[dropcap]నే[/dropcap]డు ప్రపంచమంతా కార్మిక దినోత్సవం జరుపుకుంటోంది. 1880 ఆ ప్రాంతాల్లో, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కార్మికులంతా తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్న సమయాలకు గుర్తుగా మేడే నిర్ణయించబడింది. షికాగోలోని హే మార్కెట్‌లో ప్రశాంతంగా ఉద్యమం జరుపుతున్న కార్మికులపైకి పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన ఇద్దరు వ్యక్తుల జ్ఞాపకార్ధం కూడా మేడే కార్మికుల దినోత్సవంగా నిర్ణయించబడింది. అప్పటి కార్మిక ఉద్యమాలపై,ఆ సంఘటన ప్రభావం చాలా ఉండిందని చెప్పవచ్చు. ప్రపంచంలో అనేకచోట్ల మేడే కార్మికుల సెలవు దినంగా కూడా పరిగణింపబడుతుంది. ప్రపంచ కార్మికులంతా, సరైన కార్మిక వేతనమూ, ఎనిమిది గంటల పనివేళలూ లాంటి ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్న రోజులవి.
ఐతే, భారతదేశంలో కార్మిక సమూహాల హక్కుల కోసం అహరహం శ్రమించి, హక్కుల రూపకల్పన చేసి సాధించిన మహానుభావుడు ఒకరు ఉన్నారు. కార్మికులకు ఎనిమిది గంటల పనివేళలూ, ప్రావిడెంటు ఫండూ లాంటి అనేక సౌకర్యాల రూపకల్పన చేసి, వాటిని ఆమోదింపజేసినా కూడా, చరిత్రకారులచే, రాజకీయ వేత్తలచే జాగ్రత్తగా విస్మరించబడ్డ ఆ నాయకుడూ సంస్కర్తా డా. బాబాసాహెబ్ అంబేద్కర్. చాలా మందికి ఈ విషయం ఆశ్చర్యం కలిగించవచ్చు, అంబేద్కర్ అంటే మెజారిటీ భారత ప్రజలకు గుర్తొచ్చేది రాజ్యాంగ రచయిత అని మాత్రమే. మన పాఠ్య పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు ఆయన్ని భావి భారత పౌరులకు అలాగే పరిచయం చేసాయి మరి. కొన్ని వర్గాలకూ, కులాలకు మాత్రమే అధికారం, అవకాశం ఇబ్బడి ముబ్బడిగా దక్కుతూ, మిగతా మెజారిటీ ప్రజలంతా పాలితులుగా, పాలక వర్గాల పీడనను భరించాల్సిన వారుగా మాత్రమే మిగిలిపోతున్న నిచ్చెన మెట్ల భారత సమాజాన్నిసమూలంగా ప్రక్షాళణ గావించిన అసలైన మానవతావాది, హక్కులపోరాట నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అన్నది నొక్కి వక్కాణించదగ్గ నిజమే ఐనా, మనువాద భావజాలాన్ని మెదడంతా పరచుకున్న ఆనాటి రాజకీయ శక్తులు, బాబాసాహెబ్ కృషిని తొక్కి పట్టాయి, ఆయన కృషినీ, సామ్యవాద సమాజంపట్ల ఆయన అవిశ్రాంత పోరాటాన్నీ, పాఠ్య పుస్తకాల్లోకి చేరకుండా అడ్డుపడ్డాయి. ఐనాసరే, జీవన వాహిని లాంటి ఆయన ఆలోచనలూ, అవిరళ కృషీ ఈ ఇరవయ్యొకటో శతాబ్ధ కాలానికి ఎట్టకేలకు బహిర్గతమయ్యాయి.
ఈనాటి ఈ నా వ్యాసం, భారతీయ కార్మిక వ్యవస్థకోసం, స్త్రీ కార్మికుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా ఆలోచనలు చేసారు? ఏ అధికారంతో ఆ కృషి చేసారు? ఆయన కృషికి దక్కిన ఫలితాలు ఏంటి? ఇండెపెండెంట్ లేబర్ పార్టీ అనే కార్మిక వర్గ పార్టీని ఎవరు స్థాపించారు? అనే విషయాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేస్తుంది. 1942లో, ఇండియా ఇంకా బ్రిటిష్ రూల్‌లో ఉన్నప్పుడే అంబేద్కర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా ఎన్నుకోబడ్డారు. 1942 జూలై 20 వ తేదీన ఈ ఎన్నిక జరిగింది.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బాబాసాహెబ్ ఈ మాటలు అన్నారు. “ఇలాంటి మంచి పని చేసే అవకాశం దొరకడం భవిష్యత్తుకు చాలా మంచి సూచన, ఎందుకంటే ఫ్యాక్టరీ కార్మికులకు పని ఒత్తిడి నుండి వెసులుబాటు ఉండాలి, తక్కువ పని గంటల వల్ల, వారు అలసిపోకుండా ఎక్కువ పని చేయగలుగుతారు. యజమానులకు కూడా పనివారికి ఇలాంటి ప్రశాంతతతో పని చేసే అవకాశాలు కల్పించడం మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి పనిచేసే సమయాన్ని కుదించడం అనే ఈ ప్రతిపాదన, వారి వేతనాన్ని గానీ,ఇతర అలవెన్సులను కానీ కుదించడం కాకూడదు”
అంతకు ముందు అదే సంవత్సరం ఆగష్టు 7న, “ట్రైపార్టైట్ లేబర్ కాన్ఫరెన్సు” కోసం పిలుపునిచ్చారు అంబేద్కర్. ఇందులో పరిశ్రమల్లో తలెత్తే వివాదాల పరిష్కరణ కోసం అడ్వైజరీ కమిటీల కోసం ప్రతిపాదనలు చేసారు. కార్మికులకూ, యజమానులకూ మధ్య తలెత్తే వాద వివాదాలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకునే పద్ధతుల అన్వేషణకు తెరలేపారు. ఆయన చూపిన ఈ చొరవ, ప్రభుత్వాలకూ ఉద్యోగులకూ, కార్మికులకూ, పరిశ్రమల యజమానులకూ మధ్య దూరాలను తగ్గించింది. ఒకరినొకరు ఎంతోకొంత అర్ధం చేసుకోవడానికి దోహదపడింది. ఈ సమయంలోనే ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజిల రూపకల్పన కూడా జరగడం మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా, స్త్రీ కార్మికుల ఆరోగ్య భద్రతకోసం, పనిచేసే ప్రదేశాల్లో వారి రక్షణ కోసం ఆయన గొప్ప ఆలోచనలు చేసారు. అవేంటంటే:
- గనుల్లో పనిచేసే స్త్రీల ప్రసూతి సౌకర్యాల కోసం చట్టం.
- స్త్రీల కార్మిక సంక్షేమ ఫండ్.
- స్త్రీ శిశు కార్మిక రక్షణ చట్టం.
- మహిళా కార్మికుల ప్రసూతి సౌకర్యాల చట్టం.
- బొగ్గు గనుల్లో, భూగృహాల్లో స్త్రీలు పనిచేయకుండా చేసిన చట్టం యొక్క పునరుద్ధరణ.
- లింగ బేధాలు లేకుండా ఒకటే పనికి ఒకటే వేతన చట్టం.
ఈనాడు ప్రైవేటు ఆఫీసుల్లో సైతం స్త్రీ వుద్యోగులకు ఇస్తున్న “వేతనంతో కూడిన ప్రసూతి సెలవు”, బాబాసాహెబ్ చలవే. స్త్రీ యొక్క నిబద్ధతను కొనియాడుతూ ఆయన అంటారు “బిడ్డలను కనేందుకు ఎంత కష్టమైనా సహించి, స్త్రీలు సిద్ధపడే తీరు వెలకట్టలేనిది, అదే పురుషులైతే, ఒకసారి కంటే మరోసారి అందుకు సిద్ధపడరు, కానీ స్త్రీలు అలాకాదు. కుటుంబ బాధ్యతలు మోయడంలో స్త్రీల నిబద్ధతకు తిరుగులేదు. అందుకే స్త్రీల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.” అని.
ఇంతేకాకుండా.
- బొగ్గు, మైకా గనుల్లో పనిచేసే కార్మికుల ప్రావిడెంటు ఫండు.
ఆనాటి భారతదేశ ఆర్ధిక స్థితి పరిపుష్టంగా ఉండడానికి దోహదపడ్డ బొగ్గు గనుల కార్మికుల సంరక్షణకోసం జనవరి 31, 1944 సంవత్సరంలో ఆయన ఈ పథకాన్ని రూపొందించారు. ఈ చట్టాల వల్ల, మైకా, బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు స్వంత ఇళ్ళు నిర్మించుకోగలిగారు. తాగునీరు, విద్య, లాంటి ప్రాధమిక సౌకర్యాలు తమ బిడ్డలకు కల్పించుకోగలిగారు. అంతేకాకుండా, తక్కువ ఖర్చుతో నడిచే విద్యుత్ గ్రిడ్లకోసం అంబేద్కర్ పథకాలు రూపొందించారు. స్వయం సమృద్ధితో నడిచే విద్యుచ్ఛక్తి బోర్డులకోసం కృషి చేసారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే ఆధునిక విద్యుత్ సౌకర్యాల కోసం ఎన్నో ప్రతిపాదనలు చేసారు. నీటి ప్రాజెక్టులూ, రిజర్వ్ బ్యాంక్ రూపకల్పన వెనుక సైతం ఉన్నవి బాబాసాహెబ్ ఆలోచనలే. కరువు భత్యం సైతం ఆయన ఆలోచనల ఫలితమే.
ఇంతేకాదు..
కార్మికుల నైపుణ్యాన్ని పెంచడానికి, శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణా తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘దేశం యొక్క అభివృద్ధి శాస్త్రీయ శిక్షణ లేని కార్మికుల వల్ల సాధ్యపడదు. భవిష్యత్తులో ప్రగతి సాధిచాలనుకొనే ఏ సమాజం ఐనా తమ ఉద్యోగులకు ఆయా పరిస్థితులకు అనుగుణంగా తర్ఫీదునివ్వాల’న్నారు.
బాబాసాహెబ్ మొదటిగా స్థాపించిన పార్టీ పేరు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. ఈ పేరొక్కటే చెప్తుంది ఆయన కార్మికుల పట్ల ఎలాంటి గౌరవాన్ని, ప్రణాళికలనూ కలిగి ఉన్నారు అనే నిజాన్ని ధృవీకరించడానికి. ఆగష్టు పదిహేను, 1936 ఆగష్ట్ 15 వ తేదీన ఆయన ఈ పార్టీని స్థాపించారు. మనువాద, పెట్టుబడిదారీ పెత్తనాలను తిప్పికొట్టే ఉత్కృష్ట ఆలోచనతో, భారతీయ కార్మిక వ్యవస్థకు దన్నుగా నిలబడుతూ, తద్వారా కుల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రణాళికతో ఆయన ఈ పార్టీకి ప్రాణం పోసారు. ఐతే,ఆనాటి కమ్యూనిస్టు నేతలకు బాబాసాహెబ్ ఈ పార్టీ స్థాపించడం ఏమాత్రం రుచించలేదు. కార్మికుల వోట్లను ఈ పార్టీ చీల్చేస్తుందని వారి అభియోగం. 1937 ప్రావిన్షియల్ ఎన్నికలలో ఐపీయెల్ పోటీచేసి, 17 సీట్లకుగాను 14 సీట్లు గెలిచి, ఆయన ఆలోచనలు సత్యం అని ఋజువు చేసారు. అణగారిన వర్గాల, కులాలవారంతా సంఘటితమయ్యి, తమ హక్కుల కోసం, రాజ్యాధికారం కోసం పోరాడాలని ఎన్నో బహిరంగ సభల్లో పిలుపునిచ్చారు.
ఈ దేశంలో ఎన్నో ఎన్నో విధాలుగా విభజనకూ, తద్వారా వివక్షకూ గురౌతున్న స్త్రీల, అణచివేయబడ్డ కులాల, వర్గాల ప్రజల, వుద్యోగుల, కార్మికుల హక్కుల పట్ల, జీవన భద్రతపట్ల, నిబద్ధతతో, సహానుభూతితో పనిచేసిన సంపూర్ణ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచమంతా కార్మిక హక్కుల పండుగ జరుపుకుంటున్న ఈ మంచిరోజున, భారతదేశ కార్మికులు, మహిళా కార్మికులూ, ఉద్యోగులూ ఈనాడు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు బాబాసాహెబ్ అవిశ్రాంత కృషి ఫలితమే అని ఈనాటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలోని కమ్యూనిష్టు పార్టీల నేతలకూ,మేధావులకూ, మహిళా సంఘాలకూ, మానవహక్కులనేతలకూ అందరికీ.. కార్మికుల హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ సలిపిన అవిరళ కృషిని మేడే ఉత్సవాల్లో ప్రస్తావించాల్సిన, భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది.