[box type=’note’ fontsize=’16’] వికారి నామ సంవత్సర ఉగాది నాడు ‘క్రీడాకథ’ పుస్తకం విడుదల సందర్భంగా Myind Media ప్రతినిధి – శ్రీ కస్తూరి మురళీకృష్ణగారితో జరిపిన ఇంటర్వ్యూ. క్రీడాకథ సంకలనం గురించి, సంచిక వెబ్ పత్రిక గురించి కస్తూరి మురళీకృష్ణగారు పలు విషయాలు వివరించారు. [/box]
నమస్కారం మురళీకృష్ణ గారు. ముందుగా Myind Media తరఫున ఉగాది శుభాకాంక్షలు.
మీకు కూడా వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఈ ఉగాదికి సంచిక వెబ్ పత్రిక వచ్చి సరిగ్గా సంవత్సరం అవుతోంది. అసలు ఈ పత్రిక ఆరంభించడంలో ఉద్దేశం ఏంటి?
క్రితం ఉగాది రోజున మేము సంచిక పత్రికని ఫార్మల్‌గా ప్రారంభించాము. ఉగాది ప్రత్యేక సంచిక వెలువరించాము. సంచిక వెబ్ పత్రిక ప్రారంభించడంలో ఉద్దేశం ఏంటంటే – ప్రస్తుతం తెలుగు పత్రికా ప్రపంచంలో గాని, సాహిత్య రంగంలో గాని ఒక లోటు ఉంది. ఆ లోటు ఏమిటంటే – పాఠకులకి ఇవే కావాలి, పాఠకులు ఇవే చదువుతారు, ఇలాంటివే ఉత్తమ కథలు, ఇలాంటివే ఉత్తమ రచనలు అని కొందరు తమ చుట్టూ గిరి గీసుకుని తెలుగు సాహిత్యాన్ని సంకుచితం చేస్తున్నారు. మీరు గమనిస్తే తెలుగులో ఇప్పుడు పత్రికలే లేవు, ఒక రెండు మూడు తప్పించి. ఇలాంటి పరిస్థితులలో సంచిక ఆరంభించడంలో ఉద్దేశం ఏంటంటే – తెలుగు పాఠకులు ఉన్నారు, తెలుగు చదివేవారు ఉన్నారు. వారి ఆసక్తిని గమనించి ఆసక్తికరమైన రచనలు వారికి అందిస్తే తెలుగు పాఠకుల సంఖ్య పెరుగుతుంది, తెలుగు పత్రికలు విజయవంతంగా నడుస్తాయి అని నిరూపించడం! ఈ ఉద్దేశంతో పాటు మరొక ప్రధాన లక్ష్యం ఏంటంటే అనేక కారణాల వల్ల తెలుగు కథ కాని, తెలుగు రచనలు కాని వాటి పరిధి చాలా సంకుచితమైందన్న మాట. సంకుచితం చేశారు. అలా కాకుండా, తెలుగు రచయితలు వస్తు వైవిధ్యంలో గాని, వస్తు వైచిత్రిలో గాని లేకపోతే వస్తు విస్తృతిలో గాని, శైలి వైవిధ్యంలో గాని అనేకానేక ప్రయోగాలు చేస్తూ విభిన్నమైన రచనలు రచిస్తున్నారు. ఆ రచనలకి ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో క్రితం ఉగాది రోజున సంచిక పత్రికని ప్రారంభించాం.
అందుకే మీరు గమనిస్తే, ఉన్నతమైన ఆలోచనలకు ఆహ్వానం అనేది సంచిక యొక్క మోటో. ఆనో భద్రః క‌్రతవో యంతు విస్వతః అనేది ఒక వేద సూక్తి. దాని ప్రకారం ఉన్నతమైన అన్ని ఆలోచనలకు ఆహ్వానమన్న మాట. అంటే మనకు సంకుచితాలు లేవు. ఒక ఐడియాలజీనో, ఒక ఇజమో, లేకపోతే ఒక ప్రాంతమో, కులమో మతమో, ఇలా ఎలాంటి సంకుచితాలు లేవు మనకి. అందమైన ప్రతి అక్షరానికి ఆహ్వానం పలుకుతున్నాం. మీరు గమనిస్తే, సాధారణ పత్రికల్లో ఛందోబద్ధమైన పద్యాలు కనబడవు. సంచికలో మాత్రం ఛందోబద్ధ పద్యాలు వేస్తున్నాం, ఖండకావ్యాలు వేస్తున్నాము. కోవెల సుప్రసన్నాచార్య గారు రచించిన ‘అశ్రుభోగ’ అనే ఖండకావ్యం సంచికలో సీరియలైజ్ అయింది. ఇటీవలే పుస్తక రూపంలో కూడా విడుదలైంది. ఇవి కాక, నాటకాలు. పత్రికల్లో నాటకాలు కూడా కనిపించవు. కాని సంచికలో నాటకాలు ఆహ్వానిస్తున్నాం, నాటకాలను ప్రచురిస్తున్నాం. కశ్మీరీ పండితుల దీనగాథని ఆవిష్కరించిన ఒక హిందీ నాటకం యొక్క తెలుగు అనువాదం త్వరలో సంచికలో ప్రచురితమబోతోంది. ఇట్లా పద్యాలు, కవితలు, కథలు… సాధారణ పత్రికలు కొన్ని రకాల కథలనే స్వీకరిస్తాయి, అలా కాకుండా, కథ బావుంటే, దానిలోని అంశం వివాదాస్పదమైనా సంచిక స్వీకరిస్తుంది, ప్రచురిస్తుంది. దాని మీద చర్చని పాఠకులకే వదిలివేస్తుంది. అంతేగాని ఈ కథ రాయకూడదు, ఇలాగే రాయాలి అనే ఎటువంటి నియమ నిబంధనలు లేవు, నిడివి నిబంధన కూడా లేదు. సంచికలో రచయితలకు ఉన్న నిబంధన ఏమిటంటే భాష పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉండాలి, వ్యక్తిగత విమర్శలు, నిందలు ఉండకూడదు. రచనల్లో ఏదైనా ఆరోపణలు చేస్తే, వాళ్ళు అందుకు తగిన ఆధారాలు చూపించాలి. అలాంటి రచనలనే సంచికలో ప్రచురిస్తాము. ఈ రకంగా కొన్ని ప్రామాణికాలు నిర్ణయించుకుని ఒక పద్ధతి ప్రకారం సంచిక తెలుగు పాఠక లోకంలో ప్రవేశించింది. సంచిక ప్రతీ సంచిక విడుదలయ్యేడప్పుడు మేం కొన్ని పదాలు వాడుతాం.. ఉదయించే బాలభానుడి అరుణ కిరణాల మీద నృత్యమాడుతూ సంచిక వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడుతోందని! సూర్యకిరణాలు ఎంత స్వచ్ఛమైనవో, సూర్యకిరణాలు జగతికి ఎలా వెలుగు పంచుతాయో…, సూర్యకిరణాలు ఎలా ఒక నూతన దినానికి ఆరంభం పలుకుతాయో అలా సంచిక కూడా తెలుగు సాహిత్య ప్రపంచంలో స్వచ్ఛమూ, సంస్కృతీముఖము, ఔచిత్యమంతము, సంప్రదాయబద్ధము ఐనటువంటి అనేక రచనల ద్వారా తెలుగు సాహిత్య ప్రపంచానికి ఒక నూత్నమైనటువంటి దిశను, దశను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నదని సింబాలిక్‌గా చెప్పడమన్నట మాట. సూర్యకిరణాలతో సంచిక ఆరంభమవుతుంది, అంటే రోజు ప్రారంభమన్నమాట. మాములుగా మనకి రాత్రి పన్నెండు తర్వాత కొత్త రోజు వస్తుంది, కానీ సాంప్రదాయ బద్ధంగా అయితే, సూర్యోదయంతో రోజు ప్రారంభం అవుతుంది. మరుసటి సూర్యోదయం దాకా ఆ తిథి ఉంటుంది. ఆ తర్వాతే తిథి మారుతుంది. ఇవన్నీ మన లెక్కలు. దీని ప్రకారం సంచిక అప్‌లోడ్ అవడం కూడా సూర్యకిరణాలతోటే అవుతుంది.
సంవత్సరం పాటు సాగిన సంచిక ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే – సంచికలో పొత్తూరి విజయలక్ష్మి గారి సీరియల్ వచ్చింది, బలభద్రపాత్రుని రమణి గారి సీరియల్ అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. వేటూరి ఆనంద్ అనే 35 ఏళ్ళ రచయిత సీరియల్ వస్తోంది. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రచయితలందరూ యాభై యాభై ఐదేళ్ళ వయసు పైబడినవారే. తెలుగు సాహిత్య ప్రపంచంలో యువరచయితలు తక్కువ. అందుకని ఇలాంటి యువ రచయితలకు ప్రోత్సాహమివ్వడం సంచిక మరో ప్రధాన లక్ష్యం. మీరు గమనిస్తే 83 ఏళ్ళ చావా శివకోటి గారి సీరియల్ వచ్చింది, 35 ఏళ్ళ ఆనంద్ వేటూరి సీరియల్ వచ్చింది. రెండూ ఒకేసారి సంచికలో ప్రారంభమయ్యాయి. వీళ్ళు రెండు విభిన్న తరాల ప్రతినిధులు. ఈ రకంగా అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల ప్రజలకు, బాలలకు, సినిమాలంటే ఇష్టమున్న వారికి, సాహిత్యం ఇంట్రస్ట్ ఉన్నవాళ్ళకి డ్ర్రామాలు, పద్యాలు, కవితలు… అన్నీ సంచికలో లభిస్తాయి. ఎలాగైతే అన్ని రకాల రచనలకు ఆహ్వానం పలుకుతున్నామో, అలాగ అందరు పాఠకులకి అవసరమైనవి ఇస్తూ సంచిక పాఠకులను పెంచుకుంటోది. ఇలా ఒక సంవత్సరం పూర్తయి రెండవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము.
ఏడాది కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు అభినందనలండీ. ఈ వెబ్ పత్రిక కథా సంకలనాల ప్రచురణలోకి ఎందుకు వచ్చిందో చెబుతారా?
సాహిత్య ప్రపంచంలో అత్యంత ఆవశ్యకమైన విషయాలలో ఇది కూడా ఒకటి. సంచిక అనేది కేవలం ఒక పత్రికలాగా ప్రచురించి, పాఠకులని ఆకట్టుకుని నడవడం కోసం కాదు. సంచికకు ఒక దీర్ఘ కాల ప్రణాళిక ఉంది. సుదీర్ఘమైన ప్రయాణంలో ఒక ఉన్నతమైన లక్ష్యం ఉంది. ఇదేమిటంటే తెలుగు సాహిత్య ప్రపంచంలో సాహిత్య మాఫియా ముఠాల లాగా ఏర్పడి కొందరు – ఒక ఐదు కేటగిరిలు ఉన్నాయి, ఈ ఐదు కేటగిరీల వారి రచనలకే ప్రాధాన్యమిస్తూ ఇవే ఉత్తమ రచనలు, వీళ్ళే ఉత్తమ రచయితలు, రచనలు ఇలాగే చేయాలి అని కొన్ని నిర్ణీతమైనటు వంటి, నిర్దిష్టమైన పరిధులు విధించేశారు. అంతే కథ లేదా సాహిత్యం అనే దాని చుట్టూ ఒక ముళ్ళ కంప వేసి కోటకట్టేసి, ఇక బయటవేవీ అడుగుపెట్టకుండా చేశారన్న మాట. సో, ప్రధానంగా దాన్ని వ్యతిరేకిస్తూ, సాహిత్యమనేది – ఒక డిటెక్టివ్ కథా సాహిత్యమే, ఒక హారర్ కథా సాహిత్యమే, ఒక హాస్య కథా సాహిత్యమే, శృంగార కథా సాహిత్యమే, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను ప్రతిబింబించేదీ సాహిత్యమే. సాహిత్యమనే ఇంద్రధనస్సులో ఇవన్నీ సప్తవర్ణాలన్నమాట. ఈ వర్ణాలన్నీ కలిస్తేనే ఇంద్రధనస్సు పూర్తవుతుంది. అలాంటి సాహిత్యాన్ని మనం ఒకరంగునే చూపిస్తూ, మిగతా రంగులేవీ సాహిత్యం కాదని అణచివేస్తే, సాహిత్యం సంకుచితమైపోయి వికృతమవుతుంది. సాధారణంగా పాఠకులు కోరుకునేవి సాహిత్యంలో లభించకపోతే, వారు సాహిత్యానికి దూరమవుతారు. ఈ రకంగా తెలుగు పత్రికలకు పాఠకులు కూడా తగ్గుతున్నారు. పాఠకులు తగ్గుతున్నారు కాబట్టి పత్రికలూ తగ్గుతున్నాయి. ఈ రకంగా రచయితలకు ఉత్సాహమిస్తూ, అన్ని రకాల రచనలకి ప్రోత్సాహమిస్తూ రచన అనేది ఏదైనా సాహిత్యమనే మహాసాగరంలో ఒక నీటి బిందువు లాంటిది. ఇది కావాలి, ఇది వద్దు, ఇది రాయాలి, ఇది రాయకూడదు అనేటు వంటి పరిమితులు, పరిధులు, నియమ నిబంధనలు లేకుండా సాహిత్యాన్ని స్వేచ్ఛగా సృజించేటువంటి ఒక వాతావరణం రచయితలకి కల్పించాలని సంచిక ప్రారంభించాం. అయితే అది సరిపోదు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సంకలనాలు చేస్తున్నారు. మీరు గమనిస్తే ఈ సంకలనాలు ఎవరు చేస్తున్నారో చెప్తే, ఆ సంకలనాలలో ఏయే రచయితల కథలు ఉంటాయో చెప్పచ్చన్న మాట. అంటే ఇప్పుడు సంకలనాలు కథా రచయితల పేరుతో జరుగుతున్నాయి తప్పించి కథ పేరుతో జరగడం లేదు. ఇప్పుడు ఉత్తమకథ సంవత్సరం అని వస్తాయి, నేనంటాను సంవత్సరీకాలు పెడుతున్నారని! వాళ్ళు సంవత్సరం సంవత్సరం ప్రచురిస్తుంటారు. వ్యంగ్యంగా సంవత్సరీకాలు పెడుతున్నారని అంటాను. అది ఎవరు చేస్తున్నారో మనకు తెలుసు కాబట్టి, ఎలాంటి కథలుంటాయి, ఏయే కథలుంటాయో… ప్రచురణ కాకముందే ఊహించవచ్చన్నమాట. అక్కడ కథతో సంబంధం లేదు, వాళ్ళ ఐడియాలజీతోటి, రచయితలతోటి సంబంధం.
మరో రకం సంకలనాలున్నాయి. వాళ్ళు, వాళ్ళ మిత్రులు, వాళ్ళకిష్టమైన వాళ్ళు రాసినవి… ఇక్కడ కూడా రచయిత సంబంధమే గాని కథకి సంబంధం లేదు, సాహిత్యం సంబంధం లేదు. ఇక మరికొందరు ఏం చేస్తారంటే రచయితల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి సంకలనాలు వేస్తున్నారు. నేను డబ్బిచ్చినప్పుడు, నా ఇష్టమైన కథ ఇస్తాను తప్పించి, అప్పడు సంపాదకుడికి క్వాలిటీ కంట్రోల్ ఉండదు. డబ్బులిచ్చిన వాడి కథ వస్తుంది. ఈ రకంగా తెలుగు సాహిత్యంలో వాళ్ళు వేస్తున్న సంకలనమే సంవత్సరం సంవత్సరం వస్తోంది కాబట్టి దానికి ప్రామాణికం వచ్చి, ప్రతీ వాళ్ళు ఆ వైపు వెళ్ళి, అలాంటి కథలు రాయాలి, అలా పేరు సంపాదించాలని అని ప్రయత్నిస్తుండడంతోటి సాహిత్యం దెబ్బ తింటోంది. అందుకని సంచిక ఇటు కథల సంకలనాలు వెయ్యాలని కూడా సంకల్పించింది. అయితే కథా సంకలనాలు వేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలుగు కథకులు అనేక విభిన్నమైన రచనలు చేస్తున్నారు. వారి వస్తువు కేవలం అణచివేతకో, దోపిడికో, గ్లోబలైజేషన్‌లో ఉన్నటు వంటి దుష్పరిణామాలు చూపించడానికో లేక ఫెమినిజంకో, ఇలాంటి ఉద్యమాలకో పరిమితం కావడం లేదు. వాళ్ళు మానవ జీవితంలో ఉన్నటువంటి అనేక సంవేదనలను, ఆవేదనలను; అనేక చిత్ర విచిత్రమైన సందర్భాలను వాళ్ళు తమ రచనల్లో ప్రతిబింబిస్తున్నారు. కానీ ఇలా ‘pick and choose’ వల్ల అంటే రచయితని బట్టి ఎంచుకుని సంకలనాలు వేసి, వాటి గురించే మాట్లాడుతూ, వాళ్ళకి ప్రామాణికత కల్పించడం వల్ల ఇలాంటి అనేక రచనలు మరుగున పడుతున్నాయి, రచయిత కూడా డిజప్పాయింట్ అయి రాయడం మానేస్తున్నారు లేదంటే ఏది రాస్తే పేరొస్తుందో అలాంటివి… కన్‌విక్షన్… నమ్మకం లేకుండా అలాంటివి రాస్తున్నారు. ఇది సాహిత్యాన్ని దెబ్బ తీస్తోంది.
సంకలనాలు ప్రచురిస్తే, రచయిత ఆధారంగా కాకుండా, రచన ఆధారంగా సంకలనాలు చేస్తే అనేక రకాలైన రచనలు వెలుగులోకి వస్తాయి, రచయితలకి ఊపొస్తుంది, ఇన్ని రకాల కథలున్నాయని పాఠకులకి తెలుస్తుంది. ఈ ఉద్దేశంతో సంచిక కూడా సంకలనాలను ప్రచురించాలని ఒక నిర్ణయం తీసుకుంది.
దీనికి ఊపెక్కడ లభించిందంటే, మేము దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్‌ఓ ఇచ్చిన ప్రోత్సాహంతో రూపొందించిన రైలు కథలు అనే సంకలనం వేశాము. ఆ రైలు కథల సంకలనం విస్తృతమైన ప్రచారం పొంది చాలా బాగా పాఠకుల్ని చేరింది. దాంతో సంచిక తరఫున ఏ సంకలనం చేస్తే బాగుంటుందా ఆని ఆలోచిస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలొచ్చాయి. ఇంతలో మాకు తెలుగులో దేశభక్తి కథలు లేవని అనిపించింది. మైనారిటీ కథలున్నాయి, దళిత కథలున్నాయి, ప్రాంతీయ కథలున్నాయి… ఇలాగ రకరకాల కథలున్నాయి. స్త్రీ ఉద్యమ కథలున్నాయి. రైతుల కథలున్నాయి, చేనేత కార్మికుల కథలున్నాయి, తెలుగులో దేశభక్తి కథలు లేవు. అంటే కథలు రాశారు రచయితలు, కాని వాటి సంకలనాలు లేవు. కాబట్టి దేశభక్తి కథల సంకలనం వేస్తే, అసలు దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి అంటే భౌగోళిక పరిమితమా? జండాకే పరిమితమా? భారత్ మాతా కీ జై అనడానికే పరిమితమా? క్రికెట్ మ్యాచ్‌లప్పుడు చప్పట్లు కొట్టడానికే పరిమితమా? లేదంటే ఎవరైనా మనకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని పాకిస్తాన్‍కి వెళ్లిపో అనడానికి పరిమితమా? ఇదా దేశభక్తి? లేదంటే వాడు ఆవునేదో చేస్తున్నాడని వాడ్ని చంపడమా దేశభక్తి? అసలు దేశభక్తి అంటే ఏంటి? ఇలాంటి ఆలోచనలు చేస్తూంటే – ఇలాంటి సంకలనం ప్రస్తుతం ఒక సామాజిక ఆవశ్యకత అని భావించాము, సాహిత్యరంగంలోనూ అవసరమని అనుకుని మేము దేశభక్తి కథల సంకలనం వేశాము. ఈ దేశభక్తి కథల సంకలనం కూడా విస్తృతంగా పాఠకులలోకి వెళ్ళింది. దీన్ని అకడమీషియన్లు కూడా చాలా మెచ్చుకున్నారు. నిజానికి అకడమీషియన్లు చేయాల్సిన పని ఇది. దీని మీద రీసెర్చ్ కూడా చేస్తామని కొందరు అకడమీషియన్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాగ్దానం చేశారు. ఈ రకంగా దేశభక్తి కథలు సంకలనం ఒక సంచనలం సృష్టించింది. ఇన్ని రకాల దేశభక్తి కథలున్నాయనీ, ఇంతమంది రచయితలు, ఇంత విభిన్నంగా, ఇంత విస్తృతంగా, ఇంత వైవిధ్యంగా, ఇంత విశిష్టంగా దేశభక్తి కథలని సృజించారని ఇప్పుడు పాఠక లోకానికి తెలిసింది, విమర్శకులు కూడా ఇప్పుడు ఇలాంటి సంకలనాలు చూస్తున్నారు. అంటే సంచిక తరఫున మనం తయారుచేసేటువంటి సంకలనాల ప్రచురణ ప్రధాన లక్ష్యమేమిటంటే – ఇక్కడ నిష్పక్షపాతంగా, నిర్మోహంగా, నిర్దిష్టమైన లక్ష్యంతో మనం కథలను ఎంచుకోవడం. ఎంచుకునేది కథలని, రచయితలని కాదు. ఇతను గొప్పవాడు, ఈ రచయిత కథ ఉండాలి, లేకపోతే, ఈ రచయిత మా ప్రాంతం వాడు, మా కులం వాడు, మా దేశం వాడు… ఇలాంటి వ్యక్తిగతమైన కారాణాలేవీ లేకుండా కేవలం కథ! ఆ కథ బావుంటే ఎవరు రాశారనదే అనవసరం… అందుకే ఒక్కోసారి అవసరమైనప్పుడు పేరున్న రచయితల కథలు కూడా పక్కకి పెట్టి, అప్పుడే ప్రచురితమైనటువంటి రచయితలు, తొలి కథా రచయితల కథలను కూడా ఎన్నుకున్నాం. ఎందుకంటే కథకి ప్రాధాన్యమిస్తేనే అక్కడ కథ అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడయితే మనం వ్యక్తిగతంగా ఈ రచయిత గొప్పవాడు, లేకపోతే అతను జర్నలిస్ట్ రచయిత, అతను ఐఎఎస్ ఆఫీసరు, లేకపోతే నాకు కావలసినవాడు, ఇతని కథ వేస్తే మనకు లాభం ఉంటుంది… ఇలా ఆలోచించి గనుక కథలను ఎన్నుకుంటే… అక్కడ సాహిత్యం దెబ్బతింటుంది. వ్యక్తిగతంగా రచయితలకి పేరు రావచ్చు, ఆ పేరు శాశ్వతం కాదు. అందుకని సంచిక తరఫున వేసే సంకలనాలకి నిర్దిష్టమైన ప్రామాణికాలు నిర్ణయించుకుని దేశభక్తి కథలు తయారు చేశాము.
దేశభక్తి కథలు చూడగానే మండలి బుద్ధప్రసాద్ గారు మహాత్మగాంధీ 150 జన్మదినం సందర్భంగా అక్టోబరు 2 లోపుల మమ్మల్ని ‘తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు’ అనే పుస్తకం తయారు చేయమన్నారు. తెలుగులో గాంధీ మహాత్ముడు ఆధారంగా వచ్చిన కథలను ఎన్నుకుని ఆయన తత్వాన్నీ, సిద్ధాంతాలనీ, ఆయన జీవితాన్నీ, ఆయన వ్యక్తిత్వాన్ని చూపించే కథలని మేము సంకలనం చేశాం, అది కూడా అత్యంత ప్రామాణికమైన సంకలనంలాగా నిలబడుతోంది.
అయితే ఇక్కడేం జరుగుతోందంటే, మేం సంచిక తరఫున మూడు నెలలకొక సంకలనం తేవాలని అనుకున్నాం. కాని వెంట వెంటనే సంకలనాలు వస్తుంటే ఒక సంకలనం రిజిస్టర్ అయ్యేలోపు ఇంకో సంకలనం వచ్చేస్తోంది. మొదటి సంకలనం గురించి ప్రచారమయ్యేలోపే రెండవ సంకలనం వచ్చేస్తోంది. అందుకని కాస్త గ్యాప్ తీసుకున్నాం. మూడు నెలలకి ఒకటి కాదు, ఆరు నెలలకి ఒకటి అని నిర్ణయించుకుని, అక్టోబరు 2 నుండి ఉగాది వరకు ఆగాము. పైగా ఉగాదికి సంచిక ఆరంభించి సంవత్సరం అవుతుంది. కాబట్టి ఉగాది నాటికల్లా తర్వాతి సంకలనం తీసుకురావాలని నిశ్చయించుకున్నాం. అలా ఈ ఉగాదికి క్రీడా కథల సంకలనం విడుదలవుతోంది.
సంకలనాల ప్రచురణ వెనుక చాలా పెద్ద కథ ఉన్నట్టుంది… ఈ రోజున విడుదలవుతున్న ఈ ‘క్రీడాకథ‘ సంకలనం ఎంతమందిని ఆకట్టుకోవచ్చు?
ముందుగా ‘క్రీడాకథ’ నేపథ్యం కొంత చెప్పాలి. ఇప్పుడు మేం ఒక సంకలనం ఎంచుకునే ముందు ఏ టాపిక్, ఏ అంశం మీద సంకలనం చేయాలి అని ఆలోచిస్తాం. ఇలా ఆలోచించే క్రమంలో అనేక ఆలోచనలు వస్తాయి. నిజానికి క్రీడా కథల సంకలనాన్ని మేం దేశభక్తి కథలకన్నా ముందే అనుకున్నాం. తెలుగు రచయితల్లో స్పోర్ట్స్ కాన్షయస్‌నెస్ చాలా తక్కువ. తెలుగు సమాజంలోనే ఇటు ఫిజికల్ ఎడ్యుకేషన్ గానీ, స్పోర్ట్స్ కాన్షయస్‌నెస్ బాగా తక్కువ. ముఖ్యంగా రచయితలందరూ అకడమీషియన్లో లేకపోతే జర్నలిస్టులో అవడంతోటి వాళ్ళ దృష్టి ఎంతసేపు సమాజము, అణచివేతలు వాటిపైనే ఉంటోంది గాని స్పోర్ట్స్ విషయం వైపు చాలా తక్కువగా మళ్ళిందన్న మాట. ఒకవేళ స్పోర్ట్స్ చూపించినా, దానిలోను అణచివేతలూ, అసమానతలనూ చూపించడంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. కానీ విదేశాలలోలాగా ఒక క్రీడని తీసుకుని దాని మీద కథ రాస్తే, ఆ స్పోర్ట్ మీద ఆసక్తి కలగడం.. ఇలాంటి పరిస్థితి లేదు. అందుకని ఆ సమయంలో మేము అనుకోకుండా దేశభక్తి కథలవైపు మళ్ళాము. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు ముందుగా మేము అనుకున్న క్రీడాకథల సంకలనం అని నిశ్చయించుకున్నాం.
ముందుగా అసలు స్పోర్ట్స్ అంటే ఏమిటి నిర్వచించుకున్నాం. ఎందుకంటే మన సంప్రదాయం ప్రకారం గిల్లీదండా, కబడ్డీ, గవ్వలాట, పచ్చీస్, దాగుడుమూతలు ఇవన్నీ కూడా స్పోర్ట్సే. ఇన్ని ఆటల మధ్యలో ఏవి తీసుకోవాలి? అంతర్జాతీయంగా ప్రామాణికమైన క్రీడలను ఎంచుకుంటే, మన సాంప్రదాయకమైనవి పోతాయి. ఇలా రకరకాలుగా ఆలోచించి, మేము స్పోర్ట్స్ కథా, దాని లక్షణాలు నిర్వచించుకున్నాం. ఆ తర్వాతే కథలు ఎంచుకోవడం మొదలుపెట్టాం. ఈ కథలు చదివిన వారికి స్పోర్ట్స్ పట్ల ఆసక్తి కలుగుతుంది, కొంచెం అవగాహన కలుగుతుంది. ఈ సంకలనం కోసం కథలను పరిశీలిస్తుంటే, స్పోర్ట్స్ ఆధారంగా తెలుగులో ఇన్ని కథలొచ్చాయా అనిపించింది, మొదట్లో ఒకాయన పదికథలొస్తే గొప్ప అన్నారు. ఇప్పుడీ సంకలనంలో ఇరవై మూడు కథలున్నాయి. ఇంకా కొన్ని కథలను… ప్రముఖులు రాసినవి… మా స్కీమ్‌లో ఫిట్ కాక, మేము వదిలేశాం. ఉదాహరణకి శ్రీపాద వారు వ్రాసిన వడ్లగింజలు గాని, కొత్త చూపు గాని అద్భుతమైన కథలు. వడ్లగింజలు చెస్‌కి సంబంధించినది. కొత్త చూపు కుస్తీలకి సంబంధించినది. అయితే ఆ కథలు రాయడంలో ఆయన ఉద్దేశం స్పోర్ట్స్‌ని హైలైట్ చేయడం కాదు. వేరే ఒక సామాజిక సమస్యని, మానసిక ఆవేదనని హైలైట్ చేయడమన్న మాట! అందుకని ఆ కథలని పక్కకి పెట్టాం. అలాగే శ్రీశ్రీ రాసిన అశ్వమేధం గానీ, చాసో రాసిన రథ యాత్ర గానీ… ఇవి కూడా అలాంటివేనన్నమాట. రథయాత్ర బొంగరం తిరగడంతో ఆరంభమవుతుంది, కాని వేరే వైపు మళ్ళిపోతుంది. ఈ రకమైన కథలను ప్రముఖులు రాసినవైనా వాటిని వద్దనుకున్నాము. వద్దనుకుని సంకలనం చేస్తే, మా సంకలనంలో 23 కథలున్నాయి. 23 కథలను మేమెలా వర్గీకరించామంటే… నాందీ – ఒక కథ; ప్రస్తావన – ఇంకో కథ. ఆ తరువాత క్రీడాస్ఫూర్తి, క్రీడామానసికం, క్రీడా వినోదం, క్రీడోన్మాదం, క్రీడ- నేరం అనే విభాగాలున్నాయి. క్రీడాస్ఫూర్తి అంటే స్పోర్ట్స్‌మాన్ స్పిరిట్. ఎలాగ ఆటలు వ్యక్తుల జీవితాలను మారుస్తాయి, ఎలా ఆటలు వ్యక్తుల మనఃస్థితిపై ప్రభావం చూపుతాయనేవి క్రీడా స్ఫూర్తిలో ఉండే కథలు, ఆ తరువాత క్రీడా మానసికంలో ఉండే కథలు ఎలాంటివంటే క్రీడలు మనసుపై చూపించే ప్రభావాన్ని తెలిపేవి. క్రీడావినోదంలో క్రీడల ద్వారా హాస్యం, క్రీడోన్మాదంలో… ఒక్కోసారి ఆటలలో ఉన్మాదులై పోతారు, వారు కుటుంబాన్ని పట్టించుకోరు, ఎవరినీ పట్టించుకోరు.. ఆటని రాత్రింబవళ్ళు ఆడడం, చదువు మానేసి ఆటలోనే లీనమైపోవడం.. చదరంగం అయితే, చదరంగం ఆడుతూ మిగిలినవన్నీ వదిలేయడం…ఇలాంటి ఒక ఉన్మాద స్థితిని చూపించేటి కథలు ఈ విభాగంలో ఉన్నాయి. అయితే క్రీడాకారులు కూడా మనుషులే… ఉండకూడదు గానీ వారిలోనూ నేర ప్రవృత్తి ఉంటుంది. క్రీడాకారులలోని నేరప్రవృత్తిని చూపించే కథలో క్రీడ-నేరంలో ఉంటాయి.
అంటే ఒక పాఠకుడు ఈ కథలను చదివితే నాంది తోటి కథా ప్రపంచంలోకి అడుగుపెడతాడు, ప్రస్తావనతోటి అతని బాల్యం పూర్తయి యవ్వనంలోకి క్రీడలు ఆడడం మొదలుపెడతాడు. నాందిలో భూపాల్ అనే రచయిత రాసిన కథ ఉంది. రెండు పేరా గ్రాఫులే కథ! ఒక పార్టీ జరుగుతూంటుంది. అందరూ పిల్లల్ని తీసుకుని వస్తారు, పెద్దలంతా వాళ్ళ ముచ్చట్లలో ఉంటే ఒక పాప కూర్చుని ఉంటుంది. ఆమెకి ఆడడానికి ఏమీ ఉండక అలా పాక్కుంటూ వచ్చి చెప్పుతో ఆడుకుంటుంది. వాళ్ళ అమ్మ వచ్చి పాపని ఒక దెబ్బ వేసి, చెప్పుని లాగి పాడేసి దూరంగా కూర్చోబెడుతుంది. పాప ఏడుస్తూ ఉంటుంది. మన సమాజంలో క్రీడల పట్ల ఉన్న ఒక చూఫుని ఆయన చాలా అద్భుతంగా చూపించారా కథలో. ఏంటంటే మనం పిల్లల్ని ఆడుకోనీయం.. వాళ్ళకి ఆటవస్తువులివ్వం, వాళ్ళంతట వాళ్ళు ఆడుకుంటుంటే, అదీ ఆడనివ్వం. ఆట పట్ల ఈ రకమైన మన మనస్తత్వాన్నీ, ఆలోచనల్నీ ఆ కథ చూపిస్తుంది. ఇది నాంది.
ప్రస్తావనలో కవికొండల వెంకటరావు అనే ఆయన వ్రాసిన కథ ఉంది. ఇందులో ప్రధాన పాత్ర చెడుగుడు ఆడుతూంటాడు. పెళ్ళవుతుంది. అత్తగారింటికి వెళ్తారు. అక్కడ పిల్లలు ఆడుతూ ఉంటే ఇతనికి ఆడాలనిపిస్తుంది. భార్య అంటుంది – “పెద్దవాళ్ళయ్యాకా, ఆటలెందుకు మీకు, లోపలికి రండి, అందరూ నవ్వుతారు” అని. ఇతనెళ్ళి పిల్లలతో ఆడతాడు. పిల్లలతో పాటు సుబ్బరంగా ఆడుకుంటాడు. ఇంటికెళ్ళిపోతాడు. మళ్ళీ ఏడాది వస్తాడు. అయితే అక్కడ ఆడేవాళ్ళెవరూ కనబడరు. ఎందుకంటే, పిల్లలంత పెద్దవాళ్ళయిపోయారు. అంటే… మనకి ఆటలంటే పిల్లలు ఆడుకునేవనీ, జీవితం వేరు ఆటలు వేరు అనీ, వాడు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి… ఇలా ఉంటుంది తప్పితే…. ఆట మీద దృష్టి మనకి ఇప్పుడిప్పుడు వస్తోంది. ఎందుకంటే ఆటల వల్ల జీవిక సాగుతుంది, డబ్బులు వస్తాయి, గెలిస్తే మనకి భూములిస్తారు, ఉద్యోగాలిస్తారు అన్న కాన్సెప్ట్‌ల వల్ల ఆటల మీదకి కొంచెం దృష్టి మళ్ళుతోంది గాని లేకపోతే ఆటలాడడం ఒక చెడ్డపని లాగా, ఆటలు ఆడకూడదని, పిల్లలు చదువుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి.. అలాంటి పిల్లలే బుద్ధిమంతులు, ఆటలాడే పిల్లలు అల్లరి చిల్లరి పిల్లలు అనేటువంటి అభిప్రాయం ఇప్పటికీ మనలో ఉంది. ఈ కథ దాన్ని చాలా గొప్పగా చూపిస్తుంది. చిన్నప్పుడు ఆడుకోనివ్వరు, పెద్దయ్యాకా ఆడితే, చిన్నపిల్లాడివా ఆడుకోడానికి అంటారు. మరెప్పుడు ఆడేది?
సమస్యలని, సందేహాలని లేవనెత్తుతూ, మనం క్రీడాస్ఫూర్తి అనే విభాగంలోకి వెళ్తామన్న మాట. ఈ కథలు చదివిన వారికి ముందుగా – తెలుగు రచయితలకి స్పోర్ట్స్ కాన్ష్‌యస్‌నెస్ లేదు, తెలుగు కథకులు తమ కథల్లో క్రీడల్ని అంతగా ప్రదర్శించలేదు.. అనేటువంటి అపోహ తొలగిపోతుంది.
చదివిన పాఠకుడు విభిన్నతని చూసి ఆశ్చర్యపోతాడు, కథకుల లోతుని, వాళ్ళ ఆలోచనల లోతుని, కథని ప్రదర్శించిన విధానాన్ని చూసి ఆశ్చర్యపోతాడు, సంతోషిస్తాడు. ఈ సంకలనంలోని కథలను మళ్ళీ మళ్ళీ చదువుతారు. ఈ రకంగా పాఠకులని ఇంతమంది కథకులున్నారు, ఇన్ని కథలున్నాయి, ఇన్ని రకాలుగా రాశారు మనవాళ్ళు అని తెలిసేలా ఒక ఆసక్తికరమైన రీతిలో సంకలనాన్ని అందిస్తున్నాము. దీనివల్ల ఏంటంటే సంకలనం పాఠకులను చేరుతుంది, సంకలనాల అమ్మకాలు పెరుగుతూ పాఠకులను చేరుతున్న కొద్దీ సాహిత్యం విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాగ రాస్తే కూడా మనకి ఆదరణ ఉంది అని కొత్త కొత్త కథకులు ఇంకా కొత్త కథలు రాస్తారు. అటువంటి కథలను సంచికలో ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా సాహిత్యాన్ని అభివృద్ధి చేయడంలో, కథకుల్ని, కథల్ని తెర మీదకి తీసుకురావడంలో ఈ సంకలనాలు తోడ్పడతాయని సంచిక సంకనాలను ప్రచురిస్తోంది. దానిలో ‘క్రీడాకథ’ సంకలనం ఒక భాగం. బహుశా వచ్చే దీపావళికి మరొక సంకలనం తయారు చేస్తాం.
చాలా సంతోషంగా ఉంది సార్. ‘క్రీడాకథ‘ల గురించి చెబుతుంటే ఇప్పటికిప్పుడు ఆ కథలను చదివి ప్రతి ఒక్కరికి వినిపించాలని అనిపిస్తోంది.
ఈ క్రీడలలో ఆసక్తికరమైన నేరం కూడా ఉంది – మర్డర్స్! అంటే క్రీడలంటే కేవలం ఆటలే కాదు, స్పోర్ట్స్‌మాన్‌షిప్, వాడొకరికి సహాయం చేయడం, లేకపోతే ఓడిపోయినా బాధపడకూడదు… ఇలాంటివి చెప్పడం కాదు; క్రీడాకారులలో కూడా నేరప్రవృత్తి ఉంటుందనీ చెప్పే కథలున్నాయి. మనం గమనిస్తాం – ఒకడు చదరంగం ఆడుతుంటాడు, మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన కథ ఇది. తను ఛాంపియన్ అవ్వాలి, రెండుసార్లు ఫైనల్స్‌కి వచ్చి ఓడిపోయాడు. అదే ఆటగాడితోటి! మళ్ళీ ఈసారి అదే ఆటగాడితో పైనల్స్‌కి వచ్చాడు. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలి. కాని వాడు బ్రతికుంటే గెలవలేడు, వాడు చస్తేనే వీడు గెలవగలడు. సో వాణ్ణి చంపాలి. ఇదొక కథ. ఎలా చంపుతాడు, ఏమిటి, ఎలా పట్టుబడ్డాడు… అనేవి ఆసక్తికరం. ఎందుకంటే, అవతలి ఆటగాడు కూడా చదరంగం ఆటగాడే. తెలివైన వాడు. సో వాడు వీడ్ని ఎలా బోల్తా కొట్టిస్తాడు.. ఇదీ కథ!
ఇంకో కథ ఏంటంటే… ఇది నేను రాసినదే… ‘మర్డర్ కాని మర్డర్’ అని… మనం క్రికెట్ చూస్తూంటాము, its a high stake game. బోల్డన్ని డబ్బులొస్తాయి, సో ఆటగాడికి ఆడాలని ఉంటుంది, తన స్థానం ఏదైతే వచ్చిందో, దానికి పోటీగా వేరేవాడు రావడానికి సిద్ధంగా ఉన్నాడంటే, ఎలాగైనా తాను… రకరకాల ఇన్‌ఫ్లూయన్స్‌లు ఉపయోగించైనా తన స్థానం నిలుపుకోడానికి ప్రయత్నిస్తాడు. వీటిని ఉపయోగిస్తూ… ఒక ఆటగాడు ఎలాగ మరొక ఆటగాడిని పదిమంది ఎదుట అతడి మరణానికి కారణమవుతాడు, కాని ఎవరూ ప్రూవ్ చేయలేరు, ఎవరు గమనించరు… ఇలాంటి కథ. క్రికెట్‍లో బౌన్సర్లు వేస్తారు, హెల్మెట్లు పెట్టుకుంటారు, ఫీల్డర్ సరిగ్గా చూడకపోతే బంతి వాడి తలకి తగులుతుంది, క్లోజ్-ఇన్ ఫీల్డర్స్ ఉంటారు. క్లోజ్-ఇన్ ఫీల్డర్ సరిగా పట్టుకోకపోతే, వాడికి దెబ్బ తగులుతుంది. పరుగెడుతూంటాడు, ఎదుటివాడు అడ్డొచ్చి ఇద్దరూ ఢీకొంటారు, ఎవరో ఒకరికి దెబ్బలు తగులుతాయి. సో, ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, నిజంగా జరుగుతున్నాయా? ఇలాంటి సందేహాల్ని కలిగిస్తూ రాసిన కథన్న మాట. ఈ రకంగా అన్ని కోణాలని మేము కథల్లో చూపించే ప్రయత్నం చేశాము.
అయితే సంకలానల తోటే ఆగకూడదని కూడా సంచికకి ఉంది. అసలు ఈ ఉగాదికే చేయాలని అనుకున్నాం.. ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహించి తెలుగు సాహిత్యానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి, గుర్తింపు రానటువంటి రచయితలకి సంచిక సాహితీ అవార్డు ఇద్దామని అనుకున్నాం. అయితే దాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాం. బహుశా వచ్చే ఉగాదికి సంచిక సాహితీ అవార్డును ప్రదానం చేయగలమని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎటువంటి వాదాలకి, వివాదాలకి గురికాకుండా నిస్వార్థంగా నిజమైన సాహిత్యాన్ని సృష్టిస్తూ అజ్ఞాతంలో ఉంటూ సాహిత్య సేవనే జీవిత పరమార్థంగా భావిస్తున్న వారిని సన్మానించేటువంటి, వారిని వెలుగులోకి తీసుకువచ్చేటువంటి ఈ సంచిక సాహితీ అవార్డు కనీసం వచ్చే ఉగాది నుండైనా ప్రదానం చేయగలమని అనుకుంటున్నాం.
ఈ ‘క్రీడాకథ‘లో ఎంతమంది రచయితలున్నారు? ఈ సంకలనం సిద్ధమవడంలో ఎన్ని రోజుల కష్టం ఉంది?
ఎన్ని రోజులు చేశామనేది ముఖ్యం కాదు, ఎంత శ్రమించామనేది ఇంపార్టంట్ కాదు. అల్టిమేట్‌గా ఫలితం ఏంటని చూడాలి మనం. మాకు వారం టైమ్ ఇచ్చినా, నెల ఇచ్చినా, సంవత్సరం ఇచ్చినా ఫలితం ఒకేలా ఉంటుంది. ఎందుకంటే మేము (నేను, సహ సంపాదకుడు కోడీహళ్ళి మురళీమోహన్, మా బృందం) దాని మీద పెట్టే శ్రమ 100%. ఇక ఈ పుస్తకంలో 23 మంది కథకులు ఉన్నారు. మొదటి కథ భూపాల్ గారిది, తర్వాతి కథ కవికొండల వెంకటరావుగారిది. తర్వాత సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమైన అయాచితం స్పందన కథ ఉంది, ఆ కథ ఏంటటే..ఒక అమ్మాయి బాడ్మింటన్ ఆడతానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరన్న మాట. ఆమెకి బాడ్మింటన్ మీద చాలా ఆసక్తి ఉంటుంది. దాంతో ఇంట్లో వాళ్లకి చెప్పకుండా పారిపోతుంది, పోటీలో పాల్గొనడానికి. చుట్టుపక్కల వాళ్ళు సాయం చేస్తారు కానీ పారిపోయి వచ్చిందని చెప్పి ఇంట్లో వాళ్ళకి ఇన్మరేషన్ ఇస్తారు. ఆమె సెమీపైనల్ గెలిచేసరికి ఎదురుగా తండ్రి! అందరి ముందు ఆమెను చెంపదెబ్బ కొట్టి తిట్టేసి లాక్కొని వెళ్ళిపోతాడు. అంటే ఒక అమ్మాయి ఆటలో తన ప్రతిభ చూపించి ఉత్తమశ్రేణిలో నిలవాలనుకుంటే ఎన్ని కట్టుబాట్లు, ఎన్ని నిబంధనలు ఆమెని అణచివేస్తాయి అని ఈ కథలో చూపించారు. అయితే తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయి పెళ్ళవుతుంది, ఇండిపెండెన్స్ వస్తుంది, అప్పుడామె తన కూతురిని బాడ్మింటన్ క్రీడాకారిణిగా చేస్తుంది. ఆమె గెలుస్తుంది. ఇదీ కథ. ఏ అమ్మాయి అయితే తన తండ్రి విధించిన కట్టుబాట్ల వల్ల తనలోని క్రీడాకారిణి అణిగిపోయిందో, ఇప్పుడామె గెలిచినట్టా ఓడినట్టా? క్రీడాకారిణికి ఓటమి లేదు. వాళ్ళు తమ నుంచి తర్వాతి తరానికి అలా అందిస్తునే ఉంటారని అద్భుతంగా చూపించిన కథ. ఇలాంటి కథలు కూడా ఉన్నాయి. ఇది క్రీడాస్ఫూర్తి విభాగంలో చేరిన కథ. రచయిత కొత్త రచయితనా, యంగ్ రైటరా, ఓల్డ్ రైటరా, పేరున్న రచయితనా… ఇలా ఏవీ చూడలేదు మేము. కథ బావుంది, అది సంకలనంలోకి వచ్చింది. ఇంకా ఇందులో యండమూరి వీరేంద్రనాథ్ కథ ఉంది, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి కథ ఉంది. అయాచితం స్పందన కథ ఉంది. ఇది మన క్రీడాకథల సంకలనం యొక్క విహంగ వీక్షణం.
ఇప్పటికి సంచిక ప్రారంభమై, సంవత్సరం దాటింది. సంచికలో ఎన్నో కథలు వచ్చాయి. ఈ ఏడాది కాలంలో ఏ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది, మంచి స్పందనను తీసుకువచ్చింది? చాలా కథలే వచ్చుంటాయి, అవన్నీ చాలామందినే ఆకట్టుకొని ఉంటాయి. కానీ వీటిల్లోంచి బాగా స్పందన వచ్చిన కథ గురించి చెప్పండి.
ఇక్కడ ఒక చిన్న సమస్య వస్తుందండి. సంచిక ఎడిటోరియల్ టీమ్‌లో నేనొక సభ్యుడిని. అందులో ప్రచురితమైన కథలన్నీ నేను ఎంచుకొన్నవే. సో వాటిలో ఏది ఉత్తమమైనది అంటే చెప్పడం కష్టం.
అంటే ఏ కథ బావుందని చదివాన వాళ్ళనుండి ఎక్కువగా ప్రతిస్పందన వచ్చింది?
మీరో విషయం గమనించాలి. వెబ్ పత్రికల్లో స్పందన ఎలా ఉంటుందంటే- ఒక రచయిత net savvy ఉండి, అతనికి ఫేస్‍బుక్‌లోనూ, ట్విటర్‍లోనూ, వాట్సప్‍లోనూ అనేకమంది మిత్రులుంటే – తన కథ లింక్‍ని షేర్ చేస్తే దానికి వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నేనున్నాను.. నేను నా ఫేస్ బుక్ వాల్‌మీద… ఈ కథ రాసాను… చదవండి… అని పోస్ట్ చేస్తాను, అలాగే వాట్సప్‌లో అందరికీ షేర్ చేస్తాను. మెయిళ్లు పెడతాను. ట్విటర్‌లో పెడతాను. సో, నా ఫ్రెండ్స్ అందరూ మనవాడేదో రాసాడు అని చూస్తారు. ఓహో అద్భుతం, అమోఘం అని పొగిడేస్తారు, కాని అది నిజమని అనుకోడాని లేదు. కాబట్టి ఒక రచన స్పందనని నిర్ణయించేది కాలం. కాలాన్ని తట్టుకుని నిలబడేది ఏ రచన అని మనం ఆలోచించాలి. అందుకే సంచికలో ప్రచురితమైన ఉత్తమ కథలు అనే సంకలనం మనం వెయ్యడం లేదు. నిజానికి సంచికలో మనకి ఇప్పటికి వందా – రెండు వందలకి పైగా కథలొచ్చాయి. ఆ కథలతో ఒక సంకలనం వేయచ్చు, కొన్ని పత్రికలు – తమ పత్రికలో పడ్డటువంటి ఉత్తమ కథలను, మంచి కథలను సంకలనంగా వేస్తాయి. కాని ఆ పద్ధతికి మనం వ్యతిరేకం. ఎందుకంటే రచయిత రాసే ప్రతి కథ – ఒక స్పందన పొంది, ఒక ఆవేశం పొంది రాస్తాడు. అది ఉత్తమమా చెత్తనా అని మనం నిర్ణయించలేం. రచన ఆసక్తిగా ఉందా, మనం చదవగలిగామా లేదా, దాని ప్రభావం ఎలా ఉంటుంది అని మనం ఆలోచించి విశ్లేషించడమే తప్పించి రచయిత ఇలా రాయకూడదు, ఇలాగే రాయాలి అని మనం చెప్పకూడదు. ఇది ఉత్తమ కథ, అది ఉత్తమ కథ కాదు అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక కథ ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇవాళ మనం పనికిరాదన్న కథ, ఓ పదేళ్ల తర్వాతో, పదిహేనేళ్ళ తర్వాతో అత్యుత్తమ కథగా పరిగణింపబడవచ్చు. అలాగే వివిధ భాషలలోకి అనువాదం కావచ్చు. సంచికలో ప్రచురితమైన నా కథ ‘వైష్ణవ జనతో…’ దేశభక్తి కథలు సంకలనంలో వచ్చింది, ఒరియాలోకి అనువాదమవుతోంది. సంచికలో కొత్త కొత్త కథలకి… డిటెక్టివ్ కథలు, హారర్ కథలు, ఆధ్యాత్మిక కథలు… ఇలాంటి వాటికి మనం ప్రోత్సాహమిస్తున్నాం. అంటే విభిన్నమైన రచనలకి వేదికగా సంచిక నిలుస్తోందని చెప్పుకోవచ్చు గాని, ఇది ఉత్తమ కథ, అది కాదు అని చెప్పలేం.
క్రీడాకథల తర్వాత ఏ కథల సంకలనం రాబోతోంది?
అది ఇప్పుడే చెప్పలేం. ఇందాకే చెప్పానుగా, మేం వంద ఆలోచనలు చేస్తాం, వంద కోణాల్లో ఆలోచిస్తాం, ఉదాహరణకి క్రీడాకథల కన్నా ముందు మేము వేరొక సంకలనం అనుకున్నాం, ఒక ఇరవై కథల వరకు సేకరించాం. రచయితకి చెప్పాం కూడా, సంకలనంలో వారి కథ వస్తుందని. హఠాత్తుగా ఐడియా వచ్చింది, ఆలోచన మారిపోయింది. క్రీడాకథల సంకలనం తయారైంది. కాబట్టి దీపావళికి మరో కథా సంకలనం తెస్తాం, కాని అది ఏ సంకలనమో ఇప్పుడు చెప్పలేం.
క్రీడాకథల సంకలనంలో ప్రపంచంలో ఉన్న అన్ని క్రీడల గురించి చెప్పారా?
మేము సొంతంగా చెప్పిన కథలు కావు కాబట్టి, రచయితలు ఏ క్రీడలనైతే కథలలో ప్రదర్శించారో ఆ కథలనే తీసుకోవాలి. ఎక్కువ కథలు క్రికెట్ నేపథ్యంతోనే ఉంటాయి కాబట్టి క్రికెట్ నేపథ్యంలో ఉన్న రొటీన్ కథలను కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకున్నాం. దీనిలో ‘ఒలింపిక్ కల’ అని ఒక కథ ఉంది. 1940-50లలో వచ్చిన కథ ఇది. ఆ కథ ఎలా ఉంటుందంటే – మన ఆంధ్ర దేశం వాళ్ళు.. గొప్ప గొప్ప వస్తాదులు… రెజ్లింగ్ ఆటగాళ్ళు… తమని ఎవరూ పట్టించుకోవడం లేదని, గుర్తింపు లేదని వాళ్ళంతట వాళ్ళు జర్మనీ వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ ఒలింపిక్ క్రీడలు జరుగుతుంటాయి. అది రెండో ప్రపంచ యుద్ధ కాలం. అక్కడికి వెళ్ళిపోయి ఆడుతూంటారు వాళ్ళు. ఎవరు వీళ్లు, ఏ దేశం వాళ్లు అని అనుకుంటారు జనం. ‘మేం ఆంధ్ర దేశం వాళ్ళం… మమ్మల్ని ఎవరూ గుర్తించడం లేదు కాబట్టి మేమే వచ్చాం’ అంటారు. వాళ్ళని హిట్లర్ చూస్తాడు. అభినందిస్తాడు, ఆడండి అంటాడు. వాళ్ళేమో అందరినీ ఓడించి ఒలింపిక్స్‍లో పతకం గెల్చుకుంటారు. అదంతా ఒక కల అన్న మాట! ఇప్పటికి కూడా మనకి అది కలే! ఒలింపిక్స్‌కి క్వాలిపై అయితేనే మనం ఉత్తమ క్రీడాకారుడని పొగుడుతున్నాము… బ్రాంజ్, సిల్వర్ మెడల్ దాకా వచ్చాం, అదీ ఇండివిడ్యువల్ గేమ్స్‌లో! ఒకరిద్దరు పతకాలు సాధించారు. ఇంకా ‘ఒలింపిక్ కల’ అలాగే ఉంది. సో, అలాంటి కథలు కూడా దీనిలో ఉన్నాయి. అంటే వీలైనంత విభిన్నమైన క్రీడల మీద కథలను తీసుకురావాలని మేము ప్రయత్నించినా – కథకులు అన్ని రకాల క్రీడల కథలు రాయలేదు కాబట్టి కొన్ని రకాల క్రీడలపైనే ఈ సంకలనంలో కథలు వచ్చాయి. ఎన్నో క్రీడలున్నాయి, కాని కొన్ని క్రీడల గురించి మన తెలుగు కథకులు విశిష్టంగా రాసినటువంటి కథల సంకలనమిది. ఇది చూసైనా మన తెలుగు కథకులు ఇంకా విభిన్నమైన క్రీడల గురించి విభిన్నమైన రీతిలో కథలు రాస్తారనీ, సంచిక ఆ కథలను ప్రచురించి, మరొక సంకలనం తయారు చేస్తుందని ఆశిద్దాం.
సంచిక వచ్చి ఏడాదికి పైగా అయ్యింది. వందల కథలొచ్చాయని అన్నారు. అయితే అందరినీ ఎక్కువగా ఆకర్షించే జోనర్ హాస్యం. హాస్య పరంగా సంచికలో ఎటువంటి కథలు వచ్చాయి? రానున్న రోజులలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదికి ఎన్ని హాస్య కథలు వచ్చే అవకాశం ఉంది?
మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం – సంచిక గత ఏడాది హాస్యకథల పోటీ పెట్టింది.
చాలా గొప్ప విషయం!
హాస్య కథల పోటీ పెట్టి, కథకులకు బహుమతి కూడా ఇచ్చింది. హాస్య కథలే కాదు, ఏ రకమైన కథ అయినా ఒక రచయిత విభిన్నంగా రాసాడంటే – ఆ కథ సంచికలో వస్తుంది. ఉదాహరణకి చాలామంది రచయితలకి చెబుతుంటాను నేను – ఇతర పత్రికలు మీకు తిప్పి పంపిన కథలు నాకు ఇవ్వండి అని! ఎందుకంటే తిప్పి పంపించారంటే అది తప్పని సరిగా మంచి కథ అయ్యుంటుంది. కాబట్టి సంచికలో జోనర్‌కి లిమిట్ లేదు, హాస్య కథ, మర్డర్ కథ, సైన్సు కథ, శృంగారము, విప్లవ కథలు, ఏవైనా సంచికలో ప్రచురిస్తాము. అన్ని రకాల కథలకి ఆహ్వానం పలుకుతాం. రచయిత యొక్క ప్రతిభను బట్టి పాఠకుడు వాటిని మెచ్చుకుంటాడు. ఏ కథ ఉత్తమమైనదని కాలం నిర్ణయిస్తుంది.
ఈ రోజుల్లో యువత సాహిత్యంలో… బుక్స్‌కి దూరమైపోతున్నారు. డిజిటల్ పరంగా సంచిక ఏ విధంగా ఉపయోగపడుతుంది?
ఇది మేము సీరియస్‌గా ఆలోచిస్తున్న ప్రశ్న. ఇందాక మీకోటి చెప్పాను. ప్రస్తుతం రచయితలంతా 50, ఎబోవ్ 50 వయసున్న వాళ్ళేనని! తర్వాతి తరంలో రచయితలు తక్కువ. ఈ 50, ఎబోవ్ 50 రచయితలంతా నోస్టాల్జియాలు, జ్ఞాపకాలు రాసుకునే స్థితికి వచ్చేసారు. యంగ్ రైటర్స్ లేకపోవడంతోటి… యంగ్ జనరేషన్స్ యొక్క ఆస్పిరేషన్స్ పట్టుకుని రాసేవాళ్ళు తక్కువ. అదీగాక ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే young generation is exposed to global literature. So their aspirations and their desires are different from the generation that is writing stories. సో ఇక్కడ సమస్య వస్తోంది. కొత్త జనరేషన్ స్టోరీస్ రాస్తూ రావడం లేదు, పాత జనరేషన్ వెళ్ళిపోతోంది, చదివే వాళ్ళలో కూడా అదే సమస్య వస్తోంది. ఈమధ్య నేను ఓ కళాశాలకి వెళ్ళాను… మన తెలుగు రాష్ట్రాలకి బయట ఉన్న కళాశాల అది. వేరే రాష్ట్రంలో ఉంటున్న తెలుగు పిల్లలు వాళ్ళు. 400 మంది ఉన్నారక్కడ. ఎంతమందికి తెలుగు తెలుసు అంటే 400 మంది చేతులెత్తారు. ఎంతమంది తెలుగు మాట్లాడుతారు అంటే 400 మంది చేతులెత్తారు. తెలుగు ఎంతమంది చదువుతారు అని అడిగితే, ఆ సంఖ్య వందకి పడిపోయింది. తెలుగు మ్యాగజైన్లు, తెలుగు కథలు ఎంతమంది చదువుతారు అంటే ఆ సంఖ్య ఇరవైకి తగ్గింది. తెలుగులో ఎందరు రాస్తారు అని అడిగితే ఒక్క చెయ్యి లేవలేదు. ఇది మనం ఇప్పుడు చాలా సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం. మనకి చదివేవాళ్ళు రావాలి, రాసేవాళ్ళూ రావాలి. ఆ చదివేవాళ్లని ఆకర్షించి, వాళ్ళు పోకుండా కాపాడుతూ, కొత్తగా చదివేవాళ్లని ఆకర్షించేవాళ్ళు రావాలి. ఇది యంగ జనరేషన్‌లో జరగాలి. మీరు గమనిస్తే మేము కావలిలోని రెడ్‍ఫీల్డ్ అనే స్కూల్‌లో కథల పోటీ నిర్వహించి; ఆరో తరగతి ఏడో తరగతి పిల్లలతో కథలు రాయించి బహుమతి పొందిన కథలను సంచికలో ప్రచురించాము. అలాగే అక్కడ డిగ్రీ కాలేజి పిల్లలతో రైలు కథలు సంకలనంలోని కథలపై విశ్లేషణ చేయించాము. త్వరలో సంచిక తరఫున శిబిరాలు నిర్వహించి పిల్లలకి కథలు ఎలా రాయాలో నేర్పిస్తాము. అలా వాళ్ళు రాసిన కథలను సంచికలో ప్రచురిస్తాము. ప్రతీ యంగ్ రైటర్‌కీ – కథ ఎలా వస్తుందీ, ఏమిటి అని ఆలోచించకండి, మీ ఆలోచనని రాయండి, మాకు పంపండి, కథ ఎలా రాయాలో మీకు చెప్పి, మీతో రాయించి మరీ వేస్తామని చెబుతున్నాము. ఇప్పుడు యంగ్ రీడర్స్‌నీ, యంగ్ రైటర్స్‌నీ తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాహిత్యం అనేది ఒక రిలే పరుగు పందెం లాంటిది. బేటన్ పట్టుకుని ఒకడు పరిగెత్తుతుంటాడు, కొంత దూరం వెళ్ళాక, ఇంకొకడు సిద్ధంగా ఉంటే, వాడికి బేటన్ ఇస్తే, అతను పరిగెడతాడు. కానీ సాహిత్యంలో ఇప్పుడు బేటన్ అందిద్దామంటే అందుకునేవాడు లేడు – అటు చదివే వాళ్ళలో గాని, ఇటు రాసేవాళ్ళలో గాని. ఆ బేటన్ అందుకునే వాళ్ళని తయారు చేయడం ఒక ఉద్యమంగా సంచిక త్వరలో ఆరంభించబోతోంది.
ఇంటర్నెట్ రీడర్స్‌తో వచ్చిన సమస్య ఏంటంటే పాతవాళ్లు ఇంటర్‌నెట్ సరిగ్గా వాడలేరు. కొత్తవాళ్ళు ఇంటర్‌నెట్‌లో ఇంగ్లీషు చూసుకుంటారు. వాళ్ళకి కావల్సినవేవో వాళ్ళు చూసుకుంటున్నారు. సో, వాళ్ళని ఆకర్షించే రచనలు ఎక్కువగా చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే they are exposed to global literature. అక్కడ ఒక రచయిత కొన్నేళ్ళు శ్రమించి రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ రాస్తాడు. తెలుగులో రచయితలకి అంత టైమ్ లేదు, తెలుగులో రచయితలు సర్వం త్యజించి రచనల మీద బ్రతికే పరిస్థితి లేదు. ఈ గ్యాప్‌నీ, ఈ పారడాక్స్‌ని గనుక మనం సాధించగలిగితే మనకి కొత్త రీడర్స్ వస్తారు, కొత్త రైటర్స్ వస్తారు. ప్రస్తుతం సంచిక ఆ దిశగా ఆలోచిస్తోంది.
సో, మొత్తానికి సంచిక యంగ్ రైటర్స్‌కి ఒక అవకాశం ఇవ్వబోతోంది. చాలామందిలో టాలెంట్ ఉంది, కాని కథలు ఎలా రాయాలో చాలామందికి తెలియకపోవచ్చు. వారు రాసేది తప్పో, ఒప్పో, ఎలా ఉన్నా రాసి పంపిస్తే, వారికి కావల్సిన సపోర్ట్ అన్నది సంచిక టీమ్ అందిస్తుందన్న మాట!
ప్రతీ వ్యక్తిలో ఒక రచయిత ఉంటాడు. రాయకుండా ఉండలేని వాడు రచయిత అవుతాడు. ఒకటి రాసినా, దానికి ప్రోత్సాహం లభించనివాడు రచయిత కాలేకపోతాడు. సో అలాంటి ప్రోత్సామిచ్చి రచయితలుగా నిలబెట్టే ప్రయత్నం సంచిక చేస్తోంది. భవిష్యత్తులో మీరు వాటి ఫలితాలను కూడా చూస్తారు.
కస్తూరి మురళీకృష్ణగారూ, క్రీడాకథ పుస్తకం గురించి చక్కని విషయాలు తెలియజేశారు, అలాగే ఆ పుస్తకంలోని కొన్ని కథల గురించి క్లుప్తంగా చెప్పారు. రాయలనుకుంటున్న యంగ్ రైటర్స్‌కి మీరెలా ప్రోత్సాహమివ్వదలచినది చెప్పారు. ధన్యవాదాలు సార్!
బహు కృతజ్ఞతలు. ధన్యవాదలండీ!
ఈ ఇంటర్వ్యూని మైఇండ్ మీడియా వారి యూట్యూబ్ ఛానెల్‌లో ఈ లింక్‌లో చూడవచ్చు.