ఇక్కడంతా క్షేమం

0
2

[డా. చెంగల్వ రామలక్ష్మి రచించిన ‘ఇక్కడంతా క్షేమం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]మ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే నాకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. మాటల్లో కొలవలేనిది. వాట్సప్‌లో వీడియోలో చూస్తూ మాట్లాడే అవకాశాలున్న ఈ రోజుల్లో కూడా అమ్మ ఫోన్‌లో ఎక్కువ మాట్లాడదు. అత్యవసరంగా ఏమైనా చెప్పవలసి వస్తేనే చేస్తుంది. పది, పదిహేను రోజులకోసారి అన్ని విశేషాలతో, అందరి విషయాలతో సమగ్రంగా ఉత్తరం రాస్తుంది. అమ్మ ఉత్తరానికి అంత గొప్పగా రాయలేకపోయినా నేను రాస్తుంటాను. ఎందుకంటే అమ్మ ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడదుగా!

అమ్మ ఉత్తరం బాంధవ్యాల విలువల పుస్తకం! నడి వేసవిలో కురిసే చిరుజల్లు! అమ్మ ఉత్తరం కవిత్వ పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. కథలు చెపుతుంది. నవలలా ఆపకుండా చదివిస్తుంది.

అమ్మ ఉత్తరం పోస్టు లోనే వస్తుంది. ఆమెకు ఫోనులో టైపు చేయటం వచ్చు. అయినా ఆమెకది ఇష్టం ఉండదు. అమ్మకి పుస్తకాలు చదవటం ఇష్టం. మనుషులతో ఎదురుగా కూర్చుని మాట్లాడటం ఇష్టం.

నాన్న ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగా చేసారు. ఆయన రిటైర్ అయ్యాకే పోయారు.

అమ్మ, ఇద్దరు పిన్నులు, ముగ్గురు పెద్దమ్మలు, మామయ్యలు అందరూ పల్లెటూళ్ళో ఒకే వీధిలో దగ్గర దగ్గరగా, మనసుకు దగ్గరగా, ఒకరికొకరు తోడు నీడగా, అండదండలుగా, ఆనందంగా ఉంటున్నారు. అమ్మకు పెన్షన్, పల్లెటూళ్ళో రెండు గదుల పెంకుటిల్లే ఆధారం. నాన్న పోయాక, అందరి మధ్య ఉంటే బాగుంటుందని అక్కడికి వెళ్ళొపోయింది. అదీ మంచిదే. నేను మావారి ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉంటున్నాను. ఇద్దరు పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. ఏడాదికోసారి మాత్రమే అమ్మ దగ్గరికి వెళ్ళగలను. ఈ ఉత్తరాలే అమ్మ దగ్గర లేదనే బాధను దూరం చేస్తాయి. ఉత్తరం చదువుదామా!

“ప్రియమైన చిన్ని,

నువ్వూ, అల్లుడు పిల్లలు బాగున్నారని తలుస్తాను. ఇక్కడంతా క్షేమం. నా ఆరోగ్యం బాగానే ఉంది.

చిన్న పిన్ని వాళ్ళమ్మాయిని చూసుకోవటానికి పెళ్లివారొచ్చారు. అబ్బాయిది మంచి ఉద్యోగమే! పెళ్లికూతురు రాణి ఎంత బాగుంటుందో నీకు తెలుసుగా! వాళ్ళకి అమ్మాయి నచ్చింది. కాని, వీళ్లిచ్చే కట్నమే నచ్చట్లేదు. వాళ్ళ కోరికలు కూడా గుర్రాలెక్కుతున్నాయి. బాబాయి ఈ సంబంధం తూగలేమేమోనని బాధ పడుతున్నాడు. అందరం తలో చెయ్యి వేద్దామన్నా మా అందరి పరిస్థితి అంతంత మాత్రమే! ఏమవుతుందో మరి!

చిన్న మామయ్య కూతురు సుమకు ఐదవ నెల. బలహీనంగా ఉంది. ఇక్కడుంటే విశ్రాంతిగా ఉంటుందని మామయ్య, వాళ్ళ అత్తింటి వాళ్ళ నడిగి నిన్నే తీసుకువచ్చాడు. దానికి వేవిళ్ళు. తిన్నదేదీ ఇమడట్లేదు. మామయ్య కొడుకు రవి ఉద్యోగం పోయింది. కరోనా సృష్టించిన కల్లోలంలో వాళ్ళ ఆఫీస్‌లో కొంతమందిని తీసేసారుట. తరవాత కబురు చేస్తామన్నారు. కరోనా కష్ట పర్వం ముగిసాక కూడా పిలవలేదు. ఇంక నమ్మకం లేక కొత్త వాటికి అప్లికేషన్లు పెడుతూ ఇక్కడే ఉన్నాడు. వాడి పరిస్థితి చూసి మామయ్యకు బి.పి. షుగర్ పెరిగిపోతున్నాయి.

ఈ మధ్య వచ్చిన తుఫాన్ సృష్టించిన బీభత్సానికి పంటలన్నీ కొట్టుకుపోయాయి. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా ఆలోచించాల్సి వస్తోంది.

పెద్ద మామయ్య బావమరిది సుందరయ్య హైదరాబాద్‌లో ఉంటాడు. నీకూ తెలుసుగా! ఎంతో జాగ్రతగా ఉంటాడు. మాస్కులు పెట్టుకుని, శానిటైజర్లు రాసుకుని, భౌతిక దూరం పాటిస్తూ ఉద్యోగానికి వెళ్లినా ఎలా వచ్చిందో, ఎవరి వల్ల అంటుకుందో కాని కరోనా ఎక్కువగానే వచ్చింది. హాస్పిటల్‌లో జీవన పోరాటం చేసి గెలిచి బతికాడు. కాని, తరవాత చాలా ఆరోగ్య సమస్యలు వచ్చేసాయి. గుండె జబ్బు వచ్చింది. పెద్దత్తయ్య తమ్ముణ్ణి తలచుకుని రోజూ బాధ పడుతుంది.

పెద్దమ్మ వాళ్ళింట్లో అంటు కట్టించిన పసుపు గులాబీ ఈ మధ్య తెచ్చి మనింట్లో పాతాను. నిన్ననే పువ్వు పూసింది. ఎంత బాగుందనుకున్నావు! పెద్ద పువ్వు. మొక్కకే కాదు, నా చిన్న పూలతోటకే కొత్త అందం వచ్చింది. కోయాలనిపించలేదు. కాని, పక్కసందులో కృష్ణవేణి వచ్చి చూసిందంటే ఊరుకోదు. తల్లో పెట్టుకుంటా ఇమ్మంటుంది. కాదనలేను. అందుకని, మొదటి పువ్వు దేవుడికి పెడదామని కోసి వెంకటేశ్వర స్వామికి పెట్టాను. మణి ద్వీపవాసిని పూజకని పెద్ద పిన్ని మనింట్లోవే శంఖం పూలు, నిత్య మల్లి, చుక్క మల్లి పూలు కోసుకెళ్ళింది. తనని చూసి చిన్న పిన్ని నేనూ చేస్తాను, ఈసారి నేను కోసుకుంటాను అంది. పువ్వులు బాగా పూస్తున్నాయి. నేను మాత్రం ఎన్నని చేస్తాను? మనింట్లో పూలు వాళ్ళకి ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉంది. రంగు రంగుల పూలతో తోట కళకళలాడుతోంది. ఏ విచార వార్త విన్నా, మనసు బాగోక పోయినా ఈ పూల మొక్కల మధ్య గడుపుతుంటే అదో సాంత్వన నాకు. ఇంట్లో కాసే నాలుగు బెండకాయలు, వంకాయలు, ఆకుకూరలు లాంటివి నా ఒక్క ప్రాణానికి సరిపోతున్నాయి. వేసవిలో మనింట్లో మల్లెపూలు చాలా పూస్తాయి. ఇంకా మామయ్యింట్లో కూడా పూస్తాయి. ఈసారి నా మనవరాళ్ళిద్దరికి పూల జడలు వేస్తాను.

మీ మేనత్త కూతురు వాణి విజయవాడలో ఉంటోంది. గుర్తుందా. ఇదివరకు మీరక్కడ ఉండేటప్పుడు దానితో బాగా మాట్లాడేదానివి. వాళ్ళు పెంచుకునే కుక్క పింకీ జబ్బు చేసి చచ్చిపోయిందిట. దాన్ని ప్రాణంగా చూసుకుంది. వాణి బెంగ పెట్టుకుని తిండి తినట్లేదుట. మొన్న వాళ్ళాయన ఇక్కడికి వచ్చాడు. ఒకసారి మాట్లాడు వీలయితే.

మీ నాన్న స్నేహితుడు, రామశర్మ గారు, లలితా సహస్ర నామాలకీ వివరణ రాసి, పుస్తకం అచ్చు వేయించారుట. అదీ, ఇంకా దేవీ భాగవతం పోస్టులో పంపారు. అవి చదువుతున్నాను ఇప్పుడు. మనవాళ్లందరి మధ్య ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాగుంటుంది. కాని, ఏదైనా ఇష్టంగా చదువుకుందామంటే ఒకోసారి కుదరదు. తప్పదు. ఎదుటివాళ్ళ కోసం కొన్ని వదులుకోక తప్పదు.

పెద్దమ్మకి రెండు మోకాళ్ళు అరిగిపోయాయి. ఆపరేషన్ తప్పదుట. వచ్చే నెలలో హైదరాబాద్ వెళ్లి వాళ్ళబ్బాయి దగ్గర ఉండి చేయించుకోవాలనుకుంటోంది. నన్ను తోడు రమ్మంటోంది. వెళ్లి, ఆపరేషన్ అయ్యేవరకు ఉండి వస్తాను. పెద్దమ్మ నీ పురుళ్ళకి నాకెంతో సాయంగా ఉంది అప్పుడు. మనకే కాదు అందరికి అలాగే అండగా ఉంది. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక దిగులుతో అడిగింది. ఆ మంచి మనిషికి తోడు వెళ్లకుండా ఎలా ఉండగలను?

శంకరం బాబాయి, అదే మీ నాన్న పెద్దమ్మ కొడుకు గుర్తున్నాడా! నాన్న, శంకరం సొంత అన్నదమ్ముల్లా ఉండేవారు. బాబాయి కూతురు రవళి భర్త యాక్సిడెంట్‌లో పోయాడుగా. అప్పుడు మనందరం వెళ్ళాము. దానికి ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళని పెంచుకుంటూ, నానా తంటాలు పడుతూ, ఓ స్కూల్లో క్లర్క్‌గా చేస్తోంది. ఆఫీస్‌లో మగ ఉద్యోగుల వంకర చూపులు, వెకిలి చేష్టలు చెప్పి చాలా బాధ పడింది. కిందటి వారం ఇక్కడికి వచ్చింది. రెండు రోజులుండి వెళ్ళింది. నీ నెంబర్ తీసుకుంది. ఒంటరి స్త్రీ అంటే అందరికి ఎందుకో చులకన. రవళిని చూస్తే చాలా బాధగా అనిపించింది. నేనిక్కడికి వచ్చేసాక ఫోన్లు, రాకపోకలు తగ్గిపోయాయి. ఎవరి సమస్యలు వారివిగా ఉన్నాయి.

పిల్లలు జాగ్రత్తగా స్కూల్‌కి వెళ్లి వస్తున్నారా! మీలో ఒకరు, వాళ్ళని తీసుకెళ్లి, స్కూల్ నుంచి తీసుకొస్తే బాగుంటుందనిపిస్తుంది నాకు. మీ ఉద్యోగాలు, మీ సమయాలు వేరు. వాళ్ళ స్కూల్ టైములు వేరు.

అల్లుడి ఆఫీసులో చేసే ఆయనెవరో ఇటువైపు వస్తారు. వస్తే ఇక్కడికి వస్తారన్నవుగా. ఎప్పుడు వస్తారో రెండు రోజులు ముందు చెపితే మినపసున్నుండలు, జంతికలు చేసుంచుతాను.

నా ఆరోగ్యం బాగానే ఉంది బి.పి. షుగర్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకుంటున్నాను అయినా, ఎప్పుడైనా బాధాకరమైన విషయాలు విన్నప్పుడు బి.పి. పెరిగిపోతుంది. మళ్ళీ సర్దుకుంటుంది.

అల్లుణ్ణి అడిగినట్లు చెప్పు. పిల్లలకి దీవెనలు.

ఇట్లు

మీ అమ్మ”

అమ్మ ఉత్తరం చదువుతుంటే తిలక్ రాసిన పోస్టుమాన్ గురించిన కవితలో ‘శుభాశుభాలకు నువ్వు వర్తమానం. నీ మేజిక్ సంచిలో నిట్టూర్పులు, నవ్వులు పువ్వులు, ఆనందాలు, ఏడ్పులు’ అనే పంక్తులు గుర్తుకు వస్తున్నాయి నాకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here