Site icon Sanchika

ఇది నా కలం-22 : అనిల సందీప్

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

అనిల సందీప్

[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం.

సాహిత్యం, అసలు ఆ పదం, దానికి అర్థం, నేను రాయడం మొదలుపెట్టిన ఒకటిన్నర సంవత్సరం వరకు తెలియదు. కానీ తెలిసాక, నాకు ఒక రకమైన మక్కువ ఏర్పడింది. సాహిత్యం అంటే మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న భావోద్వేగాలని బయటికి తిసుకురాగలగాలి, జీవితం మీద కొత్త ఆశని రేకెత్తించాలి, నిస్సారంగా ఉన్న వారి ఆలోచనలకి సరికొత్త జీవం పోయాలి. ఇది ఇప్పటి నా అభిప్రాయం.

నా పేరు అనిల. మాది నెల్లూరు. అనిల సందీప్ అనే పేరుతో రచనలు చేస్తాను. సందీప్ మావారి పేరు. నేను రెండున్నర సంవత్సరాలుగా రచనలు చేస్తున్నాను. కానీ నా మొదటి రచనకి బీజం పడింది మాత్రం 2006లో, అనగా, నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నప్పుడు. అప్పటినుంచి రాసి పుస్తకాల్లో దాచుకునేదాన్ని తప్పితే ఎప్పుడు బహిర్గతం చెయ్యలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా చాలా కాలం ఈ విషయం తెలియదు. తర్వాత బయటపడింది. కానీ ముందు చదువు ముఖ్యం ఆ తర్వాతే ఏదైనా అనే సరికి, నా రచనలని అటకెక్కించాను. ఆ తర్వాత చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు ఇలా సమయం చాలా గడిచిపోయింది.

2019లో ఫేస్‌బుక్‌లో అనుకోకుండా ప్రతిలిపి అనే ఒక ఆప్ చూడటం జరిగింది. అక్కడ చదవడం మాత్రమే కాదు రాయవచ్చు అని తెలిసి రాయడం మొదలు పెట్టాను. అలా మొదలుపెట్టిన నా రచనా ప్రస్థానం కొనసాగుతోంది, ఇప్పటికి 13 నవలలు రాసాను, రాస్తూ ఉన్నాను.

కొన్ని రచనలను, ప్రతిలిపి వారే కామిక్స్, వెబ్ సిరీస్, మూవీస్ ఇలా రకరకాలుగా మార్చడానికి నా నవలలు తీసుకున్నారు. మామ్స్‌ప్రెస్సో ఆప్ వారు నిర్వహించిన ఉత్తమ నవల పోటీలో గెలుపొందాను. అలాగే ఫేస్‌బుక్‌లో తపన అనే సాహిత్య సమూహాన్ని నిర్వహించడంలో అడ్మిన్‍గా నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను.

ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిన రచయితలు చాలా కొద్దిమంది. ఎందుకంటే నాకు తెలిసిన రచనా ప్రపంచం చాలా చిన్నది. కానీ ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాతగాని తెలియలేదు సాహిత్య ప్రపంచం ఎంత పెద్దదో, అందులో ఎంతమంది అనితరసాధ్యులు అయిన రచయితలు ఉన్నారు అనేది. అప్పటివరకు నవలలు రాయడం మాత్రమే తెలిసిన నాకు తొలిసారిగా కథ అనేది ఎలా ఉంటుంది, దాని శిల్పం, రూపకల్పన అనేది ఏంటి అని తెలుసుకున్నాను. అక్కడే అర్థం అయ్యింది, నేను తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, ఇంక చాలా ఉంది అని.

నిజానికి నాకు ఈ సాహిత్య ప్రపంచాన్ని పరిచయం చేసి, ప్రతిక్షణం నాకు దిశానిర్దేశం చేస్తూ ఎటు వెళితే ఏం వస్తుంది, ఎలా వెళ్ళాలి, అసలు ఎటు వెళ్ళాలి అని మాకు మార్గదర్శకం చేసిన ఒక వ్యక్తికి నేను సదా రుణపడి ఉంటాను. ఈ సాహితి ప్రపంచంలో నన్ను నిత్య విద్యార్థినిని చేసారు.

ఎప్పటికైనా నా నవల ఒక్కటి అయిన పత్రికలో కానీ, పుస్తక రూపంలో కానీ రావాలి అనేది నా కోరిక.

చివరిగా ఒక మాట, రచయిత అంటే పాఠకులకి మంచి చెప్పకపోయినా పర్వాలేదు కానీ, చెడుని మాత్రం నూరిపోయకూడదు. అలాగే ఒక రచన చేసేటప్పుడు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని రచన అనేది చేస్తే బాగుంటుంది. అలాగే పాఠకులు కూడా ఒక రచయిత రాసిన కథను చదివాక ముందుగా ఆ కథపై విమర్శ, అలాగే అందులోని లోటుపాట్లు పక్కనపెట్టి అసలు ఆ కథ ద్వారా ఏం చెప్పాలి అనుకున్నారు అని ఆలోచిస్తే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం.

anilasandeepjwala@gmail.com

Exit mobile version