కాజాల్లాంటి బాజాలు-46: ఇలాగే వుంటుంది..

1
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]అ[/dropcap]దేంటో ఎవ్వళ్ళూ నా పని నన్ను చేసుకోనివ్వరు కదా! చిన్నప్పుడు సరే అమ్మానాన్నల మాట వినాలి, పెద్దయాక ఇంట్లో అందరిమాటా వినాలి. వాళ్ళు చదవమన్నదే చదవాలి. వద్దన్నది మానెయ్యాలి. అవన్నీ ఓకే.. ఇంట్లోవాళ్ళు మన మంచికోసమే చెప్తారుకదా.. కాదనలేం.

కానీ, అదేంటో ఇంట్లోవాళ్ళు కాదు బైటవాళ్ళు కూడా నాకు సలహాలు చెప్పేవాళ్ళే.. ఇది చెయ్యి, అది చెయ్యొద్దు, ఇది కొనూ, అది కొనొద్దూ అని ముక్కూ మొహం తెలీనివాళ్ళు కూడా నాకు సలహా లిచ్చేస్తుంటే ఎలా!

అసలేం జరిగిందంటే ఇవాళ మా పక్కింటావిడ మా ఇంటికొచ్చింది. వాళ్ళు కొత్తగా ట్రాన్స్‌ఫర్ అయి వచ్చారు. అదే మొదటిసారి పరిచయం చేసుకుందుకు మా ఇంటికి రావడం. వస్తూనే తన చదువు గురించీ, వాళ్ళాయన చేసే ఉద్యోగం గురించీ, పిల్లలు ఎంత బాగా సెటిలయారో అంటూ వాళ్ల గురించీ చెప్పింది. సరే బానేవుంది పరిచయం అనుకున్నాను. ఇంకక్కణ్ణించీ నన్ను ప్రశ్నలడగడం మొదలెట్టింది.

“ఇన్నేళ్ళనించి ఈ ఊళ్ళో ఉంటున్నా ఇంత చిన్న ఇల్లు కట్టుకున్నారేంటీ… మీవారు రిటైరయ్యాక ఇలా ఇంట్లోనే ఉంటే ఏం తోస్తుందీ… వేరే ప్రైవేటుగా ఏదైనా చెసుకోవచ్చు కదా… మీ పిల్లలకి ఎంత జీతం వస్తుందీ, మీకేమైనా పంపిస్తుంటారా… ఇదేవిటీ ఇలాంటి పాత మోడలు సోఫాలు ఇంకా ఇలాగే పెట్టుకున్నారూ, కొత్తమోడల్సు బోల్డు వచ్చేయికదా, మార్చెయ్యండి వీట్ని…మీ పనిమనిషికి టిఫిన్ పెట్టి కాఫీ యిస్తున్నప్పుడు మీరు పెట్టుకునేట్టుగా ఇవ్వకండీ, ఫిల్టర్‌లో మళ్ళీ నీళ్ళుపోసి అప్పుడు దిగింది ఇవ్వండి… మీ చీరరంగు ఇంకొంచెం లేతగా ఉండేది కొనుక్కోండి..” ఇలా ఎదురుగా కనిపించేవీ, ఎక్కడో వున్నవీ కలిపేసి నన్ను తినేసింది. నేనేమైనా ఆవిడని అడిగేనా పెట్టేనా.. ఇంటికొచ్చింది కదా అని మర్యాద కోసం నోరుమూసుకుని కూర్చుని ఆవిడ సుత్తి భరించేను.

మొన్నామధ్య చీరలు కొంటున్నప్పుడూ ఇలాగే అయింది. సాధారణంగా నేను ఎవరితోనూ షాపింగ్ చెయ్యను. నేనొక్కదాన్నే వెళ్ళి నాకు నచ్చినవి కొనుక్కుంటూంటాను. అలాగే మొన్న కూడా వెళ్ళేను. నాకు కావల్సినవి చూసుకుంటుంటే పక్కన చీరలు కొనుక్కుందుకు వచ్చినొకావిడ ఆవిడ చూసుకోవడం మానేసి నేను తీస్తున్న చీరలు చూస్తోంది. చూసి వూరుకుంటే బానే వుండును కానీ ప్రతిదానికీ ఏదో వంక పెడుతోంది.. ఈ చీర నెరవెక్కువ వుండదనీ, ఈ చీర ఒక్కసారి తడపగానే సగమైపోతుందనీ, ఈ చీరకున్న రంగుకి యాసిడ్ ఎక్కువేస్తారు కనక చీర తొందరగా చిల్లులు పడిపోతుందనీ, ఈ చీర నా వయసువాళ్ళు కట్టుకుందుకు బాగుండదనీ…ఇలా ప్రతి చీరకీ ఏదోకటి చెప్పడం మొదలెట్టింది. నాకు చీర కొనుక్కోవాలో వద్దో అర్ధంకాలేదు.

నిన్న కూడా అంతే.. షాప్‌కి వెళ్ళి ఆవునెయ్యి పేకెట్ కొనుక్కున్నాను. నా పక్కన ఓ పెద్దమనిషి నిలబడి, “ఎంతండీ ఇదీ..” అనడిగేరు. దాని ఖరీదు చెప్పేను.

“అయ్యబాబోయ్.. రోజు రోజుకీ ఎంతెంత రేట్లు పెంచేస్తున్నారో.. అయినా అంత ఖరీదుపెట్టి ఇప్పుడా ఆవునెయ్యి కొనకపోతేనేవండీ.. గేదెనెయ్యయితే ఏం తక్కువటా.. చిన్నప్పుడు మాకు ఇంటి ముందుకి గేదెని తీసుకొచ్చి, మా ఎదురుకుండా పాలు పిండేవారు. ఆ పాలతో ఇంత దళసరి మీగడ కట్టేది. బోల్డు వెన్నొచ్చేది. ఇంటిల్లపాదికీ ఆ నెయ్యి సరిపోయేది. ఎంచక్క గేదె నెయ్యి కొనుక్కోండి. డబ్బులెందుకు తగలేస్తారు! అయినా పైన పేకెట్టు మీద ఆవునెయ్యి అని రాస్తారు కానీ అది నిజంగా ఆవుదో మేకదో ఎవడికి తెల్సూ! ఈ బిజినెస్ వాళ్లని నమ్మలేవండీ. ఇంకోమాట కూడా.. ఆవునెయ్యి తింటే వేడి చేస్తుందండీ. వాళ్ళు ఆరోగ్యం మన్నూ మశానం అని తొంభై చెప్తారు కానీ, యేం గేదె నెయ్యి తిని డెభ్భైయేళ్ళొచ్చిన నేను శుభ్రంగా లేనూ!” ఆయన వాక్ప్రవాహం అలా సాగిపోతూనే వుంది. ఆయనెవరో నేనెవరో. ఆయన్నేమైనా అడిగేనా.. మరింకెందుకు నాకీ సలహాలివ్వడం..బహుశా ఇంట్లో ఆయన మాట ఎవరూ వినరనుకుంటాను. ఇలా నాకు సలహా లిచ్చేస్తున్నా డనిపించింది. ఆయనలా ఖచ్చితంగా వద్దని చెపుతుంటే నేను ఆ నెయ్యి కొనుక్కోవాలా వద్దా అని డైలమాలో పడిపోయేను.

ఇందాకా సాయంత్రం కూడా అంతే.. కూరలబండి దగ్గర కూరలు కొంటున్నాను. అలవాటుగా తీసుకునే అతనే.. కావల్సిన కూరలు తీసుకున్నాక మామిడికాయ కనిపించింది. ఎంతైనా జిహ్వచాపల్యం కదా! ఓ నాలుగు కాయలు కొని టెంపరరీగా కొత్తావకాయ వేసుకుందామనిపించింది. కాయలమీద చెయ్యి వేసానో లేదో కూరలు కొనుక్కుందుకే వచ్చిన ఇంకో పెద్దమనిషి, “అబ్బెబ్బే..ఆ కాయలు పులుపుండవండీ.. చూసేరా ఆ షేపూ.. అవి బంగినపిల్లి కాయలండీ.. అంటే తెల్సా మీకూ.. పచ్చికొబ్బరిముక్కల్లా వుంటాయి..” అన్నాడు. నేను వెంటనే ఆ కాయలమీద చేతిని తీసేసేను. పాపం కూరలబ్బాయి “కావాలంటే కోసి చూపిస్తానమ్మా పులుపుంటుందో ఉండదో..” అంటూ చాకుతో కోయబోయేడు కాయని. నాకు అలా కోస్తే ఇష్టముండదు. “వద్దు వద్దు” అంటూ ఇవతలికి వచ్చేసేను. వస్తూ అనుకున్నాను.. నేనాయన్నెమైనా సలహా అడిగానా. ఆయనంతట ఆయన కల్పించుకుని చెప్పడమెందుకూ.. ముక్కూమొహం తెలీని ఆయన మాటని పట్టుకుని కాయలు కొనుక్కోకుండా వచ్చెయ్యడమెందుకూ! ఆయనెవడు నాకు చెప్పడానికీ! నేనెందుకు వినాలీ ఆయన మాట!

ఇలా ఆలోచించుకుంటే హమ్మయ్య మనసుకి ఎంత హాయిగా వుందో.. అందుకే వెంఠనే మళ్ళీ వెనక్కి వెళ్ళి మామిడికాయలు కొనుక్కుని ఎంచక్క టెంపరరీగా కొత్తావకాయ వేసేసుకున్నాను. ఊరీఊరని ఊరగాయీ వచ్చీరాని మాటలూ ఎంతో రుచి కదా…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here