Site icon Sanchika

‘స్వయంసిద్ధ’ సంపాదకులు భండారు విజయ, పి. జ్యోతి గార్లతో ప్రత్యేక ఇంటర్వ్యూ

[హస్మిత ప్రచురణల నుండి ఇటీవల వెలువడిన ‘స్వయంసిద్ధ’ కథా సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించిన భండారు విజయ, పి. జ్యోతి గార్లతో సంచిక టీమ్ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ.]

~

1.ప్రశ్న. తెలుగు పాఠకులు తగ్గిపోతున్నారు. పుస్తకలు కొనడంలేదు. అచ్చువేసుకుని ఉచితంగా పంచుకోవాలని అంటున్నారు. అలాంటి సమయంలో పుస్తకాన్ని ప్రచురించే దుస్సాహసం ఎందుకని చేయవల్సి వచ్చింది.

జవాబు: Vijaya – హస్మిత ప్రచురణల ద్వారా ఇప్పటివరకు నా సొంత పుస్తకాలను మాత్రమే ప్రచురించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచురణల ద్వారా ‘స్వయంసిద్ధ’ (40 మంది రచయితల) కథా సంకలనం తేవడం ఒక ప్రయోగంగానే నేను భావించాను. కానీ మీరన్నట్లుగా కథలను సమకూర్చే సమయంలో, పెద్ద సాహసమే చేశానని చెప్పవచ్చు.

గత రెండు దశాబ్దాలుగా రచయితలు తమ సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని పుస్తకాలు అచ్చువేసుకోవడం, వాటి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియక మథనపడేవారు. ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుంటాం? చదువరులకు ఎవరికి ఇచ్చినా, కనీసం వారైన తమ రచనలు చదివి తమ అభిప్రాయాలను చెబుతారనో, లేక తమ ఆలోచనలను ఇతరులతో పంచుతారనో అని తమ రచనలను ఇచ్చి ఆత్మతృప్తి పొందుతారు. నచ్చితే పుస్తకం బాగుంది అన్నమంచి మాట వినవచ్చన్న చిన్నఆశ వుండడం వల్ల తమ రచనలను ఇతర రచయితలకు ఇచ్చి, పుచ్చుకోవడాలు చేసేవారు. అది ఒప్పుకొని తీరవల్సిన వాస్తవo. కానీ, కరోనా పాండమిక్ వాతావరణం ప్రజల్లో మంచి చలనగతిని నేర్పింది. ఆ సందర్భంలో మనమందరం కూడా అనేక మానసిక,శారీరక సమస్యలను ఎదుర్కొన్నాo. వాటిని ఒక వైపు పెట్టినా.. ఆ దొరికిన సమయంలోనే పఠనాశక్తి వున్నవారు అనేకులు మరుగునపడిన తమ సృజనాత్మకతను తిరిగి పొందే ప్రయత్నంలో పుస్తక పఠన, దృశ్య, శ్రవణ సాధనాలైన, టీవి, రేడియో, పుస్తకాలను ఆశ్రయించారని చెప్పక తప్పదు. కొన్ని నివేదికల ద్వారా ఎన్నో వేల (సాహిత్యంతో పాటు ఇతర) పుస్తకాలు, (కథకుల రచనలు, నవలలు (అన్నీ భాషలలో) అమ్ముడుపోయాయని సమాజానికి తెలియవచ్చింది. ఆ దైర్యంతోనే కవిత్వం కన్న కథా సాహిత్యానికి వున్న గొప్ప స్థానాన్ని, ప్రాచుర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంకలనం తేవడానికి సంకల్పించాం. అందుకు ఆనందంగా వుంది.

Jyothi – తెలుగు పాఠకులు తగ్గిపోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. తెలుగులో వచ్చే సాహిత్యంలో ఒక మూసకు కట్టుబడి ఉన్న పుస్తకాలే ఎక్కువ ఉన్నాయి. పైగా సాహిత్యకారులు గ్రూపులుగా తమను తాము విభజించుకుని ఒక వర్గానికో ఒక భావజాలానికో కట్టుబడి రాసుకుంటూపోతున్నారు తప్ప సహేతుకంగా విశ్కేషణాత్మకంగా ఆలోచనాపరంగా వ్యాపక దృష్టితో రచించే సాహిత్యం తెలుగులో తగ్గిపోతుంది. ఇది నేను ఒక పాఠకురాలిగా చెబుతున్న మాట. ముఖ్యంగా కన్నడ, మలయాళ సాహిత్యంలో వస్తున్న పుస్తకాలను గమనిస్తే తెలుగు సాహిత్యకారుల వెనుకబాటుతనం స్పష్టమవుతుంది. అందుకే ఒక వర్గానికో, ఒక సమూహానికో, ఓ ప్రాంతానికో కట్టుబడకుండా సాహిత్య సృజన జరగవలసిన అవసరం ఉందని అనిపించింది. అందుకే ఈ సాహసం చేయవలసి వచ్చింది.

2.ప్రశ్న: ఒంటరి మహిళ కేంద్రంగా కథలు రాయించాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జవాబు: Vijaya – నేను వృత్తి రీత్యా గ్రంథాలయ అధికారిని, ప్రవృత్తి రీత్యా గత నలబై సంవత్శరాలుగా (కొన్ని సంవత్సరాలను మినహాయించి) రచయితను. కుటుంబ, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నఒక సామాజిక కార్యకర్తను. ఆ అంశాలపై పనిచేస్తున్న ఒక మహిళా కౌన్సిలర్‌ను. వేనూళ్లుగా పాతుకుపోయిన పితృస్వామిక వ్యవస్థలో స్త్రీలు ఇప్పటికీ రెండవ స్థాయి పౌరులుగానే చూడబడుతున్నారు. అందులో ఒంటరి మహిళలుగా జీవిస్తున్నవారి పట్ల, మరింత చులకన భావం ఈ సమాజంలో చూస్తాం. పురుషులు కానీ, ఇతర స్త్రీలు గానీ, వాళ్ళ ఒంటరి జీవనానికి గల కారణాలను, వాటి మూలాలను చూడకుండా ‘బట్ట కాల్చి వాళ్ల మీద ఏదో ఒక అపవాదు’ వెయ్యాలనే చూస్తారు. అలా ఎన్నో కష్టాలను, నష్టాలను, సమస్యలను ఎదుర్కొని మొక్కువోని దైర్యంతో, ఆత్మ విశ్వాసంతో, ఆత్మగౌరవంతో బతుకుతూ తమ జీవితాలను విజయవంతంగా తీర్చిదిద్దుకున్న మహిళలు అనేకమంది వున్నారు. వాళ్ళ గాథలు రాబోయే తరాల వారికి మార్గదర్శనీయం కావాలి. సమస్యలు వచ్చినప్పుడు క్రుంగిపోకుండా, పిరికితనంతో జీవితాలను అర్ధాంతరంగా ముగించుకోకుండా తమ యుద్ధం తాము ఎలా చేసుకోవచ్చు అన్న అవగాహన, ఆలోచనను భవిష్యత్తు తరాల యువతకు ఇవ్వాలన్న సత్ సంకల్పంతో ఈ అంశాన్ని ఏరి, కోరి తీసుకొని కథలు రాయించడం జరిగింది.

Jyothi – ఒంటరి స్త్రీ పట్ల సమాజానికి చాలా చిన్న చూపు ఉంది. విచ్చలవిడితనంతో జీవించడానికి స్త్రీ ఎన్నుకునే మార్గం ఒంటరి జీవితం అనే ఆలోచన ప్రస్తుత సమాజంలో ఉంది. ఇది నేను గమనించిన విషయం, అనుభవించిన వివక్ష కూడా. స్త్రీవాదాన్ని ఆధునికత పేరుతో కన్ఫ్యూజ్ చేసేసిన సాహిత్యం తెలుగులో చాలా ఉంది. స్వేచ్ఛ లోని బాధ్యతను గుర్తించలేని ఆధునిక స్త్రీవాదుల వాదం చాలా డామినేట్ చేసి ఒంటరి స్త్రీల జీవితాలని ఇంకా వివక్ష వైపుకు నెడుతుంది. ఒంటరి స్త్రీ అంటే ఇప్పుడు విలాసాల మార్గంలో ప్రయాణించే ఆధునిక యువతిగా వ్యక్తీకరించబడడం నేను చాలా సందర్భాలలో గమనించాను. అందువలన ఆమెను కంట్రోల్ చేసే వ్యవ్యస్థ కొన్ని సార్లు చాలా నిర్ధాక్షిణ్యంగా ఆమెను మానసిక హింసకు గురి చేస్తుంది. దీనికి పురుష సమాజంతో పాటు స్త్రీల ఆలోచనా ధోరణిలోనూ మార్పు రావల్సిన అవసరం ఉంది. నేను ఒంటరి స్త్రీగా అనుభవించిన వివక్ష పురుషుల కన్నా స్త్రీల ద్వారా ఎక్కువ. అందుకే ఒంటరి స్త్రీ ఘర్షణను ఆమె పోరాటాన్ని అందులోని మానసిక ఒత్తిడిని, ఆమె ఎదుర్కునే స్థితిగతులను చర్చకు పెట్టాలనుకున్నాను. ఇప్పటి దాకా స్త్రీవాదం స్త్రీ స్వేచ్ఛ కోసం ఎంత మాట్లాడినా స్త్రీ స్వేచ్ఛ పట్ల గౌరవాన్ని ఆమోదాన్ని సమాజంలో పెంచలేకపోయింది. గ్లోబలైజేషన్ కారణంగా స్త్రీవాదంలో ఒక అతి ప్రవేశించిన మాట వాస్తవం. దానివలన జరుగుతున్న నష్టం అనుభవిస్తున్న స్త్రీలను గమనిస్తూ ఒంటరి స్త్రీ జీవితాలను చూసే దృష్టిలో మార్పు తీసుకురావాలని, అలాంటీ స్త్రీలను ఆమోదించగలిగే వ్యవస్థ రావాలంటే వారి ఒంటరితనంలోనే బాధ్యతను గుర్తించే దిశగా సాహిత్యసృజన జరగాలని అనిపించి ఆ దిశగా తీసుకువచ్చిన సంకలనం ఇది.

3.ప్రశ్న: ఈ ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో ఎదుర్కొన్న సాధక బాధలేoటి?

జవాబు: Vijaya – ఈ ఆలోచన రాగానే ముందుగా నా ఉద్యమ సహచరి PoW సంధ్య గారికి విషయాన్ని చెప్పడం జరిగింది. అందుకు తన సుదీర్ఘ ఉద్యమ చరిత్ర అనుభవాలను క్రోడీకరిస్తూ కొన్ని అంశాలను సూచించడం జరిగింది. ఆ అంశాలను నా ఇతర మిత్రులతో పాటు పి.జ్యోతి గారితో కూడా చర్చకు పెట్టినప్పుడు, సమజాంలో ఒంటరి స్త్రీలుగా సామాజిక,రాజకీయ, న్యాయ, పరమైన సమస్యలతో పాటు మానసిక, శారీరక, లైంగిక ఒత్తుడులను, వివక్ష, అణచివేతను లెక్కచేయకుండా తమ జీవితాలను ఎలా ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయవంతంగా నిలబెట్టుకున్న మహిళల కథలను రాయాలని రచయితలను కోరుదాం అన్న ప్రతిపాధనను అందరూ ఏకకంఠంతో ఒప్పుకోవడం గొప్ప విషయం. ఇక ఆచరణలోకి వచ్చే సమయానికి ఒక్కొక్కరుగా ముగ్గురు మిత్రులు తమ, తమ వ్యక్తిగత కారాణాల వలన ఎడిటోరియల్ వర్గం నుంచి విరమించుకోవడం బాధాకరమే అయినప్పటికి నా ఆశయ సాధనకు, నాతో పాటు పి.జ్యోతి తన మేధస్సును, సమయాన్ని, చివరంటా ఖర్చుపెట్టి ఈ సంకలనం విజయవంతంగా పాఠకుల ముందుకు తేవడానికి పూర్తిగా సహకరించినందులకు వారికి కృతజ్ణతలు చెప్పే తీరాలి.

ఇక వస్తు సేకరణ నుంచి పుస్తక రూపం వరకు మేం ఎదుర్కొన్న  బాధలు చాలానే వున్నాయి. ముందుగా సీనియర్ రచయితలతో ఒక 20 నుంచి 25 కథలు తీసుకుని రావాలని అనుకున్నాం. వారిని పలుసార్లు మా కాన్సెప్ట్ చెప్పి కథలను రాయమని కోరినా, వారి నుండి సరైన స్పందన రాకపోవడంతో దాదాపు ఆరునెలలు నిరాశతోనే కాలాన్ని గడిపాo. ఆ తర్వాత పట్టువదలని  విక్రమార్కుడిలా ముందుగా రెండు వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేసి, నాకు బాగా పరిచయం వున్న రచయితలకు మా కాన్సెప్ట్‌ను చెబుతూ, మాకు కావల్సిన కోణాలను వివరిస్తూ, వాళ్ళు కథల్లో చూపించాల్సిన వైవిద్యాలను చెబూతు కథలను ఆహ్వానించాం. దాదాపు 60మందికి పైగా రచయితలు తమ కథలను పంపినప్పటికినీ, వాటిలో మా కాన్సెప్ట్‌కు దగ్గరగా వున్న కథలను ఎంచుకోవడంలో చాలా శ్రమ పడవలసి వచ్చింది. కొందరికి మా ఆలోచనకు దగ్గరగా కథలను పంపినప్పటికి, శైలి, శిల్పాలతో పాటు కథ ముగింపు విషయాలలో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ సూచనలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇందులో రాసిన రచయితలందరు మా సూచనలను స్వీకరించి మేం కోరినట్లుగా కథలను తీర్చిదిద్దడం జరిగింది. కొందరు రచయితలు వెసులుబాటు లేని కారణంగా మాపైనే ఆ భారాన్ని కూడా పెట్టడంతో వారి కథలను మా కాన్సెప్ట్‌కు దగ్గరగా తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాం. అలాగే సంకలనం పేరు, ముఖ చిత్రం విషయంలో కూడా మేం ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ముఖ చిత్రానికి ముందుగా అనుకున్న పేరుకు తగ్గట్టుగా ‘మన్నెం శారద’ గారి చిత్రం సెలెక్ట్ చేసుకుని అన్ని పనులు మొదలు పెట్టాం. కానీ ఆ పేరుకు దగ్గరగా వున్న కథా సంపుటిని మా మరో మిత్రురాలు ఆవిష్కరణ చేయడం చూసి, మా సంకలనం పేరు మార్చుకోవల్సిన స్థితి ఏర్పడింది. పేరుతో పాటు ముఖచిత్రం కూడా మార్చవల్సి వచ్చింది. ఈ సందర్భంలో ‘మన్నెం శారద ’ గారి చిత్రానికి బదులు ’పార్వతి’ గారి చిత్రాన్ని పుస్తక ముఖచిత్రంగా తీసుకోవాల్సి వచ్చింది. అందుకు ‘మన్నెం శారద’ గారికి మేo క్షమాపణలు చెబుతున్నాం. అలాగే జుగాష్ విలి గారు పుస్తక డిజైన్ చేయడం దగ్గర నుంచి, పుస్తక ప్రచురణ, పుస్తక ఆవిష్కరణ వరకు తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి మాతో సహకరించి నందులకు వారికి, పుస్తక ముద్రణలో విద్యుత్తు ఆటంకాన్ని కూడా జయించి మాకు ఆవిష్కరణ సభకు మరికొన్ని పుస్తకాలను అందించిన ‘నవ్య ప్రింటిన్ ప్రెస్’ బాధ్యుడు సోదరుడు నానికి కూడా కృతజ్ఞతలు చెప్పి తీరాలి.

Jyothi- నాకు తెలిసిన ఒకే మార్గం నిరంతర అధ్యయనం. స్త్రీ వాదం, పితృస్వామ్య సమాజంలో స్త్రీల జీవన విధానం గురించి నాకు తెలినంత మేరా సాహిత్యాన్ని చదివాను. ఫెమినిజం పై ఇంగ్లీషులో వచ్చిన కొన్ని గొప్ప పుస్తకాలను చదివాక, తెలుగు సాహిత్యంలో ఫెమినిజం పట్ల నిజమైన అవగాహనతో వచ్చిన సాహిత్యం చాలా తక్కువ అనిపించింది. తరువాత రోష్నీ హెల్ప్ లైన్‌లో వచ్చిన స్త్రీల సమస్యలను పరిశీలించడం, నా చుట్టూ ఉన్న విద్యార్థులలో మారుతున్న జీవన రీతులను గమనించడం నేను నిరంతరం చేస్తూనే ఉన్న పనులు. ఈ మధ్య కాలంలో యువతలో మానవ సంబంధాల పట్ల బాధ్యతా రాహిత్యాన్ని గమనించినప్పుడు స్త్రీ స్వేచ్ఛ సందర్భంగా వారిలో కలుగుతున్న అలోచనలలో కొంత అతి ధోరణి గమనించాను. ముఖ్యంగా ఇది వారి భవిష్యత్తులో ఎన్నో మానసిక సమస్యలకు, ఎంతో మానసిక ఒంటరితనానికి, రుగ్మతలకు కారణం అవుతుంది అని అనిపించినప్పుడు ఒంటరి స్త్రీ జీవితపు సంఘర్షణను చర్చకు పెట్టవలసిన అవసరం కనిపించింది. చాలా మంది రచయిత్రులు ఒంటరి స్త్రీ అంటే త్యాగమూర్తిగానూ, లేదా విక్టిం గానూ చూపించే ప్రయత్నం చేసారు. ఇది ఒంటరి స్త్రీలను చాలా ప్రెషర్‌కు గురి చేసే విషయం. మా కథలు అటువంటి ప్రెషర్‌కు దూరంగా ఉండాలని, అందులో స్త్రీలని సెల్ప్ పిటీ మోడ్‌లో చూపించకుండా ఉండడానికి చాలా కష్టపడవలసి వచ్చింది.

4.ప్రశ్న: ఒంటరి మహిళలను నిర్వచించండి?

జవాబు: Vijaya – ఒంటరి అనేది ఒక చేదు పదం. అది ఒక అనుభూతి. ఒక అనుభవం. సమాజంలో చిన్న దోమ, చీమ, పురుగు లాంటివే కాదు, పశు, పక్ష్యాదులు కూడా ఒంటరి జీవితానికి ఇష్టపడవు. ఎప్పుడూ సామూహికంగానే వుండాలని చూస్తాయి. సామూహికంగా లేక, మరి ఏ తోడు లేకుండా (లైంగిక, శారీరక తోడు) జీవనానికి కావల్సిన అన్ని పనులను తానే చేసుకుంటూ తన స్వశక్తి పైనే ఆధారపడుతూ ఎటువంటి కట్టుబాట్లు, అజమాయిషీ లేకుండా తన మనసు చెప్పినట్లుగా, తన ఇష్టానుసారంగా, తనను తాను ఒక పరిధిలో వుంచుకుంటూ సర్వస్వతంత్ర్యంగా జీవించడాన్ని ఒంటరి మహిళ మాత్రమే నిర్భయంగా చేయగలదని నేను భావిస్తాను.

కానీ మనిషి సంఘజీవి. ప్రకృతిలో స్త్రీ,పురుషులిద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం సహజసిద్ధం. అందువల్ల సమాజంలో ఏదో ఒక కారణం లేకుండా ఏ స్త్రీ, ఏ పురుషుడు ఒంటరిగా జీవించడం కుదరదు. ప్రకృతి కూడా స్త్రీ, పురుషులిద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడడాన్నే సమర్దిస్తుంది. అయినప్పటికి పితృస్వామిక వ్యవస్థలో స్త్రీలు రెండవ స్థాయి పౌరులుగానే చూడబడడం వల్ల, కుటుంబ, సామాజిక, రాజకీయ పరంగా వివక్ష, అణచివేతలకు గురౌతూవుంటారు. అవి భరించలేనప్పడు అవివాహితులుగానో, విడాకులు తీసుకున్నవారిగానో, లేక భర్త మరణానంతరం వితంతువులుగానో, వృద్ధాప్యంలో ఏ తోడూ లేకుండా స్త్రీలు జీవించడం జరుగుతుంది. భార్యాభర్తలుగా కల్సి ఒకే కప్పు కింద నివసిస్తూ కూడా మానసికంగా, శారీరకంగా దగ్గరితనం లేకపోవడాన్ని కూడా ఒంటరితనంగానే చూడాలని మానసిక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వీటన్నింటితో పాటు ఆర్థికంగా ఏ సపోర్టు లేనివారు, బలవంతంగా కుటుంబాల నుండి లేదా సమాజం నుండి నెట్టి/గెంటి వేయబడిన వారు (జోగిని, బసివిని, దేవుడమ్మ లాంటి సామాజిక కట్టుబాట్లు, సంప్రదాయాలకు బలిచేయబడ్డ వారితో పాటు ఎల్జీబీటీ లాంటి వారు) కూడా ఆకోవలోకి వస్తారు. తమ శరీరాలను కూడు, గుడ్డల కోసం అమ్మకానికి పెట్టే వారిని మరొకరి, అండ, తోడు లేకుండా జీవించే స్త్రీలను ఒంటరి స్త్రీలుగానే మనం చూడాలి.

Jyothi – పైన విజయ ప్రస్తావించే విషయాల వైపుకు వెళ్ళకుండా నా వరకు మానసికంగా, ఆర్థికంగా, శారీరికంగా, తన జీవన మార్గంలో తోడు లేకుండా జీవించే స్థితిలోకి చేరిన స్త్రీ ‘ఒంటరి స్త్రీ’.

5.ప్రశ్న: కథల ఎంపికలో మీరు పాటించిన ప్రామాణికాలు ఏంటీ?

జవాబు: Vijaya – కథల ఎంపికలో మేము కోరిన కాన్సెప్ట్‌కు దగ్గరగా లేని కారణంగా దాదాపుగా ఒక ఇరవై కథలను తీసుకోలేమని కథకులకు చెప్పాం. శిల్పం, శైలి సరిచేసుకుంటూనే వస్తు నాణ్యతకు ప్రాధాన్యతను ఇచ్చాం. మాకు కావల్సిన మార్పులు, చేర్పులు, ముగింపు వాక్యాలను మార్చి రాయమని పదేపదే రచయితలను విసిగించి కూడా మాకు కావల్సిన ప్రామాణిక కొలతలలో కథలు రాయించగలిగాo.

Jyothi – ఏ స్త్రీ కూడా సెల్ప్ పిటీ మోడ్‌లో ఉండకుడదనుకున్నాం. వారి జీవితంలోని ఘర్షణను, ఎదుర్కున్న వివక్షను ప్రస్తావించే కథలనే ఎన్నుకున్నాం. సింగల్ స్టేటస్‌ను గ్లోరిఫై చేసి దాన్ని గ్లామరైజ్ చేసే రచనలను వద్దనుకున్నాం. తమ జీవిత కథలను నిజాయితీతో రచించిన వారికి పెద్ద పీట వేసాం. కొంత తడపాటు, శైలిలో కొంత అస్పష్టత ఉన్నా వారి ప్రెజెంటేషన్‌లో నిజాయితీని పరిగణించి ఆ కథలను ఎన్నుకున్నాం. కథలలో నిజాయితీ ముఖ్యం అన్నది నా అభిప్రాయం. మా కథలలో పాత్రలన్నీ సజీవ పాత్రలే. ఒక్కటి కూడా కల్పిత పాత్ర కాదు.

6.ప్రశ్న: మీరిద్దరూ కలిసి పుస్తక తయారీ  ఎలా సమన్వయం చేశారు?

జవాబు: Vijaya – నేను రిటైర్డ్ ఉద్యోగిని కావడం, నా సామాజిక పనులను కొన్నింటిని పక్కకు పెట్టి రచయితల ఎంపిక, కథల ఆహ్వానం, పదే,పదే వారిని పలుకరిస్తూ కథా వస్తువు కోణాన్ని వివరించే పనులు, డిటిపి చేయించడం, వాటిని సరిదిద్దడం, క్రమబద్ధీకరించడం లాంటి పనులతో పాటు(ఇతర ప్రాంత రచయితల భాష, యాసలను తరచి, తరచి పరిశీలించుకోవడం, ప్రూఫ్ రీడింగ్ లాంటి పనులు) కొన్ని కథల పరిశీలనా బాధ్యత పూర్తిగా నా మీదనే వేసుకొని చేయడం జరిగింది. మిగిలిన కథల ప్రూఫ్ రీడింగ్‌లో పి.జ్యోతి సహకారం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తను ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల తనకున్న ఖాళీ సమయాలను చూసుకుని, ఎక్కువ శాతం నేను తన ఇంటికే వెళ్ళి కలసి ప్రూఫ్ రీడింగ్‌లు చేయడం జరిగింది. బుక్ డి‌టి‌పి, మేకింగ్, ముఖ చిత్ర మేకింగ్, పుస్తక ముద్రణ, పుస్తక ఆవిష్కరణ సభ నిర్వాహణ పనులు చేయడంలో జ్యోతి గారు ఎక్కువ సమయం కేటాయించ లేకపోవడం వల్ల నా ఇతర మిత్రుల సహకారం తీసుకోవడం జరిగింది.

Jyothi – సాహితి ప్రపంచాన్ని దగ్గరగా పరిశీలిస్తూ నేను ఎప్పుడూ ఓ దూరం మెయిన్‍టెయిన్ చేసేదాన్ని. అందువలన నాకు తెలుగు సాహితీరంగంలో పెద్దగా పరిచయాలు లేవు. కథా సంకలనం కోసం పీ.ఆర్. మొత్తం విజయ చూసుకోవాలని ముందే నేను చెప్పాను. దానికి ఆమె ఒప్పుకున్నారు. చాలా కారణాల వలన నేను వీలయినంతగా మనుష్యుల తోటి కలవడం తగ్గించుకునే స్థితిలో ఉన్నాను. కథల ఎడిటింగ్, కథలను అంగీకరించడం, నిరాకరించడం వెనుక మాత్రం నా నిర్ణయానికి, పట్టుదలకి విజయ పూర్తిగా సహకరించారు. ఒక పని పెట్టుకున్న తరువాత అనవసర మొహమాటాలు వద్దనుకునే తత్వం నాది. అందువలన పేరున్న కొందరు రచయిత్రుల కథలను తిరస్కరించాం, కొందరితో మార్పులు సూచించి చేయించాం. కథల ముగింపు పట్ల మాత్రం నేను చాలా జాగ్రత్త తీసుకున్నాను. ఏ స్త్రీ పాత్ర ఎక్కడా ఎవరి సానుభూతిని ఆశించే విధంగానూ విక్టిమైజ్డ్ గానూ ఉండరాదని చాలా కథల ముగింపుని మార్చడం జరిగింది.

7 ప్రశ్న:నిజానికి మీరిద్దరు ఎక్కువగా కథలు రాయలేదు. ఇతర రచయితలు మీ నిర్ణయాన్ని ఎలా స్వీకరించారు? పుస్తకం తయారీలో మీ చేదు, చక్కటి అనుభవాలు చెప్పండి?

జవాబు: Vijaya – నేను దాదాపుగా ఇప్పటివరకు 30పైగా కథలు రాశాను. ‘గణిక’ అనే కథా సంపుటిని 2020లో పుస్తక రూపంలో తీసుకుని వచ్చాను. ఆ పుస్తకం ఇప్పటివరకు రెండు అవార్డులను తెచ్చి పెట్టింది. నా మరో కథా సంపుటి ‘విభజిత’ ఈ సంవత్సరం రాబోతోంది. కాబట్టి నేను కథా రచయితనే అనుకుంటున్నా ను. అంతేకాక 1980కి పూర్వం (నా చిన్నతనం) నుంచే నేను రచయితను.

1984లోనే నా కవితా సంపుటి ‘దీపిక’ను తీసుకుని వచ్చాను. మధ్యలో ఒక 25 సంవత్సరాలు సాహిత్యపరంగా అజ్ఞాతoలోనే వుండి పోవాల్సిన స్థితి నాది. అయినా నాకున్న ఉద్యమ, సాహితీ మిత్రులు ఎవ్వరూ నన్ను వీడిపోలేదు. 2000 తర్వాత వారందరూ నా పునఃప్రవేశాన్ని ఆహ్వానించారు. అందువల్ల రచయితల నుండి కథలను ఆహ్వానిచడం నాకు పెద్ద శ్రమగా అనిపించలేదు. నేను కోరిన వెంటనే అందరూ అంగీకరించి కథలు పంపారు. నేను అటు సీనియార్ రచయతలకు ఇటు ఇప్పుడు రాస్తున్న రచయితలకు మధ్యన వున్న తరం నాది. కాబట్టి కథల ఆహ్వానంకు పెద్దగా నేనేమీ కష్టపడలేదనే చెప్పాలి. వాళ్ళతో ఉన్న అనుబంధం తోటే నేను ఏ విధంగా కోరితే ఆ విధంగా మార్పులు, చేర్పులు చేయడానికి ఉపయోగపడిందని భావిస్తాను. ఈ కథా సంకలనం విషయంలో చేదు అనుభవం అంటే ముగ్గురు నలుగురు రచయితలు మా మీద కొంత తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మేం తమ కథలను కుదిస్తున్నామని, పేరాపేరాలు ఎడిట్ చేస్తూ తీసివేస్తున్నామని పుకారు పుట్టించారు. అందువల్ల కొందరు రచయితలు తమ రచనల్లో మా ఎడిట్‌ను నిరాకరించడం వల్ల వారి కథలను తీసివేయడం జరిగింది. కొందరు మా సంకలనానికి పంపిన కథలను ఇతర పత్రికలలో ప్రచురించుకోవడం వల్ల వారి కథలను కూడా మేo తిరస్కరించడం జరిగింది. మరొక చేదు అనుభవం కూడా నేను ఇక్కడ చెప్పడానికి సాహసం చేస్తున్నాను. అది పుస్తకం తయారీ విషయంలో కాదు, పుస్తకం ఆవిష్కరణ అనంతరం మా పుస్తకం వెనుక అట్ట మీద వున్న ఒక వాక్యాన్ని పట్టుకుని, దాని పూర్వాపర వాక్యాలను విస్మరించి Facebook వేదికగా “కంటిలో నలుసులా, పంటికింద రాయిలా సలుపుతున్నదని” భావిస్తూ కొందరు స్త్రీవాదులు వాదించడం నన్ను బాధపెట్టిన విషయం. అదేదో పెద్ద తప్పులా చూపిస్తూ (నెగటివ్ ప్రచారం) మాపై మా కథా సంకలనంపై ఆరోపణలు చేస్తూ మూకుమ్మడి దాడి చేయడం ఎంత ధారుణమో అందరూ చూసారు. దాన్ని ఖండిస్తున్నాను. ఆ సంఘటనల వెనుక ఎవరి స్వలాభం ఎంతున్నా మాకు, మా పుస్తకానికి పాచుర్యం కలిగిందనే నేను భావిస్తాను. అది కూడా మాకు మంచి చేసిందనే అనుకుంటున్నాను. ఇక పుస్తక ముఖచిత్ర విషయంలో, పుస్తక పేరు విషయంలో మేము ఎంతో కొట్టుమిట్టాడం. ఎన్నో నెలలు తర్జనభర్జనలు పడ్డాం. చివరికి పార్వతి గారు మరచిపోయిన ముఖచిత్రాన్ని వెతికి పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఆ చిత్రాన్ని పొందిన తర్వాత నా ఆనందానికి అంతులేదు. అలాగే ఎంతోమంది మిత్రులు కథా సంకలనానికి అనేక పేర్లు సూచించినప్పటికీ, వాటిలో ఏ పేరు నాకు చిత్రానికి దగ్గరగా లేకపోవడం బాధించినా, చివరికి ‘ఓల్గా’ గారు ‘స్వయంసిద్ధ’ అని సూచించడo, ఆ పేరుకు వున్న చరిత్రను చెప్పడంతో నాకు మరింత ఆనందాన్ని ఇవ్వడం మరువలేనిది. అనేక సంఘర్షణల తర్వాత ఆ పుస్తకo పాఠకులను ఆకర్షించడం మా కష్టానికి ఫలితంగా భావిస్తాను.

Jyoti – ఈ మాట ఇక్కడ చెప్పడం అవసరం కాబట్టి చెబుతున్నాను. తెలుగు సాహిత్యంలో రచయిత్రులు ఎక్కువగా సాహిత్యాన్ని చదవరు. తెలుగులో వచ్చే కాంటెంపరరీ రచనల పట్ల కూడా వారికి అవగాహన తక్కువ. పన్నెండు సంవత్సరాలుగా సాహితీ ప్రపంచాన్ని దగ్గరగా గమనిస్తున్న నాకు తెలుగులో సాహిత్యాన్ని, అందునా ప్రపంచ సాహిత్యాన్ని బాగా చదివే రచయితలు ఓ ఇద్దరు ముగ్గురు తప్ప నాకు కనిపించలేదు. పుస్తక సమీక్షల కోసం వేదికలెక్కి మాట్లాడేవారు కూడ పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా మాట్లాడడం నేను ఇన్ని సంవత్సరాలుగా స్వయంగా గమనిస్తున్న విషయం. మా పుస్తకం పట్ల అందువలన రచయిత్రులు అనబడే వారి కన్నా పాఠకుల స్పందనే ముఖ్యం అని భావిస్తాను.

ఈ సంకలనం ఓ రచయిత్రి, ఓ విమర్శకురాలు కలిపి తీసుకొచ్చిన పుస్తకం అన్నది ఇక్కడ గుర్తు చేస్తున్నాను. నేను విజయ గారి లాగా ఎక్కువగా కథలు రాయలేదు. ఇప్పటి దాకా నావి ఓ ఎనిమిది కథలు మాత్రమే బైటకు వచ్చాయి. కాని ఇప్పటి దాకా నేను 2000 పైగా పుస్తకాలను విశ్లేషించాను. అంతకు రెండింతలు చదివాను. కాబట్టి నేను ఓ విమర్శకురాలిగానే ఈ పుస్తకం పై పని చేశాను. ప్రతి కథను విమర్శనాత్మక దృష్టితోనే చూసి మార్పులు చేసుకుంటూ వెళ్ళాను. రచయిత్రి శైలి, భాష పట్ల వారి అభిప్రాయాలను గౌరవిస్తూ విమర్శనాత్మక దృష్టితో కథలోని స్త్రీ పాత్ర చిత్రీకరణను గమనిస్తూ వెళ్ళాను. గొప్ప అనుభవాలు ఉన్నాయని చెప్పలేను కాని ఈ సంకలనానికి పని చేస్తూ నేను ఎంతో చదవవలసి వచ్చింది. ఎన్నో నేర్చుకున్నానని చెప్పగలను. పుస్తకం వచ్చిన తరువాత కొందరు ఒక్క వాక్యాన్ని పట్టుకుని చులకనగా చెసిన స్టేట్మెంట్లు తెలుగు సాహితీ ప్రపంచంలోని స్థితిని ఇంకా స్పష్టపరిచింది. ఇదీ ఓ అనుభవంగా తీసుకుని ముందుకు సాగాలనే పట్టుదల మాత్రం నాలో పెరిగింది. ముఖ్యంగా ఈ సంకలనంలో అన్నీ ప్రాంతాలకు, వర్గాలకు, మతాలకు, చెందిన స్త్రీల జీవితాలను ఓ సమూహంగా తీసుకురావడం జరిగింది. తెలుగు సాహిత్యం వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా, మతాల వారిగా విడిపోయి సంకలనాలు తెస్తున్న సమయంలో అందరినీ కలుపుకుని వచ్చిన సంకలనం ఓ దశాబ్దకాల తెలుగు సాహిత్యంలో ఇదే అని గర్వంగా చెప్పగలను. దీన్ని గమనించి స్పందించిన రచయితల విమర్శ కూడా ఇప్పటిదాకా మా వద్దకు చేరలేదు. అందుకే తెలుగు రచయితల కన్నా పాఠకుల స్పందన కోసమే మేము ఎదురు చూస్తున్నాం.

8.ప్రశ్న: కథలు రాసిన మహిళలంతా ఒంటరి మహిళలే అన్న నిబంధన ఏమైనా వుందా?

జవాబు: Vijaya – లేదు. అలా అని మేము అనుకోలేదు. కాకపోతే, ఎవరైనా తాము తమ స్వీయ కథలను రాసుకున్నా అభ్యంతరం లేదని చెప్పాం. ఎవరైనా తమకు తెలిసిన, లేదా పరిచయం వున్న వారి యథార్ధ కథలు రాయదలచుకుంటే, మాత్రం ముందుగా వారిని తప్పనిసరిగా సంప్రదించి, వారి అంగీకార పత్రాన్ని తీసుకోవాలని చెప్పాం. అంతకు మించి మేం ఎలాంటి నిబంధనలు వారికి పెట్టలేదు.

Jyothi – ఏ నిబంధన లేకపోయినా ఎక్కువగా స్పందించింది మాత్రం ఒంటరి స్త్రీలుగా ఉన్న రచయితలే. అనుభవించిన వారికే ఈ కథా సంకలనం రావల్సిన అవసరం అర్థం అయింది అనుకుంటా. కొందరు మేం ఒంటరి స్త్రీలము కాము అంటూ ఈ సంకలనానికి కథను అందించడానికి నిరాకరించారు. కాని మేము ఎవరి కథనూ ఆ విషయంగా స్వీకరించలేదు, నిరాకరించలేదు.

9.ప్రశ్న: కథలు రాసినవారు మహిళలు. సంపాదకులు మహిళలు. కానీ ముందుమాట ఒక పురుషుడితో రాయించారు. ఎందుకని?

జవాబు: Vijaya – మీరనుకున్నట్లుగానే ముందుగా అందరూ మహిళలే వుండాలని అనుకున్నమాట వాస్తవమే. మేం తర్వాత ఆలోచిస్తే అది కరెక్ట్ కాదని అనిపించింది. మా కథల్లోని పాత్రలు అన్నీ పితృస్వామిక వ్యవస్థలో, పురుష అహంకారానికి ఎదురు నిలిచి గెలిచినవారే. అందువల్ల స్త్రీల మనోభావాల అంతఃపొరలను ఒక పురుష విమర్శకులు అయితేనే బాగా అర్థం చేసుకుని సమాజానికి అర్థమయ్యే రీతిలో చెప్పగలరన్న నమ్మకంతో ‘AK ప్రభాకర్’ గారితో ముందుమాట రాయించాం. ఆ తర్వాత మా పుస్తక డిజైనింగ్, మేకింగ్ చేసిన ’జుగష్ విలి’ గారు, మా పుస్తకానికి కొంత ఆర్థిక సాయం చేసిన ఎం.సత్యం గారు కూడా స్త్రీల సమస్యల పట్ల అవగాహన వున్న మా మిత్రులే.

Jyothi – నిజం చెప్పాలంటే ఈ సంకలనం తెస్తున్నామని మమ్మల్ని ప్రోత్సహించిన వారిలో స్త్రీల కన్నా పురుషులే ఎక్కువ ఉన్నారు. మాకు కావలసిన సహకారం అందిస్తాం అని ముందుకొచ్చిన వారు పురుషులే. ముఖ్యంగా కరోనా బారిన పడిన ప్రభాకర్ గారు, ఆ సమయంలో కూడా సంకలనాన్ని రెండు మూడు సార్లు చదివి, మా కథలలో మేం విస్మరించిన కొన్ని తప్పులను పేజ్ నంబర్లతో సహా వివరించి, అవి కరెక్ట్ చేయించి ఈ సంకలనానికి పూర్తి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించారు. ఇది నేను మర్చిపోలేని విషయం. అంతటి ఇన్వాల్మెంట్ స్త్రీల నుండి మాకు రాలేదు. అతి భయంకరమైన విమర్శలు చేసిన వారిలో స్త్రీలు ఉన్నారు. అదే సందర్భంలో మమ్మల్ని, మా మాటల్ని, మా ఉద్దేశాలని అర్థం చేసుకుని ప్రోత్సహించినవారిలో పురుషులే ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ కూడా దానికి నిదర్శనమే.

10ప్రశ్న: ఒంటరి మహిళకు, ఏకాంత మహిళకు వున్న బేధం చెప్పండి?

జవాబు: Vijaya – ఈ భూమి మీద ఉన్న ప్రతి స్త్రీ డిసేబుల్, ట్రాన్స్, స్వలింగసంపర్కం, ఒంటరి వివాహిత, వితతంతువు, సంతానం లేనివారు, ఉన్నా వృద్ధాప్యంలో ఎవరూ పట్టించుకొని స్త్రీలు, విడాకులు తీసుకున్నవారు, సీస్-జెండర్ లను ఒంటరివారిగా గురించవచ్చు. లేదా సామూహికం నుండి శారీరకంగా, మానసికంగా మనుషుల నుండి వేరు చేయబడినవారు, కుటుంబాలకు దూరంగా ఏ తోడూ లేకుండా జీవించేవారు. సమాజం నుండి వెలి వేయబడినవారు, ఎటువంటి లైంగిక,వైవాహిక సంబంధం లేదా తోడు కూడా లేకుండా జీవితాంతం తమ స్వశక్తి మీద ఆధారపడుతూ జీవించే వాళ్ళను సామాన్యంగా ఒంటరి మహిళలుగా మనం భావిస్తాo. సామూహికంలో ఉండి కూడా శారీరకంగా, మానసికంగా ఎవరికీ ఏమీ కాకుండా, అందరికీ తామే ఆధారమై వుంటూ కూడా ఎవ్వరికీ ఏమీ కాకుండా మిగిలిపోయిన వారిని ఏకాంత మహిళలుగా చెప్పవచ్చు.

Jyothi – విజయ గారి జవాబు తరువాత నేను చెప్పేదేమీ లేదు. నా వరకు నేను ఓ ఏకాంత మహిళను. మా సంకలనంలోని స్త్రీల కథలన్నీ ఒంటరి మహిళల కథలే. ఒంటరి మహిళ నుండి ఏకాంత మహిళ వరకు నా ప్రయాణమే నన్ను ఈ కథసంకలనం వైపుకు నెట్టింది.

11ప్రశ్న: సంకలనంలో వ్యక్తిగతంగా మీకు అద్భుతంగా అనిపించిన కథ ఏది? ఎందుకు?

జవాబు: Vijaya – మా దృష్టిలో సంకలనంలో వున్న అన్ని కథలు అద్భుతమైనవే. ఎందుకంటే అన్నీ మా దృష్టి కోణం నుండి వచ్చినవే కాబట్టి అన్ని కథలు మాకు నచ్చినవే. అన్నింటిలో ఒక కథ గురించి చెప్పడం కష్టంతో కూడిన పనే. అయినా ‘గంగవరపు సునీత’ గారు రాసిన ‘తపన’ ఒక టీనేజ్ బిడ్డకు ఒంటరి తల్లి రాసిన వ్యథాభరిత లేఖనే ఈ కథ. టీనేజ్ వయసులో సహజ సిద్ధంగా కలిగే ఆకర్షణల నుండి పెద్ద బిడ్డను కాపాడుకోలేని తన అసహాయతను తెలియజేస్తూ తన రెండవ బిడ్డను అప్రమత్తం చేసే దిశగా ఒక లేఖలో తన అభిప్రాయాలను చెప్పే కథ. తనను అనుక్షణం అనుమానించే కూతురును కాపాడుకోవడానికి ఒక తల్లి పడే మౌన వేదనను అద్భుతంగా రచయిత ఈ కథలో చెప్పడం చాలా బాగుంది.

Jyothi – ‘తపన’ కథలో మేము ఎడిట్ చేసిన భాగం పెద్దగా ఏమీ లేదు. అంత పర్ఫెక్ట్ గా రచయిత్రి నుండి అందిన కథ అది. కాని నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన కథ ‘చిన్న చిన్నవి’. అందులో నడిచే చర్చ లాంటిది రావాలనే ఈ కథా సంకలనానికి మేం పూనుకున్నాం. ఆ కథ కోసం ఎడిటింగ్ పరంగా కొంత కష్టపడవలసి వచ్చింది. కాని ఎంతో సంతృప్తితో నేను చేసిన పని అది. ఏ సంకలనాన్ని నేను విశ్లేషిస్తున్నా, నాకు నచ్చిన కథను ప్రస్తావించడం నాకు అలవాటు. ఇందులో ‘చిన్న చిన్నవి’ నా మనసుకు ఎంతో నచ్చిన కథ.

12 ప్రశ్న: సంకలనం తయారీలో మీ ఉద్దేశ్యం, లక్ష్యం ఏంటి?

జవాబు: Vijaya – స్త్రీలు తాము ఏ కారణాల వలన ఒంటరిగా కుటుంబాల నుండి బయటపడినా, తిరిగి వారు తమ పిల్లలనో, తమపై ఆధారపడి జీవిస్తున్న వారినో మొక్కువోని దైర్యంతో, ఆత్మవిశ్వాసంతో తమ స్వశక్తి మీద వారిని పోషించుకుంటూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. అలాంటివారిపై అపవాదులు, అవమానకర చూపులు, మాటలు విసిరి పితృస్వామిక వ్యవస్థ ధారుణంగా హింసిస్తుంది. వివక్ష, అణచివేతకు గురిచేస్తుంది. అలాంటి వారు ఆత్మగౌరవంతో ఎలా జీవిస్తున్నారో, సజీవంగా చూపించాలన్న ఉద్దేశం తోనే ఈ సంకలనం తీసుకుని వచ్చాం. ఈ సబ్జెక్ట్ మీద కథలు ఇంత వరకు ఏ భాషల్లో రాలేదని సాహితీకారులు సభలో చెప్పిన తర్వాత మా లక్ష్యం నెరవేరిందనే మేము అనుకుంటున్నాం.

Jyothi – ఉద్దేశం లక్ష్యం రెండూ ఒకటే, ఒంటరి స్త్రీలను సమాజం గౌరవంగా స్వీకరించే దిశగా చర్చ జరగాలని. ఒంటరి తనాన్ని కోరుకునే స్త్రీలు విచ్చలవిడి జీవితాల కోసం ఆ మార్గం ఎంచుకోరని, దాని వెనుక ఎంతో సంఘర్షణ ఉంటుందని, ఆ తరువాత కూడా వారి జీవితం ముళ్ల బాటే అని. కాని ఆత్మగౌరవ పోరాటంలో, వారు ఎన్నుకున్న ఆ కష్టమైన మార్గాన్ని ఇంకా కష్టమయం చేసే పరిస్థితుల నుండి వారిని విముక్తలను చేసే దిశగా చదివిన వారిలో ఆలోచన పెరగాలని.

13 ప్రశ్న:ఈ పుస్తకాన్ని పాఠకుడు ఎందుకు కొని చదవాలి?

జవాబు: Vijaya – పితృస్వామిక వ్యవస్థలో నిఘా కళ్ళు ఎప్పుడూ ఆడవాళ్ళ మీదనే ఉంటాయన్నది నిర్విదాంశం. అందువల్ల స్త్రీల కథలు అనగానే, అందులో ఒంటరి స్త్రీల కథలు అనగానే పురుషులతో పాటు స్త్రీలలో కూడా ఉన్న ఒక ఉత్సుకత పాఠకునిగా మార్చుతుందన్న నమ్మకం మాకుంది. అందువలన పాఠకుడు ఇంట్రెస్ట్‌తో పుస్తకాన్ని కొని చదువుతారని నమ్ముతున్నాం.

Jyothi- ఎందుకంటే 40 జీవితాలలోని ఘర్షణను నిజాయితీతో చర్చకు పెట్టబడిన విషయం ఇందులో ఉంది కాబట్టి. తెలుగు సాహిత్యంలో నిజాయితీగా వచ్చిన పుస్తకాల సరసన ఇది నిలుస్తుంది కాబట్టి.

14ప్రశ్న: ఈ పుస్తకం తర్వాత మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి?

జవాబు: Vijaya – ఈ పుస్తక ప్రచురణ తర్వాత మహిళలకు సంబంధించిన ప్రతి అంశాన్ని తీసుకుని ప్రతి సంవత్సరo ఒక కథా సంకలనం భవిష్యత్తులో తీసుకుని రావాలని అనుకుంటున్నాం. 2024 లో రాబోవు మా కథా సంకలనం యొక్క అంశాన్ని కూడా త్వరలో ప్రకటిస్తాం. ఇంతకు ముందు ఎవరూ తీసుకుని రాని ఒంటరి స్త్రీల వ్యథలను అన్ని కోణాలతో మా ఈ ‘స్వయంసిద్ధ’ లో ఈ సంవత్సరం ఆవిష్కరించ గలిగాం. అందుకు మాకు చాలా ఆనందంగా వుంది. సాహితీ ప్రియులందరూ మా ‘స్వయంసిద్ధను’ కొనుక్కొని చదివి ఆదరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పాఠకుల ఆదరణనే మాకు కొండంత బలం అని చెప్పుతూ మాకు ఈ నాలుగు మాటలు మీ సంచిక పత్రిక ద్వారా పాఠకులతో పంచుకునే అవకాశం ఇచ్చిన ‘పత్రిక యజమాన్యాని’కి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను.

Jyothi – ఓపికున్నంత వరకు కథా సంకలనాలకు పని చేయడం. ముఖ్యంగా ఈ సంకలనం వెనుక బ్లర్బ్‌లో వచ్చిన ఓ వాక్యంతో ఏ మాత్రం సంబంధం లేని ఓ అనవసర రచ్చను అనుభవించిన తరువాత మా బాధ్యత ఇంకా పెరిగిందని అనిపించింది. నేను చూసిన స్త్రీల జీవితాలతో ఓ కథా సంకలనాన్ని స్వయంగా తీసుకురావాలనే మరో నిర్ణయం నాలో కలిగింది. ఓ సంవత్సరంలో అది నేను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను.

~

మీరు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతమవ్వాలని ఆశిస్తూ, సంచిక తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. – సంచిక టీమ్.

Exit mobile version