44. సంభాషణం – కవి, విమర్శకులు, నాటకకర్త డా. పెద్ది వెంకటయ్య అంతరంగ ఆవిష్కరణ

0
2

[సంచిక కోసం కవి, విమర్శకులు, నాటకకర్త డా. పెద్ది వెంకటయ్య గౌడ్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

డా. పెద్ది వెంకటయ్య:

డా. పెద్ది వెంకటయ్య గారి జన్మస్థానం కడవెండి గ్రామం. ఇది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజవాపన చేసిన వీరభూమి. దొడ్డి కొమురయ్య నేలకొరిగి అమరుడైన పుణ్యభూమి. ఇంకా ఎందరో వీర యోధులు ఆ గ్రామంలో ఉద్భవించి నేటికి సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆ మట్టికున్న పరిమళం వెంకటయ్యలోనూ గుబాళిస్తుంది. ఉద్యోగరీత్యా, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇరవై ఎనిమిది జాతీయ సదస్సులలో పత్ర సమర్పణ చేశారు. ఎనబై వరకు వివిధ పత్రికలలో వ్యాసాలు ప్రచురింపబడినవి. నిరంతరం సాహిత్య సాధన చేస్తున్నారు. ఆయన తన గురించి ఇంకేం చెబుదారో చూద్దాం.

~

* డా. పెద్ది వెంకటయ్య గారికి ‘సంచిక’ అంతర్జాల మాసపత్రిక పక్షానస్వాగతం. నమస్తే సర్!

జ: నమస్కారమండీ.

1. డా. పెద్ది వెంకటయ్య గారు, మీరు తెలుగు సాహిత్యం వైపు మొగ్గు చూపడానికి గల ప్రధాన కారణం ఏమిటి? అది మీ రచనా వ్యాసంగానికి ఏ విధంగా దోహదపడినది?

జ: నేను జన్మించినది జనగామ జిల్లా కడవెండి గ్రామం. మా ఊరికి చరిత్ర పుటలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆధిపత్య వ్యవస్థను అంతం చేసి ఆ విప్లవానికి దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం ప్రశ్నించే గొంతు అయ్యింది. నేను చిన్నప్పుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్బంగా “అమరజీవివి నీవు కొమురయ్య అందుకో జోహార్లు కొమురయ్య” అనే నివాళి పాట పాడి నాటి పౌరుషాన్ని చాటేవాణ్ణి. మా ఊళ్ళో జననాట్య మండలి పాటలు ప్రతీ హృదయాన్ని కదిలించి వేసేవి. మా భూమి, నేటి న్యాయం నాటకాలు, యక్ష గానాలు ప్రదర్శించేవారు. మా ఊరికి సమీప గ్రామం అయిన దేవరుప్పులలో ‘మిత్ర మండలి సంస్థ’ ఆధ్వర్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. నేను 8, 9వ తరగతి చదివే రోజుల్లో బుర్ర కథలు, నాటికలు, విచిత్ర వేషధారణలు, పాటల పోటీలలో పాల్గొని బహుమతులు పొంధినాను. ఇంటర్, డిగ్రీ చదివే రోజులలో ‘పతనం దిక్కు పరుగు’ నాటికను ప్రదర్శించి ఉత్తమ నటునిగా ఎంపికయ్యాను. పాఠశాలలో ధర్మారావు, ఇంటర్‌లో బాస్యం శ్రీనివాసాచార్య, డిగ్రీలో చిట్టిమల్లె శంకరయ్య, యం.ఏ.లో పేర్వారం జగన్నాథం, లింగంపల్లి రామచంద్ర, బన్న ఐలయ్య, పి. జ్యోతి గార్ల ప్రోత్సాహం మరువలేనిది. వృత్తిరీత్యా ఉపన్యాసకునిగా మడికొండలో ఉండడం వల్ల సాహిత్యంపై మక్కువ కలిగింది. ఈ మట్టి లోనే కాళోజీ సోదరులు, వానమమలై సోదరులు, పల్లా దుర్గయ్య, మోత్కూరి మధుసూదన రావు, అనుమల కృష్ణమూర్తి గార్లు రచించిన కావ్యాలు చదవడం వల్ల నాలో సాహిత్య సృజన జరిగి, నేను కూడా రచనా వ్యాసంగానికి పూనుకున్నాను. విశ్వభారతి సంస్థ ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలు జరిగేవి. ప్రసిద్ద రచయితల ప్రసంగాల ద్వారా నేనెంతో ప్రేరణ పొందాను.

డా.పెద్ది వెంకటయ్య గారి తల్లిదండ్రులు

2. మీరు కవిత్వం రాశారు, వ్యాసాలు రాశారు, నాటికలు రాశారు. ఈ మూడింటిలో మీరు బాగా ఇష్టపడే సాహిత్య ప్రక్రియ ఏది? ఎందుచేత?

జ: నేను కవిత్వం, వ్యాసాలు, నాటికలు రాశాను. నేను కవిత్వాన్నే బాగా ఇష్టపడుతాను. ఛందోరహితమైన వచనములో భావ లయ ప్రదానంగా పలికేది కవిత్వం కదా, కవిత్వం అంటే భావవీచిక కాదు. వాస్తవ అంశాలను తాత్విక కొలిమిలో ఆయుధంగా ఆవిర్భవించి సమాజాన్ని, మనిషిని యుద్ధం వైపు నడిపించేదే కవిత్వం. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిత్యం అనుశీలన చేస్తూ ప్రతిస్పందిస్తుటాను. నాకు కనిపించే అన్యాయం, అణిచివేత, హింస, క్రూరత్వం, ఆకలి, పీడన, దోపిడి, నిరుద్యోగం లాంటి సమస్యలుంటాయి. నాలో సంవేదన ఉంటుంది. అనుభూతి, ఉద్వేగం, ప్రశ్నించే తత్వం, ప్రతిఘటించే స్వభావం ఉంటుంది. అంతే కాకుండా నాలో భావోద్వేగాలను ప్రకటించే బలమైన ఒక అభివ్యక్తి ఉంటుంది. ఉదాహరణకు –

వాళ్ళు మట్టిని ముద్దాడిన వాళ్ళు
పండించిన పంటకు గిట్టుబాటు ధర అందక
కన్నీరు మున్నీరుగా విలపించిన వాళ్ళు
వాళ్ళు ప్రశ్నలు ఎక్కుపెడితే తూటాలతో సమాధానమా?
ఆలోచన పొద్దుపొడుపుకు ఆనకట్టలా?
వాళ్ళు చిందించిన రక్తంలో కోట్ల నక్షత్రాలు పుడతాయి.

అంటూ శ్రమ చేసిన, బ్రతకలేక పోతున్న వాళ్ళ పక్షాన నిలబడి నా కవిత అస్త్రాలను సందిస్తున్నాను.

3. తెలుగు సాహిత్యానికి సంబందించి తెలుగు ప్రత్యేక అంశంగా చదువుకున్న వారికంటే ఇతరులు రచయితలుగా ఎక్కువ కృషి చేస్తున్నారని కొందరు అంటుంటారు, దీనిపై మీ స్పందన ఏమిటి? వివరంగా చెప్పండి.

జ: చాలా మంచి ప్రశ్న వేశారు సర్, సాహిత్యానికి మన చుట్టూ ఉన్న సమాజానికి అవినాభావ సంబందం ఉంటుంది. సమాజములో నుంచే సాహిత్య సృజన పుడుతుంది. సాహిత్య సృష్టి చేసేవారు కూడా సమాజములోని ఒక వ్యక్తియే కదా! తెలుగును ప్రత్యేక అంశంగా చదువుకున్నవారు సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కృషి చేస్తున్నారు. ఇతర రచయితలు కూడా సాహిత్యంపైన ఎంతో పట్టు ఉండడం వల్ల వివిధ సాహిత్య ప్రక్రియలపై విస్తృతమైన కృషి చేస్తున్నారు. శ్రీశ్రీ జంతు శాస్త్రంలో డిమాన్‌స్ట్రేటర్‌గా పని చేశాడు. ఆయన పద్య కవిగా, భావ కవిగా, అభ్యుదయ, విప్లవ కవిగా, యుగకర్తగా నిలిచారు. అలాగే అంపశయ్య నవీన్ చదివింది ఎకనమిక్స్, ఆయన నవల, కథా సాహిత్యంలో ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించాడు. ఇంకా ఎందరో రచయితలు తెలుగును ప్రత్యేక అంశంగా చదువుకున్న వారికంటే, ఇతర రచయితల కృషి అనిర్వచనీయమైనది.

4. మీ రచనా వ్యాసంగం ఎప్పుడు మొదలు అయ్యింది? ఏ పత్రికలో మీ రచన మొదట వచ్చింది? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు?

జ: నా రచనా వ్యాసంగం 1991 సంవత్సరంలో ప్రారంభం అయ్యింది. నా రచన ‘జనధర్మ’ సాహిత్య పత్రికలో వచ్చింది. ఆ పత్రిక సంపాదకులు MS ఆచార్య. ‘జనధర్మ’ పత్రికలో వచ్చిందంటే ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాను. ఆ పత్రికలో వచ్చిన వ్యాసం ‘పేర్వారం జగన్నాథం సాగర సంగీతం’ పైన. ఆ వ్యాసంతో నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. అది ప్రేరణ కలిగించింది, అది పరిశోదనా వ్యాసాలకు దారి చూపింది.

సి.నా.రె.. గోపి.. గార్లతో డా.పెద్ది వెంకటయ్య

5. ఇప్పటి విద్యార్దులు PG స్థాయి వరకు తెలుగు చదవడానికి ఏ ఉద్దేశంతో ముందుకు వస్తున్నారని మీరు భావిస్తున్నారు? మీ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వివరించండి?

జ: ఇప్పటి విధ్యార్ధులు PG స్థాయి వరకు తెలుగు చదవడానికి తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యత సంపాదించడానికి ఒక కారణమైతే, ఉద్యోగం సంపాదించడానికి రెండో కారణం అని చెప్పవచ్చు. ప్రతి మనిషికి ఆర్థిక పునాది ఎంతో అవసరం. ఆర్థికంగా మనిషి నిలదొక్కుకోవాలంటే చదువు యొక్క ప్రాదాన్యం ఎంతో అని చెప్పవచ్చు. “Intellectuals are head of the society” అన్న షేక్‌స్పియర్ మాటను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాను.

ప్రొ.జయధీర్ తిరుమలరావు గారితో డా.పెద్ది వెంకటయ్య

6. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగు సాహిత్య రంగంలో మీరు గమనించిన మార్పులు ఏమిటి? వివరణాత్మకంగా చెప్పండి.

జ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగు సాహిత్య రంగంలో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇవ్వాళ మనం సమస్త రంగాలలో పునరుజ్జీవన ప్రయత్నాల్లో ఉన్నాం. స్వపరిపాలనలో ముందుకు పోతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తుంది. తెలంగాణ భాష, సాహిత్యం, సాంస్కృతిక వైభవాన్ని చాటుతుంది. తెలంగాణ ఆత్మను పట్టి చూపే సరికొత్త పాఠ్యపుస్తకాలను రూపొందిస్తుంది. పాఠ్యపుస్తకాలలో సంప్రధాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, కథానిక, వ్యాసం వంటి ప్రక్రియలకు చోటు లభించింది. విస్మృతికి గురయిన కవులకు, రచయితలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వైభవాన్ని, వీరుల గొప్పతనాన్ని, స్థానిక చరిత్రల, సాంస్కృతిక విశేషాల్ని, మానవీయ బంధాల్ని, దళితుల అభ్యున్నతికి పాటుపడే తపన మొదలయిన అంశాలు చోటు చేసుకున్నాయి.

శ్రీ కాళోజీ నారాయణరావు గారితో డా.పెద్ది వెంకటయ్య

7. ఈ మద్య కాలంలో సాహిత్య కార్యక్రమాలలో ఎక్కడ చూసిన మధ్య వయసు వారు, వృద్దులు మాత్రమే అధికంగా కనిపిస్తున్నారు. యువతను ఆకర్షించడానికి ఏమి చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?

జ: ఈనాటి యువతలో డాలర్ సంస్కృతి బాగా పెరిగింది. నేడు ప్రపంచీకరణ వల్ల TVలో అనేక విదేశీ ఛానల్స్ ప్రసారాలు వస్తున్నాయి. ఈ విదేశీ ఛానల్స్‌లో శృంగారం మితిమీరి చూపిస్తున్నారు. వీటిని చూసిన యువతీ, యువకులు మన సంస్కృతిని విస్మరిస్తున్నారు. ఈనాటి యువతలో ఆత్మవిశ్వాసం పెరిగి మన దేశ ఔన్నత్యాన్ని గుర్తించాలి. ‘లే.. యువత మేలుకో!’ అంటూ యువతను మేల్కొలిపిన వివేకానందుని గురించి తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి తనలో ఉన్న శక్తిని తెలుసుకొని దానికి తగినట్లుగా కృషి చేయాలి. దీక్షతో, ప్రతిభతో, పట్టుదలతో మనం అనుకున్నది సాధిoచాలి. “చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం ఒక సామాజిక నేరం” అంటాడు అబ్దుల్ కలాం. కలలు కనండి, వాటిని సాకారం చేయండి అంటాడు. సాహిత్యం మనసులను కలపడానికే ప్రాధాన్యం ఇస్తుంది. ఒక అక్షరం ఇంకో అక్షరంతో కలిసి పదం అవుతుంది. పదాలు కలిసి వాక్యాలు అవుతాయి, వాక్యాలు కలిసి కావ్యం అవుతుంది. ఈ విధంగా కలపడం అనే పని కల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వలన మానవ సంబంధాలు మెరుగుపడుతాయి. ప్రపంచ మానవాళి సోదరుల వలె మెలిగి పరస్పర ద్వేషాలు మానుకొని, ప్రేమ భావాలని పెంచుకొని యువత ఈ దిశగా ఆకర్షించడానికి పూనుకోవాలి.

తెలంగాణా రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం-2015 డాక్టర్ . పెద్ది వెంకటయ్య కు ప్రొఫెసర్ కడారు వీరా రెడ్డి , ఉపకులపతి S.U ప్రదానం చేశారు బాసరలో ..

8. మీరు రచించిన గ్రంధాల గురించి వివరించండి.

జ: నేను రచించిన గ్రంధాలు..1) వరంగల్ జిల్లా తెలుగు నాటక సాహిత్యం 2) భిషగ్వీజయ నాటకం ప్రయోగ వైశిష్ట్యం 3) మట్టి పరిమళం 4) విశ్వవీణ 5) మట్టి చిత్రాలు 6) సాహితీనిధి 7) దృక్కోణం 8) ఛైతన్యరథం 8) అంబేద్కర్ మళ్ళీ పుట్టాడు 9) చెమట బిందువులు 10) శిశిరములో వసంతం మొదలైనవి.

9. వరంగల్ సాహితీ క్షేత్రంలో మీ పాత్ర ఏమిటి? వరంగల్, హన్మకొండ పట్టణాలలో సాహితీ సంస్థలు చేస్తున్న కృషిని వివరించండి.

జ: నేను యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. ప్రవృత్తి రీత్యా కవిగా, రచయితగా, విమర్శకునిగా, నాటకకర్తగా, నటునిగా ప్రయోక్తగా పల్లె మూలాలను మరిచిపోలేని మట్టిమనిషిని. ‘స్పందన కళానికేతన్’ సంస్థను మడికొండలో 1995లో స్థాపించి అద్యక్షునిగా ఉన్నాను. ఇంకా తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శిగా, విశ్వభారతి సంస్థ ఉపాద్యక్షునిగా ఉన్నాను. 28 జాతీయ సదస్సులను, వివిద పత్రికలలో 80 వ్యాసాలు ప్రచురించబడినాయి. కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యలో MA విద్యార్దులకు ప్రాచీన, ఆధునిక, నాటక, జానపద సాహిత్య పాఠ్యాంశాలను రచించాను. ఫూలే, అంబేద్కర్ ఆలోచనలతో బహుజనుల గొంతును బలంగా వినిపిస్తున్నాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమయేందుకు ఎన్నో ఉద్యమ గీతాలను రాసి జన చైతన్యం చేశాను. కోవిడ్ దండయాత్ర చేసినప్పుడు, మద్యపాన నిషేదంపై ఎన్నో పాటలను రచించాను. నాలో ఆగ్రహం, తాత్వికత, తన్మయత్వం, మానవీయ స్పర్శ ఉన్నాయి. వరంగల్, హన్మకొండ పట్టణాలలో గత, వర్తమాన సాహిత్య, సాంస్కృతిక కళా నైపుణ్యాలను, సంపదను వారసత్వంగా భవిష్యత్ తరాలకు అందించేవే సాహితీ సంస్థలు. అందులో సాహితీ బంధుబృందం, సాహితీ మిత్ర మండలి, శ్రీలేఖ సాహితీ, సారస్వత మిత్ర మండలి, సాహితీ సమితి, పోతన విజ్ఞానపీఠం, విశ్వనాథ భారతి, సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ, సృజన లోకం, చెలిమి, విశ్వభారతి, స్పందన కళానికేతన్ సంస్థలు మొదలైనవి. సహృదయ సంస్థను డా. KLV ప్రసాద్, గిరిజామనోహర్ బాబు 1996లో స్థాపించి 25 వసంతాలలో 115 విభిన్న విలక్షణ కార్యక్రమాలను నిర్వహించినారు. కవులను, రచయితలను ప్రోత్సహించారు. రామాయణ, భారత, భాగవత, ఉపనిషత్తులపై ఉపన్యాసాలను, సాహితీ ప్రక్రియలలో విశేష కృషి చేసిన రచయితలకు సాహిత్య పురస్కారాలను అంధించినారు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను సహృదయ సంస్థ చేపట్టి ముందుకు పోతున్నది, ఇంకా అనేక సంస్థలు కూడా సాహిత్య సంపదను కాపాడుతున్నాయి.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా డా. పెద్ది వెంకటయ్యకు దేవసేనా కలెక్టర్, నాటి ఎమ్.ఎల్.ఏ టి. రాజయ్య సన్మానం చేస్తున్నారు ఖిలాషాపురంలో

10. ఒక ప్రాంతపు యాసను/ మాండలికాన్ని సాహిత్యములో చొప్పించడము ఎంతవరకు సమంజసము? అలాంటి సాహిత్యాన్ని ఇతర ప్రాంతపు పాఠకలోకం హర్షిస్తుందా? వివరించండి.

జ: ఒక ప్రాంత యాసను/మాండలికాన్ని సాహిత్యములో చొప్పించడము సమంజసం కాదు. అలాంటి సాహిత్యాన్ని ఇతర ప్రాంతాల వారు హర్షించరు. ఒకే భాషకు చెందిన భిన్న ప్రాంతాలలోని భేధాన్ని మాండలికం అంటారు. ఒకే భాషకు ప్రజల వ్యవహారము లోనూ పదాలలోనూ, ఉచ్చారణలోనూ, పదాల అర్థాలలోనూ, వాక్య రచన లోనూ బేధాలు ఉంటాయి. ఒకే భాషకు ఉన్న ఇలాంటి భేధాన్ని మాండలికాలు అంటారు. ఒక ప్రాంతాన్ని పరిశీలించా లంటే ఆ ప్రాంత భౌగోళిక, చారిత్రక, సాంఘీక భాషా మాండలికాలను తెలుసుకోవాలి. మాండలికాలని ప్రాంతీయ, సామాజిక, చారిత్రక జీవ శాస్త్రనుసారాలు అనే నాలుగు విధాలుగా వర్గీకరించవచ్చు. భాషను గమనించినచో గ్రాంథిక భాష, ఇంకోటి వ్యావహారిక భాష, ఏ భాషాకైనా జీవ ధాతువు మాండలికమే. ఉదాహరణకు వ్యవసాయ పదాలు. తెలంగాణ ప్రాంతంలో పశువులని కళింగ ప్రాంతంలో సొమ్ములని, రాయలసీమలో నగలని, ఇతర కోస్తా జిల్లాలలో డబ్బు/నగలు అని పిలుస్తారు.

ప్రపంచ తెలుగు మహాసభలు ఆర్ట్స్ కళాశాలలో పెద్ది వెంకటయ్యను అంపశయ్య నవీన్, బన్న ఐలయ్య సన్మానిస్తున్నారు

11. తెలుగు సాహిత్యంలో పద్యం అంతరించి పోతుందని కొందరి భావన. దీనిపై మీ ఉద్దేశం ఏమిటి వివరించండి.

జ: వచన, కవిత్వం వస్తున్నప్పటికి పద్య కవిత్వం వెలువడుతూనే ఉంది. యతి, ప్రాస వంటి ఛందో నియమాలను అనుసరించి చేసే సృజనాత్మక రచన తథ్యం. ఈ పద్య రచనకు ప్రాధాన్యం తగ్గిపోతున్న మాట అవాస్తవం. వెయ్యేళ్లకు పైగా తెలుగు సాహిత్యానికి ఆధారంగా నిలిచింది ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, పద్యాలలో రచించారు. నన్నయ మహాభారతం జగధ్ధితంబుగన్ అన్నాడు. తిక్కన ఆంద్రావళికి మొదము కలిగేటట్లు బారతామృతం వివరిస్తానని తెలిపాడు. విశ్వనాథ, కరుణశ్రీ, జాషువా, దాశరధి, వానమామలై, గరికపాటి వారి పద్య సంప్రదాయాన్ని తరువాతి తరం వారు కొనసాగిస్తూనే ఉన్నారు. “పద్యము పాట లాగానే తెలుగు వారి నాలుక పంట. పద్యం చావలేదు గాని దానికి పునరుజ్జీవనం కావాలి” అన్న జి. వి. సుబ్రమణ్యం మాటలు అక్షర సత్యాలు అని నేను అంటాను. వచన కవితకు నియమ నిబందనలు ఏమీ లేవు. ఈ దిశలో వచన కవులు కవిత్వాన్ని రాసినప్పటికీ పద్య కవిత్వం నిరంతరం నిలిచే ఉంటుంది.

సాహితీ ప్రియులు, డిప్యూటీ కలెక్టర్(రి) అంకయ్య గౌడ్ గారితో డా.పెద్ది వెంకటయ్య

 

* మీ సమయాన్ని వెచ్చించి మీ గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.

జ: నా అభిప్రాయాలను తెలియజేయడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు మీకూ, పత్రిక యాజమాన్యం వారికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

~

(డా. పెద్ది వెంకటయ్య గారిని +91 89191 38273 అనే నెంబరులో సంప్రదించవచ్చు.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here