[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం రచయిత్రి, కవయిత్రి శ్రీమతి రోహిణి వంజారి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]
[dropcap]తె[/dropcap]లుగు సాహితీ రంగంలో, తన వంతుగా సాహితీ సేవ చేస్తూ, పేరు కోసం కాక, ఒక బాధ్యతగా, రచనా వ్యాసంగాన్ని చేపట్టిన అతి కొద్ది మహిళలలో చెప్పుకొదగ్గ రచయిత్రి శ్రీమతి రోహిణి వంజారి.. వీరు కథా రచయిత్రిగా మాత్రమే గాక, కవయిత్రిగా, వ్యాసకర్తగా, పలు రచనలు చేశారు, చేస్తున్నారు. ఇంచుమించు అన్ని పత్రికలలో వారి రచనలు చోటు చేసుకుంటాయి. మాతృ భాష పట్ల వీరికి అపారమైన ప్రేమ వున్నది.
సంచిక ఇష్టాగోష్ఠిలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు మీ కోసం.
~
*రోహిణి గారూ.. సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు స్వాగతం.
*సంచిక అంతర్జాల మాసపత్రిక నిర్వాహకులకు, మీకు నా నమస్కారములు.
1.రచనా వ్యాసంగంలో మీరు, ఎప్పుడు, ఎలా అడుగు పెట్టారు? మీ కుటుంబ నేపథ్యం వివరించండి?
జవాబు: చిన్నప్పుడు తరగతి పుస్తకాలతో పాటు, కథల పుస్తకాలు కూడా ఆసక్తిగా చదవడం ఇష్టమైన అలవాటుగా మారింది. కళాశాలకు వెళ్ళి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పద్మావతి మహిళా గ్రంథాలయంలో ప్రముఖ రచయితల కథలు, నవలలు చదవడం జరిగేది. ఆ అలవాటు తరువాతి కాలంలో నేను రచనలు చేయడానికి దోహదం చేసింది.
2016లో ఆంధ్రజ్యోతి వారు నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన ‘నవ్య’ పత్రికలో నా తొలి కథ ‘సూపర్ టీచర్ సిండ్రోమ్’ ప్రచురితం అయింది. హైదరాబాద్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసేటప్పుడు ఆ స్కూల్ వాతావరణం, విద్యార్థుల, టీచర్ల, యాజమాన్యం ప్రవర్తనలు కాస్త వింతగా అనిపించి అప్పటి నా అనుభవాలను అక్షరీకరించాను.
మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. మా నాన్న అరిశా సత్యనారాయణ గారు, అమ్మ ఆదిలక్ష్మి. వారి ముగ్గురు సంతానంలో నేను చివరిదాన్ని. మా వారి పేరు కృష్ణమూర్తి వంజారి. టీవీ నటులు, రచయిత.
మా అబ్బాయి శ్రీనివాస చైతన్య, కోడలు సాయి సాహిత్య, మా పాప వైష్ణవి. ముగ్గురూ జాబ్ చేస్తున్నారు.
2.మీకు సాహిత్య గురువు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎవరైనా ఉన్నారా? అది ఎలా సాధ్యమైంది మీకు?
జవాబు. నా తొలి కథను చదివి లోపాలను సవరించి, రచయితగా తొలిసారి నా పేరును ‘నవ్య’ పత్రికలో అచ్చులో చూసుకోవడానికి ఆ పత్రిక సంపాదకులు శ్రీ జగన్నాథ శర్మ గారిని నేను గురువుగా భావిస్తాను. తర్వాతి కాలంలో వారిని ప్రత్యక్షంగా కలిసి రచనలో మెళుకువలు ఎన్నో తెలుసుకోవడం జరిగింది. ఇక పరోక్షంగా చాలామంది గురువులు ఉన్నారు. ఎలా అంటే గొప్ప గొప్ప రచనలు చేసే కథా, నవలా రచయితల రచనలు చదవడం ద్వారా వారు రాసే విధానం, కథను నడిపించిన తీరు, శైలి, శిల్పం, ఇవన్నీ గమనిస్తూ, నిరంతరం చదవడం ద్వారా నా రచనా నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటాను.
3.మీకు కథలు/కవిత్వం/వ్యాసం మీద అభిరుచి ఉన్నట్లు మీ రచనలే చెబుతున్నాయి. మీరు కథలకు గానీ, కవిత్వానికి గానీ ఎంచుకునే ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి? ఎందుచేత?
జవాబు: కథ, కవిత, వ్యాసం ఈ మూడు సాహితీ ప్రక్రియల్లో నా మొదటి ప్రాధాన్యం కథలకే. కథలో అయితే మనం చెప్పదలచుకున్న విషయం విపులంగా విశదపరచే పరచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెప్పాలనుకున్న అంశంతో పాటు, మనకి ఇష్టమైన శైలి, శిల్పంలో కథని నడిపించి, పాఠకులను మన కథ జరిగే కాలం లేదా కథ జరిగే చోటుకు తీసుకుని వెళ్ళి, వాళ్ళు ప్రత్యక్షముగా కథలోని పాత్రలలోకి పరకాయ ప్రవేశం చేసిన అనుభూతిని కలిగించవచ్చు.
కథ పరిమితి విస్తృతమైనది. స్థూలమైంది. అదే కవితని తీసుకుంటే చాలావరకు కవితల్లో ఈ వెసులుబాటు ఉండదు. కవితా అంశాన్ని చాల పరిమితులకు లోబడి సూక్ష్మంగా చెప్పాల్సి ఉంటుంది. దీనికి అపరిమితమైన నైపుణ్యం కావాలి. అయితే చెప్పదలచుకున్న అంశంను అతి చాకచక్యంగా, సూటిగా, అతి సౌందర్యాత్మకంగా తెలుపడం ఒక్క కవితా ప్రక్రియలోనే సాధ్యం. కథ, కవిత రెండు దేనికదే గొప్పవి. ప్రత్యేకమైనవి. రెండిటినీ పోల్చగూడదు. నా వరకు అయితే కథ రాయడంలో చాల ఆనందం పొందుతాను. కవిత రాయడంలో భావవ్యక్తీకరణకు చాల కష్టపడతాను. కథ అయినా, కవిత అయినా రాసిన తర్వాత పలుమార్లు చక్కదిద్దుకుని, నా మనసుకు బాగుంది అని తృప్తి కలిగితేనే ప్రచురణ కొరకు పంపడం జరుగుతుంది.
ఇక కథలు అయినా, కవితలు అయినా సమాజహితం కలిగించేవి నా రచనల్లో ఉండాలని కోరుకుంటాను. అయితే అన్ని కథలు సందేశాత్మకంగా ఉండక్కరలేదు. సమాజంలో జరుగుతున్నా అన్యాయాలు, అక్రమాలు, స్త్రీల పట్ల చిన్న చూపు, బానిస బతుకుల అగచాట్లు, అధికారుల దురాగతాలు వంటి వాటిని దైర్యంగా ఎత్తిచూపగల నైపుణ్యం రచయితలకు ఖచ్చితంగా ఉండాలని నేను అనుకుంటాను.
4.వివిధ సాహితీ ప్రక్రియల్లో మీరు రచనలు చేస్తున్నారు. వీటిలో ఏ ప్రక్రియకు అధిక ప్రాధాన్యతనిస్తారు? ఎందుచేత?
జవాబు: నిస్సందేహంగా నా మొదటి ప్రాధాన్యత కథలకే. ఎందుకంటే పై జవాబులో చెప్పినట్లు కథల్లో అయితే మనం చెప్పదలచుకున్న అంశం విస్తృతంగా, విపులంగా పాఠకులకు చేర్చవచ్చు. అయితే కథ కోసం ఏదో రాసి, పేజీలు నింపడం సరికాదు. ఒక కథ రాయాలంటే, ఆ కథాంశం కళ్ళముందు జరిగిన వాస్తవ సంఘటన తాలూకు అనుభూతి లేదా ఆవేదన నన్ను ఒకచోట నిలవనీయవు. నిద్ర పట్టనీయకుండా సంఘటన తాలూకు పాత్రలు నన్ను అనుక్షణం వెంటాడుతూ, ఇక రాయకుంటే మతిస్థిమితం తప్పుతుందేమో అన్నంతగా మనసు పొరల్లో మథనం జరిగి, చివరికి ఆ ఆవేదనని అక్షరరూపంలో పదిలపరిస్తే కానీ మనశ్శాంతి కలుగదు అన్నప్పుడు నేను కథని రాయడం జరుగుతుంది. నేను రాసిన ‘ఆసరా’, ‘మధు’, ’క్రుకేడ్’, ‘నల్ల సూరీడు’ కథలు అలాంటి ఆవేదన నుంచి వచ్చినవే. కవితలు రాయడానికి కూడా నేను చాల ఇష్టపడతాను. అయితే కవిత్వం రాయడంలో నావి తప్పటడుగులు. ఇప్పుడిప్పుడే కవితా ప్రక్రియలో కూడా సాధన చేస్తున్నాను.
5.పత్రికల్లో మీ మొదటి కవిత ప్రచురింపబడిందా? కథ ప్రచురింపబడిందా? ఏ పత్రికలో అచ్చయింది. మీ అనుభవం పాఠకులతో పంచుకోండి.
జవాబు: పత్రికల్లో మొదట నా కవిత ప్రచురింపబడింది. ఆంధ్రభూమి సపరివారపత్రికలో ‘కోయిలా కుయిలా’ అనే శీర్షికతో కవితలు ప్రచురింపబడేవి. దానిలో నా మొదటి కవిత ‘అభాగ్యుడు’ ప్రచురింపబడింది. నేను బి.ఎస్.సి. డిగ్రీ చేసి బి.ఎడ్. ప్రవేశ పరీక్ష కొరకు ప్రయత్నించే రోజుల్లో, నేను ప్రవేశ అర్హత మార్కులు సాధించి కూడా, పలు కారణాల చేత సీట్ రాకపోవడంతో ఆవేదన చెంది రాసిన కవిత అది. ఆ తర్వాత ‘వనితా జ్యోతి’, ‘పల్లకి’ అనే పత్రికల్లో కూడా నా కవితలు రావడం జరిగింది. నా మొదటి కథ ‘సూపర్ టీచర్ సిండ్రోమ్’ 2016లో నవ్యలో ప్రచురితం అయింది.
5.మీ ముద్రిత, అముద్రితరచనల గురించి చెప్పండి.
జవాబు: నేను రాసిన రచనలన్నీ దాదాపు ముద్రితమైనవే. ఇప్పటి వరకు 70 కథలు, 100 కవితలు, కొన్ని సమీక్షలు మరికొన్ని వ్యాసాలు రచించాను.
నా కథలు నవ్య, సాక్షి, నవతెలంగాణ సోపతి, నమస్తే తెలంగాణ బతుకమ్మ, విశాలాంధ్ర, విశాలాక్షి లాంటి ముద్రిత పత్రికలు, మాలిక, సినీవాలి, నెచ్చలి, సహరి లాంటి ఆన్లైన్ పత్రికలు దాదాపు 20 పత్రికల్లో నా రచనలు ప్రచురింపబడ్డాయి.
నెల్లూరులో శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకత్వంలో వెలువడే విశాలాక్షి పత్రికలో ‘విజయమహల్ సెంటర్ కథలు’ శీర్షికతో ఏడాది పాటు కథలు ప్రచురితం అయినాయి.
శ్రీ ఇందు రమణ గారి నేతృత్వంలో వెలువడే ‘సాహో’ పత్రికలో రెండేళ్ళ నుంచి ‘అందమే ఆనందం’, ‘ఆరోగ్యమే ఆనందం’ అనే వ్యాసాలు ప్రచురితం అవుతున్నాయి. నాకు రోహిణి వంజారి పేరుతో పర్సనల్ వెబ్సైటు ఉంది. నా రచనలన్నీ అక్కడ భద్రపరుస్తున్నాను.
6.మీ రచనలు మీ ఇంట్లో ముందు ఎవరు చదువుతారు?
జవాబు: నా రచనలకు మొదటి పాఠకురాలు మా పాప వైష్ణవి.
7.తెలుగు సాహితీ రంగంలో మీకు ఇష్టమైన రచయిత[త్రి] ఎవరు? ఎందుచేత?
జవాబు: ఇష్టమైన రచయిత ఎవరు అనేది చెప్పడం చాల కష్టమైన ప్రశ్న. ఎందుకంటే సాహిత్యం పరిధులు చాల విస్తృతమైనవి. ఎందరో సాహితీ మహానుభావులు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. చాలామంది రచయితల రచనలు ఇష్టంగా చదువుతాను. ఉదాహరణకు రంగనాయకమ్మ గారు, అబ్బూరి ఛాయా దేవి వంటి వారి స్త్రీ వాద రచనలు సమాజాన్ని నిద్రావస్థ నుంచి మేల్కొలుపుతాయి. మాలతీచందూర్ గారి రచనలు మనసుకు ఆహ్లాదాన్ని అద్దుతాయి. యుద్దనపూడి సులోచనారాణి గారి రచనలు పాఠకులను ఊహాలోకంలో విహరింపజేస్తాయి. అలాగే చలం గారి రచనలు స్త్రీని సంపూర్ణవంతురాలిగా తీర్చిదిద్దే ఉదాత్తమైనవి. బుచ్చిబాబు గారి ‘చివరకు మిగిలేది’ నవల మనిషి మనసును పట్టి కుదిపి, ఆచేతనావస్తలో ఉన్నవారిని తట్టి మేల్కొలుపుతుంది. కేశవరెడ్డి గారి ‘చివరి గుడిసె’, ‘అతడు అడవిని జయించాడు’ లాంటి నవలలు అణగారిన జీవితాల వెతలను కన్నీటితో కడుగుతాయి. రావిశాస్త్రి, శ్రీపాద వంటి వారి రచనలు వ్యంగ్య బాణాలను పాఠకులమీదకు సూటిగా వదులుతాయి. ఇలా ప్రతి ఒక్కరి రచనల్లో ఒక్కో ప్రత్యేకమైన మాజిక్ ఉంటుంది.
8.మీరు ఎలాంటి పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు? ఇతర భాషా పుస్తకాలు ఏమైనా చదువుతారా? మీ అనుభవం వివరించండి.
జవాబు: మనోవైజ్ఞానిక నవలలు చదవడానికి చాల ఇష్టపడతాను. మట్టి పరిమళాలు వెదజెల్లే రచనలు, విశ్వమానవ వికాస రచనలు, విశ్వ విజేతల జీవిత చరిత్రలు, వినోదం వెంబడి విజ్ఞానం అందించే రచనలు చదవడానికి ఇష్టపడతాను. అనువాద సాహిత్యాన్ని కూడా ఇష్టంగా చదువుతాను. వీటి వల్లే ప్రపంచం నలుమూలల్లో ప్రజల జీవనం, స్థితిగతులు ఎలాఉన్నాయి, జీవనగమనం ఏవైపుకు [పురోగామి, తిరోగమి] సాగుతున్నది లాంటి విషయాలు మనకి తెలుస్తాయి. జె.కె. రౌలింగ్ రాసిన హ్యారీపోటర్ సిరీస్ ఇష్టంగా చదివాను. టెట్సుకో కురోయనాగి అనే జపాన్ రచయిత్రి రాసిన ‘టోటో చాన్’ రైలుబండి పేరుతో తెలుగులోకి అనువాదం అయింది. చాల అద్భుతమైన నవల అది. మధుబాబు గారి షాడో నవలలకు కూడా నేను వీరాభిమానిని. యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన ‘పర్ణశాల’ నవల్లో చైతన్య పాత్ర చాలా రోజులు నన్ను వెంటాడింది. ఆంగ్లంలో షేక్‌స్పియర్ రచన ‘మర్చంట్ అఫ్ వెనిస్’ లాంటి సుప్రసిద్ధ నాటకం, మిల్టన్ లాంటి వారి రచనలు నన్ను ఎక్కువ ప్రభావితం చేసాయి. ప్రపంచ భాష అనువాద సాహిత్యంతో వెలువడే ‘విపుల’ పత్రికని ఇష్టంగా చదివేదాన్ని. ఆ పత్రిక లేని లోటు తీరుస్తూ ఇటీవల శ్రీ ముని సురేష్ పిళ్లే గారి సంపాదకత్వంలో వెలువడే ‘కథావసుధ’ వెబ్ పత్రిక అనువాద కథల లోటును భర్తీ చేస్తోంది.
9.ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎన్నో గ్రూపులు మనం చూస్తున్నాం. వీటిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. తెలుగు సాహిత్య పురోగతికి ఇవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి?
జవాబు : కరోనా కాటు యావత్ ప్రపంచ స్థితిగతులను అతలాకుతలం చేసిన విషయం మనకందరికీ విదితమే. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో అన్నీ రంగాలు దెబ్బతిన్నట్లే, సాహితీ రంగం కూడా కుదేలైపోయింది. ముద్రణారంగం మూతబడింది. గొప్ప సంస్థల నుంచి వెలువడే పత్రికలు కూడా మూతపడ్డాయి. అయితే ఒకతలుపు మూసుకుంటే ఇంకో నాలుగు తలుపులు తెరుచుకుంటాయి అనే నానుడిని రుజువు చేస్తూ, బోలెడన్ని ఆన్లైన్ పత్రికలు మొదలైనాయి. సాంకేతిక విప్లవం యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చెందడం మూలాన ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలు వెల్లువెత్తాయి. ఇంటి నుంచి అడుగు బయటకు వేయబల్లేదు. అరచేతిలో ప్రపంచ వీక్షణం. అదీ లైవ్‌లో. ఇక సాహిత్య సమూహాలకు కూడా కొదవ లేదు. కథ, కవిత, గజల్స్, వ్యాసాలు వేటికవే ప్రత్యేక సమూహాలు. బోలెడంత వినోదం, విజ్ఞానం. ఇవన్నీ ముద్రణా పత్రికలు లేని లోటుని భర్తీ చేసాయి. ఇది ఒక కోణం. నాణానికి మరోవైపు చూసినట్లయితే కొన్ని సమూహాల్లో సాహిత్య సేవ కన్నా, వర్గ రాజకీయాలు, వ్యక్తిగత దూషణ, వర్గ, వర్ణ విద్వేషాలు సాహిత్యానికి అడ్డుగోడలు కడుతుండడం మనం అందరం గమనించిన విషయమే. ఇక రచయితలకు అపరిమితమైన స్వేచ్ఛ వల్ల నూతనంగా రచనలు చేసేవారు కూడా నాలుగు వరుసలు రాసేసి, తమ రచనను తామే సొంతంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచురించుకోవడం, తమ రచనకి వచ్చిన లైక్లు, కామెంట్లు చూసుకుని మురిసిపోవడం వల్ల నైపుణ్యతతో కూడిన సాహిత్యం మరుగునపడుతోంది అనిపిస్తోంది. శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్లు అనుభవజ్ఞుడైన సంపాదకులు పరిశీలించి, రచనలోని లోపాలను సరిదిద్ది ఆ రచనకు పత్రికలో చోటు ఇస్తారు. అప్పడే ఆ రచనకు అన్నీ సొబగులు అద్దబడతాయి. సొంతంగా ప్రచురించుకునే రచనలకు ఈ సౌగంధం అంటదు.
సమూహాలు అన్నీ తెలుగు సాహిత్యాన్ని నలుదిశలా విస్తరింపజాయాలని కంకణం కట్టుకుని, సుహృద్భావ వాతావరణంలో విద్వేషపు అడ్డుగోడలను కూల్చేసి, అందరినీ కలిపే వంతెన లాంటి రచనలు చేసినప్పుడే మన తెలుగు కీర్తి పతాకం ప్రపంచ భాషల మధ్య గర్వంగా తలఎత్తుకుని నిలబడుతుంది.
10.మన విద్యావ్యవస్థలో మారుతూ వస్తున్న రూపురేఖలు గమనిస్తుంటే, తెలుగు భాషను వెనుక బెంచీకి పంపించే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి?
జవాబు: “పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నీవు సంభాషించు” అని ఓ కవి అన్నట్లు చదువుకున్న విజ్ఞులు, పెద్దలే ముఖ్యమైన కార్యక్రమాల్లో తెలుగు భాషలో సంభాషించడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇది కడు శోచనీయం. ఇక చదువుకునే రోజులు పోయి చదువును కొనే రోజులు ఎప్పుడో వచ్చేసాయి. పిల్లవాడు అమ్మ, నాన్న అంటే నలుగురిలో నామోషీ. మమ్మీ, డాడీ అంటేనే ముద్దు అనే మానసిక అవకరపు మత్తులో తల్లిదండ్రులు ఉన్నంతవరకు తెలుగు భాష వెనుక బెంచీలోకి మారుతూ క్రమంగా చివరి బెంచి నుంచి కూడా నిష్క్రమించిపోయే అవకాశం లేకపోలేదు.
ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో చదువు ఆంగ్ల మాధ్యమంలో ఉన్నా సరే, తెలుగు సబ్జెక్టును అప్షనల్ లాంగ్వేజ్ లాగా కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి పదవతరగతి వరకు అయినా తెలుగు భాషను నేర్చుకోవాలి అని తప్పనిసరి నిబంధనగా పెట్టినట్లయితే తెలుగు భాష ముందు బెంచీలోనే వెలుగులు చిమ్ముతుంది.
11.నేటి యువత తెలుగుభాషపై అధికంగా ఆసక్తి చూపడానికి, ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుందని మీరు భావిస్తున్నారు?
‘నిప్పును ముట్టుకుంటే చేయి కాలుతుంది’ అని చెప్తే వినకుండా ముట్టుకుని చూస్తాం కాలుతుందో లేదో అని చెప్పే దూకుడుగల తరం ఇప్పటి మన యువతరం. అటు శైశవం మలిదశలో, ఇటు తొలి యవ్వన దశలో ఉన్న నేటి యువత ఇప్పుడు ఇంటా, బయటా అనేకానేక సమస్యల విషవలయంలో చిక్కుకుని ఉంది. అరచేతిలో సెల్ ఫోన్ మంచి తో పాటు, విషాన్ని కూడా యువత నరాల్లోకి ఎక్కిస్తున్నది. ఇలాంటి తరుణంలో పెద్దతరం వారు చెప్పే నీతులు యువతకు ఎక్కవు. అందుకని ముందు వారిదారిలోకి పెద్దతరం వెళ్ళి, మెల్లగా వారిని మనదారిలోకి తెచ్చుకోవాలి. అందుకోసం రచయితలు అన్న వారు సామాజిక సంక్షేమం కోసం, మరీ ముఖ్యంగా యువత కోసం వారిదారిలోకి వెళ్ళి వారిని మంచి వైపుకు తిప్పుకునే నైపుణ్యంతో రచనలు చేయాలి. తెలుగు భాషలోని కథలు చాలా గొప్పవి. మన సమస్యలకు పరిస్కారం చూపుతాయి అనే నమ్మకం, ఆసక్తి యువతలో కలిగించే బాధ్యత ప్రతి ఒక్క రచయిత తీసుకోవాలి. ఇంటిదగ్గర తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు తెలుగు భాషలోని సాహిత్యాన్ని చదివేవిధంగా వారిని ప్రోత్సహించాలి. ఇది చాల కష్టమైన పని. కానీ అసాధ్యం అయితే కాదు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్న సామెత ఊరికే రాలేదు కదా.
12.మీరు పొందిన అవార్డులు, సన్మానాల గురించి చెప్పండి?
జవాబు: కథల పోటీల కోసం వేగంగా కథలు రాయలేను. జరిగిన సంఘటనో, కలిసిన వ్యక్తో మనసుని కదిలించాలి. ఆ సంఘటన వెంటాడుతూ కథ రాసేవరకు నన్ను తరుముతూ ఉండాలి. అలా రాసి పెట్టుకున్న కథలు యాదృచ్ఛికంగా పోటీలకు పంపినప్పుడు కొన్ని బహుమతులు వచ్చాయి.
- నవ్య పత్రిక ఉగాది కథల పోటీలో ‘ఆసరా’ కథకు బహుమతి వచ్చింది.
- విశాలాక్షి మాసపత్రిక కథల పోటీలో ‘నల్ల సూరీడు’ కథకు బహుమతి వచ్చింది.
- మన తెలుగు. కం. వారు నిర్వహించిన కథల పోటీలో ‘అమృతత్వం’ అనే కథకు బహుమతి వచ్చింది.
- జలదంకి పద్మావతి స్మారక ‘అర్ధాంగి’ కథల పోటీలో ‘మమేకం’ కథకు ప్రత్యేక బహుమతి వచ్చింది.
- సమన్విత, మలిశెట్టి సీతారాం కథలపోటీ, తెలుగుజ్యోతి పత్రిక లాంటి కథల సంకలనంలో నా కథలు ప్రచురితం అయినాయి.
- ఇప్పుడు తాజాగా విజయనగరం వారి విజయభావన శోభకృత్ నామ సంవత్సర రాష్ట్రస్థాయి కథల పోటీల్లో నా కథ ‘తందనానా ఆహి’ ఎన్నిక అయింది.
ఇక ఈ శోభకృత్ నామ సంవత్సరం అందరి జీవితాల్లో ఆనంద శోభను నింపాలని కోరుకుంటున్నాను. ‘సంచిక’ లాంటి గొప్ప పత్రికలో నా పరిచయానికి అవకాశం కల్పించిన సంపాదకులకు, నన్ను ఈ ఇంటర్వ్యూకు ప్రోత్సహించి, ఇంటర్వ్యూ చేసిన డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.