Site icon Sanchika

కథా రచయిత, బాలసాహితీవేత్త శ్రీ ఆర్. సి. కృష్ణస్వామిరాజు ప్రత్యేక ఇంటర్వ్యూ

[సంచిక పాఠకులకు ప్రముఖ కథా రచయిత, బాలసాహితీవేత్త ఆర్‌. సి. కృష్ణస్వామి రాజు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం కృష్ణస్వామిరాజు గారూ.

కృష్ణస్వామిరాజు: నమస్కారం.

~

ప్రశ్న 1. పుత్తూరు పిలగోడు మీరేనా?

జ: అవును.. నేనే.. నా బాల్య అనుభవాలే.. సరదాగా ఉండే వాటిని కథల రూపంలో రాసాను. ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథలన్నిటితో ‘కిష్టడి కతలు’ పుస్తకం, మిగిలిన కథలతో ‘పుత్తూరు పిల’గోడు’ పుస్తకంగా ప్రచురించాను.

ప్రశ్న 2: ఈ కథలలో కల్పన పాలు ఎంత? సత్యం ఎంత?

జ: అన్నీ వాస్తవ కథలే. ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చినవే.. నేను కళ్ళారా చూసిందే. అయితే వాటిని అక్షరాల రూపంలో తీసుకురావడానికి కొన్ని రంగులు అద్దడం జరిగింది. పాత్రల పేర్లు, ప్రదేశాలు, వరుసలు మార్చడం జరిగింది.

ప్రశ్న 3: ఇలాంటి కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జ: నా బాల్యం గురించి చెప్పాల్సి వస్తే ఇలాంటి కథలే రాయగలను. వేరేవి రాయలేను. ఎందుకంటే నా బాల్యం ఎంతో మధురం. నా చిన్ననాటి అనుభవాలు తేనె తొట్టెలు. మా పుత్తూరు కట్టుకట్టే ఈశ్వరాపురం గ్రామానికి రోజూ మూడు వందల మందికి పైగా కొత్త జనం వైద్యం కోసం వస్తారు. వివిధ రాష్ట్రాలనుంచి, వివిధ జీవన శైలులతో వచ్చే జనాన్ని చూస్తూ ఉంటే చాలు.. రోజులు గాలి బుడగల్లా ఎగిరిపోయేవి.

ప్రశ్న 4: ఈ కథల్లో మీరు కల్పించిన కథలు కొన్ని చెప్పండి. ఉదాహరణకు అండా కథ కల్పనా? నిజమా? దీనికి ఆలోచన ఎలా వచ్చింది?

జ: కల్పించబడ్డ కథలైతే మరిన్ని రాసి ఉండేవాణ్ణి. అరవై ప్లస్ కథలతో ఆపేవాణ్ణి కాను. అండా కథ గురించి అడిగారు. అది నిజంగా జరిగిందే. మా ప్రాంతంలో అండా అంటే పెద్ద పాత్ర. మా ప్రాంతం యాస, భాష పై తమిళ, కన్నడ భాషల ప్రభావం చాలా ఉంది. హిందీ ప్రభావం చాలా తక్కువ. అందుకే మాకు అండా అంటే గుడ్డు అని తెలియలేదు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే అన్నిటినీ కథలు చేయలేము కదా.

ప్రశ్న 5: ఈ కథలన్నీ వారం వారం ఆంధ్రప్రభలో పరిమిత నిడివిలో వొదిగి రాసినవి. అందుకని ఏ కథనయినా ఇంకా రాయాలని వున్నా, త్వరగా ముగించారా? రాయాల్సింది ఇంకా వున్నా, నిడివి ఎక్కువవుతుందని వదిలిన కథలు ఒకటి రెండు చెప్తారా?

రావూరి భరద్వాజ పురస్కారంతో రచయిత

జ: ఊరు చిన్నది. నా అనుభవం, అవగాహన కూడా చిన్నవే. అందువల్ల నిడివి విషయంలో ఇబ్బంది రాలేదు. ఎందుకంటే ఆ అనుభవాలను పెద్ద కథలుగా రాసే అవకాశం లేదు. బలవంతంగా లాగితే చదవడానికి చాలా ఇబ్బంది.

ప్రశ్న 6: మీ కథలలో అంతర్భాగంగా మీ ప్రాంతానికి చెందిన సాంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించిన విషయాలు వుంటాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా వుందీ ప్రాంతాలలో?

జ: చిన్నచిన్న మార్పులతోనే మా సంప్రదాయాలు, సంస్కృతి ఇంకా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. కాకుంటే ప్రభుత్వ ఆర్థిక సరళీకృత విధానాల వల్ల చాలామంది జీవన శైలిలో మార్పు వచ్చింది. సగటు ఆదాయం, వస్త్ర ధారణ, వాహన వినియోగం, మెరుగైన జీవన విధానం వల్ల ఇక్కడి వారందరూ ప్రస్తుతం కొత్తగా కనిపిస్తారు. కానీ బంధాల్లో, అనురాగంలో, సహాయాల్లో మాత్రం పాత మనుషులే.

కీర్తి పురస్కారంతో రచయిత

ప్రశ్న 7: ఇప్పుడు పుత్తూరులో పుట్టే పిలగాళ్ళకిలాంటి అనుభవాలుంటాయా? ఇలాంటి వాతావరణాన్ని వారనుభవిస్తారా?

జ: వాతావరణంలో కొద్దిగా తేడా ఉన్నా, ఇప్పటి పిల్లలకు ఉన్నదాన్ని ఆస్వాదించే అవకాశం లేదు. ఎందుకంటే.. పోటీతత్వం, సాంకేతికత, జీవితంలో వేగం, వస్తువుల కొనుగోలు సౌలభ్యం, జీవన ప్రమాణాలు పెరగడం వారిని సహజత్వం నుంచి దూరం చేస్తున్నాయి.

ప్రశ్న 8: ఇవన్నీ హాస్య కథలు. చిన్న కథలు. సాధారణంగా సామాజిక సమస్యను ఒక కోణంలో ప్రదర్శిస్తేనే మన విమర్శకులు రచయితకు ఆమోదముద్ర వేస్తారు. అయినా సరే మీ ధోరణిలో మీరు రాస్తున్నారు. మీకు గుర్తింపులు, అవార్డులపైన ఆశ లేదా? అలా రాయాలని అనుకోలేదా?

జ: దేనికి ఉండే ప్రాముఖ్యం దానికి ఉంది. ఏదీ తీసి వేయలేము. మా పుత్తూరు కట్టు కట్టే ప్రకృతి వైద్యులు ఇప్పటికీ చిన్నచిన్న కథలు చెబుతూ రోగులను మరో ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి ఎముకలను సరి చేస్తారు. అనిస్తీషియా ఇవ్వరు. అంటే హాస్యం కూడా వైద్యమే అని నా అభిప్రాయం.

పుత్తూరు పిల’గోడు’ పుస్తకావిష్కరణ సభ

ఇక సామాజిక సమస్యలంటారా.. వాటి నేపథ్యంలో కూడా అనేక కథలు రాసాను. అనేక బహుమతులు పొందాను.

కథ మనసులో మెదలాడినప్పుడు తాపీగా కూర్చుని ‘అది చిన్న కథ అవుతుందా, పెద్ద కథ అవుతుందా.. అది హాస్యమా, సామాజికమా’ అని ఆలోచిస్తాను. తూకం ఏవైపు మొగ్గితే.. ఆ వైపు రాస్తాను. ‘నేనింతే’ అని ఎప్పుడూ గిరి గీచుకుని కూర్చోలేదు.

ప్రశ్న 9: ఇలా, ఒక ప్రాంతానికి చెందిన కథలు రాస్తూంటే ఒక ప్రాంత రచయితగా మిగిలిపోతానన్న భయం లేదా?

జ: ఆ భయం లేదండీ నాకు. అనేక పార్శ్వాలలో నేను కథలు రాయడం జరిగింది. ‘నేను ఫలానా విధంగానే రాస్తాను’ అని ఎప్పడూ గిరి గీచుకుని కోర్చోలేదు. పుత్తూరు పిలగోడు లాంటి పుస్తకాలు మాత్రమే తెచ్చి నేను పేనా బిగించలేదు.

ఎందుకంటే నేను రాయలసీమ మాండలికంలో ముగ్గురాల్ల మిట్ట, సల్లో సల్ల, గాండ్ల మిట్ట పుస్తకాలు తెచ్చాను. చిత్తూరు యాసలో రాజనాల బండ పుస్తకం తెచ్చాను. ప్రామాణిక భాషలో దుశ్శాలువా కప్పంగ [హాస్యం], పకోడీ పొట్లం[కార్డు కథలు], మిక్చెర్ పొట్లం[మినీ కథలు],గతం గతః [ఆధ్యాత్మికం] తీసుకు వచ్చాను. అలాగే రాజు గారి కథలు, రాణి గారి కథలు, కార్వేటినగరం కథలు లాంటి బాలల కథల సంపుటులు ప్రచురించాను. పాఠకులు ఆదరించారు. వీటిలో చాలా పుస్తకాలకు పురస్కారాలు కూడా వచ్చాయి. రెండో ఎడిషన్లకు నోచుకున్నాయి.

ప్రశ్న10: భవిష్యత్తులో ఎలాంటి కథలు రాయాలనుకుంటున్నారు?

జ: ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసే రచనలు చేయాలని. పాఠకుడిని కూర్చోబెట్టి చదివించే కథలు రాయాలని. కుదిరితే ఏదో ఒక సందేశమో, సమాచారమో, సంతోషమో ఇవ్వాలని.

ప్రశ్న 11: ఈ పుత్తూరు పిలగాడి కథలలో మీరు రాయటానికి బాగా కష్టపడ్డ కథ ఏది? ఎందుకు?

జ: జజ్జనకరి జనారే.. కథ. ఊర్లో గంగ జాతర జరిగేటప్పుడు గ్రామస్తుల హావభావాలు రకరకాలుగా ఉంటాయి. లోపల ఒకటి, బయటికి ఒకటి కనిపిస్తాయి. ‘జనం ఏమనుకుంటారో..’ అని చాలా ఆలోచనల అణిచివేతలు ఉంటాయి. కాబట్టి ఎవ్వరి మనోభావాలూ దెబ్బతినకుండా రాయగలగడం కత్తి అంచుల మీద నడక అయ్యింది.

ప్రశ్న12: ఈ కథల్లో మీకు బాగా నచ్చిన కథ ఏది? ఎందుకు?

జ: ‘హై హై నాయకా’ కథ నాకు నచ్చిన కథ.

పల్లెల్లో బావులకాడ ఈత కొట్టే సరదాలు కోకొల్లలు. బావి గట్టున నిలబడి ఉంటే పక్కనున్న వారు సరదాగా బావిలోకి తోసేయడం సర్వసాధారణం. అలా తోసివేయడానికి వంద కారణాలు ఉంటాయి. ఒక్కోసారి తోసినోళ్ళు హీరోలైతే, మరోసారి తోయించుకున్నవాళ్ళు హీరోలవుతారు. ఆ నేపథ్యంతో రాసిన ఈ పుత్తూరు పిలగోడి ‘బావి దూకుడు’ కథ ఇది. నవ్వి తీరాల్సిన కథ ఇది.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు రాజు గారు.

కృష్ణస్వామిరాజు: మీకు కూడా ధన్యవాదాలు.

***

పుత్తూరు పిల‘గోడు’ (కథలు)
రచన: ఆర్. సి. కృష్ణస్వామిరాజు
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 107
వెల: ₹ 160/-
ప్రతులకు:
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆర్. సి. కృష్ణస్వామిరాజు
ఫోన్ 9393662821

 

Exit mobile version