ఇది నా కలం-26 : గొర్రెపాటి శ్రీను

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

గొర్రెపాటి శ్రీను

[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం. నా పేరు జి. నాగ మోహన్ కుమార్ శర్మ.

చదవడమంటే ఎక్కువగా ఇష్టపడే నేను నా రచనా వ్యాసంగాన్ని 1999వ సంవత్సరంలో అంటే నా 22వ ఏట ప్రారంభించాను.

తొలి రచన ‘అంకితం’ అనే కవిత ఓ ప్రముఖ వారపత్రికలో ప్రింట్ అయ్యింది. ఆ వెంటనే నేను వ్రాసిన ఓ కథ కూడా ప్రచురితమయింది.

అలా ప్రారంభమయిన నా సాహిత్య ప్రయాణం నేటికి నాలుగు వందల వరకు కవితలు, ఎనభై కథలు, రెండు నవలలు ప్రచురితం అయి ‘గొర్రెపాటి శ్రీను’ అనే నా కలం పేరు మీ అందరికీ పరిచయం అవడానికి కారణం అయింది.

నేను పుట్టింది గుంటూరు జిల్లాలో అయినా మా నాన్న శ్రీ గొర్రెపాటి బ్రమరాచార్యులు గారు ఉద్యోగరీత్యా శ్రీశైలం మరియు నల్గొండలో పని చేయడంతో నా విద్యాభ్యాసం అంతా ఆ రెండు చోట్లనే జరిగింది.

నేను ఉన్నత పాఠశాల అంటే 8 నుండి 10వ తరగతి వరకు పిట్టల గూడెం అనే గ్రామంలో (గుర్రంపోడు మండలం, నల్గొండ జిల్లా) చదువుకున్నాను. అలా చదువుకునే సమయంలో నాలో వున్న సాహితీ అభిలాషని గుర్తించి మంచి పుస్తకాలు చదవమంటూ సూచించడమే కాకుండా వారి వద్ద వున్న సాహిత్య పుస్తకాలు అందించి ప్రోత్సహించిన మా గురువుగారు శ్రీ ఏలూరు అశోక్ కుమార్ రావు సార్ అందించిన స్ఫూర్తి ఎంతగా చెప్పినా తక్కువే.

నాలో విజ్ఞాన బీజాలు నాటిన గురువులు ఎందరో వున్నా వారు నాకెప్పుడూ ప్రత్యేకమే. నేటికీ అశోక్ సార్‌ని నేనెప్పుడైనా కలిసి పలకరిస్తే వారు అందించే ప్రోత్సాహం మరువరానిది.

కాలేజీలో చదువుకుంటూ ఎప్పుడైనా కాస్త ఖాళీ సమయం దొరికితే నల్గొండలో వున్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కూర్చుని ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞాపకం! కాలేజీలో మంచి మార్కులు సాధించడమే కాకుండా ఉత్తమ సాహిత్య గ్రంథాలు చదవడం నల్గొండలోనే ప్రారంభమయ్యింది.

ఉద్యోగం కోసం నల్గొండ నుండి హైదరాబాద్ వస్తూ ఓ ప్రముఖ వార పత్రిక (ఆంధ్రభూమి) కి తొలి కవిత పోస్ట్ చేశాను. కానీ అదేం ఆశ్చర్యమో.. జాబ్ రావడం, నాకు జాబ్ వచ్చిన వారం రోజులకే ఆ రచన ప్రింట్ అయ్యింది.

అలా పుస్తకాలు చదువుకుంటూ, ఎన్నో రచనలు చేస్తూ నేడు మీరు చూస్తున్న నేను!

బాల్యం లో నాన్న తెచ్చిన ‘చందమామ’, ‘బొమ్మరిల్లు’, ‘బాలమిత్ర’, ‘బుజ్జాయి’ వంటి పత్రికలు చదవడం ఆ కథలు పాఠశాలలో ఉన్నప్పుడు కూడా గుర్తుకు రావడం కథలంటే తెలియని ప్రేమ పుట్టడం జరిగింది.

అలా కథ, కవితలతో బాల్యం నుండే అవినాభావ సంబంధం ఏర్పడింది.

సినారె, శ్రీశ్రీ, రవీంద్రనాథ్ ఠాగూర్, యద్దనపూడి, యండమూరి, కొడవటిగంటి, రావిశాస్త్రి, ముళ్ళపూడి వంటి ఎందరో మహనీయుల రచనలు చదివాను.

నేను చదువుకున్నది సాంకేతిక విద్య అయినా నాకు భాష పైన సరిగ్గా పట్టులేకపోయినా ఎందరో సాహితీ సృజనకారుల రచనలు చదవడం వలన మాతృభాషపైన అమితమైన ఇష్టం, ప్రేమ వున్నందు వలన రచనలు చేయగలుగుతున్నాను అని నా భావన.

2019లో ‘వెన్నెల కిరణాలు’ అనే కవితా సంపుటి, 2021లో ‘ప్రియ సమీరాలు’ అను కథాసంపుటి వెలువరించాను.

వివిధ సాహితీ సంస్థలు, దిన, వార, మాస పత్రికలు అందిస్తున్న ప్రోత్సాహం కూడా నన్ను ముందుకే నడిపిస్తుంది.. మరెన్నో రచనలు చేయాలనే ఆరాటాన్ని రెట్టింపు చేస్తుంది.

నా మాతృమూర్తి శ్రీమతి శాంతకుమారి నాకు నిత్యం చైతన్యాన్ని అందిస్తూ.. సమాజానికి నచ్చే అందరూ మెచ్చేటటువంటి రచనలు వ్రాయమంటూ సూచిస్తుంటుంది.

సదా నా అభ్యున్నతిని కాంక్షించే అమ్మకి నమస్కారాలు తెలుపుకుంటున్నాను.

నా గురించి ఇలా చిరుపరిచయం చేసుకునే అవకాశం కల్పించిన ‘సంచిక’ సంపాదక బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు!

గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)

gorrepatisrinu38@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here