[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]మా[/dropcap] పద్మం వదినని తీసుకుని బాబాయ్ గారింటికి వెళ్ళాను. మా బాబాయి పరబ్రహ్మశాస్త్రిగారు జ్యోతిష్యశాస్త్రం బాగా అభ్యసించారు. ఒక పరిశోధన లాగా ఆ శాస్త్రాన్ని శోధించారు. ఆ శాస్త్రానికి సంబంధించి దేశ విదేశాల్లోని అన్ని పుస్తకాల్లోనూ ఆయన వ్యాసాలు వస్తుంటాయి. కానీ ఎవరికీ, ఎప్పుడూ జాతకాలు చెప్పడంలాంటివి చెయ్యరు. ఆ శాస్త్రాన్నాయన ఒక సరస్వతీ ఉపాసనలాగా చేస్తూంటారు.
కానీ ఇవాళ పద్మం వదిన మాట కాదనలేక జాతకం చూడమంటూ ఆయన దగ్గరికి వెళ్ళాల్సివచ్చింది. పద్మం వదిన పెళ్ళయి పదేళ్ళయింది. కారణమేదైతేనేం ఉన్న ఇద్దరాడపడుచుల పెళ్ళిళ్ళ బాధ్యతా కూడా పద్మం వదిన, వాళ్లాయన మీదే పడింది. ఆరేళ్ళక్రితం ఇద్దరు ఆడపడుచుల్లోనూ పెద్దావిడకి పెళ్ళిచేసి పంపించారు. నాలుగేళ్ళనుంచీ రెండో ఆడపడుచు పెళ్ళికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏ సంబంధమూ కుదరటం లేదు. అందుకే నా దగ్గరకొచ్చి ఒక్కసారి మా బాబాయ్ దగ్గరికి తీసికెళ్ళమనీ, ఆడపడుచు జాతకం చూపిస్తాననీ బతిమాలింది. కాదనలేక ఇదిగో ఇలా తీసుకొచ్చాను.
బాబాయి ఎంతో ఆప్యాయంగా మాతో మాట్లాడారు. ఆడపడుచు పెళ్ళికోసం పద్మం వదిన పడే తాపత్రయం చూసి చలించిపోయారు. “ఏదమ్మా అమ్మాయి జాతకం?” అంటూ చెయ్యి చాపారు. మా పద్మం వదిన హాండ్బాగ్ లోంచి ఓ కాగితాలబొత్తిలాంటిది తీసింది. అందులోంచి ఓ కాగితం తీసి, బాగా పరిశీలించి మరీ బాబాయి చేతిలో పెట్టింది.
పరీక్షగా జాతకం చూస్తున్న బాబాయి భృకుటి ముడిపడింది. “ఎవరిచేత వేయించారమ్మా ఈ జాతకం?” అంటూ అడిగారు పద్మం వదిన్ని. “మావారి ఆఫీసులో ఒకాయనకి తెలుసంటే వారిచేత వేయించేం.”అంది వదిన కాస్త భయంగా.
ఆ జాతకాన్ని ముందున్న టేబిల్ మీదకి విసిరేస్తూ, “ఇది తప్పు జాతకమమ్మా. శుక్రుడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఆ సమయానికి గురువు ఇక్కడుండడు. ప్రతివాడూ జాతకం వేస్తే ఇలాగే ఉంటుంది” అన్నారు బాబాయి కొంచెం కోపంగా. ఆయన కోపం చూసి భయపడిన వదిన, “బాబయ్యగారూ, క్షమించండి. ఇందులో ఆ వేసినాయన తప్పు లేదు. తప్పంతా మాదే. ఎందుకంటే మా ఆడపడుచు నక్షత్రం ఆశ్రేష. ఆశ్రేషకి అత్తగారుండరని అంటారుకదా, అందుకని ఆ నక్షత్రం చెపితే సంబంధాలు వెనక్కి పోతాయని మేమే ఆయన్ని నక్షత్రం మార్చి రాయమన్నాం.” అంది.
బాబాయి తెల్లబోయారు. “మీరే నక్షత్రం మార్చి రాయమన్నారా?”
“అవునండీ. అందరూ చెపుతుంటారు కదా… ఆశ్రేషకి అత్తగారుండరు, మఖకి మామగారుండరు, విశాఖ విసిరి కొడుతుంది..” అంటూ ఇంకా ఏదో అంటున్న వదిన మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ, “ఎవరు చెప్పారమ్మా మీకివన్నీ. అసలు ఫలానా నక్షత్రం మంచిదీ, ఫలానాది చెడ్దదీ అని ఎక్కడా ఉండదు. అన్ని నక్షత్రాలూ మంచివే. ఏదో ప్రాస కలిసింది కదాని ఇలా నోటికొచ్చినట్టు చెప్పుకుపోతారా ఎవరైనా!” అన్నారు ఆశ్చర్యంగా.
వదిన కాస్త తటపటాయించి, నెమ్మదిగా చెప్పింది. “మరేం చెయ్యమంటారు బాబాయిగారూ. ఏ సంబంధం చూసినా అన్నీ నచ్చి కూడా జాతకం దగ్గర వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కొంతమందయితే సంబంధం నచ్చలేదని చెప్పడానికి ఒకవిధంగా జాతకాన్ని వాడుకుంటున్నారు. అందుకే ఈమధ్య మేం ముందు పెళ్ళికొడుకు జాతకం తెచ్చుకుని, దానికి నప్పేలాగ అమ్మాయి జాతకం రాయిస్తున్నాము. అయినా లాభం లేకపోతోంది. ఇప్పుడీ సంబంధం చాలా మంచిది. వీళ్ళు కూడా ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారోనని భయంగా ఉందండీ” అంటున్న వదినని బాబాయి జాలిగా చూసారు.
“శాస్త్రం తెలిసినవాడెవడూ ఇలా తప్పు జాతకాలు రాయడు. అయినా మిడిమిడి జ్ఞానంతో అలా నక్షత్రం మార్చి రాయమంటే రాసే జ్యోతిషపండితుడు ఎవరమ్మా?”
“వారి ననుకోడం ఎందుకులెండి బాబాయిగారూ, ఆ పండితులు మాత్రం ఏం చేస్తారు! కాలం అలా ఉంది. ప్రతివారికీ జాతకం బాగుండాలి. అది ఎంత బాగుండాలంటే అసలు ఎప్పుడూ, ఎక్కడా కష్టమనేదే లేకుండా ఉండాలి. బాబాయిగారూ, మనుషులన్నాక అన్నిరోజులూ ఒకలా ఉంటాయా చెప్పండి. కాస్త తేడా వస్తే చాలు చాలామంది తమతమ జాతకాలు పుచ్చుకుని ఏదో ఆ శాంతి చెయ్యండీ, ఈ శాంతి చెయ్యండీ అంటూ ఈ పండితుల దగ్గరికి వచ్చేస్తుంటారు. ఈ జనాల బలహీనతని వాడుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇదొక విషవలయంలా అయిపోయింది. ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటున్నారు తప్పితే శాస్త్రం గురించి ఎవరు పట్టించుకుంటున్నారండీ” అంది వదిన.
“పుట్టినవాడి జాతకం మార్చడమన్నది అది రాసిన ఆ బ్రహ్మవల్ల కూడా కాదమ్మా. ఎటొచ్చీ గ్రహాలకి శాంతులు అవీ చేయడం వల్ల ఆ ప్రభావం ఉధృతం తగ్గుతుంది కానీ జరగవలసినది మటుకు ఆగదమ్మా.. అంటే బాగా ఎండగా ఉన్నప్పుడు ఆ ఎండ బాధ ఎక్కువ తెలీకుండా గొడుగు పట్టుకోడం ఎలాంటిదో ఇదీ అలాంటిదే. అలా శాంతులూ అవీ చేయిస్తే కాలు తీసెయ్యవలసిన పరిస్థితినుంచి వేలు మాత్రం తీయవలసిన పరిస్థితులు రావచ్చు తప్పితే రాతని ఏవీ మార్చలేవు.”
“మరెందుకు బాబాయిగారూ చాలామంది పండితులు జాతకాలు మార్చి రాయమనగానే రాస్తున్నారు? వాళ్లకీ విషయాలు తెలీవంటారా?”
“ఎందుకు తెలీవమ్మా. అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఏవో నాలుగు పుస్తకాలు చదివి, ఏదో ఓ మాట చెపితే, అది కనక జరిగితే ఇంకందరూ ఆ పండితుణ్ణి ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. జనాలు నమ్ముతుంటే తను కాదనడమెందుకని తను వాళ్ల బలహీనతని సొమ్ము చేసుకుంటున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఇది చాలా గొప్ప శాస్త్రం. ఒకసారి దీని ప్రకారం దేనినైనా లెక్క కట్టారంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. అందాక ఎందుకూ.. మనవాళ్ళు గ్రహణాలు ఎప్పుడొస్తాయో ఖచ్చితంగా చెప్తారు. అంతకన్న మంచి ఉదాహరణ ఉంటుందా చెప్పమ్మా..”
“ఏమో బాబాయిగారూ, మీరిలా జాతకాన్ని మార్చలేమూ అంటున్నారు. కానీ ఆరేళ్ళక్రితం మా పెద్దాడపడుచుకి ఇలాగే జాతకం మార్చి రాసే పెళ్ళి చేసాం.”
ఆశ్చర్యంగా చూస్తున్న బాబాయిని చూస్తూ అంది వదిన..” అవునండీ. అప్పుడు మా ఆడపడుచుకి కుజదోషం ఉందని కొంతమందన్నారు, లేదని ఇంకొంతమందన్నారు. ఉందో లేదో మాకు తెలీక ఆఖరికి పెళ్ళి కుదరాలంటే లేదనే రాయించుకోవాలనుకుని అలాగే రాయించి చేసాం ఆమె పెళ్ళి..” తలొంచుకుని ఏదో చెయ్యరాని పని చేసినట్టు చెప్పింది వదిన.
“అదేనమ్మా నేనూ చెప్పేది. కుజదోషం అన్నది చాలావాటి మీద అధారపడి ఉంటుంది. ఏదో ఒక్కదాన్నే చూసి కుజదోషం ఉందని చెప్పెయ్యలేం. దానికి ముందూ వెనకా చాలా చూడాలి.” అన్నారు బాబయ్య.
“అందుకేనండీ బాబాయిగారూ, ఇదిగో పెళ్ళికొడుకు జాతకం తెచ్చాను. మీరు పెద్ద మనసు చేసుకుని ఈ జాతకానికి నప్పేలాగ మా ఆడపడుచు జాతకం రాసిపెడితే మీకు ఎంతో ఋణపడి ఉంటాను. “ అంటూ బాబాయిని భయపడుతూ అడిగింది.
రాబోయిన కోపాన్ని నిగ్రహించుకుంటున్నట్టు బాబాయి మొహం ఎఱ్ఱబడింది. బాబాయి ముఖం చూసిన నేను వదినకి అలా అడగొద్దన్నట్టు సైగ చేసాను.
“నేను అలాగ మార్చి రాయలేనమ్మా. దానికి ఇంకెవరినైనా చూసుకో. అయినా అమ్మాయి అసలు జాతకం ఉంటే ఒకసారి ఇయ్యి, చూస్తాను..” అంటూ చెయ్యి చాపారు బాబాయి.
పద్మంవదిన మళ్ళీ హాండ్బేగ్ లోంచి ఓ కాగితాలబొత్తి తీసి అందులో కాగితాలని పరీక్షగా చూడడం మొదలుపెట్టింది.
“అన్ని జాతకాలు ఎవరివమ్మా!” ఆశ్చర్యంగా అడిగారు బాబాయి.
“అన్నీ మా ఆడపడుచువేనండీ..ఇదేమో ఓ అబ్బాయి వయసుకి తగ్గట్టు ఓ రెండు సంవత్సరాలు తగ్గించి వేయించిన జాతకం. మరిదేమో నక్షత్రాలు షష్టాష్టకాలు పడితే ఇద్దరికీ కుదరదుట కదండీ అందుకని ఇంకో అబ్బాయి నక్షత్రానికి సరిపడే నక్షత్రం వచ్చేట్టు వేయించిన జాతకం. ఈ జాతకమైతే ఇద్దరికీ గ్రహబలం సరిగ్గా ఉండేలా వేయించింది..” వరసగా ఒక్కొక్కటీ చూపిస్తూ చెప్పుకుపోతున్న పద్మం వదిన్ని బాబాయి తెల్లబోయి చూసారు.
“అవన్నీ వదిలేసి, అసలు జాతకమంటూ ఉంటే చూపెట్టమ్మా..” అన్నారు.
వదిన ఆ బొత్తి ఒకటికి రెండుసార్లు బాగా పరీక్షించి అందులోంచి ఒక కాగితం తీసిచ్చింది. దాన్నందుకుని బాబాయి లెక్కలు వేయడం మొదలుపెట్టారు. మేమిద్దరం ఉత్కంఠగా ఒక పదినిమిషాలు చూస్తూ కూర్చున్నాం. జాతకాన్ని బాగా పరీక్షించిన బాబాయి పద్మం వదినతో అన్నారు.
“జాతకం చాలా బాగుందమ్మా. గురుడు ఏకాదశమందున్నాడు. ఇంకో రెండునెలల్లో ఈ అమ్మాయికి పెళ్ళి కుదిరిపోతుంది. మంచిసంబంధం వస్తుంది. హాయిగా ఉంటుంది. మీకేం బెంగ అక్కర్లేదు..”
వదిన మొహం మందారంలా విచ్చుకుంది. బాబాయి మాటలకి నాకు సంతోషంతోపాటు గర్వం కూడా కలిగింది. మార్చి రాసిన జాతకాల కన్న అసలు జాతకం ఎంత బాగుందో అన్న బాబాయి మాటలకి సంబరపడుతూ ఇద్దరం ఇంటిముఖం పట్టాం.