Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-85: ఇలావుంది కాలం..

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ [/dropcap]మధ్య ఒక పెళ్ళిలో జరిగిన సంఘటన మీ అందరితో పంచుకోవాలనిపించింది.

బాగా కావల్సిన వాళ్ళింట్లో పెళ్ళయితే “స్నాతకం సమయానికే వచ్చెయ్యీ…మనం కలుసుకుని చాలా రోజులైంది కదా.. బోల్డు కబుర్లు చెప్పుకుందాం..” అని వదినంటే అసలే ఈ మధ్యకాలంలో బైటకి వెళ్ళలేదేమో మహా ఆనందంగా సరేనన్నాను.

ఉదయం ఎనిమిది గంటలకి స్నాతకం, ఆ వెంటనే ఎదురుసన్నాహం, భోజనాలయ్యేక బుల్లెట్ బండిలాంటి డేన్సుల ప్రోగ్రామ్, రాత్రి ఏడింటికి పెళ్ళి, తర్వాత డిన్నర్. మొత్తం రోజంతా హాయిగా చుట్టాలతో కబుర్లూ, పరాచికాలూ.. బలే అవకాశ మనిపించింది.

ఇంట్లో పన్లన్నీ పూర్తి చేసుకుని మర్చిపోకుండా సానిటైజర్ బేగ్లో పెట్టుకుని, మాస్క్ మీద మాస్క్ వేసుకుని, ఎందుకైనా మంచిదని మరో జత మాస్కులు బేగ్‌లో పెట్టుకుని, బయల్దేరేటప్పటికే స్నాతకం అయిపోయింది. ఏం చేస్తాం.. కనీసం ఎదురుసన్నాహానికైనా అందుకున్నాను కదా అనుకుంటూ హాలంతా కలయచూసేను. అంత పెద్ద హాల్లోనూ కొద్దిమందే ఉన్నారు కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ మాస్కులు పెట్టుకునే ఉన్నారు. ఇదే కనక కరోనా రాక మునుపయితే హాలంతా కిటకిటలాడిపోతూ ఉండేదనుకుంటూ వదినున్న గుంపు వైపు నడిచేను.

ఆ గుంపంతా చుట్టాలే. అందరి మొహాలకీ మాస్కులున్నాయి కానీ అవి గడ్దం కిందకైనా వెళ్ళిపోయేయి… లేకపోతే ఓ చెవి పక్కకైనా వెళ్ళిపోయేయి. ఇంకొందరికయితే హస్తభూషణా లయేయి.

నేను వదిన పక్కన సెటిలైపోతూ “ఎదురుసన్నాహం అయిపోయిందా..” అనడిగేను.

“ఇంకా ఏదీ.. ఇందాకట్నించీ మగపెళ్ళివారి కోసం చూస్తున్నారు.. ఇంకా రాలేదు. బహుశా నీ పోలికేనేమో.” అంది వదిన నన్ను చూసి నవ్వుతూ.

నేనూ నవ్వేస్తూ, “పెళ్ళికొడుకెలా ఉన్నాడూ.. మనమ్మాయికి ఈడూజోడేనా..” అనడిగేను కుతూహలంగా..

“బాగున్నాడు. కానీ ఆ తల్లీ, అక్కగారే ఏంటో ముఖాలు ముడుచుకుని ఉన్నారు..”

“ఎందుకూ..”

“ఏవో.. అప్పుడే గంటనించీ వీళ్ళు ఎదురుసన్నాహానికి రెడీ అయి వాళ్లకి కబురంపేరు. ఇప్పటికొచ్చి ఇంకా రాలేదు.”

“అత్తగారి మేకప్ అవలేదేమో..” హాస్యమాడింది మా రంగత్తయ్య.

“కాదర్రా.. ఏదో అయినట్టుంది.. ఇందాక రాణక్క వచ్చి బాలొదిన్ని పక్కకి తీసుకెళ్ళి ఏదో చెప్పింది. బాలొదిన గబగబా అన్నయ్య దగ్గర కెళ్ళి మాట్లాడింది. ఏవిటో నాకైతే అర్థం కాలేదు.” పక్కనించి పాపొదిన అంది.

బాలొదినంటే పెళ్ళికూతురు తల్లి. అంత ఖంగారుగా బాలొదిన అన్నయ్య దగ్గరి కెళ్ళిందంటే మా గుంపులో ఉన్నందరం ఏమై వుంటుందా అని తర్కించుకోడం మొదలెట్టేం.

బాలొదిన, అన్నయ్య ఇంకో ఇద్దరు ఆడవాళ్లతో మగపెళ్ళివారి కిచ్చిన రూములవైపు నుంచి చిన్నబుచ్చుకున్న మొహాలతో, నెమ్మదిగా వస్తున్నారు. వాళ్లని చూడగానే రంగత్తయ్య గబగబావెళ్ళి బాలొదిన పక్కన నడిచొస్తున్న రాణక్కని చెయ్యి పట్టి మావైపు లాక్కొచ్చేసింది.

“ఏవైంది రాణక్కా…” అందరం ఒక్కసారి రాణక్కని అడిగేం.

“మగపెళ్ళివారు కలకత్తానించి వచ్చేరు కదా.. వాళ్ళదేదో పెద్ద బిజినెస్సుట అక్కడ. వదిలి రాడానికి కుదర్దుట. అందుకని పెళ్ళి ముందురోజు మాత్రం రాగలమనీ వాళ్లకి కావల్సిన బట్టలన్నీ వీళ్ళనే కొనేసి, బ్లౌజులూ గట్రా కుట్టించెయ్యమనీ చెప్పేరుట బాలావాళ్ళకీనూ. వీళ్ళలాగే చేసేరు..”

“మరింకేం.. ఏం… బ్లౌజులు సరిగ్గా కుట్టలేదా!” వదినడిగింది.

“దాంట్లో ఏవీ తేడా లేదు. వాళ్ళు అక్కణ్ణించి కొలతలు పంపించేరు. అన్నీ సరిగ్గా సరిపోయేయి..”

“మరింక ఎదురుసన్నాహానికి రాకుండా అలా మొహాలు ముడుచుక్కూచోడ వెందుకూ!”

“ఎందుకంటే.. ఎందుకంటే..”

నానుస్తోంది రాణక్క.. ఇంకాసేపు అలాగే నానిస్తే మేవందరం కలిసి కొట్టేస్తావేమోనని భయపడిపోయి,

“కంచిపట్టుచీరలమీదకి బ్లౌజులు కుట్టించేరుకానీ వీళ్ళు మేచింగ్ మాస్కులు కుట్టించలేదుట. ఇప్పుడు మేం ఎదురుసన్నాహానికి ఎలా రావూ…అని అడుగుతున్నారు.”

ఒక్కసారి అందరం నిశ్శబ్దమైపోయేం.

“అదేంటీ. ముందు చూసుకోలేదా!”

“టైమేదీ! ఇద్దరూ ఉదయాన్నే హాల్లో దిగేరు. దిగ్గానే వాళ్లకని కొన్న చీరలూ అవీ ఇచ్చేరు. వెంటనే స్నాతకం. అదయ్యేక చూసుకున్నారు. మాస్కులు లేకుండా ఎలా రావూ ఎదురుసన్నాహానికీ అంటున్నారు..”

రంగత్తయ్యే ముందు తేరుకుంది. “ఇంతోటి మాస్కులకీ ఇంత గొడవెందుకూ.. ఒక్కొక్కటీ వెయ్యిరూపాయిలెట్టైనా కొని పడేస్తాడు మా బాల మొగుడు..” అంది.

“ఇక్కడ ఎవరి దగ్గరా డబ్బుల్లేకా కాదు.. కొనుక్కోలేకా కాదు. పాతిక ముఫ్ఫైవేలు ఖరీదు చేసే కంచిపట్టు చీర, అయిదారువేలు ఖరీదు చెసే డిజైనర్ బ్లౌజూ వేసుకుని, చీప్‌గా మూతికి మేచ్ కాని మాస్క్ ఎలా కట్టుకుంటారూ.. అదీ ప్రశ్న..” ఊపిరి పీల్చుకుంది రాణక్క.

కాసేపు ఎవరినోటా మాట లేదు. రాణక్కే మళ్ళీ చెప్పడం మొదలెట్టింది..

“డిజైనర్ బ్లౌజులన్నీ జర్దోజీ వర్క్ తోనూ, మిర్రర్ వర్క్ తోనూ, స్టోన్సవీ వేసి ఎంబ్రాయిడరీ చేయించినవి. మాస్కులు కూడా అదే చీర కలర్‌లో, బ్లౌజ్‌కి నప్పే జర్దోజీ, మిర్రర్ పనితనంతో ఉంటేనే ఫొటోలూ, వీడియోల్లో బాగా పడతారుట. మామూలు మాస్కులు వేసుకుంటే ఈ చీరల, బ్లౌజుల అందం అంతా పోతుందిట. మూతికి ఏదో గుడ్డ కట్టుకున్నంట్టుంటుందిట. ఎన్నేళ్ళకైనా ఆ ఫొటోలూ వీడియోలేకదా ఈ అకేషన్‌ని చూపించేవీ. వాటిల్లో పర్మనెంట్‌గా అలా చీప్‌గానే కనిపిస్తుంటాం అంటున్నారు. అదీ వాళ్ల బాధ.”

“మరిప్పుడు ఏం చేస్తార్ట..” అర్థం లేని నా ప్రశ్నకి “అదే తెలీటంలేదు.” అంటూ జవాబిచ్చింది రాణక్క.

“బజార్లో దొరికేదైతే ఎంత డబ్బైనా పెట్టి కొని తెచ్చేస్తాం. ఇప్పుడు అదే చీర మేచింగ్ కలర్‌లో మాస్కు మీద బ్లౌజు మీదున్న హాండ్ వర్క్ చెయ్యాలంటే ఇప్పటికిప్పుడు ఎలా కుదుర్తుందీ!” రంగత్తయ్య సందేహం లేవదీసింది.

వదిన గబుక్కున అడిగింది.. “ఎన్ని చీరలుంటాయేంటీ..” అంటూ.

రాణక్క వదిన్ని చూస్తూ, “అత్తగారివి మూడూ, ఆడపడుచువి రెండూ.. మొత్తం అయిదు చీరలు.” అంది.

వదిన వెంటనే “నాకు తెలిసిన బుటెక్ వాళ్ళున్నారు.. ట్రై చెయ్యనా.. ఎంతసేపట్లో కావాలీ..” అనడిగింది.

“అంతకన్నానా.. పోనీ ఇప్పుడు డేన్స్ ప్రోగ్రామ్ పెట్టేసుకుని, సాయంత్రానికి ఎదురుసన్నాహాలుండేలా ప్రోగ్రామ్ మారుద్దాం. సాయంత్రం నాలుగ్గంటలకి అవుతుందా..” ఆశగా అడిగింది రాణక్క.

వదిన వెంటనే మొబైల్ తీసి మూడు, నాలుగు నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడింది.

“నాకు తెల్సినవాళ్ళు ముగ్గురికి ఫోన్ చేసేను. అందులో ఇద్దరు వెంటనే చీరలు తెచ్చి చూపిస్తే రెండు మూడుగంటల్లో కుట్టిచ్చేస్తావంటున్నారు. ఇవ్వనా..”

రాణక్క మొహం మందారంలా విచ్చుకుంది.

“నా తల్లే.. ఎంత మంచిమాట చెప్పేవ్… నడు ఈ సంగతి బాలతో చెప్పి, వియ్యపురాలి దగ్గర్నించి ఆ చీరలూ, బ్లౌజులూ తెమ్మందాం..” అంటూ వదిన్నీ, నన్నూ బాలొదిన దగ్గరికి తీసికెళ్ళింది.

అన్నయ్య, బాలొదిన వదిన చెప్పింది విని మహదానందపడిపోయి, వియ్యపురాల్నడిగి, ఎదురుసన్నాహం సాయంత్రానికి మార్పించి, అయిదు చీరలూ తీసుకొచ్చేరు.

వదిన ఒక డిజైనర్ దగ్గర నన్ను దింపి, ఆమెకి రెండుచీరలూ, బ్లౌజులూ ఇచ్చి, నన్నక్కడ కూర్చోబెట్టి ఇంకోచోట కెళ్ళింది. వదిన ఒకచోట, నేనోచోట దగ్గర కూర్చుని మొత్తానికి ఆ అయిదుచీరలకీ మేచింగ్ మాస్కులు జర్దోజీ, మిర్రర్ వర్క్ లతో సహా కుట్టించుకొచ్చేం.

అవి తెచ్చి బాలొదిన చేతిలో పెడుతున్నప్పుడు, ఆమె మొహంలోనూ, అన్నయ్య మొహంలోనూ కనపడ్డ రిలీఫ్ చూసేక ఏదో గొప్పపని చేసేసేమన్నంత అనుభూతి కలిగింది మాకు.

రాత్రి పెళ్ళివిందు ముగించుకుని ఇంటి కొస్తున్నప్పుడు వదిన. “స్వర్ణా, ఈసారినుంచి పెళ్ళిబట్టల లిస్టులో మేచింగు డిజైనర్ మాస్కులు కూడా చేర్చాలి… గుర్తుంచుకో..” అంది.

వదినేది చెప్పినా శిరోధార్యమే కదా!..

Exit mobile version