41. సంభాషణం – కవయిత్రి కోసూరి జయసుధ అంతరంగ ఆవిష్కరణ

8
3

[సంచిక కోసం కవయిత్రి కోసూరి జయసుధ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

‘స్వయంసిద్ధ కవయిత్రి’ శ్రీమతి జయసుధ కోసూరి:

కుటుంబ నేపథ్యంగా సాహిత్య వాసనలు లేకున్నా ప్రత్యేకంగా ప్రోత్సహించిన గురువు లేకున్నా.. స్వయంగా కవిత్వం రాయాలనే అభిలాష వుండడం జన్యుపరమైన బహుమతిగా పరిగణించవచ్చు.

అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే అది ప్రకృతి ప్రసాదించిన లేదా.. దేవుడిచ్చిన వరంగా భావించాలి. అలాంటి గొప్ప వరం కవయిత్రి శ్రీమతి జయసుధ కోసూరిగారు పొందారని చెప్పక తప్పదు. దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుపెడితే అది కష్టమయిన పనే! కానీ కవయిత్రి సుధకు ఆ సమస్య ఎప్పుడూ రాలేదు. అంటే, తాను కవిత్వం రాస్తున్నప్పుడు భర్త ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. అదే ఈ కవయిత్రికి కొండంత బలంగా చెప్పవచ్చు.

ఇప్పుడు ఫేస్‌బుక్‌లో అనేక గ్రూపులు సాహిత్యాన్ని/కవిత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అందులో కొన్ని గ్రూపులు పుష్టికరమైన కవులను, కవయిత్రులను తయారుచేస్తున్నాయి. దీనికి మంచి ఉదాహరణ ఈనాటి మన కవయిత్రి శ్రీమతి జయసుధ కోసూరి.

ఆవిడ మాటల్లోనే ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందామా.. ఇదిగో మీ కోసం..

~

1. జయసుధ కోసూరి గారికి, సంచిక అంతర్జాల మాస పత్రిక పక్షాన స్వాగతం.

జ: థాంక్యూ సర్. నమస్తే అండీ.

2. మీ ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల విద్యాభ్యాసం ఎక్కడెక్కడ జరిగిందో వివరిస్తారా?

జ: నేను ప్రకాశం జిల్లా మార్టూరులో ఇంటర్మీడియట్ వరకూ చదివాను. నా చిన్నతనం అంతా అక్కడే జరిగింది. ఇంటర్మీడియట్ అయ్యాక పెళ్లయ్యింది. తర్వాత పదేళ్లకి Rural Shores Pvt Ltd అనే సంస్థలో పదేళ్లపాటు క్వాలిటీ మేనేజర్‍గా, టీమ్ లీడర్‌గా వర్క్ చేశాను. చదువుకోవాలనే తపన నాలో ఎప్పుడు ఉండేది. అందుకే ఉద్యోగం చేస్తూనే డిస్టెన్స్ మోడ్‍లో ఏలూరు అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, రాజమండ్రిలో తెలుగులో ఎం.ఏ. చేశాను. ఇటు ఇల్లు, అటు ఉద్యోగం, పాప ఇంకా చిన్నది కావడం వల్ల వీటన్నింటిని బాలన్స్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. మావారి సపోర్ట్ ఉండడం వల్ల కాస్త ఇబ్బంది లేకుండా ఉండేది.

కోసూరి జయసుధ దంపతులు

3. మీకు కవిత్వంవైపు మనసు ఎప్పుడు ఎలా మళ్లింది ?ఈ విషయంలో మిమ్ములను ప్రోత్సహించినవారు ఎవరయినా ఉన్నారా?

జ: ప్రోత్సాహం అంటూ ఏమీ లేదండీ. స్వతః సిద్ధంగా అబ్బినదే. మొదటి కవిత ఇంటర్‌లో రాసానని గుర్తు. అప్పట్లో వాటిని కవితలు అంటారని కూడా నాకు తెలియదు. ఖాళీగా వున్న రికార్డ్ బుక్‌లో చిన్న చిన్న కథలు, కవితలు రాసుకునే దాన్ని. సహజంగా చాలా మొహమాటస్థురాలిని కనుక ఎక్కడా చదవలేదు. ఆ వయసులో అందరి ముందు నిలబడాలంటేనే భయంగా ఉండేది. కాబట్టి నేను కవితలు రాస్తానని ఎవరికి తెలియదు.

4. విద్యార్థినిగా ఉన్నప్పుడు లేదా కవిత్వం వైపు మీ మనసు మళ్ళినప్పుడు ఎవరి కవిత్వం మీరు ఎక్కువగా ఇష్టపడేవారు? ఎందుచేత?

జ: కవిత్వం ప్రత్యేకించి చదివింది ఏమీ లేదండీ. స్కూల్ డేస్‍లో ఉండగా నా ఫ్రెండ్స్‌తో ప్రతీ ఆదివారం మా ఊరి లైబ్రరీలో చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర ఇలాంటి పుస్తకాలు చదవడం అలవాటయ్యింది. తర్వాత వేసవి సెలవుల్లో మా మేనమామ గారింటికి మార్కాపురం వెళ్ళినప్పుడు మా తిరుమల మామయ్య డిటెక్టివ్ బుక్స్, యండమూరి, యద్దనపూడి సులోచనా రాణి గారి బుక్స్ ఎక్కువగా తెచ్చి ఇచ్చేవారు. వాటిని వెంటనే చదివే అలవాటు నాకు. అక్కడ ఉన్నన్ని రోజులు ఆ పుస్తకాలు చదవడం ఎక్కువగా చేసేదాన్ని. తర్వాత జాబ్ చేసేటప్పుడు క్లయింట్‌కి వర్క్ పరంగా మెసేజ్‌లు పెట్టాల్సి వచ్చినప్పుడు, ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నాను. అప్పుడు ఫేస్‍బుక్ ఎకౌంట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. దానిలో చాలా వరకూ కవితలు చూసి, ఇలా నేను కూడా రాసేదాన్ని కదా ఒకప్పుడు, అనుకొని మళ్ళీ రాయడం ప్రారంభించాను. ఇక్కడ అందరి కవితలు చదివేదాన్ని. మొదట రెండు మూడు గ్రూపుల్లో నా కవితలు విజేతలవడం మొదలయ్యాక ఇంకాస్త మెరుగ్గా రాయడం నేర్చుకున్నాను.

కుమార్తెతో జయసుధ దంపతులు

ఉద్యోగ బాధ్యతల్లో పగలు కుదరకపోయినా రోజూ నిద్రపోయే ముందు కవితలు చదవడం అలవాటు చేసుకున్నాను. ప్రస్తుతం కవితలు చదవనిదే నిద్ర రాని పరిస్థితి.

నేను మొదటిసారి నాకంటూ కొనుక్కుని చదివిన పుస్తకం మాత్రం చలం గారిదే. మైదానం నవల. చాలా ఆలోచింప చేసింది. అది రాసి దాదాపు వందేళ్లవుతున్నా స్త్రీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదనిపించింది. ఆ తర్వాత చలం, శ్రీశ్రీ, గోపీచంద్ గారివి చాలా పుస్తకాలు చదివాను.

అంతెందుకు ఫేస్‌బుక్‌లో చాలా మంచి రచయితలు, కవులూ వున్నారు. వాళ్ళ కవిత్వాన్ని వెతుక్కొని మరీ చదువుతాను.

5. మీ మొదట కవిత ఏ పత్రికలో వచ్చింది? అప్పటి మీ అనుభూతి ఎలాంటిది?

జ: సాక్షి, ఉదయం, నేటి నిజం, విహంగ, ప్రజాకాంక్ష, విమల సాహితీ, ఉదయ సాహితీ ఇలా చాలా అంతర్జాల పత్రికల్లో నా కవితలు వచ్చాయి. అవి చూసాక ‘నేనూ కవిత్వం రాయగలను’ అన్న భరోసా వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. పోటిల్లో నా కవితలు విజేతలుగా నిలవడం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

6. మీ కవిత్వానికి ప్రధాన వస్తువు సాధారణంగా ఏమి ఉంటుంది? ఎందుచేత?

జ: నేను ఎక్కువగా భావ కవిత్వం రాశాను. నాకు సామాజికం పట్టుబడటం కాస్త కష్టం. కానీ ఈ మధ్య అది కూడా రాస్తూ విజేతగా నిలుస్తున్నాను. మన చుట్టూ వున్న సమాజాన్ని, సందర్భాన్ని గమనిస్తూ, ఆలోచిస్తుంటే ఏదైనా రాయగలను అనిపించింది. కాకపోతే లోతైన అధ్యయనం ముఖ్యం.

7. అసలు కవిత్వం రాయడంలో మీ ప్రధాన ఉద్దేశం ఏమిటో వివరిస్తారా?

జ: నేనెప్పుడూ కవిత్వం రాయాలని మొదలు పెట్టలేదు. ఓ బాధనో, వేదనో మనసును స్పందింప చేసినప్పుడు మాత్రమే రాయగలుగుతాను. రెగ్యులర్‌గా అదో హోంవర్క్ లాగా నేను రాయలేను. నాకు బాధలో నుంచే భావుకత పుడుతుంది. అప్పుడే సహజమైన కవిత్వం వస్తుంది. వెంటనే రాయగలుగుతాను.

రచనా వ్యాసంగంలో.. కవయిత్రి

8. సమసమాజ నిర్మాణంలో కవి/కవిత్వం పాత్ర ఏమిటి? ఎందుచేత?

జ: వీటి గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదండీ. కానీ నాకు అనిపించేది ఏంటంటే కవి చూపు భిన్నంగా ఉంటుంది. కత్తి చేయలేనిది కూడా కలం చేసి చూపుతుంది అన్నట్టు, సమాజంలో జరిగే అన్యాయాన్ని, అవినీతిని, దురాచారాన్ని మనదైన వాక్యంతో సమాజానికి చూపగలుగుతాం. ఆలోచింపచేస్తాం. ఇలా కొందరినైనా ఆలోచించే దిశగా కవిత్వం ఉండాలని నా అభిప్రాయం. తెలంగాణ పోరాటంలో ప్రజల్ని చైతన్య వంతులను చేసే దిశగా కవిత్వం ముందడుగు వేసింది. ఇలా సమాజానికి కవిత్వం చాలా అవసరమని నా అభిప్రాయం.

కవిత్వం మనసు స్పందన. ఒక సున్నితమైన ఊహ, సృజనాత్మక ప్రక్రియ. అది ఒక నిరంతర సాధన. ఏది ఏమైనా కవిత్వానికాధారం మనసు.

9. మీ పుట్టినింట, మెట్టినింట, కవయిత్రిగా మీకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది? విపులంగా చెప్పండి.

జ: నేను కవిత్వం రాసేటప్పటికి నాన్న లేరు. అమ్మ చదివింది ఐదవ తరగతి. అమ్మకు అంతగా వీటి గురించి తెలియదు. కానీ ఇలా విజేత అయ్యాను అని చెబితే సంతోషిస్తుంది. మా పెద్ద మేనమామ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు మంచి కవి. తెలుగులో శతకాలు, పద్యం, గద్య కవితలు రాసారు, ఎన్నో పుస్తకాలు అచ్చు అయ్యాయి. వారి అంశ కాస్త నాకూ వచ్చిందేమో అనుకుంటాను.

ఇక మావారు టీచర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సాహిత్యం మీద పెద్ద అవగాహన, ఆసక్తి లేకపోయినా అభ్యంతరం మాత్రం ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి అది ప్రోత్సాహమే అనుకుంటాను.

ఏలూరులో నిర్వహించిన కవి సమ్మేళనంలో గుర్రం జాషువా అవార్డు గ్రహీత డా కత్తిమండ ప్రతాప్ గారి చేతుల మీదుగా అందుకున్న సన్మానం.

10. మీరు ఎప్పుడైనా కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారా? అసలు సమాజానికి వాటి అవసరం ఉందంటారా? ఎందుచేత?

జ: మొదటిసారి 2019 మే నెలలో రాజమండ్రి వారు నిర్వహించిన కవి సమ్మేళనానికి హాజరయ్యాను. ఆ తరువాత ఓ నాలుగుసార్లు మాత్రమే వెళ్ళాను. తర్వాత వాటిమీద ఆసక్తి పోయింది. ఎందుకంటే..

ఒకే భావజాలం, ఆలోచన, అనుభూతి వున్నవాళ్లు, సాహిత్యం మీద ఆసక్తి వున్నవాళ్లు అక్కడికి చాలా మందే వస్తారు. వారి దగ్గర నేర్చుకొనేది చాలా ఉంటుంది అనుకొని వెళ్లేదాన్ని. కానీ సమయాభావమో, కవులు ఎక్కువగా హాజరవడమో, కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని ఉద్దేశం వల్లనో గానీ అక్కడ హడావిడి ఎక్కువ. ఎవరి తరహా వారిది. ఇక అక్కడకు వెళ్లినా నేర్చుకొనేది ఏమీ ఉండదని గ్రహింపుకొచ్చాక మానేసాను. పైగా గుంపులో గోవిందగా వెళ్లడం ఇష్టం లేక మానెయ్యడం జరిగింది.

విజయవాడలో కవితాలయం సమూహ పెద్దల చేతుల మీదుగా ‘కవిరత్న’ బిరుదు అందుకున్న సందర్బంగా..

11. మన తెలుగు రాష్ట్రాల్లో, విద్యాబోధన తెలుగులో ఉండాలని మీరు భావిస్తున్నారా? ఎందుచేత?

జ: అవునండీ. మన భావాలను, అభిప్రాయాలనూ చెప్పడానికి మన మాతృభాషకి మించినది లేదు. తెలుగంటే మన పేగు బంధం. అంతకంటే మన ఆలోచనని చెప్పుకోవడానికి ఇంకేం సరిపోతుంది చెప్పండి. ముందు ముందు తెలుగును బ్రతికించుకోవాలంటే మన మాతృభాషలో విద్యాబోధన అనేది తప్పనిసరి చెయ్యాలి. దీనికి మన వంతుగా కృషి చెయ్యాల్సిన అవసరమూ వున్నది.

12. మీరు చాలకాలంగా కవిత్వం రాస్తున్నారు. కానీ మీ ఖాతాలో ఒక్క కవితాసంపుటి కూడా చేరకపోవడానికి కారణం ఏమిటి? వివరంగా చెప్పండి.

జ: ఇప్పుడు పుస్తకాలు చదివేవాళ్ళు తక్కువ. ఫ్రీ గా ఇచ్చినా పక్కన పడేస్తున్నారు. పైగా ఇంకా నా కవిత్వం పుస్తకం రాసేంతగా అభివృద్ధి చెందిందా అని ఒక ఆలోచన. ప్రస్తుతం అంత స్తోమత కూడా లేదు. కానీ నేనైతే ప్రతీ పుస్తకాన్నీ కొనే చదువుతాను. ఎవరైనా అభిమానంగా పంపించినా తప్పకుండా చదివి నాకు తెలిసిన నాలుగు మాటలు కూడా రాస్తాను. పుస్తకాలు చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.

ఏలూరు జిల్లా,ఆర్కిడ్ గ్లోబల్ స్కూల్, బువ్వనపల్లి వారు నిర్వహించిన ఉగాది సంబరాల్లో, చిరు సత్కారం.

13. మీ కవిత్వానికి ఇప్పటివరకూ ఎలాంటి గుర్తింపు వచ్చింది? వివరంగా చెప్పండి.

జ: నా ప్రపంచం చాలా చిన్నది. ఎక్కువ పరిచయాలు కానీ, కవులు కానీ తెలియరు. ఫేస్‌బుక్‌లో చాలా మంది కవులు నా కవిత్వాన్ని ఆదరిస్తున్నారు. మూడు బిరుదులు వచ్చాయి. ‘నేటి కవిత’ సమూహంలో ‘కవితా భూషణ్’, ‘కవితాలయం’ వారిచ్చిన ‘కవిరత్న’, ‘సృజన సాహితీ’ వారిద్వారా ‘కవితా శిరోమణి’ అందుకోవడం జరిగింది. ఇంకా మీ పుస్తకం రాలేదేమిటని అడిగిన వారూ వున్నారు. చూడాలి మరి. ఎంతవరకు నన్ను గుర్తిస్తారో..

14. నేటి యువతీ యువకులు మరింతగా తెలుగు సాహిత్యంవైపు మక్కువ చూపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?

జ: ఇక్కడ చూస్తుంటే చిన్నవాళ్లు చాలా మంది రాస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. కవిత్వం కూడా బాగుంటుంది. ముందు ముందు తెలుగులో సాహిత్యం ఉందని తెలియాలంటే ఇప్పటి యువత సాహిత్యం వైపు ఓ చూపు వెయ్యాల్సిందే. ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం కవిత్వం రాయడానికి వర్క్‌షాప్స్ నిర్వహించడం; వాటికి యువత ఎక్కువగా హాజరువుతుండడం. ఇలాంటివి విస్తృతంగా జరగాలి. తెలుగు సాహిత్యానికి వర్ధమాన కవుల అవసరం ఎంతైనా వుంది.

రాజమండ్రిలో స్వర్ణభారతి సంస్థ వాళ్ళు చేసిన సత్కారం.

15. మీ సమయాన్ని వెచ్చించి మీ గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.

జ: డాక్టర్ గారూ! నాకు ఈ అవకాశం ఇచ్చి, ‘సంచిక’ పాఠకులకు నన్ను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే!

~

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here