Site icon Sanchika

సంభాషణం: శ్రీమతి రమాదేవి బాలబోయిన అంతరంగ ఆవిష్కరణ

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం వర్థమాన కవయిత్రి/రచయిత్రి శ్రీమతి రమాదేవి బాలబోయిన గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

వరంగల్ సాహితీ సౌదామిని శ్రీమతి రమాదేవి బాలబోయిన

[dropcap]బా[/dropcap]ధ్యతాయుతమైన వృత్తిలో కొనసాగుతూనే, సాహిత్యం, సామాజిక సేవలను ప్రవృత్తిగా ఎంచుకోవడంతో పాటు, సాంసారిక బాధ్యతలను సైతం అదే స్థాయిలో నిర్వర్తించగలగడం, ఎలాంటి మహిళకైనా కత్తిమీద సాములాంటిదే మరి! పైగా, వృత్తి జాతీయభాషగా చెప్పబడుతున్న హిందీ బోధన, ప్రవృతి మాతృబాష అయిన మన తెలుగు-భాష. తెలుగు సాహిత్యంలో ఉన్న అన్నిప్రక్రియల్లోనూ, తనదయిన శైలిని ఎంచుకుని ఒక నదీప్రవాహాంలా,ముందుకి సాగిపోతున్న వర్థమాన కవయిత్రి/రచయిత్రి శ్రీమతి రమాదేవి.

రమాదేవి. బాలబోయిన

ఒక ప్రభుత్వ పాఠశాలలో ‘హిందీ’ ఉపాధ్యాయినిగా పనిచేస్తూ, కథ, నవల, గేయం, గజల్, లలిత గీతాలు, చిత్రకవితలు, నానీలు, మినీకవితా, ఇలా చాల ప్రక్రియలలో రచనలు చేస్తున్న మహిళామణి శ్రీమతి రమాదేవి.

దీనికి తోడు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలతో సంబంధం కలిగివుండి సేవారంగంలో సయితం తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్న సహృదయని శ్రీమతి రమాదేవి. బోధనా రంగంలో ఉండి, చిన్న/పెద్ద పిల్లలతో సంబందాలు కలిగి ఉండడం మూలాన, పిల్లలలో చదువుతో పాటు సాహిత్యాభిలాషను కలగజేయడంలో అవిరళ కృషి చేస్తున్నారు. రేపటి కవులను, రచయితలను, కళాకారులను తయారు చేయడంలో తమవంతు కృషి చేస్తున్నరు. రమాదేవి మంచి గాయని కూడా కావడం విశేషం!

~

కవితలు కథలు అన్నింటికీ సమాజమే ప్రేరణ. చాలామంది కవులు రచయితల సాహిత్యం చదివారు. రచనా విధానం తెలుసుకున్నారు. అదృష్టవశాత్తూ ఆయా పెద్ద రచయి(త)త్రుల ఆశీర్వాదం తనకు లభించింది. కవితా సంపుటి ‘ప్రాణం వాసన’. వివిధ సామాజిక మాధ్యమాల్లో పోటీలకు చాలా బహుమతులు వచ్చాయి. ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గారిపై రాసిన కవితకు ఉదయసాహితీ సంస్థ నుండి రాష్ట్ర స్థాయి కాళోజీ పురస్కారం అందుకున్నారు. కథల్లో కూడా చాలా బహుమతులు పొందిననూ ‘మరో అమ్మే భార్యంటే’కి జలదంకి పురస్కారం రావడం చాలా వారికి సంతోషాన్ని కలిగించింది. ఇక జరీనా దీదీ ఎర్రచమ్కీ చీర, ఆ చివరి క్షణంలో మంచి పేరును తెచ్చాయి. మీలిత నవల వారిని సాహిత్యం లోకంలో నవలా రచయిత్రిగా నిలబెట్టింది. మల్లినాథసూరి కళాపీఠం వారినుండి. ప్రియమైన కథకులు సమూహం నుండి, కవితా లయం మరియు తెలుగు సాహితీ వనం సమూహం నుండి వివిధ కధలకు కవితలకు బహుమతులు అందుకుని సాహితీ పెద్దల దీవెనలందుకున్నారు.

రమాదేవి గారు 7/9/1979 నాడు జన్మించారు. ప్రాథమిక విద్య… మరిపెడ బంగ్లా- ప్రభుత్వ పాఠశాల1-2, మాధ్యమిక విద్య- మహబూబాబాద్ లో లాల్ బహదూర్ శాస్త్రి3-6 పాఠశాల.. సెవెంత్ క్లాస్: ఖిలావరంగల్ ఆరెళ్ళి బుచ్చయ్య హైస్కూల్… ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి(1994)వరకు మరియు ఇంటర్మీడియట్ (CEC): వరంగల్ క్రిష్ణా కాలేజీ. డిగ్రీ (HPP) & పీజీ (హిందీ&ఇంగ్లీష్) కాకతీయ విశ్వవిద్యాలయం. హాందీ పండిట్ ట్రైనింగ్ హన్మకొండ బీఈడీ కళాశాల చదివారు.

వివాహం 18/06/1994 నాడు (పదవ తరగతి పూర్తి కాగానే, వయసు 15+) డా. కట్ల శ్రీనివాస్ గారితో జరిగింది. అనంతరం MSC, BEd, Phd (Chemistry) చదివారు.

శ్రీ వారితో… రచయిత్రి రమాదేవి బాలబోయిన

1996లో స్కూల్ అసిస్టెంట్‍‌గా జాయిన్ అయి ప్రస్తుతం గెజిటెడ్ హెడ్మాస్టర్ & వరంగల్ జిల్లా సైన్స్ ఆఫీసర్‍గా పనిచేస్తున్నారు.

పిల్లలు – పెద్దబ్బాయి సాయిరాజ్ మృదువిన కుమార్(1996) – మెకానిక్ ఇంజనీరింగ్ ఐఐటీ భువనేశ్వర్ లో పూర్తి చేసి రోబోటిక్స్ లో పరిశోధన చేస్తున్నారు. చిన్నబ్బాయి సాయిరాజ్ విరుల్ కుమార్ (1998) – ఐఐటీ బాంబే లో ఎలక్ట్రికల్ ఆనర్స్ చదువుతున్నారు.

రమాదేవి కుటుంబం

రమాదేవి బాలబోయిన 2005లో సాంత్వన ఫౌండేషన్ ప్రారంభించారు. పేద, అనాథ పిల్లలు, వృద్దులు, ఒంటరి మహిళలు ముఖ్యంగా కాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్న ఫౌండేషన్ వీరిది.

ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో మొదటి కవిత రాసారు. అది పత్రికలో అచ్చైంది… ఆ తరువాత 2016 నుండి రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.

~

ఇప్పుడు ఈ కవయిత్రి /రచయిత్రి,అంతరంగ కథనాన్ని, ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం.

ప్ర: నమస్కారం రమాదేవిగారూ.. ‘సంచిక’ అంతర్జాల పత్రిక పక్షాన మీకు స్వాగతం.

జ: నమస్కారం, డా.కె.ఎల్.వి.ప్రసాద్ గారూ.

ప్ర: తెలుగు సాహిత్యం పట్ల మీకు ఆసక్తి ఎప్పుడు? ఎలా కలిగింది?

జ: నాకు చాలా చిన్నప్పటినుండి నిరక్షరాస్యులైన మా బాపమ్మ ఎల్లమ్మ, మా మేనత్త మల్లికాంబ గార్లు కథలు చెబుతూ, పాటలు పాడుతూ మౌఖికంగా సాహిత్యాన్ని పరిచయం చేసారు. అసలది సాహిత్యమనీ, దాన్ని నిక్షిప్తపరచాలనీ తెలియని అమాయక మూడు నాలుగేళ్ళ బాల్యం నాదపుడు. అపుడు మేము ఖిలావరంగల్‍లో ఉండేవారము. ఇంతలో నాన్నగారికి యం.ఆర్.ఓ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం రావడంతో మొదట మేము మరిపెడ బంగ్లాకు వెళ్ళాల్సి వచ్చింది. నా ప్రాథమిక పాఠశాల చదువు అక్కడే ప్రారంభం అయింది. స్వతహాగా అన్నదమ్ములు అందరితో కలివిడిగా ఉండే నాన్నకు ఉద్యోగం కోసం అందరినీ వదిలి దూరప్రాంతానికి వెళ్ళాల్సి రావడం బాధపెట్టింది. దానితో నాన్న పుస్తకాలతో ఎక్కువ సమయం గడిపేవారు. నేను నాన్నా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఆయన ప్రభావంతో నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం ఏర్పడింది. బడిలో ఏది చదివించినా, కథ చెప్పాలన్నా, పాట పాడాలన్నా నన్నే లేపేవారు. నాన్న కొని తెచ్చే పుస్తకాలలో కూడా చాలా పాటలూ, కథలూ ఉండేవి. అవి బాపమ్మా,అత్తమ్మల అంత కాకపోయినా కొంత స్నేహాన్ని పంచేవి. అలా ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే నాకు సాహిత్య పఠనాసక్తి కలిగి నా క్లాసు పుస్తకాలతో పాటు అన్నయ్యల తెలుగు పుస్తకాలు కూడా చదువుతుండేదానిని. నాకు పోటీతత్వం ఎక్కువ. ఆ తరువాత మహబూబాబాద్‌కి నాన్నగారికి ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడి ‘లాల్ బహదూర్ శాస్త్రి పాఠశాల’కు వెళ్ళాను. ఆ స్కూలులో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు జరుగుతుండేవి అందులో పాల్గొనాలంటే చాలా విషయాలు తెలియాలి కదా… అందుకే మా నాన్నగారితో పుస్తకాల షాపుకు వెళ్ళేదాన్ని. మా నాన్నగారు ఆఫీసులో ఆ చేత్తో అలా జీతం తీసుకోగానే ఈ చేత్తో ఇలా నా కోసం బొమ్మరిల్లు, చందమామ, బాలజ్యోతి, బాలమిత్రలు కొనడానికి మొదట ఖర్చు పెట్టేవారు. అలా చదివినందుకేమో స్కూల్ డే ఫంక్షన్ లలో నాటకాల కోసం భారీ డైలాగులను కూడా ఇట్టే చెప్పేసేదాన్ని. చాలా నాటికలలో ముఖ్యపాత్రలు పోషించాను కూడా. ఇంకా మహబూబాబాద్ వెంకటేశ్వరాలయంలో టిటీడీ వారు పిల్లలకు పోటీలు పెడుతుండేవారు.. అందులో పాల్గొని భగవద్గీత, రామాయణం, మహాభారతం చిన్న చిన్న పుస్తకాలు బహుమతులుగా అందుకోవడం, నేను పదోతరగతి దాకా చదివిన వరంగల్ లోని క్రిష్ణాకాలేజీలో పోటీల్లో బహుమతులు అందుకోవడం నాలో చాలా చదవాలనే ఆసక్తిని పెంచాయి. అందుకు నేను చదివిన మా స్కూల్ లైబ్రరీలు, నేను పనిచేసిన ప్రైవేటు స్కూల్ లైబ్రరీలు చాలా సహకరించాయి.

ప్ర: మీ కుటుంబ నేపథ్యం మీరచనా వ్యాసంగానికి ఎలా తోడ్పడింది? మొదటి రచన ఎప్పుడు చేసారు? అప్పుడు మీ అనుభూతి ఎలాంటిది?

జ: కుటుంబనేపథ్యం అంటే మా కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన మరియు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మొదటి ఆడపిల్లను నేనేనండీ.. నా ముందు తరం ఆడపిల్లలకి అక్షరభాగ్యం లేదండీ. నా తరువాతి తరం మాత్రం చదువుల్లో ముందంజలో ఉన్నారు… ముఖ్యంగా నాపై మా నాన్నగారి ప్రభావం ఎక్కువగా ఉండేదండి. నాన్న ఉద్యోగం చేస్తూ కూడా పుస్తకాలు చదివేవారండీ. అలా మాకు పుస్తకపఠనం అలవాటైంది. మా పెద్దన్నయ్య మంచి చదువరి. ఆయనను నేను ‘మొబైల్ లైబ్రరీ’ అని అంటుంటా. మా నాన్నగారు బుక్స్ స్టాల్ నుండి రెంటుకు పుస్తకాలు తెస్తే, మా అన్నయ్యలు లైబ్రరీల్లో పుస్తకాలు తెచ్చేవారు. అవి వాళ్ళు కాసేపలా పక్కన పెట్టేసి ఆడుకుని వచ్చేలోగా నేను యమా ఫాస్టుగా ఆ పుస్తకాన్ని చదివేసేదాన్ని. ఏమీ ఎరగనట్లు మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేసే దాన్ని. చిన్నవయసు పెద్దపదాలు… వాటి అర్థాలు తెలియక డిక్షనరీలు చదివేదాన్ని. దానితో చాలా పదసంపద నా సొంతమైంది. ఇంకా రచనా వ్యాసంగానికి తోడ్పడ్డవి నా అనుభవాలు, పరాభవాలే. నా మొదటి రచన క్రిష్ణా కాలేజీలో చదువుతున్నపుడు రాసాను… మా స్కూల్ లైబ్రేరియన్ సార్ ఆ కవితలను పత్రికకు పంపారు. అదే కవితకు మా బడివాళ్ళు స్కూల్ డే సందర్భంగా బహుమతి ఇచ్చారు. కాని ఆ కవిత ఏమిటో నేను దాచుకోలేదు. అదే నా మొదటి రచన. ఇక నా అనుభూతి అంటారా… ఒంటరిగా, గొప్పగా ఆనందించే వయసు కాదాయే,ఇక ఇంటికెళ్ళి అందరికీ చెప్పిన. విని ఊకున్నరు. తరువాత నేనూ మర్చిపోయిన. కాకపోతే అదే సంవత్సరంలో నాకు మా మేనత్త కొడుకుతో పెళ్ళి చేసేసారు. చదువుకు బ్రేక్ పడుతుందని ఎంతలా భయపడ్డానో… కానీ మా బావ నాకు అప్పటినుండి ఇప్పటిదాకా చాలా సహకరించారు. ఆయనే నా రచనల మొదటి ప్రోత్సాహకుడు, విమర్శకుడు కూడా. నా కలం పేరు ‘మృదువిరి’. మా పిల్లలు మృదుల్, విరుల్‌ల పేర్ల కలయిక.

బడి పిల్లలతో ఉపాధ్యాయిని శ్రీమతి రమాదేవి

ప్ర: పత్రికల్లో మీ రచన ఎప్పుడు, ఎలా ప్రారంభం అయింది? మిమ్ములను అమితంగా ప్రోత్సహిస్తున్న పత్రిక ఏది?

జ: నాలో కొంత అలసత్వం ఉంది సర్. మనసు స్పందించినపుడు చేతికందిన కాగితపు ముక్కపై రచనలు చేయడం ఇక దాని గురించి మరిచిపోవడం. ఆ పేపర్లు ఎక్కడెక్కడో పడేసుకోవడం… అలా నా రచనలు చాలా పోగొట్టుకోవడం నేను చేసిన పొరపాటు. అలా ఇప్పటికీ ఫేస్‌బుక్‌లో రాసి, ఓన్లీ మీలో పెట్టిన అనేక రచనలు సంవత్సరానికొకసారి పలకరిస్తూంటాయి. నన్ను చాలా ప్రోత్సహించిన పత్రికలు అంటే అన్నీ అని చెప్పుకోవచ్చు సర్. సంచిక, నెచ్చెలి, నెలవంక, నవతెలంగాణ, సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, భూమిక, గోదావరి, గణేష్, విశాలాక్షి, నేటి నిజం,సాహో, మొలక, దక్కన్ క్రానికల్, మెట్రో, బహుళ ఇంకా చాలా ఆన్‌లైన్ పత్రికలున్నాయి. అందరికీ ధన్యవాదాలు. ఇంకా పత్రికలలో రచనలు చేయడం 2016లో అనుకుంటా సర్. ఒక చెట్టు+స్త్రీ గురించిన ఒకే కవిత (తరు(వు)ణి) రెండు భావనల్లో వచ్చేలా రాసాను. ఈనాడు పత్రికవారు అచ్చేసారు. అది కేసముద్రంలో ఒక లైబ్రేరియన్ గారు చూసి నాకు ఫోన్ చేసారు. ఆరోజు నేను జీవితంలో మొదటిసారి గొప్ప అనుభూతి చెందాను. తరువాత భూమిక పత్రికలో ‘శనార్తులు చేసుకుంటూ అడుగుతాన’ చాలామంది ఫోన్ చేసి అభినందించారు. నవతెలంగాణలో ‘పసిమొగ్గలలో ఏం కనబడిందిరా’ అనే కవిత నాకు చాలా మంది అభిమానులను సంపాదించి పెట్టింది సర్, గోదావరి పత్రికలో ‘ఆ డొక్కల మరణమృదంగం’ కవిత చదివి కన్నీరుపెట్టించావమ్మా అంటూ ఫోన్లు వచ్చాయి. అలా చాలా పత్రికలతో పాటు నా శ్రేయోభిలాషి పూజ్యులు డా.కె ఎల్.వి. ప్రసాద్ సర్ గారి ప్రియకుమార్తె నిహార కానేటి గారి ప్రేరణతో వరంగల్ రేడియోలో కవితా పఠనం, మరియు వివిధ పండుగల సందర్భంగా ఆ పండుగ విశిష్టత చెప్పే కార్యక్రమంలో పాల్గొనగలిగాను. అలాగే ఆనంద్ వారాల గారి టోరీ రేడియో కూడా నా కవితా పఠనానికి ప్రసారం చేసింది. ఈ సందర్భంగా పత్రికలకూ మరియు రేడియో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

తోటి కవయిత్రి ఉదయశ్రీ ప్రభాకర్ (ఉపాధ్యాయురాలు)తో రమాదేవి

ప్ర: మీరు సీనియర్ రచయితల రచనలు చదువుతారా? మీకు ఇష్టమయిన రచయిత ఎవరు? మిమ్ములను అధికంగా ప్రభావితం చేసిన రచయిత ఎవరు?

జ: నాకు సాహిత్యపఠనం చాలా ఇష్టమైనదండీ. సీనియర్లు, జూనియర్స్ అని ఏదీ చూడనండీ. అందరి రచనలూ చదువుతాను. ముఖ్యంగా రామాచంద్రమౌళి గారు, వీఆర్ విద్యార్థిగారు, మీనన్ గారు, అంపశయ్య గారు, అంగులూరి అంజలీదేవి గారు, డా.కెఎల్వీప్రసాద్ గారు, యండమూరిగారు, యద్దనపూడి సులోచనారాణి గార్ల రచనలు చదివానండీ. కవితలు శివారెడ్డిగారు, ఓల్గా గారు, మా కవిసంగమం కవితలూ, మా బండారి రాజ్ కుమార్, బిల్లా మహేందర్, శిలాలోలిత గారు, తగుళ్ళ గోపాల్, ఫణిమాధవి, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరి రచనలు చదువుతానండీ. నన్ను ప్రభావితం చేసిన రచయిత యాకూబ్ గారు. తానెదుగుతూ మరొకరి ఎదిగేలా చేసే గుణం సర్‌ది. ఇంకా ఇందు రమణగారు ప్రస్తుతం ప్రముఖ పత్రికల్లో రచనలు వచ్చే సాహితీ వేత్తలందరినీ ఒక్కచోట చేర్చి అందులో నన్నూ ఓ విద్యార్థినిగా చేర్చారాయన. మా వరంగల్‌లో డా.కెఎల్వీ ప్రసాద్ గారండీ. వారి వలననే నేను రేడియో కార్యక్రమాలు చేయగలిగాను, పలు ఆన్లైన్ పత్రికలలో రచనలు చూసుకోగలిగాను. ఎన్నాళ్ళు గానో పూర్తిచేయాలనుకున్న నవలా రచనా ప్రక్రియను వేగవంతం చేసాను. కానీ లాక్డౌన్ సమయంలో పిల్లలింట్లో ఉన్న సమయం… రాసేందుకు అనువుగా లేని వాతావరణం… అయితే పూర్తిగా రచనకు దూరమవద్దొని, నా రచనలు కనిపించకపోతే ఫోన్ చేసి అడిగి మరీ సమయాన్ని సాహిత్యానికి కూడా కేటాయించమంటూ రెండు మొట్టికాయలేసే వారి వాత్సల్యానికి, పితృప్రేమకు సదా కృతజ్ఞురాలిని.

రచయిత తో కవయిత్రి బాలబోయిన రమాదేవి, రచయిత్రి మానస ఎండ్లూరి (హైదరాబాద్)

ప్ర: మీరు వృత్తిరీత్యా హిందీ ఉపాధ్యాయిని, ప్రవృత్తిరీత్యా తెలుగు సాహిత్యకారిణి. ఇదెలా సాధ్యమయింది మీకు? అనువాదప్రక్రియపై మీ అభిప్రాయం ఏమిటి? స్వయంగా మీరు అనువాదాలు ఏమైనా చేశారా?

జ: భిన్నధృవాలైన వృత్తి, ప్రవృత్తులకు న్యాయం చేయాలని నాలో యుద్దమే రోజూనూ… అందరూ అడిగే ప్రశ్నే మీరు కూడా అడిగారు. తెలుగు మాతృభాష, హిందీ నా ఐచ్చికభాష… కష్టమైనా ఇష్టంగా నేర్చుకుని ఉపాధినీ ఏర్పరుచుకున్నాను. రెండు భాషల్లో రాస్తుంటాను. హిందీ సాహిత్యం ప్రింట్ కాలేదింతవరకు. తెలుగు నుంచి నాకు గురువు వంటి ఒక రచయిత కథల పుస్తకాన్ని అనువాదం చేసాను. వారి కవితలు కూడా హిందీలోకి అనువాదం చేసాను. అవి త్వరలో అందరిముందుకు తెస్తాను. ఇంకా ఎలా సాధ్యమైంది అంటే… నాన్న నాకు చెప్పిన మాటే ‘బాగా చదవాలి’ అని. అదే పాటించాను. హిందీలో ప్రేమ్‌చంద్ కథలు ఎంత ఇష్టపడుతానో. తెలుగులో ప్రేమ్‌చంద్ గారి శైలితో ఉండే రామాచంద్రమౌళిగారి కథలంటే కూడా నాకు అంత ఇష్టం.

అనువాదాలపై నా అభిప్రాయం… అనువాదాల ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిభ తెలియజేయబడుంది. అన్యభాషల వాళ్ళు కూడా సాహిత్యపఠనం చేస్తారు. సాహిత్యవ్యాప్తి జరుగుతుంది. మరింత సాహిత్యసృజనకూ మార్గమేర్పడుతుంది… సమైక్య తాభావన పెరుగుతుంది సర్.

సీనియర్ రచయిత శ్రీ బి.ఎస్. రాములుతో, కవయిత్రి బాలబోయిన రమాదేవి

ప్ర: సాహిత్యంలో అనేక ప్రక్రియలలో పట్టు సాధించే ప్రయత్నంలో మీరు కృషి చేసున్నట్టు మీ గురించి తెలిసినవారు ఎవరైనా చెబుతారు. మీ ప్రయత్నంలోని ఫలితాలు ఎలా ఉన్నాయి?

జ: నా పట్ల పెద్దలు చూపించే శ్రద్ధకు వారికి నేను ఋణపడి ఉంటాను. మా బన్నా అయిలయ్యసార్, యాకూబ్ గారు, శిలాలోలిత గారు,కె ఎల్వీ ప్రసాద్ సర్, రామా చంద్రమౌళి గారు, దెంచనాల జ్వలితగారు, తుర్లపాటి రాజేశ్వరి అమ్మ, పాతూరి అన్నపూర్ణగారు, అంగులూరిఅంజనీదేవిగారు, ఇందు రమణగారు, రామశర్మగారు, శాంతి కృష్ణగారు, ఇరివెంటి వెంకటేశ్వర శర్మ గారు తమ్ముడు పవన్ కుమార్ దేవపట్ల లు అందరూ – నేను అనారోగ్యం వల్లనో, కుటుంబ, ఉద్యోగ బాధ్యతల వల్లనో రచనలకు విరామం ఇచ్చినపుడల్లా ప్రోత్సాహం అందించే ఆత్మీయ హృదయులే. అందరికీ ధన్యవాదాలు. ఇంకా నా రచనలు వివిధ సంకలనాల్లో అచ్చు కాబడుతున్నాయంటే పెద్దల దీవెనలే. కానీ ప్రత్యేక సంపుటులు అచ్చు చేయించుకోవడం కోసం మరికొంత సమయం ఆగాల్సిందే.

ప్రముఖ సాహితీవేత్త శ్రీ నలిమెల భాస్కర్ (కరీంనగర్ )తదితరులతో రమాదేవి

ప్ర: తెలుగు సాహిత్య రచనా వ్యాసంగానికి మీ వృత్తి భాష అయిన హిందీ ఎంతవరకూ ఉపయోగపడుతోంది? అది ఎలా?

జ: ఇందాకే చెప్పినట్లుగా హిందీ నా ఐచ్చిక భాష. నాకు బోధన ఫ్యాషన్. నేను సక్సెస్ స్కూల్‌లో పనిచేస్తూ ఉండటంతో హిందీతో పాటు ఇంగ్లీషు, తెలుగు కూడా పిల్లలకు అర్థమయ్యేలా బోధించాలి. అలా నాకు మూడు భాషలూ నేర్చుకోవాల్సి వచ్చింది. నేను యం.ఏ. హిందీ మరియు ఎం.ఏ. ఇంగ్లీష్‌లు కాకతీయ యూనివర్సిటీ యస్డీఎల్సీలో చదివాను. భాషలంటేనే ఆదికాలంనుండి ఆధునిక కాలందాకా ఉండే సాహిత్యం గురించి ఉంటుంది కదా.. అది నేర్చుకోవాలంటే అనుబంధంగా మరిన్ని పుస్తకాలు చదవాలీ. ఇక రాయడమూ అలవాటుంది గనుక ఏదైనా సాహిత్యాన్ని చదవగానే సృజనవైపు మా మనసు లాక్కపోబడుతుంది. కొత్తరచన చేసినపుడల్లా ఒకలాంటి ప్రసవవేదన. హిందీ బోధించేటపుడు తెలుగులో నేర్చుకున్నవి, తెలుగులో రాసేటపుడు హిందీలో చదివినవి నాకు సహాయకారులే గాని ప్రతికూల వాతావరణం ఎదురు కాలేదు.. అయితే హిందీ బోధన అలవాటై పోయి తలకట్టు దీర్ఘాలు గురించి చెప్పేటపుడు.. తెలుగు కరెక్షన్ చేసినపుడు. ఆ కి మాత్రా, ఈ కి మాత్రా అని చెప్తే… ఎదుటి వాళ్ళు నవ్విన సందర్భాలు మాత్రం చాలా ఎక్కువ 😃

ప్ర: పాఠశాల ఉపాధ్యాయినిగా, తెలుగు సాహితీ వికాసానికి మీరు చేసిన కృషి ఎలాంటిది?

జ: స్కూల్‌లో ఉన్నంత సేపు స్టాఫ్ రూంకి వెళ్ళకుండా పిల్లలతో మాట్లాడుతూ, మాట్లాడిస్థూ మదర్ టీచర్‌గా గడిపే నాకు కథా, కవితల ముడిసరుకు చాలా దొరుకుతుంది సర్. వాటిని దృష్టిలో పెట్టుకొని పిల్లల చేత కవితలు, కథలు రాయించి వాటిని రెండు సంకలనాలుగా తెచ్చాను. నేను రాసిన నాటికలు పిల్లల చేత వేయించగా మండలం, జిల్లా, జోనల్ స్థాయిలో పలు బహుమతులు అందుకున్నారు. పిల్లల చేత రేడియో కార్యక్రమాలు చేయించాను. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా పిల్లల చేత కార్యక్రమాలు చేయించి వారిలో భాషా వికాసానికి నా వంతు చిన్న ప్రయత్నం చేసాను సర్.

ప్ర: కథా /నవల వికాసంలో, మాండలీకం అవసరం ఎంతవరకు?

జ: కథలు, నవలలు యథార్థాలకు కొంత ఊహను జత చేయిస్తే ఏర్పడే మనోరంజక, వినోదం, విజ్ఞానదాయక సాహిత్యం. ఇవి వ్యక్తులను, ప్రదేశాలను, కాలమాన పరిస్థితులను తెలియజేస్తాయి. ఇందుకు మనం భాష అనే వారధి సహాయం తీసుకుంటాము… అందులో మాండలీకం అంటే ఆయా ప్రాంతాల ఖచ్చితమైన జీవనవిధాన ప్రదర్శిని. కనుక మాండలికం అనేది అవసరమే. అలా వచ్చిన గ్రంథాలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది కూడా.

బాలనటిగా (ఎడమ నుండి రెండవ వారు) రమాదేవి

ప్ర: మీరు రాసిన పుస్తకాలు గురించి చెప్పండి.

జ: నేను 2019 మార్చి 10 వ తేదీన ‘ప్రాణం వాసన’ కవితా సంపుటి ఒక్కటే వెలువరించాను. రాసినవి వివిధ ప్రక్రియలలో ఉన్నా ప్రస్తుతం నేను కొన్ని అననుకూల పరిస్థితుల్లో ఉండటం వల్ల ముద్రితాలుగానే ఉన్నాయి సర్. కరోనా రాకముందు కాలు ఫ్రాక్చర్ అవడం, నేను ఒక కారు ఆక్సిడెంట్‌కి గురవడం లాంటి దుస్సంఘటనల వలన… మరియు కరోనా సమయంలో నా సాంత్వన ఫౌండేషన్ కోసం పూర్తి సమయాన్ని కేటాయించే సరికి.. మూడేళ్ళుగా నా రచనలు వివిధ సంకలనాలకే పరిమితమయ్యాయయి.

ప్రాణం వాసన—ఆవిష్కరణ సభ

ప్ర: మీ కుటుంబ జీవితంపై, మీ రచనా వ్యాసంగం ప్రభావం ఎలా ఉంది?

జ: సర్. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నేను చాలా సేపు ఆలోచించాల్సి వచ్చింది. ముఖ్యంగా మహిళలకు ఉండే సమయమంతా కుటుంబ సభ్యుల సేవలో ఖర్చయిపోతుంది. ఇక మాలాగ వృత్తి, ఇతర ప్రవృత్తులున్న మహిళలకు సమయం ప్లాటినంతో సమానం. పెద్దబాబు భువనేశ్వర్ ఐఐటిలో, చిన్నబాబు బాంబే ఐఐటిలో తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం విదేశాల్లోని మంచి యూనివర్సిటీ లలో చదివేందుకు వెళ్ళే సమయంలో కరోనా మా అందరి అంచనాలను తారుమారు చేసింది. ఇల్లు కదలకుండా చేసిన కరోనా వల్ల పిల్లలు కెరీర్ పరంగా డిస్టర్బ్ అయ్యారు. మాకు పిల్లలతో గడిపే అవకాశం చిక్కింది. అయితే కరోనా కాలంలో నా కలానికి లాక్డౌన్ ప్రకటించినట్లైంది. ఇల్లు, ఉద్యోగం, ఫౌండేషన్ పనులు నా రచనా వ్యాసంగాన్ని దెబ్బ తీసాయి. దాన్ని అధిగమించడానికి ఇంకా ఎక్కువ చదవడానికి ప్రయత్నించాను గానీ.. టీచర్ని కాబట్టి ఆన్లైన్లో క్లాసులు,నోట్స్ కరెక్షన్ లు నా కంటిచూపును దెబ్బతీసాయి. ఇక మావాళ్ళు పుస్తకాలు, కాపీలు, పెన్నులు తప్ప ఫోన్ ముట్టుకోనివ్వలేదు.

ప్ర: స్త్రీ వాదం అంటే ఏమిటి? దాని గురిన్చి మీ అభిప్రాయం.

జ: స్త్రీల ఆత్మగౌరవ రక్షణ కోసం స్ర్తీలు గానీ, పురుషులు గాని కృషి చేయడమే స్త్రీ వాదం. శ్రమ, శారీరక, మానసిక, ఎమోషనల్ దోపిడి నుండి స్త్రీలను రక్షించడం, పునరావాసం కలిగించడం, అండగా నిలవడం స్త్రీ వాదం. ఇంకా బలంగా నమ్మేదేంటంటే… ప్రత్యేకంగా స్త్రీలు కాని వారిని దూషించడం స్త్రీ వాదం కాదు.. స్త్రీలు కానివారు అని ఎందుకన్నానంటే… రూపం ఒకటి ఉన్ననూ మానసికంగా సౌమ్యులై, సున్నిత హృదయులై, మాతృహృదయం గలవారై ఉండేవారు మనకు తెలిసి చాలా మంది ఉంటారు. మహిళలకు అన్యాయం చేసేవారిని, సహృదయులను అందరినీ ఒకేగాటన కట్టేసి చెడామడా మాట్లాడటం స్త్రీవాదం కాదు. ఎక్కడ పుండుందో అక్కడే మందు వెయ్యాలి కదా.

స్థానికత కోసం నిరాహారదీక్ష

ప్ర: స్త్రీ విలువను తగ్గించేలా జరిగే సంఘటనలపై స్పందిస్తూ…

జ: మహిళల సేవకై నేను నడుపుతున్న సాంత్వన ఫౌండేషన్ ఆధ్వర్యంలో… దగాబడిన మహిళలకు సపోర్ట్ చేస్తూ ఆవేశంగా ఉద్యమాలు చేసిన రోజులున్నాయి. మందిలో ఉండి కొట్లాడిన రోజున్నాయి కానీ అదంతా గతం. ఇరవై ముప్పై లోని రక్తపు ఉడుకు. ఆ తరువాత సౌమ్యంగా సామరస్యంగా స్పందించిన సంఘటనలు చాలా ఉన్నాయి సర్. వినేవారుంటే చెప్పేవారికి లోకువ, పడేవారుంటే అనేవారికి లోకువ… అలాగే అన్యాయాన్ని ఎదిరించని వారు అందరికీ లోకువే. స్త్రీ విలువ తగ్గించేలా ప్రవర్తించేవారికి ప్రధాన ఆయుధం సెంటిమెంట్.. ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్. స్త్రీ ఎప్పుడైతే మానసిక దృఢత్వాన్ని, కొద్దిగానైనా కాఠిన్యాన్ని అలవరుచుకుంటుందో తమ విలువ తగ్గనిచ్చుకోరు. నా కన్నపిల్లలకు అదే చెప్పాను. నా విద్యార్థులకు అదే చెప్పాను. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే మనకెలా బాధ కలుగుతుందో… ఎదుటివారిని అలా అనుకుంటే చాలు…అనేకానేక సమస్యలను రాకుండా జాగ్రత్త పడొచ్చు.

నా అంతరంగాన్ని ఆవిష్కరించే అవకాశం కలిగించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్…ఉంటానండీ🙏

**ధన్యవాదాలండి.

Exit mobile version