[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]
మరీచిక కళ్యాణి
[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం.
నా పేరు కళ్యాణి. కలం పేరు మరీచిక.
చిన్నతనం నుండీ సాహిత్యం అంటే వల్లమాలిన అభిమానం లాంటి భారీ డైలాగ్స్ ఏమి లేవు కానీ, చిన్నప్పటి నుండీ పుస్తక పఠనం అంటే ఆసక్తి ఎక్కువ.. న్యూస్ పేపర్ తో సహా చదివేదాన్ని. సహజంగా కథలంటే ఆసక్తి లేని చిన్న పిల్లలు ఉండరు. అందుకు నేను కూడా మినహాయింపు కాదు. చందమామ, బాలమిత్ర కథల పుస్తకాలు కొనుక్కుని మరీ చదివేదాన్ని. అమ్మా నాన్నా ఇద్దరూ టీచర్స్ అవ్వడంతో బుక్స్‌కి కొదవ లేకుండా ఉండేది.
అమ్మ తెలుగు పండిట్. తెలుగు పాఠాలు కథల్లా ఉండడంతో ఇంట్రెస్ట్‌గా చదివేదాన్ని. మా నాన్న శ్రీ రామకృష్ణ మిషన్ డివోటీ కావడంతో రామకృష్ణ పరమహంస, శారదా మాత, స్వామి వివేకానందల జీవిత చరిత్రలు, చిన్మయ మిషన్ వారి బాలల పుస్తకాలు, ప్రతి నెల విడుదలయ్యే రామకృష్ణ ప్రభ బాగా చదివేదాన్ని. రామాయణ, మహాభారతాలు, మర్యాద రామన్న కథలు వగైరా.. కనిపించిన ప్రతి పుస్తకం చదివేదాన్ని. పెద్ద చదువులు చదివేకొద్దీ పుస్తక పఠనం కాస్త తగ్గింది. మళ్ళీ పెంచాలని అనుకుంటున్న టైంలోనే ఆన్లైన్ కథల వేదికలు కనిపించాయి. ఆసక్తి కొద్దీ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని చదివాను. మొదట్లో రచన చేయాలన్న దృష్టి నాకు పోలేదు. కానీ కొన్ని కొన్ని కథలు చదివిన తరువాత, ఇవేం కథలు అనిపించింది. ఇంతకన్నా బాగానే నేను రాయగలను అనుకోని ఎప్పుడో చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు ప్రయత్నించిన కవిత్వం రాయడం మొదలెట్టా. అది అంత అద్భుతమైన కవిత్వం ఏమి కాదు (అసలు కవిత్వమే కాదేమో🤭)
అలా చిన్న చిన్న కథలు కూడా రాయడం మొదలెట్టాను. ఇలా రాస్తున్న క్రమంలోనే సాహిత్యం అంటే ఏమిటి, రచనా విధానం ఏమిటి అనేవి తెలుసుకుంటున్నాను. అలా రాస్తున్న టైంలోనే మామ్స్‌ప్రెస్సో ఆన్లైన్ ప్లాట్‌ఫారం వాళ్ళు నిర్వహించిన 100 పదాల కథల పోటీలు, కవితల పోటీలలో గెలుపొందాను. మామ్స్‌ప్రెస్సో వారు నిర్వహించిన నవలా పోటీలో నేను మొదటి రాసిన నవల “నాగ బంధం” విజయం సాధించడం చాలా సంతోషం కలిగించింది. ఆ విజయం ఇచ్చిన ఉత్తేజంతో ఒక మాసపత్రికకు చిన్న కథ పంపగా, సాధారణ ప్రచురణకు ఎంపిక అయింది. అలా సాగుతున్న ప్రయాణంలో కొంత విరామం ఏర్పడింది. వీలయినంత తొందరలో మళ్ళీ రచనా ప్రస్థానాన్ని మొదలెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నా..