[dropcap]సూ[/dropcap]చన: ఈ వ్యాసంలో పరిచయం చేసిన సీరీస్ కథాపరంగా పెద్దలకు మాత్రమే. కావున ఈ వ్యాసం కూడా పెద్దలకు మాత్రమే.
1998లో ప్రపంచాన్ని ఊపేసింది బిల్ క్లింటన్-మోనికా లూయిన్ స్కి ఉదంతం. అమెరికా అధ్యక్షుడు క్లింటన్, శ్వేతసౌధం (అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం) లో ఇంటర్న్‌గా పనిచేసిన మోనికా మధ్య లైంగిక సంబంధం ఉందనే వార్త పెను సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి మోనికా తన సహచర ఉద్యోగిని లిండా ట్రిప్‌తో ఫోన్లో పంచుకున్నవివరాలను లిండా ఆడియో టేపుల రూపంలో బయటపెట్టింది. ఇది క్లింటన్ మీద అభిశంసన (ఇంపీచ్‌మెంట్) తీర్మానానికి దారి తీసింది. అయితే అమెరికా ఎగువ సభలో అది వీగిపోయింది. ఈ ఉదంతం గురించి తీసిన వెబ్ సీరీస్ ‘ఇంపీచ్‌మెంట్ – అమెరికన్ క్రైం స్టోరి’. మోనికా ఈ సీరీస్‍కి ఒక నిర్మాత కావటం విశేషం. పది భాగాల ఈ సీరీస్ డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీలో గత ఏడాది విడుదలయింది.
ఈ సీరీస్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఏది తప్పు, ఏది ఒప్పు అనేది చట్టం దృష్టిలో ఒకలా, ధర్మం దృష్టిలో ఒకలా ఉంటే తప్పు చేసినవారు తప్పించుకుంటారు, ఆ తప్పును సహించలేని వారు విలన్లుగా మారుతారు, కొందరు పావులుగా మారుతారు. ఉదాహరణకి పెళ్ళికి ముందు సహజీవనం చట్టం ప్రకారం తప్పు కాదు. కాని ఏ మతమైనా ఇది తప్పనే అంటుంది. ఆ మాట అనేవాళ్ళు ఈ రోజుల్లో విలన్లే, స్వేచ్ఛకు అడ్డు వచ్చేవారే. క్లింటన్-మోనికా ఉదంతంలో క్లింటన్ అభిశంసన నుంచి తప్పించుకోగా లిండా ట్రిప్ విలన్ అయింది. మోనికా వీరిద్దరి మధ్య నలిగిపోయింది. లిండా తాను పాటించిన ధర్మం దేశభక్తి అని చాలా సార్లు చెప్పింది.
గ్రాండ్ జ్యూరీ ముందు 1998లో ఇచ్చిన వాంగ్మూలంలో మోనికా ‘ఐ హేట్ లిండా ట్రిప్’ (నేను లిండా ట్రిప్‌ని ద్వేషిస్తున్నాను) అని ముగించింది. 23 ఏళ్ళ తర్వాత ఆమె అభిప్రాయం మారిందని ఈ సీరీస్ చూసిన వారికి అనిపించక మానదు. ఎందుకంటే ఈ సీరీస్‌లో ముఖ్య పాత్ర లిండాయే. ఆమె దృక్కోణాన్ని ఎంతో సహృదయంతో చూపించారు. మోనికా ఒక నిర్మాత అయిన సీరీస్‌లో ఇలా చూపించారంటే లిండాపై ఆమె అభిప్రాయం మారినట్టేగా!
సీరీస్‍లో కథ 1993లో మొదలవుతుంది. అప్పటికి క్లింటన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఆరు నెలలవుతుంది. నలభయ్యవ పడిలో ఉన్న లిండా అప్పటికే శ్వేతసౌధంలో చాలా ఏళ్ళుగా పని చేస్తూ ఉంటుంది. గత అధ్యక్షులతో పోలిస్తే క్లింటన్ దంపతుల పద్ధతులు, విలువలు తక్కువ స్థాయివని ఆమె అభిప్రాయం. ప్రస్తుతం శ్వేతసౌధం లోని ఒక లాయర్‌కి సెక్రటెరీగా ఉంటుంది. ఆ లాయర్ ఒక కుంభకోణంలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ కుంభకోణంలో క్లింటన్‌కి పాత్ర ఉందనేది అభియోగం. ఈ నేపథ్యంలో లిండా శ్వేతసౌధంలో ఉంటే క్లింటన్‌కి ప్రతికూలమని భావించి ఆమెని పెంటగాన్ (అమెరికా రక్షణ కార్యాలయం) కి బదిలీ చేస్తారు. ఆ ఉద్యోగం ఆమె స్థాయికి తగినది కాదు. శ్వేతసౌధాన్ని ఒక పవిత్ర కార్యాలయంలా భావించే ఆమెకి ఇది మింగుడు పడదు. ఉక్రోషంతోనే పని చేస్తూ ఉంటుంది.
మూడేళ్ళ తర్వాత మోనికా పెంటగాన్‌కి పని చేయటానికి వస్తుంది. అప్పటికి ఆమెకి 23 ఏళ్లు. లిండాతో పరిచయమవుతుంది. తాను కూడా శ్వేతసౌధం నుంచి బదిలీ అయి వచ్చినట్టు, ఆ ఏటి అధ్యక్ష ఎన్నికల తర్వాత తిరిగి శ్వేతసౌధానికి పిలిపిస్తామని అధికారులు చెప్పినట్టు చెబుతుంది. ఇద్దరూ స్నేహితులవుతారు. దరిమిలా మోనికా తనకు క్లింటన్‌తో ఉన్న ప్రేమ వ్యవహారం గురించి చెబుతుంది. క్లింటన్ ఆమెకు ఫోన్ చేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు శ్వేతసౌధానికి పిలిపించుకుని బహుమతులు ఇస్తూ ఉంటాడు. వారి మధ్య శ్వేతసౌధంలోనే లైంగిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ మోనికా లిండాకి చెబుతుంది. పనివేళలు ముగిశాక కూడా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది.
ఎన్నికల్లో గెలిచి క్లింటన్ మళ్ళీ అధ్యక్షుడవుతాడు. మోనికా తిరిగి శ్వేతసౌధంలో చేరే విషయంలో తాత్సారం జరుగుతూ ఉంటుంది. ఆమెకు క్లింటన్ ఫోను చేయటం తగ్గిస్తాడు. అప్పుడప్పుడూ పిలిచి బుజ్జగించి ఆమెను లైంగికంగా వాడుకుంటూ ఉంటాడు. అతని మాయలో ఉన్న మోనికా ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. బాధ కలిగినప్పుడల్లా లిండాకి ఫోన్ చేసి గోడు చెప్పుకుంటుంది. ఈ సంభాషణలని లిండా ఎందుకు రికార్డ్ చేసింది, ఏ కారణంగా బయటపెట్టింది, దాని వల్ల మోనికాకి ఎదురైన పరిస్థితులు ఏమిటి, కోర్టుల్లో క్లింటన్, మోనికా, లిండాల వాంగ్మూలాలు మిగతా కథ.
సారా బర్జెస్ రాసిన స్క్రీన్ ప్లే కట్టి పడేస్తుంది. ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ చూస్తూపోతాం. రయన్ మర్ఫీ ఈ సీరీస్‌కి పర్యవేక్షకుడు. ఎన్నో మంచి సీరీస్ చేసిన అనుభవం అతనిది. అతని ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అతని సీరీస్ లలో ఎక్కువగా నటించే సారా పాల్సన్ లిండాగా అద్భుతంగా నటించింది. లిండాలా కనిపించటానికి ఫ్యాట్ సూట్ (లావుగా కనిపించటానికి వేసుకునే తొడుగు) ధరించి తన ఆహార్యంలో, హావభావాల్లో లిండాని అనుకరించటంలో విజయం సాధించింది. ఆమె సారా పాల్సన్ అని కొందరు గుర్తుపట్టలేక పోయారంటే ఆమె ఎంతగా రూపాంతరం చెంది నటించిందో అర్థమవుతుంది. నిజ జీవితంలో లిండా 2020లో మరణించింది. ఆమె కుమార్తె ఈ సీరీస్ చూసి తన తల్లిని సహృదయంతో చూపించినందుకు హర్షం వ్యక్తం చేసింది. తన తల్లిని ఎంతో మంది ఒక విశ్వాసఘాతకురాలిగా భావించారని, ఈ సీరీస్‍లో ఆమె దృక్కోణాన్ని చక్కగా చూపించారని అంది. సారా పాల్సన్ కొన్ని దృశ్యాల్లో తన తల్లిలాగే అనిపించిందని అభినందించింది. టీవీ సీరియల్స్‌కి, వెబ్ సీరీస్‌కి ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ఎమ్మీ అవార్డ్స్‌లో ఉత్తమ నటి విభాగంలో ఈ సంవత్సరం సారా పాల్సన్ గట్టి పోటీ ఇవ్వటం ఖాయం. క్లింటన్‌గా క్లయివ్ ఓవెన్ (“చిల్డ్రన్ ఆఫ్ మెన్”), మోనికాగా బీనీ ఫెల్డ్ స్టీన్ (“లేడీ బర్డ్”), క్లింటన్ భార్య హిలరీ గా ఈడీ ఫాల్కో (“ద సొప్రానోస్”) నటించారు. అందరూ ఆరితేరిన నటులే.
వెబ్ సీరీస్‌లో అశ్లీల దృశ్యాలు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో ఈ సీరీస్‌లో ఎక్కడా హద్దు దాటకపోవటం అభినందనీయం. అయితే కథాపరంగా కొన్ని విచారణ దృశ్యాల్లో లైంగిక చర్యల గురించి విపులంగా మాట్లాడతారు. వినటానికి ఇబ్బందిగా ఉన్నా ఆ సందర్భంలో మోనికా ఎంత క్షోభ అనుభవించిందో తలచుకుంటే ఒళ్ళు జలదరిస్త్తుంది. బీనీ ఫెల్డ్ స్టీన్ తన నటనలో ఆ క్షోభను గుండెలు పిండేసేలా చూపించింది.
హిలరీ క్లింటన్ ఈ వ్యవహారంలో ఎలా స్పందించిందనేది మరో ఆసక్తికర అంశం. ఆమెకు తెలియకుండా ఏమీ జరగలేదని కొందరు, ఆమెకి ఆలస్యంగా అసలు విషయం తెలిసిందని కొందరు అంటారు. ఈ సీరీస్‌లో ఎలా చూపించారో చూసి తెలుసుకోవాల్సిందే!
క్లింటన్ చాలా తెలివైన మనిషి. చట్టంలో ‘లైంగిక సంబంధం’ అనే పదబంధానికి ఉన్న నిర్వచనం ప్రకారం తాను నేరం చేయలేదని వాంగ్మూలం ఇస్తాడు. ‘There is’ (ఇప్పుడు ఉంది), ‘There was’ (గతంలో ఉంది) అనే పదబంధాల్లో ఉన్న లొసుగుల్ని కూడా బాగా వాడుకుంటాడు. అధ్యక్షుడిగా అతడికి కొన్ని మినహాయింపులు కూడా ఉండటంతో కోర్టుకు రాకుండా వీడియో కాన్ఫరెన్స్‌లో జ్యూరీ సభ్యులు చూసేలాగా లాయర్‌కి వాంగ్మూలం ఇస్తాడు. క్లింటన్ తరఫు లాయర్లు తక్కువేమీ తినలేదు. తాత్సారం చేసి జ్యూరీ సభ్యులు ప్రశ్నలు వేయటానికి సమయం లేకుండా చేయమని సలహా ఇస్తారు. ఆ సలహా పాటించి తనకు ముఖ్యమైన రాచకార్యాలు ఉన్నాయని, ఇక సమయం లేదని చెప్పి వాంగ్మూలాన్ని ముగిస్తాడు క్లింటన్. మోనికా, లిండాలు కోర్టులో ఎన్నో అవమానకరమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మోనికా పరిస్థితి అయితే మరీ దారుణం. తాను రహస్యంగా ఉంచాలనుకున్న విషయాలు కోర్టులో ప్రమాణం చేసి అందరి ముందూ చెప్పలేక ఆమె పడే బాధ వర్ణనాతీతం. దరిమిలా క్లింటన్ పొరపాటు (పొరపాటు మాత్రమేనా?) చేశానని బయట ఒప్పుకున్నా అతను చేసింది అవినీతి గానీ, దేశద్రోహం గానీ కాదు కనుక ఎగువ సభలో అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా అధిక సభ్యులు ఓటు వేశారు.
దేశానికి అధ్యక్షుడంటే ఎంతో ఉన్నత విలువలు ఉండాలని లిండా నమ్మకం. ఎందరో హుందా గల అధ్యక్షులను చూసిన ఆమె క్లింటన్ చేష్టలని భరించలేకపోయింది. ఒక 23-24 ఏళ్ళ పడుచు యువతితో క్లింటన్ కామకలాపాలని అపరాధంగా భావించింది. ఆ వయసులో మోనికాకు లేని పరిణతి క్లింటన్‌కు ఎందుకు లేదనేది సహేతుకమైన ప్రశ్న. ఇక్కడ మోనికా తప్పేమీ లేదనటం లేదు. పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ, సెక్స్ నాకు ఇష్టమైనపుడు అది నా వ్యక్తిగతం అనేది ఆమె అభిప్రాయం. ఆ సంబంధం ఏర్పడకుండా చూసుకోవటం ఒక పరిణతి గల వ్యక్తిగా క్లింటన్ బాధ్యత అనేది లిండా వాదన. మోనికాని కుంగదీస్తున్న ఆ అక్రమ సంబంధం నుంచి ఆమెని బయటపడేయాలనుకోవటం కూడా తాను చేసిన పనికి ఒక కారణమంటుంది లిండా. మోనికా తిరిగి శ్వేతసౌధంలో పని చేయటానికి వెళుతుందని విని లిండా అసూయ పడిందా అనేది ఆమెకే తెలియాలి. ఆమె ఒక సంచలనమైన పుస్తకం రాసి లాభపడాలనుకుందన్నది ఇంకో కోణం. క్లింటన్‌ని కలుసుకోమని లిండా తనని ప్రొత్సహించేదని మోనికా అంది. అలా చేసి మళ్ళీ తన మంచి కోసం టేపులు బయటపెట్టాననటం నమ్మకద్రోహం కాదా అనేది మోనికా ప్రశ్న. కాలం గడిచిన కొద్దీ మోనికా ఆలోచన మారిందని ఈ సీరీస్ చూశాక అనిపిస్తుంది. ఒక బృహత్కార్యం కోసం కొందరు బలి కావలసిందేనేమో! ఆ బృహత్కార్యం పూర్తిగా సఫలం కాకపోతే అంతా వ్యర్థమని అనిపించవచ్చు. కానీ ఆ ప్రయత్నం భవిష్యత్తులో మరెన్నో జీవితాలు పాడుకాకుండా కాపాడిందని చెప్పవచ్చు.
అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లింటన్ తాను ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం మోనికాతో ‘ప్రేమకలాపం’ నడిపానని, దాన్ని సమర్థించుకోవట్లేదని అన్నాడు. అధికారం ఉన్నవాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే చూసీ చూడనట్టు వదిలేయటం సబబేనా? వారు సమర్థులైన ప్రపంచ స్థాయి నాయకులైతే మాత్రం వారి కాలక్షేపానికి ఇతరుల జీవితాలతో ఆడుకోవచ్చా? మోనికా లాంటి వాళ్ళు ఈ సంబంధం నా వ్యక్తిగతం, దీని పర్యవసానం నాకు తెలుసు, ఇతరులకు అనవసరం – అంటే ఇతరులు చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోకుండా నిలదీస్తే అది దేశద్రోహమా? ఇలాంటి ప్రశ్నలతో ఆలోచింపజేస్తుంది ఈ సీరీస్.