ఇది నా కలం-21 : రేఖ కొండేటి

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

రేఖ కొండేటి

[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం.

సాహిత్యం… అసలు ఈ పదానికి అర్థం కూడా కొన్నాళ్ల ముందు వరకూ నాకు తెలీదు.

అలాంటిది అసలు ఇంతటి సమర్థులైన వర్ధమాన, అనుభవ రచయిత/రచయిత్రుల పరిచయాల మధ్య, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న నాలాంటి వ్యక్తి పరిచయాన్ని చెప్పుకోవడం కాస్త ఇబ్బందిగా, ఒకింత బిడియంగా ఉన్నప్పటికీ మరోవైపు చాలా సంతోషాన్నిస్తోంది.

ఈ విషయంలో ముందుగా నా సాహితీ మిత్రురాలైన కిరణ్ విభావరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, పట్టు పట్టి మరీ నన్ను ప్రోత్సహించినందుకు.

నా పూర్తి పేరు కొండేటి కామాక్షి రేఖ. రేఖ కొండేటి పేరుతో సంవత్సర కాలంగా రచనలు చేస్తున్నాను.

కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒకటి, రెండు ఏవో చిన్న చిన్న వాక్యాలుగా రాసి, వాటిని స్నేహితులకు చూపించి బాగుంది అనిపించుకోవడం తప్పితే ఏ రోజూ కూడా సాహిత్యం వైపు రావాలని అనుకోలేదు. జీవితం తిప్పే మలుపులని ఎవరూ ఊహించలేరు కదా?! అలాంటి ఊహించని ఒక మలుపులో ప్రయాణం చేసి దారి తప్పి ఇటొచ్చెసానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు.

చిన్నప్పటి నుండి ఆదివారం పుస్తకాల్లో వచ్చే కథలు ఇష్టంగా చదివేదాన్ని. సరుకులు పొట్లాలు కట్టే కాగితాల్లో వచ్చే కథలు కూడా వదిలేదాన్ని కాదు. అలా అని పుస్తకాలు కొనుక్కొని చదవాలి అనే ఆసక్తి ఉండేది కాదు. కేవలం ఎక్కడైనా కథ కనపడితే చదవాలి. అది బాల సాహిత్యమా? లేక ప్రేమ కావ్యమా అనే పట్టింపులు ఉండేవి కావు, కథ అయితే చాలు.

ఒకానొక సమయంలో మా అన్నయ్యని ఏదో నవల కొనుక్కుని రమ్మంటే తను అది తీసుకురాకుండా ప్రతిలిపి అనే యాప్ గురించి చెప్పాడు. అలా ప్రతిలిపి లోకి వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్ళాక, అక్కడి రచనలు చదివాక నాకూ రాయాలి అనిపించింది. అలా నా రచనా ప్రస్థానం మొదలైయ్యింది.

ఏదో వచ్చీ రానట్టుగా రాసేసి పోస్ట్ చేసేసేదాన్ని. ఆ తర్వాత కొన్నాళ్ళకు ‘అక్షర లేఖ’ అని ఒక కథ రాయడం జరిగింది. తర్వాత ఆ కథకు వచ్చిన సమీక్షలు చూసి, నా మీద నాకు నమ్మకం కలిగింది. ప్రయత్నిస్తే బాగా రాయగలనేమో అనిపించింది. ఇక అప్పటి నుండి సీరియస్‌గా రాయడం మొదలు పెట్టాను. ఇప్పటి వరకు 15 వరకు రచనలు చేసాను.

చెప్పుకోదగ్గ విజయాలు ఏవి పొందలేకపోయినా చేసిన రచనలు చెప్పలేనంత సంతృప్తిని ఇచ్చాయి. సంతృప్తికి మించిన ఆనందం డబ్బో, పేరో ఇస్తుందని నేను అనుకోను.

కానీ విజయానికి మించిన ఆనందం ఇచ్చింది మాత్రం! ‘అక్షర లేఖ’ కథను అంబాళం పార్థసారథి గారి స్వరంలో వినిపించడం కోసం ఆయనకి పంపడం జరిగింది. ఆ కథ చదివాక పార్థసారథి గారు ఫోన్ చేసి మరీ కథ బాగుందని చెప్పడం మర్చిపోలేని అనుభూతి.

ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న పోటీల్లో నా రచనలు గెలుపొందాయి. ఈ మధ్య కాలంలో తెలుగుతల్లి కెనడా వారు నిర్వహించిన కథల పోటీ విజేతల కథల మధ్యన నా కథ కూడా ఉండడం చాలా ఆనందాన్నిచ్చింది.

చిన్నప్పటి నుండి ఆదివారం పుస్తకాలు చదవడం వల్లనేమో సాహిత్యం వైపుకి వచ్చిన తర్వాత నా కథ కూడా అలా అచ్చులో చూసుకోవాలి అనే కోరిక కలిగింది. ఆ కోరికని త్వరలో ఒక ప్రముఖ పత్రిక తీర్చబోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

నా ఈ రచనా ప్రయాణంలో కలంస్నేహం (వాట్సాప్ గ్రూప్) సమూహ సభ్యులు ఇచ్చే ప్రోత్సహం మరువలేనిది. వారిచ్చే, సలహాలు, సూచనలతో ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను.

ఒక నవల రాసి దాన్ని పుస్తకంగా తీసుకురావాలని ఉంది. కానీ నవల రాయడం అంత సులభమైన విషయం కాదని అతి కొద్ది కాలంలోనే అర్థమైంది. అందుకే ప్రస్తుతం నవల రాయాలి అనే ఆలోచనను పక్కన పెట్టి, ఎలా రాయాలి అనే ప్రశ్న వెనుక అడుగులు వేస్తున్నాను. దానికి సమాధానం దొరికిన రోజు ఖచ్చితంగా రాయడానికి ప్రయత్నిస్తాను.

సాహిత్యం అనేది ఒక మహా సముద్రం, ఎప్పటికీ మూయబడని పెద్ద పుస్తకం. ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతోకొంత మిగిలే ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పటి వరకు నేను తెలుసుకున్నది ఇసుమంత కూడా కాదు. ఈ సాహితీ ప్రయాణంలో ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగు పరుచుకునే దిశగా అడుగులు వెయ్యడానికి! కుటుంబ సభ్యులు, సాహితీ మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ…

రేఖ కొండేటి.

kamakshirekha95@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here