సంభాషణం: డా. జి. వి. పూర్ణచంద్ అంతరంగ ఆవిష్కరణ-2

0
6

[box type=’note’ fontsize=’16’] ఆయుర్వేద వైద్యంతో ఎందరి ఆరోగ్యాన్నో కాపాడుతూ, తన సాహిత్యంతో సమాజాన్ని ఆరోగ్యవంతం చేసే డా. జి.వి. పూర్ణచంద్‌తో సంచిక జరిపిన ఇంటర్వ్యూ రెండవ భాగం ఇది. మొదటి భాగం ఇక్కడ చదవవచ్చు. [/box]

[dropcap]డా.[/dropcap] జి. వి. పూర్ణచంద్ విజయవాడ వాస్తవ్యులు. ఆయుర్వేద వైద్యంతో ఎందరి ఆరోగ్యాన్నో కాపాడుతూ, తన సాహిత్యంతో సమాజాన్ని ఆరోగ్యవంతం చేసే డా. జి.వి. పూర్ణచంద్‌తో సంచిక జరిపిన ఇంటర్వ్యూలో ఇది రెండవ భాగం.

***

పూర్ణచంద్ గారూ, భాష, భాషా మూలాల గురించి పరిశోధనలే కాకుండా మీరు ఆహారం, ఆహారపు అలవాట్ల గురించి కూడా సమాజాన్ని జాగృతం చేయడానికి ప్రయత్నించారు. ఈ అంశంపై మీ వ్యాసాలు, పుస్తకాల గురించి చెబుతారా?

తెలుగువారికి ఆహార చరిత్ర లేదండీ. అన్ని రంగాలలోనూ అశ్రద్ధ జరిగినట్టే, ఆహార చరిత్ర విషయంలోనూ జరిగింది. అసలు ఆహార చరిత్ర గ్రంథమే లేదు మనకి.

ఆహార చరిత్ర అంటే?

ఆహార చరిత్ర అంటే మన ఫుడ్ కల్చర్. మనం తినే పద్ధతి. నార్త్ ఇండియన్స్ తినే పద్ధతి వేరు, మనం తినే పద్ధతి వేరు. మన వంటకాలు వేరు. మనం ఆహారం తీసుకునే పద్ధతి వేరు. కఠినంగా అరిగే పదార్థాలను మొదటగానూ, మృదువైన పదార్థాలను మధ్యలోనూ, ద్రవ పదార్థాలను చివరగానూ తింటాం. కూరా, పప్పు, పులుసు, మజ్జిగ! ఇలా పద్ధతుంది మనకి. ఇది మన ఫుడ్ కల్చర్. మొత్తం కల్చర్‌లో ఒక భాగం. మన వంటకాలు, వాటి తయారీ కూడా మన పద్ధతిలో ఒక భాగం. దీనికి ఒక చరిత్ర ఉంది. తరతరాలుగా మనం వంశపారంపర్యంగా మనం పొందుతున్న వారసత్వంలో ఆహారం కూడా ఒక భాగం. భారతదేశం మొత్తం మీద తన స్టేపుల్ ఫుడ్‌ని ‘అన్నం’ అని పిలిచే జాతి ఒక ఆంధ్రులు మాత్రమే. తమిళనాడు, కర్నాటకలో సాపాటు అనే అంటారు. ఉత్తరాదిలో రోటీలు. ఒక్క తెలుగువారు మాత్రమే ‘అన్నం’ అని అంటారు. ‘అన్నం’ అనేది సంస్కృత పదమనీ, మనది కాదని కొందరు భావిస్తారు. ‘అన్నం’ పదానికి ఆప్టే నిఘంటువులో ‘ఆంధ్ర’ అనే అర్థం కూడా ఉంది. భావప్రకాశం అనే వైద్యగ్రంథంలో అన్నానికిచ్చిన పర్యాయ పదాలలో ‘ఆంధ్ర’ కూడా ఉంది.  అంటే, మళ్ళీ ఇక్కడ చరిత్ర వస్తోంది. అంటే మన భాష, మన చరిత్ర, మన సంస్కృతి ఇవన్నీ కూడా ముడిపడి సాగుతాయి.

ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. కుమ్మరి సారె ఉంది, కుమ్మరి సారె మీద చక్రం గిర్రున తిప్పుతారు, పైన ఒక మట్టి ముద్ద పెడతారు. ఈ మట్టి ముద్దని ‘బోలె’ అని అంటారు. చక్రం తిప్పుతూ, ఈ మట్టిముద్దని ఒక కూజాలానో, కుండలాగానో ఏదో ఒక ఆకారంలా తీర్చిదిద్దుతారు. అదొక శిల్పం లాంటిది. అదొక కళ. ప్రాచీనమైన ఏ జాతైనా సరే ఆ జాతికి సంబంధించిన ప్రాచీనమైన వృత్తులు ఉంటాయి. అందుకనే కుమ్మరం, కమ్మరం, వడ్రంగం… వంటికి ఆ జాతి యొక్క ప్రాచీన వృత్తులు. అది ప్రాచీన జాతి అయితే, ఆ వృత్తులకు తెలుగు పదాలుంటాయ్. మనది కాని వృత్తికి తెలుగు మాట ఉండదు. కంప్యూటర్‌కి తెలుగు చెప్పండి అంటే ఉండదు, ఎందుకంటే, అది మనది కాదు కాబట్టి. నన్నొకాయన అడిగాడు, “మీరు తెలుగు భాషోద్యమం అంటారు కదా, కంప్యూటర్‌కి తెలుగు పదం చెప్పండి” అని. “నేను చెప్తానండీ, కంప్యూటర్‌కి తెలుగు పదం చెప్పడం పెద్ద కష్టం కాదు, ఈ లోపు మీరు బాగా ఆలోచించి ‘పచ్చిపులుసు’కి ఇంగ్లీషు పదం చెప్పండి” అన్నాను. ‘పచ్చిపులుసు’కి ఇంగ్లీషు పదం ఎక్కడ్నించి వస్తుంది? ఇంగ్లీషు మాట ఉండదు. దాన్ని వండాలి, తయారు చేయాలి. టామరిండ్ సూప్ అనే ఏవేవో చెప్పచ్చు, రకరకాలుగా తిప్పి దాని అర్థాన్ని సాధించవచ్చు కానీ ఒక పదం దొరకదు. ‘పచ్చిపులుసు’కి ఇక్విలెంట్ ఇంగ్లీషు మాట ఉండడు కదా! ఎందుకంటే, అది వారి సంస్కృతి కాదు కాబట్టి. వారికి ఆ ఆహారపు అలవాటు లేదు కాబట్టి. ఇక్కడే ఆహారపు సంస్కృతి యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది. ఇక్కడే ఆహార పదార్థల చరిత్ర అర్థమవుతుంది. కాబట్టి తెలుగువారి ఆహార చరిత్రని మనం నిర్మించడమంటే తెలుగు జాతి చరిత్రనీ, తెలుగు జాతి ప్రాచీనతనీ కూడా నిర్మించడమే అనే అర్థంలో మనం దీన్ని సాధించాలి. ఆ ప్రయత్నం జరగలేదు.

నేను 2002లో ‘అలనాటి ఆహారాలు’లో రాశాను. దమయంతీ స్వయంవరానికి వచ్చిన అతిథులకు వడ్డించిన వంటకాల శ్రీనాథుడు మెనూకార్డ్… ఓ లిస్ట్… ఓ పట్టిక ఇచ్చాడట. దాదాపు 78, 80 వంటకాలున్నాయి ఆ జాబితాలో. దీన్ని సురవరం ప్రతాపరెడ్డి గారు గానీ లేదా ఆంధ్రుల సాంఘిక చరిత్రలు రాసిన మహానుభావులు గానీ… ‘ఇందు కొన్ని పదములు అర్థం కానివిగా ఉన్నవి, కొన్ని ప్రస్తుతం వినియోగములో లేవు, యేమైనను విజ్ఞులు పరిశీలింతురుగాక’ అని వదిలేశారు. ఆ వంటకాల పేర్లు ఏమిటో వాటిని గనుక మనం డెసిఫర్ చేయగలిగితే మన ఆంధ్రుల ఆహార చరిత్ర నిర్మాణం అయినట్టే. కనీసం ఆరు వందల ఏళ్ళనాటి ఆహారపు అలవాట్లేమిటో మనకి అర్థమవుతుంది. ఈ ప్రయత్నం జరగలా. ప్రతీదీ కూడా విజ్ఞులు పరిశీలింతురు గాక అంటే… ఎవరు విజ్ఞులు? మరి రాసిన వారు విజ్జులు కాదా? అంటే అర్థం కావడంలేదనీ, వినియోగం లేవని… అలాంటి పదాలపై పరిశోధన చేయడం సమయం వృథా అని ఆహార చరిత్రని ఎవరికి వారు అశ్రద్ధ చేశారు. కాని నేను దాన్ని పట్టుకున్నాను. పట్టుకుని ఒక్కొక్కటి వెతకడం మొదలుపెట్టాను. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ‘ద్రబ్బెడ’ అని ఒక వంటకం ఉంది. ఏమిటి ద్రబ్బెడ అని నిఘంటువులు వెతికితే ఎక్కడా ద్రబ్బెడ ప్రస్తావనే లేదు. మరి మహానుభావులు శ్రీనాథుడు, పోతన వాడారా మాటని.

పోతన కూడానా?

పోతన కూడా వాడాడు. జడభరతుడికి సంబంధించిన సన్నివేశం చెబుతూ, అతను ఎవరు ఏం పెట్టినా తింటున్నాడు. ఒకడెవరో తవుడు తెచ్చి పెట్టాడు, అది తినేసాడాయన. ఒకడు అరటిపండు తాను తిని తొక్క ఆయన చేతికిచ్చాడు. అదీ తినేసాడాయన. లౌకికపరమైన వ్యామోహాలపైన ఏ మాత్రం ఆసక్తి లేని వ్యక్తి ఆయన. ఆయనకి పెట్టిన వంటకాలలో ‘మాడు ద్రబ్బెడ’ కూడా పెట్టినట్టు రాశాడు పోతన. ఇక్కడ దొరికింది నాకు! ఏమిటీ ‘మాడు ద్రబ్బెడ’ అని పరిశీలించాను. పోతన పదాలకు నిఘంటువు లేదు కదా, అందుకని మూల భాగవతంలో వ్యాసుడు ఏం చెప్పాడా అని వెతికాను. మూలభాగవతంలో ఈ పదానికి ‘స్థాలీపురీషం’ అనే పదం వాడారు. స్థాలీ అంటే కుండ, పురీషం అంతే వేస్ట్ మెటీరియల్. అంటే కుండ లోపలివైపు అంటుకునే ఉండే మాడు. అన్నం వండినప్పుడు కొంత అంటుకుంటుంది కదా.. దీన్ని మాడు ద్రబ్బెడ అని… మాడిన అన్నం తాలూకు అవశేషమనీ అన్నారు. అంటే అన్నం కాకుండా మాడు తెచ్చిపెట్టాడట ఎవడో… అదీ తిన్నాడు జడభరతుడు. మాడు ద్రబ్బెడ అనగా… మాడినటువంటి ద్రబ్బెడ… అంటే మాడినటువంటి అన్నం తాలూకూ అవశేషం అని అర్థమవుతుంది. అంటే, మాడకోపోతే ద్రబ్బెడ అవుతుందిగా! మాడకుండా అన్నంతో చేసిన వంటకం ద్రబ్బెడ అని అర్థమైంది. అంటే అది ఫ్రైడ్ రైస్ కావచ్చు. మాడటం అనే సెన్స్ వచ్చింది కాబట్టి, మాడకుండా కనుక అన్నంతో ఒక వంటకం చేస్తే అది ద్రబ్బెడ అవుతుంది. Some rice product… may be fried rice. అంటే కనీసం ఒక అర్థాన్నయినా మనం సాధించాముగా. ఇలా నేను ఆ 78 వంటకాలను ఏదో ఒక విధంగా పరిష్కరించగలిగాను. ‘తేమనం’ అన్నాడు… అంటే మజ్జిగ పులుసు. తేమనం అన్న చక్కటి పేరు పోయి మజ్జిగ పులుసు అని ఎలా వచ్చింది? ఆ పేరు ఎందుకు మాయమైంది? శ్రీనాథుడి కాలం దాకా ఉన్న పేరు ఆ తర్వాత ఎలా పోయింది? తర్వాత నిజాం పాలనా కాలంలోనూ, బ్రిటీషువారి పాలనా కాలంలోను మనం చాలా తెలుగు పదాలను వదులుకున్నాం, కోల్పోయాం.

కొత్త వ్యామోహాలు మనలో పెరిగిపోయి, అదీ… నియో రిచ్ మెంటాలిటీ అంటాం మనం… కొత్తగా ధనవంతుడయిన వాడికి ఉండే తత్త్వం వేరుగా ఉంటుంది. మామూలుగా నడవడు, విరగదీసుకుని నడుస్తాడు. పుట్టుకతో ధనవంతుడు చాలా వినయంగా ఉంటాడు. దీన్ని ఆ పద్ధతిలో బ్రిటీషర్ల కాలంలో ఇంగ్లీషు వ్యామోహంలోకి వెళ్లిపోయిన తర్వాత చాలా తెలుగు మాటలని మనమే కించపరుచుకుని వదిలేశాం. అందుకని నేను మన ఆహార చరిత్రని రెండు యుగాలుగా విభజించాను. ఒకటి మిరపకాయలు మనకి రావడానికి ముందు కాలము, తరువాతి కాలం. దీని ప్రాముఖ్యత ఏమిటంటే పోర్చుగీసులు మిరపకాయలని భారతదేశంలోకి తెచ్చారు. అంతకుముందు అసలు మిరప పంట భారతదేశంలో లేదు. మిరియాలున్నాయి, మనం మిరియాలనే వాడుకునేవాళ్ళం. ప్రపంచం మొత్తం మిరియాలు ఇక్కడి నుంచే ఎగుమతి అయ్యేవి. అంటే మిరియాలు ధర చాలా ఎక్కువగా ఉందేది. ధర ఎక్కువ కాబట్టి కారాన్ని చాలా జాగ్రత్తగా వాడడం మనకి అలవాటయింది. ఇప్పుడు అవసరానికి మించి కారం, ఉప్పు వేసుకుని వండుతున్నాం. దేనివల్ల? చింతపండు వేయడం వల్ల. పులుపు పెరిగిన కొద్దీ ఉప్పూ కారం పెరుగుతుంది. పులుపుని బాలన్స్ చేయడానికి ఉప్పూ, కారం వేయడం అలవాటయ్యింది మనకి. ధర ఎక్కువున్న మిరియాలను కారంగా వాడే రోజులలో మన వంటకాలలో చింతపండు లేదు. శీనాథుడు చెప్పిన వంటకాలలో గానీ, అన్నమయ్య చెప్పిన పదార్థాలలో గాని, శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్న వంటకాల లిస్టులో గాని, తెనాలి రామకృష్ణ వివరించిన వంటకాలలోగాని చింతపండు వంటకాలు లేవు. శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్న వంటకాలలో పులిచెంచలి కూర, చింతచిగురు ప్రస్తావన ఉంది, వీటిని పులుపుగా వాడినట్టుంది గానీ చింతపండు రసం వేసి వండిన వంటకాలు లేవు. ఎందుకంటే ఒకే ఒక్క కారణం కారం ఎక్కువ వేయాల్సి వస్తుంది! కాబట్టి పులుపు వేయకుండా వండుకునేవారు.

మిరపకాయలొచ్చింతర్వాత ఏమైంది? వాటిని మొట్టమొదట పండించినవాడు ఆంధ్రుడు. తెలుగువాళ్లు మిరపకాయని విపరీతంగా వాడడం మొదలుపెట్టారు. చింతపండు ఆయుర్వేదంలో ఒక ఔషధం. అలాంటిదాన్ని వంటగదిలోకి తెచ్చి పెత్తనం ఇచ్చేశారు. దానికి తగ్గట్టుగా చౌకగా మిరపకారం దొరుకుతోంది. అందుకని మిరపకాయల రాక తర్వాత మన వంటకాలలో చింతపండుకి ప్రాధాన్యత పెరిగిపోయింది. మన వంటకాలనీ టామరిండ్ ఓరియంటెడ్ ఫుడ్స్ కింద మారిపోయాయి. అందుకని ఆహార చరిత్రలో మిరపకాయలు రావడానికి ముందూ, తరువాత వంటకాలలో వ్యత్యాసాన్ని మనం చూడవచ్చు. తెలుగు జాతికి అపకారం చేసినవి మిరపకాయలు, పొగాకు!

టమాటా, క్యాబేజి, కాలీఫ్లవర్, క్యారెట్… ఇవేవీ మనవి కావు! పోర్చుగీసు వారి ద్వారా మనదేశంలో ప్రవేశించాయి. ఇదే మన ఆహార చరిత్ర. ప్రతీదాని మూలాలు గనుక వెతుక్కుంటే వెళితే మనకు అద్భుతాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి పంచదార ఉంది. చక్కెర అనేది బౌద్ధం బాగా విస్తృతంగా ఉన్నటువంటి ప్రాంతాలలో పంచదార అని పిలవబడింది. బౌద్ధంతో సంబంధం లేని ప్రాంతాలలో చక్కెర అనే అంటారు. పంచన్ అంటే బౌద్ధ భిక్షువు, దార అంటే కానుక. పంచదారని మొదట తయారు చేసింది భారతీయులే, పంచదారని చైనాకి పరిచయం చేసింది భారతీయ భౌద్ధ భిక్షువేలని చరిత్ర చెబుతుంది. అది కూడా తెలుగు బౌద్ధులు! ఇలాగ పంచదార అనేది తెలుగు బౌద్ధులు ప్రపంచానికి అందించిన కానుక. చక్కెర తెలుగు వారి స్వంతం. ఆహార చరిత్రలో జాతి చరిత్ర కూడా ముడిపడి నడుస్తుందనడానికి ఇది ఉదాహరణ.

ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తాను. కుమ్మరి సాలె మీద ఉన్న బోలె నెమ్మదిగా పూజామందిరంలోకి వచ్చింది. మనవాళ్ళు కార్తీకమాసం చివరిరోజున పోలిని స్వర్గానికి పంపడమని చెప్పి అరటి దోనెల్లో పసుపుతో చేసినటువంటి ఒక ముద్దని నీళ్ళల్లో వదులుతారు. ఇక్కడ పసుపు ముద్ద పోలి. ఇది ఎక్కడిది? కుమ్మరి సారె మీద నుంచి వచ్చింది. ఇది నెమ్మదిగా ఆహారపు చరిత్రలోకి కూడా వచ్చింది. ‘పోలి’క పుల్కాగా మారింది, ఒక పొర మీద వత్తితే పుల్కా, రెండు పొరల మీద వత్తితే దౌపత్ర లేదా దౌపాతీ, మూడు పొరల మీద వత్తితే త్రిపత్ర, నాలుగు పొరల మీద వత్తితే చపత్ర… చపాతీ అవుతుంది. ఇవీ కాలక్రమంలో మనకి వచ్చిన మార్పులు. ఇవి ఆహార చరిత్రలో భాగమే కదా! ఇవన్నీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది కదా! చపాతీల తయారీలో తెలుగువాడి పాత్ర… ఇవన్నీ నార్త్ ఇండియన్ ఫుడ్‍ అని హోటళ్ళ వాళ్ళు ముద్రవేసేస్తే, మనం నిజమే కామోసు అనుకుంటాం. కాని అబద్ధం. ఇది మన దగ్గర నుండి వెళ్ళిన మన ఆహారం, మన మాటలు. ఇవన్నీ మన తరానికి చెప్పాలి కదా, ఇవి మనవి అని తెలియజేయాలి కదా! అందుకని నేను ఆహార చరిత్రను ప్రధానంగా తీసుకున్నాను. ఇప్పటికి కేవలం తెలుగువారి ఆహార చరిత్ర మీద – నేను ఆహార చరిత్రను చరిత్రలా కాకుండా – భాషాశాస్త్రపరంగా విశ్లేషణ, వృక్షశాస్త్రపరంగా విశ్లేషణ, ఆయుర్వేద శాస్త్రపరంగా విశ్లేషణ, ఆర్కియాలజీ పరంగా… అంటే బొటానికల్ ఆర్కియాలజీ ప్రకారం విశ్లేషణ చేసి – ఇలా బహుముఖీనంగా విశ్లేషించి తెలుగువారి ఆహార చరిత్రకి సంబంధించిన మూలాలను వెతకడం ప్రారంభించాను. చేపలకి నాలుగువందల తెలుగు పేర్లు ఉన్నాయని మొట్టమొదటిసారిగా వెల్లడించాను. నాలుగు వందల రకాల చేపలున్నాయని తెలుసుకుని, వాటి తెలుగు పేర్లు సేకరించాను, ఈ రకంగా తెలుగువారి ఆహార చరిత్ర మూలాలను అన్వేషిస్తూ, తద్వారా మన భాషా సంస్కృతుల మూలాలకు వాటిని అన్వయించుకుంటూ నేను ఆరోగ్యాన్ని ఆయుర్వేదపరంగా చెప్పాను… ఒక వంటకం గురించి గానీ, ఒక మొక్క గురించి గానీ… ఉదాహరణకి కందిపప్పు గురించి చెబితే కందుల మూలాల గురించి దాని బాటనీ, దాని హిస్టరీ, దాని ఆర్కియాలజికల్ ఎవిడెన్స్‌లతో సహా అన్నింటినీ చెప్పుకుంటూ, ఆరోగ్యపరమైన అంశాలను స్వీకరిస్తూ, ఒక ఆయుర్వేద వైద్యుడిగా, ఒక చరిత్ర అధ్యయనపరుడిగా, ఒక వృక్షశాస్త్ర అధ్యయనపరుడిగా ఒక భాషాశాస్త్రపరమైనటువంటి అధ్యయనపరుడిగా నేను వీటన్నింటిని సమన్వయం చేసుకుంటూ రచనలు చేస్తూ వస్తున్నాను. అందుమూలాన నా వ్యాసాలకి గాని, నేను చెప్పేటువంటి ఆహారానికి సంబంధించిన అంశాలలో గాని ఇతరులకన్నా భిన్నమైన ధోరణి కనిపిస్తుంది. కొత్త విషయాలు కనిపిస్తాయి. అలా నేను ఇప్పటికి 13 పుస్తకాలు రాశాను. అందులో ‘ఆహార వేదం’ అనే పుస్తకం దాదాపు 600 పేజీల పుస్తకం. అలాగే ‘తరతరాల తెలుగు రుచులు’, ‘అలనాటి ఆహారాలు’, ‘భోజన భోగం’, ‘వంటిల్లే వైద్యశాల’ ఇలా ఆహారానికి సంబంధిన పుస్తకాలను వెలువరించాను.

ఈ పుస్తకాలలో ఆహరపరమైన, చరిత్రపరమైన అంశాలను చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ విషయాలు పూర్ణచంద్ మాత్రమే చెప్పగలడు అని నా వ్యాసం చదివినవారెవరైనా అర్థం చేసుకునేలా రాస్తాను. నా పేరు వేయకపోయినా, అది నేను రాసిందే అని చదివేవాళ్ళకి తెస్తుంది, నా రచనని నా పాఠకులు గుర్తుపట్టే ఒక ముద్రని నేను సాధించాలని నా కోరిక. రచయిత యొక్క పరిణతి ఆ ముద్రపై ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటాను. నాదైన ముద్ర కలిగిన రచనలు నేను అనేకం చేయగలిగాను అనేటువంటి ఒక సంతృప్తి నాకుంది.

పూర్ణచంద్ గారూ, మీరు సాహితీ సృజన మాత్రమే కాదు, సాహితీ సేవ కూడా చేస్తున్నారు. ఒక సాహితీ కార్యకర్తగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు, కృష్ణాజిల్లా రచయితల సంఘం స్థాపించి కృష్ణా జిల్లా రచయితలకి ఒక వేదిక కల్పించారు. ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ సాహిత్యం అంటే గుర్తుకువచ్చేది డా. జి.వి. పూర్ణచంద్ గారే! ఇలా రచనలు చేస్తూ, వైద్య వృత్తిలో ఉంటూ ఈ కార్యక్రమాలని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? మీ సాహిత్య కార్యక్రమాల నిర్వహణ గురించి వివరిస్తారా?

“బిజీగా ఉండే మనిషే తీరిక చేసుకోగలడు” అనేది నా సిద్ధాంతం. నాకు టైమ్ లేదండీ అనేవాడు పెద్ద సోమరి అని అర్థం. బిజీగా ఉంటేనే టైమ్ షెడ్యూల్ అనేది అర్థమవుతుంది. ఏమీ చేయని వాడు టైమ్ లేదనకుంటూ ఏమీ చేయకుండా నిర్లిప్తంగా ఉండిపొతాడు. అందుకే నాకు తీరికలేదండి అనే మాట నా నోట్లోంచి రాదు. నిజమే, నాకు 24 గంటలూ చాలనంత పని చేతినిండా ఉంటేనే నాకు నిద్ర పడుతుంది. “మంచి రచన చదివితే బాగా భోంచేసినట్లుండాలి” అన్నారు ఆరుద్ర. అలాగే ఓ మంచి కార్యక్రమం చేస్తేనే నాకు కమ్మగా నిద్ర పడుతుంది. అ కార్యక్రమం సరిగా జరగకపోతే నిద్ర కూడా పట్టదు. మొదటినుంచి కూడా ఓ సాహితీ కార్యకర్తగా ఉండడానికే నేనిష్టపడ్డాను. సాహితీ కార్యకర్త అంటే నా దృష్టిలో ఒక సత్కార్యానికి కర్త. సాహిత్యపరమైన అనేక ఉద్యమాలలో నేను భాగస్వామిని. 1978-85 మధ్య ఒక ఆరేడు సంవత్సరాల కాలంలో విస్తృతంగా వచ్చినటువంటి మినీ కవితా ఉద్యమంలో నాది ప్రధానమైన పాత్ర. నేను, రావి రంగారావు గారు, అద్దేపల్లి రామ్మోహనరావు గారు, కొల్లూరి గారు, నాగభైరవ కోటేశ్వరరావు గారు ఇట్లా చాలామందిమి మినికవితా ఉద్యమం కోసం పనిచేశాము. నాది ప్రచారకుడి పాత్ర. నేనూ రాసేవాడిని… కాని ప్రచారమనేది నేను ఇతరుల కంటే ఎక్కువగా చేశాను. ఏ విధంగా అంటే… తెలుగులో మొట్టమొదటిసారిగా ప్రదర్శన/ఎగ్జిబిషన్ ఆలోచన చేసినవాడిని నేనే. అంతకుముందెన్నడు ఇది జరగలేదు. నేను చేసిన పని ఏంటంటే – ఆ రోజులలో విశాలంధ్ర దినపత్రిక ఆఫీసులో పెద్ద లైబ్రరీ ఉండేది. మామూలు లైబ్రరీలలో లేని పుస్తకాలు ఆ రోజుల్లో విశాలాంధ్ర లైబ్రరీలో ఉండేవి. ఎడిటర్ రాఘవాచారిగారిని అడిగి ఆ లైబ్రరీలో కూర్చుని అనేక కవితా సంపుటాలు తీసుకుని మినీ కవిత రూపానికి దగ్గరగా ఉన్నవి తీసుకుని – ఒక పెద్ద షీట్ మీద ఒక వైపు ఆ కవి పేరు, మరో వైపు కవితా రాసుకుని దానికి తగ్గ బొమ్మని నేనే వేసి (నేను చిత్రకారుడిని. చాలామంది రచయితల పుస్తకాలని  ముఖ చిత్రాలు గీశాను) దాదాపుగా 300 ఎగ్జిబిట్స్ తయారు చేసి ఏ ఊరికి అవకాశముంటే ఆ ఊరు వెళ్లిపోవడం, అక్కడ హైస్కూల్‌లోనో, కాలేజీలోనో బల్లల మీద వరుసగా పేర్చేసి ఎగ్జిబిషన్ పెట్టడం! వాటిని చదివి కవులుగా మారినవారు ఎంతోమంది ఉన్నారు. ఈ రకంగా మినికవితా ఉద్యమానికి ప్రచారం తీసుకొచ్చాను. ఇవాళ ప్రసిద్ధ కవులుగా ఉన్న చాలామంది ఆ రోజుల్లో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.

నేను కుందుర్తి స్కూల్ నుంచి వచ్చాను. ఆయన ప్రభావంతోనే 1986లో ‘కాంతిస్వప్న’ అనే కవితా సంపుటి వెలువరించాను. రెండో ముద్రణ ఈ మధ్యే వచ్చింది. ‘కాంతిస్వప్న’ దీర్ఘకవిత. సృష్టి ఎలా ఏర్పడింది అనేదానిపై నేను రాశాను.

మొదట మినీ కవితా ఉద్యమం, తరువాత తెలుగు భాషోద్యమం… ఇలా అనేక ఉద్యమాలలో వాటికి ఉద్యమ స్వరూపం తేవడంలో నా పాత్ర ఉంది. నేను ఉద్యమ జీవిగా ఉండడానికే ఇష్టపడతాను. అందుకే ప్రధాన కార్యదర్శిగా ఉంటాను తప్ప, అధ్యక్షుడిగా ఉండను. ‘నువ్వు రచయితగా ఉండదలచుకున్నావా, కార్యదర్శిగా ఉండదలచుకున్నావా ముందు నిర్ణయించుకో’ అనేవారు కుందుర్తిగారు. కార్యదర్శిగా ఉండదలిస్తే నువ్వు రచనల జోలికి వెళ్లకు, కార్యక్రమాల మీద దృష్టి పెట్టు; రచయితగా రాణించదలచుకుంటే రచయితగానే ఉండు, అనవసరంగా కార్యక్రమాల జోలికి వెళ్ళకు అనేవారు.

మా అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు. మా ఇద్దరికీ 1976 నుంచి స్నేహం. గుత్తికొండ సుబ్బారావు హైదరాబాదులో ఉండగా కుందుర్తిగారికి ప్రత్యక్ష శిష్యుడు. ఆయన శిష్యుడిగా ఈయన చాలా కార్యక్రమాలు నిర్వహించాడు. శివారెడ్డి గారితో కలిసి ‘వేకువ’ అనే పత్రిక నిర్వహించాడు. సుబ్బారావు గారు కుందుర్తి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి తను రచయితగా విరమించుకుని కార్యకర్తగా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించాడు. నేను అటు కార్యకర్తగా, ఇటు రచయితగా రెండు వైపులా మనం ఎందుకు సాధించలేము అని ఒక పట్టుదలతో దేని సమయాన్ని దానికి కేటాయిస్తూ …ఇవాళ నేను తొమ్మిది పత్రికలకి ఫీచర్స్ రాస్తున్నాను, ఇవి రాస్తూ కూడా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రపంచ మహా సభలు చేసినా కూడా నేను నా ఫీచర్స్ ఆపలేదు. ఫీచర్స్ రాస్తూనే మూడు ప్రపంచ తెలుగు రచయిత మహా సభలు బెజవాడలో కృష్ణాజిల్లా రచయితల సంఘం పక్షాన నిర్వహించాను. జాతీయ తెలుగు మహా సభలు నిర్వహించాం. ఒక్కోటి దాదాపు వెయ్యి పేజీలున్న ఇరవై పుస్తకాలకు సంపాదకత్వం వహించాను. తెలుగుకి ప్రాచీన హోదా కోసం మచిలీపట్నం నుంచి నెల్లూరి వరకు రచయితలతో పాదయాత్ర నిర్వహించాం. ప్రజల గుండె తలుపులు తట్టడానికి ప్రచార కార్యక్రమాలు చేశాం. ఊరూరా భాషోద్యమ సదస్సులు నిర్వహించాం. ఇవి కాక, విజయవాడలో బుక్స్ ఎగ్జిబిషన్‌ నిర్వహించాం. ఖర్చులు మేం భరించి రచయితల పుస్తకాలు ఎగ్జిబిషన్‌లో మా స్టాల్ ద్వారా విక్రయించాం. రచయితలకి ఎంతో కొంత సేవ చేయాలనేది మా ఉద్దేశం. మా సంఘం సభ్యులు, అధ్యక్షులు, విహారి గారు, బుద్ధప్రసాద్ గారు అందరూ ఎంతో ప్రోత్సాహించి మా కార్యక్రమాలు విజయవంతం అవడానికి దోహదం చేస్తున్నారు. ఇలా మాకు భాష, సంస్కృతి, వీటి ప్రాచీనతే మాకు ముఖ్యం, వీటికి మనుగడ కల్పించడం మా లక్ష్యం! ఎన్నో కార్యక్రమాలు చేశాం.

ఒక అద్భుతమైన కార్యక్రమం గురించి చెబుతాను. ఇంతకుముందు నేను చెప్పాను, సింధు నాగరికతా నిర్మాణంలో తెలుగువారి పాత్ర ఉండే అవకాశం ఉందనీ, వారు ఇక్కడినుంచే వ్యాప్తి చెందారనీ!  ఇండస్ వాలీ సివిలైజేషన్ నడుస్తున్న కాలంలో… క్రీ.పూ.1750 నాటికి సింధు నాగరికత ముగిసింది… ముగిసినప్పటి వరకు తెలుగు నేల మీద మనుషులున్నారా లేరా? ఉన్నారు. వాళ్ళు ఎలా జీవించారు? వాళ్ళ సంస్కృతి ఏమిటి? దీని గురించి చరిత్రకారులు ఎందుకు ఆలోచించరు? అని ‘సింధు కృష్ణ లోయల నాగరికతల అధ్యయన సదస్సు’ అని ఒక సదస్సు నిర్వహించాము. మూడు రోజుల పాటు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆర్కియాలజిస్టులందరినీ పిలిచాం. ‘మీరు చెప్పండి… ఈ నాగరికతకు కృష్ణా నాగరికత అని పేరుపెట్టండి… తెలుగు నాగరికత అని పేరు పెట్టండి… ఇక్కడ ఏం నడిచిందో, దేశానికి, ప్రపంచానికి చెప్పండి… తద్వారా తెలుగువారు వెలుగులోకి వస్తారు’ అని మేము కోరాం. ఇది ఎవరు చేస్తారు? ఎవరూ చెయ్యరు. కృష్ణా జిల్లా రచయితల సంఘం పక్షాన మేం చేశాం… ఇంకా ఇలాంటి చాలా ఇన్నేవేటివ్ ఆలోచనలతో ఎన్నో విషయాలని మేము వెలుగులోకి తీసుకొచ్చాం.

మనకి ఇనుముని కరిగించే పరిజ్ఞానం ఉంది. ఉత్తరాది వారు రాగిని కరిగించారు, బంగారాన్ని కరిగించారు. వెండిని కరిగించారు. వాటితో పాత్రలు, ఆయుధాలు వగైరాలు తయారుచేశారు. వాటికంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఇస్తే గాని ఇనుము కరగదు. అంత ఉష్ణోగ్రతని ప్రొడ్యూస్ చేయగలగాలిగా! ప్రొడ్యూస్ చేసి కంట్రోల్ చెయ్యాలి… ఒక రాగి గద కన్నా ఒక ఉక్కు గద చాలా బలమైనది. యుద్ధంలో విజయం సాధించాలంటే ఉక్కు గద కావాలి. అందుకే విశ్వామిత్రుడు రాముడిని దండకారణ్యానికి తీసుకువచ్చి ఆయుధాలు ఇప్పించాడు. అస్త్రాలు మంత్రబలానికి చెందినవి, శస్త్రాలు ప్రయోగించేవి… కత్తి, గద, బాణం, విల్లు.. వగైరాలు. విశ్వామిత్రుడు ఇక్కడికి వచ్చి ఆయుధాలు ఎందుకు ఇప్పించాడు? ఇక్కడ ఇనుమును కరిగించగలిగే పరిజ్ఞానం కలిగిన జాతి ఉంది కాబట్టి… ఉక్కుతో తయారైన ఆయుధాలు ఉంటాయి కాబట్టి… రాముడు ఆజానుబాహువు. మోకాళ్ళ వరకు చేతులున్నటువంటి పొడుగాటి వ్యక్తి.  పొడుగాటి చేతులున్న వ్యక్తికి అతని కొలతలకి తగ్గట్టుగా అతని చెయ్యి బాగా ముందుకు జాపి బాణం లాగాలంటే విల్లు పొడుగెంత కావాలి? మనం టైలర్ దగ్గరికి వెళ్ళి ఆది ఇచ్చి బట్టలు కుట్టించుకున్నట్టుగానే, రాముడి శరీరాకృతికి సంబంధించిన కొలతలో ఆయుధాలు తయారు చేయించి ఇప్పించాడు.  అంటే ఇక్కడ ఉక్కు తయారీ కర్మాగారాలు ఉన్నాయన్న మాట. మరి ఇందుకు సాక్ష్యం ఏంటి? కర్నూలు దగ్గర పెద్ద పెద్ద కొండలంత బూడిద కుప్పులు చారిత్రక ఆధారాలలో దొరికాయి. ఈ బూడిద కుప్పలు మూడువేల సంవత్సరాల క్రితంవి అనీ, అవి 1500 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల పైన వేడికి బూడిదయ్యాయని తేలింది. అంత పెద్ద బూడిడ కుప్పలు ఉన్నాయంటే, ఇనుముకి సంబంధించిన ఇండస్ట్రీస్ అక్కడ ఉండి ఉండాలి. ఇదీ చరిత్ర. ఇలాగ చరిత్రకి సంబంధించిన చాలా విషయాలని మేము చర్చిస్తూ, మన భాష యొక్క ప్రాచీనతని వెనక్కి తీసుకువెళ్ళడానికి మా వంతు కృషి మేము చేశాము.  ఇది కూడా ఒక ఉద్యమం అంటాను నేను.

మేం ఏ సభ  నిర్వహించినా ఆ సభ అంశం మీద పుస్తకాలు తెచ్చాం. మా కీర్తి ప్రతిష్ఠలని ఆ పుస్తకాలు నిలబెట్టాయి. మా ప్రయత్నాల వల్ల క్రమంగా ప్రజలలో మార్పు వస్తోంది. 2005-06 మధ్య ‘మా పిల్లలకి తెలుగు చదవడం రాదండి’ అని తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకునేవారు. ఆ రోజులు పోయి, ఇప్పుడు ‘మా పిల్లలు తెలుగు చదువుతారు, పద్యాలు పాటలు పాడుతారు’ అని చెప్పుకుంటున్నారు. అంటే భాషోద్యమం కొంతమేర విజయం సాధించినట్లే. ఈ విజయంలో నా పాత్ర కూడా ఉండడం నాకు సంతృప్తినిస్తోంది. అలాగే తెలుగు భాషోద్యమంలో కృష్ణా జిల్లా రచయితల సంఘం పాత్ర కూడా గొప్పది. వ్యక్తిగతంగా, ఈ సంఘం కార్యదర్శిగా నాకెంతో తృప్తిగా ఉంది.

అలాగే ఆహారపరంగా మార్పులు తీసుకురాగలిగాను. భాషా సంస్కృతుల పట్ల ప్రజలలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తున్నాను.

మీ కవితా సంకలనం గురించి కొంచెం చెబుతారా?

చెబుతాను. దానికన్నా ముందు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. నా మొట్టమొదటి పుస్తకం 1980లో వచ్చింది. దాని పేరు ‘అమలిన శృంగారం’. అప్పుడు నేను మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ‘అమలిన శృంగారం’ రాసినప్పుడు నా వయస్సు సరిగ్గా 21 ఏళ్ళు. మలిన శృంగారం కాదని చెప్పడం నా ఉద్దేశం. 1978లో ‘సౌజన్య’ అనే టాబ్లాయిడ్ సైజు పేపర్ ఒకటి వస్తుండేది.  అందులో వ్రాసిన వ్యాసాలను పెంచి, పుస్తకరూపంలో తెచ్చాను.

ఆయుర్వేదంలో మాకు షడ్దర్శనాలు ఉన్నాయి. ఆ ఆరు దర్శనాల గురించి కూడా మేము చదువుకున్నాం. నేను ఎక్కువగా సాంఖ్యం వైపు ఆకర్షితుడనయ్యాను. అందులో మనసు ఏర్పడడం గురించి సైకియాట్రికి సంబంధించిన అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సాంఖ్యం చెప్పినదేంటంటే మనసుని మూడు గుణాలు నిర్మిస్తున్నాయి అని! అవే సత్వ, రజస్, తమో గుణాలు! సాంఖ్య స్కూల్ ఆఫ్ థాట్ నుంచే కశ్యప సంహిత వచ్చింది. అది శిశువైద్య గ్రంథం. కశ్యప సంహితలో సృష్టి మూలాల గురించి చెప్పుకుంటూ వచ్చి, మనసు ఎలా ఏర్పడిందో చెప్పుకుంటూ వచ్చి సత్వ, రజో, తమో గుణాలకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇదిలా ఉండగా, ఫ్రాయిడ్ తన సైకో అనాలిసిస్ థీరీని కూడా మనసుకి ఉన్నటువంటి మూడు గుణాలతో నిర్మించాడు. అవి ఇడ్, ఇగో, సూపర్ ఇగో. ఇడ్‌కి ఫ్రాయిడ్ చెప్పిన లక్షణాలు తమో గుణానికి సాంఖ్యం చెప్పిన లక్షణాలు ఒకటే. తమో గుణం ఒక ముద్ద. ఇందులో కోరికలు ఒక పోలి. దీని లోంచి కోరిక బయటకి రావాలి. దాన్ని నియంత్రించేది రజోగుణం. దానికి మంచి చెప్పేది సత్వ గుణం. ఇది సాంఖ్యం చెప్పినటువంటి థీరీ. ఫ్రాయిడ్ చెప్పినది కూడా అదే. అందుకే సూపర్ ఇగో అన్నాడు. ఇగో కనుక బలహీనంగా ఉంటే.. అంటే నేను అనే తత్త్వం కనుక బలహీనంగా ఉంటే తమో గుణ ఆధిపత్యం వచ్చినప్పుడు మనసులోకి వచ్చిన కోరికని వచ్చినట్టుగా తీర్చేసుకుంటారు. సత్వ గుణం అంటే సూపర్ ఇగో కనుక బలహీనంగా ఉందనుకోండి, అప్పుడు రజో గుణం కంట్రోల్ పెరిగిపోతుంది. అప్పుడేమవుతుంది? కోరికలను బలంగా అణచివేయాల్సి వస్తుంది. కోరికను జయించకుండా, బలవంతంగా అణచివేయడం వల్ల, హిస్టీరియా డెవెలప్ అవుతుంది. హిస్టీరియాకి మూలాలు వెతుకుతూ ఫ్రాయిడ్ చెప్పిన థీరీ అన్న మాట. ఏకవీర నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన థీరీ ఇదే. ఫ్రాయిడ్‌నీ, సాంఖ్యాన్ని సమన్వయపరిచి మనసు యొక్క స్వరూపానికి విశ్లేషించడానికి ‘అమలిన శృంగారం’ పుస్తకం ద్వారా ప్రయత్నం చేసిన ఏకైక వ్యక్తిని నేనే. ఆ పుస్తకం 2 మే 1980 తేదీన విడుదలయింది. ఇంతవరకు ఆ థీరీ మీద నేను చెప్పిన పద్ధతిలో ఎవరూ మళ్ళీ ఎటువంటి స్టడీ జరగలేదు.

మళ్ళీ నేనే నా ‘కాంతిస్వప్న’ని ఫ్రాయిడ్ సిద్ధాంతం ఆధారంగా, సాంఖ్యులు చెప్పిన పద్ధతిలో మనసు ఎలా రూపొందుతుందో, మనిషి యొక్క చైతన్యం ఎలా ఏర్పడుతుందో చెప్పాను. పిడికెలి ఎత్తి నిలబడి ప్రశ్నించే తత్త్వం రావాలంటే ఆ ‘నేను’ అనేది చాలా బలంగా ఉండాలి. నేను అంటే ఇగో. ఇక్కడ ఇగో అనేది ఒక గుణం. ఆ గుణం బలంగా ఉంటేనే మనిషి సత్వ గుణ సంపన్నుడై సబ్లిమేట్ చేసుకుని ఎనర్జైజ్ అవుతాడు. అదీ చైతన్యమంటే! ఇది సాంఖ్యులు చెప్పారు. ఫ్రాయిడ్ కూడా అదే చెప్పాడు. ఈ రెండు థీరీలను సమన్వయపరిచిన మొదటి సిద్ధాంతకర్తని నేనే. నా థీరీ నేను చెప్పాను, పట్టించుకోవలసిన వాళ్ళు పట్టించుకోకపోతే అది వాళ్ళ తప్పు.

రాష్ట్ర విభజన తర్వాత సాహిత్య స్వరూపం ఎలా మారింది? ముఖ్యంగా నవ్యాంద్రప్రదేశ్ అంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్‌లో సాహిత్య స్వరూపం ఎలా మారింది? మీ అభిప్రాయం ఏమిటి?

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు.

సాహిత్యపరంగా కూడానా?

చెప్తాను. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. నష్టాల్లోంచి లాభాలు ఏరుకోవాలనే ఆలోచన చెయ్యాలి కదా! నాకు నష్టం జరిగిందో అని కూర్చుంటే ఉపయోగం లేదు కదా. ఉన్న పదమూడు జిల్లాలకీ, ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా సమానంగా భాషా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రాతినిధ్యం ఉండేలాగా చేసుకోవడానికి మేం కంకణం కట్టుకున్నాం. నాకు అవకాశం ఉన్నంతమేర నేను అందుకు ప్రయత్నం చేస్తున్నాను. అది నష్టాల నుంచి లాభాలను ఏరుకోవడం అనగా. ఈ నాలుగైదు సంవత్సరాలలో భాషా సాంస్కృతిక శాఖ 250 మంది ఉగాది పురస్కారాలు అందినాయి. ఆంద్రప్రదేశ్ ఏర్పడిన 60 సంవత్సరాల కాలంలో పది పదిహేను మందికి కూడా అందలేదు. అలాగే ఓ 60-70 మందికి కళారత్న పురస్కారలు అందాయి. భాషా సాంస్కృతిక శాఖకి నేను దండం పెట్టి చెబుతున్నాను. విభజన వల్ల లాభం పొందాము అని ఇప్పుడు గర్వంగా చెబుతున్నాను. ఖచ్చితంగా మా రచయితలకి గుర్తింపు వస్తోంది. మా రచయితల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మేం కూడా గుర్తింపు పొందిన వ్యక్తులం అనే సంతృప్తి వాళ్ళల్లో పెరిగింది. మంచి రచనలు, మంచి సాహిత్యం వచ్చేందుకు అవకాశాలు పెరిగాయి.

పూర్ణచంద్ గారూ, మా కోసం సమయం వెచ్చించి మీ వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం.

నమస్కారం. చాలా సంతోషం. నా చిన్ననాటి విశేషాల దగ్గరనుంచి చాలా విషయాలు నాతో మాట్లాడించారు. అణిగిపోయినటువంటి, మరుపులోకి వెళ్ళిపోతున్న చాలా విషయాల్ని ఒక చోటకి చేర్చేందుకు మీరు నాకొక మంచి అవకాశం కల్పించారు. తద్వారా నేను నా గురువులని స్మరించుకోనే వీలు కల్పించారు. ఇది భాషోద్యమానికి సంబంధించి, అలాగే మన సంస్కృతి ఉద్యమానికి సంబంధించి చాలామందిలో నేను మాట్లాడిన ఈ నాలుగు మాటలు మంచి ప్రేరణ కలిగిస్తాయనీ, భాషోద్యమం మరింత వేగంగా ప్రజల గుండె తలుపులని తట్టాడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మనస్ఫూర్తిగా మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

(డా. జి.వి. పూర్ణచంద్, శుశ్రుత ఆయుర్వేద ఆసుపత్రి, మొదటి అంతస్తు, సత్నమ్ టవర్స్, బకింగ్‌హామ్ పేట పోస్టు ఆఫీసు ఎదురుగా, గవర్నరుపేట, విజయవాడ – 520002. ఫోన్ – 9440172642. ఈమెయిల్ – purnachandgv@gmail.com)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here