Site icon Sanchika

ఇదిగిదిగో ఈవైపొకసారి చూడండి!..

[ఇటీవల జహీరాబాదులో జరిగిన పిల్లల పండుగ గురించి వివరిస్తున్నారు శ్రీమతి అనూరాధ నాదెళ్ళ.]

[dropcap]ఈ[/dropcap] నేల, ఈ ఆకాశం, ఈ గాలి, ఈ ప్రవహించే నది, ఆ గోరువెచ్చని సూర్యుడు, ఆ వెన్నెల కురిపించే చంద్రుడు, ఆ చెట్టు, ఈ పిట్ట, ఈ పువ్వులు, ఆ నవ్వులు, ఈ కేరింతలు, ఇన్నిన్ని ఆనందాలు.. ఎవరివి? ఎవరి కోసం? మన కోసమే, మనందరివీనూ అంటారా?! నిజమే. అవన్నీ అచ్చంగా మనవే. అవునూ, అవన్నీ కలగలిసి ఒక్కచోట పోగుపడి ఒక అందమైన రూపం తొడుక్కుని మన ఎదురుగా, మనతోనే, మన మధ్యనే ఉందంటే అదేమిటంటారు?? ఒక్కసారి ఆలోచించండి.

నిర్మలమైన నవ్వులతో, అమాయకమైన చూపులతో, అల్లరి చేష్టలతో, అంతులేని చైతన్యంతో మన చుట్టూ పరుచుకున్న ప్రపంచం మీ కళ్ల ముందు సాక్షాత్కరించట్లేదూ? ఆ దొంగ నవ్వులు, ఆ పిచ్చి అల్లరి, ఆ తీరని అలకలు, ఆ అర్థంలేని(?) పేచీలు, ఆ మాయలు ఎవరివి? వాటి బారిన పడకుండా తప్పించుకోగలగడం ఎవరి తరం? అర్థమైంది కదూ ఇదంతా మన చుట్టూ ఉన్న పిల్లల ప్రపంచమన్నది!

అనగనగా బోలెడు బుజ్జిబుజ్జి పిల్లలు! అంటే, అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా. ప్రపంచానికి ఇంత అందం ఆకర్షణ, ప్రకృతికి నిరంతర చైతన్యం వాళ్లే కదూ ఇచ్చేది! వాళ్లని ప్రేమించకుండా ఉండగలగటం సాధ్యమే?! సాధ్యం కాదని మనకి తెలుసు. వాళ్లని ప్రేమిస్తాం. ప్రేమించేం కనుక, పెద్దలం కనుక, వాళ్లకంటే శారీరకంగా బలవంతులం కనుక పెత్తనం తీసుకుని వాళ్లని ఏదో అద్భుతమైన వ్యక్తులుగా ప్రపంచానికి అందించేద్దామని బోలెడు పథకాలు వేసేస్తుంటాం. ఎన్నెన్నో ఆలోచనలు చేసేసి వాళ్లని పంజరాల్లో చిలకల్ని చేసి, వాళ్లకి నడకలు నేర్పుతున్నామని, గొప్ప వాళ్ళని చేస్తున్నామని గర్వపడిపోతాం. కానీ మనం ఎవరం అవన్నీ చేసేసేందుకు అని ఒక్కసారి ప్రశ్నించుకోం. అది అజ్ఞానం వల్లనో, అహంకారం వల్లనో?!

పిల్లలు చెప్పే తియ్యని కబుర్లు, వాళ్ల కమ్మని కలలు, ఆశలు, ఇష్టాలు, అయిష్టాలు వినే తీరిక మనకుండదు. వాళ్లని గొంతులు విప్పనివ్వం. తూనీగ వెంట పరుగులెత్తనివ్వం. పెరట్లోనో, బాల్కనీ కుండీలోనో చిగురించే చిన్ని మొక్కని చూడనివ్వం. చెట్టు మీద పాట పాడే పిట్టని చూడనివ్వం. సమయం లేదు. ఎంతసేపూ వాళ్లకి ఏమి కావాలో మనం నిర్ణయించి, నియంత్రిస్తాం. నియంతలైన మన మధ్య వాళ్ల చిన్నబోయిన ముఖాల్ని పట్టించుకోం. స్వేచ్ఛగా అందమైన లోకంలోకి వచ్చిన వాళ్ల హాయిని హరించేసి క్రమశిక్షణ భలేగా నేర్పేస్తాం.

అదిగో నడక నేర్పేం, బడిలో వేసేం, పరుగందుకో అంటూ వెంటపడతాం. మనం నెరవేర్చుకోలేక పోయిన కలల్ని నెరవేర్చమని ఆంక్షలు విధిస్తాం. వాళ్లకి బడి వాకిట్లోంచే ప్రపంచం అంటే విసుగు, క్రమశిక్షణ అంటే కోపం మొదలవుతాయి. బడి అంటే ప్రశ్నించకుండానే నేర్చుకోవటం, అవగాహన లేకుండానే పరీక్షలు పాసవటం, ఇంకా పెద్ద పరీక్షలు పాసవటం..ఇంతే! అబ్బ, ఎంత నిస్సారమైన జీవితాల్ని రాస్తున్నాం పిల్లల కోసం?! పెద్దలమైనంత మాత్రాన మనకెవరిచ్చారు ఈ హక్కు? ఇదేం హక్కు? హక్కంటే తీసుకోవటమేనా? మరి పిల్లలకి ఏమిస్తున్నాం? హాయిగా ఆడి, పాడి, నవ్వే సమయాన్ని ఇవ్వని మనం వాళ్లని నిజంగానే ప్రేమిస్తున్నామా? హిపోక్రసీ అంటే..?!

ఇంత ఘోష ఎందుకంటారా? ఇప్పటి పిల్లల్ని, వాళ్ల కళ్లల్లోని దిగుల్ని, ప్రశ్నల్ని మనం చూస్తూనే ఉన్నాం. కొందరు అలా చూసి ఊరుకోకుండా ఏదైనా చేసి వాళ్ల ముఖాల్లో సంతోషాల్ని, వెలుగుల్ని తెచ్చేందుకు ఏవేవో చేస్తున్నారు. రెండు, మూడు దశాబ్దాలుగా పిల్లల కోసం మంచి మనసున్న కొందరు ఒక కొత్త పండుగని కనిపెట్టారు. మనకి బోలెడు పండుగలున్నాయి. ఒక పెద్దాయన పుట్టినరోజుని తలుచుకుని చేసే పిల్లల పండుగ కూడా ఉంది. నేను ఇప్పుడు చెప్పే పండుగ ఇవేవీ కాదు. ఈ కొత్త పండుగ కోసం ఎక్కడెక్కడి పిల్లల్నీ రారమ్మంటూ పిలిచి, వాళ్లకిష్టమైన ఆటల్ని, పాటల్ని, కథల్ని, బొమ్మల్ని, దేన్నైనా వాళ్ల ఊహల్లోంచి తయారు చెయ్యమని ఒక వేదిక అందించి, వాళ్లల్లో ఉన్న సహజమైన ప్రతిభని తవ్వి తీస్తున్నారు. ఇదేదో బావుంది కదూ. అప్పుడెప్పుడో నేను, నాలాటివాళ్లు పిల్లలుగా ఉన్నప్పుడు మాకే దిగుళ్లు, బెంగలు లేవు. బడికి హాయిగా ఆడుతూ, పాడుతూ వెళ్లాం. ఆనక ఇంటికొచ్చి ఆటలాడుకున్నాం. చదువులూ చదువుకున్నాం. అప్పుడిలాటి పండుగ లేదు, అవసరపడనే లేదు.

అన్నట్టు ఈ మధ్య జహీరాబాద్‌లో పిల్లల పండుగ జరుగుతోందంటే వెళ్లాను. ఇంకా మరికొన్ని పిల్లల పండుగల్నీ చూసొచ్చాను. నాకు ఇక్కడొక రహస్యం అర్థమైంది..

ఇక్కడ వేలల్లో కనిపించిన పిల్లలను మించి వాళ్ల పెద్దల్ని చూసాను. వాళ్ల ముఖాల్లోనూ పిల్లల ముఖాల్లో కనిపించిన ఆనందమే కనిపించటం చూసాను. తమ దైనందిన జీవితాల్లోంచి పెద్దలు ఒక ఆటవిడుపును కనిపెట్టారు. ఒత్తిడి ఎరుగని అందమైన ప్రపంచంలోకి అడుగు పెట్టారు. తమ పిల్లల్లోని స్వయం ప్రతిభ తాము ఇన్నాళ్లూ కనిపెట్టలేక పోయారన్న విస్మయంతో చూసారు. వాళ్లని ప్రయోజకుల్ని చేసే బాధ్యత తమదన్న గర్వం, పెద్దరికం సిగ్గుపడింది. ఇంతకీ ఇది ఎవరి పండుగ? పిల్లలదా, పెద్దలదా? ఎవరు ఎవరికి గురువులవుతున్నారు? పెద్దలా, పిల్లలా? పిల్లలు ప్రకృతి లాగే ఇవ్వటం తెలిసినవాళ్లు! పెద్దలం ఎప్పటికి ఈ సూత్రాన్ని నేర్చుకుంటాం?

జహీరాబాద్ తెలంగాణాలో ఒక చిన్న పట్టణం. దాదాపు 60 వేల ప్రజలుంటారు కాబోలు. నిశ్శబ్దంగా, తన మానాన తను బతికేస్తున్న పట్టణం. ఇక్కడ జరిగిన పిల్లల పండుగకి రాష్ట్రంలోను, పక్క రాష్ట్రంలోనూ ఉన్న అనేక మంది పిల్లలు తమ పెద్దలతో వచ్చి రకరకాల ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. రంగురంగుల పువ్వులతో, పక్షులతో కళకళ లాడుతున్న తోట కంటి ముందు ఆవిష్కరించబడింది. సంగీతం, జానపద గీతాలు, కథ చెప్పటం, కథ రాయటం, బొమ్మలు వెయ్యటం, కాగితంతో బొమ్మలు చెయ్యటం, మట్టితో బొమ్మలు చెయ్యటం, ఏకపాత్రాభినయం, జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యం, స్పెల్ బి, ఫ్యాన్సీ డ్రెస్ పోటీ, ఇలా రకరకాల అంశాల్లో పిల్లల్ని జూనియర్లు, సబ్ జూనియర్లు, సీనియర్లుగా విభజించి పోటీలు నిర్వహించారు. ఆయా అంశాల్లో నిష్ణాతులైన వాళ్లు స్వచ్ఛందంగా వచ్చి వీటిని నిర్వహించారు. పిల్లలు వ్యర్థ పదార్థాలతో అందమైన బొమ్మల్ని తయారు చేసారు. ఇవన్నీ ఈ పిల్లలకి ఎవరు నేర్పిస్తున్నారు?

అనవసరమైన, అనారోగ్యకరమైన విషయాల వైపు మళ్లకుండా పిల్లలకి ప్రయోజనకరమైన, ఆరోగ్యకరమైన జీవన శైలిని నేర్పుతున్నదెవరు? అభివృద్ధి చెందినవని చెప్పుకునే కొన్ని జిల్లాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ పిల్లలకున్న అవకాశాలు వేరు. అవి అందని ఈ ప్రాంతపు పిల్లల కోసం ఎవరు తాపత్రయ పడుతున్నారు? ఒక ప్రాంతం భౌగోళికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు. సామాజిక అసమతౌల్యం ఉండి ఉండొచ్చు. కానీ పిల్లల్లో ప్రతిభ ఏ ఒక్క ప్రాంతానిదో, ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదు కదా.

ఇక్కడ ఒక ఉదాహరణ చెపుతాను. జహీరాబాద్ పిల్లల పండుగకి వెళ్లి అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికుల కాలనీలో పిల్లల్ని పలకరించాం నాతోపాటుగా మరికొందరం. వారికోసం సాయంకాలాలు ఉచితంగా నడపబడుతున్న ట్యూషన్ సెంటర్ చూసాం. అక్కడ నవీన్లు, వరుణ్‌లు, తేజ లు, జ్యీతి లు, షర్మిల లు.. అందరూ ప్రపంచంలోని పిల్లల్నే ప్రతిబింబిస్తున్నారు. బోలెడు కలలు కంటున్నారు. బోలెడు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. బోలెడు నాయకత్వ లక్షణాల్ని కలిగి ఉన్నారు. ఆ పిల్లలు ఏడాది క్రితం వరకూ బడి ముఖం ఎరుగరంటే నమ్మలేం. వారంతా వలస కార్మికుల పిల్లలు. వారిలో పదేళ్ల వయసు పైబడిన వాళ్లూ ఉన్నారు. కానీ ఈ ఏడాదిగా బడిలో వాళ్లు చూసినది, నేర్చుకున్నది తక్కువది కాదు. వాళ్ల చురుకుదనం, తెలివితేటలు, చైతన్యం చూస్తే వారి భవిష్యత్తు పట్ల మాత్రమే కాదు, ఆ ప్రాంతం, దేశం భవిష్యత్తు పట్ల కూడా బోలెడంత నమ్మకం కుదిరింది. అమాయకమైన ఆ పసివాళ్ల ఆశక్తులు, ఆశలు రేపు ఏ ప్రయోగాల వైపు, ఏ విజయాల వైపు నడిపిస్తాయో కదా. ఆ పిల్లల్లో తమపైన తమకి నమ్మకాన్ని కలిగిస్తున్న వారి గురించి చెప్పుకోవాలి..

దీనికంతకూ నేపథ్యంగా జహీరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలకి వేసవి శిబిరాల్ని నిర్వహిస్తూ అనేక రకాలైన అంశాల్లో శిక్షణ అందిస్తున్న ఒక జంట గురించి చెప్పుకోవాలి. వాళ్లు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శివబాబు గార్లు. జహీరాబాద్ పిల్లల పండుగ వెనుక ఉన్నది పిల్లల పట్ల వారికున్న అతి చిక్కని ప్రేమ! వారి ఆసక్తి, అభిరుచుల్ని పంచుకోగలిగే మిత్రులను పోగుచేసుకుంటూ చుట్టూ ఉన్న సమాజానికి ఒక కొత్త చైతన్యాన్ని, రాబోయే తరానికి ఒక స్ఫూర్తిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నట్టు పైన చెప్పిన పారిశుద్ధ్య కార్మికుల పిల్లల బడి చదువులకి కూడా కారకులు ఈ డాక్టర్లే. వీరి వెనుక వీరి పెద్దలు, కుటుంబ సభ్యులు బలంగా ఉన్నారు. వారు చూపిన దారుల్లోని దార్శనికత ఈ డాక్టర్లకి మార్గదర్శకమైంది. ఆ దారులన్నీ పిల్లల ఆదర్శవంతమైన భవిష్యత్తులోకే.

వీళ్ల ప్రయత్నం చూసి, మేమూ వస్తున్నామంటూ ఎందరో పిల్లల ప్రేమికులు వచ్చేసారు. తరచుగా వినిపించే కొన్ని పేర్లను మాత్రం మచ్చుకి చెపుతాను. ఎందుకంటే అందరినీ పేరుపేరునా చెప్పాలంటే వ్యాసం సుదీర్ఘమవుతుంది. అయినా వాళ్లు తమ పేర్లనీ, తమ అస్తిత్వాన్ని ఆ పిల్లల ప్రపంచంలో ఎప్పుడో మరిచేపోయారు.

అన్నవరపు కుటుంబ సభ్యులు, కాళిదాసు గారు, సి. ఎ. ప్రసాద్ గారు, చిత్రకారుడు అన్వర్, మంచి పుస్తకం సురేష్, భాగ్యలక్ష్మిగార్లు, చిత్రకారుడు అడవిరాముడు, రకరకాల బొమ్మల్ని, విద్యల్ని నేర్పే ఫయాజ్, ఇంకా ఎందరో టీచర్లు, ప్రొఫెసర్లు, రచయితలు, డాక్టర్లు..ఒకరేమిటి అన్నిరంగాల్లోని ప్రముఖులు వచ్చేసారు. వాళ్ల వాళ్ల స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని కూడా వెంటబెట్టుకుని మరీ వచ్చేసారు. పిల్లల కోసం తమ పనులన్నీ పక్కన పెట్టి మరీ వచ్చారు. ఈ పండుగ విశేషం ఇంతకంటే ప్రత్యేకంగా ఏం చెప్పాలి?

జహీరాబాద్ ఆనందంతో పులకించింది. పిల్లల కోసం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినందుకు ఆ చిన్ని పట్టణం కొంచెం.. కొంచెంగానైనా గర్వపడింది! చరిత్రలో తన పేరుని పది కాలాల పాటు నిలబెట్టుకోబోతున్నందుకు నిటారుగా నిలబడి, గట్టిగా ఊపిరి తీసుకుంటోంది. రాబోయే కాలంలో ఇక్కడి పిల్లలు ఎన్నెన్ని అద్భుతాలు చేస్తారో, ఏయే ఆవిష్కరణలు చేస్తారో చూడాలని ఉంది. దానికి తగిన భూమిక, ఒక వాతావరణం ఇప్పటికే అక్కడ తయారైంది. ఊరు ఊరంతా పండుగ సంబరంలో మునిగిపోయింది. కావాలంటే ఈ ఫోటోలు చూడండి. పిల్లలకి, వారి వెనుక ఉన్న డాక్టర్ దంపతులకి జేజేలు!

ఇప్పుడు చెప్పండి ఇది ఎవరి పండుగ? ఇంత ఆనందాన్ని ప్రపంచానికి, పెద్దలకి పంచిచ్చిన ఈ పిల్లల్ని ఏమందాం? వచ్చే ఏడు మీరూ వచ్చి చూడండి. నేను చెప్పిన దాంట్లో అతిశయమేదైనా ఉంటే అడగండి మరి.

Exit mobile version