(ప్రఖ్యాత రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి గారి కుమారులు జీడిగుంట విజయసారధి, జీడిగుంట శ్రీధర్‍లతో ప్రత్యేక ఇంటర్వ్యూ)
ప్రశ్న1: మీ నాన్నగారు రచయిత, కథలు రాస్తారని మీకు ఏ వయసులో తెలిసింది? ఎలా? మీరెలా భావించారు?
విజయసారధి:
శ్రీధర్:
ప్రశ్న2: జీడిగుంట శ్రీరామచంద్రమూర్తిగారు కథలు ఏ సమయంలో రాసేవారు? మీకు తెలిసిన సంఘటనలనేవయినా ఆయన కథలుగా మలచారా?
విజయసారధి:
మా నాన్నగారికి కథలు ఈ సమయంలో రాయలని ప్రత్యేకంగా ఉండేది కాదు. నాకు తెలిసి ఇంట్లో ఎప్పుడూ రాస్తున్నట్టే కనిపించేవారు. ఆఫీసై పోయి ఇంటికి వచ్చాకా మిత్రులతో చర్చలు చేయడం, కథల గురించి వాళ్ళతో మాట్లాడడం చేసేవారు. ఖాళీగా ఉన్న సమయంలో రాసేవారు. నాకు బాగా గుర్తున్న సంగతి – ఒక నవల రాశారు. అయ్యగారి సుబ్బలక్ష్మి అనే ఆవిడ, ఎం.ఎస్. ఆర్. మూర్తి అనే ఆయన కలిసి అందరూ ఒకే నవల రాయాలని చర్చించారు. అది నాకు బాగా గుర్తుంది. ఇంకా ఏవో కథలు రాసేవారు గాని, ఎక్కువగా మా అమ్మకి చెప్తుండేవారు. లేదా ఎవరైనా సాహితీమిత్రులు వచ్చినప్పుడు వాళ్ళతో చెప్తుండగా, మేం ఆ పక్క గదిలో ఉండి వినేవాళ్ళం. అప్పట్లో రెండు మూడు గదుల ఇళ్ళల్లోనే కదా అద్దెకి ఉండేది. విజయ్‍నగర్ కాలనీలో ఉండేవాళ్ళం. మేం వెనకాల రూమ్‌లో ఉంటే, వాళ్లు ముందు గదిలో కూర్చుని చర్చించుకునేవారు. అలా మేము వినేవాళ్లం. అందుకని ప్రత్యేక సమయం అంటూ లేదు.
సంఘటనలను ఏవైనా కథలుగా మలిచారా అంటే, చాలా సంఘటనలని ఆయన కథలుగా మలిచారు. నిజంగా జరిగిన ఓ సన్నివేశానికి తన ఊహని జోడించి ఓ మంచి ముగింపునిచ్చేవారు. 1977 లోనో 78లోనో మేం కాశీ వెళ్ళాం. మా తాత, బామ్మ, నాన్నగారు, అమ్మ, నేను, తమ్ముళ్ళు అందరం వెళ్లాం. అక్కడొకాయనని కలిసాం. ఆయన అందరినీ వదిలేసి ఎప్పటి నుంచో కాశీ వచ్చి ఉంటున్నారు. ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చి కాశీలో ఉండసాగారు. ఈ ఫ్రెండ్ ఎవర్నో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయారట. తనకి కొరివి ఎవరో ఒకరు పెడతారులే అని ఆయన అనుకునేవారు. ఈ సంఘటనికి ఊహని జోడించి ‘కాశీపట్నం చూడకు బాబూ!’ అనే కథ రాశారు. అలాగే ఒకసారి భద్రాచలం వెళ్ళినప్పుడు పూజారి మెట్లెక్కుతూ ఓ పువ్వుని తొక్కేసారు, దాన్ని తీసి కళ్లకద్దుకుని, దేవుని పాదాల వద్ద పెట్టారాయన. దాన్ని చూశారు నాన్నగారు. ఈ సంఘటన మీద ఒక కథ రాశారు. అలా ఎన్నో కథలు. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక కథ రాశారు. చాలా కథలు జీవితంలో జరిగిన సంఘటనలను తీసుకుని ఆయనకి నచ్చిన ముగింపునిచ్చేవారు. మా నాన్నగారు ఏ కథైనా మనుషులను కదిలించేలా ఉండాలని, కళ్ళ నీళ్ళయినా తెప్పించాలి లేదా మనసు విప్పి హాయిగా నవ్వుకునేలా ఉండాలి అనేవారు. ఏ విషయం చెప్పినా, వార్తల్లో హెడ్‍లైన్స్‌లానో, వార్తలు చదువుతున్నట్లుగానో ఉండకూడదని, దానికి మంచి ఊహ జోడించాలని అనేవారు.
శ్రీధర్:
మా నాన్నగారు ఉదయమే లేచి ఆరింటికో ఏడింటికో రాసుకోడం మొదలుపెట్టేవారు. ఓ రెండు మూడు గంటలు రాసుకునేవారు. రేడియోలో ఉద్యోగం చేసేవారు. పొద్దున్న రెండు గంటలు రాసుకునేవారు. ఎక్కువగా తెల్లారగట్టే రాసేవారు. నాకు తెలిసిన చాలా సంఘటనలను ఆయన కథలుగా మలిచారు. ఆయన రాసిన కథలన్నీ కూడా ఆయన చూసినవే, అబ్జర్వ్ చేసి రాసినవే. నాకు తెలిసి చాలా సంఘటనలను మా నాన్నగారు కథలుగా రాశారు.
ప్రశ్న3: ఆయన కథలను ఎలా ఎంచుకునేవారు? మీతో ఏమయినా చర్చించేవారా? కథ రాసిన తరువాత వినిపించి అభిప్రాయాలు అడిగేవారా?
విజయసారధి:
కథలు ఎలా ఎంచుకునేవారంటే, ఆయన బాగా అబ్జర్వ్ చేసేవారు. జీవితంలో మనుషుల బంధాల మీద, ఫ్యామిలీ వ్యాల్యూస్ మీద, కుటుంబంలోని సన్నివేశాలకు, తల్లీ కొడుకుల అనుబంధం, తల్లీ తండ్రుల అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, మిత్రుల మధ్య అనుబంధం – ఇలాంటివి మా నాన్నగారు రాసేవారు. మాతో ఎక్కువగా చర్చించేవారు కాదు. మా అమ్మతో ఎక్కువగా చెప్పేవారు, ఫలానా కథ రాస్తున్నాను అని. నాన్నగారు రాసిన కథలన్నీ మా అమ్మకి తెలుసు. ముందు అమ్మకి చెప్పి, తర్వాత రాసేవారు. మా నాన్నగారు రాసిన కథల కంటే చెప్పిన కథలు ఎక్కువ ఉన్నాయని, అవన్నీ రాస్తే ఆయన జీవితం సరిపోదని ఆదివిష్ణుగారు ఓ ముందుమాటలో రాశారు. అలాగే యండమూరి వీరేంద్రనాథ్ గారు – కథ రాయడంలో నాన్నగారి నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. నేను చిన్నగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని కథలు నాకు వినిపించేవారు. అప్పట్లో నన్ను చిన్నపిల్లాడిలానే చూసేవారు. కానీ నేను ఇంటర్‍కి వచ్చాకా ఆయన కథల గురించి చెప్పేవారు. చాలా కథలలో నిజమైన సన్నివేశాలకి తన ఊహని జోడించి అద్భుతంగా రాసేవారు. అభిప్రాయాలు మా అమ్మగారిని ఎక్కువగా అడిగేవారు. లేకపోతే తోటి రచయితలని అడిగేవారు. వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళేవో ఐడియాలిచ్చేవారు. అలా చాలా కథలు రాశారు. కొన్ని రాయమని ప్రోత్సహించినా రాయలేకపోయారు, అయనకి సమయం దొరక్క.
శ్రీధర్:
పైన చెప్పినట్టు ఆయన జీవితంలో ఎదురైన సంఘటనలనే.. 90% తన కథాంశాలుగా తీసుకున్నారు. ఏదైనా సంఘటన చూసి, అబ్జర్వ్ చేసి, ఇన్‌స్పైర్ అయి కథలు రాశానని ఆయనే చెప్పారు. కథలో ఆయన కొత్తగా కల్పించాల్సిందేమీ లేదు. చూసినదాన్ని కొంచెం డెవెలప్ చేసి కథలు రాసేవారు. కథ చివర్లో ఎప్పుడూ ఒక కొసమెరుపు ఉండాలి, కథ వార్తలగా ఉండకూడదు అనేవారు. కథని కథగా చెప్పాలని, ఒక ఎమోషన్, సెంటిమెంటు వంటివి ఉండాలనేవారు.
ఆయన కథల గురించి మా అమ్మగారితో చర్చించేవారు. ఒక కథ అనుకున్నప్పుడు ఆయన పది వెర్షన్స్ రాసేవారు. ఆయన చేతిరాతతో కొట్టివేతలు లేకుండా, చక్కగా రాసేవారు. మేం పెద్దయ్యాకా, మాతో కూడా డిస్కస్ చేసేవారు. ఏ కథయినా ఆయన ముందు మా ఇంట్లో చెప్పి, అందరిని కూర్చోబెట్టి చదివి వినిపించేవారు. నా పెళ్ళయ్యాకా, మా పిల్లలకి కూడా వినిపించి వాళ్ళ అభిప్రాయాలు కనుక్కుని, అవసరమైతే చిన్న చిన్న సలహాలు తీసుకుని.. అవసరమనుకుంటేనే మార్చి రాసేవారు. మాకు జ్ఞానం వచ్చాకా, ఆయన ఏ కథ రాసినా ఇంట్లో అందరితో చర్చించేవారు. ఆ తర్వాతే కథలుగా మలిచేవారు. కథ అంటే చివరిలో ఒక కొసమెరుపు ఉండాలని చెప్పేవారు. కథ నిడివి చిన్నది కాబట్టి తప్పనిసరిగా కొసమెరుపు ఉండాలని అనేవారు. ఆయన రాసిన కథలన్నీ మాగ్జిమం హ్యుమన్ రిలేషన్స్ చుట్టూ అల్లినవే. అమ్మ, నాన్న, బంధువులు పాత్రధారులు. ప్రతీ దాంట్లోను ఒక అద్భుతమైన ఫీల్ ఉండేది. చాలా కథల్లో చివర్లో కళ్ళు చెమర్చేవి. కథలో సెంటిమెంటు అద్భుతంగా పండించేవారు.
ప్రశ్న4: ఆయన నిత్య జీవితంలోంచి కథలను ఎలా ఎంచుకునేవారు? కథలనెలా మలచేవారు?
విజయసారధి:
ఈ ప్రశ్నకి జవాబు కొంత మేర పైన చెప్పిన ప్రశ్నలోనే ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. మా మావగారు ఉన్నారు. ఆయన చనిపోయాక, కళ్ళని డొనేట్ చేశారు. మా మిసెస్ వాళ్ళ పిన్నిగారు కళ్ళ డాక్టరు. సో, మా మావగారు చనిపోగానే, కళ్ళు డొనేట్ చేయడం మంచిదని అలా చేశారు. ఈ విషయం మా నాన్నగారికి తెలిసాకా, దాని గురించి ఒక కథ రాశారు. కథ మొదట్లో తన తల్లిని తీసుకుని ఒక పెళ్ళి మండపానికి ఒక అబ్బాయి వస్తాడు. అది వాళ్ల చుట్టాల పెళ్ళి. తల్లిని అక్కడ ఉండమని చెప్పి, అతను కార్ పార్క్ చేసి వస్తానని చెప్తాడు. ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. పెళ్ళి తంతు అంతా చూస్తుంది, వధువరులని ఆశీర్వదిస్తుంది. అబ్బాయి ఇంకా రాలేదేమని అనుకుంటూ ఉంటే, కొడుకు లోపలికి వస్తాడు. ఇక్కడున్నావేంటి అమ్మా, మనం వెళ్ళాసిన పెళ్ళి ఇంకో మండపంలో అని చెప్తాడు. ఈ పెళ్ళి కూతురు పేరు – తాము వెళ్ళాల్సిన పెళ్ళి కూతురు పేరే కావడంతో ఇక్కడికి వచ్చేసాను అంటుంది. అక్కడ ముహూర్తం అయిపోయి ఉంటుంది, పద పదా అని తీసుకువెళ్తాడు. ఓ హెన్రీ గారి ముగింపులా – చివర్లో మలుపు తిప్పుతారీ కథని. గుండెకి హత్తుకునేలా మలుస్తారు. చివర్లో ఆ కుటుంబం వారి మాటల్లో తెలుస్తుంది – వాళ్ళ అబ్బాయి కళ్ళనే ఆవిడకి అమర్చారు అని. కళ్ళు దానం చేయించిన వ్యక్తి పెళ్ళికి హాజరైనందని చెప్తారు. నీ పెళ్ళి కళ్లారా చూద్దామని అన్న వాక్యం చుట్టూ అల్లిన కథ ఇది. ఇలాంటివి చాలా రాశారు.
శ్రీధర్:
నిత్య జీవితంలోంచి కథలు ఎలా ఎంచుకునేవారన్నది పైన చెప్పాను. ఆయన రాసిన కథలన్నీ నిత్య జీవితంలోంచి వచ్చినవే. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎదురుగా ఒక కుటుంబం కలిసింది. దాని మీద ఒక కథ రాశారు. తర్వాత ఆయన అమెరికా వెళ్లొచ్చారు. అక్కడ కొడుకులు, కోడళ్ళని కలిసినప్పుడు వాళ్ళ అభిమానాలు మీద కథలు రాశారు. అంటే ఒక సంఘటన చూసి దాన్ని కథగా మలిచేవారు. అలాగా ప్రతీ కథా అయన నిత్య జీవితం లోంచి పుట్టిన కథే. ఎన్నెన్నో కథలు.. ఏ విధంగా చూసినా ప్రేరణ నిత్య జీవితం నుంచే. ఒకసారి ఆయనకి ఒక పది రూపాయల నోటు దొరికింది. దాని మీద ఒక కథ రాశారు. అలాగ ఆయన రాసిన కథలన్నీ నిత్య జీవితంలోంచి పుట్టినవే. ప్రతీ కుటుంబంలో జరిగే కథలే అవి.
ప్రశ్న5: ఆయన రాసిన కథల్లో మీరేకథలోనయినా పాత్రగా కనిపించారా? ఏ కథ?
విజయసారధి:
మా నాన్నగారి చాలా కథల్లో మా అమ్మ గాని, నేను గాని లేక మా తమ్ముళ్ళు గాని నలుగురం పాత్రలుగా కనబడుతూ ఉంటాం. చాలా వాటిల్లో. కొన్నిట్లో డైరక్టుగా మా పేర్లు పెట్టే రాశారు. ఒకటి గుర్తుస్తోంది ‘పిచ్చితండ్రి’ అనే కథ. 1994లో నేను అమెరికా వచ్చినప్పుడు – అప్పటికే మా తమ్ముడు అమెరికా వెళ్ళిపోయి ఉన్నాడు. నేను వెళ్తున్నప్పుడు – సాగనంపటానికి ఆయన ఊహించిన విషయమన్న మాట. ఆ కథలో నా పేరే పెట్టారు. కొడుకు అమెరికా వెళ్తుంటే తండ్రి బాధ పడతాడు. వాడిని పంపించడం ఇష్టం లేదన్న మాట. అందువల్ల ఎయిర్‍పోర్టుకి రాడు. అర్జెంటుగా ఏదో పని వచ్చింది, రాలేకపోతున్నాను అని చెప్పి, వెళ్ళడు. కొడుకు అమెరికా చేరిన వారం తరువాత ఫోన్ చేస్తే తల్లి చెప్తుంది – ఆరోజు ఆయన ఎక్కడికీ వెళ్ళలేదని, గుడికి వెళ్ళి కూర్చున్నారు, నువ్వు వెళ్తుంటే చూడ్డం ఆయనకి ఇష్టం లేదు అని చెప్తుంది. ముగింపులో అవును నేను పిచ్చితండ్రినే. వీడికి పెళ్లయి పిల్లవాడు పుట్టాకా, ఆ పిల్లవాడు వెళ్ళినప్పుడు వీడికి తెలుస్తుంది ఆ బాధేంటో అని అంటారు. అలాగే ‘అమ్మకో ముద్దు’ అని ఒక కథ రాశారు. అమెరికాకి వెళ్ళిన పిల్లలు తల్లిని ఎంత బాగా చూస్తారనే విషయం మీద ముగ్గురు పిల్లల గురించి రాసిన కథ ఇది. ఈ కథ చాలా ఫేమస్ అయింది. ఇంకో కథ ‘గోడ’ అని రాశారు. మేం ఇంటర్ చదువుతున్నప్పుడు మా ఇంటికి చిన్న పిట్ట గోడ ఉండేది. సాయంత్రం పూట ఐదు గంటల నుండి ఫ్రెండ్స్ తో కలిసి రాత్రి తొమ్మిందింటి వరకూ ఆ గోడ దగ్గర కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్లం. ఏడు-ఏడున్నరకి ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ నాన్నగారు మాకేసి సీరియస్‍గా చూసుకుంటూ వెళ్ళేవారు. మేం టైం వేస్ట్ చేస్తున్నామని అనుకునేవారేమో. దాని గురించి ఈ కథ రాశారు. అయితే మా ఫ్రెండ్స్ అంతా చక్కని పొజిషన్లలో ఉన్నాం. ఈ కథలో నా పేరు, మా ఫ్రెండ్ పేరు కూడా ఉంటుంది. ఇలా చాలా కథల్లో నేను ఉంటాను, మా అమ్మ ఉంటుంది.
శ్రీధర్:
ప్రశ్న6: ఆయన రాసిన కథల్లో మీకు నచ్చిన కథ ఏది? ఎందుకు?
విజయసారధి:
నాకు చాలా చాలా నచ్చిన కథ ‘గుడిలో పువ్వు’. పైన చెప్పినట్టు మేం భద్రాచలం వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అధారంగా రాశారు. ఒక పువ్వు తోటలో పుడుతుంది. మామూలుగా తోటమాలి తెచ్చిన పూలని పూజారి రాములవారికి వేస్తారు. ఒక పువ్వు మాత్రం పుడుతూనే వడలిపోయినట్టుగా పుడుతుంది. వడలిన పువ్వు పక్కన ఉన్న మిగతా పూలని కూడా మనం కొయ్యం సాధారణంగా. ఆ పువ్వు పడే బాధని, వేదనని తీసుకుని కథ రాశారు. ‘పుష్పవిలాపం’ కంటే అద్భుతంగా అనిపిస్తుంది నాకు. కరుణశ్రీగారిది పద్యమైతే, నాన్నగారిది వచనం. ఇక్కడ తోటలో పుట్టాను అని మొదలుపెడ్తుంది ఆ పువ్వు. అదృష్టవశాత్తు, తోటమాలి మిగతా పూలతో పాటు ఆ పువ్వుని కూడా కోసుకెళ్తాడు. ఆ పువ్వు చాలా ఆనందిస్తుంది. మాలలు కట్టేడప్పుడు దాన్ని మాలలో చేరుస్తాడు. అమ్మయ్య, నేను దేవుడి దగ్గరకు వెళ్తున్నాను అని ఆ పువ్వు అనుకుంటుంది. కానీ ఎవరూ ఈ పువ్వు ఉన్న మాలని కొనరు. మిగతా పూలన్నీ దాన్ని తిడతాయి. అలాగే ఆ పువ్వు పడే వ్యథని గొప్పగా చిత్రించారు. దాని తర్వాత అదృష్టవశాత్తు ఆ దండని ఎవరో కొని పూజారికి ఇస్తారు. కానీ బలహీనంగా ఉండడం వల్ల ఆ పువ్వు జారి కిందపడిపోతుంది. బాధపడినా, దేవుడి సన్నిధిలో పడ్డానని ఆనందిస్తుంది. ఇంతలో పూజారి వచ్చి కింద పడిన పువ్వుని తీసి, మిగతా పూలతో పాటు రాముడికి అర్పిస్తాడు. ఆ పువ్వు పరవశించిపోతుంది. ఈ కథని మా నాన్నగారు ఎలా చెప్పారంటే, ఆ రోజు పండుగ – పూజలన్నీ అయిపోయాకా, రాములవారు సీతమ్మతో గోదావరి తీరంలో నడుస్తూ నీకో కానుక ఇస్తాను అని చెప్తున్నటు రాశారు. సీత మురిసిపోతుంది, ఎప్పుడూ లేనిది ఈరోజు కానుక ఇస్తున్నారంటూ. ఏ వజ్రాల హారమో అని అనుకుంటుంది. కానీ రాముడిచ్చినది ఈ వడలిపోయిన పువ్వు. ఇదేంటి ఈ పువ్వునిచ్చారు అని సీత అడిగితే, ఇది మామూలు పువ్వు కాదు సీతా అని – ఈ కథంతా చెప్తాడు రాముడు. పరవశించిన ఆ పువ్వు తనకి మోక్షం కావాలని కాకుండా, తనని రాముని పాదాల వద్దకి చేర్చిన పూజారి ఆనందంగా, హాయిగా, ఆయురారోగ్యాలతో ఉండేట్లు చూడు స్వామీ అని కోరిందని చెప్తాడు రాముడు. ఈ కథ నాకు చాలా చాలా ఇష్టం.
శ్రీధర్:
మా నాన్నగారు రాసిన కథల్లో నాకు బాగా నచ్చిన కథ ‘గుడిలో పువ్వు’. ఆయన, మా అమ్మగారు ఒకసారి భద్రాచలం వెళ్ళినప్పుడు – దర్శనానికి క్యూలో వెడుతున్నప్పుడు ఒక పువ్వు కింద పడి కనిపించిందట. దాన్ని కొందరు తొక్కుతూ వెళ్ళిపోయారట. దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయిన మా నాన్నగారు ఇంటికొచ్చాకా, ఒక అద్భుతమైన కథ రాశారు ‘గుడిలో పువ్వు’ అని. అంటే ఆ పువ్వుని తోటలోంచి కొయ్యడం, అది వాడిపోయిన పువ్వు కావడం, మొత్తానికి ఏదో దండలో పెడతారు, పండుగ రోజున రాముడికి వెయ్యాలనుకుంటారు. ఒక భక్తుడు ఆ దండని తీసుకుని వెళ్తే, గుడిలో ఆ పువ్వు జారిపోతుంది. లైనులో మరో భక్తుడు చూసి ఆ పువ్వుని పూజారికిస్తే, రాముడి దగ్గర పెడతారన్న మాట. ఇది social part of the story..
ఈ పువ్వు మీద కథ నిజానికి – శ్రీరాముడు, సీత పండుగ రోజున గోదావరి తీరంలో విహరిస్తూండగా ప్రారంభిస్తారు.. రాముడు ఈ పువ్వుని సీతకిస్తాడు. ఇది చాలా ముఖ్యమైనది అని చెప్తే, ఎలా అని సీత అడుగుతుంది. అప్పుడీ కథంతా శ్రీరాముడు చెప్తాడు. ఈ పువ్వుని నా దగ్గరకు చేర్చిన భక్తుడికి సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు కలగాలని దీవించమంటుంది సీత. Extraordinary గా ఉంటుందీ కథ. ఆ పువ్వు వర్ణన, ఆ పువ్వు వేదన.. చదువుంటే బాగుంటుంది. ఇలా, ఓ చిన్న సంఘటనని చూసి ఆయన దాన్ని ‘గుడిలో పువ్వు’ అనే కథగా మలిచారు. నాకు ఇది one of the best stories. చాలామంది చెప్పారు, వాళ్ళకి కూడా ఈ కథ బాగా నచ్చిందని. కళ్ళలో నీళ్ళొస్తాయి మనకి.
ప్రశ్న7: మీ నాన్నగారికి సాహిత్య ప్రపంచంలో ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు లభించిందంటారా? లేకపోతే, ఎందుకని?
విజయసారధి:
లభించిందనే అనుకుంటాను. కానీ మా నాన్నగారు అవార్డుల వెంట, సన్మానాల వెంట ఎక్కువగా వెళ్ళలేదు. పోటీలకు మాత్రం కథలు పంపించేవారు. చాలా పోటీలలో ప్రైజులు వచ్చాయి. కథల సంపుటులు కూడా చాలా ప్రచురించారు. కానీ ఏమిటంటే, ‘వందేళ్ళ కథ’ వంటి సంకలనాలలోనో, లేదా ప్రముఖుల కథల పుస్తకాలలోనో – ఏ ఒక్క దాంట్లోనూ నాన్నగారి కథలకి చోటు ఎందుకు దక్కలేదో అర్థం కాదు. అయినా మా నాన్నగారికి చాలా గుర్తింపు లభించిందనే అంటాను. నాన్నగారికి సాహిత్య ప్రపంచంలో కన్నా, ఆలిండియా రేడియోలో స్క్రిప్ట్ రైటర్ గాను, ఎన్నో సాహిత్య ప్రక్రియల్లో పాల్గొన్నవ్యక్తిగా అక్కడ గుర్తింపు, పేరు ఎక్కువ వచ్చాయి. సాహిత్య ప్రపంచంలో మాత్రం ఓ కథకుడిగా గుర్తిస్తారు. చాలా మంచి కథలు రాస్తారు అని పేరు ఉంది. కథా ప్రపంచంలోని ప్రముఖులందరూ.. గొల్లపూడి మారుతీరావు గారు, పెద్ద పెద్ద వాళ్ళంతా గుర్తింపు ఇచ్చారు. అయితే గత పది-పదిహేనేళ్ళలో.. రకరకాల టాపిక్స్‌తో వచ్చిన సంకలనాలలో మాత్రం నాన్నగారి కథలు లేకపోవడం కొద్దిగా బాధనిపిస్తుంది. నాన్నగారు ఎక్కువ లైమ్‍లైట్‍లో లేకపోవడం, ఎక్కువగా ఎవరితోనూ కలవకపోవడం వల్ల అవి రాలేదని అనుకుంటున్నాను.
శ్రీధర్:
మా నాన్నగారికి గుర్తింపు అంటే.. చాలానే వచ్చినట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత నలభై ఏళ్ళలో కథా రచయితగా ఆయన చాలా పాపులర్ అయ్యారు. రాఘవేంద్రరావు గారు, జంధ్యాల గారు, యండమూరి గారు, ఇంకా ఎంతో మంది రచయితలు, సినీ ప్రముఖులు, ఎన్నో అసోసియేషన్సు నాన్నగారిని ఎంతో గౌరవిస్తారు. కథ రాయడం ఎంతో కష్టం, అలాంటిది ఒక జానర్.. సెంటిమెంట్ మీద జీడిగుంట రామచంద్రమూర్తి రాసినట్టు ఎవరూ రాయలేరు, అందరూ నవలలు, సీరియల్స్, కామెడీల మీద వెళ్ళిపోతారు. చిన్న కథని రెండు మూడు పేజీలలో రాసి దాన్ని మెప్పించి చివర్లో కంట్లో చెమ్మ వచ్చేట్టు చూసి.. ఎమోషన్, ఫ్యామిలీ బాండింగ్స్ తో ఉండే కథలు మీరెలా రాస్తారు, మీరు చాలా గ్రేట్ అని అందరూ మెచ్చుకునేవారు. ముఖ్యంగా డా. రావూరి భరద్వాజ గారితో ఆలిండియా రేడియోలో మా నాన్నగారు పని చేసే రోజుల్లో ఆయన నాన్నగారిని చాలా మెచ్చుకునేవారు. మా నాన్నగారు ఆకాశవాణిలో పనిచేయడం వల్ల ఎంతోమంది కథలను రేడియోలో ప్రసారం చేశారు. సో, డెఫినెట్‍గా ఆయనకి మంచి గుర్తింపు ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తూ, కథలు రాసేవారు. సినిమా ఫీల్డుకి వెళ్ళి ఉంటే ఎలా ఉండేదో నాకు తెలియదు గానీ, but as it is గా ఆయన 15-20 పుస్తకాలు వేశారు. సుమారు 500 కథలు రాశారు. టీవీకి, రేడియోకి, నాటకాలకు ఎన్నో రాశారు. ఈ రోజుకి జీడిగుంట శ్రీధర్ అంటే జీడిగుంట రామచంద్రమూర్తి గారి అబ్బాయి అనే అంటారు. మంచి గుర్తింపు ఉన్నట్టే లెక్క.
ప్రశ్న8: ఇంకా వెలుగు చూడని రచనలేవయినా వున్నాయా? వాటిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?
విజయసారధి:
మా నాన్నగారు రాసినవి చాలా వరకు ప్రచురించారు. నిజానికి చనిపోయేముందు.. ఆయన కోవిడ్‍తో చనిపోయారు.. కోవిడ్ పైన ఒక కథ రాశారు. అది అప్పటికి ప్రచురణ అవలేదు. తరువత ఆ కథని కౌముది అంతర్జాల పత్రికలో ప్రచురించారు. నాన్నగారు అందులో ఒక మిత్రుని మరణం గురించి రాశారు. చాలా సన్నిహిత మిత్రుడు మరణిస్తే మిగిలిన ఇద్దరు మిత్రులు వెళ్ళలేకపోతారు కోవిడ్ పుణ్యమా అని. దాన్ని కథగా రాశారు నాన్నగారు. మా నాన్నగారి మరణం కూడా అలాగే సంభవించింది. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను, మా తమ్ముళ్ళిద్దరూ, మా మదర్ తప్ప పక్కన ఎవరూ లేరు.
మా నాన్నగారి అన్ని రచనలని ఒక పెద్ద వాల్యూమ్‌గా.. ఐదారు భాగాలుగా చెయ్యాలని సంకల్పం అయితే ఉంది. చూడాలి. వాటిని వెలుగులోకి తేవడానికి ఆ దేవుడు మాకు సహాయం చేస్తాడనే భావిస్తున్నాం. నాన్నగారి అన్ని రచనలు – సితారకి రాసిన వ్యాసాలు, కథలు,.. అనేక రచనలన్నింటిని సమగ్ర సాహిత్యంగా తేవాలని ప్రయత్నిస్తాము.
శ్రీధర్:
ఇక వెలుగు చూడని రచనలంటే.. ఆయన కరోనా వల్ల స్వర్గస్థులయ్యారు. ఆ టైమ్ లోనే కరోనా మీద ఒక కథ రాశారు. అది ఆయన చనిపోయాకా, ప్రచురితమైంది. ఇంకా ఎన్నో వ్యాసాలు, కవితలు లాంటివి ఉన్నాయి. అవన్నీ భవిష్యత్తులో పుస్తక రూపంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఆయన రచనలని షార్ట్ ఫిల్మ్స్ గానూ, టెలీఫిల్మ్స్ గాను చేయాలని ఆలోచన నాకుంది. వెలుగు చూడనివి ఎక్కువేం లేవు, కాని చిన్నచిన్నవి ఉన్నాయి. ఒక ఐదారు కథలు మాతో చర్చించినవి, మరికొన్ని కథలు ఉన్నాయి. ఆ కథలతో భవిష్యత్తులో నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను. ఇప్పుటి జనరేషన్‍కి అవి తప్పుకుండా మంచిగా నప్పుతాయనే అనుకుంటున్నాను. కుటుంబం, బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు.. ఇలాంటి వాటి మీద ఉంటాయి కాబట్టి వాటిని షార్ట్ ఫిల్మ్స్‌గా చేయాలని నా కోరిక. నాన్నగారి రచనలన్నీ ఒక సమగ్ర పుస్తకంగా తేవాలని కోరిక.
***
సంచిక పాఠకుల కోసం మీ నాన్నగారి సాహిత్యం గురించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు.
విజయసారధి:
నాన్నగారి సాహిత్యం గురించి మమ్మల్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసినందుకు మీకు మా ధన్యవాదాలు.
శ్రీధర్:
ధన్యవాదాలు మురళీ గారు అండ్ సంచిక టీమ్.
సంచిక కోసం మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సమాధానాలిచ్చినందుకు ధన్యవాదాలు