[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]మొ[/dropcap]ట్టమొదటగా కుడిపాదం మోపి అత్తవారింట్లో అడుగుపెట్టింది కొత్తకోడలు సరోజ. తిన్నగా పూజగదిలోకి తీసికెళ్ళి గృహప్రవేశమయిన కొత్తకోడలిచేత దేవునికి దీపారాధన చేయించేరు పెళ్ళి చేయించిన బ్రహ్మగారు.
అంతా అయ్యాక చుట్టాలందరూ సరోజ చుట్టూ చేరి అత్తగారింటి విషయాలు ఒక్కొక్కటీ చెప్పడం మొదలుపెట్టేరు. అందులో చాలామంది చెప్పిన విషయం సరోజ అత్తగారు భవాని ఇంటిగురించి తీసుకునే శ్రధ్ధ గురించి.
“మా భవానీ ఎంత పధ్ధతైన మనిషో.. ఇంట్లో ఎక్కడి వస్తువక్కడ ఉండాల్సిందే. దేన్నైనాసరే అదుండేచోట దాన్ని పెట్టేదాకా తనకి తోచనే తోచదనుకో..ఆ పనయ్యేదాకా కొట్టుకుపోతుంది. ”
“ఏ టైమ్‌లో వెళ్ళినా భవానీ ఇల్లు ఎంత నీట్‌గా ఉంటుందో అనుకుంటుంటాం. ఎప్పుడు చూసినా నడుంలో నాప్కిన్ దోపుకునే వుంటుంది.. ఇంట్లో తిరుగుతూ ఎక్కడ దుమ్ము కనిపిస్తే అక్కడ తుడిచేదాకా ఆ చేతులు ఊరుకోవనుకో..”
“పనిమనిషి పని చేసి వెళ్ళేక ఆ గిన్నెలన్నీ మళ్ళీ కడుక్కుంటుంది తెల్సా! ఆ గాస్ స్టౌ మటుకు అప్పుడే కొన్న కొత్తదానిలా ఉండదూ!”
“వంట చేస్తే మటుకు అమృతం కాదూ! ఎవరి కేదిష్టమైతే అది సరిగ్గా టైమ్‌కి టేబుల్ మీద పెట్టేస్తుంది..”
“అంతదాకా ఎందుకూ.. ఇప్పుడు కొడుక్కి పెళ్ళి చేసిందా.. ఎంత హడావిడీ.. ఎంత హంగామా.. అయినా సరే ఇల్లూ అద్దంలా లేదూ!”
“మాట మటుకు.. ఎంత బాగా మాట్లాడుతుందనీ! ఎవ్వరినీ నొప్పించదు. ఆ మొహంలో ఎప్పుడైనా చిరాకూ, విసుగూ అంటూ కనిపిస్తేగా.”
“వ్రతాలూ, నోములూ మటుకు ఎన్ని చేసిందనీ.. ఇంక ఆ వ్రతాల పుస్తకంలో భవానీ చెయ్యడానికి ఒక్క వ్రతమైనా మిగల్లేదు.”
“అసలు ఏ గడియైనా ఒక చోట కూర్చోడం చూసేవా ఎప్పుడైనా.. ఎప్పుడూ ఏదో పని చేస్తూనే వుంటుందాయె”.
“అందుకే మన పెద్దలన్నారు. ఇంటిని చూసి యిల్లాలిని చూడూ..అని..” పతివ్రతా లక్షణాలు ఒక్కొక్కటీ నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టేరు..
అందరి మాటలూ వింటున్న సరోజ హడిలిపోయింది. మర్నాటినుంచీ తను కూడా ఓ నాప్కిన్ నడుంలో దోపుకుని ఇల్లంతా దులిపేస్తున్నట్టు ఊహించుకుని బెదిరిపోయింది.
“మా అమ్మని చూసేవుగా… ఇల్లంటే అలా ఉండాలి.. అన్నీ తెలిసున్నదానివి.. నీకు వేరే చెప్పాలా!”
వినోద్ మాటలు విని అతను తననుంచి ఏం ఆశిస్తున్నాడో తెలిసిన సరోజకి ఇల్లు శుభ్రం చెయ్యకుండానే నీరసం వచ్చినంత పనైంది.
“ఊ!” అంది సరోజ భర్త మాటకి వంత పలుకుతూ.. ఇంకా కొత్త. ఏం మాట్లాడితే యేమనుకుంటాడో తెలీదు.
అంతే హడిలిపోయి నాకు ఫోన్ చేసి బేరుమంది..
“పెద్దమ్మా, ఇదిగో ఇక్కడ వరస ఇలా ఉంది. మా ఆయనకి వేరే ఊళ్ళో ఉద్యోగం కూడా కాదు.. ఈ ఊళ్ళోనే.. నా పరిస్థితి తల్చుకుంటే భయమేస్తోంది..” అంది.
ఇంతకీ సరోజ ఎవరో చెప్పనేలేదు కదూ.. మా చెల్లెలి కూతురు. కొత్తగా పెళ్ళైంది.. పాపం అత్తారింట్లో పరిస్థితి చూసి హడిలిపోయింది.
అక్కడికీ దానిని ఓదార్చేను.. “అన్నీ మీ అత్తగారే తుడిచేసుకుని కడిగేసుకుంటుంది కదే.. ఇంక నీకెందుకూ బెంగ..” అంటూ..
“అయ్యో.. నిన్నేమైందో తెల్సా.. పక్కింటావిడ పేరంటానికి పిలిస్తే నన్నూ తీసికెళ్ళిందా.. వాళ్ళింట్లో కిటికీలో దుమ్ము కనపడిందిట.. గబుక్కున చేతిలో ఉన్న రుమాలుతో తుడిచేస్తోంది.. నన్ను కూడా అలాగే ఎదురింటికీ, పక్కింటికీ వెళ్ళి తుడిచైమంటుందేమో పెద్దమ్మా..”
సరోజ మాటలు వింటుంటే పాపం పిల్ల ఎంత బెదిరిపోయిందో అనిపించింది. ఏం చెప్పడానికీ నాకేం తోచక “ఉండు.. వదిన్ని అడుగుతాను.. ఏదైనా ఉపాయం చెప్తుందేమో..” అని వదినకి విషయం చెప్పేను.
“హోస్.. ఈ మాత్రానికే అంత ఖంగారు పడిపోవాలా సరోజ? నేను మాట్లాడతాలే దాంతో.” అంది వదిన.
హమ్మయ్య.. వదిన రంగంలోకి దూకిందంటే ఇంక తిరుగేవుందీ.. నిశ్చింతగా నిద్రపోయేను. నాలుగు రోజులు గడిచేయి. అయిదోరోజు సరోజ ఫోన్ చేసి ఆనందంతో “అత్త భలే చేసింది పెద్దమ్మా.. ఇప్పుడు మా అత్తగారు భలే మారిపోయేరు. చాలా సంతోషంగా కూడా ఉన్నారు” అంది.
“అలా ఎలాగే! ఇంతకీ వదినేం చేసిందీ?” అన్న నా ప్రశ్నకి సరోజ సమాధానం ఇదుగో..ఇదే..
మొదటిరోజు వదిన సరోజకి ఫోన్ చేసి, ఒక ప్రత్యేకమైన విషయం చెప్పడానికి చేసేనంటూ..
“మా అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉండే సుశీలా ఆంటీ హాస్పిటల్లో చేరిందే సరోజా.. పెళ్ళైనప్పట్నించీ ఒళ్ళు దాచుకోకుండా ఆ ఇంటికి చాకిరీ చేస్తూ కూర్చుంది కదా.. ఇంకా అరవైయేళ్ళు కూడా రాకుండానే మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయిందిట.. ఆపరేషన్ చెయ్యాలని హాస్పిటల్లో చేర్చేరు..” అందిట.
“ఏవంటుంది మీ అత్తయ్యా..” అని అడిగిన అత్తగారికి విషయం చెప్పి బాధపడిందిట సరోజ.. పాపం అనుకుంటూ ఆవిడ కూడా బాధపడిందిట.
రెండోరోజు ఫోన్ చేసి “మా వదిన అక్క తోడికోడలిని మొన్న హాస్పిటల్లో చేర్చారే సరోజా.. అవిడా నీకు తెల్సుగా.. మొన్ననే కూతురికి పెళ్ళి చేసింది.. ముఫ్ఫైయేళ్ళనుంచీ మడీ తడీ అంటూ చన్నీళ్ళ స్నానాలూ, తడిబట్టలూ కట్టుకునేది కదా! అదే ఆవిడ పాలిట రోగమై కూర్చుంది. అసలే చలెక్కువ ఆ మనిషికి. ఇంకది ఆస్తమా లోకి దింపింది.. చాలా బాధపడుతోందనుకో పాపం..”
ఆ రోజు కూడా అత్తగారికి వదిన ఎందుకు ఫోన్ చేసిందో చెప్పింది సరోజ. ఆవిడ కళ్ళల్లో ఒకలాంటి భయం కదలాడిందట.
మూడోరోజు ఫోన్ చేసి “మా ఊళ్ళో పార్వతక్కయ్య అని పిలిచేవాళ్లం గుర్తుందా! ఆవిడ కాళ్లకేదో జబ్బులాంటిది వచ్చిందిట.. నీరసంగా ఉంటున్నా పట్టించుకోకుండా ఇల్లాంతా సద్దుతూ కూర్చునేది అస్తమానం.. ఇప్పుడు మంచం దిగలేకపోతోంది పాపం..”
ఇది విని సరోజ అత్తగారి మొహంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందిట సరోజకి.
నాలుగో రోజైతే వదిన ఫోన్ చెయ్యగానే సరోజ అత్తగారు “మీ అత్తకి చెప్పు.. ఇలాంటి విషయాలైతే చెప్పొద్దని. అయినా ఇల్లన్నాక తుడుచుకోకుండా, కడుక్కోకుండా ఉంటారా ఎవరైనా?” అని గట్టిగా అడిగిందిట ఆవిడ.
అత్తగారడిగిన మాటే అంతకన్నా గట్టిగా వదిన్ని అడిగిందిట సరోజ.. అప్పుడు వదిన ఏం చెప్పిందిటంటే..
“అయ్యో.. సరోజా. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవద్దని ఎవరంటారూ.. శుభ్రంగా ఉంచుకోవాలనుకోవడం వేరూ.. అదే పనిగా తోవిందే తోవీ, కడిగిందే కడిగీ, తుడిచిందే తుడిచీ చేస్తూ.. ఇల్లంతా అద్దంలా మెరిసిపోతోందని అందరూ మెచ్చుకోవాలనుకోవడం వేరూనూ..
ఏ మనిషయినా ఓపిక ఎంతవరకూ ఉంటుందో ఆలోచించుకోవాలి. వయసులో ఓపికుంది కదాని ఒళ్ళెరక్కుండా పని చేస్తే దాని ప్రభావం వయసయాక బయట పడుతుంది.. అందుకే ఏ పనైనా తెలివిగా చేసుకోవాలి. తను పని చెయ్యడవే కాకుండా ఎదుటివాళ్ల చేత చేయించుకోవడం కూడా తెల్సుకోకపోతే ఒంట్లో ఓపిక కాస్తా ఖర్చైపోతుంది. అప్పుడు కదల్లేని పరిస్థితి వస్తే మనకెవరు చేస్తారూ..
అదంతా వదిలై సరోజా… మా పెద్దమ్మకూతురు లక్ష్మి నీకు తెల్సుకదా.. లక్ష్మి మడికట్టుకుందంటే పాతికమందికి ఎడంచేత్తో ఇట్టే వంట చేసెయ్యగలదు అని పదేళ్ళక్రితం మెచ్చుకునేవాళ్ళు చుట్టాలూ, స్నేహితులూ కూడానూ. కానీ ఇప్పుడు ఆ లక్ష్మే పాపం నడుం నెప్పితో మంచమీంచి లేవలేకపోతోంది. అందరూ సానుభూతి చూపించగలరు కానీ ఆవిడ బాధలో పాలుపంచుకోలేరు కదా! పాపం వాళ్ళాయనే అన్నీ తనే అయి లక్ష్మిని చూసుకుంటున్నాడు. పదిమందికి తన చేత్తో వండి పెట్టే లక్ష్మి అలా ఇంకోళ్ళమీద ఆధారపడవల్సి వచ్చినందుకు ఎంత బాధపడుతోందో..
అందుకే ప్రతి ఇంట్లోనూ ఇల్లాలి మీద ప్రేమున్న ఆ ఇంట్లో మనుషులు ఈ విషయాలు ఆవిడకి చెప్పి ఆవిడ మీద పని ఒత్తిడి తగ్గించాలి.. ఎవరైనా సరే ముందు ఇంటి ఇల్లాలి పరిస్థితి చూసుకోవాలి. ఇల్లాలే లేకపోయాక ఇంక ఇల్లెక్కడుంటుంది!
ఏవే సరోజా.. నువ్వైనా మీ అత్తగారి గురించి పట్టించుకోవచ్చు కదే.. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటే ఆ ఇల్లాలే కనపడకుండాపోయే ప్రమాదం ఉంది. అందుకే ముందు ఇల్లాలి సంగతి చూసుకుని, తర్వాతే ఇంటిని చూసుకోవాలని ఈమధ్య అంటున్నారు.. వినలేదా!
ఏం.. మనమేవీ ఆమాత్రం లేనివాళ్లం కాదు కదా! చక్కగా ఇద్దరు మనుషులని పెట్టుకుని, హాయిగా కుర్చీలో కూర్చుని అజమాయిషీ చేయమను మీ అత్తగారిని. వాళ్లచేత రోజుకి పదిసార్లు దుమ్ము దులిపించమను. ఇరవైసార్లు కడిగించమను. అన్నింటికీ ఆవిడ పరిగెట్టి అల్సిపోనక్కర్లేదు.”
వదిన చెప్పిన మాటలు విన్న సరోజ అత్తగారు ఆ మర్నాడే మరో ఇద్దరు మనుషులని పనికి కుదుర్చుకుని, ఆవిడ కుర్చీలో కూర్చుని వాళ్లని అజమాయిషీ చేస్తున్నారుట.. సరోజ ఎంత హాపీసో…
ఈ విషయం విన్నాక ఇంత మంచి జీవనసత్యాన్ని చెప్పిన వదినని మెచ్చుకోకుండా ఉండగలమా!..