[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]
సి.హెచ్. గౌతమి
[dropcap]నా[/dropcap] పేరు సి.హెచ్. గౌతమి. నేను ఎంబీఏ చేసాను. ప్రస్తుతం గృహిణిగా ఉంటూ నా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే నాకు ఎంతో ఇష్టమైన రచనారంగం వైపు అడుగులు వేస్తున్నాను. రాయడం అంటే ఉన్న ఇష్టంతో మనసులో మెదిలిన భావాలకు ఇలా అక్షరాలను చేర్చి కథలుగా మలుస్తూ ఉంటాను.
సాహిత్యం లోకి అడుగుపెట్టిన ప్రారంభ దశలో, ఎన్నో అపజయాలు అనే కన్నా అన్నీ అపజయాలే పొందాను. మరెన్నో విమర్శలని ఎదుర్కొన్నాను.
ఒకానొక దశలో నేను కథలు రాయడానికి పనికిరాను అని నేనే అనుకొనేంతలా అవి నన్ను మానసికంగా కృంగిపోయేలా చేసాయి. కానీ సాహిత్యం పట్ల నాకుండే ప్రేమే తిరిగి ధైర్యంగా నా రచనాయానాన్ని కొనసాగించేలా చేసింది. ఇందులో నా కొంతమంది సాహితీ మిత్రుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. వారికి నేనెప్పుడూ కృతజ్ఞురాలిని.
ఆ తర్వాత మెల్లిగా పెద్ద పెద్ద రచయితల రచనలు చదువుతూ నన్ను నేను సరికొత్తగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చాను. దాని ఫలితం మొదటిసారిగా మామ్స్‌ప్రెస్సోలో ఒక నెల ఉత్తమ బ్లాగ్‌గా ఎంపికయ్యాను.
ఆ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ తర్వాత ఒక్కసారైనా మాగజైన్‌లో నా కథ చూసుకోవాలనే కోరిక, తపనతో ఎన్నో మ్యాగజైన్‌కి ఎన్నో సార్లు కథలు పంపాను, అవేవి ఎంపికవ్వలేదు. ఐనా నేను కృంగిపోలేదు, నా ప్రయత్నాన్ని వదలలేదు.
తెలిసిన అన్ని పోటీలకు కథలను రాసి పంపడం మొదలుపెట్టాను. మళ్ళీ అపజయాలే ఎదురవ్వడంతో అసలు దాని వెనక ఉన్న కారణం తెలుసుకునే దిశగా అడుగులు వేస్తున్న నాకు ఎక్కువ కథలు రాసి తక్కువ చదవడం కన్నా ఎక్కువ కథలు చదివి తక్కువ రాయడం వలన మంచి రచనలు చేయగలం అని తెలిసింది.
కొంత విరామం తీసుకుని చదవడం మొదలుపెట్టాను. ఆ ప్రయాణంలో నన్ను నేనే మరచిపోయాను. నా లోకమే కొత్తగా మారిపోయింది. ఒంటరితనం, బాధ, నిస్పృహ ఇలాంటి ఎన్నో భావాలు నా నుండి దూరమవ్వడం గమనించాను. నాలో కలిగిన మార్పు నాకెంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగించింది.
2 సంవత్సరాలు గడిచాయి. ఈ 2 సంవత్సరాలలో నేను చాలా తెలుసుకున్నాను. ఎందరో గొప్ప రచయితల రచనలు చదివాను. గొప్ప గొప్ప రచయితల గురించి విన్నాను, వాళ్ళ గురించి తెలుసుకున్నాను. కొత్త కొత్త సాహితీ మిత్రులను కలిశాను, వారి నుండి కొత్త కొత్త విషయాలని తెలుసుకున్నాను. కథలు ఎలా రాయాలి? కథా వస్తువు ఎలా ఉండాలి? విరామ చిహ్నాలు ఎలా ఉపయోగించాలి? ఇలాంటి ఎన్నో అంశాల గురించి అవగాహన కలిగింది. అంతకు మించి మన తెలుగు సాహిత్యం పట్ల అభిమానాన్ని పెంచుకున్నాను.
2019లో మొదలైన నా రచనారంగంలో ఇప్పటివరకు ఎన్నో కథలు రాశాను. అందులో కొన్ని అంతర్జాల పత్రికలలో ప్రచురితం అయ్యాయి. మరికొన్ని బహుమతులను తెచ్చిపెట్టాయి. ఎప్పటికైనా మ్యాగజైన్‌లో నా కథ ప్రచురణ జరగాలి అనే నా కోరిక ‘సాక్షి’లో ప్రచురించబడిన నా కథ ‘రంగనాధం మాష్టారు’ ద్వారా నెరవేరింది. ఆ తర్వాత సహరి అంతర్జాల వార పత్రికలో 3 కథలు, సుకథలో ఒకటి, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రికలో ఒకటి చొప్పున నా రచనలు ప్రచురితమయ్యాయి.
సాహిత్యం అనే మహాసముద్రంలో చేరడానికి బయల్దేరిన పిల్ల కాలువ లాంటి నా ప్రయాణంలో ఊహించని ఎన్నో పరాభవాలు, అనుకోని కొన్ని విజయాలు నాకెంతో నేర్పాయి. వాటినే పాఠాలుగా చేసుకుని, పెద్దల సలహాలు, సూచనలతో ప్రసిద్ధి చెందిన రచయితల రచనల ద్వారా నా రచనా శైలిని ఎల్లప్పుడూ మెరుగులు దిద్దుకుంటు ముందుకు సాగుతూ ఉండాలని కోరుకునే ఓ నిత్య విద్యార్థిని నేను.