Site icon Sanchika

ఇంద్రధనస్సు

[dropcap]నీ[/dropcap]టికోసం పట్టిన దోసిలి నిండుతోంది, అద్దంలో తనని తాను చూసుకుంటున్న అర్జున్ గతంలోకి వెళ్లి, తనను తానే వెతుక్కోసాగాడు. అమ్మను వదిలి బడికి వెళ్ళనన్న పసితనం, ఒకసారి వెళ్ళాక ఒళ్ళు మరిచి అల్లరి చేసే పెంకితనం, తల్లి గారాబం, తండ్రి పెంపకం, స్నేహితుడి చాచిన హస్తం, మొదటి ప్రేమాయణం, అది మిగిల్చిన మాయని గాయం, ఓటమి రుచి తగిలిన క్షణం, తన మొట్టమొదటి విజయం, స్వయంగా మొదలెట్టి నడిపిస్తూన్న, నిజం కాబోతున్న తన కలల వ్యాపారం, దేనిలోనూ తనకు తాను దొరకక కళ్ళు పెద్దవై వెదకసాగాయి.

అంతలో ”అర్జున్! గంట సేపయింది బాత్రూంకెళ్లి బయటకొస్తావా? అక్కడే ఉండిపోతావా?” అన్న అమ్మ కేకలు గతంలో తప్పడిపోయి తచ్చాడుతున్న అర్జున్‌ని ప్రస్తుతంలోకి లాగాయి. దోసెళ్ళో నిండిన నీటిని మొహంమీద కొట్టుకుని, తనని తాను మరొక్కసారి దీర్ఘంగా చూసుకుని, ఛాతి నిండేంత ఊపిరి పీల్చుకుని బయటకువచ్చాడు.

”ఉన్న రెండు రోజులు అలా పరధ్యానంలో ఉండకపోతే మాతో ఈ లోకంలో ఉండొచ్చు కదా?” వేడివేడి అట్లతో పాటు చీవాట్లు కూడా వడ్డిస్తూ తినమంటూ సైగ చేసింది అతని తల్లి.

సెలవు తీసుకుని ఇంట్లో ఉన్న అర్జున్ కొన్ని రోజులుగా ముభావంగానే ఉంటున్నాడు. అదే ఆమె మనసులో కలత పడుతోంది. స్నానం, పూజ ముగించుకుని ఒకవైపు తనకు కావలసినవి సర్దుకుంటూ మరోవైపు అప్పటికే ఆఫీసుకి చేరుకున్న తన టీమ్‌కి ముఖ్యమైన పనుల గురించి నిర్దేశాలు ఫోన్లో ఇస్తూ, రోజును మొదలు పెట్టే హడావిడిలో ఉన్న అర్జున్ తండ్రి కూడా అర్జున్‌తో టిఫిన్ చేసేందుకు కూర్చున్నాడు. తన పనులు చేస్తూనే, కొడుకు కాస్త ఢీలాగా ఉన్నాడనిపించి

”ఏమైందిరా అలా ఉన్నావు” అర్జున్ జుట్ట చెరుపుతూ అడిగాడు.

అర్జున్‌కి అలా చక్కగా దువ్వుకున్న తలకట్టు చెరపడం ఇష్టం ఉండదు. అలా చేసినప్పుడల్లా అది సవరించుకుంటూ ”అలా చేయకండీ” అంటూ చిరాకు పడతాడు.

అది తెలిసే అర్జున్ తండ్రి, కొడుకుని ఆట పట్టిద్దామని అలా చేశాడు. అర్జున్ అది పట్టించుకోకుండా, తల్లిదండ్రుల వైపు దీర్ఘంగా చూస్తూ, తల్లి చేయి పట్టుకుని

”మీతో ఒక విషయం చెప్పాలి” అన్నాడు.

అర్జున్ ప్రవర్తనబట్టి అది ఎంతో ముఖ్యమైన విషయమని అతని తండ్రికి అర్థమైంది. వెంటనే ఆఫీస్‌కి ఫోన్ చేసి కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పాడు. అర్జున్ మొహంపై చిరునవ్వు. అది చూసి అతని తల్లి కూడా ఊపిరి పీల్చుకుంది. అయితే ఆనందాన్ని మనుషులు ఆహారం తినడం ద్వారా వ్యక్తపరుస్తారు అనుకునే సగటు ఆంధ్రా అమ్మ కనుక అర్జున్ వద్దంటున్నా వినకుండా ఇంకో రెండు అట్లు వడ్డించింది. ”తినేసి చెప్దూగాన్లేరా” చిరునవ్వుతోనే అన్నాడు తండ్రి.

పిల్లలు ఏ వయసులో ఏం కోరుకుంటారో ఎలాంటి తప్పటడుగులు వేస్తారో ఒక జీవితాన్ని గడిపిన తల్లిదండ్రులకు తెలియక పోదు. చక్కగా చదువుకున్నాడు, తన సొంత వ్యాపారాన్ని పైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు, ఇప్పుడు ఇక మిగిలిన ముఖ్య విషయం ఏమైయుంటుంది? ఎవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నాడనుకున్నారు అర్జున్ తల్లిదండ్రులు.

ఇద్దరిని సోఫాలో కూర్చో పెట్టి, ముందు కూర్చున్న అర్జున్ మాట తడబడుతోంది, నుదుట చెమట పడుతోంది, మనిషిలో భయం అంతకంటే బెంగా కనిపిస్తున్నాయి. అర్జున్ తల్లి తన కొంగుతో అర్జున్ చెమటని తుడుస్తూ ”ఏమైంది నాన్నా” అంది కాస్త కంగారుగానే. చేతి వేళ్ళు విరుచుకుంటూ, మాటలు వెతుక్కుంటూ, నేలకేసి చూస్తున్నాడు అర్జున్. తండ్రి కాస్త ముందుకు జరిగి, అర్జున్ని తనవైపు చూడమని

”అర్జున్ నువ్వు తప్పు చేయవన్న నమ్మకం మాకుంది, విషయమేమిటో ధైర్యంగా చెప్పు” అంటూ అర్జున్‌కి కాస్త ధైర్యమిచ్చాడు.

అర్జున్ పిడికిలి బిగించి ఊపిరి గట్టిగా పీల్చుకొని ఒకసారి తల్లిదండ్రులు ఇద్దరి వైపు చూసి..

”అమ్మా! నాన్నా! ఐ.. ఐ యామె గే!, నేనీ విషయం నాలోనే దాచుకోవాలని…, కానీ.. కానీ.. నాకు ఒక అబ్బాయితో పరిచయమయింది” గొంతు వణుకుతోంది, కళ్ళు తడి బారుతున్నాయి, ఊతకి ఏం దొరక్క గాలినే పిడికిలితో పట్టుకున్నాడు అర్జున్.

”మేమిద్దరం ఒకర్ని.. అదే, ఒకర్నొకరం ఇష్టపడుతున్నాం” అప్పటికి గుండెల్లో నిండిపోయిన భారం కన్నీళ్లగా బయటకు వచ్చింది.

”ఇది మీకు ఎలా చెప్పాలో తెలియలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం నాన్నా?” అన్నాక అర్జున్ ఊపిరి సాధారణ స్థాయికి చేరుకుంది. కన్నీళ్లు ఆగి కళ్ళు ఎర్రబడ్డాయి. ఊత కోసం చూస్తున్న చేతులు ఒకటినొకటి పట్టుకున్నాయి, రెప్పార్పకుండా తండ్రి వైపే చూస్తున్నాడు.

నిజం ఒక్కోసారి ఎంత క్రూరంగా, విచిత్రంగా ఉంటుందంటే చెవులు ఆ నిజాన్ని విన్నా మనసు దాన్ని ఒప్పుకోదు, కుదరదంటుంది, తిరస్కరిస్తుంది, ధిక్కరిస్తుంది, కుట్ర, ఇదంతా మాయ అంటుంది. చివరికి మరొక సారి వింటే, ప్రయత్నిస్తే, మనకు అనుకూలమవుతుందనుకుంటుంది. అర్జున్ తల్లి అదే స్థితిలో ఉంది. ఈ విషయం తనకు ఇప్పుడే తెలిసిందనీ, డాక్టర్‌కి చూపించండి అని, మన వంశంలో ఇలాంటివి ఉండవని, ఆ కుర్రాడు ఏదో చేసి ఉంటాడని ఇలా ఆపకుండా ఏవో వాదనలు చేస్తోంది.

”ఏం మాట్లాడరేంటండీ, నాకేం అర్థం కావట్లేదు”

రెప్పార్పకుండా అర్జున్నే చూస్తున్న భర్త భుజాన్ని తడుతూ అంది అర్జున్ తల్లి.

ఎదిగిన కొడుకు తప్పు చేశాడనుకున్నప్పుడు తలదించుకోడం తప్ప ఆ తండ్రికి మరో మార్గమేముంటుంది. అర్జున్ తండ్రి కూడా అదే చేశాడు, అతని కళ్ళు నేలని చూస్తున్నాయి, మాట మెల్లగా వచ్చింది, ముఖంలో ఓటమి కనిపించింది.

”అర్థం కాకపోవడానికేముంది, నీ కొడుక్కి మొగవాళ్ళంటే ఇష్టం, అలాంటి వాళ్లలో ఒకడ్ని ఎంచుకున్నాడు కూడా, అర్జునుడనుకున్నాను బృహన్నల పుట్టాడన్న మాట, ఇంతకన్నా పచ్చిగా నేను చెప్పలేను” అంటూ లేచి నిల్చున్నాడు.

అప్పటికే బాధపడుతున్న అర్జున్ తల్లి బావురుమంది.

పదేపదే గీమని కొట్టుకుంటున్న తన సెల్ ఫోన్ పట్టుకుని, ఆఫీస్ బయలుదేరుతూ,

”నన్ను తండ్రిగా ఓడిపోయేలా చేసావర్జున్!” అన్న తండ్రి మాటలు అర్జున్‌కి ఊపిరి ఆడనివ్వలేదు.

***

ఆఫీస్‌కి వెళ్ళినా అర్జున్ తండ్రి పనిమీద శ్రద్ధ పెట్టలేకపోయాడు. అతని చెవులు ఉదయం అర్జున్ అన్న మాటలే వింటున్నాయి. కళ్ళు కన్నీరు కారుస్తున్న తన కుటుంబాన్నే చూస్తున్నాయి. మెదడు క్షణానికో కోటి ఊహల్ని ఊహించుకుంటోంది. క్లైంట్ ముందు ఇవ్వాల్సిన అతి ముఖ్యమైన ప్రజెంటేషన్‌లో తడబడి తప్పులు చేశాడు. ఎప్పుడూ అదరగొట్టే ఆయన ఈసారి నీరుగార్చేడేంటని అతని టీం ఆశ్చర్యపడ్డారు, పోటీదారులు ఆనందపడ్డారు, కంపెనీ సీఈఓ కృష్ణకుమార్ గారు మాత్రం ఆలోచనలో పడ్డారు.

కంపెనీ మొదలుపెట్టినప్పటి నుండి అర్జున్ తండ్రి అక్కడే పని చేస్తున్నాడు. ఇప్పటికీ సీఈవో కృష్ణకుమార్ గారిని అతని పోటీదారులు కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజీ విజయ రహస్యం చెప్పమని అడుగుతుంటారు. అంతటి విజయవంతమైన విభాగాన్ని నడిపిస్తూ కంపెనీ ఎదుగుదలలో ముఖ్య భాగమయ్యాడు అర్జున్ తండ్రి. అలాంటాయన ఆవేదనలో ఉండటం చూసి తన వంతు సాయం చేద్దామనుకున్నారు కృష్ణకుమార్.

”మహేంద్ర! ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి కలవండి” ప్రజెంటేషన్ మూగిసాక అర్జున్ తండ్రి మహేంద్రతో అన్నారు కృష్ణకుమార్. ఆరోజు ప్రజెంటేషన్‌లో జరిగిన తడబాటు గురించి వివరణ ఇస్తున్నా మహేంద్ర మనసు మాత్రం అక్కడ లేదు. అది గమనించిన కృష్ణకుమార్ గారు అసలు సమస్య ఏంటని సూటిగా అడిగారు.

పనిచేయని వాడిలో భయం, పని చేతగాని వాడిలో బాధ ఉంటాయి కానీ మహేంద్రలో బెంగ కనిపిస్తోందని అన్నారు. అంతేకాక సంస్థ నుండి సాయం కోరే హక్కు మహేంద్రకుందని గుర్తు చేశారు. కానీ మహేంద్ర తన సమస్యను ఎలా చెప్పగలడు? పొరపాటున పదిమందికి తెలిస్తే!!?

ఒక్కోసారి సమస్య కంటే దాన్ని అందరినుండి దాచడం పెద్ద సమస్యౌవుతుంది. పైగా కృష్ణకుమార్ గారు ఏనాడు ఎవరి వ్యక్తిగత జీవితాల్లోనూ కలుగజేసుకోలేదు, ఆయన వ్యక్తిగత జీవితాన్నీ రహస్యంగానే ఉంచారు. ఎవరికీ తన కుటుంబం గురించి తెలియదు. ఆయన తెలుసుకునే చనువు ఎవరికీ ఇవ్వలేదు.

అలాంటిది ఈ విషయం ఆయనకు చెప్పాలా వద్దా అని సంకోచిస్తూండగా

”నేను మీ స్నేహితున్నని చెప్పలేను గానీ కచ్చితంగా మీ శ్రేయోభిలాషిని” అన్న కృష్ణకుమార్ మాటలు మహేంద్ర తన బాధను పంచుకునేలా చేశాయి.

ఆవేశంతో ఆవేదనతో జరిగిందంతా కృష్ణకుమార్‌కి చెప్పాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొత్తం విని

”నేను అర్థం చేసుకోగలను కానీ ఎలాంటి సాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను” అన్న కృష్ణకుమార్ వైపు చూసి

”ఒక్కోసారి మన బాధని విని, అర్థం చేసుకోవడమే ఎదుటి వాళ్ళు మనకి చేసే అతి పెద్ద సాయం” చెమ్మగిల్లిన కళ్లతో అన్నాడు మహేంద్ర.

ఈ విషయాన్ని బయటికి తెలియనీయ వద్దని కృష్ణకుమార్ గారికి మరోసారి గుర్తు చేసి ఇబ్బందిగా వెళ్లిపోయాడు మహేంద్ర.

తర్వాత కొన్ని రోజులు మహేంద్ర ఆఫీసుకి రాలేదు, ఆరా తీయగా,

”ఒంట్లో బాగుండటంలేదు ముఖ్యమైన పనులను ఇంటినుండే చేస్తున్నారు” అని మహేంద్ర టీం వాళ్ళు కృష్ణకుమార్‌కి సమాచారం ఇచ్చారు. సమస్య తెలుసు గనుక మహేంద్ర తన కుటుంబంతో ఉండటమే మంచిదని అనుకున్నారు కృష్ణకుమార్.

రెండు వారాలైనా మహేంద్ర రాకపోయేసరికి కృష్ణకుమార్ కంగారు పడ్డారు. ఇన్నాళ్ళు అతనిని మహేంద్ర విషయంలో మరింత కలుగ జేసుకోకుండా ఆపింది ఒక్కటే, ఓసారి ఎదుటి వారి వ్యక్తిగత విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వారికి తన వ్యక్తిగత విషయాల్లో కలుగజేసుకొనేందుకు అనుమతి ఇచ్చినట్లే. కానీ పొరపాటున మహేంద్ర తప్పుడు నిర్ణయం తీసుకొని, తన కుటుంబాన్ని కోల్పోతాడేమో అన్న భయం కృష్ణకుమార్ని మహేంద్రకు ఫోన్ చేసేలా చేసింది.

మహేంద్రతో మాట్లాడాక కృష్ణకుమార్‌కి తను అనుకున్న దానికంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉందని అర్థమైంది. మహేంద్ర తన బంధువుల్లో కొంతమందికి విషయం చెప్పి సలహా అడిగాడు. సలహా ఇవ్వకపోగా ఇదంతా అతి గారాబం వల్లనే అంటూ మహేంద్రనే నిందించారంతా. మహేంద్ర తన బిడ్డను అర్థం చేసుకోవడం మాని వాట్సాప్ ఫార్వర్డ్ లనీ, ఆన్లైన్ ఆర్టికల్స్‌ని నమ్మడం మొదలెట్టాడు. అర్జున్‌ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లాలి అనుకున్నాడు.

అర్జున్ కాదనడాన్ని ధిక్కారంగా భావించాడు. పరువనీ, ప్రతిష్ఠని, వంశం కొనసాగాలని ఇలా ఎన్నో కారణాలతో అర్జున్ ప్రేమని అంగీకరించలేదు, అంగీకరించడం కాదు అసలది ప్రేమే కాదన్నాడు. కృష్ణకుమార్ ఫోన్ చేసిన రోజున మరో పెద్ద వాగ్వాదం జరిగిందని, కోపంలో అర్జున్ ఇంటి నుండి వెళ్లిపోయాడని మహేంద్ర చెప్పాడు.

”ఉన్నాడుకదా మొగుడో పెళ్ళామో ఏమనాలో తెలియని వాడు,వాడి దగ్గరికే వెళ్ళుంటాడు” మహేంద్ర గొంతులో బెంగా, భయం కాకుండా కోపం, ద్వేషం వినిపించాయి.

”మహేంద్ర! నేను ఊరికి చాలా దూరంగా ఉంటాను, మీకు చిరునామా చెప్పినా కనుక్కోవడం కష్టం, కారు పంపిస్తాను. రండి. మీకు వీటన్నింటి నుండి కాసేపు విశ్రాంతి కలిగినట్టు ఉంటుంది” సుమారుగా ఆదేశించారు కృష్ణకుమార్.

డ్రైవర్ వచ్చాడు, మహేంద్ర వెళ్ళాడు. కృష్ణకుమార్ ఎంత ప్రయత్నించినా మహేంద్ర ఆవేశం చల్లారలేదు, కుటుంబం పరువు పోయిందని, తలెత్తుకోలేమని, వంశం అంతం అయిపోతుందని, అసలు ఇలాంటి సంబంధానికి శాస్త్రపరమైన ఋజువు లేదని ఇలా తన కోపాన్నంతా మాటల్లో చెబుతూనే ఉన్నాడు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు అన్నాడు కృష్ణకుమార్, నెమ్మదిగా అర్జున్‌తో మాట్లాడి అసలు విషయం అర్థం చేసుకోమన్నారు.

ఆ సలహాతో మరింత మండిపోయింది మహేంద్రకి

”పిల్లలు, కుటుంబం లేనివాడికి అసలు సలహా ఇచ్చే అర్హత లేదు” అన్నాడు.

కొన్ని క్షణాల మౌనం మహేంద్రకి తన మాటల్లోని క్రూరత్వాన్ని తెలిసేలా చేసింది. క్షమాపణ చెప్దాం అనుకునేలోపే

”నాకు పాతికేళ్ళప్పుడు ఇంటి నుండి పారిపోయి వచ్చాను. వ్యాపారం చేశాను, విజయం సాధించాను. కష్టపడ్డాను, కోట్లు సంపాదించాను కానీ కుటుంబాన్ని సంపాదించుకోలేకపోయాను” అన్న కృష్ణకుమార్ మాటలు మహేంద్రకి తను అతన్ని ఎంత బాధపెట్టి ఉంటాడో చెప్పాయి. మహేంద్ర కాస్త చల్లబడ్డాడు.

”నీకున్నది నీ కొడుకు మరో మొగవాడ్ని ఇష్టపడ్డాడన్న బాధ కాదు, ఆ విషయం పదిమందికి తెలుస్తుందేమోనన్న భయం” కృష్ణకుమార్ మాటలు మహేంద్రకి సమస్యని తాను అసలు అర్థం చేసుకునే ప్రయత్నమే చెయ్యట్లేదని తెలిపాయి.

కృష్ణకుమార్ మహేంద్రని ఒకే ఒక ప్రశ్న తనకు తాను వేసుకోమని అన్నారు

”అర్జున్‌ని ఈ విషయం తెలియక ముందు ఎంత ప్రేమించాడో, ఈ విషయం తెలిసాక అంతకన్నా తక్కువ ప్రేమిస్తున్నాడా?” ఆ ప్రశ్న మహేంద్ర మనసుని ఆలోచించేలా చేసింది.

మధ్యతరగతి మనిషికి పరువు ఒక మోయలేని బరువు అని మహేంద్రకు గుర్తుచేశారు కృష్ణకుమార్. ఉన్నవాడు ఏం చేసిన ఒప్పుకుంటారు, లేనివాడు ఏం చేసిన పట్టించుకోరు, మధ్య వాడికే ఈ కులాలు, కట్టుబాట్లు, సామాజిక సంకెళ్ళు, ఆ సంకెళ్ళని తెంచుకుని ఆలోచించమన్నారు కృష్ణకుమార్.

అంతలో మహేంద్రకి తన భార్య నుండి ఫోన్ వచ్చింది భయంతో ఆమె గొంతు వణుకుతోంది

”అర్జున్ ఇంకా ఇంటికి రాలేదు, కనుక్కుందామని ఆ కుర్రాడికి ఫోన్ చేసేలోపు అతనే ఫోన్ చేసి, ‘అర్జున్ చాలా బాధతో మాట్లాడి సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు’ అని చెప్పాడు, ఏ పిచ్చి పనైనా చేస్తాడని భయంగా ఉంది” అంది. వెంటనే కృష్ణకుమార్ తన కారిచ్చి బయల్దేరామన్నారు మహేంద్రని.

ఇంటికి వెళ్లిన వెంటనే తన భార్యను కంగారుపడొద్దని చెబుదామనుకున్న మహేంద్రకి, ఆమె మరో వ్యక్తిని కంగారు పడొద్దు అని చెబుతూకనిపించింది. మహేంద్ర రాక గమనించి, అతని దగ్గరకు వచ్చి, ఏం చేద్దామని, పోలీసులకు చెప్పొచ్చా? కంపెనీలో ఎవరి సాయమైనా తీసుకోవచ్చా? ఇలా తన సలహాలు చెబుతోంది, ప్రశ్నలు అడుగుతోంది. మహేంద్ర చూపులు మాత్రం ఆ వ్యక్తి పైనే ఉన్నాయి. ఏడ్చేందుకు కూడా కన్నీళ్లు మిగల్లేదేమో ఎర్రబడి వాచిపోయేయా కళ్ళు, కంగారు పడొద్దన్నా మనసు విండంలేదేమో చేతులు వణుకుతున్నాయి. మహేంద్రను చూసి లేచి నిలుచున్నాడు, పచ్చగా, పొడుగ్గా ఉన్నాడు వణుకుతున్న చేతులతోనే నమస్కారం చేసాడు. మహేంద్రకి అతనెవరో అర్థమైంది. మహేంద్ర తిరిగి ఏమనక పోవడంతో అక్కడే తలదించుకు కూర్చుండిపోయాడు.

ఆ క్షణం మహేంద్రకి సిగ్గనిపించింది. ఆ వ్యక్తిలో అర్జున్‌కి ఏమవుతుందోనన్న భయం ఉంది, ఏమికాకూడదన్న ఆశ ఉంది, అది ప్రేమ కాదని ఎవరైనా ఎలా అనగలరనిపించింది. అర్జున్ పారిపోవడమో, మరో పిచ్చి పనో చేసేంత పిరికివాడు కాదని ఇద్దరికీ ధైర్యం చెప్పి అర్జున్ తరచు వెళ్ళే ప్రదేశాలకు వెళ్ళి చూద్దామని ఇద్దరినీ తీసుకొని బయలుదేరాడు మహేంద్ర.

తెలిసిన చోటు, తెలియని చోటు, ఉంటాడనిపించిన చోటు, ఉండకపోయినా ఓసారి చూసి వచ్చిన చోటు ఇలా అన్ని చోట్ల వెతికారు.

అలసిపోయిన శరీరం కార్చిన చెమటని, విసిగిపోయిన మనసు కార్చిన కన్నీళ్ళను కొంగుతో తుడుచుకుంటున్న తన భార్యని చూసినప్పుడల్లా, తనని ప్రేమించిన వాడు తప్పిపోయాడో లేక తనను వదిలి వెళ్ళిపోయాడో తెలియక కళ్ళు పెద్దవి చేసి వాడి కోసం వెతుకుతున్న తన కొడుకు ప్రేమించిన వాడిని చూసినప్పుడల్లా మహేంద్రకు తను ఎంత తప్పు చేసాడో తెలిసింది.

నిజానికి వాళ్ళిద్దరు చేసిన తప్పేంటి అనిపించింది. శాస్త్రపరమైన ఋజువులు లేవు, సమాజం ఒప్పుకోదు, తక్కువగా చూస్తుంది, కానీ ఈ విషయం వాళ్ళకి కూడా తెలుసు కదా, మరి ఎందుకు ఇష్టపడుంటారు? అసలు ఇద్దరు వ్యక్తులు ఒకర్నొకరు ఇష్టపడితే కాదనడానికి మిగతావారంతా ఎవరనిపించింది. తనని కారులో పంపుతూ కృష్ణకుమార్ అన్న మాటలు గుర్తొచ్చాయి.

”ఊరు మారితే పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు మారుతారు, ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే చుట్టాలంతా కలుస్తారు కానీ మనుషులు పొతే తిరిగిరారు, మనసులు విరిగితే అతకలేరు.”

అర్జున్ ఎంతకీ కనపడకపోయేసరికి వీరిద్దరిని ఇంటి దగ్గర దింపి తను పోలీస్టేషన్‌కు వెళ్ళి అడుగుతానన్నాడు మహేంద్ర.

ఇంటి దగ్గరకు వచ్చేసరికి తాళం వేసిన ఇంటి బయట, మెట్ల మీద, లైట్ కింద, తన నీడని తాను చూసుకుంటూ దిగులుగా కూర్చుని ఉన్నాడు అర్జున్.

కారు ఆగి ఆగకముందే దిగి పరిగెట్టింది అర్జున్ తల్లి. దెబ్బ తగిలిన పిల్లాడి మీద కోప్పడినట్లు కోప్పడింది. అర్జున్ అతని ప్రియుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మహేంద్ర ముందు నిల్చున్నారు. లోపలికి పదండి అన్నట్లుగా సైగ చేశాడు మహేంద్ర.

మహేంద్ర నిర్ణయం కోసం ముగ్గురు ఎదురుచూస్తున్నారు. మహేంద్ర అర్జునుని క్షమించమన్నాడు అర్థం చేసుకోకపోవడాన్ని కాదు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోవడాన్ని. ఇద్దరు వ్యక్తులు, వారు ఎవరైనా, కలిసి ఉండాలి అనుకుంటే కాదనే హక్కు ఎవరికీ లేదన్నాడు. ఈ విషయం అర్థం చేసుకునే వాళ్లే తమ జీవితాల్లో ఉంటారన్నాడు. చాలా రోజుల తర్వాత చిరునవ్వు అర్జున్ పెదాల్ని పలకరించింది. మహేంద్ర మళ్లీ తన కొడుకుని చూసి గర్వపడ్డాడు. అర్జున్ తల్లి వద్దంటున్నా, అర్జున్‌కు ఇష్టమైన వంటల్ని చేస్తానంటూ లోపలికి వెళ్ళిపోయింది

అంతలో మహేంద్రకి కృష్ణకుమార్ నుండి మెసేజ్ వచ్చింది

” అంతా క్షేమంగానే ఉన్నారని డ్రైవర్ చెప్పాడు. సంతోషం. మీ అబ్బాయి నాకు ధైర్యాన్నిచ్చాడు. నేను మా నాన్నకి ఈ సమాజానికి భయపడి దాచిన విషయాన్ని చెప్పేందుకు ధన్యవాదాలు.” అని.

మహేంద్రకి పూర్తిగా అర్థం కాలేదు. పావుగంటలో అతనికి తన టీమ్ మెంబెర్స్ నుండి, తెలిసిన వాళ్ళనుండీ మెసేజ్‌లు, కాల్సు రావటం మొదలెట్టాయి. స్టాక్ వేల్యూ పడిపోయే అవకాశం ఉందనీ, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందేననీ, చాలా నిర్లక్ష్య వైఖరనీ ఇలా ఎన్నో. అర్జున్ మహేంద్రకు కృష్ణ కుమార్ గారి ట్విట్టర్ ఇంకా ఫేస్బుక్ ఎకౌంట్ చూపించాడు.

”చాలా కాలం నా తండ్రికి భయపడి, తరువాత సమాజానికి భయపడి, తరువాత భయపడడానికి అలవాటుపడీ ఈ విషయం చెప్పలేదు. ఐ యామె గే. ఐ లైక్ మెన్. ఎంతోకాలంగా మోస్తున్న భారం దించినట్లైంది.” అని ఎకౌంట్ అప్డేట్ ఉంది.

మహేంద్ర ఒక్క క్షణం ఆలోచించి అర్జున్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు, తన కొడుకు ఆ బాధలనుండి దూరమైనందుకు.

”ఇద్దరు మనుషులు ఇష్టపడితే కాదనడానికి మిగతావారంతా ఎవరు?”

”ఊరు మారితే చుట్టుపక్కల వారు మారతారు, శుభకార్యంలో చుట్టాలంతా కలుస్తారు కానీ మనుషులు పొతే తిరిగిరారు మనసులు విరిగిపోతే అతకలేరు”

Exit mobile version