సంభాషణం: డా. మచ్చ హరిదాసు అంతరంగ ఆవిష్కరణ

3
2

మీరు కవిత్వం రాయలేదన్నారు, కానీ నానీలు రాసినట్టున్నారుగా…

నిజమే రాశాను. కానీ నానీలను నేను కవిత్వంగా అనుకోను. ఎందుకంటే నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు మా వద్దకు వేరే డిపార్ట్‌మెంట్ వాళ్ళు వచ్చేవారు. వాళ్ళకి టైం పాస్ కొరకు కాలక్షేపం కోసం చమత్కారంగా మాట్లాడమనేవారు. ఆ చమత్కార సంభాషణనే నోట్ చేసుకుని నానీలుగా రాయమని సూచించారు. మా గోపీగారి ప్రోత్సాహంతో వాటినే నానీలుగా రాశాను. ఆయనకి చూపిస్తే, ఆయన మెచ్చుకుని వాటిని పుస్తకంగా వెలువరిద్దాం అని ప్రోత్సహించారు. ఒకసారి అష్టమ సభ అని నానీల ఎనిమిదవ వార్షిక సభ జరిగింది. ఆ సభకు నేను వెళ్ళాను. అప్పుడు అక్కడ నాకు నానీలపై సంపూర్ణ అవగాహన కలిగింది. ఇదంతా రాయక ముందు సంగతి. అ సభ నుంచి వచ్చాకా ఒక ఎగ్జామినేషన్ డ్యూటీ పడింది. మా దగ్గర ఎన్.సి.సి. ఆఫీసర్ కెప్టెన్ మధుసూదన్ అని ఉండేవారు. ‘మీరు ఆ సభకి వెళ్ళొచ్చారు కదా, ఏదో ఒక నానీ చెప్పండి’ అన్నారు. నాలో పెద్ద బలహీనత ఉంది. నాకేదీ జ్ఞాపకం ఉండదు. ‘నాకేదీ గుర్తు లేదయ్యా’ అన్నాను. అన్నానే కాని ఎగ్జామినేషన్ డ్యూటీలో నేను చేసేదేముందీ, సూపర్‌విజనే కదా… ఆలోచిస్తూ ఉన్నా. అప్పుడే నావంటూ నా పది నానీలు వెలువడ్డాయప్పుడు. వాటిని నేను ఆయనకు చూపించినాను. ‘చాలా బాగున్నాయి’ అన్నాడు. దాని తర్వాతే వాటిని గోపీగారికి చూపించాను. అప్పుడు ఈ పుస్తకం వచ్చింది. ఈ పుస్తకం పేరు ‘గోరుకొయ్యలు’. గోరుకొయ్యలంటే రైతు తెల్లవారు జామున పొలానికి వెళ్ళేడప్పుడు ఈ గోరుకొయ్యలని చూసి సమయాన్ని తెలుసుకుంటాడు. అంటే ఆకాశంలో మూడు చుక్కలు వరుసగా కనబడుతుంటాయి. అవి గోరుకొయ్యలంటే! ‘ఈ పుస్తకంలో దేశీయ ముద్ర ఉంది’ అని గోపీ ఓ మీటింగ్‌లో అన్నారు. అంటే మన ప్రాంతంలో వుండే వ్యక్తులను స్మరించుకోడం అనేది! నాలుగు నానీల తర్వాత ఇక్కడున్న వారి గురించి ఐదోది… అంటే కాళోజీ లాంటి వారి గురించి.. నా సమకాలికుల గురించి… నా మిత్రుల గురించి.. వాళ్ళ రచనలలో ఉండే అంశాన్ని ప్రధానంగా తీసుకుని నాలుగు లైన్లలో ఎరుకపరచడానికి ప్రయత్నం చేశాను.

నేను డయాబెటిక్ పేషంటును. నా మీద నేనే ఒక నానీ రాసుకున్నాను.

మధుమేహమూ
గయ్యాళి భార్యలాంటిదే
విడాకులివ్వలేం
కలిసి నవ్వలేం
.”

ఇంకొన్ని చెప్పండి

ఇంత గంజిబువ్వకై
ఎంత కాపలా
కుక్కకి
లౌక్యం తెలియదు.

రైతు జీవితం గురించి ఒకటి:
ఆరుగాలం కష్టించినా
అడ్డికి పావుశేరే
రైతు జీవితం
ఎద్దు పుండు.

కళాకారుల గురించి రాసినవాటిల్లో భానుమతి గారి గురించి ఒకటి:
భానుమతి
బహుముఖ ప్రజ్ఞావతి
ఆమె నటన
నభూతో న భవిష్యతి.

ఇలా నాలుగు లైన్లలోనే నేను వారి గురించి చెప్పడానికి ప్రయత్నం చేసినాను.
నవ నవలాకారుడు
అంపశయ్య నవీన్
ఫ్రాయిడ్‌ను పుక్కిట
పట్టిన ప్రవీణుడు.

కొంచెం అంత్యప్రాస కలిసినట్లుండాలి, మొదటి రెండు లైన్లను చివరి రెండు లైన్లు సమర్థించేలా ఉండాలి.
మొన్న ఆలి కోసం
నిన్న నేల కోసం
నేడు నీళ్ళ కోసం
నిత్యం ఘర్షణే జీవితం.

రామాయణంలో భార్య కోసం, భారతంలో రాజ్యం కోసం, నేడు దేశాల మధ్య నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాని చెప్పడం నా ఉద్దేశం. ఇవి గోరుకొయ్యలు లోని కొన్ని నానీలు.

మీ వ్యాసల’హరి’ గురించి చెప్పండి

2000 నుంచి 2008 సంవత్సరాల ముందు నా సాహిత్య జీవితం ‘తథ్యము సుమతీ’ అనే పుస్తకానికి, ‘తెలుగులో యాత్రా రచనలు’ అనే పిహెచ్‌డి గ్రంథానికి పరిమితమయ్యింది. ఈ రెండూ తప్ప నేనేమీ రాయలేదు. కాకపోతే నేను అప్పుడు డిపార్టుమెంట్ హెడ్‌గా ఉండేవాణ్ణి కాబట్టి కరీంనగర్ ప్రాంతంలో ఎవరు సభ జరిపినా కూడా ఒక గౌరవ సూచకంగా నన్ను వచ్చి మాట్లాడమనేవారు. ఆవిష్కర్తగానో, ముఖ్య అతిథిగానో, అధ్యక్షుడిగానో, సమీక్షుడిగానో నన్ను పిలిచి వాళ్ళ గౌరవాన్ని చాటుకునేవారు. అప్పుడు నాకు మాట్లాడడం తప్పనిసరి అయ్యేది. దానికి ప్రిపేర్ అయ్యేవాణ్ణి, ప్రిపేర్ అయి వెళ్ళి మాట్లాడేవాణ్ణి. ఏ సభలో  మాట్లాడాలన్నా ముందు వ్యాసంలా నోట్స్ తయారు చేసుకుని వెళ్ళేవాడిని. అలా 27 పుస్తకాల సమీక్షలను వ్యాసలహరి పేరుతో 2011లో పుస్తకంగా తెచ్చాను. దీనిలో నానీల మీద ఒక పెద్ద వ్యాసం రాసినాను. ఈ పుస్తకం తరువాత ఒకాయన ఎం.ఫిల్ చేయడానికి ఉపకరించింది. కరీంనగర్ నానీలు మేలిమి రతనాలు అనే దాదాపు పదిహేను పేజీల వ్యాసం ఇందులో అన్నిటికంటే పెద్దది. ఈ పుస్తకం కూడా పండితులలో నాకు మంచి పేరును తెచ్చింది.

ఈ సమీక్షలూ, వ్యాసాలు రాయడం వల్ల ఎక్కడైనా మీరు విమర్శలు ఎదుర్కున్నారా?

లేదు. అలాంటివేవి ఎదురవలేదు. నేను ఒక సమన్వయ పూర్వకంగా రాస్తూ రావడం వల్ల అకారణంగా నిందించడం గానీ, అనవసరంగా పొగడడం గానీ చేయలేదు. ఉన్న విషయన్ని ఉన్నట్టుగా చెప్పినాను. ఏవైనా లోపాలున్నా వారికి సున్నితంగా ఎరుకపరిచాను.

మీ విద్యార్థులలో ఎవరైనా తర్వాతి కాలంలో పెద్ద రచయితలుగా పేరుపొందినవారున్నారా?

మా విద్యార్థులలో నానీల విషయానికొస్తే వెంకటేష్ అనే ఆయన నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఒక పుస్తకం రాసినాడు. అతనోసారి వ్యాసమేదో రాసి చూపిస్తే నేను అందులోని లోపాలను సరిజేసి, వ్యాసాలెలా రాయాలో తెలిపాను. ఆ స్ఫూర్తితో అతను తనను మెరుగుపర్చుకుని నానీల పుస్తకం వెలువరించాడు. ఇంకా ఇద్దురు ముగ్గురు పుస్తకాలు రాసినారు. పద్యకవిత్వం, కథలు వ్యాసాలు రాసినవారు నా దృష్టికి రాలేదు. చాలామంది విద్యార్థులు కాలేజీ మేగజైన్ కోసం మాత్రం రాసి, ఆపేసారు.

మీరు ’తథ్యము సుమతీ!’ పుస్తకం 1984లో సుమారు వంద పేజీలున్నాయి. 2016లో పరిష్కృత ముద్రణ తెచ్చేసరికి 232 పేజీల పుస్తకంగా మారింది. ఈ కాలంలో మీ దృష్టిలో వచ్చిన మార్పులు, వ్యాసాలలో వచ్చిన మార్పుల గురించి చెప్పండి.

ఇదివరకు చెప్పినట్లుగా 1978లో గోపీగారితో కలిసి తంజావూరు వెళ్ళాను. అక్కడ తాళపత్ర గ్రంథాలు లభించాయని చెప్పాను కదా. వాటిని తిరగరాసుకున్నాను. 1984లో పిహెచ్‌డికి అప్లయి చేద్దామనుకుంటున్నప్పుడు ‘ఇది వరకు మీకు రచన అలవాటు ఉందా, ఏవైనా వ్యాసాలు రాసినారా’ అని ప్రొఫెసర్లు అడిగినారు. మొట్టమొదటిసారి ఇంటర్వ్యూకి పోయినప్పుడు నాకు సీటు దొరకలేదు. ‘మీకు రచనానుభవం లేనట్టుంది, ఏవైనా పుస్తకం రాసి లేదా వ్యాసాలు రాసి తీసుకురండి’ అని చెప్పారు. నా దగ్గర మెటీరియల్ ఉంది కాబట్టి, వాటిపై వ్యాసాలు రాయవలసిందిగా గోపీ సూచించారు. అప్పుడు నేను ఐదు వ్యాసాలు రాసినాను. సుమతి శతకం మీద సుమతి శతక కర్తృత్వ చర్చ, సుమతి పద్య సంఖ్య – యాభై ఆరు కొత్త పద్యాలు, మూడవది ప్రతుల వివరాలు – పాఠం మీద చర్చ, నాలుగవది సుమతి కందం – ఛందఃశిల్పం, ఐదవది సుమతి నీతి – కవితారీతి అని అయిదు వ్యాసాలు రాసి వాటిని పుస్తకంగా ప్రింట్ చేయించినాను. దాదాపు 70 పేజీల పుస్తకం వచ్చింది. రెండవసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకాన్ని తీసుకునిపోతే, ‘మీరు ఎన్నుకున్న అంశానికీ దీనికి సంబంధం లేదు’ అన్నారు. ఈ పుస్తకం చిన్న పుస్తకమైనా ఆంధ్రప్రదేశ్‌లోని పండితులలో మంచి పేరు తెచ్చుకున్నది. ఇంకో ముప్ఫై పేజీలు పెంచి రాసినట్లయితే ఎం.ఫిల్ స్థాయి పుస్తకమయ్యేది కదా అన్నారు. కాకపోతే నాకప్పుడు ఆ దృష్టి లేదు. ఏదో హడావిడిగా కాకుండా లోతుగా పరిశోధన చేసి ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రిక, కాకినాడ వారి 56 కొత్త పద్యాలను సూచించాను. తెలుగు సాహిత్య అకాడెమీలో నూట యాభై పద్యలున్నాయి. ఆ నూట యాభైకి ఈ యాభై ఆరు పద్యాలు కలిపి 206 పద్యాలున్నాయని సూచనాప్రాయంగా చెప్పి వదిలిపెట్టాను. తాళపత్ర గ్రంథాలలోనివి నా దగ్గర ఉన్న పద్యాలు… ఇది అహంకారం కాదు గానీ… రాష్ట్రంలో ఎవరీ వద్దా లేవు. నా తదనంతరం ఈ పద్యాలు కాలగర్భంలో కలిసిపోతాయి. తంజావూరు దాక వెళ్ళి శ్రమ పడి పరిశోధన చేసినంత శ్రమా ఓర్పు ఈ కాలపు పిల్లలకు లేదనే నేను అనుకొంటున్నాను. అందుకని ఆ పద్యాలు మరుగున పడిపోకుండా ఉండడానికి రిటైరయిన తర్వాత వాటిని మళ్ళీ ముందేసుకుని వాటి ఆధారంగా అంటే సాహిత్య అకాడెమీ ప్రతి 150 పద్యాలు, తాళపత్ర ప్రతులు, తరువాత బజారు ప్రతులు, ఇవన్నింటినీ ముందు పెట్టుకుని రిపిటీషన్ కాకుండా టోటల్‌గా 206 పద్యాలు తీసుకుని పరివర్తిత ముద్రణములో అనుబంధంగా వేసినాను. కొందరన్నారు 206 పద్యాలను విడిగా పుస్తకంగా వేసినట్లయితే బాగుండేదని. అప్పట్లో నాకా ఆలోచన లేదు. భవిష్యత్తులో వేస్తానేమో. వీటిలో మూడు పద్యాలు నాకు కొరుకుడు పడలేదు. వాటిని ఒకరిద్దరు పండితుల చేత పరిష్కరింపజేసుకున్నాను. ఇంకా అడిగిన తర్వాత, పూర్తి పాఠం లభించిన తర్వాత అన్నీ కలిపి సమగ్రంగా ఒక చిన్న పుస్తకం వేయాలనుకుంటున్నాను.

దీనిలో 18 ప్రకరణాలు తీసినాను. పాత పుస్తకంలో అయిదే ప్రకరణాలుండేవి. ఇది 2016లో ముద్రింపబడింది. దీనికి కూడా రాజా రామ్‌మోహన్ రాయ్ ఫౌండేషన్ వారికి అప్లయి చేసుకున్నా కూడా కొనుగోలుకి నాకు పిలుపు రాలేదు. నా పుస్తకాలన్నింటికీ ఇలాగే అవుతోంది. ప్రచార ఆర్భాటం లేకపోవడం వల్ల పంచుకోడమే తప్ప ఎవరూ వీటిని ఆదరించడంలేదు. పండితులు మాత్రం మెచ్చుకుంటున్నారు.

మీరు సుమతి శతకం కర్తృత్వం గురించి చర్చించారు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?

నాకు దొరికిన ఆధారాలను బట్టి బద్దెన… బద్దెనృపాలుడే రాశాడని నా అభిప్రాయం. ఆయన అదివరకే నీతిశాస్త్ర ముక్తావళి రాసినాడు. నాకు దొరికిన ఆధారాలను బట్టి బద్దెనే రాసినాడని నేను రాశాను. ఇంకెవరైనా పరిశోధకులు ఎవరైనా దాన్ని వెలికితీసినట్లయితే… అంటే ఇప్పుడో అభిప్రాయం ఉంది… బద్దెన తెలంగాణకి చెందినవాడు అని నిరూపించాలని. ఆయన వేములవాడ చాళుక్యుల కాలంలో ఉండి ఉంటాడు… అట్లా మీరు నిరూపించలేరా అన్నారు. నాకైతే సాక్ష్యాలు దొరకలేదు. కొంత ఒత్తిడి కలిగి ఒక ఏడాది దాక పుస్తకాన్ని ప్రింట్ చేయకుండా ఆపినాను. తెలుగు సాహిత్య చరిత్ర… తెలంగాణ సాహిత్య చరిత్ర రాసిన వాళ్ళు కూడా ఒక వాక్యం రాసి ఊరుకున్నారు – బద్దెన బహుశా తెలంగాణా వాడు అయిఉంటాడు అని! అయిఉంటాడు అని అంటున్నారు కానీ ఆధారాలు చూపడం లేదు. నాకు ఇదివరకున్న వ్యాసాల ఆధారంగా, పుస్తకాల ఆధారంగా సుమటి శతక కర్త బద్దెనృపాలుడే అని ముగించినాను. చివరిలో ఒక వాక్యం మాత్రం ఎవరైనా నిరూపించదలిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. బద్దెన తెలంగాణకి చెందినవాడైతే నేను కూడా చాలా సంతోషపడతాను అని రాశాను.

అంటే బద్దెనృపాలుడు తెలంగాణ వాడు కాదని మీ అభిప్రాయమా?

అవును. తెలంగాణా వాడు కాదు. బహుశా ఏ కృష్ణా జిల్లా వాడో అయిఉండచ్చు. రచయిత కాలం గురించి కూడా వివాదం ఉంది. కర్తృత్వ వివాదమూ ఉంది, కాలం గురించిన వివాదమూ ఉంది. ఆయన 13వ శతాబ్ది వాడని నా అభిప్రాయం. కొన్ని అంతర్గత సాక్ష్యాలను బట్టి ఈ నిర్ణయానికొచ్చాను.

కందపద్యం పుట్టింది తెలంగాణలోనే కదా, ఈయనవి కందపద్యాలే కదా ఇక్కడివాడవుతాడేమోనని మనవాళ్ళు  అంటారు. బద్దెన, బద్దెనపల్లి ఉంది, బద్దెనృపాలుడు ఉంది, బద్ది పోచమ్మ ఉంది, బద్దిపల్లి ఉంది. ఈ పేర్లను బట్టి చూసినట్లయితే బద్దెన మన వాడేమో, వేములవాడ వాడేమో అంటున్నారు. ఏమో అంటున్నారు కాని దానికి ఆధారాలు దొరకడం లేదు. ఒకవేళ  నేనలా రాసి ఉంటే నామీద ఎంత దుమారం రేగేదో ఊహించలేను. అందుకే దానిని నేను భావి పరిశోధకులకే వదిలివేస్తున్నాను.

ఒకవేళ రాసి ఉంటే దుమారం రేగేది కాదేమో?

కాదెమో. కాని ఆధారాలు లేకుండా రాయడం నాకిష్టం లేదు.

కుమతీ శతకం కూడా ఉంది కదా…

ఉంది. కుమతి శతకంలో పేరడీ ఉంటుంది. మా లోక రీతుల్ని చూసి, లోకంలో ఉండే వ్యవహారాలను గమనించి ఇదే కందపద్యపు మూసలో పద్యాలు రాసినారు. కుమతి శతకాలు రెండున్నాయని అంటారు. ఒకదాంట్లోనయితే పరిశోధకులకు తలమునకలయ్యేంతగా ప్రశ్నలు వేసినారు. అంటే దీనిలో ఉర్దూ పదాలు కనబడుతున్నాయి కాబట్టి ఇది పదహారవ శతాబ్ది దాటినది కావచ్చు అనుకోవడం జరుగుతుంది.

మీరు గమనించిన కొన్ని పేరడీలను చెబుతారా?

తప్పకుండా:

కడుబలవంతుడైనను.. అనే సుమతి శతకంలో పద్యం ఒకటి ఉంది. దానికి రెండు పేరడీలు రచించాడు కుమతికారుడు.

కడు బలహీనుండైనను
బడిపిల్లల కార్మికాది పామర జనులన్
వడిగొని రేకెత్తించిన
కడు బలవంతుండతండు కాదటె కుమతీ!

కడు బలవంతుండైనను
మెడికలు కాలేజీ జేర మెచ్చుచు యువకున్
మడియని హాస్టలు జేర్చిన
పడపుగ నంగటికి దానె పంపడె కుమతీ!

మునిమాణిక్యం నరసింహారావు గారు కూడా ‘అభినవ సుమతీ’ పేరిట పేరడీలు రాశారు.
అప్పచ్చుల తోడ సుష్టుగ
ఎప్పుడు భోజనము పెట్టు ఇల్లో హోటలో
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ

అలాగే…
అక్కరకు రాని బస్సును
చక్కగ సినిమాకు రాక సణిగెడు భార్యన్
ఉక్కగ నుండెడు ఇంటిని
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!

వినదగు నెవ్వరు చెప్పిన పద్యానికున్న పేరడీ చూడండి
తినదగు నెవ్వరు పెట్టిన
తినినంతనె వేగపడక త్రేన్పంగవలెన్
తిని తీపి కారమరయని
మనుజుడెపో తిండిపోతు మహిలో కుమతీ!

మరొక పేరడీ:
కాఫీ త్రాగని వారును
సాఫీగా లంఖణాలు సాగేవారున్
ఏ ఫీజీయక మన పని
ఆఫీసులో చేయువారు అరుదుర కుమతీ!

ఒక్కోసారి పాదాన్ని అనుకరిస్తారు, ఒక్కోసారి శైలిని అనుకరిస్తారు. రెండు కుమతి శతకాలు ఉన్నాయన్నాను కదా, నాకు ఒకటే దొరికింది. నాకు దొరికినది 1964లో రాసినది, దొరకనిది 1954లో రాసినది. మునిమాణిక్యం గారివి కూడా అన్ని దొరకలేదు. దొరికితే ఈ పుస్తకం ఇంకా బాగా వచ్చేది.

యాత్రా చరిత్రలు’ పుస్తకాన్ని లఘు గ్రంథంగా ఎందుకు తెచ్చారు?

ప్రపంచ తెలుగు మహాసభలు 2012 డిసెంబరు నెలలో తిరుపతిలో జరిగాయి. తెలుగులో యాత్రా రచనలపై మొదటి పరిశోధనా గ్రంథం నాదే కాబట్టి తెలుగు యూనివర్సిటీ వారు యాత్రా రచనలపై ఒక లఘు గ్రంథం రాయవల్సిందిగా కోరినారు. అయితే నా థీసిస్ దాదాపు ఆరువందల పేజీల గ్రంథం. కాబట్టి లఘు గ్రంథాన్ని దాదాపు 108 పేజీలతో పుస్తకంగా వెలువరించినాను. దీనిలో కూడా ఓ 70 పేజీలు నా థీసిస్‌లోంచి క్లుప్తపరిచి రాసినాను. మరో ముప్ఫై పేజీలలో నాకు దొరికిన పుస్తకాలను అప్‌డేట్ చేసినాను. 1990 నుండి 2012 వరకు  ఎవరెవరు యాత్రలు చేసినారో ఆ పుస్తకాల సంక్షిప్త వివరణను కూడా ఇందులో అందించాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారి సాంస్కృతిక మండలి ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

మీరు కొత్తగా రాసిన ‘గునుకుల కొండాపురం పద్మశాలీయులు బూట్ల వంశం ఏడు తరాల చరిత్ర’ అనే పుస్తకం విడుదలైంది కదా, ఈ బూట్ల వంశం గురించి కాస్త చెబుతారా?

బూట్ల వంశం అనేది మా అత్తగారి వంశం. పద్మశాలీలలో బూట్ల వారు, మచ్చవారు.. ఉంటారు. మచ్చ వంశంలొ మా ఇల్లొకటే ఉంది. మేము ఆడపిల్ల తరఫు వాళ్ళం. మా నాయనమ్మ, మా అమ్మ, నా భార్య ముగ్గురు కూడా బూట్ల వంశం నుంచే కోడళ్ళుగా వచ్చినారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు… ఆబ్దికం పెట్టేడప్పుడు అయ్యవారు మా నాయన పేరు, తాత పేరు అడిగితే చెప్పినాను. తాతగారి తండ్రి పేరు అంటే చెప్పలేకపోయినా. చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే మా నాయనగారు నాలుగైదు ఏండ్ల వయసులోనే ఆ ఊరు వదిలిపెట్టి వచ్చినారు. ఆ ఊరితో సంబంధం లేకుండా పోయిందాయనకు. సందర్భవశాత్తు కూడా ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళ నాన్న పేరు చెప్పినాడు కానీ వాళ్ళ తాత పేరు చెప్పలేదు. బహుశా అడిగితే చెప్పేవాడేమో… మరి నాకు తెలియలేదు. అప్పుడయ్యవారు యజ్ఞయ్య అనే పేరుతో కర్మకాండ పూర్తి చేశారు. మా ముత్తాత గారి పేరు నాకు తెలియకపోవడమేంటని మీమాంసలో పడి బావుపేటలో ఉండే మా వియ్యంకుడిని వివరాలు తెలుసుకోమని అభ్యర్థించాను. ఆయన తెలుసుకుని నాకు చెప్పారు. తరువాత మా వంశంలోని ఆరు తరాల వారి వివరాలు సేకరించగలిగాను.

ఈ  మధ్యలో ఏమయిందంటే… మా అమ్మమ్మ వాళ్ళ భర్త… వీరయ్య… బూట్ల వంశానికి చెందినవాడు కాదు అని తెలిసింది నాకు. ఆయన వేరే ఇంటి నుండి దత్తత వచ్చినాడని తెలిసింది. చాలా ఆశ్చర్యమనిపించింది. బోట్ల దారం వడికి చేతి మగ్గం పని చేసేవారు కాబట్టి బూట్ల వంశం అని పేరు వచ్చినట్లుంది. బూట్ల వంశం గురించి ఆరా తీస్తే బాగుంటుందనిపించింది. అలా బూట్ల వంశం గురించి పరిశోధిస్తే, నాకు వారి ఏడు తరాల చరిత్ర లభించింది. ఇందుకు నాలుగేళ్ళు పట్టింది. బూట్ల వంశంలోని వారితో ముఖాముఖి జరుపుతున్నప్పుడు – చాలామందికి తమ కుటుంబ సభ్యుల పేర్లే తెలియకపోవడం చూసి విస్తుపోయాను. ఒక వ్యక్తి ఒకసారి చెప్పిన విషయం మరొక వ్యక్తి చెప్పే విషయానికి పొసిగేది కాదు. అందుకే నలుగురైదుగురి ద్వారా విషయాలను సేకరించి సత్యమని రూఢిపరుచుకున్నాకనే ఈ పుస్తకంలో పొందుపరిచాను. ఈ వంశంలో ఐదో తరానికి చెందిన వ్యక్తి.. నాకు తాతయ్య వరసయ్యే చొక్కయ్య గారు తన కొడుకులు ఆ రోజుల్లోనే హైదరాబాద్‌కి పంపి చదివించాడట. వాళ్ళు ప్రయోజకులై రాణించడం మా నాయన నన్ను కరీంనగర్‌లో చదివించడానికది ప్రేరణనిచ్చి ఉండచ్చు. నా జీవితం బాగుపడడానికి పరోక్షంగా కారణమైన చొక్కయ్య తాతగారి ఋణం తీర్చుకునేందుకు ఈ పుస్తకాన్ని వారికే అంకితం చేశాను.

మీ శిష్యుడొకరు మీ పై పుస్తకం వెలువరించారని తెలిసింది, ఆ వివరాలు చెప్తారా?

1978లో ములుగులో నాకు పాతూరి రఘురామయ్య అనే శిష్యుడు ఉండేవాడు. ఎందరో శిష్యులుంటారు కానీ ఎవరు ప్రయోజకులవుతారో మనకి తెలియదు. మనం క్లాస్ రూమ్‌లో ఏం చెబుతామో, వాళ్ళు దానిని ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ మనకేమీ తెలియదు. కానీ ఆ పిల్లవాడు ఎప్పుడో 1978లో నా శిష్యుడైనప్పటికీ, ఇంకో ఏడాదిలో టీచరుగా రిటైరవుతున్నాడు.

నేను రిటైర్ అయినప్పుడు నా గురించి ‘హరిచందనం’ పేరిట అభినందన సంచిక వెలువరించారు. దాన్ని చదివిన రఘురామయ్య, నన్ను కలిసి, నా పై ఒక పద్యకావ్యం రాయలని ఉందని అన్నాడు. “నా మీద శతకం రాయడమేమిటి? రాస్తే నా సమకాలీనులు అసూయ పడరా? అయినా దేవీదేవతలపైన కదా శతకాలు రాయల్సింది” అన్నాను. కాని అతను బాగా పట్టుపట్టిన మీదట సరేనన్నాను. నా జీవితం మొత్తాన్ని మేళవించి మధురాక్కరలు ఛందస్సులో 120 పద్యాలతో ‘గురువరేణ్య శతకం’ రాశాడు. ఆ పుస్తకం కూడా ‘గునుకుల కొండాపురం పద్మశాలీయులు బూట్ల వంశం ఏడు తరాల చరిత్ర’ పుస్తకంతో పాటుగా విడుదలయింది. ఆ పుస్తకాన్ని రఘురామయ్య నాకే అంకితం చేసినాడు. శిష్యుడు ప్రయోజకుడైతే గురువుకి అంతకన్నా ఆనందం ఏముంటుంది?

చివరగా, మీ విశ్రాంత జీవనం ఎలా ఉంది? మీ పిల్లల గురించి చెప్పండి.

2008లో ఉద్యోగ బాధ్యతల నుంచి విరమించుకున్నాను. ప్రస్తుతం పఠనం, అధ్యయనం, మనవలు మనవరాళ్లతో కాలక్షేపం. నా భార్య భారతి. నాకు ముగ్గురు కొడుకులు – రాజశేఖర్, చంద్రశేఖర్, ఇందుశేఖర్. అందరూ చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు. వసంతలక్ష్మి, శిరీష, భాగలక్ష్మి కోడళ్ళు. శ్రీమాన్, శీవల్లి, శ్రీకర్, శ్రీనాథ్, శ్రీముఖి మనవలు, మనవరాళ్ళు.

హరిదాసు గారూ, మా కోసం సమయం వెచ్చించి మీ వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం.

నమస్కారం. మా ఊరొచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు.

(డా. మచ్చ హరిదాసు, ఇం.నెం.1-86 (న్యూ), శ్రీనివాసం, పద్మనగర్, కరీంనగర్ – 505002 మొబైల్: 9849517452)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here