ఇది నా వృత్తయింది

0
2

[dropcap]పొ[/dropcap]ద్దు లేలేత కిరణాలతో భూమిని చీల్చుకొని పైపైకి ఉబుకుతున్నది. మబ్బుతునకలు వెలుగుతో దోబూచులాడడం నయనానందకరంగా ఉంది. పక్షులు గూడు విడిచినయి. ఊరిళ్లల్లోని కూనలు – వీడ్కోలు చెపుతున్నట్టు కిసకిసలాడినయి. రాత్రంతా మాటుమనిగిన పల్లెన, అలికిడి సురువయింది. రకరకాల శబ్దాలు కలగలసిపోయి – ఓ రకమైన సన్నని గాలిన చెరెచెరలుగా వినిపిస్తున్నది. ఓ రైతు కోటేరేసుకొని ఆదరబాదర చెలకబాట పట్టాడు. ఎద్దుల మెడగంట వాటి నడకన లయబద్ధంగా వినిపిస్తున్నయి. ఊరి రామాలయాన గంట అప్పుడుప్పుడు మోగుతున్నది. ఆలయ శిఖరం నుంచి పావురాలు మూకుమ్మడిగా రెక్కలు తాటిస్తూ పైకెగిరినయి.

‘గుడి’ దాపునున్న ‘ఆదిలక్ష్మి’ చుట్టు గుడిస నిశ్శబ్దంగా బావురుమనేలా అనిపిస్తుంది. రాములయ్య చుట్ట కాల్చే ప్రయత్నాన చకుముకి కోసం రొండిన చెయ్యేసి చూసుకొని మొలతాడున ‘చెకుముకి’ సంచి కనపడక పోవడంతో ‘అగ్గి’ కోసం ఆదిలక్ష్మి గడవేపు మళ్ళాడు. నాలుగడుగులు లోపలికేసి ‘ఇదింకా లేసి ఇంటి ముందు చిమ్మలేదేంటి’ అనుకుంటూ ‘ఆదీ’ అని పిలిచాడు, పలకలేదు. మళ్ళీ పిలిచాడు కొంచం పెద్దగా. చడీచెప్పుడు లేదు. తలుపు దాపు కొచ్చి నెట్టాడు. తెరుచుకుంది. కాని ఆదిలక్ష్మి లేచినట్టు లేదు. ‘ఆదమ్మా’ అంటూ లోనకు అడుగేసాడు. మంచంపై ఆదిలక్ష్మి కనిపించింది కాని కదలిక లేదు! ‘ఏందీ మొదు నిద్ర? మొగుడు ముద్దు లేకున్నా’ అనుకుంటూ, మంచం దగ్గరికి వచ్చి ‘ఎందబ్బా ఇంత మొద్దు నిద్ర’ అనుకుంటూ కాలు దగ్గర తట్టాడు. చలికట్టెలా అనిపించి ఒళ్ళు జల్లుమంది. మీదకు వంగి భుజాలు పట్టుకొని ‘ఒసే ఆదీ! ఆదీ’ అని కుదిపాడు… అర్థమయింది ‘ఒట్టి కట్టె’ అని. మళ్ళీ కదిపాడు అనుమానం పోక. “ఓసేయ్ రాములూ, చంద్రి, శ్యామలా, అమరయ్య” అని దూరంగా జరుగుతూ కేక వేసాడు.

‘ఏందిరా’ అంటూ పక్కింటి అమరయ్య వచ్చాడు. “నేను ‘అగ్గి’ కోసం దీనింటికొస్తే ఇది చలికట్టెలా పడి ఉందిరా. రాత్రెప్పుడో ఊపిరి పోయినట్టుంది. ఒంటిన చింతాకంత వేడిలేదు, నువ్వు కాస్త చూడు” అనగానే లోన జొరబడి చూసి “రాత్రే ఊపిరిపోయినట్టు ఉంది” అని “అరేయ్ మంచం మీద దాన్ని ఉంచకూడదు కాని – ఆ మూలన చాప ఉంది, తెచ్చి పరువు. దాని పైన దించుదాం.” అనగానే చాప పరచి ఇద్దరూ పట్టి చాప పైకి జరిపారు. ఈ అలజడిలో నెమ్మదిగా చుట్టు పక్కన వాళ్లు ‘ఆశమ్మ పోశమ్మలు పని పాటలేని రంగయ్యలు’ ఏందటూ రావటం మొదలు పెట్టారు. ఊరు కదా, ఒక్కరొక్కరూ విషయం తెలుసుకుంటూ వస్తూనే ఉన్నారు. పోగడుతున్నారు దండిగా.

మాది వాస్తవానికి పల్లే కాదు పట్నమూ కాదు. పెద్ద తోవెంట ఉండడాన నాలుగైదు పచారి దుకాణాలు, రెండు ఇడ్లీ బండ్లు ఉన్నాయి. మా పల్లెల్ల సారా అంగళ్ల కాడ కల్లు అడ్డాల కాడ ఉడక బెట్టిన గుడ్లు, పునుగులు మిరపకాయ బజ్జీలు వేస్తూ రాత్రి బాగా పొద్దుపోయేదాకా ఉంటారు. అప్పటి దాకా సందడిగానే ఉంటుంది ఊరు.

ఆ తర్వాత గప్ చుప్. ఊరకుక్కలు, దొంగకోరులూ తప్ప మనుషులు కనబడరు.

ఇదిగో ఇంతలో అమరయ్య అన్న వచ్చి “ఈ ఆది లచ్చికి బంధువులు ఎవరైనా ఉన్నారా. అది కనుక్కుంటే కబురు చేయొచ్చు” అన్నాడు. అటుగా వచ్చే సైదయ్య ఆగి “యీడెవరూ ఉన్నట్టు లేరు. అయినా దీనిది అసలు  ఈ ఊరు కాదు కదా. అటెటో పడమట నుండి రెండేళ్ళ క్రితమే ఓ పోరడ్ని ఎంటేసుకొచ్చి ఈ గుడిసే కొనుక్కుని కూలి నాలి చేస్తా అది దొరకన్నాడు, ఇళ్ళల్లో ఆలుకులూ పై పనులూ చేస్తుంటుంది.” అన్నాడు. “కనీసం ఏమిటి మనిషో తెలుసా?” అడిగిండు అమరయ్య.

“తెలవదు కాని సూద్రపు మనిషే. దీని పోరడు చానా దూరాన ఏదో మిల్లులో పని చేస్తుండుట. ఆరునెల్లకో ఏడాదికో వచ్చిపోతుంటాడు. అంతకు మించి తెలవదు” అన్నాడు జంగయ్య.

“మనువయ్యిందా? పోరడికి” అదీ తెలవదు. ఇది మాత్రం ఒంటరిగే ఉంటది. మనిషి వస్తుసహా చానా కలివిడిగా ఉంటది. చిన్నదానికి పెద్దదానికి పని మొహాన, లెక్క చేయక బీద సాదా అనక కష్టం చేస్తూ అందరికి సాయంగా ఉంటది. మా కరణం గారి ముదిగవ్వకు పక్షవాతం వస్తే ఇంటిమనిషోలె ఓర్పుగ చాకిరి చేసింది, ఇంత ఇస్తేనే కదురతది అని నోరిప్ప అడగలే. పైగా ఏ అరమరికల్లేని మనిషి మంచి గుణం.

“మరి పోరడు సంగతి తెలిసేదెట్లా” అడిగిండు సైదయ్య. “అది లచ్చికి దగ్గరక ఉండేవాళ్లు ఏవరైనా ఉన్నారా? దాన్ని అడిగితే తెలుస్తది”. అనగానే పరమయ్య గబగబా లోనకెళ్లి ఆది లచ్చితో దగ్గరగా ఉండే నర్సవ్వని కనుక్కొని బయటకు వచ్చి “దానికీ తెలవదట. దాని ఎరకలో ఈడికి ఎవరూ వచ్చినట్టు లేదట. పోరడూ పెండ్లిగానోడే. పైగా ఓ కాలు అవుటు. చిన్నతనాన పోలియో వచ్చి పోయిందంట. కానీ తల్లి లెక్కే నిమ్మలస్తుడు, మంచి పోరడు. ఒక్క చదువే వొంటబట్టలేదు” అన్నాడు అప్పుడే వచ్చిన జారయ్య.

అమరయ్య ఆలోచనలో పడి ఉన్న నలుగురిని చూస్తూ “మనది ఊరు కదా. మొదలు కట్టెను బయటకు కదిలించడం ఎట్టా? పోరడికి కబరందకున్నా రాలేకపోయినా ఊళ్లో నయితే సచ్చిపోయిందాన్ని అట్ల ఉంచం కదా” అనగానే ఉన్న నలుగురు చూట్టూ చేరి “ఏం చెద్దాం?” అని పరమయ్యతో అన్నారు.

“ఈ అగావు జరిగినట్టు తెలిసినకాడి నుంచి అదే ఆలోచిస్తున్న! మొదలు తలా ఇన్ని ఏసుకొని దాన్ని బయటకు తెద్దాం” అనగానే అందరూ ఆలోచనలో పడ్డారు.

“ఇగో నేను తిరుపతికి పోదమని రెండు వేలుంచిన, అయి రెడీగ ఉన్నాయి” అని పకీరయ్య అనగానే జానపాటికని రెండు పోతులు ఉంచిండు సైదయ్య. ఈ పనికంటే వాడూ ఒప్పుకుంటాడు. అని తోవన పడ్డారు. కలిసినోళ్ళకల్లా విషయం చెప్పి తలాయిన్ని పోగుచేసారు. దానికీ ఎవరూ ఉన్న జాడలేదు, అరకుంట జాగాలో ఉన్న గుడిసె తప్ప. దాన్ని బయటకు తీసి నడపాలి. మిగితా సంగతి ఆనక చూసుకుందాం అని అన్నాడు అమరయ్య. వెంకన్న తన దగ్గరకున్న ఆరు నూరులు ఇస్తానన్నాడు. పోరడితో పంపాడు కూడా.

అది సరే కాని దహన సంస్కారం పూర్తి కావడానికి బోలెడు తతంగం ఉంది. అది దగ్గరుండి ఎవరు చేయిస్తారు అన్న అనుమానం కుల పెద్ద అయిన వీరరాఘవుడు వ్యక్తం చేశాడు. పరమయ్య కల్పించుకొని “ఇగో నాకీ అనుమానం పొద్దుటే కలిగింది. మన శివారు పల్లెలో సింగయ్య అనే అతను నా బాల్య స్నేహితుడు ఇటువంటి కార్యక్రమాలు ముచ్చటంగా ముచ్చటగా మాట రాకుండా అందరూ సరే అనేట్టు చేస్తాడు. తప్పకపోతే తలకొరివి కూడా వాడే పెట్టి మమ అనిపిస్తడు. అయితే వాని కైన కర్చులు(శవ దహనం దగ్గర పూర్తయిన దాకా) మనం ఇయ్యాల. కొందరిని అయితే అంత కావలా ఇంత కావాలా అని లెక్క చెప్పి మరీ తీసుకుంటడు. అతనికి కబురు చేశాను. వస్తుంటడు. నాకు బాగా అయినవాడు కనుక మట్టంగ కర్చు పెట్టి పని పూర్తి చేస్తడు. లెక్కలు రశీదులు మనకిస్తడు. ఏమంటరు” అనగానే ఉన్న  నలుగురు అ… సరే అన్నారు. ఇంతలో సింగయ్య రానే వచ్చిండు. అతనిని దగ్గరకు రమ్మని పిలిచి విషయం చెప్పి ఇది నా పని జాగ్రత్తగ పూర్తి చేయమని అనగానే అంతా గుడిసె దగ్గరున్న శవం దగ్గరకు వచ్చారు. జనం చాలా మంది మూగి కనిపించారు.

“ఇక నేను పని ప్రారంభిస్తా, కాని మొదట్లో 3000 ఇవ్వండి” అనగానే పరమయ్య తన దగ్గరున్న ‘3000’ ఆ సింగన్నకిచ్చాడు. ‘మొదటనే ఇంతనా,’ అని గునిసాడు వెంకన్న.

“ఆయ్యా మీరు నలుగురు కూర్చోండి. నాకో మనిషి నివ్వండి. మీ ఎదురుగనే పట్టీ రాసి తెప్పిస్తా” అని చదువుకున్న ఓ పోరడ్ని పిలిచ్చి. పట్టీ, చెప్పిండు. పట్టీ వ్రాసే ముందు ‘ఆడ మనిషే కదా’ అని అడిగిండు. శంకరయ్య “కర్చున ఆడ మగకి తేడాలుంటయా” అని అడగబట్టిండు అదోలా చూస్తూ.

“చెపుతా చూడు! ఎవళ్ళకేం కావాలో నీకే సమజయితది” అని పోరడకి సైగ చేసి “ఇక రాసుకో” అని – ఓ పాత టైరు, అరడబ్బా కిరసినాయిలు, పసుపు, కుంకుమ, గులాలు, పేలాలూ, సెంటు. నాలుగు గంధపు చెక్కలు 20 రూపాయల చిల్లర. పైన కప్పెందుకు తెల్ల గుడ్డ, ఆడమనిషి కనుక కోక, పాడెకు సరిపడ బొంగులు, కుండ, పది గజాల కొబ్బరి తాడు. ఓ అగ్గి పెట్టె. నలుగురు ఎట్లోండ్లు (వాని రోజువారి కూలి), చప్పుడు చేసేందుకు రెండు డప్పులు, కట్టెలు స్మశానాన కాష్టం పేర్చుడు. జీవి కట్టె తీసికపోయి పోసెటోడికి కూలి (50/-), తలకొరివి పెట్టినోడికి (100/-)” అని ఆగి పరమయ్యను చూస్తూ “ఆ దగ్గరన నీళ్లున్నాయి కదా” అని అడిగాడు. “ఆ పెద్ద బావి ఉంది”. అక్కడ నుంచి దేవుడి గుడికి పోయి దండం పెట్టేందుకు – అర కిలో బెల్లం, 3 కొబ్బరికాయలు. ఊదుబత్తీలూ” ఇంత వరకు పోయి తీసుకరమ్మని ఆ పోరడికి చెప్పటంతో కొందరు నోరెల్లబెటి చూడమే సరిపోయింది. “ఆ మర్చిపోయా” అని రాఘవుడి వైపు చూసి “ఆ మనిషి (శవం) బరువు ఎంతుంటుందో?” అని చూశాడు. ఆ 50 కేజీలు కంటే ఎక్కువ ఉండదని రాఘవుడు అన్నాడు. పుల్లన్న బరువెందుకో అన్నట్టు చూశాడు. “అవును ఆ బరువును బట్టే కట్టెలు కొనాల్సొస్తది” అని చెప్పి సింగయ్య తన పనిలో నిమగ్నమవుతూ “నేను పిలిచినప్పుడు వచ్చి సాయంగా నిలబడండి, మీకు తోచింది చెప్పతు రాకండి” అన్నాడు. ఆ మాట అనగానే మేము సిద్ధం అన్నట్టు నలుగురు ఊరి వాళ్లు దాపు కొచ్చారు…

కాటి దగ్గరకు పంపే వాళ్లకు కట్టెల పని అప్పగించి ఓ వయసు పోరడ్ని పిలిచి నువ్వు స్నానం చేసి స్మసానానికి ఎళ్లి జీవి కట్టె వేసిరా. ఆ కట్టె నువ్వు వేసిన కాడే కాష్టం పేరుస్తారు. అని సాకలి మంగయ్యను పిలిచి కొంత డచ్చిచ్చి సరుకులు తెచ్చందుకు పంపుతూ “ఇవన్నీ కస్బా బజార్‌న ఉండే కొట్టులో దొరుకుతయి, నాలుగు దుకాణాలు తిరగాల్సిన పని లేదు. ఆ మర్చిపోయా, ‘టంకయ్య దుకాణం’ అంటే అక్కడ ఎవరైనా చెప్తారు. నేను పంపానని చెప్పు. ఇవి అన్ని వస్తువులు ప్యాక్ చేసి ఇస్తారు. అవి పట్టుకొని త్వరగా రా!  నువ్వొస్తేనే పని మొదలవుద్ది. పొద్దు వాలక ముందే పాడెకు అగ్గి తగిలించాలి”  అని చెప్పి మరో వైపుకెళ్ళాడు సింగయ్య. ఊరి జనం అతన్ని చూడటమే సరిపోయింది. అన్నీ అమర్చుకొని ఏ హడావుడి లేకుండా, పద్ధతిగా పూర్తిగాచేయటం చిత్రంగా అనిపించింది. క్రతువు పూర్తయిన తర్వాత స్నానాలు పూర్తి చేసి గుడి మందుకు చేరారు. ఓ పది కేజీల బియ్యం ఎసట్లో వేసి పప్పు, పులు అప్పడాలు వేయించి కాటి వద్ద నుంచి వచ్చిన నలుగురుకి చేయి కూడా కడిగించాడు.

***

పరమయ్య దగ్గరకు వచ్చిన సింగయ్య ఆయన చూట్టూ ఉన్న నలుగురిని చూస్తూ “మీరు చెప్పిన ప్రకారం పద్ధతిగా నా శక్తి మేరా చాతనయిన రీతిన పనిని ముగించాను. మీకెక్కడయినా అసంతృప్తిగా అనిపించినట్లుంటే మీ ఆత్మీయునిగా స్నేహితునిగా మన్నించండి” అని; “ఇక నాకు సెలవు ఇప్పిస్తే నాతో పనైపోయింది గనుక బయలుదేరతా” అన్నాడు వినయంగా. జరిపిన తంతుకు అయిన ఖర్చంతా కాగితం పై వివరంగా రాసి పరమయ్య చేతికి ఇచ్చాడు. అంతా కలిసి 4456/- అయింది. రాగానే ఇచ్చిన 3 వేలు రూపాయలు పోను 1456/- రావాల్సివస్తుంది. పట్టి పరిశీలించిన పెద్ద మనుషులు సింగయ్య వంక సంతృప్తిగా చూస్తూ సంతోషంగా మిగిలిన పైసలు ఇచ్చారు. పరమయ్య సింగయ్యకు వీడుకోలు చెప్తూ “నాకున్న అనుమానం, ఈ పద్ధతి ఎట్లా పడ్డుబడ్డదిరా. ఇంత సక్రమంగా ఓర్పుగా ఇందరి మధ్యన మెలుగుతూ నిర్వహించటం కష్టం కదా” అనగానే పరమయ్య ఎదురుగా చతికెల పడుతూ “చెప్తారా అంతా మూడు ముక్కల్లో పూర్తి చేస్తా. స్నేహంగా అడిగావు కదా. మనిద్దరం దుర్గయ్య పంతులు దగ్గర కొంతకాలం అక్షరాలు దిద్దాం కదా. మాది విశ్వ బ్రాహ్మణ కుటుంబం. మా తండ్రి వడ్రంగం పని చేసేవాడు. సాలుకింతని ‘అరకల’ లెక్కన రైతులు ధాన్యం ఇచ్చేవారు. అది మా జీవనానికి కటాబోటిగ సరిపోతుండేది. మా అమ్మకు మేం నలుగురు సంతానం. నేను పెద్దవాడిని. నాకు ‘ఒడుగు’ అయిన తదుపరి పని నేర్చుకుందాం అనుకుటుండగా అకాలంగా ‘పాము’ కాటుకు గురై మా తండ్రి కాలం చేశాడు. ఇంత ఆర్జించి కుటుంబాన్ని పోషించే నాన్న గతించాక రోడ్డున పడ్డది మా కుటుంబం. కాకపోతే తలదాచుకునేందుకు సొంత ఇల్లు ఉంది. వేరుగా ఆస్తిపాస్తులేవు. అయితే నాన్న పోయినా ఆ సాలుకు ఇవ్వాల్సిన ‘ధాతి మేర అరకల’ వారిగా మా రైతులు ఇంటికి పంపారు. అది కొన్ని దినాలకు ఆధారమయింది. ఇక భవిష్యత్తు అన్న  ప్రశ్న నన్ను తొలిచింది. నీకు తెలుసు నేను చదివింది వానాకాలం చదువేనని. ధాలి వద్ద పని చేద్దామంటే పని రాదు. కనుక ఆలోచనలో పడ్డాను.

మా బంధువుల్లో బ్రహ్మం అనే ఆయన నలుగురైదుగురిని పెట్టుకుని వంటలు చేస్తుండేవారు. ఆయన దగ్గర చేరి పని నేర్చుకొని శ్రద్ధగా మెలిగా. వంటలు చేయటంలో రెండో వానిగా ప్రావిణ్యం సంపాదించా. ఆయన పెళ్లిల్లు, దినాలు, పెద్ద పెద్ద విందులు ఒప్పుకొని ‘శభాష్’ అనిపించుకున్నాడు. వృత్తిన నేను బాగా అధ్యయనం చేశా. పరిచయాలు పెంచుకున్నా. స్వతంత్రంగా కూడా వంటలు చేయగలను అనే స్థాయికి చేరుకున్నాను. ఈ స్థితి ఇలా ఉంటే మా బ్రహ్మంగారికి అస్వస్థత దాపరించింది. ఆయన పేరుననే ఆ సాలంతా పని చేశాను, ఆయన పూర్తిగా రాలేకపోయినా. ఈ కాలం నాకు పరిచయాలని చాలా పెంచింది. ఆయన చనిపోయాడు. అక్కడ పని చేసిన నలుగురైదుగురు తలా ఒక తీరుగా సొంతంగా చేసుకోవడానికి వెళ్ళారు. వృత్తిని మాత్రం వదలలేదు నేను. ఆ వరవడిన ఆరు మాసాలు చేశాను. నేను చేసుకోకపోతే కుటుంబం గడవదు కదా. అయితే, ఈ కొద్ది కాలంలోనే వృత్తి తరీఖాను మార్చాను. అందుకు కారణం, మా పల్లెన ఓ దిక్కులేని వాడు చనిపోవడం. అక్కడి పెద్దలు సామూహికంగా చందాలు వేసుకొని దహనం చేయటం. ఇదే వృత్తిగా స్వీకరిస్తే మానసికంగా కొంత సంతృప్తిగా సేవ చేయగలుగుతాను, నా భుక్తి డోకా లేకుండా నడుస్తుంది అనిపించి అలా ప్రారంభించాను. నాకున్న పరిచయాల వల్ల ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పిలవడం మొదలు పెట్టారు.  ఇప్పుడు వారికి, నాకు సంతృప్తిగానే ఉంది. అయతే ఆ తరువాత నేను దహన సంస్కారాలలో రీతులు గమనించాను. అది వారి ఆచార వ్యవహారాలను బట్టి, మతాల తీరులలు బట్టి, ఆ మతాలను అనుసరించేవారి భిన్నమైన ఆచార్య వ్యవహారాలను గమనించడం కాక కళ్లతో చూశా. మనలోని కొందరిని భూమిన పాతి పెడతారు. అందులో కొందరిని కూర్చోబెట్టి మరీ. కొందరిని బోర్లా పడుకోబెట్టి మరీ పూడుస్తారు. పెళ్లి పెటాకులైన ఎక్కువ మందిని కాలుస్తారు. అదే పెళ్లికాని వారిని అదే బ్రహ్మచారులను పసివాళ్లను పూడుస్తారు. జైనులలో వింత ఆచారం కనిపిస్తది. శవాన్ని వారు ఖననం చేయరు. వారి నిర్ణీత స్మశాన వాటికన అన్ని అలంకారాలు చేసి కొన్ని తిండి పదార్థాలను పక్కన నుంచి వదిలేస్తారు. రాబందులొచ్చి(పెద్ద పక్షులు) పీక్కుతింటాయి. సాహెబులో ఒక పద్ధతి, కిరస్తానంలో ఒక పద్ధతి. ఇంకా అనేక విధాలుగా చేస్తారు. ఇంత వరకే నాకు తెలుసు. తెలిసిన పద్దతిలోనే చేస్తుంటా.

పైసలు దుబారా చేయను. పొదుపుగా కర్చు ముగించి నేకు సహాయం చేస్తున్నాను అన్న సంతృప్తితో జీవనయానం గడుపుతున్నాను. ఇప్పటికీ సజావుగానే నా యాత్ర సాగుతుంది. తృప్తిగాను ఉంది. భగవదేచ్ఛ అనుకునే నడుస్తున్నాను. ఇక సెలవు తీసుకొంటా. సందర్భం వచ్చినప్పుడు గుర్తుంటుకోండి” అని లేచాడు. చివరగా నమస్కరించి “ఈ క్రతువులో నాకు రోజు కూలీ మిగిలితే చాలు. చాల ఆనందపడతాను. కొన్ని చోట ఎదురు పడతయి. అయినా భరిస్తా. నమస్తే. ఇక సెలవు. ఇదే నావృత్తి” అని వెనుదిరిగాడు. నావెంట అయిదారుగు చాలా దూరం వచ్చి వెనుదిరిగారు. వారి ముఖాల్లో కనిపించే సంతృప్తి నన్ను అనాయాసంగా నడిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here