సంభాషణం: కవి అల్లాడి శ్రీనివాస్ అంతరంగ ఆవిష్కరణ

3
2

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం – కవి శ్రీ అల్లాడి శ్రీనివాస్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

స్వచ్ఛమైన తెలంగాణా మాండలికంలో తేట తెలుగుకవిత్వం అందిస్తున్న కవి శ్రీ అల్లాడి శ్రీనివాస్

పండితుల పుత్రులందరూ పండితులు కావడం బహు అరుదు. కుటుంబ నేపథ్యంలో సాహిత్యకారులు వుంటే, అది అందిపుచ్చుకుని సాహిత్యసేద్యం చేయగలవాళ్ళు కూడా బహు తక్కువ. దీనికి భిన్నంగా యావత్ కుటుంబాన్నీ సాహిత్యం వైపు మళ్లించగల సాహిత్యకారులు, సాహిత్యాభిమానులూ కూడా వేళ్ళమీద లెక్కపెట్టదగ్గవారు మాత్రమే ఉంటారు. అటువంటి బహు కొద్దిమందిలో, మంచిర్యాలకు చెందిన కవి/కథకుడు శ్రీ అల్లాడి శ్రీనివాస్. ఆయన శ్రీమతి కవయిత్రి కావడం, పిల్లలు కూడా సాహిత్యకారులు, సాహిత్యాభిలాషులు కావడం ఆయనకు కలిసొచ్చిన అదృష్టం అని చెప్పాలి.

రచయిత, కవి,హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ అల్లాడి

కృత్రిమత్వం కనిపించని, స్వచ్చమైన, చక్కని, చిక్కని, తెలంగాణా మాండలికంలో కవిత్వం/కథలు రాయగల మరో సాహిత్యకారుడు శ్రీనివాస్. తన రచనా వ్యాసంగం గురించి ఇంకా ఏమి చెబుతారో ఆయన మాటల్లో…….

~

ప్ర: శ్రీనివాస్ గారూ…. నమస్కారం. సంచిక పక్షాన మీకు స్వాగతం.

* నమస్కారం సర్… హృదయపూర్వక ధన్యవాదాలు.

ప్ర: తెలుగు సాహిత్యం వైపు మీ మనస్సు ఎప్పుడు ఎలా మళ్లింది?

*నాకు 34 ఏళ్ల వయస్సులో సాహితీ లోకంలో మొదటి అడుగు వేశాను. అంతవరకు అంతగా సాహిత్యపు వాసన అంటని నన్ను ప్రముఖ కథా రచయిత బెజ్జారపు వినోద్ కుమార్ గారి సాన్నిహిత్యం సాహిత్యం వైపు  అడుగు వేయించింది. ఆయన రాసిన ‘గవ్వల మూట’ కథా సంపుటి నాపై అంతగా ప్రభావం చూపింది. “మీరు రాయగలరు” అన్న ఆయన మాట నాలో ఎంతో ధైర్యం నింపింది. ఆ ధైర్యంతోనే నేను రాసిన మొదటి కథ ‘ఎడారి పూలు’ ఆంధ్రజ్యోతి వారి నవ్య వీక్లీలో ప్రచురితం అయింది.

అచ్చులో చూసుకున్న మొదటి కథ

అలా ప్రారంభమైన నా కథా రచనా కొనసాగుతూ నాతో 36 కథలు రాయించింది. నేను పత్రికలకు పంపిన ఏ కథ కూడా ప్రచురితం కాకుండా తిరుగు టపాలో రాలేదు.

ప్ర: విద్యార్థి దశలో సాహిత్యం పట్ల మీ అభిరుచి ఎలా ఉండేది?

* నా విద్యార్థి దశ గురించి చెప్పాలంటే… పదవ తరగతి వరకు నా స్వగ్రామం భూషణరావుపేటలోనే చదివాను. బాల్యంలో చందమామ, బాలమిత్రలు చదివేవాణ్ణి. కాలేజీ డేస్‌లో మధుబాబు షాడో నవలలు, యండమూరి నవలలు కొన్ని చదివాను. ఇక… నేను స్టేట్ యూత్ అవార్డు అందుకొనేలా చేసిన ‘చైతన్య యూత్ అసోసియేషన్’ వ్యవస్థాపక కార్యదర్శిగా అక్షరాస్యత కార్యక్రమం ’అక్షర ఉజ్వల’లో భాగంగా మా గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో వివిధ గ్రామాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాడడానికి జానపద బాణీలో కొన్ని పాటలను రాసాను, అది సాహిత్యం అని తెలియకుండానే‌.

ప్ర: తెలుగు భాష – యాసల గురించి మీ అభిప్రాయం చెప్పండి. రచనా వ్యాసంగంలో వీటి ప్రభావం పాఠకుడి మీద ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు?

* తెలంగాణ భాష-యాసలు ఉమ్మడి రాష్ట్రంలో చలనచిత్రాల్లో కామెడీ పాత్రలకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ, ఇప్పుడు అదే భాష హీరో, హిరోయిన్ల పాత్రల ద్వారా వింటున్నాం కదా… అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అదే చూస్తున్నాం‌. కథలు, కవితలలో తెలంగాణ భాషను వాడడం ద్వారా సహజత్వాన్ని ఆపాదించుకొని సామాన్య పాఠకుల హృదయాన్ని తాకుతుందని నా అభిప్రాయం.

రచయిత బాల్య మిత్రుడు, కవి, కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. కల్వకుంట రామకృష్ణ చేత ఆత్మీయ సన్మానం. చిత్రంలో అన్నవరం దేవేందర్ గారు.

ప్ర: తెలంగాణా మాండలీకంలో మీరు రచనలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో వీటి అవసరం ఎంతవరకూ ఉందని మీరు భావిస్తున్నారు?

* నా అమ్మ భాష, నా ఊరి భాష, నా బాల్యదశలో నా చెవుల్లో ఇంకి, నా నాలుక మీద నాట్యమాడిన భాష… ఈ తెలంగాణ భాష. దాన్ని ముందు తరాలకు అందించాలన్న ఆకాంక్షతో తెలంగాణ భాషలో రాయడం ప్రారంభించాను. నా బాల్యాన్ని వడబోసి, దానికి సామాజిక స్పృహను మేళవించి రాసిన నా రాతలకు అత్యద్భుతమైన స్పందన లభించింది. దీన్ని బట్టి తెలంగాణ భాషలో ఇంకా విరివిగా రచనలు రావాల్సిన అవసరం వుందని అర్థం అయింది. కొన్నేళ్లుగా దాదాపు ప్రతీరోజు తెలంగాణ భాషలో ఒక కవిత రాసి నా ఫేస్‌బుక్ వాల్ మీద పోస్టు చేస్తున్నాను. దానికి నేను ఊహించనంతగా సాహితీ మిత్రుల నుండి కామెంట్స్ ద్వారా లభించిన స్పందన నా కలానికి మరింత బలాన్నిచ్చింది.

ప్ర: మీరు మాండలికంలో రాస్తున్న రచనలకు పాఠకుల నుండి స్పందన ఎలా వుంది?

* రెండు తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య పాఠకులు, సాహితీ మిత్రుల నుండి నా తెలంగాణ భాష రాతలకు అత్యద్భుతమైన ప్రశంసలను అందుకున్నాను. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా నా తెలంగాణ భాషకు అభిమానులున్నారని చెప్పడానికి గర్విస్తున్నాను.

కైతిక కవి మిత్ర పురస్కారం

 

ప్ర: మీరు కథలు రాస్తున్నారు, కవిత్వం రాస్తున్నారు. ఈ రెంటిలో మీకు తృప్తినిస్తున్న ప్రక్రియ ఏది? ఎందుచేత?

* నేను కథా రచనతోనే సాహితీరంగంలో మొదటి అడుగు వేశాను. పదుల సంఖ్యలో కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాక గానీ నేను కవిత్వం వైపు దృష్టి సారించలేదు. నేను ఉద్యోగ రీత్యా భూషణరావుపేట నుండి మంచిర్యాలకు మకాం మార్చిన తర్వాత ఇక్కడి సాహితీ సంస్థలు నిర్వహించే కవి సమ్మేళనాలు నన్ను కవిత్వం వైపు నడిపించాయి. నాలుగేళ్లకు పైగా నిరంతరం తెలంగాణ భాషలో అక్షర సేద్యం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్నాననే ఆనందం అనిర్వచనీయమైనది. కథా రచనను ప్రేమించే వ్యక్తినైనప్పటికీ, తెలంగాణ భాషలో నేను రాస్తున్న కవిత్వమే నాకు అధికమైన తృప్తినిస్తుందని చెప్పక తప్పదు. తీసుకున్న కవితా వస్తువును తక్కువ నిడివిలో పాఠకుని హృదయానికి చేర్చగలమని నా అభిప్రాయం.

ప్ర: పుస్తకాలకు ముందుమాటఅనే అంశం అవసరం అని మీరు భావిస్తున్నారా? ఎందుచేత? ఈ విషయంలో మీ అనుభవాలు చెప్పండి..

* పుస్తకాలకు ముందుమాట అనేది భవనానికి ప్రవేశ ద్వారం లాంటిదని నా వ్యక్తిగత అభిప్రాయం. పుస్తకంలో తాను ఆశించే సాహిత్యం ఉనికిని కనుగొనడానికి ‘ముందు మాట’ పాఠకునికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా అనీ… రచనలో పస లేకున్నా అతిశయోక్తి అలంకారాలతో రాసే ముందుమాటలతో పుస్తకం లోకి వెళ్లిన పాఠకుడు తిట్టుకుంటాడు. స్వయంగా నేను ముందు మాట చదివి ఉత్సాహంగా పేజీలు తిప్పి సాహిత్యం కోసం వెతికి అసంతృప్తికి గురయిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, ఉత్తమ సమీక్ష చేసే ముందుమాటలు ప్రతీ పుస్తకానికి అవసరమే… ఆమోదయోగ్యమే.

ప్ర: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత సాహిత్య రంగానికి సంబందించి, ఎలాంటి మార్పును మీరు గమనించారు. ఇంకా ఎలాంటి మార్పులు మీరు ఆశిస్తున్నారు?

* ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాహిత్య రంగంలో తెలంగాణ భాష ప్రాధాన్యం పెరిగింది. ఆనాడు చిన్నచూపు చూసిన ఆ భాషకే ఈ రోజు పెద్ద పీట వేయడం చెప్పుకోదగ్గ మార్పు. సాహిత్యంలో అనువాదకుల అవసరం ఎంతైనా వుంది. తెలుగు సాహిత్యం ఖండాంతరాలకు చేరాలంటే అది ఇతర భాషల్లోకి అనువాదం కావాల్సిన అవసరం ఎంతైనా వుంది. పాఠకునికి సులభంగా అర్థమై, హృదయాన్ని తాకి సమాజ శ్రేయస్సు కోరే విధంగా దిశా నిర్దేశం చేసేదే మంచి సాహిత్యం అని నా భావన.

ప్ర: రచనా వ్యాసంగానికి సంబందించి మీ మీద ఎవరి ప్రభావం అయినా ఉందా? అది ఎలా జరిగింది?

* నేను ముందుగానే చెప్పినట్టుగా బెజ్జారపు వినోద్ కుమార్ గారు నా కథా రచనకు ప్రేరకులు, ప్రోత్సాహకులు. అలాగే అల్లం రాజయ్య సార్, పెద్దింటి అశోకన్న, అన్నవరం దేవేందరన్నలు నా తెలంగాణ భాష రచనలకు పరోక్షంగా ఊతమిచ్చారు.

ప్ర: మీ వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. మీ విషయంలో ఇవి ఒకదాని విషయంలో మరొకటి ఎప్పుడైనా సమస్యలు సృష్టించాయా? వాటిని మీరు ఎలా పరిష్కరించుకోగలిగారు?

* వృత్తి పరంగా వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ ఎడ్యుకేటర్‌గా ఉద్యోగం… ప్రవృత్తి రచనా వ్యాసంగం. నాకు మాత్రం ఈ రెండూ సమాంతర రేఖల లాంటివే. ఒకదాని వల్ల ఇంకోదానికి ఏనాడూ సమస్యలు ఉత్పన్నం కాలేదు. నా ఉద్యోగ బాధ్యతలు సంపూర్ణంగా నిర్వర్తించిన తర్వాతే సమయం దొరికినప్పుడే నా కలం కదలికలు.

ప్ర: కుటుంబ పరంగా మీకు రచనా వ్యాసంగానికి సంబందించి ఎలాంటి ప్రొత్సాహం లభిస్తుంది?

* నా శ్రీమతి సుజాత కూడా కవయిత్రి కావడం వల్ల నా రాతలకు ప్రథమ పాఠకురాలిగా మారి మంచి విమర్శ చేస్తుంది. ఐఐటీ ఖరగ్‌పూర్ లో బీటెక్ (కం.సై.ఇం.), ఐఐఎం బెంగుళూరులో ఎంబీయే చదివి ‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్’ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మా పెద్దబ్బాయి సాత్విక్, బీడియెస్ చదివిన మా చిన్నబ్బాయి సౌమిత్‌లు కూడా సాహిత్యాభిమానులే. సౌమిత్ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పోయమ్స్, పాటలు రాసాడు. మొత్తానికి మా కుటంబంలో చదువు, సాహిత్యం రెండింటికీ సమానంగా అత్యంత ప్రాధాన్యతనిస్తాము.

శ్రీనివాస్ కుటుంబం

ప్ర: మీరు పుస్తక రూపంలో ఏమి పుస్తకాలు తీసుకువచ్చారు? ప్రచురణా రంగంలో నేడు రచయితలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించండి.

* ఇప్పటి వరకు నేను రాసిన మూడు పుస్తకాలు ప్రచురించబడినవి.

1.’ఎడారి పూలు’ కథా సంపుటి

2.’అచ్చు కాయిదం’- అచ్చ తెలంగాణ భాష మ్యూజింగ్స్

3.’గున్కపూలు’- లఘురూప వచనకవిత్వం-కైతికాలు

ఎడారిపూలు కథాసంకలనం ముఖచిత్రం
అచ్చుకాయిదం పుస్తకం ముఖచిత్రం
గున్కపూలు పుస్తకం ముఖచిత్రం

మొదటి పుస్తకం నేను స్వంతంగా ప్రచురించుకున్నాను. మిగతా రెండు పుస్తకాలను ‘పాలపిట్ట’ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు.

ఎడారిపూలు పుస్తకావిష్కరణ సభలో అల్లాడి శ్రీనివాస్ (మంచిర్యాల)
అచ్చుకాయిదం పుస్తకావిష్కరణ వేదిక మీద దానికి ముందుమాట రాసిన ఏనుగు నర్సింహారెడ్డి గారికి “అచ్చు కాయిదం” అందజేత
అచ్చుకాగిదం ఆవిష్కరణ రోజు… చిత్రంలో గుడిపాటి గారు, అల్లం రాజయ్య గారు

ఏదేమైనా ఒక కవి/రచయిత తన పుస్తకాన్ని ప్రచురణలో చూసుకోవాలంటే అది తలకు మించిన భారమే. అలా ఆర్థిక భారంగా భావించిన ఎందరో మహానుభావుల రచనలు వెలుగులోకి రాకుండా వారి కాగితాల్లోనే మాసిపోవడం జరుగుతుంది. మంచి రచనలు ప్రచురణకు నోచుకోవాలంటే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందాల్సిన అవసరం వుందని నేను అనుకొంటున్నాను.

ప్ర: మీ అవార్డులూ -సన్మానాల గురించి వివరించండి

* ఇక కొన్ని సాహితీ సంస్థలు ఆత్మీయతతో అవార్డులు ఇచ్చాయి. ప్రేమతో సన్మానాలు చేస్తూనే వుంటారు. కొన్ని కవితా పోటీల్లో బహుమతులు కూడా వచ్చాయి. అయినా… అవార్డులు, సన్మానాల గురించి చెప్పుకునే స్థాయికి నేనింకా ఎదగలేదు సర్.

సన్మాన సభలో శ్రీ అల్లాడి శ్రీనివాస్

ప్ర: మీ జీవితంలో మీరు మరచిపోలేని మధురమైన జ్ఞాపకాలు??

* 1. నేను వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా వున్న ‘చైతన్య యూత్ అసోసియేషన్’ ద్వారా చేసిన సాంఘిక సేవకు గుర్తింపుగా ‘స్టేట్ యూత్ అవార్డు’ అందుకోవడం….

  1. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ కి చెందిన ‘ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ అండ్ రీసర్చ్ సెంటర్’ ముంబయిలో నేను చదివిన ‘పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ ప్రమోషన్ ఎడ్యుకేషన్’ కోర్సులో ‘గోల్డ్ మెడల్’ సాధించడం… నా జీవితంలోని మధుర స్మృతులు.

~

** చక్కని మీ సాహిత్య ప్రయాణం గురించిన విషయాలు ‘సంచిక’ పాఠకుల కోసం అందించిన మీకు సంచిక వార/మాస పత్రిక పక్షాన ధన్యవాదాలండీ.

**నన్ను ‘సంచిక’ పాఠకలోకానికి పరిచయం చేసిన మీకు,సంచిక సంపాదకవర్గానికి ధన్యవాదాలు డాక్టర్ గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here