[సంచిక కోసం ప్రముఖ కథా, వ్యాస రచయిత్రి శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
సహృదయ సాహితీమణి శ్రీమతి పుట్టి నాగలక్ష్మి..!!
అలాంటి వారిలో, ముందువరసలో కూర్చోబెట్టదగ్గవారు శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారు. వారిది ఉపాద్యాయ వృత్తి, ప్రవృత్తి రచనా వ్యాసంగం – పోస్టల్ స్టాంపుల సేకరణ.
స్టాంపులు సేకరించడమే కాదు, మన భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ విడుదల చేసిన మహిళా స్వాతంత్ర్య సమరయోధులు, ఇతర ప్రముఖ మహిళామూర్తుల పోస్టల్ స్టాంపులు సేకరించి వారి గురించి సంక్షిప్తంగా తెలుగు పాఠకలోకానికి అందిస్తున్నారు. అంతమాత్రమే కాకుండా గతంలో వీరు అనేక పత్రికలలో కథలు రాశారు.
‘సంచిక’ అంతర్జాల పత్రికకు సుపరిచితులైన శ్రీమతి పుట్టి నాగలక్ష్మి పదవీవిరమణ చేసి రచనా వ్యాసంగంతో చక్కగా సేదతీరుతున్నారు. నాగలక్ష్మి గారి గురించి మరికొన్ని విషయాలు, వారి మాటల్లోనే చదువుదామా! పదండి ముందుకు —
~
డా. కె. ఎల్. వి. ప్రసాద్: పుట్టి నాగలక్ష్మి గారూ! నమస్కారం. ‘సంచిక’ అంతర్జాల మాస పత్రిక పక్షాన మీకు స్వాగతం.
పుట్టి నాగలక్ష్మి: నమస్తే డాక్టర్ గారూ! మన ‘సంచిక’ పాఠకులకు ఇలా పరిచయమవడం సంతోషంగా ఉంది.
ప్రశ్న1: మీ ఉద్యోగపర్వం అంతా విద్యారంగంలో ముగిసిపోయింది కదా! తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి ఎప్పుడు, ఎలా కలిగింది?
జ: నా ఉద్యోగజీవితం సాహితీ సృజనకి కొంతవరకు తోడ్పడింది. నేను ఉపాధ్యాయినిగా చాలా శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యాను, అక్కడ బాలల కోసం స్కిట్లు, అభినయ గేయములు, చిట్టి పొట్టి నాటికలు వ్రాయడం అలవాటయింది.
నేను 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పాను. ఆయా సందర్భాలలో వారి కోసం గేయాలు, ఏకపాత్రాభినయాలు, నాటికలు వ్రాసి, పాధన చేయించేదానిని. స్థానిక, జిల్లా, రాష్ట్రస్థాయిలలో బహుమతులు లభించాయి.
S.C.E.R.T. (State Council for Educational Research and Training) వారు ప్రతి సంవత్సరము కౌమారవిద్యకి సంబంధించిన గేయాలు, స్కిట్లు, నాటికల పోటీలు నిర్వహించేవారు. 2012వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయిలో నేను వ్రాసి, దర్శకత్వం వహించిన నాటికకు ద్వితీయ బహుమతి లభించింది.
నేను మా నాన్నగారు స్వర్గీయ శ్రీ పుట్టి వేంకటేశ్వరరావు పేరుతో ‘శ్రీ పుట్టి వేంకటేశ్వరావు సామాజిక సేవా సంస్థ’ ద్వారా విద్యార్థులకు వివిధ సాహితీ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేసేదానిని. ఇంకా మా సంస్థ ఆధ్వర్యంలో సాహితీవేత్తలను పాఠశాలకు ఆహ్వానించి – తెలుగు భాషాదినోత్సవం – నిర్వహించేదానిని.
బడిలో రచనలతో సమాంతరంగా వివిధ పత్రికలలోనూ రచనా వ్యాసంగం కొనసాగింది. 1984లో మొదలై ఈ నాటికీ కొనసాగుతూవుంది. మధ్యలో ఒకసారి ఐదేళ్ళు, ఒకసారి ఆరేళ్ళు వివిధ కారణాల మూలంగా కుంటువడింది.
ప్రశ్న 2: రచనా వ్యాసంగం పట్ల మీకు ఎవరయినా మార్గదర్శనం చేశారా? అది ఎప్పుడు, ఎలా జరిగింది?
జ: నేను బి.ఎ డిగ్రీ తెలుగు సాహిత్యం, చరిత్ర, అర్ధశాస్త్రములతో చేశాను. మా తెలుగు లెక్చరర్ ఝాన్సీగారు తెలుగు సాహిత్యపాఠాలు బోధించేవారు. ఆవిడ ఒకసారి కాలేజి మ్యాగజైన్ కోసం ఏమయినా వ్యాసాలు వ్రాయమని మమ్మల్ని అడిగారు. వారం గడిచాక ఒకరోజు “మీకు ఇన్నిపాఠాలు చెప్పాను. ఇంతమంది ఉన్నారు. కనీసం ఒకరయినా వ్రాయలేదు” అని బాధను వ్యక్తపరిచారు. నాకు చాలా బాధేసింది.
ఆ రోజు రాత్రి ఆలోచించాను. మూడు రోజుల్లో మూడు వ్యాసాలు వ్రాశాను. 1. నన్నయ అక్షర రమ్యత, 2. శ్రీనాథ సాహిత్యంలో ప్రకృతి వర్ణనలు 3. శ్రీనాథ సాహిత్యం గురించే (విషయం గుర్తులేదు). మా ఝాన్సీ మేడమ్ చాలా సంతోషించారు. మూడూ మ్యాగజైన్‍లో అచ్చువేశారు. ఆ విధంగా మా మేడమ్ నాకు మార్గదర్శనం చేశారు.
ప్రశ్న 3: మీరు విద్యార్థినిగా ఉన్నప్పుడు ఎవరి రచనలు ఎక్కువగా చదివేవారు? ఎందుచేత?
జ: మా ఇంటికి వారపత్రికలు, మాసపత్రికలు తెప్పించేవారు. 6వ తరగతి నుండీ వాటిని చదివేదానిని. పాఠశాల, కళాశాలలోని గ్రంథాలయాల్లోను, ఉద్యోగంలో చేరిన తరువాత పౌర గ్రంథాలయాలకి వెళ్ళి అందరి రచనలు చదివేదానిని. ప్రత్యేకంగా ఒకరి రచనలే చదవాలనే అభిప్రాయం లేదు. అందరివీ చదివితేనే వివిధ వర్గాల వారి జీవన పరిస్థితులను, సమాజంలో సంభవించే మార్పులను అర్థం చేసుకోగలుగుతాము. ఆయా పాత్రల ద్వారా మానవ మనస్తత్వాలను అవగాహన చేసుకోగలుగుతాము.
ప్రశ్న 4: మీ రచనలు మొదట ఏ పత్రికలో ప్రచురింపబడ్డాయి? అప్పుడు మీరు పొందిన అనుభవాన్ని చెప్పండి.
జ: నా రచనలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడ్డాయి. నా కథ ప్రచురణకు అంగీకరించినట్లుగా ఉత్తరం వచ్చింది. ఏ వారం వస్తుందా? అని ఎదురుచూశాను.
నా మొదటి కథే పెద్ద పత్రికలో ప్రచురింపబడినందుకు చాలా సంతోషం కలిగింది. నా పేరు పత్రికలో చూడగానే నేనూ వ్రాయగలను అనే ఆత్మవిశ్వాసం కలిగింది.
ప్రశ్న 5: మొదట మీ కథ/కవిత/వ్యాసం ఏది ప్రచురింపబడింది?
జ: 1984లో నా మొదటి కథ ‘ఎవరు మేకపిల్ల?’, మొదటి సాహిత్య వ్యాసం ‘తెలుగు సాహిత్యంలో రాష్ట్రగానం’ – ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడ్డాయి. మొదటి సినిమా వ్యాసం ‘దేవులపల్లి సినీగీతాలలో ప్రకృతిశోభల ఊసులు’ – ‘జ్యోతిచిత్ర’ సినీవారపత్రికలో ప్రచురింపబడింది.
ఆ కథకి 30 రూపాయలు పారితోషికం పంపించారు. ఆ డబ్బుతో కొనుక్కున్న ఫోటో ఆల్బమ్ ఇప్పటికీ అపురూపంగా దాచుకున్నాను.
ప్రశ్న 6: ‘సంచిక’లో మీ వ్యాస పరంపర పాఠకులుగా గమనించాం. వ్యాసం మీద మీకు అంత వ్యామోహం కలగడానికి గల ప్రధాన కారణం?
జ: 2019లో విజయవాడలో జరిగిన ఒక సాహితీసమావేశంలో ‘సంచిక’ ఎడిటర్ శ్రీ కస్తూరి మురళీకృష్ణ కలిశారు. “ఏదైనా ఒక అంశం తీసుకుని వ్రాయండి” అన్నారు. ‘సంచిక’లో మొదట రెండు కథలు, పది కవితలు వ్రాశాను.
2020 ఆగష్టు నుండి ‘స్టాంపుల్లో మహిళలు’ అంశం తీసుకుని 120 మంది స్త్రీమూర్తులను గురించి వ్యాసాలు వ్రాశాను.
నేను మొదటి నుంచి ఏ పత్రికకయినా ఒకటి రెండు వ్యాసాలు పంపించేదానిని. పత్రికల సంపాదకులు వ్యాసాలు వ్రాయమని అవకాశం కల్పించేవారు. అలా వ్యాసాలు వ్రాయడం అలవాటయింది. అంతకుమించి వేరే కారణం లేదు.
ప్రశ్న: స్త్రీమూర్తుల తపాల బిళ్ళలు, వాటి చరిత్ర గురించి మీరు ప్రత్యేక దృష్టి సారించడానికి గల కారణం?
జ: ఇక్కడ స్టాంపుల ప్రదర్శన గురించి చెప్పవలసి వుంది. నేను ‘Thematics’ విభాగంలో ప్రదర్శన తయారు చేశాను. ఏదో ఒక అంశం తీసుకుని, పరిశోధన చేసి ఒక క్రమంలో అమర్చుకోవాలి. ప్రతి స్టాంపు గురించి ముఖ్యమైన సమాచారం చాలా క్లుప్తంగా రాయాలి.
నేను ‘The Fragrance of Superiority The Marvelous Women’ శీర్షికతో మహిళల స్టాంపుల ప్రదర్శన తయారు చేశాను. ఆ సమయంలో మహిళల స్టాంపులు తక్కువగా ఉండడం గమనించాను. 1997లో నేను వ్రాసిన ‘స్టాంపుల ముద్రణలోనూ చిన్న చూపేనా?’ అనే వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రిక మహిళల పేజీ ‘నవీన’లో ప్రచురించబడింది. ఈ వ్యాసమే ‘స్త్రీమూర్తుల తపాలబిళ్ళలు’ వ్యాసాలు వ్రాసేందుకు స్ఫూర్తినిచ్చింది.
కస్తూరి మురళీకృష్ణగారు ‘సంచిక’లో వ్రాసేందుకు ఇచ్చిన అవకాశం ఈ వ్యాసాలు వ్రాసేందుకు దోహదం చేసింది. వారికి, ‘సంచిక’ టీమ్‌కి, సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను.
ప్రశ్న 8: ఒక బాధ్యత గల ఉపాధ్యాయినిగా, విద్యార్థులు తెలుగుభాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి చూపే విధంగా ఎంత వరకూ మార్గదర్శనం చేయగలిగారు?
జ: నేను బి.యిడి. పూర్తి చేసిన తర్వాత మొదట ఒక గ్రామంలోని అభ్యుదయ ప్రాథమిక పాఠశలలో పనిచేశాను. మూడు సెషన్లలో జరిగేది. మొదటి సెషన్ ఉదయం గం 6-15 ని-ల నుండి 8 గంటల వరకు. ఈ సెషన్‍లో యోగాసనాలు, ప్రాణాయామము, వ్యాయామము జరిగేవి. ఒక రకంగా ఇది వ్యాయామోపాధ్యాయిని డ్యూటీ. రెండవ సెషనలో ఉదయం గం-9-20 ని-ల నుండి మధ్యాహ్నం గం-12-40ని-ల వరకు పాఠాలు చెప్పాలి.
మూడవ సెషన్ సాయంత్రం గం-4-15ని-ల నుండి గం-6-15 నిల వరకు. ఈ సెషన్‌లో సహవిద్యాకార్యక్రమములు, అభినయ గేయాలు, గేయనాటికలు, వివిధ అంశాలలో స్కిట్లు, బాలల నాటికలు, హరికథలు, బుర్రకథలు, కోలాటం వంటి వాటిలో శిక్షణ నివ్వడం జరిగేది.
మూడవ సెషన్‍లోని అంశాలు విద్యార్థులకు తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచడానికి తోడ్పడ్డాయి. వారికి వివిధ అంశాలలో శిక్షణనిచ్చి పోటీలకు పంపించేదానిని. బేసిక్ టీచర్ శిక్షణ పొందిన ఒక సీనియర్ ఉపాధ్యాయిని సలహాలు, సూచనలు ఇచ్చేవారు.
మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధం చేసి పంపేదానిని. వారికి బహుమతులు వచ్చేవి.
హైస్కూలులో ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా పనిచేసినప్పుడు కూడా విద్యార్థులకు పై కార్యక్రమాలను నిర్వహించాము. మా ఉపాధ్యాయ బృందం అందరూ సహకరించేవారు.
గ్రంథాలయ వారోత్సవాలలో, ‘వివిధ దినోత్సవాల సందర్భం’, ‘జాతీయపండగల సందర్భంలో’ తెలుగులో వ్యాసరచన, వక్తృత్వము, క్విజ్ వంటి పోటీలకు నేను తయారు చేసి పిల్లలు పాల్గొనేట్లు చేసేదానిని.
నాకు పరిచయమున్న వివిధ సాహితీ సంస్థలు, ప్రముఖులను తెలుగు భాషా దినోత్సవం, మాతృభాషాదినోత్సవాల సమయంలో మా పాఠశాలకు ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. వివిధ సందర్భాలలో నిర్వహించిన తెలుగు భాషకు సంబంధించిన చర్చలు, సమావేశాలలో పిల్లలు పాల్గొనేవారు. వారికి నగదు బహుమతులు కూడా అందజేసేవాళ్ళం.
ఈ విధంగా పిల్లలకు మార్గదర్శనం చేశాననే తృప్తి ఉంది.
ప్రశ్న 9: ఈ మధ్యకాలంలో తెలుగు సాహిత్యకారులను అనేక రూపాలలో ప్రోత్సహిస్తున్న మీకు తెలిసిన విద్యావేత్త, సాహితీవేత్త గురించి చెప్పండి.
జ: ఈ మధ్యకాలంలో చాలా మంది విద్యావేత్తలు, సాహితీవేత్తలు వ్యక్తిగతంగాను, సాహితీసంస్థల ద్వారాను మన తెలుగు భాషకు సేవలు అందిస్తున్నారు. వివిధ అంశాలను గురించి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో సభలు, సమావేశాలను నిర్వహిస్తున్నారు. వాట్సప్ గ్రూపులలోను జూమ్ సమావేశాలను (కోవిడ్ కాలం నుండి) సాహితీ సమావేశాలను అంతర్జాతీయ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నారు.
బాలలకు, పెద్దలకు కూడా తెలుగు భాష, సాహిత్యాలపట్ల అవగాహనను పెంపొందింపజేస్తున్నారు.
ఈ విధంగా తెలుగు భాషను ప్రోత్సహిస్తున్న విద్యావేత్తలు, సాహితీవేత్తలు, సాహితీ సంస్థలు, అంతర్జాల సమూహాలు అందరూ అభినందనీయులే!
ప్రశ్న 10: మీరు ఒక పాఠకురాలిగా, ఎక్కువ రచయిత్రుల రచనలు ఇష్టపడతారా? రచయితల రచనలు ఇష్టపడతారా? ఎందుచేత?
జ: ప్రత్యేకించి రచయిత్రుల రచనలు, రచయితల రచనలు అని తేడా చూడను. నా మనసుకి నచ్చిన రచనలు అన్నీ ఇష్టపడతాను.
ప్రశ్న 11: ముద్రితాలయిన మీ రచనల గురించి, ముద్రించబోయే రచనల గురించి వివరించండి.
జ: నా రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి, మన తెలంగాణ, ఆంధ్రప్రభ దినపత్రికలలో; ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర, ఆంద్రప్రభ, సన్‍ఫ్లవర్ వార పత్రికలలోను; కలువబాల పక్షపత్రిక, వనితాజ్యోతి, నది, విశాలాక్షి, స్రవంతి, విజ్ఞానసుధ, భావవీణ, భావతరంగిణి, చినుకు, నడుస్తున్న చరిత్ర, సురక్ష, ఉపాధ్యాయ, బాలరంజని వంటి మాసపత్రికలు, ద్విభాషా త్రైమాస పత్రిక స్రవంతి, ‘సంచిక’ వెబ్ మ్యాగజైన్ లలో ముద్రించబడ్డాయి. ఆకాశవాణిలో కవితలు, కథలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. కథలు, కవితలు, గ్రంథ సమీక్షలతో పాటు కెరీర్ గైడ్, ప్రశ్న× ప్రజ్ఞ, కెరీర్ గైడెన్స్ వంటి శీర్షికలతో జనరల్ నాలెడ్జికి సంబంధించినవి వ్రాశాను.
కిడ్స్ కార్నర్, మొగ్గ, ఛుక్ ఛుక్ రైలు వంటి బాలల శీర్షికల కోసం నవీన, నవ్య, చెలి, జీవన శీర్షికలతో, కలువబాల, వనితాజ్యోతిలలో మహిళల అంశాలతో వ్యాసాలు వ్రాశాను.
నది, విశాలాక్షి, ఆంద్రభూమి పత్రికలలో తెలుగు సినీనేపథ్య గాయనీగాయకుల గీతాల వైవిధ్యాన్ని వివరిస్తూ వ్యాసాలు వ్రాశాను.
‘సంచిక’ అంతర్జాల పత్రికలో కథలు, కవితలు, పుస్తక పరిచయాలు వ్రాశాను. 120 మంది ‘స్టాంపుల్లో మహిళలు’ వ్యాసాలు వ్రాశాను.
గాంధీపెక్స్, అహింసాపెక్స్ పేరిట నిర్వహించిన స్టాంపుల ప్రదర్శనలో గాంధీమహాత్ముని స్టాంపులను ప్రదర్శించాను. ఆ అనుభవంతో ‘స్టాంపుల్లో మహాత్ముడు’ పుస్తకం ముద్రించాను.
వివిధ పత్రికలలో ముద్రించిన స్టాంపుల వ్యాసాలతో ‘స్టాంపుల్లో నాయకులు’, ‘తపాలాబిళ్ళలలో కట్టడాలు’, మొదలయిన పుస్తకాలు ముద్రణలో ఉన్నాయి.
‘సినీగాయనీగాయకుల వ్యాసాల సంకలనం,’ ‘సంచిక’లోని ‘స్టాంపుల్లోని మహిళామూర్తులు’, ముద్రించే ఆలోచన ఉంది. కవితలు, కథలతో కూడా పుస్తకాలు ముద్రించాలని. 2024లో ఈ పనులు చేద్దామని..
‘కృష్ణా జిల్లా రచయితల సంఘం’ వారు ముద్రించిన పలు గ్రంథాలలో కూడా కొన్ని ప్రత్యేక వ్యాసాలు వ్రాశాను.
మొత్తం మీద సుమారు 520 వ్యాసాలు, 20 కథలు (12 రేడియో కథలే), 50 కవితలు, 25 సమీక్షలు, జనరల్ నాలెడ్జికి సంబంధించిన మెటీరియల్ వ్రాశాను. అన్ని పత్రికలలో ఆకరగ్రంథాలలో ముద్రితమయ్యాయి.
ప్రశ్న 12: మీరు పొందిన అవార్డుల గురించి, సన్మానాల గురించి వివరించండి.
జ: (1) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయినులకి ప్రదానం చేసే ‘సావిత్రీబాయిపూలే ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం’ 2018లో లభించింది.
(2) కృష్ణాజిల్లా విద్యాశాఖ వారు నూరుశాతం ఉత్తీర్ణతా శాతాన్ని సాధించినందుకు పలుమార్లు ప్రశంసాపత్రాలను అందించారు.
(3) విజయవాడ సాహితీసమాఖ్య వారు ‘సావిత్రీబాయి పూలే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారాన్ని’ 2017లో అందించారు.
‘లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ’, హైదరాబాద్ వారి నుండి 2020లో ‘మాతృదేవోభవ పురస్కారాన్ని’ అందుకున్నాను.
2016లో ‘అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్’ వారి ‘అమ్మ’ పురస్కారం అందుకున్నాను.
భారత వికాస పరిషత్, ఆంధ్రప్రదేశ్ శాఖ వారిచేత ఉత్తమ ఉపాధ్యాయినీ పురస్కారాన్ని, భావ తరంగిణి (మచిలీపట్నం) వారి సాహితీసేవా పురస్కారాన్ని అందుకున్నాను.
2014 లోనే ‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ (తానా) వారి పురస్కారం లభించింది.
తెలుగు సంస్కృతీయాత్రలో పాల్గొన్నందుకు 2008లో నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ యం. వెంకయ్యనాయుడు గారి అభినందనలు అభించాయి.
2019 నవంబర్ 1 నుండి 3 వ తేదీ వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి, మాజీ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌ల అభినందనలు అందుకున్నాను.
స్టాంపుల ప్రదర్శనలలో పతకములను బహుమతులుగా అందిస్తారు. స్టాంపుల ప్రదర్శనలో వివిధ స్థాయిలలో సుమారు 35 పతకాలు పొందాను. వీటిలో జాతీయస్థాయి పతకాలే ఎక్కువ.
స్టాంపుల ప్రదర్శనలలో స్టాంపుల ఆధారిత సాహిత్యంలో కూడా పోటీలను నిర్వహిస్తారు.
ముద్రిత గ్రంథాల విభాగంలో ‘స్టాంపుల్లో మహాత్ముడు’, గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయిలో ఒకటి, జాతీయస్థాయిలో రెండు కాంస్యపతకాలు లభించాయి.
అంతర్జాల పత్రికలలో వ్యాసాల ముద్రణావిభాగంలో కూడా రాష్ట్రస్థాయిలో ఒకటి, జాతీయ స్థాయిలో రెండు కాంస్య పతకాలు లభించాయి.
ప్రశ్న 13: భవిష్యత్తులో తపాల బిళ్ళలు అంతరించిపోయే పరిస్థితులు మెండుగా కన్పిస్తున్నాయి. దీనిపై మీ స్పందన?
జ: మన బాల్యం నుండి కొన్ని సంవత్సరాల క్రితం వరకు మనమందరం ఉత్తరాలు వ్రాసుకునేవాళ్ళం. వాటికి అంటించిన తపాలబిళ్ళలు సేకరించి దాచుకునేవాళ్ళం. సెల్‍ఫోన్లు, కంప్యూటర్లు, అంతర్జాలంలో సమాచారం పంపించడంలో అభివృద్ధిని సాధించాం. ఉత్తరాలు వ్రాసుకోవడం తగ్గింది. కాబట్టి తపాల బిళ్ళల వాడకం తగ్గింది.
కాని జ్ఞాపకార్థ స్టాంపులు, వివిధ సందర్భాలలో విడుదలయ్యే ప్రత్యేక స్టాంపులను సేకరించేవారు ప్రపంచదేశాలన్నింటిలోను కొన్ని లక్షలమంది ఉన్నారు. వీరు వివిధ దేశాల స్టాంపులను సేకరిస్తారు. ప్రతి రెండు మూడు సంవత్సరాలకి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో స్టాంపుల ప్రదర్శనలు జరుగుతున్నాయి. (కోవిడ్ కాలంలో కూడా) అన్ని రంగాలలో లానే ఈ రంగంలో కూడా వర్చువల్ స్టాంపుల ప్రదర్శనలు జరిగాయి. నేను వాటిలో కూడా పతకం గెలిచాను.
కాబట్టి నిత్యవాడకంలో స్టాంపులు అంతరించి పోయినా స్టాంపుల ప్రదర్శనకారులు (ఫిలేటలిస్టులు), స్టాంపుల ప్రదర్శనలు అవి అంతరించి పోకుండా కాపాడతాయి (రు). స్టాంపులంటే ఒకటి రెండంగుళాల కాగితపు ముక్కలే కాదు. అవి మనకి చాలా కథలు చెపుతాయి. ఊసులాడతాయి. తమ వెనక తరతరాల చరిత్రని, భౌగోళిక సంపదని, మానవజీవిత చరిత్రని నిక్షిప్తం చేసుకున్నాయి!
నా ఈ అభ్యున్నతికి, సాహితీసృజనకు దోహదపడిన వారందరికీ నమోవాకాలు,
మా తెలుగు అధ్యాపకులు శ్రీమతులు పొట్లూరి ఝూన్సీ లక్ష్మిబాయి గారికి, అన్నపూర్ణభవాని శివరాణి గారికి, చరిత్ర అధ్యాపకులు ప్రమీలగారికి, నర్రా త్రిపురాంబగారికి, ఇందిరాభవాని గారికి, నావృత్తికి కళాశాలలోనే బీజాలు వేసిన అర్థశాస్త్ర అధ్యాపకులు శ్రీమతి యన్. ధనేశ్వరి గారికి నా నమస్సుమాంజలి.
గాడ్ మదర్, గాడ్ ఫాదర్ లాగనే గాడ్ ఫ్రెండ్స్ వుంటారు. అటువంటి వారికి నా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
చివరిగా ఒక్క మాట-
“అనుకున్నామని జరగవు అన్నీ!
అనుకోలేదని ఆగవు కొన్నీ!
జరిగేవన్నీ మంచికనీ
అనుకోవడమే మనిషి పనీ”
అనే సినీకవి మాటలు ఎల్లప్పడూ గుర్తు చేసుకుంటూ జీవితాన్నీ, సాహితీయానాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాను.
~
డా. కె. ఎల్.వి. ప్రసాద్:- ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ!
పుట్టి నాగలక్ష్మి: నా సాహితీయానాన్ని గురించి, స్టాంపులతో నాకున్న అవినాభావ సంబంధాన్ని సంచిక రచయితలు, పాఠకులతో పంచుకునే అవకాశం కల్పించిన ‘సంచిక’ యాజమాన్యానికి, సంపాదక వర్గానికీ, మీకూ హృదయపూర్వక దన్యవాదాలండీ!