[సంచిక కోసం ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు శ్రీమతి శారద గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
ఆస్ట్రేలియా తెలుగు తేజం శ్రీమతి శారద
[dropcap]మా[/dropcap]తృభాష మీద ప్రేమ, అభిమానం ఉంటే ప్రపంచంలో ఏ దేశమేగినా, తెలుగును మరచిపోరు తెలుగువాళ్లు. అలాంటి వారిలో శ్రీమతి శారద (బ్రిస్బేన్) ముందువరసలో ఉంటారు. వీరి వంశ మూలాలు నల్లగొండకు చెందినా, పుట్టి, పెరిగి, చదువు పూర్తిచేసినది మాత్రం హైదరాబాద్ లోనే!
హైదరాబాద్ లోని మహిళా కళాశాల, యూనివర్శిటీ అఫ్ హైద్రాబాద్‌లో, తమ ఉన్నతవిద్యను అభ్యసించారు. ఆస్ట్రేలియాలో భౌతిక శాస్త్రం/గణిత శాస్త్రాలలో పరిశోదనలు చేస్తున్నారు.
తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ కావడంతో, తెలుగులో కథలు, నవలలు రాస్తున్నారు. అనువాదాలు చేస్తున్నారు. ప్రామాణికమైన పరిశోధన పత్రాలు సమర్పించారు. అన్ని ప్రక్రియలలోనూ, కథా ప్రక్రియ ఎక్కువ ఇష్టం అంటున్న శారదగారి సాహిత్య ప్రస్థాన విశేషాలు మరిన్ని తెలుసుకోవడానికి పదండి మరి ముందుకి.
~
* శారద గారూ, సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు స్వాగతం.
నమస్కారం. ధన్యవాదాలు.
ప్రశ్న: సంచిక అంతర్జాల పత్రికతో మీకు అనుబందం ఎప్పటి నుండి, ఎలా ఏర్పడింది?
జ: బహుశా నాలుగేళ్ళ క్రితం నుంచి కాబోలు.
సాధారణంగా మాకు ఆదివారం మధ్యాహ్నం సమయానికి పత్రిక అప్‌లోడ్ అవుతుంది. మొదట్లో లక్ష్మీ ప్రియగారి ‘అలనాటి అపురూపాలు’ శీర్షిక చాలా ఆసక్తికరంగా అనిపించి చదువుతూ వుండేదాన్ని. తరవాత ఇంకొన్ని శీర్షికలూ, ధారావాహికలూ నచ్చి చదవడం మొదలుపెట్టాను. కొన్నిసార్లు మరిచిపోవడం కూడా జరుగుతుంది, కానీ, దాదాపు రెగ్యులర్‌గానే చూస్తాను. లతా మంగేష్కర్ గారి గురించి మురళీ కృష్ణ గారు వ్రాసిన వ్యాస పరంపర నాకు చాలా నచ్చింది.
ప్రశ్న: మీరు ప్రాథమిక విద్యనుండి వృత్తి విద్యవరకూ ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నారు కదా! మరి తెలుగుభాష మీద మీకు ఇంత మక్కువ ఏర్పడడానికి ప్రదాన కారణం ఏమిటి?
జ: నిజమే. చదువుకున్నదంతా ఆంగ్ల మాధ్యమమే. చిన్నప్పటినించీ నాకు పుస్తకాలు చదివే అలవాటు బాగా వుండేది. ఆంగ్ల పుస్తకాలతోనే నా పఠనాభిలాష మొదలైంది. ఐతే ఇంట్లో అమ్మా నాన్నా, చందమామతో మొదలుపెట్టి మా కోసం తెలుగు పుస్తకాలు బాగానే కొనేవారు. మరీ ముఖ్యంగా, హైస్కూలు చదువుకొచ్చేసరికి మా ఇంట్లో, యువ, వనిత పత్రికలు ఎక్కువగా వొచ్చేవి. అందులో మంచి కథలేవైనా వొస్తే అమ్మ నాతో చదివించేది.
నేను చదువుకున్నది కాన్వెంటు స్కూలే ఐనప్పటికీ, హైస్కూల్లో తెలుగు నేర్పించిన అన్నదానం సుబ్రహ్మణ్యం గారి చలవ వల్ల నాకు భాషలోని సౌందర్యం, సాహిత్యంలోని మహత్తూ అర్థమయ్యాయి.
స్కూలు చదువు దాటి కాలేజీ చదువులకొచ్చేసరికి నాకు తెలుగు పుస్తకాలు చదివే అలవాటు మొదలైంది. నేను రోజూ చూసే జీవితాలకి దగ్గరగా అనిపించి, తెలుగు సాహిత్యం పైన అభిలాష పెరిగింది. ఆ రోజుల్లో నేను స్వర్గీయ కుటుంబరావు గారి కథలు చదివి చాలా నేర్చుకున్నాను. సాహిత్యమూ, కథన రీతుల గురించే కాకుండా, జీవితానికుండే రంగుల గురించీ, వాటిని సాహితీ ప్రక్రియల్లో ఒడిసిపట్టుకోవడం గురించీ, చాలా ఆలోచింపచేసాయాయన కథలు నన్ను. 1990 ప్రాంతాల్లో వచ్చిన రచన పత్రిక కూడా నన్ను తెలుగు సాహిత్యానికీ, ముఖ్యంగా కథా సాహిత్యానికీ చాలా దగ్గర చేసింది. బహుశా ఆ చదవడం వల్లే వ్రాయాలన్న ఆసక్తి కూడా నాలో పెరిగిందేమో.
ప్రశ్న: మీరు తెలుగులో రచనా వ్యాసంగం ఎప్పుడు ప్రారంభించారు? దానికి మీ ఇంటి వాతావరణం ఎంతవరకూ సహాయపడింది?
జ: చిన్నప్పుడు స్కూల్లో రాసిన వ్యాస రచన కాకుండా, సీరియస్ కథా రచన 1996లో మొదలు పెట్టాను. అప్పుడు రాసిన మూణ్ణాలుగు కథలు రచన పత్రికలోనూ, ఆంధ్రప్రదేశ్ పత్రికలో వచ్చాయి. 1999లో మేము ఆస్ట్రేలియా వొచ్చాం. ఆ రోజుల్లో వ్రాసిన కథలు ఈమాట పత్రికలో వచ్చేవి. ఆ తరవాత కౌముది, సారంగ పత్రికల్లో, ఆంధ్రజ్యోతిలోనూ నా కథలు వొచ్చాయి.
ఇంట్లో వాతావరణం గురించి చెప్పాలంటే మా కుటుంబ సభ్యులు నా కథా రచనకెంతో సహకరించి, చిన్నవైనా నా విజయాలకెంతో గర్వపడి ప్రోత్సహిస్తారు. మా అమ్మ (కీ.శే. విజయలక్ష్మి) నేను రాసిన ప్రతీ కథనీ చదివి తన అభిప్రాయం చెప్పేది.
ఇంట్లో వాళ్ళు (శ్రీవారు మురళీధరన్, చిరంజీవులు మధువంతీ, అనన్య) నేను రాసే ప్రతి కథ పైనా తమ అభిప్రాయం చెప్తారు. నా పుస్తకాలు ‘నీలాంబరి’, ‘మలయమారుతం’ ప్రచురణా, విడుదల కార్యక్రమాల్లో కూడా కుటుంబం నాకందించిన సహకారమూ, ప్రోత్సాహమూ ఎనలేనివి.
ప్రశ్న: మీ రచనల్లో ప్రధానంగా కనిపించేవి కథలా? కవిత్వమా? వ్యాసమా? నవలలా? ఎందుచేత?
జ: చదవటానికి, కథలూ నవలలూ, వ్యాసాలూ ఆసక్తిగా చదివినా, రాయడానికి మాత్రం నాకు కథా రచన ఇష్టమైన ప్రక్రియ.
కవిత్వం ఎందుకనో నాకంతగా పట్టుబడదు. అంటే అర్థం కాదని కాదు, కానీ ఎంతో చిక్కటి భావం వుంటే తప్ప నా మనసుకి అంతగా హత్తుకోదు. పోతన పద్యాల్లోనూ, త్యాగరాజ కీర్తనల్లోనూ, అన్నమయ్య పదాల్లోనూ కనిపించినంత అందమైన కవితాత్మ ఇక నాకెక్కడా కనిపించలేదని నేనంటే, అందరికీ నేనొక చాదస్తం మనిషిలా అనిపించొచ్చు.
కవిత్వంలో భాషలో వుండే శబ్ద సౌందర్యంకన్నా, ఇమేజరీ, మెటఫోర్, వర్డ్‌ప్లే, అన్నిటికన్నా భావంలో వుండే సాంద్రత నాకెక్కువ నచ్చుతుంది. అంత అందంగా రాసేంత జ్ఞానమూ, భాష మీద పట్టూ, నాకు లేవు. అందుకే నేనెప్పుడూ కవిత్వం జోలికి పోలేదు.
అప్పుడప్పుడూ కొన్ని వ్యాసాలు వ్రాసినా, కథా ప్రక్రియ నాకు చాలా ఇష్టమైనది (నేను చేయడానికి- చదవడం నేను అన్ని ప్రక్రియలూ చదువుతాను). సాహిత్యంలో నన్ను చాలా ప్రభావితం చేసిన రచయితలందరూ ఎక్కువగా కథకులే కావడం కూడా ఒక కారణం కావొచ్చు. సోమర్‌సెట్ మాం, చెహోవ్, మొపాసా, కుటుంబరావు గారు నా అభిమాన రచయితలు. వీళ్ళందరి కథల ప్రభావం నా మీద చాలానే వుంది. అందువల్లనే నేను కథా రచన మీద ఆసక్తి పెంచుకున్నానేమో తెలియదు.
మిగతా అన్ని ప్రక్రియల్లోకన్నా, కథల్లో నాకు కొంచెం స్వేచ్ఛ ఎక్కువనిపిస్తుంది. అలాగే కొంచెం ఛాలెంజింగ్‌గా కూడా.
స్వేచ్ఛ ఎందుకంటే- దాదాపు దేన్ని గురించైనా కథ చెప్పుకోవచ్చు. మన ఊహాశక్తికి తగ్గట్టు. క్లుప్తంగా చెప్పుకోవచ్చు, లేదా విస్తారంగా చెప్పుకోవచ్చు. వ్రాసే శైలిలో కూడ ఎన్నో రకాల అవకాశాలున్నాయి.
సవాలు ఎందుకంటే, స్టిల్ ఫోటోగ్రాఫులా, అందంగా వుండడమే కాకుండా, కనిపించే అన్నిటినీ చిత్రంలో పట్టుకోవాలి. చెప్పదల్చుకున్న విషయాన్ని, సరళంగా, గాఢంగా, చదువరి దృష్టి (అటెన్షన్) కోల్పోకుండా, మళ్ళీ ఏ విషయంలోనూ రాజీ పడకుండా చెప్పడం అన్నది కొంతవరకు సవాలే.
అయితే ఇదంతా, రేషనలైజింగ్. ఈ కారణాలవల్ల కథా రచన నా కిష్టం అని చెప్పటం కాదు కానీ, కథా రచన నాకిష్టం, నాకు కొంచెం తేలిగ్గా పట్టుబడింది.
అయితే ఒక నవలా, ఒక అనువాద నవలా కూడా వ్రాసాను. రెండో నవల ప్రస్తుతం వ్రాస్తున్నాను.
ప్రశ్న: మీ మొదటి రచన కథా? కవిత్వమా? ఏ పత్రికలో మీ మొదటి రచన ప్రచురింపబడింది? ఎలా?
జ: నా మొదటి రచన, ‘అభిమాని విన్నపం’, కథ, రచన పత్రికలో వచ్చింది.
అప్పట్లో రచన పత్రికలో వసుంధర దంపతులు (శ్రీ జొన్నలగడ్డ రాజగోపలరావు గారు, జొన్నలగడ్డ రామలక్ష్మి గారు) కథా విశ్లేషణల కాలం ఒకటి వ్రాసేవారు. దానికి నేను మధురాంతకం రాజారాం గారి కథని గురించిన విశ్లేషణా, ఒక చిన్న కథా పంపాను. అక్కణ్ణించి ప్రారంభమైంది నా కథా రచన. నేను కథా రచన మొదలు పెట్టిన యేళ్ళలో, వసుంధర దంపతులు నాకిచ్చిన ప్రోత్సాహమూ, సూచనలూ మరవలేనివి. అప్పట్లో నా కథలు రచన, ఆంధ్ర ప్రదేశ్, ఆంధ్ర భూమి పత్రికల్లో వచ్చేవి.
ప్రశ్న: సాదారణంగా కథ రాయడానికి మీరు ఎన్నుకునే ప్రదాన కథా వస్తువు దేనిని తీసుకుంటారు? ఎందుచేత?
జ: కథా వస్తువులుగా నాకు మనుషుల ప్రవర్తనా, ఆలోచనా సంవిధానమూ, మనిషికీ మనిషికీ మధ్య వుండే సాంఘిక సంబంధాల్లోని లోతుపాతులూ, చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. మనుషుల ఆలోచనాధోరణి వర్గ స్థాయి కంటే, వ్యక్తిగత స్థాయిలో విలక్షణంగా వుంటుందని నా అభిప్రాయం. మనుషుల ప్రవర్తనలోని సంక్లిష్టతతో పాటు వైరుధ్యాలనీ ఒడిసి పట్టుకోగలగడం ఒక మంచి కథ చేయగలదీ, చేయవలిసినదీ.
చాలావరకు నా కథల్లోని వస్తువు, నేను చూసిన సంఘటనలకి నేనిచ్చుకునే వ్యాఖ్యానం అయివుంటుంది. నా కోణంలో, నాదైన విశ్లేషణ. ఉదాహరణకు, ‘సజీవం’, ‘మలయమారుతం’, ‘ఉన్నదానికీ అనుకున్నదానికీ’ కథల్లోని కొన్ని సంఘటనలు నేను దూరం నుంచి చూసినవే. వాటి ఆధారంగా కథ అల్లుకున్నాను.
కొన్నిసార్లు కథా వస్తువు నాకు సంభాషణల్లోనో, వార్తా పత్రికల్లో వచ్చే చిన్న చిన్న వార్తల్లోనో దొరుకుతుంది. ‘యాదృచ్ఛికం’ అనే కథలోని సంఘటన నిజంగా అడిలైడ్ నగరంలో జరిగింది. అలాగే ‘పడవ మునుగుతోంది’ కథ కూడా. (ఈ కథలు నీలాంబరి సంకలనంలో వున్నాయి.) వార్తా పత్రికల్లో వచ్చే చిన్న చిన్న వార్తల్లో మానవ జీవితం గురించిన ఎన్నో వ్యాఖ్యానాలూ, ఎన్నో కోణాలూ కనపడతాయి, మనం ఆలోచించగలిగితే.
ప్రశ్న: మీరు కథ సాదారణంగా ప్రథమ పురుషలో రాస్తారా మధ్యమ పురుషలో రాస్తారా? ఎందుచేత? ఏ రూపంలో రాస్తే, కథ పాఠకుడిని ఆకట్టుకుంటుందని మీరు భావిస్తున్నారు? వివరంగా చెప్పండి.
జ: ఏ రకమైన నెరేషన్ పాఠకులని ఆకట్టుకుంటుంది అనేది చాలావరకు కథా వస్తువు పైన ఆధారపడి వుంటుందని నా అభిప్రాయం. అసలే నెరేషనూ లేకుండా, కేవలం సంభాషణలతో ‘అరికాళ్ళ కింద మంటలు’ వ్రాసారు శ్రీపాద.
నేను ఏ రకమైన నెరేషన్ ఇష్టపడతానంటే, అది చెప్పదల్చుకొన్న విషయాన్ని బట్టి వుంటుంది. ప్రెఫెరెన్సేమీ లేదు. కొన్నిసార్లు నా మూడ్‌ని బట్టి కూడా. 😊
ప్రశ్న: ఆస్ట్రేలియా దేశంలో తెలుగు సాహిత్యానికి ఉన్న స్థానం ఏమిటి? అందులో మీ పాత్ర ఏమిటి?
జ: ఆస్ట్రేలియాలో తెలుగు సాహిత్యానికి సంబంధించి చాలానే కార్యక్రమాలు, చాలా కృషీ జరుగుతున్నాయండీ. మెల్బోర్న్, సిడ్నీనగరాల్లో కొంచాడ మల్లికేశ్వర రావు గారూ, మోటమర్రి సారథిగారూ, గొల్లపూడి విజయమాధవి గారూ, మా బ్రిస్బేన్ నగరంలో బచ్చు ప్రభాకర్ గారూ, ఝాన్సీ గారూ, చాలా మంది సాహిత్యకారులు వున్నారు.
అడిలైడ్ నగరంలో లైబ్రరీల్లోనైతే చాలా మంచి తెలుగు పుస్తకాలు దొరుకుతాయి. నేను నా మొదటి కథా సంకలనం ‘నీలాంబరి’ పుస్తక ఆవిష్కరణ అడిలైడ్ నగరంలోని చార్ల్స్‌స్టర్ట్ కౌన్సిల్ లైబ్రరీలో మల్టీ కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ గారి అధ్యక్షతలో చేసాను.
నా పాత్ర ఏమిటీ, అంటే, కథా రచన తప్ప నేను చేయగలిగేది పెద్దగా ఇంకేమీ లేదండీ. నాకు వీలైనప్పుడల్లా సాహితి సమావేశాల్లో పాల్గొంటూనే వుంటాను. కవితాస్త్రాలయ లాంటి సంకలనాలకి నా రచనలు అందిస్తూనే వుంటాను.
ప్రశ్న: ఆస్ట్రేలియా వంటి విదేశంలో తెలుగుభాష అవసరం అంతగా లేకున్న, అక్కడ నివసిస్తున్న మీరు మాతృభాష పట్ల అంతగా తపన చెందడానికి గల ప్రధాన కారణం ఏమిటి?
జ: ఒకే ప్రశ్నలో చాలా విషయాలు ప్రస్తావించారు 🙂
‘విదేశాల్లో తెలుగు భాషా ఆవశ్యకత’, ‘మాతృభాష పట్ల తపన’, ‘నా కథా రచన’ మూడు వేర్వేరు అండీ. పరస్పరాశ్రితాలు కావు.
అంటే, నేను కథలు వ్రాసేది ‘ఆస్ట్రేలియాలో తెలుగు భాషని బ్రతికించడానికో’, లేకపోతే, ‘మాతృభాష పట్ల తపనతోటో’ కాదు. కథలు వ్రాయడం నాకిష్టం, నాకు అన్నిటికంటే బాగా వొచ్చిన భాష తెలుగు, అంతే. అది యాదృచ్ఛికం. నేను వ్రాసే కథలతో తెలుగు భాషకి జీవం పోస్తున్నాననీ, నిలబెడుతున్నాననీ, అనుకునేంత అహంకారమూ అజ్ఞానమూ నాకు లేవు.
విదేశాల్లో తెలుగు ఆవశ్యకత – అంటే- తెలుగు మాట్లాడే వాళ్ళుండే ఏ ప్రదేశంలోనైనా తెలుగు భాష ఆవశ్యకత వుంటుంది కదా? ఆ మేరకు నేనూ నా పిల్లలకీ, నా దగ్గర సంగీతం నేర్చుకునే విద్యార్థులకీ తెలుగు వీలైనంత నేర్పిస్తూనే వుంటాను.
నిజం చెప్పాలంటే- తెలుగు భాషని సజీవంగా వుంచడం పుస్తకాల వల్ల కావడంలేదేమో అనిపిస్తుంది నాకీమధ్య. ఎందుకంటే ఈ బ్రిస్బేన్ నగరంలో కొందరు తెలుగు స్నేహితులకి నేను నా కథల పుస్తకం ఇచ్చాను. ముక్తకంఠంతో అందరూ ఒకటే మాట చెప్పారు. “టైం దొరకడం లేదండీ! ఇంకెప్పుడైనా చదువుతాను”.
కాబట్టి నేను వ్రాసే కథలతో తెలుగు భాషకి పెద్దగా వొచ్చే లాభం యేదీ లేదండీ 🙂 భాష బ్రతికేది మాట్లాడే వాళ్ళుండడం వల్లే.
ప్రశ్న: తెలంగాణాలో పుట్టి పెరిగిన మీరు విద్యాభ్యాసం కూడా అక్కడే ముగించారు కదా! అక్కడి భాష, యాస పై మీ అబిప్రాయం ఏమిటి? తెలంగాణా మాండలికంలో మీరు ఏమైనా రచనలు చేసారా?
జ: మా స్వగ్రామం తెలంగాణలోని నల్లగొండ జిల్లా. మా అమ్మమ్మా, నానమ్మల ఇంట్లో చక్కటి తెలంగాణ మాండలీకమూ, నుడికారమూ వినపడేవి. కానీ, పెరిగిందంతా హైదరాబాదు కావడం వల్ల, నాకు బళ్ళో నేర్పించిన భాషే అలవాటైపోయింది. అన్ని మాండలికాల్లాగే, తెలంగాణా యాస, మాండలీకమూ ఎంతో సొగసైనవి. ఎటువంటి అలంకరణా లేని పల్లె పడుచు నిర్మల సౌందర్యంలాటి అందమది.
మాండలికం వ్రాయడానికి నేను ప్రయత్నించలేదు. మాండలికం వ్రాయగలనన్న కాన్‌ఫిడెన్సు లేకపోవడమే ముఖ్య కారణం. భవిష్యత్తులో తప్పక ప్రయత్నిస్తాను.
ప్రశ్న: మన తెలుగు సాహిత్యం ఇతర భాషలలోకి అనువాదం కావల్సిన ఆవశ్యకత గురించి మీరేమంటారు?
జ: తెలుగనే కాదు, ఏ భాషలోని సాహిత్యమైనా ఇతర భాషల్లోకి అనువాదం జరగడం అవసరమూ, ప్రయోజనకరమూ కూడా. భాషా సౌందర్యాలూ, నుడికారాలూ పలుకుబడుల గురించి తెలుసుకోవడం ఒక అకడెమిక్ అవసరమైతే, అనువాద సాహిత్యం ద్వారా ఇతర జీవిత శిల్పాల గురించి తెలుసుకోవడం సామాజిక అవసరం. చిన్నప్పుడు విపుల పత్రికలో వచ్చే కథలవల్లా, మాలతీ చందూర్ గారి పాత కెరటాలు శీర్షిక వల్లా ప్రపంచ సాహిత్యంతో పరిచయమూ, తద్వారా ప్రపంచ జ్ఞానం లభించింది కదా?
ప్రశ్న: మీ రచనలు ఏమైనా ఇతర భాషలలోకి అనువాదం అయ్యయా? మీ అనుభవం చెప్పండి.
ఎక్కువగా లేదండీ. గౌరీ కృపానందన్ గారు ఒక్క కథేదో తమిళంలోకి అనువాదం చేసినట్టున్నారు.
ప్రశ్న: విదేశాలలో తెలుఁగు సాహిత్య అధ్యయనం అవసరం అని మీరు భావిస్తున్నారా? ఎందుచేత?
ఇది చాలా క్లిష్టమైన ప్రశ్నండీ.
‘విదేశాల్లో తెలుగు సాహిత్య అధ్యయనం అవసరం’ వుందనుకుంటే వుంది, లేదనుకుంటే లేదు.
నన్నడిగితే, సహజంగా వుందనే అంటాను. అయితే ఈ అధ్యయనం విదేశాల్లో నివసించే తెలుగు వారే కాక, విదేశీయులు కూడా చేయాలా అంటే నా దగ్గర స్పష్టంగా జవాబు లేదు.
ప్రశ్న: మీరు గణిత శాస్త్రజ్ఞులు కదా! ఈ విజ్ఞానాన్ని తెలుగు సాహిత్యానికి ఆపాదించే ప్రయత్నం చేశారా? వివరించండి.
జ: నా రీసెర్చి భౌతిక శాస్త్రంలోనండీ. అయితే, గణితమూ, భౌతికశాస్త్రమూ కవలపిల్లల్లాటివి కనక, నేను రెండు విషయాల్లోనూ పని చేస్తాను.
సైన్సు నేపథ్యంలో కాల్పనిక సాహిత్యం కంటే సైన్సు గురించిన వ్యాసాలు నాకు ఎక్కువ నచ్చుతాయి. అనిల్ రాయల్ గారూ, చిత్తర్వు మధు గారు, సౌమ్యా సైన్సు నేపథ్యంలో మంచి ఫిక్షన్ రచనలు చేసారు.
ప్రస్తుతం నెచ్చెలి మాస పత్రికలో ‘విజ్ఞాన శాస్త్రంలో వనితలు’ అనే శీర్షికన విశ్వవ్యాప్తంగా వున్న మహిళా శాస్త్రవేత్తలని పరిచయం చేస్తున్నాను. ఈ శీర్షిక 2024 ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఈ అనుభవంతో వీలైతే భౌతిక శాస్త్రం గురించిన వ్యాసాలు కొన్ని వ్రాసే ప్రయత్నం చేస్తాను.
ప్రశ్న: ముద్రణకు నోచుకున్న మీ రచనలు (సాహిత్య /సాంకేతిక) గురించి వివరంగా చెప్పండి.
జ: ‘మలయమారుతం’ పుస్తకం కంటే ముందు 2013లో నేను వ్రాసిన కొన్ని కథలతో ‘నీలాంబరి’ అనే కథల పుస్తకాన్ని తీసుకొచ్చాను. నా అనువాద కథలతో ‘శంకరాభరణం’ అనే పుస్తకం అంతర్జాలంలో లభ్యమవుతుంది. కౌముది పత్రికకోసం వ్రాసిన ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే నవలా, సారంగ పత్రిక కోసం వ్రాసిన ‘వీలునామా’ అనే అనువాద నవలా కూడా అంతర్జాలంలో వున్నాయి.
వృత్తిపరంగా నేనొక సైంటిస్టుని. భౌతికశాస్త్రంలో నేను వ్రాసిన పేపర్లు ఫిజిక్స్ రివ్యూ లెటర్స్ లాటి జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. నేను ప్రస్తుతం సాగించే పరిశోధన ఆస్ట్రేలియా ప్రభుత్వ రంగానికి సంబంధించిన పరిశోధన కావడంతో దాన్ని గురించిన విశేషాలు కానీ, వివరాలు కానీ చెప్పడానికి నాకు అనుమతి లేదు.
ప్రశ్న: ఆస్ట్రేలియాలో తెలుగు పత్రికలు మీకు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి?
జ: ఆస్ట్రేలియా నించి శ్రీనివాస్ కండ్రు గారి సంపాదకత్వంలో ‘వీధి అరుగు’ అనే పత్రిక కొత్తగా వొస్తుంది. కొంచాడ మల్లికేశ్వర రావుగారి నిర్వహణలో కవితాస్ట్రేలియా అనే పుస్తకం రెండుసార్లు వొచ్చిందనుకుంటా. ఆస్ట్రేలియా నుంచి ఇలా పత్రికలు వెలువడడం నిస్సందేహంగా ఆస్ట్రేలియాలోని తెలుగు సాహిత్యకారులకి చాలా ప్రోత్సాహంగా వుంటుంది.
ప్రశ్న: మీ అవార్డులు – సన్మానాల గురించి చెప్పండి.
జ: సన్మానాలవీ ఏవీ లేవండీ. ఏదో కొన్ని అవార్డులొచ్చాయంతే.
ఈ మధ్య వచ్చిన బహుమతులు
నెచ్చెలి పత్రిక నిర్వహించిన కథల పోటీలో నేను వ్రాసిన ధీర అనే కథకు శ్రీమతి కె. వరలక్ష్మి అవార్డు ఇచ్చారు.
వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది కథల పొటీలో ఈ సంవత్సరము, ఇంతకు ముందొకసారీ బహుమతులు వచ్చాయి. అటువంటివే ఇంకేదో ఒకటి రెండు బహుమతులు వచ్చినట్టున్నాయి. అంతే.
~
** మీ విలువైన సమయం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నా తరఫున సంచిక తరఫున మీకు ధన్యవాదాలు.
శారద: ధన్యవాదాలు. నమస్కారం.