సంభాషణం: కవి, కథకుడు, నవలాకారుడు అన్వర్ అంతరంగ ఆవిష్కరణ

25
2

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం కవి, కథకుడు, నవలాకారుడు అన్వర్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

వరంగల్ ఆణిముత్యం కవి అన్వర్…!!

సమాజాన్ని ప్రత్యేక దృష్టితో పరిశీలించేవాడూ, ప్రజా సమస్యలకు తక్షణం స్పందించేవాడూ, స్పందనకు మానవత్వం జోడించి, పరిష్కార మార్గాలు చూపించేవాడు, మాటలతోనే సరిపెట్టకుండా, చేతలతో మానవత్వాన్ని ప్రదర్శించేవాడు అసలయిన సాహిత్యకారుడు. అతడు/ఆమె, కవి కావచ్చు, కథకుడు  కావచ్చు, నవలాకారుడు కావచ్చు. మాధ్యమం ఏదైనా చెప్పదలచింది సూటిగా చెప్పడం వీరి నైజం! ఇలాంటి గొప్ప లక్షణాలను కలిగి వుండి, ఎలాంటి  భేషజాలు లేకుండా, చెప్పదలచుకున్నది సూటిగా చెప్పగల కవి, కథకుడు, నవలాకారుడు, అన్నింటికన్నా మనసున్న మంచివాడు శ్రీ అన్వర్.

కవి అన్వర్ క్యారికేచర్….. శ్రీ సుభాని

ముస్లిం కుటుంబ నేపథ్యం అయినా, చదువుకుంది సైన్స్ అయినా, పని చేస్తున్నది ప్రజా సంబంధాలు కలిగిన వైద్యరంగం అయినా, తెలుఁగు సాహిత్యం/భాష పట్ల మక్కువ ఎక్కువ గలవాడు శ్రీ అన్వర్. అందుకే ఆయన ప్రవృత్తి తెలుగు రచనా వ్యాసంగంగా రూపుదిద్దుకుంది. ఆయన సాహితీ జీవనశైలి గురించి, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

~

ప్ర : అన్వర్ గారూ.. నమస్కారం.. సంచిక అంతర్జాల పత్రిక పక్షాన మీకు స్వాగతం.

నమస్కారం సర్. సలాం.

ప్ర : మీరు తెలుగు సాహిత్యం వైపు మొగ్గు చూపింది ఎప్పుడు?ఎలా?

ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన నేను తెలుగు వైపు రావడానికి, తెలుగు వైపు ఆకర్షించబడడానికి నేను పుట్టి పెరిగిన వాడ, చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలే ప్రధాన కారణం.

4వ తరగతి నుండే నాకు తెలుగు భాష పట్ల విపరీతమైన మక్కువ వుండే. దానికితోడు మా తెలుగు టీచర్ ఆచార్యులు వారు నన్ను మా తరగతి గదిలో కిటికీ మీద నిలబెట్టి నాతో ప్రతీరోజు తెలుగు పాఠం చదివించేవారు. వారిది కంచుకంఠం. ఆజానుబాహులు. చాలా ఎత్తు, బలంగా, దృఢంగా వుండేవారు. వారు నా భుజాలకింద చేతులు వేసి కాస్త ఎత్తేవారు. నేను ఈలోపు కాస్త జంప్ చేసి కిటికీలో నిలబడేవాణ్ణి.

‘వాడు చూడండి, పాఠం ఎంతబాగా చదువుచున్నాడో’ అనేవారు సర్. అలా ప్రతిరోజు మెచ్చుకుంటు నా క్లాస్‌మేట్స్‌తో అప్పుడప్పుడు చప్పట్లు కొట్టించేవారు. అలా తెలుగు అంటే అభిమానాన్ని గుండెల్లో నింపి అదే నాకు చెప్పలేని గుర్తింపు రావడానికి కారణమయ్యారు నా ప్రాథమిక పాఠశాల తెలుగు గురువర్యులు.

నేను 7వ తరగతికి వచ్చేవరకు శ్రీశ్రీ కవితల్ని నోటికి చదివే స్థాయికి వచ్చేశాను. 8వ తరగతిలో మా తెలుగు టీచర్ శేషగిరిరావు గారు హాస్యంతో, ఛలోక్తులతో, పరమ రసానందభరితంగా తెలుగు పాఠాలు చెప్పేవారు. నేను ఇప్పటిదాకా గమనించిన తెలుగు మాస్టార్లల్లో ఆయన తెలుగు చెప్పే విధానం చాలా ప్రత్యేకమైనది. నేను పద్యాన్ని రాగయుక్తంగా, పాఠాన్ని భావయుక్తంగా చదివే తీరును వారు నన్ను ప్రత్యేకంగా అభినందించేవారు. స్వతహాగా నేను వ్యక్తిత్వంగా అంతర్ముఖం నుంచి బహిర్గతమయ్యే స్వభావిని. కాబట్టే నాకు శ్రీశ్రీ కవితలు నా యౌవ్వనాన్ని చెప్పలేనంత ప్రభావితం చేశాయి. నా ఉన్నత పాఠశాల విద్యతో పాటు ఇంటర్మ్మీడియేట్ కూడా ఆచార్య చందాకాంతయ్య శ్రేష్టి గారు కట్టించిన ఆంధ్ర విద్యాభి వర్ధిని (ఏ.వి.వి) లో కొనసాగింది. 8వ తరగతి నుండి క్రమంగా 5 సంవత్సరాలు ఉపన్యాస, వ్యాసరచన పోటీలలో, పోతన పద్య పఠన పోటీలలో నాకే ప్రథమ, ద్వితీయ బహుమతులొచ్చేవి. నా చిన్నప్పుడే ‘పతితులారా, బ్రష్టులారా, దగాపడ్డ తమ్ముల్లారా ఎడవకండేడవకండి, మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంట, హడావుడిగా అరుచుకుంటు పరుగెత్తే జగన్నాధ రథచక్రాల్, జగన్నాధ రథచక్రాల్, రథచక్రాల్ రథచక్రాల్ , జగన్నాధ రథచక్రాల్ భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా ‘ అనే కవితను విపరీత అభిమానంతో అలా పాటలాగా చెప్తూ వుండేవాణ్ణి.

మా కళాశాలలో పోతన భాగవత పద్యపఠన పోటీలు ప్రతి సంవత్సరం కాలేజి డే సందర్భంగా పెట్టేవారు. అందులో నాకు 2 సార్లు బహుమతులు రావడం కూడా  నా తెలుగు వికాసానికి ఒక కారణం. ఇక ఇంటర్మీడియేట్‌లో బై.పి.సి.తీసుకున్నాను కానీ నా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. మార్కుల కోసం చాలామంది హిందీ/సంస్కృతం తీసుకునేవారు. నేను ముస్లిం ఐనా కూడా తెలుగు తీసుకున్నా. మా తెలుగు లెక్చరర్ డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్ గారు. నా మొదటి సంవత్సరమే వారు కాలేజిలో కొత్తగా జాయిన్ అయ్యారు. వారు దూరదర్శన్, హైద్రాబాద్ లోని తన జాబ్ ను వదులుకొని మాకు క్లాసులు చెప్పడానికి వరంగల్ వచ్చి సెటిల్ అయ్యారు. పాఠం చాలా స్పష్టంగా చెప్పాలనేది వారి సిద్ధాంతం. స్వతహాగా చాలా అందంగా వుండే వారు కాలేజీకి మంచి మేకప్‌తో, కొన్నిసార్లు టై కట్టుకొని వచ్చేవారు. తెలుగు అనేది చాలా గ్లామర్ సబ్జెక్టు అనేది సర్ ఉద్దేశం. వారు చెప్పిన పాఠం, వారిచ్చిన నోట్స్, వారి ఉచ్చారణ – ఇప్పటికి నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. స్వతహాగా వారు నాకు చాలా చాలా ఇష్టమైన గురువయ్యారు. నేను కూడా చాలా ఇష్టమైన శిష్యున్నయ్యాను. ఈ నా తెలుగు వ్యామోహం వల్ల నా ఉర్దూ భాష ఉచ్చారణ దాదాపుగా మారిపోయింది. కుర్సీ అనాలి. కుర్చీ అనేవాణ్ణి. బజార్, హజార్ అనే జేర్, జబర్లు వచ్చే ఉర్దు సొగసు నంతా నా తెలుగు భాషాభిమానం వల్ల చెడగొట్టేశాను. అలాగే ‘అన్యభాషలు నేర్చి ఆన్ద్రంబు రాదంటూ సకిలించు ఆంధ్రుడా! చావ వెందుకురా!’ అనే కాళోజి గారి కవిత్వం వల్ల, నా  తెలుగు భాష అభిమానం వల్ల వచ్చిన ఇంగ్లీష్‌ కూడా వాడకంలో లేకపోవడం వల్ల ఇంగ్లీష్‌లో వున్న నా అరకొర జ్ఞానం కూడా పోయింది.

ఆటలు, డ్రాయింగ్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్‌లలో అద్భుతమైన ఆటగాడిని నేను. తెలుగు భాష పట్ల మక్కువ వల్ల లైబ్రరికి వెళ్లడం, ఉపన్యాసాలు, వ్యాసరచనల్లో పాల్గొనడం ఎక్కువగా చేయడం వల్ల దాదాపుగా ఆటలకు దూరమయ్యాను.

బహుశా నా టెన్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు నేను నా స్నేహితులకు ఆ ఆరేండ్లలో కనీసం 500 ఉత్తరాలు రాసి ఉంటాను. చాలాసార్లు మా స్నేహితులు నాకు చెప్పారు – నువ్వు చిన్నప్పుడు మాకు రాసిన ఉత్తరాలు అన్నీ చాలా జాగ్రత్తగా దాచుకున్నామని. మా అన్నయ్య (మహ్మద్ అప్జల్) నిజామాబాద్‌లో జాబ్ చేసేవాడు. ప్రతినెల కనీసం 2 ఉత్తరాలైనా నేను మా అన్నయ్యకు రాసేవాడిని. రాయడం కంటే ముఖ్యంగా ఆ ఉత్తరంలో, ఇన్‌లాండ్ లెటరైనా సరే బొమ్మలు గీసి, చిన్న చిన్న కవితలు రాసి పంపేవాడిని. మా అన్నయ్య నా గురించి, నా బొమ్మలు, రాతల గురించి అదేపనిగా గొప్పగా ప్రచారం చేసేవాడు. అతను నాకు అద్భుతమైన బట్టలు, వాచ్, బూట్లు, పుస్తకాలు, గడియారం, సైకిల్ లాంటి గొప్ప వస్తువులన్నీ కొని తెచ్చేవాడు. బహుశా మా అన్నయ్య ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా అని చెప్పడానికి లేనంత గొప్పది.

యువ అన్వర్

నేను మా ఇంటిముందు అరుగు మీద ఎదురుగా ఉన్న స్ట్రీట్ లైట్ వెలుగులో కూర్చొని రాసుకోవడం, చదువుకోవడం చేసేవాడిని. అలా రాత్రి కనీసం పదకొండు అయ్యేది. ఆ రాత్రిపూట మా ఇంటి ముందు వున్న రాజేశం అన్న ఆర్.టి.సి. డ్రైవర్ డ్యూటి పూర్తి చేసుకొని బాగా తాగి ఇంటికి వచ్చేవాడు. నిర్మానుష్యమైన ఆ రాత్రి ఇంకా రాసుకుంటున్న, చదువుకుంటున్న నా వద్దకు వచ్చి నన్ను ప్రేమతో అమాంతం ఎత్తుకునేవాడు. నేను ఏదో ఒకటి అవుతానని నన్ను గొప్పగా ఆశీర్వదించేవాడు. బహుశా ఈ ప్రోత్సాహం కూడా నాలో ఒక గొప్ప చైతన్యానికి కారణం కావచ్చు.

పదవతరగతి నుండే వ్యాసాలు, ఉత్తరాలు, చిన్న చిన్న కవితలు రాస్తున్న నేను 1992 నుండి రోజు కనీసం ఒక కవిత చొప్పున రాస్తూ వచ్చాను. మా క్లాస్‌మేట్ శ్రీదేవి గారింటిలో ఒకరోజు నేను కూర్చొని మాటాడుతుంటే ఇద్దరు ఎనిమిదవ తరగతి చదువుతున్న అమ్మాయిలు  దూరం నుంచి నా మాటలు విని పరుగెత్తుకొచ్చి శ్రీదేవి వాళ్లింట్లో మొసపోస్తూ నిలబడ్డరు. వాళ్లు నా మాటలు విని వాళ్ల సార్ మాట్లాడుతున్నాడని పరుగెత్తుకు వచ్చారట. మా శ్రీదేవి నన్ను వాళ్లకు పరిచయం చేసింది. అప్పటినుండి వాళ్లిద్దరు నన్ను అన్నయ్య అని పిలవడమే కాదు వాళ్లు స్కూల్ నుండి ఇంటికి వెళ్లే సమయంలో ప్రతిరోజు సాయంత్రం నన్ను కలిసి ఈరోజు రాసిన కవిత ఏదన్నయ్య అని చదివి, బావుంది అని చెప్పి వెళ్లేవారు. అలా దాదాపు వాళ్ళు డిగ్రీకి వచ్చేంతవరకు నేను రోజుకు ఒక్క కవితైనా రాసేవాడిని. నా కవితలకు మొదటి శ్రోతలు, విమర్శకులు వాళ్లే.

నేను మా పి.హెచ్.సి.లో ఫార్మసీస్ట్ గా పనిచేస్తున్న పద్మజ గారి ద్వారా డా.ఎం.ప్రభావతి గారితో పరిచయమయింది. డా.ప్రభావతి మేడం గారు ఖాజీపేట రైల్వే కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా జాబ్ చేసేవారు. తెలుగు అష్టావధానుల్లో ఏకైక మహిళా అష్టావధాని వారు. గుంతకల్లు వాస్తవ్యులు. మేడం గారి భర్త శ్రీనివాస్ రావు గారు కూడా నన్ను అభిమానించేవారు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి (కల్యాణి గారు)వుండేవారు.  కళ్యాణి ఇంగ్లీష్ ఎం.ఏ.పూర్తి చేసి సంగీతంలో కూడా డిప్లమాలు, డిగ్రీలు పూర్తిచేశారు. కళ్యాణి ఎలా కనిపెట్టారో కానీ ప్రతి సండే వారు నా కవితను వినిపించండి అనేవారు. లేదండి నేను రాయను, కేవలం బాగా చదువుతాను అని చెప్పేవాడిని. అయినా కూడా పట్టువిడవకుండా కనిపించిన ప్రతిసారి నా కవిత్వం గురించి అడిగేవారు. ఒకరోజు ప్రభావతి మేడం గారు ఆ అబ్బాయిని అలా ఆటపట్టించవద్దు. రాస్తే చెప్పేవాడుకదా. వినిపించేవాడు కదా? ఇన్నిసార్లు అడగాలా? అని కల్యాణిని కొంచెం గట్టిగానే మందలించారు. అప్పుడు ‘లేదు మమ్మీ, తను రాస్తాడు’ అని గట్టిగానే చెప్పింది. అప్పుడు ప్రభావతి మేడం గారు ‘నాన్నా, రాస్తే తీసుకొచ్చి చూపించు – వినిపించు’ అన్నారు. అప్పటిసంది నేను వారి ఇంటికి వెళ్లి నా కవితల్ని వినిపించేవాడిని. కొన్నిసార్లు అలా వాళ్లింటికెళ్లి కూర్చున్నానో లేదో.. కొన్నిసార్లు మేడం గారు నా కవితను తీసి అక్కడికి వచ్చిన వాడ పెద్దలకు నా కవితను శ్రావ్యంగా వినిపించేవారు. శ్రీశ్రీ గారి కవిత్వంతో నా కవిత్వాన్ని పోల్చి చెప్పేవారు. అలా నా కవిత్వానికి అమ్మ గురువు – డా.ప్రభావతి అమ్మగారు. ఆ వెంటనే మేమంతా డా.అనీస్ సిద్ధికి గారి అధ్యక్షతన శాంతిసంఘం – అమన్ -అనే సంస్థలో క్రియాశీలక సభ్యులమయ్యాము. అప్పుడు(1994-1995) ఆ సంస్థ జిల్లాలో వున్న కవులందరినీ కలుపుకొని ఒక బహుభాషా కవిసమ్మేళనం ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ప్రజాకవి కాళోజి గారిని ముఖ్య అతిధిగా, వారి అన్నయ్య ‘షాద్’ రామేశ్వర్ రావు గారిని సభాధ్యక్షులుగా పిలిచాము. మా టీమ్‌లో వున్న నేను తెలుగులో, కల్యాణి ఇంగ్లీష్‌లో కవితలు వినిపించాలని చెప్పారు. నేను నా సాహిత్య ప్రస్థానంలో ఆ రోజు నేను చదివిన ఆ కవితను అక్కడ ఉన్న దాదాపు 150 మంది కవులు నేను కవితను వినిపిస్తున్నప్పుడు చాలాసార్లు చప్పట్లు కొట్టి ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చారు. చదివాక దాదాపుగా స్టాండింగ్ వోవేషన్ ఇచ్చారు. అలా పోడియం వదిలి వస్తుంటే చాలామంది అలయ్ బలాయ్ తీసుకున్నారు. అదీ నా మొదటి కవితా కవిసమ్మేళన ప్రస్థానం. అయితే ప్రోగ్రాం అయిపోయాక పెద్దకాళోజి గారు, ప్రజాకవి కాళోజి గారు ఆటోలో వెళ్తున్నప్పుడు నన్ను ‘షాద్’ రామేశ్వర్ రావ్ గారు దగ్గెరికి పిలుచుకొని సెకండ్ సాటర్ డే (ప్రతినెల రెండవ శనివారం సాయంత్రం) నాడు మా ఇంట్లో ‘మిత్రమండలి – కవిసమ్మేళనం’ జరుగుతుంది. రమ్మని నాకు చెప్పారు. నేను ‘రెండవ శనివారం ఎప్పుడొస్తదో ఇవ్వాల్టి నుండే ఎదురుచూస్తున్నా సర్’ అన్నాను. అప్పుడు కాళోజి రామేశ్వర్ రావు గారు ‘లేదు లేదు, రెండవ శనివారం నాడు నువ్వొస్తావని నేను ఎదురుచూస్తాను’ అన్నారు. ఆ తర్వాత ఆ మహానుభావులిద్దరు వున్నంతకాలం నేనెప్పుడు ఒక్కసారి కూడా మిత్రమండలికి ఆబ్సెంట్ కాలేదు. చాలాసార్లు అక్కడ ఉన్న కవులు నేను చదివిన కవితను, కథను సరిగ్గా అర్థం చేసుకోకపోతే పెద్ద కాళోజి, ప్రజాకవి కాళోజి లిద్దరు నా కవితను సహేతుకమైన వివరణతో చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.

నా మొదటి కవితా సంపుటి ‘తలవంచని అరణ్యం’ కు కాళోజి గారు ముందుమాట రాశారు. దానికోసం నేను ఒక 4,5 సార్లు కాళోజి గారిని కలిశాను. ఒకరోజు కాళోజి గారు నా చేతిలో ఒక రెండువేల రూపాయలు పెట్టారు. నేను షాక్ తిన్నాను. అరే, సర్, నేను నా ముందుమాట కోసం వచ్చాను అన్నా. అప్పుడు కాళోజి గారు ‘నువ్వు కవితాసంపుటి వేస్తున్నావు కదా. ఖర్చులు ఉంటాయి. వుంచుకో’ అని చెప్పలేనంత ప్రేమగా చెప్పారు. నేను చాలా సున్నితంగా వద్దని చెప్పి ‘కేవలం మీ ముందుమాట కోసమే బుక్ ఆలస్యమవుతుంద’ని చెపితే ఆ తర్వాత 2 రోజుల్లో ముందుమాట ఇచ్చారు కాళోజి గారు.

అన్వర్ కవితా సంపుటిని ఆవిష్కరిస్తున్న శ్రీ కాళోజీ.

‘తలవంచని అరణ్యం’ ఆవిష్కరణకు గంట కంటే ఎక్కువ కూర్చోను అని చెప్పిన ప్రజాకవి దాదాపు 4 గంటలు అయిపోయిన తర్వాత కూడా ఉన్నారు.

‘తలవంచని అరణ్యం’ కవిత వార్త సండే మ్యాగజైన్‌లో సింగిల్ పేజీలో గద్దర్ గారి పెయింటింగ్ (జావేద్ వేశారు) వచ్చింది. ఆ తర్వాత ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ప్రజా యుద్ధనౌక గద్దర్‌ని వరంగల్‌లో ఒక సభలో కలిసినప్పుడు ‘ఆ కవిత (తలవంచని అరణ్యం) ఆప్ లిఖే. 43 మంది కవులు నా మీద కవితలు రాశారు. నీ కవితని వారం రోజులు నిమ్స్ హాస్పిటల్‌లో నా తలదిండు కింద పెట్టుకున్నాను’ అన్నరు.

కాళోజి గారు తన పుట్టినరోజు నాడు జారి పడ్డారు. అదే కాలోజీ గారి ప్రాణానికొచ్చింది. ఆరోజు అన్ని సంతోషాల మధ్య కాళోజిని హైదరాబాద్ హాస్పటల్ కోసం తీసుకెళ్లిందే చివరసారి అయ్యింది. అయితే నేను నిమ్స్ హాస్పటల్‌లో వున్న కాళోజి గారిని చూడ్డానికి వెళ్లానోసారి. అప్పుడు కాళోజి గారు ఐ.సి.యూ.లో సీరియస్ కండీషన్ లోనే వుండే. ఆ తర్వాత ఓ పదిరోజులకు కవి మిత్రుడు శేషభట్టార్ వేంకట రమణ, నేను కలిసి కాళోజిని చూడడానికి వెళ్తే కాళోజి గారు బెడ్ మీద లేరు. వరండాలో అలా గాలికి బయటికి తీసుకెళ్లారని పక్క బెడ్ వాళ్లు చెప్పారు .మేము వరండాలో వెతుకుతుంటే వీల్ ఛైర్ లో కూర్చోపెట్టి నాగిళ్ల రామశాస్త్రి గారు అలా నెట్టుకుంటు, ఏవో మాటలు చెప్తూ ఆ చల్లని గాలిలో తిప్పుతున్నారు. కాళోజి గారిని దూరం నుంచే చూసిన నేను, రమణ – మా ఆనందాలకు అవధులే లేకుండా పోయింది. ఆరోజు కాళోజి గారు నాకు ఒక గంట, గంటన్నర సేపు సాహిత్యం, సాహిత్య ప్రయోజనం, సాహిత్య లక్ష్యాలు, కవి ఏ వైపున వుండాలే, కవి వ్యక్తిత్వం ఎలా వుండాలే… మొదలైన చాలా విషయాలు అదే వరండాలో చెప్పారు. రామశాస్త్రి గారు కనీసం ఒక ఆరేడు సార్లు ‘కాకా, నువ్వు ఇంతసేపు మాట్లాడొద్దు. వాడు మళ్లీ వస్తాడు’ అని చెప్పినా కూడా ఆయన ‘ఆగురా,’ అని నాకు రొమారోల, ఖలిల్ జిబ్రాన్ ల గురించి, ప్రాఫెట్ పుస్తకం గురించి, ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, హేతుబద్ధంగా, శాస్త్రీయంగా, ప్రజాస్వామిక లక్ష్యాలతో ఎలా ఉండాలి, మానవ హాక్కుల కోసం ఎలా నిలబడాలి, ‘నువ్వు చెప్పే విషయాలతోని మనం ఏకీభవించక పోయినా, చెప్పే నీ హక్కును నేను గౌరవిస్తాను’ అనే విషయం గురించి అనర్గళంగా చెప్పారు. ఆ తర్వాత ఒక వారం రోజులకే కాళోజి గారు మనల్ని విడిచి వెళ్లిపోయారు. అలా కాళోజి గారు నాకు వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా ఒక బాధ్యతను అప్పచెప్పిపోయినట్టుగా మనస్ఫూర్తిగా భావించి నేను కాళోజి గారి బాటలో రక్తస్పృహతో నడుస్తున్నాను.

ప్ర : మీరు తెలుగు సాహిత్యాన్ని ప్రవృత్తిగా స్వీకరించడం వెనుక నేపథ్యం ఏమిటి?

నా వృత్తి ఆరోగ్యశాఖలో ఆరోగ్య విద్యా బోధన. నా ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యం ఒక ఎమోషన్. ఒక అద్భుతమైన భావావేశం. నేను సహజంగానే ఒక ఎగసిపడుతున్న కెరటపు హోరులా ఉంటాను. ఫైరింగ్ కాదు నా ఆవేశం. భూమి నుంచి ఆకాశం వైపు ఎగచిమ్ముతున్న ఆవేదన నా కవిత్వం. ఎవరైనా సరే ఒక కవితాత్మకమైన వాక్యం చెపితే నాలో చెప్పలేని ఒక ఊపు పుడుతుంది. ‘ఒక ధిక్కారానికి, ఒక ఆవేశానికి, ఒక ధర్మాగ్రహానికి, ఒక ఆవేదనకు గొంతు నివ్వాలి’ అనుకుంటాను నేను. నా కవిత్వం ఎత్తుగడ, దాడి, ఒక వాస్తవిక దృగ్గోచరంగా ఉంటుంది. ‘నిజంగానే మన కళ్ల ముందు ఇంత దారుణం జరిగిందా’ అన్నంత ఆవేశం అక్షరమక్షరం తాండవం చేస్తుంది. అనేక సంఘటనల మీద, చెప్పలేని దుర్ఘటనల మీద చాలా కవిత్వాన్ని రాశాన్నేను. ఇన్సిడెంటల్ పోయెట్రీ అంటారేమో కానీ కవిత్వంలో వర్తమాన విషయం బాగా అల్లుకుపోయి రాజకీయ అవగాహనను మేల్కొల్పేల ఉండాలన్న బహుజన భావావేశం నాది. కులాల మీద, మతాలమీద, స్త్రీల మీద, చిన్నపిల్లల మీద, అమాయకుల మీద జరుగుతున్న అన్ని దాడుల్ని, సంఘటనల్ని నిరంతరం మేల్కొల్పే, ధైర్యాన్ని నింపే, శక్తినిచ్చే, చైతన్యం రగిలే భావావేశపు అక్షరమై మండుతాను.

సాహితీ సమావేశంలో మాట్లాడుతూ శ్రీ అన్వర్

నన్ను ఏ ఒక్కరు కలిసినా నేను మాట్లాడే ప్రధాన విషయం కవిత్వం లేదా సాహిత్యమే. ఇద్దరు, నలుగురు, పదిమంది కలిస్తేనా ఇగ చూడండి – నాకు పండగే. కవిత్వం, కవిత్వపు విషయాలు చెప్పడమే నా విధి. నేను సాధారణంగా పనికిరాని లేదా అవసరం లేని లేదా నాకు తెల్వని విషయల జోలికి పోను. రోజు కొంత కవిత్వం గురించే మాట్లాడుకోవడం నా దినచర్యలో ఓ భాగం. నేను ప్రతిరోజు ఎంతమందితో మాట్లాడుతాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం చాలా కష్టం. ప్రతి ఒక్కరితో మాట్లాడడమే నా ప్రధాన విషయం. కొందరు కొన్ని విషయాలు అలా అలవోకగా మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ వాక్యం మళ్లీ గుర్తుండదని ఒక పేపర్ మీద రాసుకుంటాను. నేను అలా రాసుకుంటుంటే ‘ఏ, ఆదేమంత పెద్ద విషయం కాదు’ అని కొందరు, కొందరు రాసుకోనివ్వరు. కానీ నేను కవిత్వంతో సంబంధం వున్న, లేకున్న వారి ద్వారా కూడా చాలా గొప్పవాక్యాల్ని విని రాసుకున్న సందర్భాలు చాలా వున్నాయి.

నాపై చాలామంది కవుల ప్రభావం ఉంది. ప్రత్యక్షంగానైతే కాళోజి సోదరులతో అనుబంధం ఉంది. నా కవిత్వపు లైన్ వేరు. నా భావావేశం వేరు. మా కవితా డిక్షన్ వేరు. నేను కవిత్వానికి పెట్టే శీర్షికలు వేరు. మొత్తంగా తెలుగు సాహిత్యంలో అవలీలగా, సునాయాసంగా, అలవోకగా నా కవిత్వాన్ని చదవొచ్చు. అర్థం చేసుకోవచ్చు కూడా. నా కవిత్వాన్ని చదివి ఒక ఊపుతో ఊగిపోయిన వాళ్లు చాలామందే వున్నరు.

నా కవిత్వానికి ప్రేరణ అన్నింటికీ ఆరటపడే నా హృదయమే. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడో, అవమానం జరిగినప్పుడో, ఆధిపత్యం చలాయిస్తున్నప్పుడో… నాలో చెప్పలేని ఓ ఆవేశం పూనకమై ఊపేస్తది. అలా కవిత్వంగానే కాకుండా వ్యక్తిత్వంగా కూడా నిలబడే విధంగా నేను సిద్ధపడుతున్నాను.

‘అన్ని తెలిసికూడా చెప్పలేనివారు, ఎవ్వరికీ పనికిరారు, ఏమీ చేయలేరు’ అనే భావజాలాన్ని అలవర్చుకొని కష్టాలను ఎదురీదుతున్నాను. ప్రతీ విషయంలో ‘ ఖుల్లం ఖుల్లా’ గా వుండాలనుకునే ఆవేశం నాది.

ప్ర : మీ కుటుంబం నేపథ్యంగా మీరు ఉర్ధూ భాషకు అతి చేరువలో ఉండే అవకాశం ఉంది. ఉర్దూ సాహిత్యంతో మీ అనుభవాలు చెప్పండి.

నా కుటుంబ నేపథ్యం ఉర్దూ. ఇంట్లో, బంధువులతో ఉర్దూలోనే మాట్లాడుతాం. మాది పూర్తిగా హిందువాడలో ఉన్న ముస్లిం కుటుంబం. మా ఒక్క కుటుంబమే ఆ వాడలో ముస్లిం కుటుంబం. మా నాన్నగారు (అబ్బాజాన్ – మహ్మద్ జానీమియ – ఆజంజాహి మిల్లులో కపడ ఖాతాలో పనిచేసేది. మా నాన్న తరపు పెదనాన్న, అత్తమ్మ మరియు మా అమ్మవైపు పెద్దమ్మ, చిన్నమ్మ, అమ్మమ్మ, పెద్దమామ, చిన్నమామ.. అందరు శివానగర్ ముస్లింవాడలో వుండేవాళ్లు. నా స్నేహితులంతా హిందువులే. అందులో ఎక్కువగా అప్పర్ క్యాస్ట్ వాళ్లే.

మా ఇంట్లో మేము ఐదుగురం అన్నా తమ్ముళ్ళం, ఐదుగురు అక్కా చెల్లెళ్ళం. అయితే మా అమ్మ (కరీంబి) నన్ను చాలా అపురూపంగా చూసుకుంది. బహుశా ఈ ప్రపంచంలో ఏ తల్లి తన కొడుకును అంత గొప్పగా, అపురూపంగా చూసి ఉండదు. నన్ను అంత అద్భుతంగా చూసుకుంది. నేను ఇంట్లో మానాన్న విపరీత స్వభావం వల్ల చాలా ముభావంగా వుండేవాన్ని. నేను మా ఇంట్లో ఇంటర్మీడియెట్ లోనే నాకు ఇష్టమైన ఓ రెండు కొటేషన్స్ (కవితా పంక్తులు) గోడమీద పేయింటర్ తో రాయించుకున్నాను. ‘స్మైల్ అండ్ స్మైల్ ఏ లైఫ్ టైమ్, నోబడి కెన్ డిస్టర్బ్ మీ బట్ మై సెల్ఫ్’ అని. నేనెప్పుడైనా నిరాశ, నిస్పృహతో వున్నప్పుడు మా అమ్మ అనేది – ‘అలా గోడలమీద రాసుకున్నావు కానీ, ఎందుకిలా బాధపడుతున్నావు’ అని. నేను మా అమ్మ ఉన్నంత వరకు ఒక రాజ్యాన్నేలినంత గొప్పగా రాజుగానే బతికాను కానీ, వున్నట్టుండి ఒక రోజులోనే మా అమ్మ మానుంచి దూరమయ్యింది. మా అమ్మ పోయిన తర్వాత (1991) నుంచి నేను అనుభవించిన కష్టాలు, బాధలు, నరకాలు నాకు తెలిసిన ఎవరు అనుభవించలేదు. మా అమ్మ వున్నంతకాలం నాకు అమ్మ విలువ అంతగా తెలవలేదు. నా స్నేహితుల అమ్మలు నన్ను తమ సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు. నేను ఒక స్నేహితుని అమ్మ దగ్గేర కర్రీ చేయడం నేర్చుకున్నాను. ఒక అమ్మ దగ్గేర కార్డ్స్, చెస్ ఆడడం నేర్చుకున్నాను. ఒక అమ్మ దగ్గేర మాటలు, వ్యవహారం నేర్చుకున్నాను. అలా నా 15 మంది స్నేహితుల అమ్మల దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. మా ఇంట్లో కంటే ఎక్కువగా వాళ్ల ఇండ్లల్లోనే ఉండేవాడిని. మా సొంత అమ్మను నా 16 వ అమ్మ అని అనుకునేవాడిని. ఎప్పుడైతే మా అమ్మ సడన్‌గా బ్రెయిన్ హుమరేజ్‌తో వెళ్లిపోయిందో… ఆ సంవత్సరమంతా నేను ఎవరితో మాట్లాడలేదు. ఎవరితో కలవలేదు. అందరికి కావాలనే దూరమై నా ఆగిపోయిన చదువు డిగ్రీ పూర్తి చేశా. తర్వాత ఇంకో డిగ్రీ ఆ తర్వాత రెండు పి.జి.లు పూర్తిచేశా.

నాపై వివక్షత కానీ, నాకు అవమానం కానీ బయట సమాజంలో ఎప్పుడు, ఎక్కడ జరగలేదు. నా తెలుగుభాష, నా కవిత్వం నాకు గొప్ప గౌరవాన్ని, విలువను ఇచ్చింది.

నా మొదటి కవితా సంపుటి ‘తలవంచని అరణ్యం’ మా అమ్మ కరీంబికి అంకితమిచ్చా. అంకితంలో ‘అరణ్యమైనా, ఆకాశమైనా అమ్మ కాళ్ల ముందు తలవంచాల్సిందే’ అని రాశా!

నేను చదువుకుంటున్న చిన్నప్పుడే  ఒక దాదిమా దగ్గర ‘అరబ్బీ’ నేర్చుకున్నాను. అలా పవిత్ర గ్రంధం ఖురాన్ లోని కల్మాలు నోటికి అబ్బాయే కానీ చదవడం రాలేదు.

ముస్లింవాద సాహిత్యానికి నా కాంట్రిబ్యూషన్ చాలా చాలా తక్కువనే చెప్పాలి. నేను అభ్యుదయ, విప్లవ, మానవహక్కుల కవిత్వం ఎక్కువగా రాశాను కానీ నా సొంత, నా వ్యక్తిగత, నాదైన నా స్వీయ బాధలోంచి నా జాతికి సంబంధించిన ముస్లింవాద కవిత్వాన్ని చాలా తక్కువగా రాశాను. ఎప్పుడైతే స్వీయ ఆత్మగౌరవ కవిత్వాన్ని రాయలన్న సోయి వచ్చినప్పుడు నేను కొన్ని మంచి ముస్లింవాద కవితలు రాశాను కానీ విస్తృతంగా రాయలేకపోయాను. ఎందుకంటే నేను ఈ సమాజంతో, నా ఈ బహుజన సమాజంతో, అగ్ర కులాలతో ఒక మనిషిలాగే కలిసిపోయి మంచిగానే బతికాను. నాపై ఏ ఇక్క కులం వారి ఆధిపత్యం కానీ, ఆటంకాలు కానీ లేవు. అందుకే నా కవిత్వం నిండా బహుజన సమాజ దుఃఖాలు, బాధలు, అవమానాలు, ఆగ్రహాలు, ఆవేదనలు ఉంటాయి. విరసం సభ్యుణ్ణి కాకపోయినా బలమైన విప్లవ కవిత్వాన్ని రాశాను. ‘కాళోజి గారి స్కూల్ ఆఫ్ థాట్ ‘ ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి మానవ ఆకాంక్షలకోసం, ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం, ఆధిపత్యం లేని సమాజం కోసం కలం పోరాటం చేస్తూనే వున్నాను. ‘ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు. దారి చూపగ లేను. తప్పు దిద్దగ లేను. ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’ అన్నడు కాళోజి. ‘జాతికి పట్టిన దుమ్ములు దులిపే దుమ్ములు ఎవ్వరివి. నీతికి పట్టిన మరకను మలిపే తెగింపు ఎవ్వరిది. చూసి చూడక, వినీ వినక మాట్లాడకపోతే ఈదేశం మారేనా? లంచం ఇచ్చి కంచం పెట్టి మంచం వేసే మోసం ఆగకపోతే మన బతుకులు మారేనా?’ అని పాట రాశా. ఇట్లా తెలుగు భాష వల్ల, నా రచనల వల్ల నాకు ఒక ప్రత్యేకమైన గౌరవం, తెలుగు కవిగా నాకు ఒక చెప్పుకోదగ్గ విలువ దొరికింది. ముస్లిం అయి ఉండి తెలుగులో రాయడం వల్ల కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం దొరికింది.

ప్ర: ముస్లింవాదం అంటే ఏమిటి? తెలుగు సాహిత్యంలో దీని ఉనికి ఎలాంటిది?

తెలుగుసాహిత్యంలో తెలుగు రాస్తున్న ముస్లిం కవులు తమ జాతి గురించి, తమ మతం గురించి, సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఇంకా అనేకమైన జీవన వైవిద్యాల గురించి, తమ వ్యక్తిగత, సామూహిక, సాంప్రదాయిక వ్యవహారాల గురించి, తమ స్వీయ సమూహ ఆత్మగౌరవ విషయాల గురించి ప్రస్తావిస్తూ రాసే విషయాలు, సాహిత్యం ముస్లింవాద సాహిత్యంగా అనుకోవచ్చు. ముస్లింలు తమదైన జీవన విధానం గురించి రాసే అన్ని విషయాలు ముస్లింవాద సాహిత్యంగా చెప్పుకోవచ్చు. ఒక ముస్లిం కవి తన జీవితంలోవి కష్టాలు, బాధలు, ఆవేదనలు, ఆచారవ్యవహారాలు, పండుగలు, ఉత్థాన పతనాలు, తన చుట్టువున్న తన స్వాభావిక, సాముదాయిక విషయాలను సాహిత్యంలోకి తీసుకువచ్చినప్పుడు ముస్లింవాద సాహిత్యంగా మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైతే ‘జల్ జలా’ (భూకంపం) అనే ముస్లిం కవులు రాసిన కవితా సంకలనం వచ్చిందో అప్పటి నుండి ముస్లింవాద సాహిత్యం ప్రారంభమయ్యిందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా ముస్లిం కవులు తమ జీవితంలోని సంఘర్షణలు, అవమానాలు, ముస్లిం జాతుల మీద ఈ దేశంలో జరిగిన దాడుల గురించి రాయాలి అన్న ఒక సోయి లేకపోవడం, తెలుగు సాహిత్యంలో అలా రాయవచ్చు అనే ఆలోచన లేకపోవడం జరిగింది. కానీ మన సర్వసతాక సామ్యవాద గణతంత్ర దేశంలో రాజకీయ ప్రచారాలలో భాగంగా, మత రాజకీయాల్లో భాగంగా ముస్లింలను రెండవశ్రేణి ప్రజలుగా అవమానించడం, ఈ దేశవాసులు కాదని, తీవ్రవాదులని ఇలా ముస్లింలను రకరకాలుగా రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేయడం, ముస్లింల మీద భౌతిక, మానసిక దాడులు చేయడం, వారి ఆహార విషయాలలో కూడా జోక్యం చేసుకోవడం, ముఖ్యంగా బాబ్రీ మజీద్ కూల్చడం నుంచి మొదలైన ఘర్షణలు, గోద్రా జెనోసైడ్ వరకు జరిగిన ప్రత్యక్ష దాడుల వల్ల ముస్లిం కవులలో మానసిక అలజడి చెలరేగింది. అప్పటిదాకా తెలుగు సాహిత్యాన్ని రాస్తున్న ముస్లిం కవులు తమ అస్తిత్వం, ఆత్మ గౌరవం కోసం తన జాతి మీద జరుగుతున్న దాడుల్ని రాయడం మొదలు పెట్టారు. అలా తెలుగు సాహిత్యంలో అభ్యుదయవాదం, స్త్రీ వాదం, దళితవాదం వచ్చినంత చారిత్రాత్మకంగా ముస్లింవాదం బలంగా వచ్చి బలమైన సాహిత్యానికి బాటలు, దారులు వేసింది. ఖాదర్ మోహినొద్దీన్ – పుట్టుమచ్చ – కవితతో తెలుగుసాహిత్యంలో ముస్లింవాదం బలంగా తమ అస్థిత్వాన్ని వినిపించింది. సాహిత్యంలో ప్రజలలోని జీవన వైవిద్యాల వల్ల, అనేక వైరుధ్యాల వల్ల అస్తిత్వ వాదాలు రావడం ప్రజాస్వామ్య లక్షణమే. అలా వివిధ సమూహాలలోని జీవన వైవిద్యాలను, సంఘర్షణలను ఈ వాదాలు అద్దం పడతాయి. ఇవ్వాళ తెలుగు సాహిత్యంలో ఉన్న అన్ని వాదాలలాగే ముస్లింవాదం కూడా బలంగా ఉంది. ముస్లింవాద కవులు మంచి ముస్లింవాదసాహిత్యాన్ని సృష్టించారు కూడా.

బక్రీ…ఆవిష్కరణ సభలో ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారితో శ్రీ అన్వర్.

ప్ర : ముస్లిం వాదంలో సాహిత్యపరంగా స్త్రీవాదానికి స్థానం వుందా? ఎందుచేత?

ఖచ్చితంగా ఉంది. ముస్లిం సమాజంలో స్త్రీకి సరైన స్వేచ్ఛ లేదు. స్త్రీకి సరైన గౌరవం లేదు అని ఇలా ఎన్నో అపోహలు ఇతర సమాజాలలో, మనుషులలో ఉంది. కానీ అలాంటిదేమీ లేదు. ముస్లింవాదం రావడానికి ప్రధాన కారణం ఇతర మతాలవారి దాడులు, మత సంఘర్షణలు మాత్రమే కారణం కాదు. ముస్లిం కవులు తమ సొంత మతంలో, సమాజంలో జరుగుతున్న అంతర్గత సంఘర్షణలను కూడా సాహిత్యం చేశారు. ఆత్మగౌరవం ఎక్కడైతే దెబ్బతింటున్నదో అది సొంత వ్యక్తులా, సొంత మతమా, సొంత సమాజమా లేదా ఇతర వ్యక్తులు, ఇతర మతం, ఇతర సమాజమా? అని చూడకుండా ఎదిరించడమే కవుల స్వభావం. కాబట్టి అంతస్సంఘర్షణల కోసం కలం పట్టడమే. ముస్లిం సమాజంలోని ఇబ్బందులను, కష్టాలను, ఆధిపత్యాలను ఖండించిన ముస్లింవాద కవులు, రచయితలు వున్నారు. మతానికి, జీవన విధానానికి, సామాజిక సంబంధానికి సంభందించిన అనేక స్వీయ ఘర్షణలను కూడా ముస్లింవాద సాహిత్యంలో మనం చూడవచ్చు. అందులో భాగంగానే ముస్లింవాద సాహిత్యంలో స్త్రీవాదాన్ని కూడా మనం చూడవచ్చు. ముస్లింవాదం పురుషులు, స్త్రీలు అనే భేదభావం లేకుండా ప్రజాస్వామికంగా, సమాన గౌరవంతోనే ఆధిపత్య భావజాలం లేకుండానే ఉంది. మహిళా ముస్లిం కవులు, రచయితలు చాలామందే ముస్లిం – స్త్రీవాదం అని కవితాసంపుటాలను కూడా తీసుకువచ్చారు. ముస్లిం స్త్రీలు తమ స్వీయ సమాజంలోని బహిర్ అంతర్గత సమస్యలను, సంఘర్షణలను సాహిత్యం చేశారు. ఇది ముస్లింవాదంలో భాగంగానే, పోరాట స్వభావంగానే ఉంది. కాబట్టి గత ముప్పై సంవత్సరాలుగా వస్తున్న ముస్లింవాద సాహిత్యంలో స్త్రీవాదం కూడా జమిలిగా నడుస్తూనే ఉంది. ముస్లింవాదంలో ముస్లిం మహిళా కవులు, రచయితల పాత్ర కూడా గుర్తించతగిన, చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రముఖంగానే ఉంది.

ప్ర : సాహిత్యకారులు ‘వాదాలు’ పరంగా విడిపోవడానికి కారణం ఏమిటి? తెలుగు సాహిత్య పరంగా లాభనష్టాలు వివరించండి.

సమాజంలో కానీయండి, సాహిత్యంలో కానీయండి వాదాలు రావడం ఒక మంచి పరిణామమే. అలా వాదాలు రావడానికి కూడా ఎంతో కొంత చారిత్రాత్మక కూడా ఉంటుంది. ఏ వాదమైనా అంత అలవోకగా రాదు. దానికి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ కారణాలు ఉంటాయి. అప్పుడే ఆ వాదం బలంగా ముందుకు వస్తుంది. ఒక గొప్ప మార్పును కూడా తీసుకువస్తుంది. భావకవిత్వం తర్వాత సాహిత్యం అభ్యుదయ కవిత్వం వైపు దారులు వేయడానికి అప్పటి సామాజిక, రాజకీయ సామాజిక కారణాలు కూడా ప్రధానంగా దోహదం చేస్తాయి. ప్రజల్లోంచే వాదాలు ప్రస్ఫుటంగా బయటపడుతాయి. కవులు ప్రజల ఆకాంక్షలను, ఆవేదనలను అక్షర రూపంలోకి మార్పిడి, తర్జుమా చేస్తారు. అలా మళ్లీ వాదాలు ప్రజల్లోకి వెళ్లి ఒక సామాజిక చైతన్యరూపం తీసుకుంటాయి. అభ్యుదయ కవిత్వం నుంచీ విప్లవ కవిత్వం వైపు కవులు, రచయితలు మరలడానికి, నిలబడడానికి చాలా సామాజిక, రాజకీయ కారణాలే వున్న సంగతి అందరికీ తెలుసు. అన్నీ రంగాల్లో పురుషాధిపత్యాన్ని సవాల్ చేస్తూ ‘స్త్రీ వాదం’ సాహిత్యంలో ఎంత బలంగా వచ్చిందో తెలుగు సాహిత్యమే సాక్ష్యం. స్త్రీవాద సాహిత్యానికి కేవలం స్త్రీలు తమ భావవేశాల్ని, తమ ప్రశ్నల్ని, తమ హక్కుల్ని ఎంత బలంగా ముందుకు తెచ్చారో వారికి చాలామంది ప్రజాస్వామ్యవాదులు, హక్కుల పోరాటనాయకులు, సామాజిక ఉద్యమకారులు పూర్తి సంఘీభావంగా నిలబడ్డారు. ఏదో ఒకరిద్దరు, కొందరు అప్పుడు చలామణిలో ఉన్న సృజనకారులు, సాహిత్యకారులు, విమర్శకులు అడ్డుపడినా స్త్రీవాద సాహిత్యం ఒక ఫోర్సుగా వచ్చిందే తప్ప తగ్గింది లేదు. అలాగే దళితవాదం కూడా ఎంత చారిత్రాత్మకంగా వచ్చిందో మనందరికీ తెలుసు. దిగంబర కవుల తర్వాత దళితవాద కవులు సాహిత్యాన్ని ఎంత సుసంపన్నం చేశారో, ఎంత విస్తృతం చేశారో, ఎంత అమోఘమైన పోరాట ప్రతీకల్ని తెలుగు సాహిత్యానికి అందించారో.. అదంతా ఒక చరిత్ర. ఒక కొత్త డిక్షన్ తెలుగు సాహిత్యానికి స్త్రీవాదం, దళితవాదం, ముస్లింవాదం ఆ తర్వాత తెలంగాణవాదంతో లభించింది. సాహిత్యం ఎక్కువగా పరిఢవిల్లింది వాదాల సాహిత్యం వల్లనే. తెలుగుసాహిత్యం బహుజన సాహిత్యంతో చాలా ముందుకు ఇతర భాషా సాహిత్యాల చెంతకు చేరింది. బహుజన సాహిత్యంగా విస్తరించింది కూడా. కావున కవులు ప్రజల సామాజిక, ఆర్ధిక, రాజకీయ ఆకాంక్షలను అర్థం చేసుకుని వాటికి ఒక దిశానిర్దేశనం చేసే స్థాయిలో కవిత్వానికి, సాహిత్యానికి దారులు వేయాలే కానీ కుంచించుకుపోయి ఉండకూడదు. కవుల ద్వారా భావజాలవ్యాప్తి కావాలి. తెలంగాణ సాహిత్యం వచ్చిన తర్వాత ప్రబలమైన రాజకీయ కారణాలను కూడా కవులు ప్రజాస్వామ్యయుతంగా అర్థం చేసుకొని ముందు వరుసలో ఉన్న ఆంధ్రకవులు తెలంగాణ కవులకు మద్దతుగా నిలిచి తెలంగాణ ఉద్యమానికి భావజాలపరంగా ఎంతో తోడ్పాటునిచ్చారు. వాదాల పరంగా అర్ధం చేసుకోవడమే. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కట్టుబడ్డ కవులు విడిపోవడం కంటే భావజాలన్ని ప్రజల్లోకి తీసుకుపోడానికే గట్టిగా నిలబడుతారు. సాహిత్యంలోకి వాదాలు రావడం అంటే ప్రజాస్వామ్య హక్కుల్ని, ప్రజల ఆకాంక్షల్ని భావజాలపరంగా బలపరచడమే. ప్రజలవైపు నిలబడడమే కవి ప్రధాన కర్తవ్యం కూడా. సాహిత్యానికి కొత్త వాదం ఒక కొత్త ఊపిరి లాంటిదే. ఆ ప్రజా ఆకాంక్షల చైతన్యమే సాహిత్యానికి బలం.

దూరదర్శన్ కోసం ప్రముఖ నవలాకారుడు శ్రీ అంపశయ్య నవీన్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్న కవి అన్వర్

ప్ర : మీ రచనల్లో, వస్తు పరంగా స్త్రీ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత నిస్తారు?ఎందుచేత?

సాహిత్యంలో ప్రధానంగా రాయాల్సింది స్త్రీల గురించే. మీరు ఏ విభాగం తీసుకున్నా ఆ విభాగంలో స్త్రీల గురించే రాయడానికి ఉంటుంది. పేదరికం తీసుకుంటే పేదరికంలోని మగవారి కంటే మహిళల సమస్యలే ఎక్కువగా ఉంటాయి. ఓ కుటుంబం తీసుకోండి, ఆ కుటుంబంలో చాలా సమస్యలు కేవలం స్త్రీలకే ఎక్కువగా ఉంటాయి. సమాజం తీసుకోండి సమాజంలో పురుషులు మహిళలు అనుకుంటే మళ్లీ మహిళల సమస్యలే ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా కవులు, రచయితలు చిన్నప్పటినుండి ఇంట్లో అమ్మను చూస్తూ పెరుగుతారు. ఆ తర్వాత అమ్మ కష్టం చూస్తూ పెరుగుతారు. ఒక టైములో అమ్మ కోసం ఏమైనా చేయాలి అనే ఆవేశం వస్తది. భావజాలం ఉన్న వాళ్ళకి, సృజనాత్మకత ఉన్న వాళ్లకి ఆ ఆవేశం భావావేశమై కవితో, కథ, పాటై ప్రభవిస్తది. సాధారణంగా చిన్నప్పుడు ఎవరైనా సరే ఓ దుఃఖం చూశారు అంటే అది కచ్చితంగా వాళ్ల అమ్మ దుఃఖమే అయ్యుంటుంది. కొడుకు కోసం ఏమైనా చేయాలి అని తల్లులనుకున్నట్టే అమ్మ కోసం ఏమైనా చేయాలి అని కొడుకులనుకుంటున్నారు. ఇప్పుడైతే బిడ్డలు కూడా అమ్మ కోసం అమ్మల దుఃఖం దూరం చేయడం కోసం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో వుంటున్నారు. కాబట్టి కవి, రచయిత ఒక ఉదాత్తమైన పాత్ర సృష్టించాలన్నా, ఒక మంచి పదాల అల్లిక చేయాలన్నా, తన భావాసాంద్రతనంతా ఒక పాత్ర లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, అందరికి ఇట్టే అర్థమైపోయే ఒక రచన చేయాలన్నా అది ఖచ్చితంగా ఒక మహిళా గురించి అయితే ఆ రచన కొంత కాలం మనగలుగుతుంది. నిలబడగలుగుతుంది. స్ఫూర్తినింపగలుగుతుంది. ముఖ్యంగా నా రచనల్లో చాలా వరకు స్త్రీల గురించి చాల బలమైన భావజాలమే ఉంటుంది. నేను మా అమ్మ గురించి ‘అమ్మ సూర్యుడు’ అనే కవిత రాశాను. ‘మా తుఝే సలాం’ అని ఒక కథ, ‘అమ్మ కుక్క’ అనే ఇంకో కథ రాశాను. అమ్మ మీద అద్భుతమైన పాట రాశాను. అమ్మ మీద నవలా కూడా మొదలుపెట్టాను. అలా నా కవిత్వంలో ఎక్కువగా మహిళా పాత్రలు ఉంటాయి. అవి చాలా చైతన్యంతో ఉంటాయి. అసలు నా కవిత్వంలో, కథల్లో, నవలలో మహిళ పాత్ర చాలా చైతన్యంగా, ఉద్విగ్నంగా, ఉదాత్తంగా, ఇన్స్పైరింగ్‌గా ఉంటాయి. నా కవిత్వంలో ఎక్కువగా మహిళలు, స్త్రీలు, అమ్మాయిల మీద జరిగిన దాడుల ప్రతీకారమే ఉంటుంది ఎక్కువగా. స్త్రీల సమస్యలపై చాలా కవితలు, కథలు రాశాను. స్వతహాగానే నా హృదయం ఒక మాతృమూర్తి హృదయం లాంటిదని భావిస్తాను. నా జీవితంలో మా అమ్మ, మా అత్తమ్మ, మరి కొందరు స్త్రీలు చాలా ప్రభావాన్ని చూపారు. నేను ‘జమీలాబాయి’ అనే నవల ఒక 29 సంవత్సరాల ఒంటరి మహిళ గురించే రాశాను. ఆ నవల చదివిన చాలామంది మహిళలు ‘నన్ను నేను చూసుకున్నాను’ అని నాతో చెప్పారు. జమీలాబాయి చాలాసార్లు మౌనంగా ఉంటుంది. కానీ ప్రతి చేతకానివాడు కూడా ఆమె అందానికి వెంటనే దాసుడై ఆమెను ఉద్ధరించడానికి కంకణమే కట్టేసుకుంటాడు. అప్పుడు చూడాలి జమీలా ఒక శివంగై తక్కువ మాటలతోనే ఎదుటివారికి జ్ఞానోదయం కలిగిస్తుంది. మహిళల గురించి నేనెప్పుడు కావాలని రాసింది లేదు కానీ నేను ఎక్కువగా రాసింది మాత్రం మహిళల గురించే. ‘అమ్మ ఇచ్చినంత ఇన్స్పిరేషన్ బహుశా సమాజంలో వేరే ఎవ్వరు ఇవ్వరు’ అనేది నా అబ్సర్వేషన్. మహిళల పట్ల ఒక కమిట్మెంట్‌తో ఇంకా ఎక్కువగా రాయాల్సి ఉంది.

ముఖ్యమంత్రి కె.సి.ఆర్, కవి నందిని సిద్దారెడ్డి గార్లతో కవి అన్వర్.

ప్ర : మీరు కవిత్వంతో పాటు, కథలు, నవలలు కూడా రాస్తున్నారు. వీటిలో మీ అభిమాన ప్రక్రియ ఏమిటి? ఎందుచేత?

నేను కవిత్వం తప్ప ఏమీ రాయొద్దు అని గట్టిగా అనుకున్నవాణ్ణే. శపథాలు కూడా చేసినవాణ్ణే. అయితే నా ‘తలవంచని అరణ్యం’ కవితా సంపుటి వచ్చాకా (1999) హైదరాబాద్లో ఒక సాహిత్య సమావేశంలో నా పక్కనే కూర్చున్న ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారు మీరు కథలు కూడా రాయవచ్చు కదా. ముఖ్యంగా మీ ముస్లిం సమాజంలోని చాలా విషయాలు, మాలాంటి వారికి కూడా తెలినీ చాలా విషయాలు మీరు కథలుగా రాయవచ్చుకదా అని చెపితే నేను చాలా చాలా గట్టిగా, స్ట్రాంగ్‌గా ‘కేవలం కవిత్వం తప్ప వేరే రాయను’ అని చెప్పా. ఆమె అయినా కూడా వదిలిపెట్టకుండా ‘కథలు కూడా రాయండి’ అని నవ్వుతూ చెప్పారు. అదేంటో నేను ఆ కొన్నిరోజుల్లోనే ‘బక్రీ’ అని ఓ రెండు పేజీలను ముస్లిం సమాజంలోని విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని కథ రాశాను.

కవిత్వం రాస్తున్నవాళ్లు ఇతర జోలికి వెళ్లవద్దు అని సీనియర్ కవులు చెప్తుండేవారు. కానీ కవి కవిత్వంతో పాటు కథలు, నవలలు, వ్యాసాలు, పాటలు రాస్తే ఆ స్పార్క్ వేరే ఉంటుంది. వాటిలో ఒక అద్భుతమైన ఫ్లో ఉంటుంది. కాబట్టి తీసుకునే వస్తువే అది కవిత రాయాలా, కథ రాయాలా అని డిసైడ్ చేస్తుంది. కవులు అన్నీ రాయాలి. కవిత్వం రాయడంలో వాస్తవానికి ఎక్కువ స్కోప్ ఉండదు . అదే కథ రాస్తే ఆ విషయంలో సమగ్రంగా, సమూలంగా రాయవచ్చు. ఇప్పుడు కథల కాలమే నడుస్తుంది. మంచి కథలకు చాలా డిమాండ్ ఉంది. ఇంకో విషయం, నా అబ్సర్వేషన్ ఏంటంటే ‘మన చుట్టూతా చాలా కథలు ఉన్నాయి. వాటిని ఒడిసిపట్టుకోవాలి’ అంతే. నావరకైతే ఇప్పటి వరకు 50 కథలు రాశాను. రాసిన కథల్లో ఒక 15 కథలతో ఒక కథల సంపుటి ‘బక్రీ’ వచ్చింది. ఒక నవల ‘జమీలాబాయి’ రాశాను. ఇంకో రెండు నవలలు అసంపూర్తిగా ఉన్నాయి. నా అభిమాన ప్రక్రియ మాత్రం కవిత్వమే. కవిత్వంలో మన భావావేశాన్ని అవసరం కంటే ఎక్కువే ఎగ చిమ్మియ్యవచ్చు. ఎంత వీలైతే అంత ఎక్స్‌ట్రీమ్‌గా రాయవచ్చు. కవిగా బతకడం, నిరంతరం కవితలు రాయడం చాలా ఊపుగా ఉంటుంది. కవి తన కలాన్ని, గొంతును నిరంతరం సమాజానికి ఇవ్వొచ్చు.

ప్ర : మీరు కవిత్వానికి గాని, కథలకు గాని ఎన్నుకునే వస్తువుల విషయంలో ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎందుచేత?

ఈ ప్రశ్నకు జవాబు కొంచెం కష్టమే సర్. ఎవరు ఏది రాసినా అది ప్రత్యేకమే అనుకుంటారు. నేను కూడా అనుకుంటాను.

అందరి కోసం రాస్తాము కానీ మనం రాసింది కొన్నిసార్లు కొందరి వరకు కూడా రీచ్ కాదు. వస్తువులు సాధారణంగా కామనే. కానీ ఆ వస్తువును, కథను రాసే క్రమంలో శిల్పం చేయడమే మన నైపుణ్యం. కదిలించేలా రాయడం, కన్నీళ్లు పెట్టించండం, చదివిన వెంటనే పఠిత హృదయంలోంచి ఓ వెలుగురేఖను పుట్టించడం చేయాలి. రాసిన కవిలో, చదివిన వారిలో ‘ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్’ ఉండాలి. ఏ వుద్దేశంతో రాశామో అది నెరవేరాలి. కాన్సెప్ట్ వివరణలు, ఫుట్ నోట్స్ లేకుండా అర్థం కావాలి. ప్రతి కవి తను రాసే ప్రతి అక్షరం ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు. అయితే ఒక వస్తువుని తీసుకొని రాసేటప్పుడు తన ఫ్లోలో తా వెళ్తుంటడు. రాశాక అదీ ఏమైనా ప్రత్యేకంగా ఉందా అనేది కొంత దృష్టి పెడితే అర్థమవుతుంది. అంతా మాయాజాలం, కనికట్టు, ఇంద్రజాలం, ఆవలి తీరాలకు తీసుకెళ్లడం అంటామే అదంతా అక్షరమక్షరం చేసేయాలే. వాక్యాల్లో తళుక్కున మెరుపులు కావాలే. అసలు కొన్నిసార్లు కవిత్వంలో మెరుపే కనిపించదు కానీ చెప్పలేని భావాన్నేదో క్యారీ చేస్తది. కవిత్వం ఒక కళ. అది అన్నికళలలాగా మౌనంగా ఉండేది, అన్నీసార్లు ఆకట్టుకునేది కాదు. కొన్నిసార్లు అమాంతం ఆకాశానికి ఎత్తేసేంత ఉద్విగ్నత ఉంటుంది. లండన్ లోని వింబుల్డన్ సెంటర్ కోర్టులో  ‘ఇఫ్’ (రుడ్యార్డ్ కిప్లింగ్) చాలా పెద్ద డిస్ప్లే ఉందట. ఒక వింబుల్డన్ లాంటి సెంటర్ కోర్టు ఎంట్రన్స్‌లో ఆ కవిత అవసరం ఏంటీ? కవిత్వం మనసును, మెదడును పరుగెత్తించాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి తీసుకెళ్లే చేయందించాలి. మాజీ ప్రధానమంత్రి నెహ్రు గారి ఆఫీస్ టేబుల్ మీద కూడా ఓ కవిత తన స్వదస్తూరితో రాసి పెట్టుకున్నారని సాహితికారులు చెప్తారు.’స్టాఫింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోనీ ఈవినింగ్’ (రాబర్ట్ ఫ్రాస్ట్) కవిత. కవి రాసిన కవిత సమాజానికి మార్గదర్శనం చేయాలే. ఒక స్ఫూర్తిని నింపాలి. ఆ కొన్ని లైన్లలో ఉన్న తత్వాన్ని జీవితతత్వం చేసుకునే వ్యక్తిత్వాన్ని కవిత్వం నిర్మించాలే. తీసుకునే వస్తువులో ప్రత్యేకత వాక్య నిర్మాణంలో, శబ్ద సౌందర్యంలో ఉండాలి. ఆ కవిత నా కోసమే రాశారు అన్నంత ఇన్స్పిరేషన్ ను ఇవ్వగలగాలి. అందుకే మళ్లీ చెప్పేదేమిటంటే ‘ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగే’ ముఖ్యం. ‘యద్భావం తద్భవతి’ అంటామే, అలా!

శ్రీమతి హేమలతా లవణం, అంపశయ్య నవీన్, రామాచంద్రమౌళి గార్లతో శ్రీ అన్వర్.

ప్ర : వరంగల్  సాహిత్య రంగంలో మీ పాత్ర ఎలాంటిది? వివరించండి..

వరంగల్ సాహితీ రంగం గురించి చాల విస్తృతమైన చర్చ చేయాల్సే ఉంది. అన్ని రంగాల్లో వరంగల్ ఎంతముందైతే ఉందో అంతకంటే గొప్పగా సాహితీ రంగంలో ఉంది. వరంగల్ అంటే ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను మనం అన్నింటిలో చూడవచ్చు. ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తిలో చూడవచ్చు. అలాంటిది ఇక్కడి కవుల్లో ఇంకా అద్భుతంగా చూడవచ్చు. పాల్కురికి సోమన, మహాకవి పోతన నుండి ప్రజాకవి కాళోజి వరకు వేసిన అద్భుతమైన సాహితీ బాటలు, చెరిగిపోని పాదముద్రాలు ఎన్నో చూడవచ్చు. తరాలను ప్రభావితం చేసిన కవులు, రచయితలు, సాహితీవేత్తలు తమ రచనల ద్వారా అమరత్వ సిద్ధి పొందారు. ఈ మాట కేవలం కీర్తిశేషులైన వారి గురించి కాదు నేను చెప్పేది. ‘విత్తనం చనిపోతు పంటను వాగ్ధానం చేసింది’ అన్నరు శివసాగర్. ‘అక్షరం వాక్యరూపం తీసుకున్నాకా ఒక సంస్కారానికి  తెరలేపాలే’. ‘అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక’ అన్నరు కాళోజి భైరన్ కవితను తెలుగు చేస్తూ. అందుకే వరంగల్ అంటే పోతన స్వీయ స్వాభిమాన చైతన్యం, పాల్కురికి కవితా వైభవ శక్తి, కాళోజి కవిత్వ ప్రజా గొడవ లాగా ఇక్కడ రాస్తున్న కవుల చైతన్యం సామూహిక శక్తిమంతమైనది. నేనైతే నా కవిత్వాన్ని మైలపడ్డ, అవినీతిపరుల చేతుల ద్వారా ఆవిష్కరింపచేసుకోలేదు. కవిత్వంలో నేను నాదైన ఒక ప్రత్యేక భావజాలంతో రాస్తున్నాను. నా కవిత్వమే చెప్తుంది నేనే వైపు ఉన్నానో. ఎందుకోసం రాస్తున్నానో, ఏం రాస్తున్నానో… నా కవితా సంపుటాల టైటిల్సే చెప్తాయి. ‘తలవంచని అరణ్యం, సవాల్, ముట్టి (పిడికిలి), ఖుల్లం ఖుల్లా’. నేను కవిత్వాన్ని ధిక్కారంగానే భావిస్తున్నాను. మూగపోయిన గొంతుల మాటై నిలబడాలనుకుంటున్నాను. అన్యాయం మీద అక్షర పిడుగై హోరెత్తాలనుకుంటున్నాను. ఆ దృష్టిలో నాకోసం రాసుకున్న కవిత్వం వేరే. సమాజం కోసం రాస్తున్న కవిత్వం వేరే. రాసిందంతా రమ్యత, ప్రసన్నత మాత్రమే కాదు . వాక్యమే బలము – బలగం కావాలని కోరుకుంటాను. తీసుకున్న ఏ అంశం/ విషయమైనా సరే దిగులు గుండెల మీద ఆవేశాత్మక ఆవేదన కావాలనుకుంటున్నా. భజన కాదు సృజన కావాలి. భజన కాదు గర్జన కావాలి. ఆవేశం కాదు ఆపాదమస్తకం పూనకాలు రావాలే. ‘అన్యాయం అంతరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయాన్నేదిరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అన్నడు కాళోజి. అదే నా బాట కూడా. ప్రజల్నే కాదు ప్రజల్లోవున్న కవుల్ని కూడా కాళోజి ఉసికొల్పిండు. నీ అవసరం చాలావుంది అనుకున్నప్పుడే ఒక చైతన్యాన్ని అందించగలుగుతాం.

నేను కాళోజి మిత్రమండలి సమూహాన్ని. ‘వరంగల్ మట్టి పిడికిట పట్టి రువ్వి చూడు. ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగుస్తాయి’ అనేటటువంటి సోయి ఉన్నవాడిని. తెలుగు సాహిత్యంలో ‘నాయిన’ (father)ల మీద ఒక్క కవిత, పాట కూడా లేనప్పుడు నేను కవుల చేత వారి వారి నాయినల గురించి కవిత్వం రాయించి ‘నాయిన’ అనే ఒక బృహత్ కవితా సంకలనం (2005) డా. లంకా శివరామ ప్రసాద్ గారి సౌజన్యంతో ‘సృజన లోకం’ ప్రచురణగా నా సంపాదకత్వంలో తీసుకువచ్చాను. ‘తెలంగాణ కవిత’ (2007) ప్రారంభ కవితా సంపుటి నా సంపాదకత్వంలో వచ్చింది. ‘1969 – తెలంగాణ ఉద్యమం – వరంగల్ అమరవీరులు, తెలంగాణ ఉద్యమం – ఆత్మబలిదానాలు’ అనే విశిష్టమైన ఉద్యమ సాహిత్య పుస్తకాలను ప్రచురించాను. ప్రముఖ ఒగ్గుకథ చుక్క – చుక్క సత్తయ్య గారి మీద ఒక పుస్తకం రావాల్సి ఉంది. వరంగల్ నుంచి చాలామంది చాలమంచి కొత్త కవులు వస్తున్నారు. ఇంకా కవులు విస్తృతంగా రాయాల్సిన అవసరం ఉంది.

ప్ర : మీ రచనల గురించి వివరించండి.

నా రచనలు

  • కవిత్వం – తలవంచని అరణ్యం 2. ముట్టి 3. సవాల్ 4. ఖుల్లం ఖుల్లా
  • కథా సంపుటి – బక్రీ
  • నవల – జమీలాబాయి
  • పాటలు – దాదాపు 20 సామాజిక చైతన్య గీతలు రాశాను.

సమీక్షలు, వ్యాసాలు, ముందుమాటలు చాలా రాశాను.

ప్ర : మీ తర్వాతి తరం యువతీ యువకుల్లో సాహిత్యాభిలాష పెంచే విషయంలో మీరు ఏమైనా కృషి చేస్తున్నారా? ఎలా?

సాహితాభిలాష ఉండడం వల్లే కవులు, రచయితలు  తయారవుతారు. యూనివర్సిటీ వీ.సి.లను, హెడ్ ఆఫ్ ద డిపార్టుమెంట్లను కాళోజి గారు ఒక మాట అడిగేవారు. ‘కాలేజి బిల్డింగ్‌లు, లాబ్‌లు, లైబ్రెరీలు కట్టాం అని చెప్పుడు కాదు ఎందరు కవుల్ని తయారు చేసిండ్లో చెప్పండి’ అనేవారు. కవిత్వం ఒక సొంత ఆత్మీక వ్యవహారం. ఒక వాక్యం మస్తిష్కంలో పురుడు పోసుకొని హృదయంలోంచి ఎగతన్నుకు రావాలి. వాక్యమే కావ్యమంత రసాత్మకంగా ఉండాలి.

రాయడం ఒక ఎత్తు, నిరంతరం చడవం, అధ్యయనం మరోఎత్తు కావాలి. బాగా చదివితే ఎలా రాయాలో తెలుస్తుంది. ఎలా రాయకూడదో కూడా తెలుస్తుంది. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో సునాయాసంగా రచనలు చేయాలి. అవార్డులు, ప్రశంసలు, అభినందనల కోసం కాకుండా మన మనసుకు తృప్తి నివ్వడం కోసం రాసుకోవాలి. ఎవ్వరు కూడా మన వాక్యాన్ని, కవితను, సాహిత్యాన్ని సరిచేయరు. ఎవరికి వారే శ్రమించి సరిచేసుకోవాలి. రాసిన కవితని ఎప్పటికి సరిచేసుకుంటు ఉండాలి. నిన్న రాసింది ఇవ్వాళ్టికి అయిపోయింది అని అనుకోవద్దు. అదే ఒక లోకం, యావ కావాలే. ‘కవిత కాదు కన్నీటి కలత’ అన్నరు ఆత్రేయ. ‘రాతిరియున్ మరపురాని హొయలు’ కావాలి కవిత్వం. కొత్తవారు కవిత్వపు టెక్నీక్ దొరకపట్టుకొని తమదైన ఒక స్టైల్ సృష్టించుకోవాలి.

డాక్టర్ సి.నా.రె, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గార్లతో శ్రీ అన్వర్

ప్ర : మీ అవార్డులు, సన్మానాల గురించి చెప్పండి.

అవార్డ్స్ :

  1. ఉమ్మడిశెట్టి సాహిత్య అవార్డు – 2000 – అనంతపూర్
  2. జిల్లా యువకవి అవార్డ్ – 2001- వరంగల్
  3. ఎక్స్ – రే అవార్డ్ – 2001, 2006 విజయవాడ
  4. భారతీయ దళిత సాహిత్య అకాడమీ అవార్డ్ : 2009, న్యూ ఢిల్లీ
  5. ట్రూ ఇండియన్ మహాత్మా జ్యోతిబా ఫులే అవార్డ్- 2011 – హైదరాబాద్
  6. జాషువా పురస్కారం – తెలుగు అకాడమీ – 2013
  7. లయన్స్ పురస్కారం – బీమారం – 2014 – హన్మకొండ
  8. గుర్రం జాషువా పురస్కారం – ది యునైటెడ్ ఫోరమ్ – ఎస్.సి. ఎస్.టి. విభాగం – 2015 , వరంగల్
  9. జే. బి.కల్చరల్ ఆర్ట్స్ పురస్కారం – 2015
  10. జాబిలి సాహిత్య సాంస్కృతిక పత్రిక పురస్కారం – 2015
  11. ఏ.పి. స్టేట్ కల్చరల్ అవేర్ నెస్ సొసైటీ పురస్కారం – 2017 – విశాఖపట్నం
  12. శశిశ్రీ – స్మారక సాహిత్య పురస్కారం – 2017 – కడప
  13. జిల్లా ఉత్తమకవి పురస్కారం – 2017 – వరంగల్
  14. రాయల కీర్తి పురస్కారం – 2017 – పెనుకొండ
  15. ఇండియా వరల్డ్ పోయెట్రీ ఫెస్టివల్ – లైఫ్ టైమ్ అచీవమెంట్ అవార్డ్ – ఇంటర్నేషనల్ అవార్డు – 2017- రామోజీ ఫిల్మ్ సిటీ
  16. అనంత సాహిత్య అకాడమీ పురస్కారం – 2018 – అనంతపూర్
  17. కంకనాల జ్యోతీరాణి చారిటబుల్ ట్రస్ట్ – సాహితీ జ్యోతీరత్న అవార్డ్ – 2018 – వరంగల్
  18. రోజా క్రీయేషన్స్ పురస్కారం – 2018 – వరంగల్
  19. శ్రీమతి శకుంతలా జైనీ స్మారక కళా పురస్కార అవార్డు – 2019 – హైదరాబాద్
  20. సరళి డిజి స్కూల్ – తెలంగాణ పాట పురస్కారం – 2019
  21. సకల కళా సాంస్కృతిక మండలి – తెలంగాణ జానపద సింగిడి పురస్కారం – 2020 – వరంగల్
  22. నేషనల్ ఇంటిగ్రేషన్ – అన్యువల్ ఫెస్టివల్ పురస్కారం – 2021 – బాబా ఫక్రుద్దీన్ దర్గా – పెనుగొండ
కవి అన్వర్ ను సన్మానిస్తున్న స్థానిక శాసనసభ్యులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్

ప్ర : ప్రత్యేక తెలంగాణలో సాహిత్యపరంగా మీరు గమనించిన అభివృద్ధి గురించి  వివరించండి.

తెలంగాణ రాత్రం ఏర్పడ్డ వెంటనే కొన్ని మంచి కార్యక్రమాలైతే జరిగినవి కానీ ప్రత్యేక తెలంగాణలో సాహిత్యపరంగా కొత్తగా జరిగిన అభివృద్ధి అంతగా మనకు కనిపించదు. కానీ సమాజంలో మనం అనుకున్నది చాలా ఆలశ్యంగా కనపడుతుంది. అనేక ఆకాంక్షల మేరకు కొత్తగా రాష్ట్రాన్నయితే ఏర్పాటు చేసుకున్నాము కానీ సాహిత్య పరంగా చెప్పుకోతగ్గ అడుగులు వేసింది అంతగా ఏమీ లేదు. తెలంగాణ భాషాశాస్త్రాన్ని, మాండలిక నిఘంటువును, తెలంగాణ భాషాచరిత్రను అభివృద్ధి పరచుకున్నది లేదు. సంస్థలు, కార్యక్రమాలు మొక్కుబడిగా తయారయ్యాయి. ఒకప్పుడు ఆధిపత్యం కనపడేది. ఇప్పుడు ఆధిపత్యం లేని పెత్తనం కనిపిస్తున్నది. అకాడమిలు, సాహిత్యపరిషత్తులు, సాంస్కృతిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఎవర్నీ గుర్తించే స్థితిలో లేరు. పేరుకు నామమాత్రంగా అన్నీ వున్నాయే కానీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే వున్నది. ఒకరిద్దరు పట్టుదలతో వున్నారు కానీ శాయశక్తులా భాష కోసం, సాహిత్య సాంస్కృతిక సంరక్షణ కోసం అందరు పూనుకోవాలే.

‘అందరు గజయీతగాళ్లే – ఈదింది గజమంత లేదు’ అన్నడు మహాకవి.

నేనింకా ‘నా’ నుంచి ‘మా’ వరకే రాలేదు. ‘మన’ అన్నప్పుడు కదా ముందడుగు’ అన్నడు ప్రజాకవి. అది ఇక్కడి పెద్దలకు శిరోధార్యం కావాలి.

ప్ర : మీ జీవితంలో మరచిపోలేని వ్యక్తులు, ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?

నా జీవితమే చాలామందితో కూడిన ఒక విస్తృత ప్రయాణం. నేను చాలామందికి తెలీదు కానీ నిత్య విద్యార్థిని. ఎందరెందరినుంచి సామాజిక స్పృహ నేర్చుకున్నానో చెప్పడం కష్టం.

ప్రజాకవి కాళోజి, షాద్ కాళోజి రామేశ్వర్ రావు, డా. ప్రభాకర్ జైనీ, కార్టూనిస్ట్ శంకర్ పామర్ధి, కవి యాకుబ్, డా. విరించి విరివింటి, ప్రో.జయధీర్ తిరుమల రావు, డా. జిలుకర శ్రీనివాస్, డా. పసునూరి రవీందర్, మామిడి హరికృష్ణ, అబ్దుల్ రజా హుస్సేన్, డా. కె.ఎల్.వి.ప్రసాద్, డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్, డా. లంకా శివరామ ప్రసాద్, విలసాగర్ రవీందర్, మంగళగిరి ఆదిత్య ప్రసాద్, నాగిళ్ల రామశాస్త్రి, డా. ఎం.ప్రభావతి, డా.అనీస్ సిద్ధిఖి,  దూరదర్శన్ వరప్రసాద్ సర్, ఇన్నన్న, యాదవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జాబిలి చాంద్ బాషా, బిక్కి కృష్ణ సర్, అక్బర్ ఆర్టిస్ట్, మహ్మద్ ఖదీర్ బాబు, నాగబెల్లి జితేందర్ , పొడిశెట్టి కరుణాకర్, బొడ్డు ప్రసాద్, డా.డి.శ్రీరాం, డా.ఏ.అప్పయ్య, డా. చల్ల మధుసూదన్ , డా. పిల్లి సాంబశివరావు, డా. విజయలక్ష్మి, అప్జల్ భాయ్, అశోక్ రెడ్డి, రోజా క్రియేషన్స్ శ్యాం, చిలుముల సుధాకర్, శంకర్రావు శెంకేసి, గొల్లపూడి శ్రీనివాసరావు, పేరం శ్యామ్ సుందర్, డా.యాకుబ్ పాష, రహీమున్నిసా బేగం, మా అక్క నూర్జహాన్, మా అమ్మ కరీంబి, అబ్బాజాన్ జానీమియ, భాయ్ అప్జల్… ఇంకా చాలా మంది, స్నేహంతో… మరచిపోదామన్న మరచిపోని ఆ మహనీయుల సాంగత్యం, చేయూత, అభిమానాలతో కవిగా జీవిత ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను.

సెలవిప్పటికి!

స్నేహమెప్పటికి !!

~

మీ సాహితీప్రయాణం గురించి చక్కని వివరాలు అందించారు, ధన్యవాదాలు అన్వర్ గారూ …

డాక్టర్ గారూ నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన మీకు, సంచిక అంతర్జాల పత్రిక సంపాదకవర్గానికీ హృదయపూర్వక ధన్యవాదాలు సర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here