్నాను. కేవలం ఆకాశవాణి ద్వారా మాత్రమే దాదాపు ముప్పైనుంచి ముప్పై ఐదు వేలరూపాయలు పారితోషకం తీసుకున్నానంటే అతిశయోక్తి కాదు.

అనేక కవిసమ్మేళనాలలో పాల్గొన్నాను. రెండు సార్లు మా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదగా ఉగాది పురస్కారాలు, నెల్లూరు సృజన వారి కవితా పురస్కారం, తేజా ఆర్ట్స్ క్రియేషన్స్ వారి రాష్ట్ర పురస్కారం (సి నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా) ఏపిసాక్స్ నిర్వహించిన కవితల, కథల పోటిలో బహుమతులు తీసుకున్నాను. అనేక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నాను. మా ఇంటి అరమర నిండా సాహితీ జ్ఞాపికలే కనువిందు చేస్తాయి.

జీవితంలో ఎదురైన కొన్ని సమస్యలు, సవాళ్ళనధిగమించే క్రమంలో ఓ ఐదారేళ్ళపాటు సాహితీ సేద్యానికి దూరమవ్వాల్సి వచ్చింది, నేను పత్రికలకు పంపింది చాలా తక్కువ. చదువుకునే అవకాశం లేనప్పుడు ఎందుకులే పంపడం అనుకునేదాన్ని. పుస్తకాలు చదివే అవకాశం లేనందున పదిహేనేళ్ళ వయసులో ప్రారంభమైన నా రచనా పయనం నాకు 34 ఏళ్ళు వచ్చినా పెద్దగా వృధ్ధి చెందలేదని అనుకుంటాను.

2016లో ఆంధ్ర భూమిలో వచ్చిన నా కథలు మూడింటిని ప్రతిలిపి వారు సేకరించి ప్రచురించారు. అలా ప్రతిలిపి లోకి వచ్చి అందరి అమూల్య స్నేహాన్ని అందుకునీ, కలం స్నేహంలో సభ్యురాలనయ్యాను. ఇటీవల కొన్ని కథలకు బహుమతులందుకున్నాను.

నా రచనలకు మొదటి విమర్శకుడు మా తమ్ముడు. మొదటి శ్రోత మా అమ్మ. మొదటి పాఠకుడు నా భర్త.

సుమారు ముప్పై కథలు, ఓ ఎనభై కవితలు, ఆరు నాటికలు, పది వ్యాసాలు, నాలుగు గజళ్ళు, ఇప్పటి వరకూ రాశాను. ఇకనుంచి రచనలపై పూర్తి దృష్టి పెట్టి పత్రికలకు పంపుదామనుకుంటున్నాను. రాధిక, సుధ గారుల ప్రోత్సాహ,సహకారాలు మరువలేనివి. కలం స్నేహం అందించిన ప్రేరణ అమూల్యమైనది.

ఇంత భారీ పరిచయాన్ని ఓపికగా చదివినవారికి హృదయపూర్వక ధన్యవాదములు.

gayathripendyala2015@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here