Site icon Sanchika

ఇలా చేస్తే…..?!

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘ఇలా చేస్తే… ?!’ అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము. “ఆకాశవాణి నాటకోత్సవమహోత్సవం” 2020లో హైద్రాబాద్ నుంచి ఎన్నికై అన్ని కేంద్రాలలో ప్రసారం చేయబడిన నాటిక! [/box]

పాత్రలు:

***

[dropcap]లో[/dropcap]కంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అన్నిటినీ రూపుమాపలేకపోయినా వీలైనన్నిటిని తమ పరిధిలో మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్న ప్రేమికులు ధర్మతేజ, వందన.

ఇప్పుడు వారు ఏ పనిలో ఉన్నారో చూద్దాం!

***

(పార్కు. పక్షుల కిలకిలారావాలు వినిపిస్తూ ఉంటాయి)

వందన : ధర్మా! ధర్మా! ఇక్కడ!

ధర్మతేజ : ఓ! ఇక్కడ ఉన్నావా వందనా?

వందన : ఆఁ! తెలిసినవాళ్లు కనిపిస్తే ఇటు వచ్చాను.

ధర్మతేజ : మనం అనుకున్నచోట లేకపోతే వెతుకుతున్నా!

వందన : సెల్ ఉండగా ఈ అనవసర ప్రయాసలేల?

ధర్మతేజ : అవసరానికి మించి సెల్ ఉపయోగించకూడదని మనమిద్దరం అనుకున్నాంగా.

వందన : ఇది అవసరమేగా. నేను కనిపించనప్పుడు.

ధర్మతేజ : కాసేపు వెతికి అప్పుడు ప్రయత్నిస్తానన్నమాట సెల్‍లో.

వందన : గుడ్. మన సిద్ధాంతాలను బాగా పాటిస్తున్నావు.

ధర్మతేజ : దేవి గారి కోసం.

వందన : కాదు. మనకోసం. అందరి కోసం.

ధర్మతేజ : అవును వందనా! మనం మంచిగా ఉండాలి. మన చుట్టుపక్కల వారు కూడా మంచిగా ఉండాలి.

వందన : సర్వేజన సుఖినోభవంతు లాగా.

ధర్మతేజ : అంతే! అంతే! రేపు ఆదివారం కదా! ఏం ప్లాన్ చేశావ్? చెప్పనే లేదు.

వందన : ఇప్పుడు నిన్ను పిలిచింది అందుకే కదా!

ధర్మతేజ : సరే సరే! చెప్పు.

వందన : మా 240 ప్లాట్స్‌లో ఉన్న ఆడవాళ్లను పిలిచి ‘షీ టీమ్స్’ వారితో వాళ్ళను వాళ్లు ఆపద వచ్చినప్పుడు రక్షించుకునే టెక్నిక్స్ నేర్పించబోతున్నా.

ధర్మతేజ : మంచి ఆలోచన వచ్చిందే నీకు.

వందన : మరీ… రోజుకో కిడ్నాప్, నిముషానికో రేప్, చూస్తూ ఊరుకుంటామా! మీ మగవాళ్ల అరాచకాలను (వత్తి పలుకుతూ)

ధర్మతేజ : వద్దు వద్దమ్మ తల్లీ అలాంటి వాళ్ళలో నన్నూ చేర్చకు.

వందన : లేదులే! సరదగా అన్నాను.

ధర్మతేజ : మీ అపార్ట్‌మెంట్స్‌లో అందరూ ఎలాగూ కరాటే నేర్చుకుంటున్నారు. అయినా ఇదీ మంచిదే!

వందన : కొందరికి కుదరక రావటం లేదు. అలాంటివారికి ఇది ఉపయోగపడుతుందని నా ప్లాన్.

ధర్మతేజ : అవునవును.

వందన : వాళ్ళు ముందునుంచీ పట్టుకుంటే ఎలా అటాక్ చెయ్యాలి, వెనుకనుంచీ వచ్చినా, గొలుసు, హ్యాండ్ బ్యాగ్ లాంటివి లాక్కెళుతుంటే ఎలా దెబ్బకొట్టాలన్నవి చెబుతారు.

ధర్మతేజ : చెప్పటమేనా? చూపిస్తారా?

వందన : చూపిస్తారు కళ్ళకు కట్టినట్లు.

ధర్మతేజ (ప్రశ్నార్థకంగా) : చేసాఁ!

వందన : అవును. వాళ్ళలోనే ఒకరు చెయిన్ లాగే వాళ్ళుగా, మరొకరు అటాక్ చేసేవాళ్ళుగా!

ధర్మతేజ : (ఆశ్చర్యంగా) అవునా!?

వందన : ఆఁ! ఈసారి ఓ అడుగు నేను ముందుకేస్తున్నా!

ధర్మతేజ : ఏమిటో!

వందన : బ్లాక్‍కి ఇద్దరిని ఎంచుకుని వాళ్ళతో రియల్‍గా చేయిస్తా.

ధర్మతేజ : ఓ! అవును. చెప్పటం, చూడటం కంటే చేస్తేనే బాగా తెలుస్తుందిలే.

వందన : ఆ! అదే! అదీకాకుండా వాళ్లతో మిగిలినవాళ్ళకు ఖాళీ సమయాల్లో శిక్షణ ఇప్పించవచ్చు.

ధర్మతేజ : ఊఁ! ప్లాన్ బాగుంది.

వందన : చెయ్యాలి ధర్మా! ఇలాంటివి ఇంకా ఎన్నో చెయ్యాలి.

ధర్మతేజ : ఉద్యమాలు చేస్తే సరిపోదు. మనల్ని మనం రక్షించుకునేలా ఉండాలి ముందు.

వందన : నిజం చెప్పావు. అంతేకాదు ఆపదలో ఉన్నవాళ్లను రక్షించగలిగే సామర్థ్యం కూడా ఉండాలి.

ధర్మతేజ : అప్పుడే వీటిని ఎదుర్కోగలుగుతాం.

వందన : అవును ధర్మా! అదే నా ఉద్దేశం కూడా!

ధర్మతేజ : బాగుంది.

వందన : రేపు వచ్చేసెయ్. నాకు తోడుగా ఉందువు గానీ.

ధర్మతేజ : తప్పకుండా. నువ్వు చెప్పాలా? చీకటి పడుతోంది. ఇక వెళదామా?

వందన : పద. నువ్వు నా ప్రక్కన నీడలా ఉన్నవన్న ధైర్యమే నన్ను నడిపిస్తుంటుంది. తెలుసా!

ధర్మతేజ : ఒకరికి ఒకరు ఉంటేనే కదా ఏ బంధం అయినా గట్టి పడుతుంది?

వందన : అవును.

ధర్మతేజ : ఎప్పటికీ మనమిలానే….!

వందన : తప్పకుండా. జీవితాంతం వరకూ…!

హఁ హఁ హఁ!

(ఇద్దరి నవ్వులూ వినిపించాలి)

***

(కాలింగ్ బెల్ శబ్దం వినిపించాలి)

వకుళ : (గట్టిగ) అయ్యాయా పెత్తనాలు

వందన : (వ్యంగ్యంగ) ఆఁ! అయినట్లే అమ్మా!

వకుళ : ఆడపిల్లవని గుర్తుపెట్టుకుంటే ఇలా ఆలస్యంగా రావు.

వందన : బాగా చెప్పావమ్మా! ఇంకో మూడుగంటల తర్వాత నీ కొడుకు వస్తాడుగా. వాడినీ ఇలా నిలదియ్యి.

వకుళ : వాడికేం మగ మహారాజు!

సర్వోత్తమరావు : పెళ్ళయిన దగ్గరనుంచీ ఇదే మాట. కాస్త మార్చవే!

వందన : ఎందుకు మారుస్తుంది నాన్నా! ఇంకా మగాడు తిరక్క చెడ్డాడు. ఆడది తిరిగి చెడింది అని సామెతలు కూడా వదలదు.

సర్వోత్తమరావు : ఇదే కదా మీ అమ్మతో వచ్చిన చిక్కు. అన్ని ఉద్యోగాలలో ఇప్పుడు ఆడవాళ్ళే ఎక్కువ. అయినా మీ అమ్మ ఈ పాట ఆపటం లేదు.

వకుళ : అనండి. అందరూ నన్నే అనండి.

వందన : ఊరికే నిన్ను ఎందుకు అంటావమ్మా! వాడిని నీ గారాబంతో చెడగొట్టకు. నాకు లాగే చూసుకో అంటున్నానంతే.

సర్వోత్తమరావు : అది ఈ జన్మలో జరిగితే మనం అదృష్టవంతులమే!

వందన : అమ్మ మంచిది. మారుతుంది నాన్నా!

సర్వోత్తమరావు : ఏమి మారుతుందో! ఊళ్లో వాళ్ళందరినీ మార్చగలుగుతున్నాం. ఇన్నేళ్లయినా మీ అమ్మలో మాత్రం ఇసుమంత మార్పు తీసుకురాలేకపోతున్నాం.

వందన : పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అంటారు. ఆ నానుడిని అమ్మ విషయంలో తిరగరాయాల్సిందే.

వకుళ : ఎంతసేపూ అందరూ నన్ను మారమనేవాళ్ళే! ఇలా నామీద సెటైర్లు వెయ్యటం మీ ఇద్దరూ ఆపేదెప్పుడో!

వందన, సర్వోత్తమరావు : (ఇద్దరూ ఒకేసారి) నువ్వు మారినప్పుడు (చిన్నగా నవ్వుతూ)

వకుళ : ఎంతైనా మీ తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ ఒకవైపే.

వందన : నువ్వూ, అన్నయ్య ఒకవైపు ఉన్నట్లా!

వకుళ : అదే వద్దన్నాను, పెద్దవాళ్ళను మాట అనకూడదు. చిన్నప్పటి నుంచీ చెబుతున్నా.

సర్వోత్తమరావు : పెద్దవాళ్ళు తప్పులు కూడా చెయ్యకూడదే పిల్లల ముందు.

వకుళ : ఆఁ! పెద్ద చెప్పొచ్చారులే. ఎంతైనా వాడు వాడే. అది అదే!

సర్వోత్తమరావు : కాదని ఎవరన్నారే! కానీ సమానం అంటున్నానంతే!

వకుళ : నేనొప్పుకోను. వాడి బలం దీనికుందా?

సర్వోత్తమరావు : ఎందుకులేదు? ఇప్పుడు ఆడపిల్లలు అబలలు కాదు సబలలు. వాళ్ళకు ఆస్తిలో కూడా హక్కు ఉంది.

వకుళ : అలా అని ఇచ్చేస్తారా ఏమిటి?

సర్వోత్తమరావు : ఆఁ! మర్వాదగా ఇవ్వకపోతే కోర్టుకు ఎక్కుతారు. ఆ అప్రతిష్ఠ మనకెందుకు?

వకుళ : వందనా! నువ్వలా చేస్తావా?

వందన : చెయ్యనమ్మా!

వకుళ : చూశారా! అది నా కూతురు.

సర్వోత్తమరావు : మన ఆస్తి నేను సంపాదించినది కాదే. అది మా నాన్నది. నీ కొడుకుకు ఎంత హక్కు ఉందో నీ కూతురుకీ అంతే హక్కు ఉంది.

వకుళ : ఇళ్ళూ, పొలాలు కూడా కట్టబెట్టేస్తారా?

సర్వోత్తమరావు : ఆ! అన్నీ.

వకుళ : అమ్మో! అమ్మో!

సర్వోత్తమరావు : అదే…. ఇది నేను సంపాదించినదైతే దానికి అసలు ఏమి ఇవ్వననేదానివేమో?

వకుళ : ఎవరిదైనా ఇవ్వను. అది పెళ్లి చేసుకున్న వాడిది దానిదేగా.

సర్వోత్తమరావు : అలా అంటే నీ కొడుకుకీ వస్తుందిగా కోడలి ద్వారా.

వకుళ : మీరు ఎన్నయినా చెప్పండి నేను వినను.

సర్వోత్తమరావు : అదే పిచ్చితనం. అవతలి వాళ్లకు ఉందా లేదా అన్నది ఈ విషయంలో చెల్లదే.

వకుళ : మీ మాట మీదే! నా మాట నాదే!

సర్వోత్తమరావు : వందనా! ఈ విషయంలో లాయర్‍ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇప్పించాల్సిందే మీ అమ్మకు.

వందన : అమ్మ ప్రేమ నాకు కావాలి నాన్నా! ఈ ఆస్తి ఇవ్వకపోతే ఏంటి?

సర్వోత్తమరావు : అలా వదిలేస్తామా ఏమిటి? నీకు అదీ దక్కాలి ఇదీ దక్కాలి.

వకుళ : ప్రయత్నించండి.

సర్వోత్తమరావు : ఇందులో ప్రయత్నించడానికి ఏం లేదు. నువ్వు కాదన్నా ఆస్తి దానికి ఇచ్చెయ్యగలను. కానీ ఆ మాట నీ నోట వినలని. అంతే.

వకుళ : ఈ విషయంలో నేను రాజీపడను.

సర్వోత్తమరావు : నువ్వు తల్లివేనా? అందరూ ఆడపిల్లలకు ఎలా ముట్టచెప్పాలా అని రకరకాలుగా ఆలోచిస్తారు. నువ్వు మాత్రం ఇలా…!

వకుళ : మీరు నన్ను ఎన్నయినా అనుకోండి. నేనింతే! నేనొప్పుకోను.

వందన : నాన్నా! అవసరమా!

సర్వోత్తమరావు : అవసరమే తల్లీ. ఇప్పుడు నువ్వు ఊరుకున్నా రేపు నిన్ను చేసుకున్నవాడు వదలడుగా.

వందన : నీకా భయం లేదు నాన్నా! నేను చేసుకునేవాడు ఎప్పటికీ అలా అడగడు.

సర్వోత్తమరావు : అతను అంత మంచివాడు అయితే అతనికి నేనెలా అన్యాయం చేస్తాను?

వందన : (గారంగా) నాన్నా!

వకుళ : (నసుగుతూ) అంతే! ఎప్పుడూ ఇద్దరూ ఒకటే! నా కొడుకు ఇంట్లో లేనప్పుడే ఇలా మాట్లాడతారు.

సర్వోత్తమరావు : వాడు వస్తే మాత్రం భయమా మాకు! ఈ విషయంలో వాడు కూడా ఏమి చెయ్యలేడు. తెలుసుకో.

వకుళ : చూద్దాం.

వందన : వదిలెయ్యండి నాన్నా!

సర్వోత్తమరావు : ఏదీ వదలద్దని నువ్వే కదా అంటావు. ఇది మాత్రం ఎందుకు వదిలెయ్యాలి.

వందన : సరే నాన్నా! ఇది నువ్వూ, అమ్మా తేల్చుకోవలసిన విషయం.

సర్వోత్తమరావు : సమానత్వం నువ్వూ కావాలంటావుగా.

వందన : అవును నాన్నా! మనల్ని పుట్టించినప్పుడు ఇద్దరినీ సమానంగానే పుట్టించారు. అందుకని సమంగానే ఉండాలంటాను. హక్కులుతో సంబంధం లేకుండా.

సర్వోత్తమరావు : నేనూ మీ అమ్మతో అందుకే పోరాడుతున్నాను తల్లీ!

వందన : అది పోరాడితే వచ్చేది కాదు నాన్నా! ఇష్టంగా చెయ్యాల్సింది. అలాంటిదే నాకు కావాలి.

సర్వోత్తమరావు : మనలాంటి వాళ్ళ మధ్య ఉండి కూడా మీ అమ్మ ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంటుంది వందనా.

వందన : అమ్మకి అన్నయ్య సపోర్ట్. వాడు మారితే తప్పకుండా ఈవిడ కూడా మారుతుంది.

సర్వోత్తమరావు : చూద్దాం! ఆ రోజు ఎప్పుడు వస్తుందో?

వందన : అమ్మ అన్నయ్యకి వంత పాడినన్నాళ్ళు రాదు. అన్నయ్య ఈవిడను వెనుకేసుకొచ్చినా జరగదు.

సర్వోత్తమరావు : అలా ఎందుకు అనుకోవాలి? కొన్నిటిని కాలమే మారుస్తుంది.

వందన : అదేదో తొందరగా వచ్చి అమ్మ, అన్నయ్య మారితే మనం సగం విజయం సాధించినట్లే నాన్నా!

సర్వోత్తమరావు : అవునమ్మా.

(హఁ హఁ! హఁ! ఇద్దరూ కలిసి నవ్వుతారు.)

***

(తలుపు తడుతున్న శబ్దం)

వకుళ : (మనసులో) వీడు వచ్చినట్లున్నాడు.

(తలుపు తీసిన శబ్దం)

వకుళ : తొందరగా రారా! వాళ్ళిద్దరూ చూశారంటే పెద్ద రాద్దాంతం చేస్తారు. పన్నెండు గంటలయింది.

బహుగుణ : (మత్తుగా) అదేనే నా (ధైర్యం) దయిర్యం.

వకుళ : ఈ తాగుడు మానరా అంటే వినవు కదా.

బహుగుణ : ఇదే ఇప్పటి (ఫ్యాషన్) పేషన్.

వకుళ : (నెమ్మదిగా) సరె.. సర్లే.. భోజనం పెడతారా!

బహుగుణ : వద్దే. నిద్ర వస్తోంది పొడుకుంటా.

వకుళ : (బాధగా) ఇలా రోజు తాగి వస్తే నీ ఆరోగ్యం పాడయిపోతుందిరా.

బహుగుణ : పోతే పోనీ. ఇందులో మజా ఉంటదే.

వకుళ : ఆఁ! షూస్, సాక్స్ అన్నా విప్పనీ. అలానే మంచం మీద పడిపోతావు.

బహుగుణ : తీసుకోవే. ఆ అదురుష్టం నీదే.

వకుళ : తొందరగా నీకు పెళ్ళి చేసేస్తే ఆ అమ్మాయే నిన్ను మార్చుకుంటుంది.

బహుగుణ : (మూలుగు) ఊ……ఊ…..

(తలుపు వేసిన శబ్దం)

వకుళ : (స్వగతంలో) ఒక్కగానొక్క కొడుకు అని గారాబంగా పెంచితే ఇలా ఎందుకు పనికిరాని వాడిలా తయారయ్యాడు. ఎలాంటి పిల్ల వస్తుందో ఏమిటో?

***

(టాంక్ బండ్)

ధర్మతేజ : (దిగులుగ) వందనా

వందన : ఏమయ్యింది! చాలా దిగులుగా కనిపిస్తున్నావ్?

ధర్మతేజ : పెద్ద సమస్యే!

వందన : ఏంటది?

ధర్మతేజ : మా చెల్లిగారి పాప ‘నందిని’ తెలుసుగా.

వందన : ఆఁ! ఫిఫ్త్ క్లాసు చదువుతుందిగా.

ధర్మతేజ : అవును. దాన్ని వాళ్ళ సార్ అత్యాచారం చేశాడు.

వందన : దరిద్రుడు. గురువు స్థానంలో ఉండి అంత చిన్నపిల్ల పైన అఘాయిత్యమా? ఇలాంటి వాళ్ళని నడిరోడ్డు మీద ఉరి తియ్యాలి.

ధర్మతేజ : చాలా భయపడుతోంది.

వందన : అవునా? మరి పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా?

ధర్మతేజ : లేదు. అక్క వాళ్లు వాళ్ళ పేరు బయటికి వస్తుందని భయపడుతున్నారు.

వందన : అలాంటిదేం లేదు. అవేం బయటికి రానివ్వరు పోలీసులు.

ధర్మతేజ : అంటారు కానీ పేపరులో వార్తలు వస్తాయిగా. అందుకే నేనూ అక్కకి చెప్పలేకపోతున్నాను.

వందన : వదలొద్దు ధర్మా! అలాంటి కీచకులను అస్సలు వదలొద్దు.

ధర్మతేజ : నేనూ అదే అనుకుంటున్నాను.

వందన : వాడిని అలా వదిలేస్తే మళ్ళీ మళ్ళీ ఎందరు విధ్యార్థినులు బలి అయిపోతారో. దాని కోసమైనా వాడిని పట్టించాలి.

ధర్మతేజ : అంతేనంటావా?

వందన : అంతే. మనం పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ‘భరోసా’కి పంపుతారు. ఇక అక్కడి నుంచీ అంతా వాళ్ళే బాధ్యత తీసుకుంటారు.

ధర్మతేజ : నీకెలా తెలుసు?

వందన : ఈ మధ్యే ఒక స్నేహితురాలితో అవసరమైతే వెళ్ళి వచ్చాను.

ధర్మతేజ : అవునా!

వందన : నందిని భయం పోగొడ్తారు. వాడికి శిక్ష పడేంతదాకా నిద్రపోరు. తోడుగా ఉంటారు.

ధర్మతేజ : సాక్ష్యం అదీ ఇదీ అని మళ్ళీ ఇబ్బంది పెడతారేమో?

వందన : అదేం లేదు. ప్రక్క గదిలో పాపను కూర్చోపెట్టి ఆడిస్తూ వేరే గదిలోంచి జడ్జిగారు మాట్లాడతారు. మళ్ళీ పాప, నేరస్థుడు ఎదురుపడాల్సిన అవసరమే లేదు. నాకు తెలుసు.

ధర్మతేజ : నిజమేనా? ఇలా అయితే అక్కను ఒప్పించొచ్చు.

వందన : అవును ధర్మా! వాళ్ళను వేరే ద్వారం గుండా రప్పిస్తారు. జడ్జిగారు కూడా వేరే గానే వస్తారు.

ధర్మతేజ : అలా జరుగుతుందంటావా?

వందన : నేను స్వయంగా ఇదంతా చూశాను ధర్మా.

ధర్మతేజ : ఏమో! నమ్మబుద్ధి కావడం లేదు.

వందన : అంతే! పోలీసులు లంచాలు తీసుకుని క్రూరంగా హింసించి, అమాయకులను కొడతారన్నది మనకు బాగా తెలుస్తాయి. ఇలాంటి మంచి విషయాలు మనకు తెలియవు తొందరగా.

ధర్మతేజ : నువ్వు చెబుతుంటే అలానే అనిపిస్తుంది.

వందన : ఏదో శిక్ష వేసెయ్యటంతో వాళ్ళు వదిలిపెట్టటం లేదు. కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పుకు కూడా కృషి చేస్తున్నారు.

ధర్మతేజ : అయితే నందిని భయం కూడా పోగొడతారంటావా?

వందన : ఆ! అందులో సందేహమే లేదు. నాదీ పూచీ.

ధర్మతేజ : నిజంగాఁ!

వందన : ఆఁ! నిజంగానే! వాళ్ళ వల్ల నీకూ, నందినికి లాభమే కానీ నష్టం జరగదు. మీరందరూ సమస్య నుంచి బయటపడేవరకు తోడుగా ఉంటారు.

ధర్మతేజ : మా కొలీగ్ ఒకరు పోలీసులు హింసే మాకు ఎక్కువ అని చెప్పింది.

వందన : అలాంటివారు లేరని అనను. మన ఏరియా ఇనస్పెక్టర్ చాలా మంచివారు. ప్రతి కేసును సొంత కేసులా చూసుకుంటారు.

ధర్మతేజ : ఈ కాలంలో అసలు అలాంటివారు ఉన్నారా?

వందన : నువ్వు వినలేదా ఆయన గురించి. అందరూ చెప్పుకుంటున్నారుగా.

ధర్మతేజ : ఎక్కడా…. ఇల్లు… ఆఫీసు ఆర్థిక ఇబ్బందులతో సతమతం. ఇలాంటివాటికి నా దగ్గర సమయం ఉండటం లేదు.

వందన : అవునులే. ఆఫీసులో పని అయ్యాక మళ్ళీ లెక్కలు రాయటానికి వెళతావుగా. ఇంకేముంటుంది టైమ్?

ధర్మతేజ : సరే! అక్క దగ్గరకు వెళతాను. నువ్వు చెప్పింది అంతా చెబుతాను.

వందన : నేను రమ్మన్నా వస్తాను. అవసరమైతే!

ధర్మతేజ : అక్కర్లేదు. నేను చెప్పి పోలీస్ రిపోర్ట్ ఇప్పిస్తాను. వస్తా!

వందన : బాయ్!

***

బహుగుణ : నాన్నా! నేను పక్కింటి ‘హనిత’ను పెళ్ళి చేసుకుంటా.

సర్వోత్తమరావు : వాళ్ళా! మన కులం కాదు కదా! అయినా నీకే ఠికానా లేదు. నీకు పెళ్ళా?

బహుగుణ : మనకున్న ఆస్తి చాలదా? నేను మళ్ళీ సంపాదించాలా?

సర్వోత్తమరావు : కూర్చుని తింటే ఎంత ఆస్తి అయినా కరిగిపోతుంది. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించుకో. ఆ తర్వాత పెళ్ళి సంగతి చూద్దాం.

బహుగుణ : అదేం కుదరదు. వాళ్ళింట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. వెంటనే పెళ్ళి చేసుకోవాలి.

సర్వోత్తమరావు : వకుళా! ఇటు రా! నీ సుపుత్రుడు ఏదో చెబుతున్నాడు చూడు.

వకుళ : ఏంటిరా బంగారం!

సర్వోత్తమరావు : అలా అడుగు.

బహుగుణ : హనితను పెళ్ళి చేసుకుంటానంటున్నా!

వకుళ : నీకిదేం మాయారోగంరా. దాన్ని మన వందన అక్కా! అక్కా! అని పిలిచేదిగా.

బహుగుణ : అది పిలిస్తే నేనలా అనుకోలేదు. ప్రేమించా. దాన్నే పెళ్ళి చేసుకుంటా.

వకుళ : ఆస్తి ఉందని ఎర వేసినట్లున్నారు. ఆడపిల్ల ఉన్నోళ్ళకి ఇలాంటి బుద్ధులు ఎక్కువై పోతున్నాయి.

బహుగుణ : వాళ్ళనేం అనకు.

వకుళ : మరి నిన్ననాలా? కడుపు రగిలిపోతోంది. మాంసం తినేదాన్ని నా ఇంటికి కోడలును చేస్తావా?

బహుగుణ : తప్పేముంది?

వకుళ : తప్పా! తప్పున్నరా! రేపు మనింట్లో కూడా వండుతానంటుంది. మా వల్ల కాదు.

బహుగుణ : కావాలంటే బయటనుంచీ తెప్పించుకుంటాంలే.

వకుళ : ఖర్మ! ఖర్మ! ఈ సంబంధానికి నేను అస్సలు ఒప్పుకోను.

సర్వోత్తమరావు : నేను ఊ అన్నాననుకున్నావా ఏమిటి?

బహుగుణ : నేను కావాలనుకుంటే ‘ఊ’ అనండి.

వకుళ : నిన్ను వద్దని ఎలా అనుకుంటాం? కని, పెంచి, పెద్ద చేసింది వదులుకోవటానికా?

బహుగుణ : పెళ్ళి వద్దంటే చస్తా. వదులుకోనంటావ్ పెళ్ళి చెయ్యనంటవ్.

వకుళ : ఇదేం బెదిరింపురా.

బహుగుణ : నువ్వేమైనా అనుకో.

సర్వోత్తమరావు : ఆ అమ్మాయే కావాలనుకుంటే నువ్వు బయటికి పో. నా ఇంట్లో ఉండటానికి లేదు.

బహుగుణ : అయితే నా ఆస్తి నాకు పడెయ్యండి. అలాగే పోతా.

సర్వోత్తమరావు : కొడుకు… కొడుకు అని నెత్తికెక్కించుకున్నావుగా. ఇప్పుడు చెప్పు వాడికి సమాధానం.

వకుళ : ఇలాంటి వెధవ పని చేస్తాడని నేను కలగన్నానా?

సర్వోత్తమరావు : వాడు మంచిపని చేశాడు కనక ఇది వెధవ పని అని తిట్టటానికి, చిన్నప్పుడే చెప్పాలి. నెత్తినెక్కించుకున్నావ్.

వకుళ : అంతా నా ఖర్మండీ.

సర్వోత్తమరావు : ఏడువు…. నీకిలాగే కావాలి.

వకుళ : అయినా నాన్నను అలా అడుగుతావా?

బహుగుణ : మరీ… నేను గడ్డి తిని బ్రతకాలా?

వకుళ : మీ నాన్న సంపాదించుకొని నన్ను పోషించలా? అలాగే నువ్వూ చెయ్యి.

బహుగుణ : నాకేం ఖర్మ నా తాత బోలెడు సంపాదించి ఇచ్చాడు. మనవడిగా నాకే వస్తుంది.

సర్వోత్తమరావు : అంతా నీకే రాదు నాన్నా! మాకూ, వందనకు కూడా వాటాలుంటాయి.

బహుగుణ : అవన్నీ కోర్టుకో తేల్చుకుంటా.

సర్వోత్తమరావు : (హేళనగ) అలాగే కోర్టు ఫీజులు మీ మామ ఇస్తాడా? వెళ్ళి తెచ్చుకో.

బహుగుణ : అదీ చూస్తా. అప్పు చేసైనా నాది నేను దక్కించుకుంటా.

వకుళ : (ఏడుస్తూ) అయ్యో! అయ్యో! ఎంతకు తెగించావురా.

సర్వోత్తమరావు : ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు.

***

ధర్మతేజ : వందనా! నీ పుణ్యమా అని మా నందిని మళ్ళీ మనుషుల్లో పడింది.

వందన : నే చెప్పాగా!

ధర్మతేజ : చెప్పావుగానీ అంతా అయ్యేదాకా నాకు మాత్రం నమ్మకం లేదు.

వందన : భరోసా వాళ్ళ భరోసా గట్టిది.

ధర్మతేజ : అవును. వాళ్ళకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. వెధవకి శిక్ష బాగానే పడింది.

వందన : ఇంక వాడికి ఉద్యోగం ఎవరిస్తారు?

ధర్మతేజ : లేదులే. వాళ్ళే వాడి బుద్ధిని కూడా మార్చారు.

వందన : అవును కదా! పోనీలే మిగతా పిల్లలకు ఈ భయం ఉండదు.

ధర్మతేజ : ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఎప్పుడు ఏ నిమిషాన ఏం జరుతుందో చెప్పలేకపోతున్నాం.

వందన : అవును ధర్మా! ఎటు చూసినా అన్యాయమే! ఆడపిల్లలు దారుణంగా బలి అయిపోతున్నారు.

ధర్మతేజ : తల్లులే మగ పిల్లలను ఆడవారిని గౌరవంగా చూసేట్లు పెంచాలి.

వందన : కొందరిని చెడగొట్టేది వాళ్ళే. మా అమ్మ అలాంటిదే. అందుకే మా అన్న అలా తయారయ్యాడు.

ధర్మతేజ : మీ అన్న అలాంటివాడేనా?

వందన : అలాంటివాడు కాదు కానీ…. అమ్మవాళ్ళ నెదిరించి ఇంట్లోంచి బయటకుపోయి కేసు వేశాడు ఆస్తి కోసం.

ధర్మతేజ : అవునా…

వందన : వాడు ప్రేమించిన అమ్మాయిని అమ్మ వద్దంది.

ధర్మతేజ : పోనీ చెయ్యవచ్చుగా పెళ్ళి.

వందన : మా ఇంట్లో గుడ్డు కూడా తినరు. వాళ్ళు నాన్ వెజిటేరియన్స్. అందుకే ఒప్పుకోవటం లేదు.

ధర్మతేజ : కులాల కంటే ముందు ఈ ప్రాబ్లమ్ విడదీస్తుంది కదా.

వందన : అవును.

ధర్మతేజ : మరేం చేద్దామని.

వందన : మా అమ్మ ఇప్పుడు దార్లోకి వచ్చింది. ఇన్నాళ్ళు ఆడపిల్లకిచ్చేదేమిటి అనేది ఇప్పుడు దానికీ వస్తుంది అన్నారుగా, ఇచ్చెయ్యండి అంటోంది.

ధర్మతేజ : మంచి మార్పే.

వందన : నేను, మా నాన్నా ఊహించలేదు అమ్మ ఇలా అంటుందని.

ధర్మతేజ : పోనీ! మంచిదేగా!

వందన : అంతా మన మంచికే అని అందుకే అంటారేమో!

ధర్మతేజ : నువ్వయినా పెళ్ళికి ఒప్పించొచ్చుగా.

వందన : లేదు ధర్మా! వాళ్ళ మనస్తత్వాలు మంచివి కావు. వీడయితే వాళ్లకి సరిపోతాడు. రేపు ఇంట్లోకి వచ్చాక ‘గృహహింస’ అని బెదిరిస్తే మనమేమీ చెయ్యలేం కదా!

ధర్మతేజ : అదొకటి ఉందిగా. అమాయకులను తీసుకెళ్ళి జైలులో పెట్టిస్తున్నారు.

వందన : అందుకే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు.

ధర్మతేజ : ఏమిటో కాలం ఇలా మారిపోతోంది.

వందన : కాలం కాదు. మనుషులు, మనస్తత్వాలూ మారిపోతున్నాయి.

ధర్మతేజ : ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో?

వందన : పాత తరమే బాగుండేది. ఆత్మీయతలు, అనురాగాలు ఉండేవి. ఒకరిమీద ఒకరికి ప్రేమలు ఉండేవి. ఇప్పుడవేమీ కనిపించటం లేదు.

ధర్మతేజ : ప్రేమలు లేకపోయినా ఫర్వాలేదు. స్వార్థాలు ఎక్కువైపోతున్నాయి. ఎంతసేపూ నేనూ, నాదీ అని ఆలోచిస్తున్నారు.

వందన : ప్రక్కవాళ్లను పట్టించుకోవడమే మానేశారు. ఎంతసేపూ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవటమే.

ధర్మతేజ : ఎవరికి వాళ్ళు మనకు ప్రక్కింటి వాళ్ళ అవసరం లేదనే భ్రమలో బ్రతికేస్తున్నారు. ఎవరు చెప్పగలం ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో?

వందన : అవును ధర్మా! అవసరం ఉంటే తప్ప మాటలు కలపకూడదా? ఎలా తయారయిపోయారు మనుషులంతా.

ధర్మతేజ : ఇప్పుడు అవసరాలని బట్టే మాటలు. వాటిని కూడా కొలతగా వాడుతున్నారు.

వందన : చూస్తున్నా!

ధర్మతేజ : ఏమిటి?

వందన : అదే… కొలత ఎంత ఉందని?

ధర్మతేజ : హాస్యమాఁ!

వందన : జీవితంలో అది లేకపోతే సంతృప్తి ఉండదుగా.

ధర్మతేజ : నిజమే వందనా. కోపం వచ్చినప్పుడు నవనాడులూ ఆవేశంతో ఊగిపోతాయి. అదే నవ్వితే అన్నీ హాయిగా సర్దుకుంటాయి.

వందన : ఏదీ…. అందరూ కలిసి కూర్చుని నవ్వులు పంచుకోవటం ఎక్కడైనా చూస్తున్నామా? ఎవరికి వాళ్ళు బిజీ…. బిజీ.

ధర్మతేజ : డబ్బు సంపాదనలో పడి యంత్రాలుగా మారిపోతున్నారు.

వందన : డబ్బుకంటే కాలం విలువైనదని ఎప్పుడు తెలుసుకుంటారో ఈ జనం.

ధర్మతేజ : ఇక వెళదాం. నిన్ను ఇంటిదగ్గర దింపేసి నేను వెళ్ళిపోతాను.

వందన : అలాగే! కాసేపు అమ్మతో మాట్లాడి వెళ్ళు. కొడుకు చేస్తున్నా పనికి మానసికంగా ఆవిడ బాగా కృంగిపోతోంది.

ధర్మతేజ : తప్పకుండా. ఆవిడ మీ అన్నయ్య మీద మరీ ఎక్కువ ప్రేమ పెంచేసుకున్నారు. అతి ఎప్పుడూ అనర్థమే.

వందన : అవును.

***

ధర్మతేజ : అత్తయ్యా! ఎలా ఉన్నారు?

వకుళ : ఇలా ఉన్నాను నాయనా! కళ్ళల్లో వత్తులు వేసి పెంచుకున్న కొడుకుని ప్రక్కింట్లోంచి చూసుకోవల్సిన ఖర్మ పట్టింది.

ధర్మతేజ : బాధపడకండి అంతా సర్దుకుంటుంది.

వకుళ : ఇంకా సర్దుకోవటానికి మాకు ఏం మిగిలిందని.

ధర్మతేజ : రోజులన్నీ ఒకలా ఉండవు. ఏది జరగవనుకున్నామో అవి జరిగే రోజు వస్తుంది.

వందన : మీరు మాట్లాడుతూ ఉండండి. టీ తీసుకుని వస్తాను.

వకుళ : అంత అదృష్టమా? వాడేదో మాకు శతృవు అయినట్లుగా మాట్లాడుతున్నాడు ధర్మా.

ధర్మతేజ : కోపం విచక్షణ లేకుండా చేస్తుంది. పట్టించుకోకుండా మీరు ప్రేమగా మాట్లాడండి. తనే మారతాడు.

వకుళ : ఏమో!

ధర్మతేజ : కోర్టులు దాకా ఎందుకు? నలుగురు పెద్దమనుషుల ముందు బహుగుణకు రావాల్సింది ఇచ్చెయ్యండి.

వకుళ : నేనూ, ఆయనా అదే అనుకుంటున్నాము.

ధర్మతేజ : అప్పుడైనా అతనిలో మార్పు వస్తుందేమో!

వకుళ : ఒక్కసారి బ్రతుకు అంతా చీకటి అయిపోయింది.

ధర్మతేజ : భగవంతుడు చీకటిలోనే చిరుదివ్వెలా వెలుగును ఇస్తాడు.

వకుళ : మా ఇంటికి ఆ వెలుగువి నువ్వే. వందనను పెళ్ళి చేసుకో. మీ ఇద్దరూ కళకళలాడుతూ మా ముందు తిరుగుతుంటే కాస్త ఈ బాధ తగ్గుతుందేమో!

ధర్మతేజ : మీ ఇష్టం.

వకుళ : పరాయి తల్లి కన్నబిడ్డవైనా మాకూ, వందనకూ ఆపదలో అండగా నిలబడుతున్నావ్.

ధర్మతేజ : అది నా ధర్మం. నేనూ మీ బిడ్డనే.

వకుళ : (సంతోషంగా) అంత మాటన్నావు అదే చాలు.

వందన : అనుకున్నది సాధించేసావ్. అమ్మ ముఖంలో నవ్వు తెప్పించేశావ్ ధర్మా!

ధర్మతేజ : హఁ! హఁ! హఁ! (నవ్వుతాడు)

వందన : హాయిగా టీ త్రాగండి.

వకుళ : ఇన్నాళ్ళు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక కొడుకు… కొడుకు అని దేవులాడాను.

ధర్మతేజ : ఇప్పటికైనా అర్థం చేసుకున్నారుగా.

వకుళ : వాడు దూరమైనప్పటినుంచీ ఇది తల్లిలా చూసుకుంటోంది. ఇంకా చెప్పాలంటే అమ్మ కంటే ఎక్కువగానే.

ధర్మతేజ : ఇన్నాళ్ళకు వందనను కూతురిగానే గుర్తించారు సంతోషం.

వకుళ : నేనే కాదు నాలాంటి తల్లులందరూ నన్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి.

వందన : అమ్మలో మనమనుకున్న మార్పు వచ్చేసింది. నాన్న కూడా ఉంటే బాగుండేది.

సర్వోత్తమరావు : (అప్పుడే వస్తూ) వచ్చేశానురా రావటం మీ అమ్మ అమృత పలుకులు వినటం అన్నీ జరిగిపోయాయి.

వందన : గెలిచాం నాన్నా!

సర్వోత్తమరావు : అవునురా. గెలిచినట్లే. నా కొడుకు చెడ్డవాడైనా వాళ్ళ అమ్మలో మార్పుకు దోహదమయ్యాడు. వాడినీ మెచ్చుకోవాల్సిందే.

వకుళ : ధర్మ ఒప్పుకున్నాడు. వాళ్ళకీ పెళ్ళి చేసేద్దామండీ.

సర్వోత్తమరావు : తప్పకుండా. వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుందాం. మా వందనమ్మ పెళ్ళికూతురాయెనే.

వందన : పో నాన్నా!

సర్వోత్తమరావు : ఎవ్వరూ ఎక్కడికీ వెళ్ళేది లేదు. అందరూ ఇక్కడే ఉందాం. ఇక నుంచీ ధర్మలోనే నా కొడుకుని చూసుకుంటాను.

ధర్మతేజ : అంతకన్నానా మామయ్యా!

వందనా : భోజనం ఇక్కడే చేసి వెళ్ళు ధర్మా.

ధర్మతేజ : అలాగే!

(అందరూ నవ్వుకుంటారు)

వకుళ : ఇప్పుడు బహుగుణ ఉంటే బాగుండేది.

సర్వోత్తమరావు : నాలుగురోజులు పోతే వాడు బుద్ధి తెచ్చుకుని మన దగ్గరికి చేరతాడు. కన్నపాశం వదిలిపెడుతుందా?

వకుళ : నిజమేనంటారా?

ధర్మతేజ : హాచ్! (తుమ్ముతాడు)

వందన : చూశావమ్మా! సత్యం అని నిరూపణ అయిపోయింది.

వకుళ : అందరూ కలిసి ఉండటంలోనే కదా ఆనందముండేది.

సర్వోత్తమరావు : ఇలా…..!

ధర్మతేజ, వందన : అవును…. అవునవును (అంటారు నవ్వుతూ)

(కలిసి అందరూ నవ్వులు పంచుకోవాలి)

(సమాప్తం)

Exit mobile version