[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం సాహిత్య సాంసృతిక కళానిధి డా. పత్రి లక్ష్మీ నరసింహ ప్రసాద్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]
[dropcap]సా[/dropcap]హిత్య రంగం ఒక సముద్రం లాంటిది. సాంసృతిక రంగం మహాసముద్రం లాంటిది. ఈ రెంటిని సమన్వయ పరచుకుని, ఆ రెంటికీ న్యాయం చేయడం సామాన్య విశయం కాదు. సామాన్యులకు అది సాధ్యం కాదు. కృషి, పట్టుదల, నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చని పెద్దలు చెబుతారు. అది నిజమని నిరూపించారు, పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారి కుటుంబంలో మరో ఆణిముత్యం, సాహితీ దిగ్గజం డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్ గారు.
సాహిత్య, సాంస్కృతిక, విద్యా రంగాలలో ప్రసాద్ గారి బహురూపాలను వారి ద్వారానే తెలుసుకుందాం.
~~
♦ కళలు కొన్ని పుట్టుకతోనే మన వెంట కదలి వస్తాయి. కొన్ని సాధనతో ఫలితాలు సాధించవచ్చు. మీ విషయంలో రచనా వ్యాసంగం ఎప్పుడు ఎలా మొదలైంది?
♣ మీరు చెప్పింది నిజమే.. కళాభిరుచి, కళపై విపరీతమైన తృష్ణ నిస్సందేహంగా పుట్టుకతోనే వస్తాయి. దానికి ప్రోత్సాహం, అండదండలు, అవకాశాలు లభిస్తే, ఆ కళాకారుడిలో కళ రాణింపుకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనలో ప్రత్యేకంగా ఓ కళలో ఆసక్తి ఉన్నట్లు కొందరి వల్లే బయట పడుతుంది.
నా జీవితంలో యాదృచ్ఛికం గానో కాకతాళీయం గానో ఒక మహా చైతన్యమూర్తి, గత శతాబ్దంలో ఎన్నో తరాలని బాల్యం లోనే సాంస్కృతిక కళారంగాల్లో ప్రభావితం చేసి, కళాకారులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు ‘రేడియో అన్నయ్య’గా కీర్తి పొందిన శ్రీ న్యాయపతి రాఘవరావు గారి సాహిత్యాన్ని పొందటం జరిగింది. నా 12వ ఏట మా నాన్నగారు గారు శ్రీ పత్రి గోపాల కృష్ణ రావు గారు నన్ను వారి బాలల సామ్రాజ్యం లోకి తీసుకు వెళ్లారు.
ఆంధ్ర బాలానంద సంఘం నారాయణ గూడ శాఖ హైదరాబాద్‌లో ఈ బాలల అద్భుత స్వర్గం ఉన్నది. రేడియో అన్నయ్య గారు బాపు రమణ లను, శ్రీ. మోహన్ కందా IAS వంటి మహానుభావులనికి బాల్యంలోనే ఎంతో ప్రేరణ చైతన్యం కలిగించారు. శ్రీ న్యాయపతి రాఘవరావు గారు, రేడియో అక్కయ్య న్యాయపతి కామేశ్వరి ఇద్దరు బాల్యం లోనే పిల్లలకి అత్యుత్తమ సంగీతం, సాహిత్య నృత్యాలపై ఆసక్తి కలిగించేవారు. వాటిలో పిల్లలు ప్రావీణ్యం పొందేలా నాటికలు, నృత్య నాటికలు, రేడియో నాటికలు ఏకపాత్రాభినయాలు మొదలైన ప్రక్రియల్లో వారికి అవకాశాలు కల్పించారు. భారతీయ సంస్కృతి, తెలుగు వారి కళా సామ్రాజ్యం పసితనంలోనే పిల్లలకి పరిచయం అయింది. ఎవరిలో ఏ కళ ఉంటే, ఆ కళ వికాసం అయింది.
రేడియో అన్నయ్య గారి బాలల సామ్రాజ్యంలో జీవించిన పిల్లలు పెరిగి పెద్ద అయ్యాక కొందరు మహా కళాకారులు అయతే అందరూ రసజ్ఞులయ్యారు. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఉత్తమ పౌరులయ్యారు.
పిల్లలకి రేడియో అన్నయ్యగారు ఒక అద్భుత వేదిక ఇచ్చారు. పిల్లలు శ్రావ్యంగా రేడియో లోను, రంగస్థలంపై దృశ్యం గాను సంగీత సాహిత్య నృత్య నాటికలు ప్రదర్శించారు. ఆ సమయం లోనే శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు నిర్మాతలుగా సుడిగుండాలు, మరో ప్రపంచం సినిమాలు తీశారు. దానిలో పిల్లల చేత స్వతంత్ర భారత నృత్య నాటిక కూడా ప్రదర్శించారు.. నేను కూడా దీనిలో పాల్గొన్నాను. శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారి హస్తాలనుండి సుడిగుండాలు షీల్డ్ జ్ఞాపిక అందుకోవడం నాకు ఒక అద్భుతమైన అనుభూతి.. ఇది కళారంగంలో నా ప్రవేశం. దీని ద్వారా నా జీవితంలో బాల్యం లోనే అద్భుతమైన కళా సాంస్కృతిక రంగాల పునాదులు పడ్డాయి.
రేడియో అన్నయ్య గారు ఢిల్లీలో 1969లో అఖిల భారత బాల బాలికల సమ్మేళనానికి మమ్మల్ని తీసుకు వెళ్లారు. అందులో నేను 3 నాటికల్లో పాల్గొన్నాను. గురజాడ వారి ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ చీకట్లో వెలుగు, పట్టుదల నాటికల్లో పాల్గొన్నాను.. ముఖ్య విషయం ఏమిటంటే, ఆనాటి సాంస్కృతిక కార్యక్రమాలు ఢిల్లీ TV లో ప్రసారం అయ్యాయి.. అసలు అప్పుడు. మాకు TV అంటే ఏమిటో తెలియదు.. మాకు ఒక్కటే చెప్పారు. ఆతి పెద్ద చప్పుడు, పెద్ద లైట్లు నాటిక మధ్యలో మా మీద పడతాయి.. భయపడద్దు.. అన్నారు. అయినా చాలా భయం వేసింది. విశాలమైన మైదానం చాలా పెద్ద రంగస్థలం. బ్రహ్మాండమైన లైట్లు.. వాటి మధ్య మా నటన… నాటిక… మరపు రాని అనుభూతి..
ఆ బ్రహ్మాండమైన ప్రదర్శన తరువాత మా పిల్లల నందరం భారత రాష్ట్రపతి శ్రీ V.V. గిరి గారిని రాష్ట్రపతి భవన్‌లో కలుసుకున్నాం. శ్రీ V.V. గిరి గారు మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్రపతి భవన్‌లో ఒక పెద్ద ఉద్యానవనం, సువిశాలమైన సౌధాలు ఆ బాల్యంలో చూసే భాగ్యం కలిగింది.
♦ మీరు వృత్తి రీత్యా విద్యారంగంలో స్థిరపడడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయా? ఎందుకు మీరు ఈ రంగాన్ని ఎంచుకున్నారు?
♣ నా తండ్రి శ్రీ పత్రి గోపాల కృష్ణ రావు గారు డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్, ప్రిన్సిపాల్. ఆయన ప్రభావంతో పాటు చిన్నప్పటి నుండి విద్యారంగం అంటే ఆసక్తి పెరిగింది. మా తెలుగు ఉపాధ్యాయుడు శ్రీ పి. సూర్యనారాయణ మూర్తి గారు, విశ్వ విద్యాలయ స్థాయిలో ఆచార్య శ్రీ జి. వి.సుబ్రహ్మణ్యం గారి ప్రభావం చాలా ఉన్నది.
నా జీవితం మీద ఆకాశవాణి ప్రభావం చాలా చాలా ఉన్నది. M.A.తెలుగు చేస్తున్న రోజుల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో CAUSUAL ANNOUNCER గా 5 సంవత్సరాలు పని చేసాను. అప్పుడే అక్కడే. Permanent ఐపోతానేమో అనుకున్నా.. కానీ విద్యారంగం పరిశోధన నన్ను తీవ్రంగా ఆకర్షించింది.. అసలు డిగ్రీ స్థాయిలో నేను B.COM. E.M. కొద్దీ నెలలు. C.A కి. కూడా వెళ్ళాను. Entrance వ్రాసాను..ఆకస్మాత్తుగా ఒకరోజు మా నాన్న గారితో నేను M.A. తెలుగు చేస్తా అని నా నిశ్చయాన్ని చెప్పాను.. ఆయన ఆశ్చర్యపోయారు. ముందు ఒప్పుకోలేదు.. తరువాత నా గురించి అలోచించారు. నేను అప్పటికే తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ రచయితల గ్రంథాలు చదవడం, కళా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో నా ఆసక్తిని గుర్తు చేసుకొని ‘సరే’ అన్నారు.. ఇది నా జీవితాన్ని సంపూర్ణంగా మలుపు తిప్పింది.
నాకు నా గురువుల ప్రభావంతో ఒక Teacher కావాలని తీవ్రమైన కోరిక ఉండేది. ఇంటర్మీడియట్ నుండి P.G. వరకు ఉపాధ్యాయుడిగా బోధించడం నాకు నెరవేరిన కల. దీనితో పాటు ఆధ్యాత్మిక పౌరాణిక తాత్త్విక ఉపన్యాసాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం నాకు జీవితంలో ఎంతో తృప్తి ని ఉచ్చింది. ఇప్పటికి SKYPE లో ఇస్తున్నాను.
♦ అన్నమయ్య సాహిత్య పరిశోధనకు మిమ్ములను పురిగొల్పిన పరిస్థితులు ఏమిటి? మీ పరిశోధనలో మీరు సాధించిన విజయాల గురించి చెప్పండి.
♣ అన్నమయ్యపై పరిశోధనకి ముందు నాకు తెలుగు సాహిత్యంలో హాస్యం పైన Ph.D చేద్దామని లేదా పరిశోధన చేద్దామని చాలా తీవ్రమైన కోరిక ఉండేది. బాపు, ముళ్ళపూడి వెంకట రమణ గార్ల ప్రభావం చిన్నప్పటి నుండి చాలా ఎక్కువ.
M.A తెలుగు పూర్తి అయ్యాక ఆచార్య డా.జి. వి.సుబ్రహ్మణ్యం గారి ప్రభావం ఎక్కువయింది.. ఆయన నన్ను మహా భారతం మీద పరిశోధన చేయమని ప్రోత్సహించారు. పంచమ వేదాన్ని అధ్యయనం చేసే భాగ్యం కదా. M.Phil కోసం ‘ఆంధ్ర మహాభారతం ~ ఉద్యోగపర్వం ~ వాక్యలయ’ అనే అంశాన్ని తీసుకున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆ M.Phil డిగ్రీ 1980లో తీసుకున్నాను.
హాస్యం మీద పరిశోధన Ph.D చేద్దామనే కోరిక లోపల నుండి జ్వలిస్తోంది. నిజానికి తెలుగు సాహిత్యంలో హాస్యం గురించి నా పదో ఏట నుండి ఇప్పుడు కూడా చదువుతూనే వ్రాస్తూనే ఉన్నాను. 1980లో మా బాబాయి శ్రీ పి.వి.ఆర్.కె ప్రసాద్ గారు I.A.S. ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం EXECUTIVE OFFICER గా ఉండేవారు. నా జీవితం అంతా ఆయన వేసిన ముద్రలే..
అన్నమయ్య ఆనాడు ఈనాడు కూడా దున్నని పొలమే. అన్నమాచార్య ప్రాజెక్ట్ TTD కొన్నివిశ్వవిద్యాలయాలకి ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, మద్రాస్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లకు ప్రత్యేకంగా Ph.D కోసం Scholarship ఇచ్చి ప్రోత్సహించారు.. ఇది శ్రీ పి వి.ఆర్.కె. గారి సంకల్పం.. శ్రీవారి అనుగ్రహంతో శ్రీవారిపై అన్నమయ్య సంకీర్తనలను అధ్యయనం చేస్తూ పరిశోధన చేసే అవకాశం.. నేను వెంటనే సెంట్రల్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్నాను. శ్రీహరి కృపతో నాకు Ph.D సీటు వచ్చింది. నా పరిశోధన అంశం ‘తాళ్ళపాక అన్నమాచార్యుల శృంగార సంకీర్తనల్లో రస వృత్తి – వాక్య లయ’. ఆ విధంగా అన్నమయ్యపై పరిశోధన ఆచార్య శ్రీ జి. వి.సుబ్రహ్మణ్యం గారు Guide గా ఉండగా 1980లో ప్రారంభం అయింది. నేను ఉద్యోగ రీత్యా వరంగల్లు ఆంధ్ర విద్యాభి వర్ధనీ కళాశాలకి 1983లో రావడంతో నేను అన్నమయ్య కాకతీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్నాం. డా.జి.వి.రత్నం గారు ఇక్కడ Guide గా ఉన్నారు.1990లో నాకు Ph.D వచ్చింది.. ఆద్యంతము శ్రీ పి.వి.ఆర్.కె. పరిశోధనలో ఎంతో ప్రోత్సహించారు.
♦ సాహిత్యంలో హాస్యం వెనుకబడిపోయింది అనీ, కథల్లో గాని, నవలల్లో గానీ హస్యం సరిగా పండడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి?
♣ నాకు చిన్నప్పటి నుండి తెలుగు సాహిత్యంలో హాస్యం అంటే చాలా ఇష్టమని ఇంతకు మునుపే చెప్పాను.. అసలు హాస్య రసమే ఉపేక్షిత రసం. పేరుకి రసాల్లో రెండో స్థానం ఇచ్చినా, ఆధునిక యుగం వరకు తెలుగు సాహిత్యం హాస్యానికి పెద్దపీట వేయలేదు. ప్రధాన రసంగా హాస్యానికి ఏ ప్రక్రియ లోను కవులు స్థానం కల్పించలేదు. కందుకూరి వారు, గురజాడ అప్పారావు గారు చిలకమర్తి వారితో హాస్యం ప్రధానంగా రచనలు ప్రారంభం అయ్యాయి. అవి కూడా సామాజిక దురాచార ఖండన కోసమే స్వీకరించారు.
ఆధునిక యుగంలో అన్ని ప్రక్రియల్లో హాస్యం వ్రాయడం ప్రారంభం అయింది. వెటకారం, శ్లేష క్రోక్తి, దూషణలు కూడా హాస్యం అయ్యాయి. మంచి సరసమైన హృదయగత హాస్యం మునిమాణిక్యం నుండి ముళ్ళపూడితో యర్రంశెట్టి సాయి, ఇంకా అనేక ప్రముఖులతో ఉన్నత స్థాయి హాస్యమే పండింది. ప్రస్తుతం ఆ స్థాయిలో హాస్య రచనలు రావడం లేదు. నేను అనేక ప్రక్రియల్లో హాస్య రచనలు చేసాను.
నాకు కళాశాలల్లో క్లాస్‌మేట్, మార్గదర్శి, సుప్రసిద్ధ విమర్శకురాలు ఆచార్య డా. మృణాళిని నా పరిశోధనలో రచనలలో నా హాస్య రచనల్లో మీడియా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఎంతో ప్రేరణ కలిగించింది. తన ప్రోత్సాహం తోనే నేను ‘తెలుగు సాహిత్యంలో హాస్యం’ అనే గ్రంథాన్ని 2013 ప్రపంచ తెలుగు మహా సభల్లో వ్రాసాను, దీనిని తెలుగు విశ్వ విద్యాలయం ముద్రించింది. తన విలువైన సూచనలతో ఇప్పటికీ బాపు గారిపై పరిశోధన చేస్తున్నాను.
ఆకాశవాణి లో 13 వారాలు తెలుగు సాహిత్యంలో హాస్యం గురించి మాట్లాడాను.. తెలుగు సాహిత్యంలో హాస్యం గురించి శ్రీ ఓలేటి పార్వతీసం గారి నిర్వహణలో నా ప్రసంగాలు హైదరాబాద్ దూరదర్శన్ ప్రసారం చేసింది.
♦ మన రాష్ట్రంలోనూ, కేంద్రం లోనూ వివిద హోదాలలో పనిచేసిన మాన్యులు శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారి కుటుంబ సభ్యులుగా మీ గురించి చాలా మందికి తెలియదు. వారితో.. సాహిత్య పరంగా మీకున్న అనుభవాలు చెప్పండి.
♣ శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ IAS నాకు బాబాయి. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం E.O. నుండి, భారత ప్రధాని చీఫ్ సెక్రటరీ దాకా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించినా, పదవి వల్ల ఆయన పొందిన గౌరవం కన్నా, ఆయన వల్ల పదవికి లభించిన గౌరవమే ఎక్కువ. ఆయన వ్యక్తిత్వ పరిమళం సమర్థత, కార్యదక్షత, నిజాయితీ అటువంటివి.
నన్ను బాల్యం నుండీ ఆయన ఎంతో అభిమానించారు. నేను తెలుగు సాహిత్యంలో హాస్యంపై Ph.D చేస్తానంటే ఆ శ్రీహరి పై ప్రతి తెలుగు తల్లి పాడుకునే అన్నమయ్య సంకీర్తనలపై చేయమని సూచించారు. ఒక డిగ్రీ కన్నా ఇలా శ్రీహరి నామాన్ని నిరంతరం శ్రవణం కీర్తనం స్మరణం చేస్తూ పరిశోధించే భాగ్యమే గొప్పది, పైగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారం ఈ భాగ్యం లభించడం నా పురాకృత పుణ్య విశేషం, శ్రీహరి కరుణా కటాక్షం. పి.వి.ఆర్.కె. ప్రత్యేకించి నన్ను నా పరిశోధన గురించి తన ‘నాహం కర్తా హరిః కర్తా’ లో ప్రస్తావించడం ఇంకా ఆనందం, గౌరవం.
శ్రీ పి.వి.ఆర్.కె. T.T.D. E.O గా ఉండగా స్వయంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో నాకు వేద పండితుల చేత ఉపనయనం చేయించారు. నా ఆధ్యాత్మిక ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. నా రచనలని ఎన్నింటినో ఆయన స్వయంగా చదివి విశ్లేషించి సూచన లిచ్చారు.. ముఖ్యంగా నేను వ్రాసిన అష్ట లక్ష్మీనరసింహా కల్యాణం కూచిపూడి నృత్యనాటికని స్వయంగా వరంగల్లు వచ్చి నేను ఆంధ్ర విద్యాభి వర్ధనీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు వచ్చి వీక్షించారు.. ఈ నృత్య నాటికని నేను వారికే అంకిత మిచ్చాను.
ఒకసారి నాకు వరంగల్లులో తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్వహించాలనే సంకల్పం కలిగింది. నేను నాకు సహోద్యోగి, జీవితమంతా గురువు, మార్గదర్శి, తోడు నీడగా నిలిచి నాలో చైతన్యాన్ని, ప్రేరణని ఉత్సాహాన్ని కలిగించిన వ్యక్తి శ్రీ వేమూరి శ్రీనివాసమూర్తి. ఆయన తోడు అండదండలు ఆశీస్సులు లేకుండా నేను జీవితంలో పరిశోధన, నేను వ్రాసిన భిన్న సాహిత్య ప్రక్రియల్లో రచనల పర్యవేక్షణతో పాటు, ఒక విధానంగా నా జీవితం నా తండ్రితో పాటు నడిపించారు. వారు లేకుండా నేను ఏ కార్యాన్నీ సాధించ లేదనే చెప్పాలి. నేను శ్రీనివాస మూర్తి గారు, వరంగల్లులో సుప్రసిద్దులు ఆడిటర్ శ్రీ జి. ఎస్.మాధవ రావు గారు తోడుగా నిలువగా శ్రీ భాగవత పీఠం స్థాపించాము. పి.వి.ఆర్.కె ఆశీస్సులు లభించాయి.
ఒకసారి వైశాఖ పౌర్ణమి నాడు ఈ అన్నమయ్య జయంతి ఉత్సవాలను శ్రీ కరి కూర్మనాథం, కర్ణాటక సంగీత విద్వాంసులు, శ్రీమతి కుప్పా పద్మజ కూచిపూడి నృత్యం గారి తోడ్పాటుతో ఉత్సాహంతో నిర్వహించాను. రెండవ సారి ఇంకా భారీ ఎత్తున ఈ ఉత్సవాలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని సంకల్పం కలిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా అన్నమాచార్య సంగీత పోటీలు నిర్వహించాలని నిశ్చయించాము. అతి చిన్న పిల్లల నుండి పండితుల వరకు భిన్న స్థాయిల్లో ఈ పోటీలు జరిగాయి. ప్రథమ బహుమతి రు.1000/- షీల్డ్ శాలువా.. ఇలాగే అత్యంత ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించాము.
మేమే అన్నమయ్య సంకీర్తనలని వేల సంఖ్యలో ముద్రించి ప్రజలకి అందించాము. అత్యధిక సంఖ్యలో ప్రజలు ఇలా అన్నమయ్య సంకీర్తనలు పోటీ పడుతూ భక్తి పరవశంతో పాడుతుంటే వినడమే ఓ భాగ్యం. నాకు ఒక చిన్న సేవా భాగ్యం కలిగిందని సంతోషించాను.
నాకు ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. నాకు ‘భావయామి గోపాల బాలం’ అనే అన్నమయ్య సంకీర్తన చాలా ఇష్టం. పోటీలో పాడే వారు తమకిష్టం వచ్చిన సంకీర్తన పాడతారు కదా.. నాకు నచ్చిన ఈ సంకీర్తన పాడరు కదా.. ఏం చేయాలి అనుకున్నా.. శ్రీ పి.వి ఆర్.కె.కి చెప్పాను. “అందరూ అందరినీ ఈ పాట పాడేట్లు చేయాలి. ప్రతి ఒక్కరు ఏ అన్నమయ్య సంకీర్తన పోటీలో పాడినా ఈ ‘భావయమి గోపాల బాలం’ సంకీర్తన విధిగా పాడాలని నిబంధన పెట్టు. పాడిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక బహుమతి ఇస్తానని చెప్పు.” అని సూచించారు..
“ఎంత మంది పోటీలో పాల్గొంటారో తెలియదు. మొత్తం బహుమతులకే చాలా ధనం కావాలి. Sponsored amount వాటికే చాలుతుందో లేదో తెలియదు. ఇలా ప్రతి ఒకరికి ఒక ప్రత్యేక బహుమతి ఎలా ఇవ్వను?” అన్నా.. దిగులుగా.. “TTD. ని అడుగుదాం” అన్నారు నవ్వుతూ పి.వి.ఆర్.కె. “ముఖ్య అతిథిగా మీరు వస్తారా..”అని అడిగా… “ఓ తప్పకుండా. ఇంత హరి నామ స్మరణ జరుగుతుంటే రానా” అన్నారు నవ్వుతూ ఆయన.
నాకు ఉత్సాహం పట్టపగ్గాలు లేకుండా పోయింది.. ముందు సంగీత కళాశాల వారు అభ్యంతరం చెప్పారు.. ఈ భావయామి సంకీర్తన మా సిలబస్‌లో పెట్ట లేదు. ఎవరు పాడక పోతే అభాసు అవుతారు, ఇది తీసేయండి అన్నారు. నేను అంగీకరించలేదు. పాడగలిగిన వాళ్ళే పాడతారు అన్నాను.. నాకు మొండితనం ఎక్కువయింది.. ఊళ్ళో పెద్దల ఆశీస్సులతో ముందుకు నడిచాను. పోటీలో జనం పోటెత్తారు. రాష్ట్ర స్థాయిలో సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులని జడ్జీలుగా పిలిచాను ప్రజలు మహోత్సాహంతో పాల్గొనడంతో.. నేను అనుకున్న రోజుల్లో పోటీ నిర్వహించడం సాధ్యం కాలేదు. ఉత్సవ సభల్లో పి.వి.ఆర్.కె ముందు ఫైనల్స్ అని ప్రకటించాను.
శ్రీ పి.వి.ఆర్.కె.ని చూడటం కోసం భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. ప్రఖ్యాత పరిశోధకులు అన్నమయ్య ఆడియో Cassette లకు వ్యాఖ్యానం అందించిన శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు కూడా అతిథిగా వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి బహుమతుల ప్రసాదం విశేషంగా లభించింది.
శ్రీ పి.వి.ఆర్.కె. బాపు బొమ్మలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయిన నా Ph.D పరిశోధన గ్రంథాన్ని ఆనాటి సభలో ఆవిష్కరించారు. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం చేసింది. ఆ సభ లోనే ఆయన నేను రచించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ పాటల AUDIO CD (బాపు బొమ్మలతో) ఆవిష్కరించారు.. పి.వి.ఆర్.కె ఆశీస్సులు ఇంత అద్భుతంగా లభించాయి. ఆయన ఆనందానికి ఆకాశమే హద్దు.
నా తండ్రి గారితో పాటు వారు కూడా నా ఆధ్యాత్మిక గ్రంథ రచనలను పర్య వేక్షించారు. ఎంతో అభినందిస్తూ ఆశీర్వదించారు.
నేను రెండు AUDIO CD లను – 1. కర్మ ~ పునర్జన్మ, 2. మరణానంతర స్థితి పై పరిశోధనాత్మకం గా రచించి అందించాను.
కర్మ పునర్జన్మ CD ని సద్గురు శ్రీ కందుకూరు శివానంద మూర్తి గారికి అంకిత మిచ్చాను. వారు ఎంతో అనుగ్రహంతో ఆ CD పూర్తి రచన చదివి శివరాత్రి నాడు తమ అనుగ్రహభాషణంలో ఇది ప్రపంచానికి ఎంతో ఉపయోగపడుతుందని నన్ను ఆశీర్వదించారు. ఇది నాకు సాక్షాత్తు పరమేశ్వరానుగ్రహం.
శ్రీ పి.వి.ఆర్.కె ప్రసాద్ గారికి నా రెండవ C.D మరణానంతర స్థితి అంకితమిచ్చాను. వారి ఆశీర్వచనం స్వయంగా శ్రీ వెంకటేశ్వర ప్రసాదమే. ఈ విధంగా ఓకేసారి హరిహరుల కరుణ నా పై కురిసింది. శ్రీ పి.వి.ఆర్.కె. వ్యక్తిగతంగా ఆత్మీయంగా సాహితీ పరంగా ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా నాపై ప్రేమామృతం కురిపించారు.
♦ సాహిత్యానికి, సాంసృతిక అంశాలకూ, ఆధ్యాత్మిక సమావేశాలకు మీరు చాలా సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఉంటుంది. మీరు ఏ ప్రక్రియల్లో రచనలు చేశారు?
♣ నా సాహిత్య రచనలు ఆకాశవాణి ~ మీడియా పత్రికా రంగంగా విడిగాను, ఆధ్యాత్మిక రంగాన్ని విడిగాను విభజించుకోవాలి.
I. నేనూ, ఆకాశవాణి:
నేను బాల్యంలో ఆదివారం బాలానందం కార్యక్రమాల కోసం మొదటి సారిగా రేడియో అన్నయ్యగారు శ్రీ న్యాయపతి రాఘవరావు గారి వెంట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మెట్లెక్కి లోపలికి వెళ్ళాను. అలా ప్రారంభమైన ఆకాశవాణితో అనుబంధం గత 55 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.
1978 చిన్న చిన్న నాటకాల్లో యువవాణి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడిని. 1978 నుండి 83 దాకా casual Announcer గా పని చేసాను. శ్రీ మధుసూదన్ రావు గారు, శ్రీ భీమయ్య, వేదవతి గార్లు ఎంతో ప్రోత్సహించారు M.Phil చేస్తున్న రోజుల్లో నాటికలు వ్రాస్తూ, ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను. ఆకాశవాణి తరపున నగరం లోని కొన్ని సభా కార్యక్రమాలని O.B.చేసాను.
1983లో వరంగల్లు వచ్చాక ఇక్కడ ఆకాశవాణిలో ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాను. నేను అన్నమయ్య పై పరిశోధన చేస్తున్నప్పుడు చాలా విలక్షణమైన కార్యక్రమాలు చేసాను.. 1990లో నాకు Ph.D. వచ్చింది. అప్పట్లో శ్రీ మధుసూదన్ రావ్ గారు వరంగల్ ఆకాశవాణి STATION DIRECTOR గా వచ్చారు. నేను హైదరాబాదులో C.Announcer గా ఉండగా ఆయన PROGRAMME EXECUTIVE.
నేను అన్నమయ్య గురించి వారి వద్ద ప్రస్తావించగానే “నువ్వు అర్జెంటుగా అన్నమయ్య మీద ఓ అరగంట నాటిక వ్రాసి ఇవ్వు, ఇంత వరకు అన్నమయ్యపై ఆకాశవాణిలో నాటకం రాలేదు” అన్నారు. నేను కొంచెం ఆలోచిస్తూ “నేను నాటక ప్రక్రియ ఇంకా రాయలేదు” అన్నాను. “ఇప్పుడు వ్రాయి. Ph.D చేసావుగా!” అన్నారు..
“బావుంది ఇంత లావున్నావు తేలు మంత్రం రాదా అన్నట్లు ఉందిసర్” అన్నా… “నేను Contract. రాసేస్తున్న.. నువ్వు వ్రాయగలవు.. వ్రాస్తావు…” అన్నారు ఆయన. ఆ ముహూర్త బలం చాలా గట్టిది కాబోలు.
ఆ మరునాడే మొదలు పెట్టి మొదటి నాటిక వ్రాసేసాను. వరంగల్లులో సుప్రసిద్ధ కళాకారుడు REC PROF. శ్రీ టి.కె.వి.అయ్యంగార్ అన్నమయ్యగా నటించారు. నేను రజనీకర స్వామి అనే ప్రతినాయక పాత్ర వేసాను. ఆ తరువాత ఎన్నో రేడియో నాటకాలు రంగస్థల శ్రవ్య దృశ్య నాటికలు నాటకాలు వ్రాసాను.. శ్రీ చలపతి రావు గారు, శ్రీమతి శకుంతల, శ్రీ దక్షిణామూర్తి గారు ఎంత గానో ప్రోత్సహించారు.
ఆ తరువాత కొన్నాళ్లకు శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ స్టేషన్ డైరెక్టర్‍గా వచ్చారు. శ్రీ రాంబాబు గారు పోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. ఎన్నో రసవత్తర విలక్షణ కార్యక్రమాలు రచించాను. 1995 లో శ్రీ రాంబాబు గారి నిర్వహణలో మనసున మల్లెల మాల లూగేనే, సుప్రసిద్ధ సినీ రచయితల గీతాలతో ఒక కార్యక్రమం, శ్రీ శ్రీ జయంతి సందర్భంగా ఆయన గీతాలతో నా వ్యాఖ్యానంతో ఒక కార్యక్రమం చేసాను.
ఆ రోజుల్లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ క్విజ్ కార్యక్రమాన్ని అమితాబ్ నిర్వహిస్తుండేవారు. శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి ప్రోత్సాహంతో శ్రీ రాంబాబు గారి నిర్వహణలో ఒక విలక్షణ క్విజ్‌ని నేను క్విజ్ మాస్టర్‌గా రూపొందించాను. ఆ క్విజ్ 1995 లో మా ఆంధ్ర విద్యాభి వర్ధనీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు ఆచార్య శ్రీ చందా కాంతయ్య శ్రేష్టి గారి శత జయంతి ఉత్సవాలు నిర్వహించబడినాయి. దీనిలో ఒక భాగంగా నేను ఆకాశవాణి ఆచార్య చందా కాంతయ్య భారతీయ సంస్కృతి క్విజ్ పోటీని క్విజ్ మాస్టర్‌గా హై స్కూల్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల విభాగాలకు INTER COLLEGIATE QUIZ గా నిర్వహించాను… విద్యార్థుల కి 3 life line లు కౌన్ బనేగా కరోడ్ పతి పద్ధతి లోనే ఉంటాయి.. వారు కోరుకున్నవారికి కాల్ చేసి ప్రశ్నకు సమాధానం తెలుసుకునే అవకాశం కల్పించాము. ఇది నగరంలో సంచలనం సృష్టించింది.. అందరి ప్రసంశలను పొందింది.
శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు. నేను ఆయన సహకారంతో శ్రీమతి సరోజ నిర్మల గారి నిర్వహణలో అన్నమాచార్యుల సంకీర్తనలతో కూర్చి నేను వ్రాసిన సంగీత రూపకాలను రూపొందించడం జరిగింది. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీ కరి కూర్మనాథం గారు అప్పటికి ఎవ్వరు స్వర పరచని అన్నమాచార్యుల సంకీర్తనలని స్వర పరిచారు.
తెలుగు సాహిత్యంలో నా విమర్శనాత్మక ప్రసంగ వ్యాసాలు ఎన్నోఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యాయి. శ్రీమతి వై. ఉషారాణి గారు ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్‌గా ఉన్నపుడు ఆవిడ ప్రత్యేకించి నాకు హాస్యంపై ఉన్న ఆసక్తి చూసి, ఆకాశవాణిలో 13 వారాలు తెలుగు సాహిత్యంలో హాస్యం గురించి నా ఉపన్యాసాలు ప్రసారం చేశారు. ఇటీవల శ్రీ అనిల్ ప్రసాద్ గారు ఈ వారం ప్రత్యేక అతిథిగా నన్ను పరిచయం చేసారు.
మద్రాస్ ఆకాశవాణి నుండి కూడా ఎన్నో కార్యక్రమాలు అందించాను. శ్రీమతి పద్మజ నిర్మల గారు PROGRAMME EXECUTIVE ప్రత్యేకంగా అన్నమయ్యపై ఎన్నో కార్యక్రమాలు నాతో రచింప చేశారు. మొదటి సారిగా మొత్తం తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర ఆధారంగా నేను వ్రాసిన ‘సంకీర్తనామృతం’ నాటకం మద్రాస్ ఆకాశవాణి కేంద్రం ప్రసారం చేసింది. ఇది ప్రత్యేక త్రైమాసిక నాటకంగా ప్రసారం అయింది. అన్నమయ్య జయంతి సందర్భంగా నేను వ్రాసిన ‘సింహ దర్శనం’ అనే సంగీత నాటకాన్ని 8 సంగీత వాయిద్యాలతో శ్రీ మతి పద్మజ నిర్మల సమర్పించారు.
ఘంటసాల జయంతికి పద్మజ గారు నన్ను ఒక పరిశోధకుడిగా ఘంటసాలపై ఒక ప్రత్యేక జనరంజని కార్యక్రమాన్ని సమర్పించమని అడిగారు. చాలా ఆనందంగా నేను ‘స్వరంలో అభినయాత్మకత’ అనే శీర్షికన నిర్వహించాను. ఎందరో రసజ్ఞులు ఈ కార్యక్రమాన్ని విని ఆనందించి అభినందించారు. ప్రధానంగా శ్రీ బాపు గారు ఈ కార్యక్రమాన్ని విని నాకు వరంగల్‌కి ఫోన్ చేసి అభినందించారు. ఈ సంఘటన నా జీవితంలో ఒక మలుపు. శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ రచించిన రాధా గోపాలం కథలను వారి అనుమతితో నేను ఒక గంట నాటకంగా వ్రాసాను. ఆకాశవాణి మద్రాస్ కేంద్రం శ్రీమతి పద్మజ నిర్మల నిర్వహణలో ప్రసారం చేసింది. రెండేళ్ల క్రితం పూరీ జగన్నాథుడిపై నేను రచించిన జగన్నాటకం అనే గంట నాటకాన్ని శ్రీ రాంబాబు గారు, శ్రీ సుధాకర రావు గారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం చేశారు.
(సశేషం)