గురజాడకు వన్నె తేవాలనే అభిలాష ‘నందిపిల్లి గురజాడ కన్యాశుల్కం’

0
2

[శ్రీ వృద్ధుల కళ్యాణరామారావు రచించిన ‘నందిపిల్లి గురజాడ కన్యాశుల్కం’ పుస్తకం తనలో కలిగించిన అనుభూతిని వివరిస్తున్నారు శ్రీ సారధి మోటమఱ్ఱి,]

నందిపిల్లి – గురజాడ కన్యాశుల్కం పుస్తకం పై నా అనుభూతి

[dropcap]ఇ[/dropcap]టీవల వృద్ధుల కళ్యాణరామారావు గారు, ‘నందిపిల్లి – గురజాడ కన్యాశుల్కం’ అనే చక్కటి, ఎవరూ రాయని, రాయలేని – పుస్తకాన్ని వెలువరించారు. ముందుగా చెప్పేదేమిటంటే, ఈ పుస్తకాన్ని, గురజాడ ఎవరికి నచ్చడో,   కన్యాశుల్కం నాటకం పై ఎవరైతే ఏహ్య భావంతో ఉంటారో, వారు తప్పక చదివి తీరాలి!

ఈ పుస్తకంలోని కొన్ని విషయాలు వృద్ధుల వారు అప్పుడప్పుడు ముఖపుస్తకం ద్వారా పంచుకుంటూనే ఉన్నారు. ఈ అనుభూతి ఏవిధంగాను పుస్తక సమీక్ష కాదు, కానీ, ఆ పుస్తకం చదివినప్పుడు నాకు అనిపించిన భావనలు మాత్రమే.

ఆధునిక (తెలుగు) సాహిత్యానికి ఒక కోహినూరు, గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకం, రచనా కాలం 1897, ఇతివృత్తం, ఆనాటి సాంఘిక సమస్య. ఆనాటి కాలమాన పరిస్థితులు ఏనాడో కనుమరుగు అయినాయి. గురజాడ వారి రెండవ కూర్పు 1909లో రాగా, కన్యాశుల్కంకు పూర్తిగా వ్యతిరేకమైన వరకట్న దురాచారం 1921 నాటికే సమాజాన్ని దొలిచేస్తుంది. ఎలా చెప్పగలం? కాళ్లకూరి నారాయణరావు గారి ‘వరకట్నం’ నాటక తొలి ముద్రణ 1921లో వచ్చింది. ఆశ్చర్యమేమిటంటే, ఈ సాంఘిక పరిణామం ఎలా జరిగింది, సమాజంలో ఇంతటి విరుద్ధమైన ఆచారాలు ఎలా చేతులు మారాయి, అనేది, నా మెదుడులో దశాబ్దాలుగా మెదులుతూనే ఉంది! బహుశా, ఇంతవరకు దీనిపై సమగ్ర పరిశీలిన జరిగినట్లు నాకు అనిపించదు. మరొకటేమిటంటే, కాళ్ళకూరి వరకట్న రచన కూడా, ఏమాత్రం వన్నెతగ్గని, ఒక ‘సాహిత్య జాకోబ్’ వజ్రం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.

అసలు సాంఘిక నేపథ్యమే మారిపోయిన కాలంలో కూడా, కన్యాశుల్కం ఇంకా ఎందుకు ఒక గొప్ప రచనగా 127 సంవత్సరాల తదుపరి కూడా నిలబడింది, రాబోయే శతాబ్దాలలో కూడా నిలబడనుంది? అంటే, ఆ రచనలో గురజాడ సాధించిన సార్వజనీనత, వ్యక్తుల స్వభావ చిత్రణ, హాస్యం, కాలానికంటే ఎంతో ముందుచూపు, విషయ పరిజ్ఞానం, సమాజానికి సాహిత్యం దిక్సూచి కావాలనే తలంపు, ఆ విధంగా నడిపే కథాక్రమం, అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

గురజాడ కొందరకు ఎందుకు నచ్చడు, కొన్ని శాఖల వారు, అధిక విశ్వనాథ అనుయాయులు, ఎందుకు ఆయనను నొచ్చుకుంటారు? అనేది నాకు ఒక తీరని ఒక ప్రశ్నగానే నిలిచింది. అంటే మనం గురజాడ కాలంలోకి కాలయంత్రం ద్వారా ప్రయాణించాలి. అప్పటి పరిస్థితులు అవగతం చేసుకోవాలి. అప్పటి అగ్రహార పురజనుల మానవ స్వభావాలు మనం అర్థం చేసుకోవాలి. నిజంగా గురజాడ ఎవరినైనా నొప్పించాడా? పనిగట్టుకుని మన సంప్రదాయాలపై వ్యంగాన్ని చొప్పించాడా? ఆంగ్లేయానురక్తితో మన విజ్ఞానాన్ని తులనాడాడా?

కాదు, ఎంతవరకూ కాదు. “ఈసురోమని మనుషులుంటే, దేశమే గతి బాగుపడునోయ్” అని ఆక్రోశించాడు. “దేశమంటే మట్టికాదోయ్, మనుషులోయ్!” అంటూ పిలుపునిచ్చాడు. అటువంటి గురజాడకు తన నాటక శిల్పానికి, ముడి శిల ఏది? ఏమైనా ఉన్నదా? ఉన్నదంటారు, వృద్ధుల వారు. ఒక రచనపై అనేకానేక విమర్శలు, పొగడ్తలు రావచ్చు. రచన ప్రభావం సమాజంపై ఏవిధంగా ఉంది అనే దానిపై ఒక విశ్లేషణ రావచ్చు. కానీ, రచన నేపథ్య ప్రేరణ ముడి సరుకులు ఏవి, అవి ఏవిధంగా రచయితను ప్రేరేపించి, రచనలో అంతర్లీనం అయ్యాయో సూత్రీకరించడం చాలా కష్టమైన పని. ఆనాటి సంఘ పరిస్థితులతో పాటు, ఆ రచయిత సన్నిహిత వర్గం యొక్క వివరాలు, వారి జ్ఞాపకాలు, అనుభూతులు అవన్నీ అందుబాటులోకి తెచ్చుకొని, వాటిని బేరీజు వేసి, ఒక క్రమంలో అమర్చి, ఆ అమర్చిన కల్పనా భవంతి మన ముందు పెట్టాలి, విశ్లేషకుడు!

వృద్ధుల వారు ఆ పనే సఫలీకృతంగా చేశారని నా భావన. నందిపిల్లి అనే అగ్రహార అనుభవాలు, గురజాడలోని అంతర్గతంగా నలుగుతున్న నాటక రూపకల్పనలో దోహద పడింది అని, దానివల్ల, గురజాడ, కొంతవరకు వైదీకుల, ద్రావిడ బ్రాహ్మణ వర్గాల ద్వేషానికి గురయ్యాడని, వారెవరూ, బహుశా, ఆ నాటకాన్ని పూర్తిగా చదివి ఉండరని ఆయన అంటారు! దానివల్ల ఈ పుస్తకం చదివితే ఆ అనుమానాలు నివృత్తి కాగలవని కూడా మనం అనుకోవచ్చును. ఈ రచన ఆయనకు మాత్రమే ఎందుకు సాధ్యమైనది, మరెవరూ ఆ నాటక ఇతివృత్త మూలాలకు ఎందుకు పోలేదు అంటే, అది చాలా సులభమైన ప్రశ్న, నందిపిల్లితోను, అక్కడి నివాసులతోనూ ప్రత్యక్ష, పరోక్ష సంబంధ బాంధవ్యాలు ఆయనకు ఉండడమే కాదు, గురజాడ రచనపై ఎడతెగని మక్కువ, సాహిత్యాభిలాష, తెలుసుకొన్నది పదిమందితో పంచుకోవాలని, గురజాడకు వన్నె తేవాలనే అభిలాష కూడా కనిపిస్తుంది. అందుకే తప్పక చదవండి, ఈ పుస్తకం.

అలాగే నాటి వ్యావహారిక భాషోద్యమం, అందు గురజాడ చేసిన ఎనలేని కృషి, గిడిగు మరియు ఆదిభట్ల వారితో గురజాడకున్న సాన్నిహిత్యం కూడా వివరించారు. వ్యావహారిక భాష విషయంలో కందుకూరి కూడా విభేదించారని మనం తెలుసుకోవచ్చు. నాటకంలో ఒక అంశమైన “ఎత్తురుపు ఆట (పేకాట)” గురించి కూడా విపులంగా వివరించారు. అది కన్యాశుల్కం నాటకం అర్ధం చేసుకోవడానికి తప్పక ఉపకరిస్తుంది.

గురజాడ సామాజిక మార్పు కాక, ఒక ఆకాంక్షతో కన్యాశుల్కం రాశాడని ఊహించడం సరికాదు అని నా అభిప్రాయం. ఒక పూర్ణమ్మ, ఒక కన్యక ముత్యాలసరాలు, దేశమును ప్రేమించుమన్నా లాంటి ప్రేరణాత్మక గీతాలు, కొంత మనకి స్వామి వివేకానంద స్పూర్తిని కూడా గుర్తు చేస్తాయి. గురజాడ మంచి గతమున కొంచెమేనంటూ, వెనుకపడితే వెనకే నోయి, అని నమ్మినవాడుగా, ప్రపంచ మానవాళి వికసించాలని, విశ్వసించినవాడుగా అగుపడతాడు. ఆ విషయంలో రచయిత కొంత సంయమనం పాటించి, నందిపిల్లి అనుభవాలకు పరిమితమైతే బాగుండేదేమో! రచయిత దీనిపై కొంత వివరణ ఇచ్చుకున్నారు, అది గురజాడ ఆత్మతో జరిగిన, మూర్తితో జరిగిన సంభాషణలాగా కూడా చక్కగా చెక్కారు. అలాగే, కన్యాశుల్కం మొదటి కూర్పు, రెండవ కూర్పులలో  మార్పుల గురించి కూడా విలువైన సమాచారం అందించారు.

గురజాడ మరింత కాలం జీవించి ఉంటే, మరింత సాహితీ కృషి జరిగి ఉండేదని, అలాగే, గురజాడకు, గిడుగు వారికి అన్నమయ్య గురించి విపులంగా తెలిసి ఉంటే, వారికి భాషోద్యమంలో ఎంతో దోహదపడేదని నా కనిపిస్తుంది. నందిపిల్లి పునశ్చరణలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ముద్రణా దోషం సూక్ష్మ నిశిత పరిశీలనతో వృద్ధుల వారు వెలికితీసారు. వారు ఆశించినట్లు, నందిపిల్లి పునశ్చరణలో ఉన్న ముద్రణా దోషం ప్రచురణకర్తలు సరిచేస్తారని, కన్యాశుల్కం నాటకంతో పాటు, ఈ నందిపిల్లి పుస్తకం కూడా ఒక అనుబంధంగా నిలుస్తుందని ఆశిద్దాం!

స్వస్తి.

***

నందిపిల్లి గురజాడ కన్యాశుల్కం
రచన: వృద్ధుల కళ్యాణరామారావు
ప్రచురణ: ఛాయా రిసోర్స్ సెంటర్
పేజీలు: 164
వెల: ₹150.00
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/NANDIPILLI-KANYASULKAM-VRUDDHULA-KALYANA-RAMARAO/dp/B0CRZ7F7M7

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here