సంభాషణం: ‘కార్టూన్ – కథా విరించి శ్రీ సరసి’ అంతరంగ ఆవిష్కరణ

24
3

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం ‘కార్టూన్ – కథా విరించి శ్రీ సరసి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

ఉపన్యసిస్తున్న శ్రీ సరసి

[dropcap]పా[/dropcap]త తరం పాఠకులకు కార్టూనిస్టు అనగానే ముందు చటుక్కున గుర్తుకువచ్చేది శ్రీ ‘బాపు’. అయితే అలాంటి బాపుగారు మెచ్చిన, ఆయనకు నచ్చిన కార్టూనిస్టు, ప్రస్తుతం అందరికి తెలిసిన కార్టూనిస్టు శ్రీ ‘సరసి’. దీనిని బట్టి సరసి అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. అంతమాత్రమే కాదు, శ్రీ బాపు – రమణలకు ఎంతో ఇష్టమైన రచయిత/కార్టూనిస్టు ఆయన. సరసి వందల సంఖ్యతో కథలు (ముఖ్యంగా హాస్యకథలు) రాసినా, కార్టూనిస్టుగానే ప్రసిద్ధులు (కార్టూనులు వేలసంఖ్యలో ఉంటాయి లెండి). ‘నేటివిటీ’కి నిలువెత్తు సాక్ష్యాలు వీరి కార్టూన్లు. అందుకే అన్ని వర్గాల ప్రజలు వీరి కార్టూన్లని అమితంగా ఇష్టపడతారు.

సరసి గారు మంచి చిత్రకారులు కూడా. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వెళ్లి చూస్తే ఆయన చిత్రకళా నైపుణ్యం ఎలాంటిదో అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆయన మాటల్లోనే సరసి గారి గురించి మరన్ని విషయాలు చదువుదామా…

~ ~

1) సరసి గారూ మీ కార్టూన్లు మాదిరిగానే, కథలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఆలాగే మీ కలం (కుంచె )పేరు కూడా దీనికి అతీతం కాదు.సరసిఅని పేరు పెట్టుకోవడం వెనుక ఏదైనా కథ వుందా? మీ అసలు పేరు చెప్పండి?

♣ ‘నేములో నేమున్నదీ?’ అన్నారొక పెద్దాయన. నా అసలు పేరు సరస్వతుల రామ నరసింహం. అయితే కార్టూనులో ఓ చివర పేరు రాయడానికి ఇది బాగా పెద్దది అవుతుందని మా డ్రాయింగ్ మేష్టారు తమ్మా సత్యనారాయణ గారు నా పేరులో మూడు అక్షరాలను తీసుకుని ‘సరసి’ అని రెండోసారి బారసాల చేసారు.

సరసిగారి కుటుంబం

2) కథకుడిగా ముందు రంగప్రవేశం చేశారా? కార్టూనిస్టుగానా? ఎప్పుడు? ఎలా?

♣ మా గురువు గారి శిష్యరికంలో ముందు బొమ్మలే నేర్చుకున్నా. ఎనిమిదవ తరగతిలో ఒక కథ రాసాను. అయితే బాపు గారి కార్టూన్లు, బొమ్మలు ఎంతో ప్రభావితం చేసాయి. పదవ తరగతిలో ఒక పేజీ కార్టూన్లు వేసి పత్రికకి పంపితే అవి తిరిగి వచ్చాయి.

ఉగాది పురస్కారం

3) మీరు కార్టూనిస్టుగా ఎదగడం వెనుక నేపథ్యం చెప్పండి?

♣ మా ఇంట్లో ఎప్పుడూ హాస్యభరిత వాతావరణం ఉండేది. మా నాన్నగారు వ్యవసాయదారులు. మా వూరి సర్పంచ్‌గా రెండు పర్యాయాలు చేసారు. అయన ఎప్పుడూ ఇంట్లో పిల్లలతో సరదాగా ఉండేవారు. నవ్వించే విద్య అయన పెట్టిన భిక్షే. దరిమిలా బాపు గారి కార్టూన్లలో ‘నేటివిటీ’కి ఆకర్షితుడయ్యాను. ఆయనే నా కార్టూన్లకి ప్రేరణ. అయితే సంప్రదాయమైన చిత్రకళ, కథలకు కావలసిన కల్పనా చాతుర్యం నా గురువు తమ్మా సత్యనారాయణ గారి చలవే.

4) మీ మొదటి కార్టూను ఎప్పుడు, ఏ పత్రికలో ప్రచురింపబడింది.అప్పటి మీ అనుభూతిని వివరించండి?

♣ అయితే ఇరవై ఏళ్ల వయసులో 1976లో మొదటి కార్టూను ప్రచురణ జరిగింది ‘అపరాధ పరిశోధన’ అనే డిటెక్టివ్ పత్రికలో. అప్పటి నుంచి అటు కార్టూన్లు, ఇటు కథలు రెండూ ప్రయాణం ప్రారంభించాయి. అయితే ఎక్కువగా కార్టూన్లే.

జీవిత సాఫల్య పురస్కారం

5) మీకు నచ్చిన కార్టూనిస్టు, కథా రచయిత ఎవరు? ఎందుచేత?

♣ నిస్సందేహంగా నచ్చిన కార్టూనిస్టు బాపు గారే. తర్వాత చాలా మంది. కథా రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయన తరవాత చాలా మంది.

బాపు-రమణ పురస్కారం

6) సరసిఅంటే నాకు ముందు గుర్తుకువచ్చేది మీ కార్టూను, తరువాతే కథ. ఈ రెండు ప్రక్రియలలో ప్రజాదరణ పొందిన మీ ప్రక్రియ ఏది? ఎందుచేత?

♣ నేను కార్టూనిస్టుగానే ఎక్కువ మందికి పరిచయం. సుమారు నాలుగు వందల కథలు రాసినా నన్ను కార్టూనిస్టు అనే పిలుస్తున్నారు.

సరసి కార్టూన్ (1)

7) జోక్ – కార్టూనుల మద్య తేడాయేమిటి? కార్టూన్లు వేసేవాళ్ళు, జోకులు రాయలేరా? ఈ రెండు ప్రక్రియలలో, ఏది పాఠకుడిని అమితంగా ఆకర్షిస్తుంది?ఎందుచేత?

♣ వ్యాఖ్య, బొమ్మ రెండూ కలిపి పూర్తి అర్థాన్ని ఇస్తేనే అది కార్టూను అవుతుంది. కేవలం వ్యాఖ్య ద్వారానే పూర్తి ప్రయోజనం సిద్ధించిపోతే అది జోక్ అవుతుంది. కార్టూన్లు వేసేవాళ్ళు జోక్స్ కూడా రాయగలరు. అయితే బొమ్మలు వేసే విద్య వచ్చు కాబట్టి జోక్‌ని కార్టూనుగా మలిచి వెయ్యడానికే మొగ్గు చూపుతారు. కార్టూను అనేది దృశ్య మాధ్యమం. ఎక్కువమంది కళ్ళలో పడేది కార్టూనే.

సరసి కార్టూన్ (2)

8) మీ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనది. ప్రవృత్తితో ప్రజాదరణ పొందడానికి మీరు సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకున్నారు?

♣ తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసి ఉన్న రోజుల్లో నేను రాష్ట్ర శాసన సభలో సహాయ కార్యదర్శి (గెజిటెడ్) గా పని చేసి పదవీ విరమణ చేసాను. వృత్తిలో ఎంత ఒత్తిడి ఉన్నా సాయంత్రం ఇంటికి రాగానే నా అసలు జీవితం ప్రారంభం అవుతుంది.

9) ఆఫీసుపరంగా వృత్తితో, ప్రవృత్తి పరంగా ఇంట్లో, ఎప్పుడూ బిజీగావుండే మీరు, కుటుంబానికి సమయం ఎలా కేటాయించ గలిగారు? మీ జీవన శైలిపై, కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉండేది?

♣ నా వృత్తిలో ఉండే ఒత్తిళ్ళు, నా అభిరుచుల్లో ఉండే రుచులు మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందువల్ల నాకెప్పుడూ ఇబ్బంది రాలేదు. నా ఎదుగుదల వాళ్ళకి కూడా ఆనందమే కదా.

10) బాపు గారు అంతటి వారు మీ అబిమానినని చెప్పుకున్నారు. బాపు – రమణలతో మీ అనుబంధం ఎలాంటిది?

♣ నాలుగు మాటల్లో చెప్పేది కాదిది. 1998వ సంవత్సరంలో బాపు గారు ఆంధ్రప్రభ ఉప సంపాదకులు శ్రీ రమణ గారికి లేఖ రాస్తూ ‘మీ పత్రికలో సరసి (అనే అతను/ఆమె) వేస్తున్న కార్టూన్లు ఎంతో బావుంటున్నాయి. తెలుగు కార్టూనిస్టులలో ఆ మాత్రం తెలివైన వారిని నేను చూడలేదు’ అని రాసారు. వారు ఆ లేఖను నాకు పంపేరు. బాపు గారితో నాకు అపుడు పరిచయం లేదు. నేను ఆడో మగో కూడా ఆయనకు తెలియదు.

బాపు గారి తో…సరసి

2004వ సంవత్సరంలో నేను నా మొదటి కార్టూను పుస్తకానికి వారిని ముఖ చిత్రం వెయ్యమని అభ్యర్ధిస్తే, ఒకటి వేసిచ్చి, అది కాదు మరొకటి, మరొకటి అంటూ మొత్తం 5 బొమ్మలు వేసిచ్చారు. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. తరువాత ఆయనతో అనుబంధం పెరిగిపోయింది. నా కార్టూన్ల గురించి గొప్పగా ఎంతో మందికి నా పరోక్షంలో చెప్పి నా స్థాయి పెంచేశారు. ఎంతోమంది పెద్దవాళ్ళు, ఉన్నత స్థానాలలో ఉన్నవాళ్ళు అప్పటి నుంచి నా కార్టూన్లు చూసి, నాకు అభిమానులయ్యారు. ‘మీరు మా అబ్బాయి లాంటివారు’ అనేవారు బాపు గారు. జీవితంలో అంతకన్నా ఇంకేమి కావాలి? అలాగే రమణ గారు కూడా. ఒక మంచి కార్టూను పత్రికలో కనిపిస్తే చాలు వెంటనే బాపు గారి నుంచి ఫోను వస్తుంది. నన్నే కాదు ఏ కార్టూనిస్టు మంచి కార్టూను వేసినా వారి చిరునామాయో, ఫోను నంబరునో సంపాదించి అభినందించే గొప్ప గుణం బాపు గారిది.

బాపు, రమణలతో ఎన్నో మంచి అనుభవాలున్నాయి. అవన్నీ చెప్పడానికి స్థలం చాలదు.

11) మీరు గొప్పచిత్రకారులుఅని కూడా చెబుతారు. మీ చిత్రకళ గురించి వివరించండి?

♣ గొప్ప చిత్రకారుడిని కాదు. చాలా నేర్చుకోవలసింది ఉంది. చిన్నపుడు డ్రాయింగ్ మాష్టారు నేర్పిన విద్యే ఇప్పటికీ.

రాష్ట్ర శాసనసభలో నేను వేసిన అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, కాసు బ్రహ్మానంద రెడ్డి గార్ల నిలువెత్తు తైలవర్ణ చిత్రాలను అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఆవిష్కరించి సన్మానించడం మరిచిపోలేని అనుభవాలు. స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారి చిత్రం కూడా వేసాను.

సరసిగారి కొన్ని పుస్తకాలు

12) మీ అవార్డులు, సన్మానాల గురించి వివరించండి?

♣ చాలా చెప్పాలి. ముఖ్యంగా చెప్పేవి – కార్టూన్లకి 4 అంతర్జాతీయ అవార్డులు, 2 జాతీయ అవార్డులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, బాపు రమణ అకాడమీ వారి బాపు అవార్డు. అలాగే కార్టూన్లకి, కథలకి చాలా బహుమతులు, పురస్కారాలు లభించాయి.

వీటితో బాటు 8 కార్టూన్ల సంకలనాలని, ఒక మినీ కథల సంపుటినీ విడుదల చేసాను. వీటికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, బాపు గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, రావి కొండల రావు గారు, తనికెళ్ళ భరణి, డా. గురవారెడ్డి గారు ఇంకా మరికొందరు ప్రముఖుల ఆశీస్సులు, ముందు మాటలతో ఈ పుస్తకాలు విడుదల అయ్యాయి (అవి కావలసినవారు నా ఫోన్ నెం. 9440542950లో సంప్రదించండి. పోస్టు ఖర్చులు నేనే భరించి సరసమైన ధరలకు అందిస్తాను).

సరసి గారితో రచయిత

♣ ఈ ఇంటర్వ్యూ కారణభూతులైన మీకు (డాక్టర్ కె ఎల్వీ ప్రసాద్ గారికి) ప్రత్యేక ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here