ఇది నా కలం-5 : స్ఫూర్తి కందివనం

2
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

స్ఫూర్తి కందివనం

[dropcap]నా[/dropcap] పేరు స్ఫూర్తి కందివనం. నా స్వస్థలం మహబూబ్‌నగర్. ప్రస్తుతం హైదరాబాదులో నివాసముంటున్నాను. తల్లిదండ్రులు కందివనం రఘురామయ్య, మారిపాకుల వరలక్ష్మి. భర్త పాపతోటి నరేంద్రకుమార్.

బయోటెక్నాలజీలో పీజీ చేసిన నేను ఆరేండ్లపాటు సైంటిఫిక్ ఈ-జర్నల్స్ పబ్లిషింగ్ సంస్థల్లో మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశాను.

వృత్తిరీత్యా మా నాన్నగారు జర్నలిస్ట్ అవడంతో నిత్యం పత్రికల కోసం ఎన్నో కథనాలు రాసేవారు. ఆయన్ను అలా చూస్తూ పెరిగిన నాకు కూడా ఆయనలా రాయాలని ఉండేది. తరువాత చదువు, ఉద్యోగం… వీటివల్ల నేను దానిమీద అంతగా దృష్టి సారించలేకపోయాను. ఓ రోజు చేతన్ భగత్ గారి నవల చదివాక, తిరిగి రాయడం పట్ల ఆసక్తి కలిగి … అలా ఎట్టకేలకు 2019లో సాహిత్య ప్రపంచంలోకి నా తొలి అడుగులు వేసాను. మొదలు ఇంగ్లీషులో రాయడం ప్రారంభించాను. 12 కథలు రాసాను. ఆ తర్వాత నా మాతృభాషను వదిలి ఇంగ్లీషులో ఎందుకు రాయడం అని నా మనసుకి అనిపించి తెలుగు సాహిత్యంలోకి అడుగుపెట్టి ఇప్పటివరకు 33 కథలు, రెండు నవలలు రచించాను. వీటితో పాటు కొన్ని బ్లాగ్స్ కూడా రాసాను. నా మొదటి నవల ‘చైత్ర’ను పుస్తకంగా వెలువరించాను. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ గారు ఈ నవలను చదివి నన్ను అభినందించడం… నేను నా జీవితంలో మరచిపోలేని అనుభూతి. మరో నవల ‘ఒక మజ్ను కోసం’ను సిరీస్‌గా ప్రతిలిపిలో ప్రచురించాను. రెండున్నర లక్షల మంది పాఠకుల అభిమానాన్ని చూరగొంది ఈ సిరీస్. నా తొలినాళ్ళలోనే పాఠకుల నుండి ఇంతటి స్పందన లభించడం నన్ను మరింత ఉత్సాహంగా ముందుకు నడిపింది.

‘లోగిలి’ మాస పత్రిక 2019లో నిర్వహించిన సింగల్ పేజీ కథల పోటీలో నేను రచించిన ‘సత్యవతి హ్యాండ్లూమ్స్’ కథకు గాను తృతీయ బహుమతి గెలుచుకున్నాను, ‘ప్రతిలిపి ఇంగ్లీష్ విభాగం’ 2019లో  బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో నేను రచించిన ‘లిటిల్ మింటు – ఎ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్’ కథల మినీ సిరీస్‌కు నాలుగవ బహుమతి గెలుచుకున్నాను. నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నిర్వహించిన ‘కథ 2020’ పోటీ కోసం నేను రచించిన ‘చీకటి వెలుగులు’ కథకు విశిష్ట బహుమతి లభించింది. రామోజీ ఫౌండేషన్, ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కథా విజయం 2020’ పోటీకి నేను రాసిన ‘నాయిన చెప్పిన అబద్ధం’, విశాలాంధ్ర-అరసం యువ కథా పురస్కారం 2021 కథల పోటీకి నేను రచించిన ‘నేను…మీ…!’, మరియు అర్చన ఫైన్ ఆర్ట్స్ కథా మాలిక 2021 పోటీకి రాసిన ‘ఇంకా ఎందుకీ నిశ్శబ్దం’ కథలకు గాను ప్రత్యేక బహుమతులు అందుకున్నాను. వీటితో పాటు ప్రతిలిపి, మోమ్స్‌ప్రెస్సో, స్టోరీ మిర్రర్ వంటి ఆన్లైన్ సాహిత్య వేదికల్లో నిర్వహించిన పలు పోటీల్లోనూ బహుమతులు దక్కించుకున్నాను.

సాహిత్య ప్రపంచంలోకి అడుగు పెట్టాక ఎన్నో నేర్చుకున్నాను, నేర్చుకుంటున్నాను. ఇందులో నా ప్రయాణం ముందుకు సాగేకొద్దీ నేను తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థమయ్యింది. సాహిత్యం నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా మాండలిక కథలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరచిపోయిన… అనే కంటే నిర్లక్ష్యం చేసిన నా యాసను తిరిగి గుర్తించగలిగాను. తెలంగాణా మాండలిక కథలు రాయడం అన్నా, చదవడం అన్నా చాలా ఇష్టం. ఒక యువ రచయిత్రిగా నా భాషను, యాసను కాపాడుకోడానికి మరియు మన ముందు తరాల కోసం వాటిని పదిలపరచడానికి మాండలిక శైలిలో కథలు రావడం చాలా అవసరం అని గుర్తించాను. అందుకోసం నా వంతు కృషిగా సాధారణ కథలతో పాటు మాండలిక కథలు కూడా రాస్తున్నాను.

మరొక ముఖ్యమైన విషయం… పుస్తక పఠనం. నేడు అంతా ఆన్లైన్‌మయం కావడంతో పుస్తక పఠనం రాను రాను తగ్గిపోతుంది. ఒక పుస్తకం తీసుకురావలంటే ఎంత కష్టమో, ఎన్ని ఆటుపోట్లు ఉంటాయో స్వీయానుభవంతో తెలుసుకున్న నేను… ఆన్లైన్‌లో చదవడంతో పాటు పుస్తకాలు కూడా కొని చదవాలని నిశ్చయించుకుని, సాహిత్యంలో మంచి పుస్తకాలు సేకరిస్తూ, వాటిని చదవడం అలవరచుకున్నాను. భవిష్యత్తులో మన తెలుగు పుస్తకాలు కూడా ఇతర భాష పుస్తకాలలా విక్రయించే రోజులు రావాలని కోరుకుంటున్నాను.

k.spoorthy20@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here