Site icon Sanchika

సంభాషణం: తెలుగు మహిళా శాస్త్రవేత్త డాక్టర్ పావని చెరుకుపల్లి అంతరంగ ఆవిష్కరణ

[box type=’note’ fontsize=’16’] కెనడా లోని భారత సంతతికి చెందిన అందులోను హైదరాబాద్‌కు చెందిన తెలుగు మహిళా శాస్త్రవేత్త డాక్టర్ పావని చెరుకుపల్లి గారితో సాధన గారు జరిపిన ముఖాముఖిని సంచిక పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]1[/dropcap]800ల నుంచి కలుషితాలు శుభ్రం చేయడానికి స్పాంజ్ వాడటం జరుగుతోంది. మనలో చాలా మందికి స్పాంజ్ అంటే వంటింటి గట్టు జిడ్డు శుభ్రం చేసే పరికరం, సోఫాలో ఉండే స్టఫ్. ఇదే స్పాంజ్‌ను నీటి నుంచి చమురు కలుషితాలు, బాక్టీరియా వేరు చేయడానికి ఉపయోగించొచ్చు అంటే మీరు నమ్ముతారా. నమ్మాల్సిందే, ఈ పరిశోధన కెనడా లోని టొరంటో యూనివర్సిటీలో జరిగింది.

ఈ పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరో కాదు, భారత సంతతికి చెందిన అందులోను హైదరాబాద్‌కు చెందిన తెలుగు మహిళా శాస్త్రవేత్త డాక్టర్ పావని చెరుకుపల్లి.

డాక్టర్ పావని ఒక యువ మహిళా శాస్త్రవేత్త, ప్రొఫెసర్ మరియు బుక్స్ రైటర్. కెనడా, అమెరికా, లండన్ దేశాలలో అనేక అవార్డులు పొందారు.

డాక్టర్ పావని గారి పరిశోధనల గురించి వ్యాసాలు విదేశీ పత్రికలలో ప్రచురితమైనప్పుడు, హైదరాబాద్ లోని మూసి నది గురించి ప్రస్తావించడం జరిగింది. లండన్‌లో జరిగిన మోడరన్ ఆర్ట్స్ అండ్ మెకానికల్ సైన్స్ ప్రదర్శనలో మూసి నది చిత్రాలు ప్రదర్శించడం జరిగింది. వీరి పరిశోధనకు మన మూసీ నదికి సంబంధమేమిటో తెలుసుకోవాలనుందా… ఎందుకాలస్యం చదవండి మరి.

తల్లి తండ్రులు విద్యాభ్యాసం 

తల్లి తండ్రులు శ్రీమతి దమయంతి, శ్రీ చెరుకుపల్లి కృష్ణ గార్లు, స్వస్థలం హైదరాబాద్. కులీ కుతుబ్ షా పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా, శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు.

కెనడా లోని టొరంటో యూనివర్సిటీలో మెకానికల్ విభాగంలో మాస్టర్స్ మరియు డాక్టరేట్ పట్టభద్రులు. ప్రస్తుతం ఇంపీరియల్ కాలేజీ లండన్‌లో పోస్ట్ డాక్టరేట్ పరిశోధన చేస్తున్నారు.

డిప్లొమా నుండే

చిన్నప్పటి నుంచి సబ్జెక్టుని పూర్తి అవగాహనతో ఇష్టంగా చదువుతాను. సిలబస్‌ను అనుసరించి కాకుండా సబ్జెక్టు మూలాల నుంచి చదివి తెలుసుకోవడం అలవాటు.

డిప్లొమాలో నాకొచ్చే సందేహాలు నేను చదివే విధానం ప్రాజెక్ట్‌లు చేసే పద్దతి చూసి, అప్పటి మా ప్రొఫెసర్ ప్రస్తుత మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సుబ్బారావు గారు “నువ్వు గొప్ప ఆవిష్కరణలు చేస్తావు, అది ప్రపంచాన్ని మార్చేస్తుంది” అనేవారు. అలా డిప్లొమా నుండే నన్ను కాబోయే సైంటిస్ట్‌గా చూసేవారు.

ఉద్యోగం అడిగితే

టొరంటో యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్‌తో పాటు చదువుకున్నాను. టీచింగ్ అంటే ఉన్న ఇష్టం వల్ల మాస్టర్స్ అవుతూ ఉండగా యూనివర్సిటీ లోనే ఫుల్ టైం ప్రొఫెసర్ ఉద్యోగం కోసం మా ప్రొఫెసర్‌ని సంప్రదిస్తే, నువ్వు చేయాల్సింది ఉద్యోగం కాదు పరిశోధన, పిహెచ్‌డి చేస్తే స్టైఫండ్ వస్తుంది అదే నీ జీతం అనుకో అన్నారు. నీ లాంటి తెలివితేటలు, కష్టపడే గుణం అనితర సాధ్యం దానిని వృథా చేయొద్దు, సమాజం కోసం ఆవిష్కరణలు చేయమంటూ ప్రోత్సహించారు. ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, అదే పరిశోధన చేస్తే మనం కనుగొనే ఆవిష్కరణలు సమాజానికి ఉపయోగపడతాయి. అందుకే ఫుల్ టైం ఉద్యోగం కాకుండా పిహెచ్‌డి ఎంచుకున్నాను.

చారిత్రాత్మక మూసీ నది – ప్రేరణ

డిప్లొమా చేసేటప్పుడు మా కాలేజీ బస్సు మూసి నది మీదుగా వెళ్ళేది, మూసి నదిలో చాలా కలుషితాలుండేవి. చారిత్రాత్మక మూసీ నది అలాంటి దురవస్థలో ఉండడం చాలా బాధనిపించేది. అప్పుడే నీరు ఈ విధంగా వృథా అవకుండా నేనేమైనా చేయాలి అనుకున్నా.

పిహెచ్‌డిలో పరిశోధన అంశం ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, నాకు మూసీ నది గుర్తుకు వచ్చింది. నేనెంచుకున్న అంశం “కలుషిత నీటి శుద్ధి”.

స్పాంజ్ టెక్నాలజీ

కెనడా లోని ఆల్బర్టా ఆయిల్ స్పిల్స్ విడుదల చేసిన కలుషితాలు అక్కడి నీటి మడులలో కలుస్తాయి. అలాంటి నీటిని త్రాగడం వల్ల పశువులు, పక్షులు చనిపోతున్నాయి. దీనిని నివారిస్తే అమాయకపు పక్షులు, జంతువులను కాపాడడంతో పాటు, పర్యావరణాన్ని కాపాడొచ్చు.

సిద్ధాంతపరంగా నీరు మరియు నూనెలు కలవవు. కానీ వాస్తవానికి నీటిని నూనె వ్యర్థాలను వేరు చేయడం దాదాపు అసాధ్యం. అలా వేరు చేయాలంటే ఒక వాహకం కావాలి. అలా వాహకంగా స్పాంజ్‌ను ఎంచుకున్నాను. సాధారణంగా వంట గదిలో జిడ్డు లేదా మరకలు తొలగించడానికి మనం స్పాంజ్‌ను ఉపయోగిస్తాము. ఎందుకంటే దీనికి కలుషితాలను పీల్చుకొనే గుణం ఉంటుంది. నేను అభివృద్ధి చేసిన స్పాంజ్ నూనె కలుషితాలను పీల్చుకొని నీటిని వదిలేస్తుంది.

దశల వారీగా ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత తేలికైన, రీఛార్జబుల్, రీయూసబుల్ హైబ్రిడ్ స్పాంజ్‌ను అభివృద్ధి చేసాను. ఈ స్పాంజ్ నూనె కలుషితాలను 98% వరకు శుద్ధి చేసి నీటిని రిలీజ్ చేస్తుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువ.

అడ్వాన్సుడ్ స్పాంజ్ టెక్నాలజీ

పిహెచ్‌డి పరిశోధనలో నేను అభివృద్ధి చేసిన స్పాంజ్ నీటి నుండి 98% కలుషితాలను శుద్ధి చేస్తుంది. ప్రస్తుతం పోస్ట్ డాక్టరేట్ పరిశోధనలో భాగంగా కలుషితాలతో పాటు బాక్టీరియాను నిర్ములించే విధంగా అలాగే మరింత తక్కువ సమయంలో నీటి శుద్ధి అయ్యే విధంగా స్పాంజ్ టెక్నాలజీ రూపకల్పన చేస్తున్నాను. ఈ పరిశోధన ఇంపీరియల్ కాలేజీ లండన్‌లో చేస్తున్నాను.

స్పాంజ్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి అయిన తర్వాత భారత దేశం లోని మూసీ, గంగ వంటి నదుల నీటి శుద్ధికి ఈ సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు.

యూనివర్సిటీ ఆఫ్ టొరంటో లో బెస్ట్ ప్రెజెంటర్ అవార్డు

మోడరన్ ఆర్ట్స్ పెయింటింగ్ ప్రదర్శన

ఇంపీరియల్ కాలేజీ లండన్‌లో నేను ఆవిష్కరించిన స్పాంజ్ టెక్నాలజీని మోడరన్ ఆర్ట్స్ పెయింటింగ్‌తో మిళితం చేసి పెయింటింగ్స్ రూపంలో ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనకు చాలా స్పందన వచ్చింది. ఇలా ఆవిష్కరణలను పెయింటింగ్స్‌గా ప్రదర్శించడం ఇదే మొదటి సారి. ఈ ప్రదర్శనలో మెకానికల్ ఆవిష్కరణను ఆర్టిస్టిక్‌గా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో విదేశీ చిత్రకారులు, నా పరిశోధన వివరాలతో పాటు, నాకు ప్రేరణ ఇచ్చిన మూసి నదిని కూడా చిత్రించారు.

టొరంటో యూనివర్సిటీలో డాక్టర్ పావని

అవార్డులు

ఇప్పటివరకు చాలా అవార్డులు వచ్చాయి.

కోవిడ్ ఎఫెక్ట్

పరిశోధన నిరంతరాయంగా పని చేయాల్సిన ఆవశ్యక రంగం. మేమంతా మాస్క్ మరియు సాంఘిక దూరం పాటిస్తున్నాము. పుస్తకాలూ రాయడం, పేపర్ పబ్లిషింగ్ జరుగుతోంది. కానీ, ప్రతి సంవత్సరం లాగా, దేశ విదేశాలలో జరిగే శాస్త్రవేత్తల సమావేశాలు, సెమినార్లు జరగడం లేదు. ఈ సంవత్సరం భారతదేశంలో కూడా పని చేయాలని అనుకున్నాను. కోవిడ్ నేపథ్యంలో ప్రయాణాలు చేయలేము కాబట్టి, ఇలాంటి పనులు కొన్ని వాయిదా పడ్డాయి.

వరల్డ్ ట్రేడ్ సెంటర్, అమెరికాలో అవార్డు పొందిన సందర్భంగా పెప్సీ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ తో

సాధించాల్సినవి

నీరు, ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణకు తక్కువ ఖర్చు తో ఎక్కువ ప్రయోజనం చేకూరే విధంగా మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలి. మరిన్ని పుస్తకాలు రాయాలి. పర్యావరణాన్ని కాపాడడంలో నా వంతు కృషి నేను చేస్తాను.

డాక్టర్ పావని గారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మరిన్ని ఆవిష్కరణలు చేసి మన దేశానికి మరింత పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

మీ

సాధన

Exit mobile version