[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం రచయిత్రి, సాహిత్యసేవకురాలు, విద్యావేత్త డా. అమృతలత గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]
సాహిత్యసేవలో సహృదయిని డా. అమృతలత
సాహిత్యం వివిధ ప్రక్రియల్లో రాయడం వేరు, ఇతర సాహిత్యకారులను ప్రొత్సహించడం వేరు. తాము సాహిత్య సేవ చేస్తున్నామనుకునే వాళ్లందరూ పై రెండు లక్షణాలను కలిగివుండాలన్న నియమం ఏమీ లేదు. నిజమయిన సాహిత్య (భాషా) సేవ చేసే వాళ్ళు, తమ రచనావ్యాసంగాన్ని సైతం పక్కన పెట్టి ఇతరులను ప్రోత్సహించే దిశలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారు. స్వంత ప్రచారానికి దూరంగా వుండి తాము చేయదలచుకున్న పనిని చేసుకుంటూ ముందుకు దూసుకు పోతుంటారు. అందులోనే వారు ఎంతో తృప్తిని పొందుతారు. అదిగో.. అలాంటి గొప్ప లక్షణాలున్న సహృదయని, కవయిత్రి, రచయిత్రి, సాహిత్యసేవకురాలు, విద్యావేత్త శ్రీమతి డా. అమృతలత గారు.
నిజామాబాద్‌ను కేంద్రస్థానంగా చేసుకుని కొన్ని విద్యాసంస్థలు నడుపుతూనే, సాహిత్యం పట్ల ఉన్న మక్కువతో అనేక సాహిత్యకార్యక్రమాలు నిర్వహిస్తూ,తన రచనావ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ప్రతి యేటా ఎంపిక చేసిన ఉత్తమ రచయిత్రులకు/రచయితలకు అవార్డులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు.
సంచిక అంతర్జాల పత్రికలో సంభాషణం కోసం అడిగినప్పుడు, సంతోషంతో ఒప్పుకుని, కేవలం మూడురోజుల్లో తన సమాధానాలు అందించిన క్రమశిక్షణ గల రచయిత్రి డా. అమృత లత గారు.
తన సాహిత్య ప్రస్థానం గురిన్చి డా. అమృతలత గారు ఏమంటున్నారో చూద్దాం….
~
ప్ర: అమృతలత గారికి, ‘సంచిక‘ అంతర్జాల పత్రిక పక్షాన స్వాగతం!
– నమస్కారం డాక్టర్ గారు.
ప్ర: మీరు సాహిత్యకారులు మాత్రమే కాకుండా, ప్రతిభావంతులైన తోటి సాహిత్యకారులను కూడా ఎంపికచేసి అవార్డులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు. మీకు ఈ ఆలోచన ఎలావచ్చింది? దీని వెనుక నేపథ్యం వివరించండి.
– నాకు సాహిత్యమన్నా, లలితకళలన్నా చిన్నప్పటి నుండి చాలా ఇష్టం! ఆ రోజుల్లో కథలకు వారపత్రికల్లో విరివిగా పోటీలుండేవి.. ఆ పోటీల్లో గెలుపొందిన వాళ్ళ సంతోషాన్ని చూస్తే ముచ్చటేసేది… ‘ఎంత బాగా రాస్తే.. వాళ్లు అలా ఎన్నో వందల మందితో పోటీపడి, ఆ బహుమతులు తెచ్చుకోగలుగుతారు! ఎంత గ్రేట్’ అనిపించేది! నా చేతిలో పక్ష పత్రిక వున్నప్పుడు నేనూ కథల పోటీలు నిర్వహించాను.. వారికి హైదరాబాదులో బహుమతి ప్రదానం కూడా చేసాను… కానీ పత్రిక మూసేసాక.. ఎందుకో అశాంతిగా ఫీలయ్యాను.. సాహిత్యం అన్నా, లలితకళలు అన్నా ప్రాణం పెట్టే నేను.. స్తబ్దుగా వుండలేక.. అవార్డు గ్రహీతల ముఖాల్లో వెలుగుని చూడాలన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం అవార్డ్స్ నెలకొల్పాను.
ప్ర: సాహిత్య పరంగా అవార్డులు ఇవ్వడానికి మీరు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు?
– సాహిత్యంలో కేవలం ‘నవలలు’ రాసిన ‘సీనియర్’ రచయిత్రులకు మాత్రమే ‘అమృతలత అవార్డులు’ ఇవ్వడం జరుగుతోంది. ‘అపురూప అవార్డ్స్’ విషయంలో మాత్రం… సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ‘తమదైన ముద్ర’ వేసుకుని పేరు తెచ్చుకున్న సీనియర్ రచయిత్రులకు, యువ రచయిత్రులకు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతోంది.
ప్ర: కవులకు, రచయితలకు అవార్డులు ఇచ్చే విషయంలో మీరు ఆయా రచయితల పేరు ప్రఖ్యాతులకి ప్రాధాన్యతనిస్తారా? లేక వాళ్ళు సృష్టించిన సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తారా?
– రచయితలకైనా, కళాకారులకైనా.. పుట్టుకతోనే వాళ్లకి అవార్డులు రావు! వాళ్ళ సాహితీ సృజనని బట్టో, కళా ప్రతిభని బట్టో వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి.. వారిలో ఆ కళే లేకపోతే వారికి ఆ గొప్పదనం గానీ, అవార్డులు గానీ రావు కదా! విరివిగా రచనలు చేసి ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సీనియర్ రచయిత్రులెంతో మంది వున్నారు..
మొదటిసారిగా నేను అవార్డ్స్ నెలకొల్పినపుడు అలాంటి వాళ్ళని పక్కనబెట్టి, కొత్తగా కలం పట్టుకున్న వాళ్లకి ఇస్తే – అప్పటికే ఎన్నో నవలలూ, కథలను రాసిన వాళ్ళని నిర్లక్ష్యం చేసిన వాళ్లమవుతాం కదా అని అన్పించింది. అలా అని ఎప్పుడూ లబ్ధప్రతిష్ఠులకే అవార్డులు ఇస్తూ వుంటే… యువతరంలోని మెరికల్లాంటి సృజనకారులకు ఆ అవకాశం దొరక్క వాళ్ళు డిజప్పాయింట్ అవుతారు కదాని అన్పించింది.
అందుకని చాలాసార్లు అవార్డ్స్ ఎంపికలో న్యాయనిర్ణేతలు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని – అటు సీనియర్ రచయితలైనా, ఇటు జూనియర్ రచయిత్రులనైనా ఎన్నో విషయాల్లో బాలెన్స్ చేస్తూ ముఖ్యంగా వాళ్ళ సాహితీ సృజనని బట్టే.. ఎంపిక చేయాల్సి వస్తుంది.. నిజానికి న్యాయనిర్ణేతలకు ఇది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే అవుతుంది. అయితే అవార్డులు రాని వాళ్లలో కూడా ఎందరో నిష్ణాతులున్నారు.. అందరికీ ఒకేసారి ఇవ్వలేం కదా!
ప్ర: మీరు అవార్డుల విషయంలో, కేవలం కవయిత్రులు/రచయిత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చింది?
– మహిళలకు అన్నింటా ప్రోత్సాహం కరువవుతోందన్న ఉద్దేశంతో చాలా ఏళ్లుగా నేను మహిళలకే పెద్దపీట వేసాను. అయితే జెండర్ వివక్షత వుండకూడదని చెప్తూ.. అవార్డ్స్ విషయంలో మగవాళ్లకు అన్యాయం చేస్తున్నానని అనిపించి… తర్వాతి రోజుల్లో రచయితలకు కూడా ‘అమృతలత అవార్డులు’ ఇచ్చాను.. ఆ పరంపరలో.. 2017లో కేంద్రసాహిత్య అవార్డు గ్రహీతలు డా. ఎన్.గోపి గారికి, అంపశయ్య నవీన్ గారికి, గత సంవత్సరం (2021) విహారి గారికి, రామా చంద్రమౌళి గారికి ‘అమృతలత అవార్డులు’ ఇవ్వడం జరిగింది.
నేను పుట్టి పెరిగిన నిజామాబాదు జిల్లాలో మాత్రం ‘ఇందూరు అపురూప అవార్డుల’లో సింహభాగం రచయితలకు, ఇతర లలిత కళల్లోని పురుషులకు అవార్డులు ఇచ్చాను. ‘మీ జిల్లా వాడినైనా కాకపోతిని అపురూప అవార్డు అందుకొనగా!’ అంటూ నా ముందు కూనిరాగం తీసాడు ఓ సోదర రచయిత.
ప్ర: రచనా వ్యాసంగంలోకి ఎప్పుడు, ఎలా ప్రవేశించారు. దాని వెనుక నేపథ్యం ఏమిటి?
– తొమ్మిదో తరగతి చదువుతోన్న రోజుల్లో.. పృథ్వీరాజ్ చౌహన్‌పై ఒక దేశ భక్తి నాటిక రాసి, మాడపాటి హన్మంతరావు గారి ప్రశంసలను అందుకున్నాను.. హెచ్చెస్సీలో ‘బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నదీ’ పాట పై పేరడీ రాసి.. ఆడపిల్లల మెప్పు పొందాను..
పీయూసీలో వరవరరావు గారి సృజన పత్రికలో ‘కూలి’ పేర ఓ కవిత రాసి ‘ప్రత్యేక బహుమతి’ పొందాను. బిఎలో ఎమెస్కో పాకెట్ బుక్స్ వారు ఉస్మానియా విద్యార్థుల కోసం వెలువరించిన ‘కతాంజలి-3’ లో ‘కన్నీళ్లతో కాలక్షేపం’ కథ ప్రచురింప బడింది.
ఆ తర్వాత కొన్ని కథలు, ఒక నవల.. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఎడిటర్‌గా వున్న రోజుల్లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రచురితం అయ్యాయి. అనంతరం ఆంధ్రభూమి వీక్లీ లో పిల్లల కోసం రాసిన నాటికలెన్నో సీరియల్ గా ప్రచురింపబడ్డాయి. విద్యారంగంలో అడుగిడిన తర్వాత సాహితీ రంగానికి దూరమయ్యానని ‘అమృత్ కిరణ్’ పక్షపత్రికని ఓ రెండేళ్ల పాటు (1994 -1996) వెలువరించి, దాన్ని అనివార్య పరిస్థితుల్లో మూసివేయాల్సి వచ్చింది. ఆ పత్రికలో ‘అమృత వర్షిణి’ పేర రాసిన నా ఎడిటోరియల్స్ పాఠకుల మన్ననలు పొందాయి.
2013 నుండి అవార్డులు నెలకొల్పి గత పదేళ్లుగా నాకు చేతనైన రీతిలో నా సాహితీ సేవని కొనసాగిస్తూ తృప్తి పడ్డాను.
చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల నాలుగైదు కథలు, మూడు వారాల క్రితం ‘నా ఏకాంత బృందగానం’ పేర నా సచిత్ర స్వీయ చరిత్ర రాసాను.
ప్ర: సాహిత్యపరంగా భాష/యాసలపై మీ అభిప్రాయం చెప్పండి.
– సాహిత్యం ఎప్పుడూ ప్రామాణిక భాషలోనే వుంటే అన్ని ప్రాంతాల వారికి అర్థమవుతుందని నా ఉద్దేశం.. ఎవరి ‘యాస’లో వాళ్ళు రాస్తే.. సాహిత్యానికి వున్న విస్తృత ప్రయోజనం దెబ్బతింటుందనీ, పాత్రల పరంగా యాసని చొప్పిస్తే ఫర్వాలేదు గానీ కథనం కూడా యాస లోనే రాస్తే… ఆ యాసేతరులకు అందులోని భావం అర్థం కాదనీ, ‘యాస’ కేవలం రేడియోలో, టీవీలలో వినడానికి బావుంటుందిగానీ.. చదవడానికి మాత్రం అడుగడుగునా స్పీడ్ బ్రేకర్‌లా అడ్డం పడుతుందని నా ఉద్దేశం!
ప్ర: సాహిత్యం వివిధ ‘వాదాలు‘ గా విడిపోవడంపై మీ అభిప్రాయం చెప్పండి.
– చాలా ఏళ్లుగా సాహిత్యంలో రకరకాల మార్పులొచ్చాయి.. డిటెక్టివ్ సాహిత్యం, క్షుద్ర సాహిత్యం, కాల్పనిక సాహిత్యం, పాపులర్ సాహిత్యాలను పక్కనబెట్టి విశ్లేషిస్తే.. సాహిత్యంలో రకరకాల భావజాలాలు, వాదాలు తలెత్తి- ఉన్నోడిచే పీడింపబడే లేనోడి గురించి రాస్తే – అది విప్లవ సాహిత్యం, పురుషుడిచే పీడింబడే స్త్రేల గురించి రాస్తే – అది స్త్రే వాద సాహిత్యం, అగ్రకులాలచే పీడింపబడే దళితుల గురించి రాస్తే – అది దళితవాద సాహిత్యం… అలా నేడు రక రకాల వాదాల పేర సాహిత్యం వెలువడుతోంది. అయితే – పీడన ఏ రూపంలో వున్నా – దాన్ని గర్హించాలి! కేవలం వాదాలకే పరితమైతే… సాహిత్యానికున్న విస్తృత ప్రయోజనం దెబ్బతింటుంది. పరిధి కుంచించుకు పోతుంది. స్త్రీ వాద సాహిత్యమైనా అంతే! స్త్రీకి పురుషుడొక్కడే సమస్య కాదు. ఆమెకి… ఆమెతో ముడిపడిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానసిక సమస్యలూ.. కొన్నిసార్లు తోటి స్త్రీలు కూడా ప్రధాన సమస్యలే! ఏ కులానికి సంబంధించిన వారైనా.. వారి ‘అకృత్యాలు’ మాత్రమే సమస్య కావాలి గానీ – కులం, మతం, ఉనికి, పుట్టుకలే ప్రధాన సమస్య కాకూడదు! హింసా ప్రవృత్తి, దుర్భుద్ధి ఉన్నవారికి.. డబ్బూ. హోదా, అధికారం వుంటే.. వాటితో బలహీనులను హింసిస్తూ అణగదొక్కుతారన్నది నిజం. అది ఏ కులంలోనైనా, ఏ మతంలోనైనా జరగొచ్చు. దాన్ని ఏ కులానికో, మతానికో ఆపాదించడం సరికాదు.
అన్యాయాలూ, అక్రమాలూ కేవలం పురుషులకో, అగ్రకులాలకో, మతాలకో అంటగడుతూ రచనలు చేయడంలో ఏ శాస్త్రీయ దృక్పథం వుందో, అది హేతువికి ఏ రకంగా నిలుస్తుందో సాహితీకారులు ఆలోచించాలి.
స్త్రీ – పురుషుల మధ్య, దళితులూ – అగ్రకులాల మధ్య, ముస్లిములూ, ముస్లిమేతరుల మధ్య ‘హెచ్చు తగ్గుల్లేని, సమ భావన’ కోసం కృషి చేయాలే తప్ప.. జాతుల పేర, కులాల పేర, మతాల పేర.. వైషమ్యాలు తలెత్తేలా సాహిత్యం వుంటే.. అది ఒకరి పట్ల మరొకరికి ద్వేష భావాలను నూరి పోసినట్లవుతుంది.
ఏ ఉద్యమానికైనా ఊపిరి పొసే అభినవ బ్రహ్మలు సాహితీకారులు! నాణానికి ఒక వైపే వీక్షిస్తూ.. మరోవైపు అలక్ష్యం చేయడం, వాదాల చట్రంలోనే ఇమిడిపోవాలనుకోవడం పాక్షిక దృష్టి అవుతుందే తప్ప సమ దృష్టి కాదు!
ఎవరింట్లో పుడ్తున్నాం అన్నది మన చేతుల్లో లేదు! మన చేతుల్లో లేని విషయాన్ని ప్రధానం చేసుకుని కులాల పేర, జాతుల పేర, మతాల పేర.. వైషమ్యాన్ని పెంచే సాహిత్యం కాకుండా – మానవీయ విలువలకి ప్రాధాన్యమిచ్చే సాహిత్యం రావాలన్నదే నా అభిమతం!
ప్ర: సాహిత్యపరంగా ‘ఆత్మకథ‘ల ప్రయోజనం ఏమిటి? ఎందుకు రాస్తారు?
– ఆత్మ కథలు చదవడం మూలంగా – సదరు రచయిత తన జీవితంలో సంభవించిన ఒడిదుడుకులను ఎలా తట్టుకు నిలబడ్డాడు, ఎలా నిలబడలేకపోయాడు… అపజయాల్లో ఎలా కుప్పకూలాడు, తిరిగి ఎలా పుంజుకున్నాడు, ఏ నిర్ణయం అతడి జీవితాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందీ, చివరకి ఏది ఎలా అతడ్ని విజేతగా నిలబెట్టింది పాఠకులకు తెలుస్తుంది.అలాంటివి పఠితల్లో ఆత్మవిశ్వాసం నెలకొనేలా చేస్తుంది.
ఆత్మకథలు ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులకి, సమాజంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడతాయన్న అభిప్రాయంతోనే ఆత్మ కథలు రాస్తారనీ, రాయాలనీ నా అభిప్రాయం!
ప్ర: తెలుగులో మీకు నచ్చిన ఆత్మకథ గురించి చెప్పండి.
– కేవలం ఫోటోలను ఆధారం చేసుకుని అబ్బూరి ఛాయాదేవి గారు రాసిన ఆత్మ కథని తప్ప ఎవరి ఆత్మకథలూ చదవలేదు. అదీ కొండవీటి సత్యవతి గారు ఛాయాదేవి గారి ఆత్మకథ తాలూకు సాఫ్ట్ కాపీని పంపిస్తేనే… ఆ పుస్తకాన్ని చదవగలిగాను.
ప్ర: పాఠకలోకంలో వీటి ప్రభావం ఎట్లావుంటుంది?
– విజేతల ఆత్మకథలే కావు.. పరాజితుల ఆత్మకథలు కూడా పఠితలకు కొన్ని పాఠాలు నేర్పుతాయి! నిరాశావాదంతో నాలుగు రోడ్ల కూడలిలో నించుని ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు కొన్ని ఆత్మకథలు.. కరదీపికల్లా ఉపయోగపడతాయి!
ప్ర: కథ, నవల, ఈ రెండింటిలో మీకు ఇష్టమయిన ప్రక్రియ ఏది? ఎందుచేత?
– ఇద్దరు పిల్లలున్నప్పుడు మీకు ఏ పిల్లోడు ఇష్టం అని అడిగితే ఏం చెపుతాం? ఇద్దర్నీ మనమే కనిపెంచుతాం కదా! నాకు రెండూ ఇష్టమే!
ప్ర: అధికార భాషగా, బోధనా భాషగా తెలుగు అవసరం అని మీరు భావిస్తున్నారా? ఎందుచేత?
– ఎంతో మంది నిరక్షరాస్యులుగా వున్న దేశంలో.. తెలుగు ‘అధికార భాష’ గా కొనసాగించడం అత్యంత అవసరం! అయితే బోధనాభాషగా కేవలం తెలుగు మీడియంని మాత్రమే ప్రవేశ పెట్టాలనుకోవడం… విద్యార్థుల స్వేచ్ఛని హరించినట్టవువుతుంది! విద్యార్థులకి వాళ్లకి ఇష్టమైన మీడియంలో చదువుకునే పరిస్థితులను నెలకొల్పాలి. పొతే ఎవరు ఏ మీడియంలో చదివినా – ప్రథమ భాషగా తెలుగుకే పట్టం కట్టాలి!
ప్ర: తెలుగుభాష భవిష్యత్తు గురించి మీరు ఏమనుకంటున్నారు?
– ప్రపంచంలో ఒకప్పుడు ఎన్నో భాషలుండేవి. ఎవరికి వారు తమ భాషలను నిర్లక్ష్యం చేయడం మూలంగా – అవన్నీ మృత భాషలై,ప్రస్తుతం కేవలం 6912 భాషలు మాత్రమే మిగిలాయి. బ్రతుకు తెరువు కోసం మనం ఇంగ్లీష్,ఫ్రెంచ్, చైనీస్ లాంటి భాషలు ఎన్ని నేర్చుకున్నా- మాతృ భాషని అలక్ష్యం చేస్తే – కొన్నాళ్ళకి అది కూడా అంతరించిపోయిన భాషల్లో ఒకటిగా మిగిలిపోతుంది.
తన తీరిక సమయమంతా ఆటపాటల్లో, టీవీ, కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ ముందు గడిపే పిల్లాడికి.. తెలుగు పట్ల అభిమానం కలగడానికి కేవలం స్కూలే కాదు – ఇల్లూ, మీడియా, సమాజం.. అందరూ నైతిక బాధ్యత వహించాలి.
ఇంటి విషయానికొస్తే – కొన్ని వేల రూపాయలను కొత్తబట్టలకు ఖర్చు చేసే మనం.. ఇంట్లో పట్టుమని పది పుస్తకాలైనా కొనివ్వం! కేవలం ఒక కప్పు టీ ఖరీదుతో లభించే దినపత్రికకైనా మనం డబ్బు వెచ్చించం!
తెలుగు భాషని తల్లి దగ్గరే నేర్చుకున్న విద్యార్థికి – ఇంట్లో చదవడానికి ‘పుస్తకాలు’ వుండాలి. వాటిని మనం పిల్లలతో చదివించాలి.
పట్టు చీరల్లాంటివి పరాయి భాషలైతే.. అమ్మ మెత్తటి చీరలాంటిది మన మాతృభాష.
అలాంటి మన మాతృ భాష మనం పరిరక్షించుకోలేకపోతే- ‘అబ్బో! తెలుగా? రాయడం కష్టం!’ అనుకునే విద్యార్థులనే చూస్తాం!
అందుకే ఇలాంటి దుర్గతి నుండి మన తెలుగు భాషని పరిరక్షించుకునే దిశగా – తల్లిదండ్రులూ, స్కూళ్ళూ, అన్ని పత్రికలూ కృషి చేయాలి!
చక్కని సమాచారం అందించిన మీకు దన్యవాదాలు మేడం.
– ధన్యవాదాలు డాక్టరు గారు.